Wednesday, 22 March 2017

విరించి ll   మాట్లాడుకుందాం  ll
------------------------------------------------

నేను చెప్పగానే నీవు వింటావనీ, మారిపోతావనీ
నేనెప్పటికీ అనుకోను
కానీ ఎందుకనో..
చెప్పకుండా నిస్పృహతో ఉండిపోవాలనే పట్టుదలను
ప్రతిసారీ బలవంతంగా వొదులుకుంటూనే ఉంటాను

నేను చెప్పినపుడు నీవు విన్నా విననట్టుగా ఉండిపోతుంటావు
లేదా, అదేమంత ముఖ్యం కాదన్నట్టుగా ప్రవర్తిస్తుంటావు
నాకు అత్యద్భుతమైన విషయం
నీ ముఖ కవళికల్లో అతి చిన్నవిషయంగా నీవు చూపించినపుడు
పైకి నవ్వుతూ  లోన బాధపడటం
నేనపుడపుడే నేర్చుకుంటాను
అద్భుతమని విప్పార్చిన నా కళ్ళలో
అసహనాన్ని దాచడమెంత కష్టమో తెలుసుకుంటాను.

చెప్పాలనుకున్న అంశం ఉన్నదున్నట్టుగా
నీ మనసును చేరాలంటే ఎన్ని అడ్డుగోడల్ని దాటాలో కదా...!
నా పెదవులు మాట్లాడిన మాటలూ
నీ చెవులను చేరిన మాటలూ
ఒకటే ఎందుకు కాలేవని నేనెపుడూ ఆలోచిస్తూంటాను

పెదవులకీ చెవులకీ నడుమ
భావప్రసారం సరిగా జరిగిన తరుణంలో
మన నాలుగు నేత్రాలూ తడిసిపోతుంటాయి
మాటలు కౌగిలించుకోవడం చూస్తుంటామపుడు
ఎపుడోగానీ జరగదనుకుంటానిలాగా..!

కానీ, ఎప్పటికీ మనం మాట్లాడుకుంటూనే వుందాం
ఒకరినొకరం అపార్థం చేసుకోవడానికైనా మాట్లాడుకుందాం
సమయాన్ని నింపడానికి తప్ప ఉపయోగపడని మాటలకు
ఏదో ఒక అర్థాన్ని ఇవ్వడానికైనా మాట్లాడుకుందాం...
ఔను, ఇక మనం మాట్లాడుకుందాం.

6/3/17

No comments:

Post a Comment