తల్లి అసలు స్వరూపం
--------------------------------------
ప్రతీ ఒకరికీ వారి వారి మానసిక చట్రం ( Mental Frame) ఒకటి ఉంటుంది. తన చుట్టూ ఉన్న ప్రపంచం ఇచ్చిన అనుభవాలే అతడి మానసిక చట్రాన్ని ఏర్పరుస్తాయి. ఒక వ్యక్తి చుట్టూ పరుచుకుని ఉన్న అనుభవాలు, చుట్టూ పేరుకుని ఉన్న భావాలతో,ఇంకో రకంగా చెప్పాలంటే ఆదర్శాలతో ఏకీకృతం కానపుడు, అతడు తన మానసిక చట్రంలో తీవ్ర ఘర్షణకు లోనవుతాడు. వైయుక్తిక అనుభూతికీ, సామాజిక ఆదర్శానికీ లంకె దొరకక పరాయీకరణ (Alienate) చెందుతాడు. చుట్టూ వున్న సమాజంలో ఇమడలేక ఏకాకవుతాడు. అటువంటి వ్యక్తి సాధారణ వ్యక్తి అయితే, అతడు నిశ్శబ్దంగా నిస్సారంగా తన బతుకును వెళ్ళదీస్తాడు. కానీ ఆ వ్యక్తి ఒక కవి అయితే ఆ ఘర్షణను భాషలో వ్యక్తీకరించటానికి ఉద్యమిస్తాడు. ఆ ఉద్యమంలో అతడు వ్యవస్థ ఆదర్శాలను తనలోని సంఘర్షణతో ఢీకొడతాడు. ఢీకొట్టే బలాన్ని బట్టి నూతన సృష్టి జరిగే అవకాశం పెరుగుతూ ఉంటుంది. ఎంతగా లోపల సంఘర్షణ ఉంటే అంత బలంగా దెబ్బ వుంటుంది. దెబ్బెంత బలంగా వుంటే ఏర్పడిన సమాజాదర్శాలు అంతగా వినాశనమవుతాయి. అవెంత వినాశనమౌతే నూతన సృష్టి అంతగా జరుగుతుంది. అంటే లోపలి సంఘర్షణ బయటి సృష్టికి కారణమవుతుంది. ఫ్రాయిడ్ చెప్పినట్టు చెప్పాలంటే సృష్ట సమాజంలో ఇమడలేనివాడు కాబట్టే సృష్టి చేస్తాడు. నిజానికి కవికి సమాజంతోటి సంఘర్షణ అనేది అనుషంగిక ఆవశ్యకతలా మారుతుంది కాబట్టే కవి దారి చూపించేవాడవుతాడు. కవి లేదా కళాకారుడు స్రష్ట కనుక ఆ ఆవశ్యకతతోటే జీవిస్తాడు అంటాడు రాంక్ అనే మనో వైజ్ఞానిక శాస్త్రవేత్త. కళ అనేది ఆత్మాభివ్యక్తీ కాదు, సృష్ట సమాజపు( created society's) సామూహికాదర్శ అభివ్యక్తీ కాదు. అది వైయుక్తిక సామూహికాదర్శాల మధ్య ఘర్షణ అనేది అతని సిద్ధాంతం. ఈ లెక్కన చూసినపుడు కవిత్వ సృష్టిలో స్వచ్ఛమైన కళాభినివేశం పెరిగేకొలదీ, అతడు సమాజాదర్శాలకు దూరం జరుగుతాడు. సమాజాన్ని కొత్తగా చూపించటం మొదలెడతాడు. రవి కాంచని చోట కవికాంచును. అలాంటి కవి మద్దూరి నగేష్ బాబు.
ఈ కవితలోని వస్తువు అమ్మ. నేటికీ అమ్మ అనగానే ఒక రూపం మన మదిలో కలుగుతుంది. ఈ రూపం ఈ సమాజాదర్శం నుండి వచ్చిందే తప్ప వాస్తవ రూపం కాదు. అందుకే అమ్మ అనే భావన చుట్టూ పేరుకుని ఉన్న భావజాలాన్ని అందులోని డొల్ల తనాన్నీ బలంగా బద్దలు చేస్తాడీ కవితలో. అమ్మకు సంబంధించిన అతడి వైయుక్తిక అనుభవంలోని నిజం, సమాజాదర్శంలోని అబద్దం ఈ రెండూ కవిని ప్రేరేపిస్తాయి. అమ్మను కొత్తగా చూపిస్తాయి. నిజానికి కొన్ని ప్రమాణాలకు లోబడి మనుషులు భావనలను ఏర్పరచుకుని, వాటిని స్థిరీకరించుకున్నపుడు ఆ సమాజం మృత సమాజమే అవుతుంది. సృజనాత్మకతకీ చోటుండదు. కవి సృజించేవాడు. మృత్యవుని జయించేవాడు. మృత సమాజాన్ని మేల్కొలిపేవాడు. మద్దూరి నగేష్ బాబు కవితల్లో ఈ అంశం కనిపిస్తుంది. ఈ కవితలో అబద్దంలో జీవించడమే కాక సమాజంలోని పోతపోసిన పోకడలని అనుసరించే అరవింద ఘోష్ వైషయిక (sensate) మానవుడినీ, లేదా జే.ఎస్ మెకంజీ పండిత మన్యుడినీ( pedant) చాలా వ్యంగ్యంగా విమర్శిస్తాడు. ఫిలిస్టైన్ (philistine) మానవుని భావబధిరత్వాన్ని, సత్య బధిరత్వాన్నీ సులువైన మాటలలో ఎండగడతాడు. అమ్మ భావనను కొత్తగా చూపివ్వడమే కాకుండా అందులో తన సంవేదనను నింపుతాడు. తద్వారా సమాజంలోని వ్యక్తులు తల్లి చుట్టూ ఏర్పడిఉన్న భావనలద్వారా ఎంతటి అంధులుగా మారారో చెప్పదలచుకుంటాడు. తల్లి భావనను మనిషి భావన దగ్గరికి తీసుకెల్లి, తల్లి కూడా ఒక మనిషే అనే సత్యాన్ని తీసుకువస్తాడు.
వైషయిక మానవ సమూహంతో ఏర్పడిన మనదేశ సంస్కృతి, బీదతనంలో మగ్గి, అసే ఒసే లంజముండా అనిపించుకున్న తల్లుల విషయంలో ఎంతటి అంధత్వాన్ని ప్రదర్శించిందో ఈ కవితలో చూపిస్తాడు. మనదేశంలో అత్యధిక తల్లులు ఈ బాధలను అనుభవించినవారే..తక్కువకులం పేరుతో నానా మాటలూ పడ్డవారే. అంతేకాక చెరువుల దగ్గర నీళ్ళు కూడా తాగనీయని అగ్ర వర్ణ అహంకారం, తమని అక్షర సముద్రం ముందర అంగీకరిస్తుందా అని అడుగుతాడు కవి. బుద్ది జీవుడైన కవితప్ప ఇంకెవ్వరూ సంస్కృతి అనబడే అంశంలోని పటాటోపాన్ని గుర్తించలేరు. తను చూసిన తన తల్లి రూపాన్ని అందరికీ చూపించి తద్వారా తల్లి అనే సమాజ భావనలోని లోపాన్ని ఎత్తిచూపుతాడు కవి. తల్లి భావనను ఒకదానిని సృష్టించి,దానిని స్థిరీకరిస్తుంది సమాజం. పోతపోసినట్టుండే ఆ భావానికి సంబంధంలేని అతిరిక్త (deviant) భావనలన్నింటినీ కొట్టేయ్యాలని నాశనం చెయ్యాలనీ సమాజం, దాని నాగరికత నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటాయి. వీటన్నింటిని సమర్థవంతంగా కవితలో చర్చిస్తాడు కవి.
అంతేకాక మన భారతీయ సమాజంలో కుల వ్యవస్థలో వివక్షకు గురైన పీడితులను సాటి మనుషులుగా గుర్తించలేని తత్వం కనిపిస్తుంది. సాటి మనుషులను పశువులుగా గుర్తించిన వారు కూడా పశువులే. నిజానికి ఈ దేశ తల్లుల మీద చాలా బాధ్యత ఉంది. తమ పిల్లలు మనుషులని మనుషులుగా గుర్తించగలిగేలా పెంచటమా, లేక మనుషులను పశువులుగా గుర్తించగలిగేలా పెంచటమా అనేది వారి పెంపకం మీదే ఆధారపడి వుంది. స్త్రీగా కాక మనిషిగా బతికిన తల్లులే తమ పిల్లలను మనుషులుగా పెంచుతారేమో..! ఇటువంటి ఒక అంతర్లీన సూచనతో కవిత ముగుస్తుంది. మనకు కొత్తగా తల్లిని చూచిన అనుభూతి మిగులుతుంది.
||అలగా తల్లి || మద్దూరి నగేష్ బాబు || మాతృక సౌజన్యంతో ||
------------------------------------------------------------------------------------------------
ఏ ప్రభుత్వాసుపత్రి శవాలకొట్టుముందయినా
ఒక కన్నీటి మడుగుని చూసారా – అది మా అమ్మే
ఏ సమాధుల దొడ్లోనయినా కనీసం చావుబండకి నోచుకోని
బొందమీద మొలిచిన ఏకాకి శిలువని చూసారా? – అదీ మా అమ్మేనండీ
మా అమ్మ యశోద కాదు
అలాగని కౌసల్యా కాదు
ఆకలై గుక్కపట్టి ఏడుస్తున్న నన్నెత్తుకొని చందమామని చూపిస్తూ
వెండిగిన్నెల గోరుముద్దలు తినిపించలేదు మాయమ్మ
నూజీడీల కోసం మారాం చేస్తే నాలుగు తన్ని కసురుకుందేకాని
కొసరి కొసరి బేబీ బిస్కెట్లు తినిపించలేదు మాయమ్మ
ఆమె కళ్ళల్లో ఎన్నడైనా ఒక్క దీపమైనా వెలిగిన జాడలేదే
అలాంటి మా అమ్మమీద ఏం రాయమంటారండీ
అందరూ వాళ్ళ అమ్మల మీద కావ్యాలల్లుతున్నారంటే
వాళ్ళ తల్లులు రాజమాతలు కడుపులో చల్ల కదలని క్షీరమాతలు
మా అమ్మదేవుందండీ
అసే ఒసే అనే తప్ప ఒక పేరన్నదే లేనిది
లంజముండా అని తప్ప గౌరవవాచకాలకి నోచుకోనిది
బతుకంతా గుక్కెడు గంజినీళ్ళ కోసమే దిగులుపడి డీలాపడ్డ పిచ్చిది
అలాంటి మా అమ్మ మీద కవిత్వమంటే
అక్షరాలు అంగీకరిస్తాయంటారా?
లక్షణాలు వొదుగుతాయంటారా?
అందరి తల్లులు ఆదమరిచి సుఖనిద్రలు పోతున్నప్పుడు
నా కూలితల్లి పంటకుప్పల మధ్య పరాభవమైపోయింది
ఉన్న తల్లులంతా ఉత్తమమాతల పురస్కారాలందుకుంటున్నప్పుడు
నా వాడతల్లి గుక్కెడు నీళ్ళు తాగినందుకు జరిమానాలు కడుతూ వుంది
అందరి తల్లులు అపరనాయకురాళ్ళయి ఏలికలు చేస్తున్నప్పుడు
నా అలగాతల్లి ప్రభుత్వాఫీసుల ముందు ధర్నాలు చేస్తూ వుంది
ఎవరికైనా అమ్మంటే పాలు పడుతూనో జోల పాడుతూనో గుర్తొస్తే
నాకు మా అమ్మ కలుపుతీస్తూనో తట్టలు మోస్తూనో గుర్తొస్తుందండీ
కోడి కూసింది మొదలు రాత్రికి నాన్న తట్టిందాకా
తనకసలు ఒక ఆడదాన్నన్న సంగతే గుర్తుకురాని నా మొరటు తల్లి మీద
ఏం రాయమంటారండీ
నాకు మా అమ్మ ఎప్పుడూ జోల పడలేదండీ
దాని గొంతెప్పుదో ఆకల్తో పూడుకుపోయింది
నన్ను మా అమ్మ ఎప్పుడూ జోకొట్టనైనా లేదండీ
దాని చేతులెప్పుడో వ్యవసాయపనిముట్లుగా మారిపోయాయి
పిల్లలందరూ తమ తల్లుల చిటికెనేళ్ళు పుచ్చుకు వనభోజనాలకెళ్తుంటే
నేను మా అమ్మడొక్కలోయలోకి ముడుక్కుని పడుకున్నాను సార్!
బిడ్డలంతా తమ తల్లుల్ని ప్రత్యక్షదైవాలుగా కీర్తిస్తుంటే
నేను ఫీజు కట్టలేని నా పేదతల్లిని కసిదీరా తిట్టిపోస్తున్నాను సార్
కొడుకులందరూ తమ కలిగిన తల్లుల తలనొప్పులకే తల్లడిల్లుతున్నప్పుడు
నేను నా రోగిష్టితల్లి ఇంకా ఎందుకు చావలేదా అని గొణుక్కున్నాను సార్
ఏం చెప్పమంటారండీ!
వానలో తడిసొచ్చి తుడుచుకుందామని అమ్మకొంగందుకుంటే
కోటి మాసికలు నన్ను వెక్కిరించాయండీ
చిన్నప్పుడు ఆకలై మా అమ్మరొమ్ముని ఆబగా నోటికదుముకుంటే
నాకు దాని పక్కటెముకలు గుచ్చుకున్నాయండీ
ఏదేమైనా సార్!
సాటిమనుషుల్ని పశువులుగా చూసే పశువుల్ని కని
పశుమాతలుగా దూషించబడుతున్న లక్షలాది తల్లుల మధ్య
మనిషి కాక మరేమీకాని నా తల్లి గురించి చెప్పాలంటే
ఈ భాషా ఈ కవిత్వం ఎప్పటికీ సరిపోవు సార్!
(కవిత్వ సందర్భం 32)
8/3/17

No comments:
Post a Comment