Thursday, 28 April 2016

బ్రాహ్మణ వాదం అంటే...? అనే చర్చలో "చరచ్చ"  చేయకుండా పాలుపంచుకున్న అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు.
ముఖ్యంగా రాజు గారికి, వంశీ కలుగోట్లకీ. ఈ పేద్ద కామెంటు అదే చర్చ కింద పోస్ట్ చేస్తే, పోస్ట్ కావటం లేదు. అందుకే ఈ సెపరేటు పోస్ట్. ఇది నిన్నటి చర్చకు కొనసాగింపుగా గుర్తించగలరు.

బ్రాహ్మణ వాదం అనేది కుల వివక్షకీ, అంటరానితనానికీ కారణం అయితే, ఆ వివక్షలూ, అంటరానితనాలూ ప్రస్థుత సమాజంలో బై అండ్ లార్జ్ తగ్గుముఖం పట్టినాయి  అనేది వాస్తవం. దానికి స్వాతంత్ర్యానంతరం రాసుకున్న రాజ్యాంగం, అది అమలు జరిగిన తీరు కారణం. ఈ క్రెడిట్ రాజ్యాంగానిదే. అలా అని వాటి ఆనవాలు పూర్తిగా నశించిపోయాయి అని చెప్పటానికి లేదు. ఏదో ఓ రూపంలో అవి మన కంటి ముందు కనిపిస్తూనే ఉన్నాయి. తగ్గు ముఖం పట్టాయి కనుక సమీప భవిష్యత్తులో పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉందని చెప్పవచ్చు, కృష్ణ పక్షంలో అమావాస్యను ప్రెడిక్ట్ చేసినట్టు. రాజ్యాంగం రాసుకోక ముందు ఈ వివక్షకు బ్రాహ్మణులే కారణం అని చాలా మటుకు ఒప్పుకోక తప్పదు. అందుకు కారణం అది మతంతో ముడిపడివున్న సమాజం కావటం. ఇది చాలా వేగ్ స్టేట్మెంట్ అనిపించినా కాస్తో కూస్తో నిజముందనుకుంటాను, సెక్యులర్ అనే భావన అప్పటికి లేదు కాబట్టి. కానీ సెక్యులర్ రాజ్యంగా మనం మారాక బ్రాహ్మణుల ప్రాబల్యం తగ్గుతూ వచ్చింది. ఇపుడు రాజ్య నిర్ణయాల్లో అధికారమూ డబ్బూ ప్రాబల్యం చూపుతున్నాయి తప్ప బ్రాహ్మణత్వం కాదు. ఇలాంటి సందర్భం, బ్రాహ్మణ ప్రాబల్యం తగ్గిన సందర్భంలో అధికారమే పరమ పదం గా భాసిస్తున్న రాజకీయ తరుణంలో...ఎవరైనా ఎక్కడైనా కుల వివక్షకు గురి అయితే దానిని బ్రాహ్మణ వాదం అనటం, బ్రాహ్మణులైన వారికి ఒకింత మింగుడుపడని విషయం. దానికింకో పేరు తగిలించుకోవచ్చుకదా, బ్రాహ్మణులేం చేశారట మధ్యలో...బ్రాహ్మణ వాదం ఏంటీ?.. అనేది వారి కంప్లైంట్.

అలా అని, బ్రాహ్మణులలో కుల వివక్ష పూర్తిగా లేకుండా పోయిందా అంటే, లేదనే చెప్పాలి. ఎంతో పుణ్యం చేసుకుంటేగానీ, బ్రాహ్మణ పుట్టుక కలుగదు అనే భావన వారిలో ఉంది. తామొక్కరిమే తెలివయిన వారిమి, మిగతా వారంతా పరమ మూర్ఖులు అనే ధోరణి కూడా వారిలో అంతో ఇంతో ఇప్పటికీ ఉంది. దాగి ఉంది. అది ఎప్పుడో ఎక్కడో బయట పడుతూనే ఉంది. ఇక రెండు ముక్కలు సంస్కృతం నేర్చుకున్నాడా..ఆ బ్రాహ్మణుడు ఎవరికీ ఆనడు.   మాటలు గాలిలోనే తేలియాడుతూ ఉంటయి. దానికి తోడు హిందూ మతానికి ఏ మాత్రం సంబంధం లేని ధర్మ శాస్త్రాల్ని చూపించి, శాస్త్రాలు ఘోషిస్తున్నాయని గగ్గోలు. ధర్మ శాస్త్రాలు కాలానుగుణంగా మారగలిగినవి అయ్యుండాలిగానీ, యూనివర్సల్ సత్యాలన్నట్టు మాట్లాడితే చాగంటి గారి డ్రాయర్ పురాణంలా ఉంటుంది. రాజ్యాంగానికి సవరణలు ఉన్నట్టు ప్రతీ ధర్మానికీ సవరణ ఉంటుందట. శాస్త్రం మనుష్యుల కోసం గానీ, శాస్త్రం కోసం మనుష్యులు ఉండరాదన్నది ధర్మ శాస్త్రాలు చదివినవారే చెబుతూ ఉంటారు. కానీ అదేమీ పట్టనట్టు పంతం పట్టి కూర్చునే బ్రాహ్మణులు నేటికీ ఉన్నారు. ఎంతమంది ఉన్నారిట్లా అని అడిగితే, టీవీల నిండా వాల్లే కనిపిస్తున్నారు మరి. అయితే కాస్తో కూస్తో ధర్మ శాస్త్రాల వాసన ఏదో రూపంలో ఉంది కాబట్టి, ఇలా టీవీల్లో మాట్లాడే బ్రాహ్మణులను చూసి నవ్వుకునే వారిలో మిగతా వారికంటే బ్రాహ్మణులే ఎక్కువ.

ఉత్పత్తికి దూరంగా ఉంటూ వచ్చారు బ్రాహ్మణులు అని ఇంకో వాదన. కమ్యూనిస్ట్ వాదన. ఉత్పత్తి మార్కెట్టు వంటి పదాలు ఒకదానితో ఒకటి ముడి పడి వుంటాయి. ఉత్పత్తిని దోచుకునే వాడు బ్రాహ్మణుడయి వుంటాడా? భూస్వామి అయి వుంటాడా అనేది అర్థం చేసుకోవలసిన విషయం. బ్రాహ్మణుడు దోచుకుని మార్కెట్టు చేసుకుని డబ్బు సంపాదించింది లేదు. భూస్వాముల్లో బ్రాహ్మణులెంతమంది ఉండిన్నారో మరి తెలియదు. ఒకప్పటి బ్రాహ్మణ విధులల్లో వేద వేదాంగాలని కంఠతా నేర్చుకోవటం ప్రధాన విషయం. దానికి పన్నెండేల్లకు పైనే పడుతుంది. కఠోర శ్రమ తప్పదు దానికి. వేద వేదాంగాలను కంఠతా నేర్చినందుకు బ్రాహ్మణులపైన ఒకింత గౌరవం సమాజంలో ఉండేది. కష్టతరమైన పనిని దీక్షగా ఏండ్ల తరబడి, తరాల తరబడి ఎవరు చేసిన ఆ మాత్రం గుర్తింపుని సమాజం ఇస్తుంది. ఉత్పత్తికి దూరంగా ఉన్నది ఇటువంటి కార్యాలు చేయటానికే...అంతేకానీ సోమరిగా తిని బలిసిన వ్యవహారం కాదు. తిండి విషయంలో వేదాధ్యయన విద్యార్థికి ఎనలేని ఆంక్షలు. విద్యాతురాణాం న సుఖం న నిద్ర అన్నది ఈ విషయాన్నే తెలుపుతుంది. ఇంతా చేసి, వేదం నేర్చుకుని ఇక ఏమి చేయాలి. భుక్తికి ఏదో ఒకటి చేయాలి కదా..? సమాజంలో చదువుకున్న వాడు కదా అని ఎవడయినా కరుణించి అన్నం పెట్టినా ఎప్పటికీ పెట్టలేడు కదా?. ఒకరిద్దరికి పెట్టగలిగినా బ్రాహ్మణులందరికీ పెట్టలేడు కదా? అందుకే తాను చదువుకున్న విద్యకు సమాజ శ్రేయస్సును జోడించాడు బ్రాహ్మణుడు. విద్య నేర్పించటం, వైద్యం చేయటం, కళలను ఆశ్రయించటం, తగువులను తీర్చటం మున్నగునవి. వీటివల్ల లాభం పొందిన వారు అంతో ఇంతో ఇస్తే పుచ్చుకోవటమే తప్ప ఇప్పటిలాగా ఒకటో తరగతికి ఇంత, పదో తరగతికి ఇంత, ఫలానా పనికి ఇంత అని లెక్కలేసి డబ్బులు గుంజినది లేదు. హిందూ మతమూ, భక్తి భావమూ బ్రాహ్మణులకు ఒక ఊతం ఇచ్చింది.

అందువల్ల హిందూ మతంలో మతాలు కూడా పుట్టుకొచ్చినయ్. శైవులు, వైష్ణవులు, శాక్తేయులు ఇంకా పలు పలు రకాలు. ఇటువంటి మతాలకన్నిటికీ వేదమో ఉపనిషత్తో ఆధారం కాదు. తరువాత వచ్చిన పురాణ ఇతిహాసాలే. పురాణాలు వేదాల్ని పునర్ప్రతిపాదిస్తాయి అని చెప్పుకోటానికే తప్ప, వాటి ధోరణి వాటిదే. అన్నీ కథలే. ఒక పురాణంలో ఒక దైవం గొప్పగా పొగడబడితే, అదే దైవం వేరే పురాణంలో తూలనాడబడుతుంది. అసలు ఈ పురాణాల్లో కనిపించే దైవాలు కూడా వేదంలోని వారు కాదు. ఋగ్వేదం లో దేవాధిదేవునిగా కీర్తించబడిన ఇంద్రుడు పురాణాల్లో కేవలం స్వర్గాధిపతి. స్త్రీ లోలుడు. చంచలుడు. అస్థిరుడు. ఋగ్వేదమంతా ఇంద్రుని సర్వజ్ఞతను ప్రతిపాదిస్తుంది. రామాయణం కూడా రాముడిని ఇంద్రునితో పోలుస్తుంది తప్ప, విష్ణువు అవతారంగా కీర్తించదు. అసలు విష్ణువు అనే పదమే రామాయణంలో లేదు.  మొత్తానికి పురాణాలు ఎవరు ఎందుకు రాసినా, ఆయా ఇష్ట దైవాలపై భక్తి కుదురుకోవాలనే విధంగా ఒక్కో పురాణం ఒక్కో దైవాన్ని అందలం ఎక్కించినా.., తరువాతి కాలంలో ఈ వ్యత్యాసమే హిందూ మతంలోని శైవ వైష్ణవ సాంప్రదాయాలుగా అవతారం ఎత్తాయి. ఇక బ్రాహ్మణులకు చెప్పలేనంత పని. ఆయా దైవాల్ని, మతాల్ని, సాంప్రదాయాల్ని తీర్చిదిద్దటానికి బుర్రలో ఇంచు జాగా కూడా వదలకుండా వాడేశారు. ఫలితం శైవ వైష్ణవ యుద్ధాలు. ఆలయాలు. ఆ తరువాతి కాలంలో స్థిరీకరించబడిన సాంప్రదాయాల గుడ్డి నమూనాలతో బ్రాహ్మణులలో పెరిగిపోయిన ఛాందసత్వం. ఇప్పటికీ శ్రీ వైష్ణవులు తామే అసలైన బ్రాహ్మణులం అని అనుకుంటారు. పొరపాటున వారి ఇండ్లలో ఎవరైనా శివలింగం పెట్టుకుంటే, వారినిక వెలేస్తారు.

మొత్తానికి చెప్పొచ్చేదేమంటే, ప్రస్థుత కుల వివక్షకి, అనగా రాజ్యాంగానంతర కుల వివక్ష కీ, ప్రస్థుతం ఉన్న బ్రాహ్మణులకీ సంబంధం లేనపుడు, దీనికి బ్రాహ్మణ వాదం అని పేరెందుకు అని. ఇలా అంటే ఆయన బాపనాయన కాబట్టి ఆ కులాన్ని వెనుకేసుకొచ్చే ప్రయత్నం ఇదని మీరు అనవచ్చుగాక. కానీ బ్రాహ్మణుడు అంటే ఆ పదం వెనుక ఉండే భావం మీద నాకు గౌరవం ఉంది తప్ప బ్రాహ్మణుల మీద కాదు.  ఒకప్పుడు బ్రాహ్మణుల వలన అంటరానివారిగానో, తక్కువ కులం వారిగానో అవమానింపబడ్డ వారంతా తస్సాదీయ...దొరికార్రా ... తనివితీరా తిట్టేయాలి అనే ఆనందంలో కొట్టుమిట్టాడటం కనిపిస్తుంటుంది. కానీ బ్రాహ్మణత్వం ఒక కులంగా ఇంకా మనం చూడటం ఎప్పటికీ మానలేమేమో. సమ్యక్ దృష్టి, సమ్యక్ వాక్కు, సమ్యక్ భావన కలిగి సమాజ హితైషులు అందరూ బ్రాహ్మణులుగా గుర్తించబడాలి. అటువంటి మార్గదర్శకులనే బ్రాహ్మణులు అనాలి, వారికే ఆ గౌరవం ఇవ్వాలి. వారికి ఆ దృష్టి వేదం ఇచ్చిందా, ఆధునిక విజ్ఞాన శాస్త్రాలిచ్చినాయా అనే మీమాంస కాకుండా బ్రాహ్మణ భావనను అందుకున్న ప్రజలు సమాజంలో అవతరించాలి. సమాజం ఇక్కడినుంచి ముందుకు కదలాలి.

No comments:

Post a Comment