Sunday, 26 March 2017

పవన్ మళ్ళీ మోసపోయాడు
------------------
(సినిమాను సినిమాలాగా చూడాలనే పాత చింతకాయ పచ్చడి సొల్లు డైలాగులు చెప్పే గుండెపోటు గుమ్మడి క్యారెక్టర్లు ఇక్కడ  కామెంట్లు చేయకండి.)

మనమెవరైనా బంధువుల ఇంటికి పోతుంటాము. అపుడపుడే ముద్దు ముద్దు మాటలు మాట్లాడే చిన్న పిల్లలు గనుక వాళ్ళ ఇంట్లో ఉండింటే, సాధారణంగా ఒక సీన్ మొదలవుతుంటుంది. వచ్చిన వారికి ఆ సదరు బుజ్జిపాపల పాండిత్య ప్రకర్షను ప్రదర్శించటానికి ఆ ఇంటి వారు పూనుకుంటారు. కొన్ని ఇంగ్లీషు పద్యాలూ, సంస్కృతం శ్లోకాలు ఆ చిన్నారితో చదివిస్తూ ఉంటారు. ఎబిసిడీలు, అఆఇఈలూ, వన్టుత్రీలు కూడా వచ్చిచేరుతుంటాయి. సిగ్గు పడుతూ నో, చెప్పమన్నారు కాబట్టి దిక్కులు చూస్తూనో, భయం భయంగానో ఆ చిన్నారి అన్నీ చెబుతూ   ఉంటుంది. మధ్య మధ్యలో ఆ చిన్నారి ఏదైనా చెప్పలేక పోతేనో, మరచిపోయినట్టుగా అనిపిస్తేనో, మనం 'అబ్బే అస్సలు లాభం లేదు' అంటామేమో అనేంత ఆతృతతో వాళ్ళమ్మ అక్కడక్కడా పదాలను అందిస్తూ ఉంటుంది. పైగా తనేమీ అందివ్వలేదన్నట్టు మనవైపు చూస్తూ ఉంటుందావిడ. అయినా పాప సరిగా చెప్పలేకపోతే, ఇపుడే నిద్ర లేచింది అందుకే డల్ గా ఉందనో, మీరు కొత్త కాబట్టి సిగ్గు పడుతుందనో సరిబుచ్చుతూ  ఉంటుంది. 'లేకుంటేనా అసలు..!!'అనే స్వరం ఆ సరిబుచ్చటంలో వినిపిస్తూ ఉంటుంది. వింటున్న మనకూ బాగుంటుంది. చిన్న చిన్న పెదాలతో వచ్చీరాని మాటలతో మనల్ని కట్టిపడేస్తూ ఉంటారు పిల్లలు. ఒకవేళ ఆ కార్యక్రమానికి మనమే మొదటి అంకుల్ అయుంటే పరిస్థితి ఇంకో రకంగా తయారు కాక తప్పదు. ఆ తరువాత ఫంక్షన్ కి వచ్చే ప్రతీ అంకుల్ లేదా ఆంటీల ముందర ఈ కార్యక్రమం మొదలవుతూ  ఉంటుంది. 'ట్వింకిల్ ట్వింకిల్ లిటిలిస్టార్' మళ్ళీ మొదలవుతుంది కానీ ఈ సారి ఇంకో అంకుల్ కోసం అన్నమాట. ఇక ఆ పై వచ్చిన ప్రతీ ఆంటీ అంకుల్ దగ్గర మొదలైపోతే మొదలొచ్చిన ఆంటీ అంకుళ్ళ పరిస్థితి వర్ణనాతీతం. పెదవుల పైన నవ్వు తగిలించుకుని వాచీల వైపు పదే పదే చూసుకుంటూ ఈ ప్రోగ్రాం ఎపుడెపుడైపోతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఆ తల్లి ఆతృత, మురిపెం అపుడు మెలి మెల్లిగా 'అబ్బా..'అని విసుగుదలగా మారుతూ  ఉంటుంది. ఆనందంలో ఊయలలూుతున్న ఆ తల్లికది తెలియకపోవచ్చు. కానీ వచ్చిన వారికి బలవంతంగా కూర్చోబెట్టినట్టు అనిపిస్తూ ఉంటుంది. నిన్న పవన్ కళ్యాణ్ నూ, కాటమ రాయుడు సినిమానూ చూస్తున్నపుడు ఇటువంటి పరిస్థితులు గుర్తుకొచ్చాయి.

ఒక బిజినెస్ చేసే సంస్థ ఒక ఊరిలో ఏదో పరిశ్రమ కడదామనుకుంటారనుకుంటా. వాళ్ళకి అక్కడి లోకల్ లీడర్ అనబడే కాటమ రాయుడి పర్మిషన్ కావాలిట. అమరావతిలో వలె రైతుల భూములను లాక్కుని బడాబాబులు వారి వారి పరిశ్రమలను నెలకొల్పుకోవడానికి ప్రయత్నించినట్టు ఈ బడాబాబులు ఈ చిన్న ఊరిలో పరిశ్రమ నెలకొల్పడానికి ఒస్తారన్నమాట. ఎమ్ ఓ యూలు పట్టుకుని సీ.ఎం. ముందు లైనుగా నిలబడిన పారిశ్రామిక వేత్తల ఫోటోలు చూసిన మనకు, 'ఈ లోకల్ లీడర్ ఒప్పుకుంటేనే సాధ్యం' అనేది ఎట్లానో అర్థం కాదు. రైతుల భూముల్ని కాపాడటం అనే అంశంతో మనకు ఈ లోకల్ లీడర్ కనిపిస్తాడు. వచ్చిన పారిశ్రామిక వేత్తలు కూడా వారి ప్రాజెక్టేమిటి, ఎందుకు ఈ లోకల్ లీడరు అడ్డుపడుతున్నాడు అనే అంశంతో రారు. ఏకంగా ఏసేయ్యడానికే వచ్చేస్తారు. లోకల్ లీడర్ రాగానే లేచి నిలబడాలని ఏదో డిక్షనరీలో రాశారు అన్నంత బిల్డప్ సృష్టిస్తాడు డైరెక్టరు.లీడరుగారు వచ్చి కుర్చీలో కాలు మీద కాలేసుకు కూర్చుని తన అధికారాన్ని ప్రదర్శిస్తాడు. అక్కడ ప్రాజెక్ట్ చర్చలూ ఇత్యాదివేమీ ఉండవు. సంబంధం లేకుండా పశువులకు సంబంధించిన మాటల రూపంలో ఈ ప్రాజెక్టు తనకు ఇష్టం లేదని చెప్పడం అక్కడ హీరోయిజం. సభ్యత గా ప్రవర్తించడం హీరోయిజం కానంత వరకూ ఇదే హీరోయిజం అని మనకు దర్శకుడు చెప్పాలనుకుంటాడేమో. అక్కడో ఫైటు. సర్కార్ రాజ్ సినిమాలో ఇటువంటి సీన్ ఉంటుంది. కొన్ని గ్రామాలను ఖాళీ చేయించి ఒక ఎలక్ట్రిసిటీ ప్లాంట్ నిర్మించాలని ఒక బడాబాబు ఆలోచిస్తాడు. దానికి లోకల్ లీడర్ అడ్డు  . ఆ లోకల్ లీడర్ రాజకీయాలు సీ.ఎమ్. ని కూడా శాసించేలా ఉంటాయి. అపుడు ఆ పర్మిషన్ కోసం ఏకంగా సీ.ఎమ్. తో పాటు వస్తారు ఆ పారిశ్రామిక వేత్తలు. చర్చ జరుగుతుంది. ఈ ప్లాంటు ఎంత గొప్పదైనా, భవిష్య తరాలకు ఎంత ఉపయోగపడినా, వేల మంది నిర్వాసితులను ఒకేసారి వీధిపాలు చేస్తుంది కాబట్టి నేను ఒప్పుకునేది లేదని తేల్చేస్తాడు. ఎక్కువగా మాట్లాడితే సీ.ఎమ్. కుర్చీలో నీవు కూడా ఉండవు అనేంత శక్తి ఉన్న లీడర్ గా ఆ పాత్రను చూపిస్తారు. మహారాష్ట్రలో ఆ పాత్ర ఎవరిదో మనకందరకూ తెలిసినదే.

ఈ ఇంట్రడక్షన్ సీన్ తరువాత అసలీ లోకల్ లీడరెవరు అనేది మనకు అర్థం కాదు. వార్డు మెంబరా, సర్పంచా, ఉప సర్పంచా, ఎమ్పీటీసీ, జడ్పీటీసీ, ఎమ్మెల్యేనా?...ఏమో...ఒక సీన్ కే లోకల్ లీడర్ అన్నమాట. ఆ తరువాత ఎక్కడా బహిరంగ సభల్లో మాట్లాడటమో, పార్టీ మీటింగుల్లో వాణిని వినిపించడమో, సమస్యలతో ప్రజలు అతడిని శరణుజొచ్చడమో అటువంటివేమీ లేని ఒక లోకల్ లీడర్ ని దర్శకుడు మనకు చూపిస్తాడు. అతడికి నలుగురు సోదరులు. ఏమి చదువుకున్నారో, ఏమి చేస్తున్నారో మనకు అనవసరం. కానీ వారందరూ చదుకోవడానికో వ్యవసాయం చేసుకోడానికోగానీ, హీరో అన్నం తినకుండా ఛాయ్ తాగి పెంచుతాడన్నమాట. కానీ వాళ్ళ అన్నని ఎవరైనా ఏమైనా అంటే మూకుమ్మడిగా దాడి చేసి కుటుంబ బంధాలనూ, అనుబంధాలనూ ఆ విధంగా చూపిస్తారన్నమాట. ఈ సదరు లీడరుకి ఆడవారంటే పడదు. ఎందుకో..ఏమ్మాయరోగమో అనుకునేలోపల బ్లాక్ అండ్ వైట్ లో పదేళ్ళు నిండని పసి పిల్లల మధ్య ప్రేమ భావనలున్నట్లు చూపించేస్తాడు దర్శకుడు. ఆ చిన్నప్పటి జ్ఞాపకాలను భారంగా మోస్తాడేమో గానీ దానికీ, ఆడవారంటే పడకపోవడానికీ సంబంధం బొత్తిగా అర్థం కాదు. ఇంతలో ఎదురింటిలో దిగిన ఒక క్లాసికల్ సింగర్ కం డాన్సర్ కం, పక్కనోడు ఏ సొల్లు చెప్పినా నమ్మేసే అమాయకురాలు కం, అహింసా మార్గమంటే బీభత్సమైన నమ్మకమున్న కుటుంబం నుండి వచ్చిన అమ్మాయి కం, పాటలల్లో లోదుస్తులు కనబడేలా ఎక్స్పోజింగ్ చేయగల సమర్థురాలు కం, అందం కోల్పోయిన అందగత్తె అయినటువంటి ఓ హీరోయిన్ వస్తుందన్నమాట. ఆ అమ్మాయిని  ఈ అన్నయ్యకు తగిలించడానికి ఈ సోదరులు పడే తంటాలతో సింహభాగం మొదటి భాగం. ఆడవారంటే అన్నయ్యకు పడదంటూనే నలుగురూ ఒక్కో అమ్మాయిని ప్రేమికురాలిగా కలిగి ఉండటం మనకు అందించే కామెడీ అన్నమాట.

ఇక రెండవ భాగంలో ఆ అమ్మాయి ఇంటికి పోవడం, అక్కడొక స్కూలు విషయంలో హీరో గారి గొప్పదనం ద్వారా పని జరిగిపోవటంతో హీరోయిన్ తండ్రి కాబోయే అల్లుడు గారి శాంత స్వభావానికి ఉబ్బితబ్బిబ్బై పోవడం. ఆ సీన్ లో హీరోని ఎవడో అనామకుడు అనుకున్న ఒక వ్యక్తి ఇంకో వ్యక్తికి ఫోన్ కాల్ చేయడం. కాటమరాయుడి పేరు వినబడగానే ముందు కాళ్ళు మొక్కమని అవతలి వ్యక్తి ఇవతలి వ్యక్తిని పురమాయించడం, ఇతడు వెంటనే కాటమరాయుడి కాళ్ళు పట్టుకోవడం చూస్తే ఎప్పుడో అంతరించిన ఫ్యూడల్ భావజాలాన్ని ఈ ఆధునిక కాలంలో ఎందుకు పట్టుకు వేల్లాడుతున్నారో అర్థం కాదు. ఆ సదరు వ్యక్తి పేరులో గౌడ్ అని ఒక కులాన్ని సూచించేలా ఎందుకు పెట్టారో కూడా తెలియదు. వెంటనే అవతలి ఫోన్ లోని వ్యక్తి కూడా వచ్చేసి కాటమరాయుడి కాళ్ళు పట్టుకోవడం చూస్తుంటే, అసలు దర్శకుడు ఈ కాలం వాడేనా లేక ఫ్యూడల్ యుగం నాటి వాడు టైం మెషీన్ లో ఈ కాలానికి వచ్చి తిష్టవేశాడా అనిపిస్తుంది. ఇక రెండవ భాగంలో రెండవ సగమంతా, అహింసా మార్గం లో పోయే హీరోయిన్ ఫ్యామిలీ చుట్టూ అల్లుకున్న హింసాయుత వాతావరణాన్ని హీరో అండ్ అతడి సోదరులూ వారికి తెలియకుండానే తొలగిస్తూ ఉంటాడు. ఒకానొక సందర్భంలో హింసా మార్గంలో ఉన్నాడని తెలుసుకున్న ఆ కుటుంబం అతడిని వెలివేస్తుంది. అయినా హీరో కదా అసలు నిజాన్ని చెప్పడన్నమాట. మనసులోనే దాచుకుంటాడు. వెంకటేష్ 'రాజా' సినిమాలోలాగా సెల్ఫ్ సింపథీని హీరో ప్రదర్శించక పోవటం ఒక శుభ పరిణామం. కానీ హీరోయిన్ తండ్రి పూర్తి ఆపదలోకి  రాగానే హీరో మరలా రావడం. ఆ దుండగులనందరినీ చంపేయడం. అపుడు చివరిగా "బాబూ...మాకోసం ఇదంతా చేశావా" అంటే..అవును అని ఒక ముక్కలో చెబితే బాగోదు కాబట్టి, రెండు భారీ డైలాగులతో సినిమాని ముగించటం.

ఏమి చెప్పదలుచుకున్నాడు దర్శకుడు?. ఇంకా ఈ పాత కథలు ఎందుకు రాసుకుంటున్నారు?. తెలియదు. ఈ సినిమాకు ఏకైక బలం పవన్ కళ్యాణ్.  తెలుగులో అంత స్టైలిష్ హీరో లేడనే చెప్పాలి. దాసరి నారాయణ రావు కూడా గబ్బర్ సింగ్ సినిమా చూసి ఇదే మాటన్నాడు. అంతో ఇంతో సామాజిక దృక్పథం ఉన్న హీరో కూడా అతడేనేమో బహుశా. అతడికి ఈ సినిమాకూ ఎక్కడా పొసగదు. ఒక బంగారాన్ని దగ్గర పెట్టుకుని ఇత్తడి కథలు తీయడం, దానిని ఫ్యాన్స్ అనే వారు బలపరచటమూ చూసినపుడు, తెలుగు సినిమా దిశ ఎటు అనేది అడగాలనిపిస్తుంది. బాధ్యతాయుతమైన హీరోలుగా మన హీరోలు మారటం ఎంతో అవసరం అనిపిస్తూంటుంది. చిన్న పిల్లలు ఏది చేసినా బాగుంది బాగుంది అని తల్లి అంటుంది. తల్లికాబట్టి. అది అందరికీ చూపాలనుకుంటుంది. తల్లి కాబట్టి. పర్వాలేదు. కానీ పదే పదే అదే చూపాలి అనుకోవడంతో అసలు సమస్య మొదలవుతుంది. ఎంతకాలం పవన్ వంటి హీరోతో చేసిందే చేయిస్తారు అని నా ప్రశ్న. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ విన్న కథలలో ఇదే ఉత్తమ కథ అయుంటుంది. అందుకే అతడు మోసపోయాడు. ఇదే ఉత్తమ కథ అయినట్టైతే అసలు పరిశీలనకు వచ్చి రిజెక్ట్ అయిన కథల పరిస్థితి ఇంకెంత దారుణమో ఆలోచించాలి. పవన్ వంటి సామాజిక స్పృహ ఉన్న హీరో మీద సామాజిక బాధ్యత కూడా ఉంటుంది. ఫ్యాన్స్ కోసమే సినిమా తీసేట్టయితే ఇంక సినిమా తీసి రిలీజ్ చేయడమెందుకు, ఫ్యాన్స్ ని అందరినీ ఒక థియేటర్ లో కూర్చోబెట్టి ప్రదర్శస్తే సరిపోతుందిగా. పవన్ ఈ సమాజం కోసం సినిమా తీయాలి. ఆధునిక యుగంలోని సామాజిక వాస్తవిక జీవితాలకు దృశ్య రూపం ఇవ్వాలి. ప్రజలను ఆలోచింపజేసే సినిమాలు తీయాలి. పవ'నిజం' అలా మొదలుకావాలి.

26/3/17
Virinchi virivinti.
ధ్యావుండా....

"దేవుడా...నువ్వున్నావని నమ్ముతున్నాను" అని దేవునికి తెలియ చెప్పాలనుకోవడమే భక్తి
దానిని దేవునికి తెలియజెప్పడానికి ప్రయత్నిస్తున్నానని పది మందికీ చూపుకోవడం నిష్ఠ
ఆ విధంగా చూపుకున్నది అవతలి వాడిని కూడా మార్చేసి తన మార్గం వైపుకు మరలేలా చేస్తుందనుకోవడం ఆచార్యత్వం
అలా పదిమందిని పోగేసుకుని దేవుడి గురించి సొల్లు కబుర్లు చెప్పుకోవడం..కల్ట్.
వారిలో ప్రతీ ఒక్కరినీ ఇంకో పది మందిని (వీలైతే మందని) పోగేసుకురమ్మని పురమాయించడం ప్రచారం
అటువంటి వారు చెప్పే కాకి కబుర్లు విని ఊగిపోవడం వారితో కలిసి 'పోవడం' మతానందం
అనుభవించిన ఆ వెర్రి ఆనందమే అందరికీ కలగాలనుకోవడం మత జాడ్యం
ఈ పిచ్చానందాన్ని పదిమందికీ పంచి డబ్బు పోగేయటం మత వ్యాపారం
ఈ ఆనందాన్ని ఇలాగే, ఈ చెప్పబడిన దేవుడితోటే పొందావో సరి, లేదంటే నా చేతిలో చచ్చావే పో...అనుకోవడం మతోన్మాదం.
ఈ దైవానందం నాకు మల్లేగాకుండా ఇంకో రకంగా పొందాడో వాడు ముమ్మాటికీ శత్రువే , అనుకొని  వాడిని చంపేయడమే మత తీవ్రవాదం.

హమ్మయ్య......
మతాల మతలబులు ఇలా దొరుకుతాయనుకోలేదు.

Wednesday, 22 March 2017

ఇద్దరు మిత్రుల రసవత్తర నాటకం.
------------------------------------------------

ఇళయరాజా, బాలు కావాలసిగానే కాపీ రైట్ విషయాన్ని తెరమీదకు తెచ్చారని నా అవగాహన. వారిద్దరూ మంచి మిత్రులన్నది అందరికీ తెలిసిన విషయమే. అటువంటపుడు కాపీ రేట్స్ మీద గొడవపడవలసిన అవసరం ఉండదనుకుంటాను. ఇక ఇళయరాజా ఒక మంచి విషయాన్ని తెరమీదకు తెచ్చాడు. కమర్షియల్ ప్రోగ్రామ్స్ లో తమ గొంతు విప్పి పాడుతున్న గాయకులు పాడే పాటలేవీ తాము స్వంతంగా స్వరపరిచినవి కావు. వాటిని సృష్టించిన సృజనకారులు సంగీత దర్శకుడూ సాహిత్య కారుడూనూ. నిజానికి వారి బుర్ర ఇందులో లేకపోతే ఈ గాయకులకు ఆ పేరు వచ్చేదే కాదు. పేరు విషయం పక్కకు పెడితే, ఎపుడో స్వరపరిచిన పాటలను నేటికీ పాడుతూ  డబ్బును వెనుకేసుకుంటున్న గాయకులు, ఈ మొత్తం సంపాదనలో స్వరకర్తనూ, సాహిత్యకారుడినీ పట్టించుకోక పోవడం ముమ్మాటికీ క్షమింపరాని నేరం. ఇళయరాజా దానిని బయటకు తీసుకువచ్చి, పాట సృష్టిలో అసలైన శ్రామికులకు చెందవలసిన క్రెడిట్స్ ని నొక్కి వక్కాణించి నట్టయింది. ఇది ఇళయరాజా మాత్రమే చేయగల సాహసం.

ఇది బయటకు కాపీ రైట్స్ విషయంలా కనబడినా, లోపల ఎన్నో విషయాలను తప్పక తెరమీదకు తీసుకొస్తుంది. ఇళయరాజానే ఈ సాహసం చేయగలడని ఎందుకన్నానంటే...వేరే ఏ సంగీత దర్శకుడూ తాను స్వరపరచిన పాట పూర్తిగా తన సొంతదే అని చెప్పగలిగిన ధైర్యం ఉన్నవాడు కాదు. రెహ్మాన్ నుండి, దేవిశ్రీప్రసాద్ వరకూ ఇంగ్లీష్, స్పానిష్, అరబిక్ వంటి భాషల పాటలను కాపీ చేసి తమ సినిమాల్లో 'వాడుకున్నా'రనేది నిర్వివాదాంశం. అంతే కాక వాళ్ళు ఎక్కడా ఆ ఒరిజినల్ సంగీత కారుడికి క్రెడిట్స్ ఇచ్చినట్టుగా కనిపించకపోగా, ఇదంతా తమ 'తెలివి మహాత్యమే' అని చెప్పుకోవడమూ చూస్తున్నాం. ఇపుడు ఈ కాపీ రైట్స్ వివాదం ముదిరి ముదిరి పాకాన పడుతుంది. ఇళయరాజా మీద ప్రశ్నల వర్షం కురుస్తుంది. "తమరు నావి అని చెప్పుకుంటున్న స్వర బాణీలు ఎంతవరకు మీవి"? అనే అంశం తెరమీదకు వస్తుంది. నాకు తెలిసి ఇళయరాజాకు వేరే బాణీలను కాపీ చేసుకోవాల్సిన అవసరమూ, అవి తన సృష్టే అని అబద్ధం చెప్పుకోవాల్సిన ఆగత్యమూ ఇంతవరకూ రాలేదు. కాబట్టి అతడు పూర్తిగా సేఫ్ సైడ్. ఇపుడు ఇతర సంగీతకారులు కూడా ఇళయరాజాలాగానే తమ కాపీ రైట్స్ విషయంలో మాట్లాడాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఈ బాణీ "సాంతమూ నాదే" అని చెప్పలేని మహా మాయగాల్లందరూ గప్చుప్ కాక తప్పదు. ఇక అసలు దొంగలను బయట పెట్టే కార్యక్రమం కోసమే ఇద్దరు మిత్రులు కలిసి వేసిన పాచిక అని నాకనిపిస్తుంది.
పిల్లలాట
----------------

సాధారణంగా పిల్లలు ఏదైనా విషయాన్ని పోటీ పడి తోటి పిల్లలతో చెబుతూ వుంటారు. నా దగ్గర పది చాక్లెట్లున్నాయి తెల్సా అని ఒకడంటే, నా దగ్గర పదకొండున్నాయి తెలుసా అంటాడింకొకడు. మా ఇంట్లో మూడు కుక్కలున్నాయ్ అంటే..మా ఇంట్లో నాలుగున్నాయ్ అంటాడు. ఏది చెప్పినా దానికింకొకటి కలిపి చెప్పడం, ఆ విధంగా అవతలివాడికంటే తామే గొప్ప అని చెప్పాలనుకోవడం పిల్లల అలవాటు. అది పిల్లలకు ఒక ఆట. దీనిని బ్రాగ్గింగ్ అంటారు. పిల్లలు అభివృద్ధి చెందే దశల్లో ఇదీ ఒకటి. పిల్లలు సోషియలైజ్ అయ్యే దశలో ఈ విధంగా ప్రవర్తిస్తుంటారు. కానీ ఇదే పరిస్థితి పెద్దగ అయ్యాక కూడా దాపురించిందంటే అది అసాధారణ మానసిక రోగమని చెప్పాలి. ఈ ఉప ఎన్నికలలో జరిగిన ప్రచార తంతు కావచ్చు, ఆ తరువాత జరిగిన రాజకీయ సమీకరణాలు కావచ్చు, ఈ చిన్న పిల్లలాటను గుర్తు చేస్తున్నాయి. ప్రజాస్వామ్యం ప్రజల మేధావిత్వాన్నీ, ఆక్టివ్ పార్టిసిపేషన్ నీ మాత్రమే కాక హుందాతనాన్నీ కోరుకుంటుంది. రాహుల్ గాంధీ లో వీడని బాల్యం, ప్రధాన మంత్రి అయిన మోడీలో కూడా బాల్యాన్ని నిద్రలేపిందేమో....మరీ దిగజారుడు స్థాయిలో ప్రచారాలు జరిగాయి. నారియల్ పానీ, నారియల్ జ్యూస్ వంటి చిల్లర జోక్ లూ ప్రధాన మంత్రి ఉపన్యాసాల్లోకి వచ్చి చేరాయి. గతంలో ప్రధానమంత్రులెవరూ ఇలా మాట్లాడిన దాఖలాలు లేవు. తానేంచేయబోతున్నాడో..తన గవర్నమెంటు పథకాలేంటో, సాధించిహ విజయాలేంటో ప్రతిభావంతంగా ప్రజలముందు పెట్టి, ఎంతో హుందాగా ఓట్లను అడిగేవారు. చురకలు విజ్ఞతతో కూడుకుని ఉండేవి. చమత్కారంగా సాగేవి. అవన్నీ ఇపుడు పోయి, పిల్లలాటగా మారిందనిపించేలా ఉపన్యాసాలు సాగాయి.

ఎన్నికల తరువాత కూడా..గోవా మణిపూర్ లలో ఒక్కొక్కసీటును లెక్కపెట్టుకుంటూ, నేను గొప్పంటే నేనే గొప్ప అని అధికారాన్ని చేజిక్కించుకోవడం కోసం పడుతున్న పాట్లు చూస్తుంటే, ఈ చిన్న పిల్లలాటే గుర్తుకొస్తోంది. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షంలో కూర్చోవటం నామోషీ ఏమీ కాదు. ప్రజల కష్టాలని అర్థం చేసుకోవడానికి, పరిపాలనలో ఊహలకూ వాస్తవానికీ ఉన్న అంతరాల్ని అవగతం చేసుకోవడానికీ తద్వారా మెరుగైన సమాజాన్ని తయారు చేసుకోవడానికీ ప్రతిపక్షం పాత్ర దోహదపడుతుంది. అధికార పక్షానికి ఎప్పటికప్పుడు చేసే తప్పులను గుర్తుకు చేయడం సరి చేసుకోవడానికి అవకాశం కల్పించడం వంటి బాధ్యతల ద్వారా, ఇంకా మెరుగైన పాలన అందించడానికి ప్రతిపక్షం దోహదం చేస్తుంది. ప్రతిపక్షంలో ఉంటే ఓడిపోవడమూ, అధికార పక్షంలో ఉంటే గెలవడమూ అనే స్పృహ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం. ప్రజలు ఈ సారికి ఆ  పక్షానికి అధికారమిచ్చారు అంతే తప్ప అదేదో శాశ్వత విజయం కాదు. కానీ పరిస్థితులు చూస్తుంటే కేవలం అధికారాన్ని చేజిక్కించుకోవడం కోసం మాత్రమే ప్రజాస్వామ్యం ఉన్నట్టు కాకలుదీరిన రాజకీయ పార్టీలు ప్రవర్తించడం, హుందాగా వ్యవహరించవలసిన చోట చిన్నపిల్లల్లా ప్రవర్తించడం చాలా దారుణమైన విషయం. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విషయం. గోవా మణిపూర్ లలో హుందాగా కాంగ్రేసుకు అధికారమిచ్చి తాను ప్రతిపక్షంలో కూర్చుని ఉంటే, బీజేపి వంటి అనుభవమున్న పార్టీమీద గౌరవం పెరిగేది. కానీ ఇండిపెండెంట్ అభ్యర్థులను కలుపుకొని, బహుశా కొని, అధికారం కోసం అర్రులు చాచటం పిల్లల పది పిప్పరమెంట్ల ఆటనే గుర్తుకు తెస్తోంది.

మన సమాజం మోడెస్టీని ఇష్టపడే సమాజం. సాధుశీలతనూ, వినయాన్నీ, త్యాగాన్నీ ఆదర్శాలుగా చెప్పుకునే సమాజం. అతిగా గొప్పలు చెప్పుకుని తమ ప్రతాపం చూపించుకోవాలి అనుకునే వారిని ఈసడించుకునే సమాజం. ఇటువంటి దేశంలో ప్రజాస్వామ్యం వాస్తవానికి దాని స్వచ్ఛతను బయటపెట్టేదిలా ఉండాల్సింది పోయి, దాని లొసుగులతో పబ్బం గడుపుకునే వారిని తయారు చేయడం భయానకమైన విషయం. బహశా మన దేశంలో ఉండే బానిస మనస్తత్వం ఇటువంటి పోకడలను ప్రోత్సహిస్తుందేమో. ప్రజలు స్పష్టమైన మెజారిటీ ఇంకో పార్టీకి ఇచ్చాక కూడా, తిమ్మిని బమ్మిని చేసి రాజ్యాధికారం కోసం అంగలార్చడం ఏ విధంగా ప్రజాస్వామ్యం అనిపించుకుంటుందో వారే చెప్పాలి.

15/3/17
Virinchi Virivinti
తల్లి అసలు స్వరూపం
--------------------------------------

ప్రతీ ఒకరికీ వారి వారి మానసిక చట్రం ( Mental Frame)  ఒకటి ఉంటుంది. తన చుట్టూ ఉన్న ప్రపంచం ఇచ్చిన అనుభవాలే అతడి మానసిక చట్రాన్ని ఏర్పరుస్తాయి.  ఒక వ్యక్తి చుట్టూ పరుచుకుని ఉన్న అనుభవాలు, చుట్టూ పేరుకుని ఉన్న భావాలతో,ఇంకో రకంగా చెప్పాలంటే ఆదర్శాలతో ఏకీకృతం కానపుడు, అతడు తన మానసిక చట్రంలో తీవ్ర ఘర్షణకు లోనవుతాడు. వైయుక్తిక అనుభూతికీ, సామాజిక ఆదర్శానికీ లంకె దొరకక పరాయీకరణ (Alienate) చెందుతాడు.  చుట్టూ వున్న సమాజంలో ఇమడలేక ఏకాకవుతాడు. అటువంటి వ్యక్తి సాధారణ వ్యక్తి అయితే, అతడు నిశ్శబ్దంగా నిస్సారంగా తన బతుకును వెళ్ళదీస్తాడు. కానీ ఆ వ్యక్తి ఒక కవి అయితే ఆ ఘర్షణను భాషలో వ్యక్తీకరించటానికి ఉద్యమిస్తాడు. ఆ ఉద్యమంలో అతడు వ్యవస్థ ఆదర్శాలను తనలోని సంఘర్షణతో ఢీకొడతాడు. ఢీకొట్టే బలాన్ని బట్టి నూతన సృష్టి జరిగే అవకాశం పెరుగుతూ  ఉంటుంది. ఎంతగా లోపల సంఘర్షణ ఉంటే అంత బలంగా దెబ్బ వుంటుంది. దెబ్బెంత బలంగా వుంటే ఏర్పడిన సమాజాదర్శాలు అంతగా వినాశనమవుతాయి. అవెంత వినాశనమౌతే నూతన సృష్టి అంతగా జరుగుతుంది. అంటే లోపలి సంఘర్షణ బయటి సృష్టికి కారణమవుతుంది. ఫ్రాయిడ్ చెప్పినట్టు చెప్పాలంటే సృష్ట సమాజంలో ఇమడలేనివాడు కాబట్టే సృష్టి చేస్తాడు. నిజానికి కవికి సమాజంతోటి సంఘర్షణ అనేది అనుషంగిక ఆవశ్యకతలా మారుతుంది కాబట్టే కవి దారి చూపించేవాడవుతాడు. కవి లేదా కళాకారుడు స్రష్ట కనుక ఆ ఆవశ్యకతతోటే జీవిస్తాడు అంటాడు రాంక్ అనే మనో వైజ్ఞానిక శాస్త్రవేత్త. కళ అనేది ఆత్మాభివ్యక్తీ కాదు, సృష్ట సమాజపు( created society's) సామూహికాదర్శ అభివ్యక్తీ కాదు. అది వైయుక్తిక సామూహికాదర్శాల మధ్య ఘర్షణ అనేది అతని సిద్ధాంతం. ఈ లెక్కన చూసినపుడు కవిత్వ సృష్టిలో స్వచ్ఛమైన కళాభినివేశం పెరిగేకొలదీ, అతడు సమాజాదర్శాలకు దూరం జరుగుతాడు. సమాజాన్ని కొత్తగా చూపించటం మొదలెడతాడు. రవి కాంచని చోట కవికాంచును. అలాంటి కవి మద్దూరి నగేష్ బాబు.

ఈ కవితలోని వస్తువు అమ్మ. నేటికీ అమ్మ అనగానే ఒక రూపం మన మదిలో కలుగుతుంది. ఈ రూపం ఈ సమాజాదర్శం నుండి వచ్చిందే తప్ప వాస్తవ రూపం కాదు. అందుకే అమ్మ అనే భావన చుట్టూ పేరుకుని ఉన్న భావజాలాన్ని అందులోని డొల్ల తనాన్నీ బలంగా బద్దలు చేస్తాడీ కవితలో. అమ్మకు సంబంధించిన అతడి వైయుక్తిక అనుభవంలోని నిజం, సమాజాదర్శంలోని అబద్దం ఈ రెండూ కవిని ప్రేరేపిస్తాయి. అమ్మను కొత్తగా చూపిస్తాయి. నిజానికి కొన్ని ప్రమాణాలకు లోబడి మనుషులు భావనలను ఏర్పరచుకుని, వాటిని స్థిరీకరించుకున్నపుడు ఆ సమాజం మృత సమాజమే అవుతుంది. సృజనాత్మకతకీ చోటుండదు. కవి సృజించేవాడు. మృత్యవుని జయించేవాడు. మృత సమాజాన్ని మేల్కొలిపేవాడు. మద్దూరి నగేష్ బాబు కవితల్లో ఈ అంశం కనిపిస్తుంది. ఈ కవితలో అబద్దంలో జీవించడమే కాక సమాజంలోని పోతపోసిన పోకడలని అనుసరించే అరవింద ఘోష్ వైషయిక (sensate) మానవుడినీ, లేదా జే.ఎస్ మెకంజీ పండిత మన్యుడినీ( pedant) చాలా వ్యంగ్యంగా విమర్శిస్తాడు. ఫిలిస్టైన్ (philistine) మానవుని భావబధిరత్వాన్ని, సత్య బధిరత్వాన్నీ సులువైన మాటలలో ఎండగడతాడు. అమ్మ భావనను కొత్తగా చూపివ్వడమే కాకుండా అందులో తన సంవేదనను నింపుతాడు. తద్వారా సమాజంలోని వ్యక్తులు తల్లి చుట్టూ ఏర్పడిఉన్న  భావనలద్వారా ఎంతటి అంధులుగా మారారో చెప్పదలచుకుంటాడు. తల్లి భావనను మనిషి భావన దగ్గరికి తీసుకెల్లి, తల్లి కూడా ఒక మనిషే అనే సత్యాన్ని తీసుకువస్తాడు.

వైషయిక మానవ సమూహంతో ఏర్పడిన మనదేశ సంస్కృతి, బీదతనంలో మగ్గి, అసే ఒసే లంజముండా అనిపించుకున్న తల్లుల విషయంలో ఎంతటి అంధత్వాన్ని ప్రదర్శించిందో ఈ కవితలో చూపిస్తాడు. మనదేశంలో అత్యధిక తల్లులు ఈ బాధలను అనుభవించినవారే..తక్కువకులం పేరుతో నానా మాటలూ పడ్డవారే. అంతేకాక చెరువుల దగ్గర నీళ్ళు కూడా తాగనీయని అగ్ర వర్ణ అహంకారం, తమని అక్షర సముద్రం ముందర అంగీకరిస్తుందా అని అడుగుతాడు కవి.  బుద్ది జీవుడైన కవితప్ప ఇంకెవ్వరూ సంస్కృతి అనబడే అంశంలోని పటాటోపాన్ని గుర్తించలేరు. తను చూసిన తన తల్లి రూపాన్ని అందరికీ చూపించి తద్వారా తల్లి అనే సమాజ భావనలోని లోపాన్ని ఎత్తిచూపుతాడు కవి. తల్లి భావనను ఒకదానిని సృష్టించి,దానిని స్థిరీకరిస్తుంది సమాజం. పోతపోసినట్టుండే ఆ భావానికి సంబంధంలేని అతిరిక్త (deviant) భావనలన్నింటినీ కొట్టేయ్యాలని నాశనం చెయ్యాలనీ సమాజం, దాని నాగరికత నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటాయి. వీటన్నింటిని సమర్థవంతంగా కవితలో చర్చిస్తాడు కవి.
అంతేకాక మన భారతీయ సమాజంలో కుల వ్యవస్థలో వివక్షకు గురైన పీడితులను సాటి మనుషులుగా గుర్తించలేని తత్వం కనిపిస్తుంది. సాటి మనుషులను పశువులుగా గుర్తించిన వారు కూడా పశువులే. నిజానికి ఈ దేశ తల్లుల మీద చాలా బాధ్యత ఉంది. తమ పిల్లలు మనుషులని మనుషులుగా గుర్తించగలిగేలా పెంచటమా, లేక మనుషులను పశువులుగా గుర్తించగలిగేలా పెంచటమా అనేది వారి పెంపకం మీదే ఆధారపడి వుంది. స్త్రీగా కాక మనిషిగా బతికిన తల్లులే తమ పిల్లలను మనుషులుగా పెంచుతారేమో..! ఇటువంటి ఒక అంతర్లీన సూచనతో కవిత ముగుస్తుంది. మనకు కొత్తగా తల్లిని చూచిన అనుభూతి మిగులుతుంది.

||అలగా తల్లి || మద్దూరి నగేష్ బాబు || మాతృక సౌజన్యంతో ||
------------------------------------------------------------------------------------------------
ఏ ప్రభుత్వాసుపత్రి శవాలకొట్టుముందయినా
ఒక కన్నీటి మడుగుని చూసారా – అది మా అమ్మే
ఏ సమాధుల దొడ్లోనయినా కనీసం చావుబండకి నోచుకోని
బొందమీద మొలిచిన ఏకాకి శిలువని చూసారా? – అదీ మా అమ్మేనండీ

మా అమ్మ యశోద కాదు
అలాగని కౌసల్యా కాదు

ఆకలై గుక్కపట్టి ఏడుస్తున్న నన్నెత్తుకొని చందమామని చూపిస్తూ
వెండిగిన్నెల గోరుముద్దలు తినిపించలేదు మాయమ్మ
నూజీడీల కోసం మారాం చేస్తే నాలుగు తన్ని కసురుకుందేకాని
కొసరి కొసరి బేబీ బిస్కెట్లు తినిపించలేదు మాయమ్మ

ఆమె కళ్ళల్లో ఎన్నడైనా ఒక్క దీపమైనా వెలిగిన జాడలేదే
అలాంటి మా అమ్మమీద ఏం రాయమంటారండీ

అందరూ వాళ్ళ అమ్మల మీద కావ్యాలల్లుతున్నారంటే
వాళ్ళ తల్లులు రాజమాతలు కడుపులో చల్ల కదలని క్షీరమాతలు
మా అమ్మదేవుందండీ
అసే ఒసే అనే తప్ప ఒక పేరన్నదే లేనిది

లంజముండా అని తప్ప గౌరవవాచకాలకి నోచుకోనిది
బతుకంతా గుక్కెడు గంజినీళ్ళ కోసమే దిగులుపడి డీలాపడ్డ పిచ్చిది
అలాంటి మా అమ్మ మీద కవిత్వమంటే
అక్షరాలు అంగీకరిస్తాయంటారా?
లక్షణాలు వొదుగుతాయంటారా?

అందరి తల్లులు ఆదమరిచి సుఖనిద్రలు పోతున్నప్పుడు
నా కూలితల్లి పంటకుప్పల మధ్య పరాభవమైపోయింది
ఉన్న తల్లులంతా ఉత్తమమాతల పురస్కారాలందుకుంటున్నప్పుడు
నా వాడతల్లి గుక్కెడు నీళ్ళు తాగినందుకు జరిమానాలు కడుతూ వుంది
అందరి తల్లులు అపరనాయకురాళ్ళయి ఏలికలు చేస్తున్నప్పుడు
నా అలగాతల్లి ప్రభుత్వాఫీసుల ముందు ధర్నాలు చేస్తూ వుంది

ఎవరికైనా అమ్మంటే పాలు పడుతూనో జోల పాడుతూనో గుర్తొస్తే
నాకు మా అమ్మ కలుపుతీస్తూనో తట్టలు మోస్తూనో గుర్తొస్తుందండీ
కోడి కూసింది మొదలు రాత్రికి నాన్న తట్టిందాకా
తనకసలు ఒక ఆడదాన్నన్న సంగతే గుర్తుకురాని నా మొరటు తల్లి మీద
ఏం రాయమంటారండీ

నాకు మా అమ్మ ఎప్పుడూ జోల పడలేదండీ
దాని గొంతెప్పుదో ఆకల్తో పూడుకుపోయింది
నన్ను మా అమ్మ ఎప్పుడూ జోకొట్టనైనా లేదండీ
దాని చేతులెప్పుడో వ్యవసాయపనిముట్లుగా మారిపోయాయి

పిల్లలందరూ తమ తల్లుల చిటికెనేళ్ళు పుచ్చుకు వనభోజనాలకెళ్తుంటే
నేను మా అమ్మడొక్కలోయలోకి ముడుక్కుని పడుకున్నాను సార్!
బిడ్డలంతా తమ తల్లుల్ని ప్రత్యక్షదైవాలుగా కీర్తిస్తుంటే
నేను ఫీజు కట్టలేని నా పేదతల్లిని కసిదీరా తిట్టిపోస్తున్నాను సార్
కొడుకులందరూ తమ కలిగిన తల్లుల తలనొప్పులకే తల్లడిల్లుతున్నప్పుడు
నేను నా రోగిష్టితల్లి ఇంకా ఎందుకు చావలేదా అని గొణుక్కున్నాను సార్

ఏం చెప్పమంటారండీ!
వానలో తడిసొచ్చి తుడుచుకుందామని అమ్మకొంగందుకుంటే
కోటి మాసికలు నన్ను వెక్కిరించాయండీ
చిన్నప్పుడు ఆకలై మా అమ్మరొమ్ముని ఆబగా నోటికదుముకుంటే
నాకు దాని పక్కటెముకలు గుచ్చుకున్నాయండీ

ఏదేమైనా సార్!
సాటిమనుషుల్ని పశువులుగా చూసే పశువుల్ని కని
పశుమాతలుగా దూషించబడుతున్న లక్షలాది తల్లుల మధ్య
మనిషి కాక మరేమీకాని నా తల్లి గురించి చెప్పాలంటే
ఈ భాషా ఈ కవిత్వం ఎప్పటికీ సరిపోవు సార్!

(కవిత్వ సందర్భం 32)
8/3/17
Telugu traslation of our movie song
EL MUCHACHO DE LOS OJOS TRISTES by Spanish singer JEANETTE
----------------------------------------------------------------------------------------------------------------------

అతడి ప్రపంచాన్ని ఆనంద పరచటానికి
ఒక చిన్న నవ్వు,
అతడి లోతైన కళ్ళలో ఒక చిన్న వెలుగూ
కనీసం ఒక ఆలోచనా ప్రతిబింబం
ఏదీ లేదసలు

అతడి కళ్ళ లోని బాధ
నాతో నిశ్శబ్దంగా మాట్లాడుతోంది
నిదానంగా నాతో నాట్యం చేస్తోంది.
దూరతీరాలనుండి ఎగిరొచ్చిన ఆ బాధ
నా అంతరంగాన్ని తాకి ప్రేమగా మారుతోంది.

విచారంగా కనిపించే కనులున్న అతడి ఒంటరితనానికి
నా ప్రేమ కావాలి.
ఈ గాలికి నా అవసరం ఉన్నట్టుగా
నేనతడికి అవసరమిపుడు

విచారంగా కనిపించే కన్నులున్న ఈ అబ్బాయిపుడు
చిరునవ్వు నవ్వటానికి ఓ కారణం కనుగున్నాడనిపిస్తుంది.
నా స్నేహాన్నీ, నా ప్రేమనూ ఆస్వాదిస్తున్నాడనిపిస్తుంది.

నాకతడి పేరు తెలియనప్పటికీ
అతడు ఒంటరిగా దొరికినపుడు
వసంతంలాంటి ఆ కళ్ళలో
లోకాల్ని మరచి నిదురపోవాలనిపిస్తుంది.

ఈరోజు దీనంగా కనిపిస్తున్న అతడి కళ్ళలో
నేను ఏదో ఓ కారణం కనుక్కోకుండా పోను
సునిశితమైన నవ్వును ఆ కళ్ళలో చూడకుండా పోను

విచారంగా కనిపించే కనులున్న అతడి ఒంటరితనానికి
నా ప్రేమ కావాలి.
ఈ గాలికి నా అవసరం ఉన్నట్టుగా
నేనతడికి అవసరమిపుడు

విచారంగా కనిపించే కన్నులున్న ఈ అబ్బాయిపుడు
చిరునవ్వు నవ్వటానికి ఓ కారణం కనుగున్నాడనిపిస్తుంది.
నా స్నేహాన్నీ, నా ప్రేమనూ ఆస్వాదిస్తున్నాడనిపిస్తుంది.
విరించి ll   మాట్లాడుకుందాం  ll
------------------------------------------------

నేను చెప్పగానే నీవు వింటావనీ, మారిపోతావనీ
నేనెప్పటికీ అనుకోను
కానీ ఎందుకనో..
చెప్పకుండా నిస్పృహతో ఉండిపోవాలనే పట్టుదలను
ప్రతిసారీ బలవంతంగా వొదులుకుంటూనే ఉంటాను

నేను చెప్పినపుడు నీవు విన్నా విననట్టుగా ఉండిపోతుంటావు
లేదా, అదేమంత ముఖ్యం కాదన్నట్టుగా ప్రవర్తిస్తుంటావు
నాకు అత్యద్భుతమైన విషయం
నీ ముఖ కవళికల్లో అతి చిన్నవిషయంగా నీవు చూపించినపుడు
పైకి నవ్వుతూ  లోన బాధపడటం
నేనపుడపుడే నేర్చుకుంటాను
అద్భుతమని విప్పార్చిన నా కళ్ళలో
అసహనాన్ని దాచడమెంత కష్టమో తెలుసుకుంటాను.

చెప్పాలనుకున్న అంశం ఉన్నదున్నట్టుగా
నీ మనసును చేరాలంటే ఎన్ని అడ్డుగోడల్ని దాటాలో కదా...!
నా పెదవులు మాట్లాడిన మాటలూ
నీ చెవులను చేరిన మాటలూ
ఒకటే ఎందుకు కాలేవని నేనెపుడూ ఆలోచిస్తూంటాను

పెదవులకీ చెవులకీ నడుమ
భావప్రసారం సరిగా జరిగిన తరుణంలో
మన నాలుగు నేత్రాలూ తడిసిపోతుంటాయి
మాటలు కౌగిలించుకోవడం చూస్తుంటామపుడు
ఎపుడోగానీ జరగదనుకుంటానిలాగా..!

కానీ, ఎప్పటికీ మనం మాట్లాడుకుంటూనే వుందాం
ఒకరినొకరం అపార్థం చేసుకోవడానికైనా మాట్లాడుకుందాం
సమయాన్ని నింపడానికి తప్ప ఉపయోగపడని మాటలకు
ఏదో ఒక అర్థాన్ని ఇవ్వడానికైనా మాట్లాడుకుందాం...
ఔను, ఇక మనం మాట్లాడుకుందాం.

6/3/17

Thursday, 16 March 2017

ఎంతగా కల లోకి గుచ్చుకున్నావో ఈ జీవితాన్ని
కలల్లో నెత్తురు కారుస్తున్నావు
పిచ్చివాడా...
కలల్లో స్వేచ్ఛ ఉందని విసిగిస్తావేం..?
ఏదీ నిద్రను దాటి రమ్మను చూద్దాం...

తలపుల కిటికీలు బార్లా తెరిచి కూచుంటావు
ప్రశ్నలెంత బలంగా వీస్తాయో...
ఒకసారి ఆనందంలో ఇంకోసారి విషాదంలో
ఒంటరిగా తడిసి ముద్దవుతావు
తల తుడుచుకోవడానికి తుండుగుడ్డ కూడా దొరకదా?

ఎపుడోమారు నీ ద్వేషానికీ కోపమొస్తుంది
కత్తిమీది రక్తపు చారికలా ఉంటుందేమో అది
కత్తులూ  వాడికి
నీ స్నేహం రుచిస్తుందా చెప్పు...

గుండెల్లోకి కత్తి దిగినా, తూటా దిగినా
బుగబుగ పొంగుకొచ్చేది నెత్తురు కాదేమో...
నరనరాన ఇంకిపోయిన నీ అలసత్వం
అయినా..నీ జీవన పోరాటంలో
కత్తులూ లేవు, తుపాకులూ లేవు
యుద్ధంమాత్రం జరుగుతూనే వుంది

నీ శత్రువెపుడూ నీకు అమూర్తమే
వాడికీ తెలుసు వాడు కనిపిస్తే చంపేస్తావని
ఓడిపోవడానికే నీయుద్ధం
ఓటమిలో మెలకువలు తెలుసుకోవడమే జీవితం