రైతులు కాదు- వీళ్ళంతా పండని విత్తులు
..................................................
మనిషి ఎంతగా ఆలోచిస్తే, అంత మనిషిగా మారుతాడు. కవిత్వం మనిషిని ఆలోచించే మనిషిగా మార్చగలదు, అటు రాసిన కవినయినా, ఇటు చదివిన పాఠకుడినైనా. కవి రాసిన కవిత్వం, పాఠకుడికి, రాసినదాని కన్నా ఎక్కువనే నేర్పిస్తుంది. పాఠకుడికి తెలియని లోకాల్ని మాత్రమే పరిచయం చేయడు కవి, అంతకు మించి తాను తెలిపే లోకాల్ని పాఠకుడికి తెలిసిన లోకాలతో కలిపి కుట్టి చూపిస్తాడు. ఒక కవిత చదివినపుడు కవితలో కవి ఏమి ఆలోచనలని చెప్పాడు అనే దానికన్నా, ఆ కవిత మనలో ఎలాంటి ఆలోచనలను రేకెత్తించిందనేది ముఖ్యమవుతుంది. కవి అయినా తన ఆలోచనల్ని రాజకీయనాయకుడిలాగా సమాజం మీద రుద్దాలి అనుకోడు. సమాజపు ఆలోచనల్ని, ప్రజల జీవితాల్ని తన రచనలు ఎలా ప్రతిబింబింప చేస్తున్నాయి అనేది ఆలోచిస్తాడు. ఒకప్పటి భావ కవిత్వపు నీడ రాజకీయానికీ కవిత్వానికీ అగాధాన్ని సృష్టించింది. కానీ అభ్యుదయ పతాక రాజకీయాల పొట్టల్లోంచి పొడుచుకుని వచ్చి ప్రజల మధ్యన విస్పష్టంగా రెపరెపలాడుతోంది. అలాంటి కవిత్వాన్ని జండాలా పట్టుకుని దారి చూపే కవి అన్నవరం దేవేందర్.
వ్యాపారం చేసేవాడెపుడూ నిజాలు చెప్పడు. అబద్ధం వాడి జీవిత విధానం. 'మార్కెట్ ఎకానమీ' కిందకి ఒక సమాజం మారిపోయినపుడు జీవితం కూడా అబద్ధంగా మారిపోతుంటుంది. వస్తువు వస్తువులా చూడబడదు. సరుకులా చూడబడుతుంది. మనిషి కూడా మనిషిలా చూడబడడు. సరుకులా చూడబడుతాడు. మార్కెట్ ఎకానమీ అనేది మనిషిలో కలిగించే మొట్టమొదటి మార్పు..'ఆశ'. ఆశ ఉండకూడదని కాదు. ఆశ యొక్క విస్తీర్ణం పెరగటం వేరు, ఆశ కలిగి ఉండటం వేరు. నేను పండించిన పంట నా ఊరికి, నాకు సరిపోతుంది అనుకోవటంలో తృప్తి ఉంది. ఇందులో ఆశ కూడా ఉంది. కానీ ఇక్కడ ఆశ తన ఊరి వరకు మాత్రమే పరిమితం అయింది. కానీ ఇపుడు నేను పండించిన పంట విదేశాలకు ఎగుమతి కావాలి అనుకోవడం కూడా ఆశే. కానీ దాని పరిధి పెద్దది. ఈ పరిధిని పనికట్టుకుని పెంచి పోషించే మంత్రంలాంటి పదం ఒకటుంటుంది. దాన్ని "అభివృద్ధి" అంటాం. ఈ అభివృద్ధి అనే పదాన్ని మార్కెట్ సృష్టిస్తుంది. మన ఇంట్లో ఒకరికొకరం మాట్లాడుకోవటం కంటే పక్కింటి వాడితో ఫోన్లో మాట్లాడటం అభివృద్ధి. అంతకు మించి విదేశాల్లో ఉండే కొడుకుతో స్కైప్ లో మాట్లాడటం మరింత అభివృద్ధి. అభివృద్ధి అనే పదం తెలియనపుడు తరాలకు తరాలు కుల వృత్తులతో నిశ్చింతగానే బతికి ఉండింటారు. ఒక తరానికీ రెండవ తరానికీ కూడా ఆలోచనలోగానీ ఆచరణలోగానీ పెద్దగా మార్పు వచ్చి ఉండిండదు. కానీ గ్లోబల్ విలేజ్ గా మారిపోతున్న ప్రపంచంలో మనం రోజులో అతి ఎక్కువ సార్లు వినే అధికారిక పదం 'అభివృద్ధి' కాబట్టి, అది తనతో పాటు ఎన్నో అనుకూల విపరీత మార్పులను తీసుకుని వచ్చింది. 'అభివృద్ధి' పదం అబద్ధాలనూ తీసుకుని వచ్చింది. జీవితాన్ని నడిపే వ్యవసాయ రంగం కూడా అబద్ధాల పాలయిన సందర్భాన్ని ఈ కవితలో కవి మనకు చూపిస్తాడు.
1991 లో ఆర్థిక సరళీకరణలు భారత దేశానికి వచ్చిన తరువాత విదేశీ సంస్థలు కూడా విత్తన కంపనీలతో ఊడిపడ్డాయి. దేశం ఒక అభివృద్ధి నమూనాను కల్పించుకుంది. దానిలో 'వ్యవసాయరంగం వృద్ధి రేటు' అనేది ప్రధాన అంశం. దీనిలో భాగంగానే అభివృద్ధి అంశపు పరిధి కూడా పెరిగింది. జొన్నలు తిని జొన్నలు ఏరిగి బతికే మనుషులు సాంప్రదాయక పంటల స్థానంలో సంపాదనను అందించే పత్తి పంటను గురించి ఆలోచించారు. ఎండిన నేలలలో పండే పత్తి, డెక్కను పీఠభూమిని సరైన నేలగా ఎంచుకుంది. జెనెటికల్లీ మోడిఫైడ్ విత్తనాలు వచ్చాయి. వాటిని మార్కెట్ చేయటానికి, రైతులు అభివృద్ధి చెందాలనే స్లోగన్ పుట్టుకొచ్చింది. అందులో భాగంగానే బీటీ పత్తి విత్తనాలు వాటి కంపెనీలు. తక్కువ సమయంలో ఎక్కువ ఉత్పాదనని కలిగిస్తాయనీ, పురుగుమందు వాడకం తగ్గుతుందనీ, లేబర్ పెద్దగా అవసరం ఉండదనీ, పత్తిని ఎగుమతులు చేసుకుని మంచి లాభాలు గడించవచ్చనీ నమ్మబలికాయి. ఈ పంటలకి ఏకంగా "క్యాష్ క్రోప్స్' ( cash crops) అని పేరొచ్చింది. ఈ అభివృద్ధి మంత్రానికి తోడుగా మన ప్రభుత్వాల అవలక్షణాలన్నీ సామాన్య చిన్నకారు రైతులని క్యాష్ క్రాపుల వేపు మనసు మల్లించాయి. స్థిరమైన సాగునీటి వనరులు లేకపోవటం, ప్రాజెక్టులు అంతరాష్ట్ర వివాదాల్లో చిక్కుకు పోవటం, చెరువులు ఎండిపోవటం, వర్షాలు పడకపోవటం, భూగర్భ జలాలు ఇంకి పోవటం, ఎరువు మందుల ధరలు విపరీతంగా పెరిగిపోవటం, ప్రభుత్వ అదుపులోనుండి మధ్య దళారుల చేతిల్లోకి పోవటం, నాణ్యత లోపించడం, బ్యాంకు అప్పు తీసుకోవాలంటే పెద్ద కులపు వాడు కాకపోవటం, అర్థరాత్రి తరువాతే బోరుబావులకు కరెంటు అందటం, గ్రామీణ బ్యాంకు వ్యవస్థ పనికి రాకుండా పోవటం, పంటకు కాకుండా పంటమీద తీసుకున్న లోన్ కి ఇన్స్యూరెన్సు పుట్టడం, ప్రభుత్వ మార్కెటింగ్ వ్యవస్థ రైతుకు గిట్టుబాటుధరని కల్పించలేకపోవటం ఒకటేమిటి రైతుకు ప్రతీదీ సమస్యే. అన్ని సమస్యలకూ ఒకే మందు, ఈ నూతన వ్యవసాయ పద్దతి.. Cash crops..!
రైతులు పూర్తిగా మోస పోయారు అన్ని విధాలుగా. కొత్త వ్యవసాయ పద్దతులు కూడా ఏ సహకారం అందించలేదు. అభివృద్ధి అనే ఆశ అత్యాశగా అనిపించి నిరాశకే లోనయ్యాడు రైతు. ప్రభుత్వాలు తమ తప్పిదాల్నన్నింటిని కప్పి పుచ్చి బీటీ పత్తి విత్తనాలదే తప్పన్నాయి. లేకపోతే వరుణుడిదే తప్పనీ, మేఘుడిదే తప్పనీ తప్పించుకున్నాయి. అసలు రైతులదే తప్పు, వ్యవసాయం లాభసాటి విధానమే కాదు అని కూడా విజనరీ ప్రభుత్వాలన్నాయి. తాము చేసిన అప్పులకూ, తమకొచ్చే పంట దిగుబడికీ ఏ మాత్రం పొంతన లేని వారు పురుగుమందుల్ని ఆశ్రయించారు. చనిపోయిన వారికి ఎక్స్గ్రేషియాలు ఘనంగా ఇస్తున్నాంగా, మిగిలిన వారంతా బాగానే ఉన్నారుగా, చని పోయిన యువ రైతులంతా ప్రేమ విఫలమయ్యి చనిపోయారుగా అని కాకి లెక్కలు చెబుతూ కాకుల్లా అరిచే ఏలికలకు ఈ కవిత ఒక కనువిప్పు. బతికి ఉన్న రైతాంగం నిజానికి రైతులుగా లేరు. వారంతా దినసరి కూలీలుగా మారారు. ప్రతీ ఊరిలో ఒక అడ్డా ఏర్పరచుకుని తమను తాము అమ్ముకున్నారు. అలాంటి ఒకానొక అడ్డా ఈ మంకమ్మతోట లేబర్ అడ్డా. ఈ లేబర్ అంతా ఎక్కడినుంచో పుట్టుకురాలేదు. ధాన్యం పండే పొలాల్లోంచి పుట్టుకొచ్చిన నవ సమాజపు పండని విత్తులు ఈ రైతులు. వీరు పంటలు పండించటం లేదిపుడు, లేబర్ పండిస్తారు. పంటల గిట్టుబాటు కోసం ఎదురు చూడటం లేదిపుడు, తమ శరీరం గిట్టుబాటు కోసం 'కూలీ తక్కువిచ్చినా వస్తం' అంటూ ఆశగా ఎదురు చూస్తున్నారు. అవును అదే ఆశ. అభివృద్ధి అనే ఆశ.
మంకమ్మ తోట లేబర్ అడ్డా
-----------------------------------
పల్లె పొలిమేరలు దాటి
అడ్డా మీద సరుకుగా మారిన సందర్భం
అంగడిలో గొడ్డూ గోదా అమ్ముడుపోయినట్లు
తనకుతానే అమ్ముకుంటున్న దృశ్యం
మంకమ్మతోట లేబర్ అడ్డా మీద
బక్కచిక్కిన దేహాలన్నీ
లొట్టపోయిన కండ్లతో చూస్తున్నాయి
పనికి తీసుకోండ్రి సారూ..
కూలీ తక్కువిచ్చినా వస్తం
ఏదన్నా పని...కావాలె...అయ్యా పని..
గోస గోస మాటలు
గోవుల్లాంటి చూపులు
సున్నం వేసే కుంచెలు
తట్టా పార గడ్డపారలతో
పల్లె తరుముతే
పక్షులన్నీ అడ్డామీద వాల్తాయ్
చేయి సంచిల సద్ది గిన్నె
జబ్బ మీద తువ్వాల
ఇంకో చేతిల అతారెలు
ఎవలు పిలుస్తరా అని ఎదురుచూపులు
కంకర కొడతరు కందకాలు తీస్తరు
భవంతులు కడతరు బండలేస్తరు
గోడలు కడుతరు రాళ్ళు మోస్తరు
అరొక్క పనులన్నీ అవలీలగ చేస్తరు
నున్నగ తారురోడ్డు పరిచి
కలల కూడా డ్రైవింగ్ చేయని వాళ్ళు
ఫోన్ లైన్ల కోసం కందకాలు తవ్వీ తవ్వీ
హలో అని పలకని వాళ్ళు
పాలరాల తో భవనాలు కట్టి
పూరి గుడిసెల్లోనే జీవించే వాళ్ళు
ఉస్నాద ఎములాడ సిర్సిల్ల...
చినుకులు కురవని పల్లెలు ఎల్లగొడితే
అడ్డమీద కూలీలైరి
13/4/16
(కవిత్వ సందర్భం 15)

No comments:
Post a Comment