Thursday, 28 April 2016

(కవిత్వ సందర్భం 14)

గణతంత్ర దినోత్సవ ప్రత్యక్ష ప్రసారాలు
...............................................
స్వాతంత్ర్యానంతర భారత దేశ ఆర్థిక చరిత్రను రెండుగా విభజించుకోవచ్చు. 1991 కి ముందూ, ఆ తరువాతా అని. 1991 కి ముందు ఆర్థిక వ్యవహారాలన్నీ గవర్నమెంటు చేతిలో ఉండేవి. ఎవరైనా ఒక ప్రైవేటుకంపనీ మొదలు పెట్టాలంటే దాదాపు ఎనభై రకాల గవర్నమెంటు లైసెన్సులు పొందవలసి ఉండేది. అంతేకాక ఆ ప్రైవేటు కంపనీ ఎంత ఉత్పత్తి చేయాలో కూడా ప్రభుత్వమే నిర్ణయించేది. ఈ విధానాన్ని "లైసెన్స్ రాజ్" అనేవారు. ఇది పండిత జవహర్ లాల్ నెహ్రూ మానస పుత్రిక. సోషలిస్ట్ భావజాలానికి ప్రభావితుడు కావటం వల్లనో, వందల యేండ్ల బ్రిటీష్ వలస పాలన అనుభవం వల్లనో ఇతర దేశాల కంపనీలను మన దేశంలోకి రానివ్వకుండా కట్టడి చేసే ఇటువంటి విధానాన్ని నెహ్రూ రూపకల్పన చేశాడు. దీని ప్రధాన ఉద్దేశం ప్లానింగ్ కమీషన్ కి అనుగుణంగా దేశ అభివృద్ధి జరగటం. కానీ 1985-1990 లో ఏర్పడిన ఆర్థిక సంక్షోభం నుండి తప్పుకోవటానికి భారత దేశం, దేశంలో ఉండే బంగారు నిల్వలను అదనపు హామీ గా చూపి ఐ. ఎమ్. ఎఫ్ (I M F) నుండి పెద్దమొత్తంలో అప్పు తీసుకోవలసి వచ్చింది. అదే సమయంలో చంద్రశేఖర్ ప్రభుత్వం కూలిపోగానే ప్రధాని అయిన పీవీ నరసింహారావు ఆర్థిక సంస్కరణలు చేపట్టడం జరిగింది. దీని ప్రధాన ఉద్దేశం ఇండియన్ మార్కెట్ ని 'ఓపెన్ టు ఆల్' అని అందరికీ తలుపులు బార్లా తెరవటం. లైసెన్సింగు విధానం పలుచన చేయటం జరిగింది.  ఈ సరళీకరణను లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ (LPG) అనీ పిలుస్తున్నాం. 1991 లో వచ్చిన ఈ సరళీకరణ భారత సమాజాన్ని విపరీతమైన మార్పుకి గురిచేసింది. అప్పటి ఆ మార్పు ఎంతో మందిలో భయాందోలనలను కలుగజేసింది. ఒకేసారి కుప్పలు తెప్పలుగా విదేశీ కంపనీలు భారత దేశానికి వచ్చి పడ్డాయి. వ్యాపారం చేసేవాడు వస్తువును అమ్ముకోవాలంటే ముందు అది అమ్ముకోవటానికి తగిన మార్కెట్ ని సృష్టించుకోవాలి. తమ వస్తువు మనిషికి అవసరం లేకున్నా అవసరం ఉందని మనిషిని నమ్మించాలి. ప్రసార సాధనాలు ప్రచార సాధనాలుగా చేసుకోవాలి. అటువంటి తరుణంలో కవి తన జీవన సరళిలో ఆలోచనా విధానంలో వస్తున్న మార్పులను గమనించుకుని, ఉలిక్కిపడి, వాటిని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తాడు. ఈ ప్రపంచీకరణ మేలే చేస్తున్నపుడు కవి దానిని ఎందుకు తిప్పి కొట్టాలి అనే సందేహం కలుగుతుంది. అవును. ఇలా తిప్పికొట్టడం కూడా సహేతుకమే. ఎందుకంటే ప్రపంచీకరణ విధానాలు పేదరికాన్ని రూపుమాపకపోగా, పేదరికాన్ని ఈసడించుకునే ఒక సైద్ధాంతిక తాత్వికతను ఎస్టాబ్లిష్ చేస్తాయి. దానికి తగ్గ భూమికను తన నిత్య జీవితంలో చూసే సంఘటనలను తనదైన రీతిలో వ్యక్త పరుస్తాడు కవి జూకంటి జగన్నాథం.

కంటికి కనిపించని ఎన్నో అవ్యక్త శక్తులు మనిషి జీవితాల్ని శాసించటం మొదలైంది ప్రపంచీకరణ వల్లనే. తన జీవితం తన చేతుల్లో లేక పరాయాకరణ చెందినట్టు మనిషి గుర్తించగలడో లేదో కానీ కవి దానిని స్పష్టంగా చూడగలుగుతాడు. ఉదయాన్నే లేస్తే రైతులో ఉండే అయోమయమైనా, అరుగు మీద పిల్లలకి అన్నం పెడుతూ  అమ్మ మాట్లాడే భాషలోని పదాలలోనైనా ఎక్కడా తన సొంతం కాని జీవితం, మరెవరి జీవితమో తాను జీవిస్తున్నట్టు. వస్తు వినిమయ సంస్కృతే ప్రతీ చోట ప్రతిఫలిస్తుంది. అమ్ముకోగలిగితే ఏదైనా అమ్ముకోవచ్చు. అప్పటి దాకా వ్యవసాయాధారిత జీవితం ఇక ఏ మాత్రం లాభదాయకం కాదు అని, లాభం లేని, లాభం రాని జీవితం నిష్ఫలం అనీ  భావజాలం వ్యాపిస్తుంది. పెట్టుబడీదారుడు ఫ్యాక్టరీ పెడతాడు. దానికి కార్మికుడు కావాలి. రైతు కూలీ ఇపుడు కార్మికుడి అవతారం ఎత్తాలి. ఊ..ఇంకేం. మీ నాగళ్ళను కట్టెలుగా నరికి పొయ్యిలో వేయండి. మీ వ్యవసాయానికి పనికొచ్చే ఎద్దులనూ, ఎద్దులను కనే ఆవులనూ ఊరికే ఉంచటం దేనికీ?. వధశాలలకమ్మండి. విదేశాల్లో మాంచి గిరాకీ  పలుకుతుంది. డబ్బు విలాసం అందుకోవాలంటే ఇలాగే చెయ్యాలి. బీదవాడిగా పుట్టడం తప్పుకాదు, బీదవాడిగా చనిపోవటం మహా ఘోరమైన పాపం అంటుంది. ఇది ప్రత్యక్ష మార్పయితే పరోక్షంగా అనేక సామాజిక పర్యవసానాలు నెలకొంటాయి. వస్తు వినిమయ సంస్కృతికి దూరంగా జరిగే ప్రయత్నం కూడా మనిషి చేస్తాడు. దానికి మత విశ్వాసాలకి దగ్గరగా జరుగుతాడు. కానీ వస్తు వినిమయ సంస్కృతి మతాన్ని కూడా వ్యాపారంగా మలచుకుంటుంది. ప్రాంతీయత స్థానికత అంశాలు వెల్లువలా ముందుకు వస్తాయి. సంస్కృతీ కళా రూపాలు కూడా మార్పుకీ ఒత్తిడికీ లోనవుతాయి.

ప్రపంచీకరణ జరగటానికి ప్రధాన మాధ్యమం ప్రసార సాధనాలు. అవే వారి ప్రచార సాధనాలు. టీవీ, ఇంటర్నెట్ ఎక్కడ చూసినా అడ్వర్టయిజ్మెంట్స్ రూపంలో సాంస్కృతిక దాడి చెయ్యాల్సిందే. ఒకే కంపనీ ఎన్నో ప్రోడక్ట్స్ ను ఉత్పత్తి చేస్తుంది. ఒక్క హిందూస్థాన్ లీవర్ అనే ఆంగ్లో డచ్ కంపనీ తయారు చేసే వివిధ రకాల ప్రోడక్ట్స్ ని డెబ్భై కోట్ల మంది భారతీయులు వాడుతున్నారంటే అది కాళ్ళు చాపిన మార్కెట్ విస్తీర్ణాన్ని అంచనా వేయవచ్చు. ఉదయాన వాడే పేస్టు బ్రష్ నుండి రాత్రి పడుకున్నపుడు దోమలు రాకుండా వాడే మస్కిటో రిపెల్లెంట్స్ వరకూ అన్నీ హిందూస్థాన్ లీవర్ ప్రోడక్ట్ లే. భారతీయ గ్లోబల్ నారీ రూపాన్ని తీర్చి దిద్దటంలో ప్రపంచీకరణ హస్తం పెద్దదే. మహిళలలో పెరిగిన చదువు, ఉపాధి అవకాశాలూ వారిని అసలైన వినియోగదారీ లక్ష్యాలుగా చేశాయి. చదువుకుని చక్కని బట్టలతో అందంగా ఆకర్షణీయంగా ఉండే మహిళలు, ఇంట్లో ఒకరితో ఒకరు పోటీలు పడి బట్టలు ఉతుకుతున్నట్టు ఉంటుంది ఒక యాడ్. దానిలో హిందూస్థాన్ లీవర్ సర్ఫ్ వాడిన మహిళ గెలుస్తుంది. పది మందిలో తల ఎత్తుకు నడుస్తుంది. ఆఫీసు నుండి ఇంటికి వచ్చి, వంట చేయబోయి నడుము నొప్పితో పడిపోయిన మహిళకు, ఈ కంపనీ వారు తయారు చేసే పెయిన్ కిల్లర్ బామ్ రాసుకోగానే నొప్పి తగ్గుతుంది. లేచి వంట చక చకా చేసేస్తుంది. భర్త మెప్పుని పొందుతుంది. ఫ్యూడల్ పతివ్రతల స్థానం నుంచి  ప్రపంచీకరణ విద్యావంతురాలిగా ఎదిగినా చివరికి అదే వంట గదిలోనో ఇంటిల్లిపాది పనులు చేస్తూనో ప్రత్యక్షం అవుతుంది. ఈ గొప్ప తనానికి కారణం ఈ కంపనీ ప్రోడక్ట్స్ వాడటమే. కణ్వముని ఆశ్రమంలో పండితులను వాక్పటిమతో ఓడించిన శకుంతల భర్త మతిమరుపుతో ఆడ జన్మే వృధా అనుకునేట్టు  ఈ కాలంలో 'నేటి మహిళ' కూడా దాదాపు అదే స్థానంలోనే ఈ యాడ్స్ లో కనిపిస్తుంది. పోర్షియా అందాన్నీ తెలివి తేటలనూ కాదని, బన్సానియో ఆమె డబ్బునీ బంగారాన్నీ చూసి పెళ్లి చేసుకున్నట్టు, ఒక టూత్ పేస్టు వాడటం వల్ల ఒక అమ్మాయికి పెళ్లి కావటం, ఒక డిటర్జంటు వాడటం వల్ల ఉద్యోగం రావటం చూస్తుంటాం.

ఈ కవిత రాసినది 1994 లో. ఇప్పుడు మనకైతే అలవాటై పోయింది కానీ అప్పటివారు ఈ ప్రపంచీకరణ భూతాన్ని చూసి ఎంతగా కంగారు పడ్డారో ఈ కవిత చక్కగా వివరిస్తుంది. ప్రపంచీకరణ మంచిదా చెడ్డదా అనే ప్రశ్నకి సమాధానం చెప్పటం అంత తేలికైన విషయం కాదు. అంతర్జాతీయ విపణిలో దేశ వృద్ధి రేట్లతో సామాన్య మానవుడికి నిజంగా పనైతే లేదు. కానీ వాడి భాషనూ సంస్కృతినీ జీవితాన్ని ఎంతగా ప్రభావితం చేస్తుందనే విషయం అధ్యయనం చేయటానికి ఈ కవిత వెలువడిన సమయం కంటే ఇప్పుడు సరయిన సమయం అనుకుంటాను. ఎందుకంటే ఇండియాను ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనటం అప్పటికంటే ఇపుడే సరైనది. కానీ జూకంటి జగన్నాథం గారు ఈ పరిస్థితిని అపుడే ఊహించి రాసేశారు. గణతంత్ర దినోత్సవ ప్రత్యక్ష ప్రసారాలని విదేశీ కంపెనీలు స్పాన్సర్ చేస్తాయని చెప్పటం వస్తు వినిమయ తత్వానికి పరాకాష్ట కాక  మరేమిటి?.

ఇండియా ప్రైవేట్ లిమిటెడ్
.....................................
పిల్లల ప్రపంచం విస్తరిస్తోంది
మనలోకం తలకిందులవుతోంది
మన బ్రతుకు మెల్ల మెల్లగా
పరాధీనమై కుంచించుకు పోతోంది

తెల్లారి లేస్తే
ఎద్దులను ముందేసుకుని
భుజాన నాగలి మోస్తూ పొలం వెళ్ళే
రైతుకు అంతా వడ్లు పెరుగు కలిసినట్లు అయోమయం

వీధి అరుగులమీద
పిల్లలకు అన్నాలు తినిపిస్తూ పక్కవాళ్ళతో
మా అమ్మ చెప్పే ముచ్చట్లలో
ఒక కొత్త డిక్షన్ దొర్లుతుంది
ఒక సరికొత్త దురాక్రమణ కొనసాగుతుంది

ఇంటి జారాడు నీళ్ళతో
నవ నవ పెరిగిన తోటకూరను
లండన్లోనో వాషింగ్టన్లోనో
అమ్ముకుని లాభ పడొచ్చని
'గాట్' ఒప్పందం పై వెన్నముక సాక్షిగా
ప్రభుత్వం చిలుకపలుకుల సంతకం

రూపాయికి పూర్తి మారకం
బ్యాంకు వడ్డీ తగ్గింపు
పశువులను వధ శాలలకమ్మండి
తోళ్ళకు మంచి గిరాకీ ఉంది
మాంసానికి మామంచి ధర పలుకుతుంది
నాగళ్ళ ను ఎక్కడికక్కడికి నరికి పోయిలోపెట్టి
ఏదో పరిశ్రమ స్థాపించుకోండి
ఇంట్లో కడుపులో గుద్ది
బజార్లో వీపు మీద చెయ్యేసి శభాష్ అంటుంది రాజ్యం

హిందుస్థాన్ లీవర్ లిమిటెడోడు
స్త్రీలకు బట్టలుతికే పోటీ నిర్వహిస్తాడు
మనం చొంగ కారుస్తూ గుడ్లప్పగించి చూస్తాం

మా చిన్నమ్మాయికి తెల్లారితే
అన్నీ అనుమానాలే అన్నీ ప్రశ్నలే
మా పెద్దమ్మాయికి అడుగు తీసి అడుగు వేస్తే
అన్నీ సందేహాలే అన్నీ సందిగ్ధాలే
డంకెల్? ఐ ఎమ్ ఎఫ్?? అగ్ర రాజ్యాలు???
'నీకంట్లో నేను వేలు పెడుతా
నీవు నానోట్లో చెయ్యి పెట్టు' బాపతిగాల్ల

ఇంతెందుకు ఒక్కమాట
తలొంచుకు మన పొలం గెట్టు మీదో మన యింటి ముందో
చల్లగా నిలిచిన వేపచెట్టు చూస్తుండగానే
వాని హక్కు భుక్తం అయిపోతుంది
మన అంగట్లో సరుకుల వ్యాపారం చేయరాని
మనం ప్రపంచ మార్కెట్లో పోటీ పడి
అవయవాలను అమ్ముకోవాలి

టెలివిజన్లో
సర్వ సత్తాక స్వతంత్ర సామ్యవాద లౌకిక గణతంత్ర దినోత్సవం
త్రివిధ దళాల వందన స్వీకారం
రాష్ట్రపతి భూతద్ద ప్రసంగం
అనంతరం ఒక ప్రకటన
ఇంతవరకూ మీరు చూసిన కార్యక్రమాన్ని
స్పాన్సర్ చేసినవారు
పోక్టర్ అండ్ గ్యాంబుల్, గ్లాక్సో, నెస్లే.

6/4/16
(కవిత్వ సందర్భం 14)

No comments:

Post a Comment