Tuesday, 27 February 2024

Satire

 యుద్ధానికి ప్రజాస్వామ్యానికీ సంబంధం లేదు. ప్రజలందరి ఆమోదంతోటి యుద్ధమెవరూ చేయరు. కొంతమంది తలతింగరి పెద్దలు కలిసి ఒక రూంలో కూర్చుని పలానా నగరం మీద అణుబాంబు యేసేద్దాం అని అనుకుని యేసేస్తారు. 


ఒకదేశంపై యుద్ధం చేయాలంటే ఐక్యరాజ్య సమితి పర్మిషన్ లు గట్రా ఏమీ ఉండవు. అంతా ఐపోయాక పప్పు బెల్లాలు పంచడానికి వచ్చేదే ఐక్యరాజ్య సమితి. ఒకదేశంపై మరోదేశ అధినేత యుద్ధం మొదలెట్టగానే ప్రతి తలకుమాసిన దేశ అధినేత ఫోన్ చేసి మాట్లాడతారు. "ఆ ఏంటయ్యా...! యుద్ధం ఆపవచ్చుకదా...యుద్ధం పాపం కదా..ప్రజలు కదా.. చచ్చిపోతారు కదా..!" వంటి సినిమా క్లాసులు పీకడం లాంటివేమీ ఉండవక్కడ. "నేను నాశనం చేయబోయే దేశం యొక్క దేశ పునర్నిర్మాణ పనుల కాంట్రాక్టు మీకే ఇస్తాను!!" అని ఆ అధినేతే భరోసా ఇస్తాడు. 

యుద్ధం ఆగిపోవాలని కోరుకునేకంటే ఎంత ఎక్కువ డామేజైతే మనకంత కాంట్రాక్టు వస్తుందని వీళ్ళంతా ఉవ్విళ్ళూరుతుంటారు. 


అమెరికా ఇరాక్ విషయమై ఇలాగే ప్రపంచదేశాలను ఒప్పించిందంట. ఇండియా కూడా సైసై అంది. శాంతి అహింస సుహృద్భావము సహకారము వంటివి యుద్ధం విషయంలో కుదరవు. Everything is right  incase of war. యుక్రెయిన్ రష్యా యుద్ధమైనా, పాలస్తీనా ఇజ్రాయెల్ మధ్య యుద్ధమైనా ఓకే భయ్. ఇందులో మాకేంది మీకేంది.


ఎలక్షన్లైనా అంతే. ఈ మధ్య  ప్రజాస్వామికంగా హుందాగా జరగవలసిన ఎలక్షన్లను యుద్ధాలతో పోలుస్తున్నారు. పెద్ద కంపెనీలకు మీడియా సంస్థలకు మంచి కాంట్రాక్టులు ఎవరు ఆఫర్ చేస్తారో వాళ్ళదే విజయం. నాయకుడు చేయవలసినది ఒకటే. తన స్పీచుల్లో ఎంత దమ్ముందా లేదా నిజాయితీ ఉందా లేదా అనేది విషయంకాదు. అదంతా కామన్ మ్యాన్లకోసం వేసే బిస్కెట్లు. అసలైన విషయం పెద్ద పెద్ద వాళ్ళను  కాంట్రాక్టుల విషయమై ఎంతవరకు నమ్మించగలిగామన్నదే విషయం. ఐనా యుద్ధంలో వలే కాకుండా ఎలక్షన్లలో మాత్రం ప్రజలే చివరికి దేవుళ్ళు. దేవుడు రెండు కళ్ళిచ్చి ఒక నోరిచ్చారని రెండు చెవులిచ్చారనీ కాకుండా రెండు చెవుల మజ్జన కొంత డొప్ప ఇచ్చి అందులో కాస్త గుజ్జు కూడా ఇచ్చాడని మనం గుర్తుపెట్టుకోవాలి.

Satire

 స్విగ్గీకి ప్రతి సెకండ్ కీ రెండుకు పైగా బిర్యానీ ఆర్డర్లు వస్తున్నాయంట.


దేశంలో బిర్యానీలను పీక్కుతింటున్నారంట. 

ఐతే ఫ్రీ డెలివరీ ఉంటుంది కాబట్టి ఒక్కొక్క కష్టమర్ ఈ ఫ్రీ డెలివరీ ద్వారా ఎంత లాభం పొందారో చెబుతోంది స్విగ్గీ. బెంగుళూరు వాసులు వంద కోట్లను మిగిల్చుకుంటే ఢిల్లీలో ఒక్కతనే 2.5 లక్షలని ఈ ఫ్రీ డెలివరీ వలన డబ్బు ఆదా చేసుకున్నాడని హొయలు పోతోంది స్విగ్గీ. 

బెంగుళూరులో ఒకతను దీపావళికి ఒకేసారి రూ. 75000 పై చిలుకు  పీజాలు ఆర్డర్ పెట్టాడంట.


ఇకపోతే స్విగ్గీ వచ్చినప్పటి నుండి మూడునాలుగేళ్ళుగా  వంటింటికి అడుగుపెట్టని కుటుంబాలు తెలుగు రాష్ట్రాలలో పెరిగిపోతున్నాయి. ఫ్యూచర్ లో వంటిల్లులు లేని ఇళ్ళు కట్టుకునే అవకాశమూ లేకపోలేదు. వంటిల్లెందుకు చీపుగా, స్విగ్గీ మనకు అండగా ఉండగా అనే రోజులూ వస్తాయి. టిఫిన్ లంచ్ డిన్నర్ టోటల్ గా స్విగ్గీతో కానించేస్తున్నారు. ఈ ట్రెండ్ కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఎక్కువగా ఉందని వినికిడి. 


ఈ ట్రెండ్ పై నా కామెంట్స్ ఏమీ లేవు.

Just an observation 

కాకపోతే ఈ హోటల్స్ లో ఏ నూనెలు వాడతారో ఎంత క్వాలిటీ మెంటెయిన్ చేస్తారో....అన్నీ ఆ కరోనా వాక్సిన్ కే తెలియాలి.

Satire

 ఎంతో అన్యోన్యంగా పెరిగిన అన్నాదమ్ములే ఆస్తి పంపకాలొస్తే ఎవరివాటా ఎంత అని కొట్టుకుంటుంటారు. నీకున్న బెస్ట్ శత్రువెవరయ్యా అంటే ఎవరితో ఐతే నీవు నీ ఆస్తిని పంచుకోవాల్సి వస్తుందో వాడే నీకు అత్యుత్తమ శత్రువౌతాడు. 

ఇద్దరిలో మొత్తం వాటామీద ఎవరికి ఎక్కువ పెత్తనం ఉంటుందో వాడు మరింత పట్టుదలతో ఉంటాడు. ఎందుకంటే ఆస్తి పంచుకోవడమంటే కొంత ఆస్తి వదులుకోవడమే కాదు తన పెత్తనంని కూడా కోల్పోవడం. ఆస్తి , పెత్తనం రెండూ కలిసే ఉంటాయి. 


మహాభారతమంతా అన్నదమ్ముల మధ్య రాజ్యమనే ఆస్తి తగాదా వంటిదే.

పెద్ద రారాజైన దుర్యోధనుడు పాండవులకు మిగిలిన కొద్ది పాటి అధికారాన్ని కూడా కుయుక్తులతో లాక్కొని  అడవికి పంపిస్తాడు. అతడి బాధంతా అతడి పెత్తనం పోతుందనే. రోడ్డుమీద బిక్షగాడి వేషంలో వెళ్ళి కూర్చుంటే అక్కడున్న అసలైన బిక్షగాడొచ్చి వెళ్ళిపోమని బెదిరిస్తాడు. వినకుంటే తన్నినా తంతాడు. అడుక్కోవడంలో అది వాడబ్బజాగీరని వాడనుకుంటాడు. వాడిదే పెత్తనం. సముద్రం అందరిదైనా పెద్ద చేప పెత్తనం ఎక్కువ గనుక చినచేపను తినేయడం న్యాయమే అనుకుంటుంది. 


ఎలక్షన్ లలో సీట్లు పంచుకునే పార్టీల పరిస్థితి ఇదే. వాటా ఇచ్చేపార్టీకి పుచ్చుకునే పార్టీ అంటే లోకువ. ఇలాంటి పరిస్థితి లో తేడాలొస్తే వీళ్ళకు బయటనుండి వేరే శత్రువు అవసరం లేదు. పెద్ద చేప పెత్తనం ఒప్పుకున్నంత వరకే చిన్నచేప మనుగడ.

Satire

 ఎన్నికల పండుగ సందర్భంగా..


జండాలు మోసేవారికి

ఎండల్లో గంటల తరబడి నిలబడేవారికి

సైకాళ్ళ మీద బైకుల మీద ర్యాలీలంటూ తిరిగేవారికి

బైకుమీద కారు ముందు జెండాలు పెట్టుకునేవారికి

డ్రైవర్లకు

టైర్లకు గాలి కొట్టేటోళ్ళకి

ఓటర్లను మభ్యపెడుచూ లీడర్లను ఎలివేట్ చేసేవాళ్ళకి

తమ నాయకుడిని ఏమైనా అంటే బూతులు అందుకునేవారికి

కర్రలు కత్తులు అందుకుని రోడ్లమీద కొట్టుకునేవారికి

ప్రాణాలైనా తీస్తాం ప్రాణాలైనా ఇస్తాం అనేవారికి

సోషల్ మీడియాలో ఎగస్పార్టివాళ్ళను లకారాలతో తిట్టేవారికి

నాయకుడి స్పీచ్ అర్థంకాకున్నా జై కొట్టేవారికి

నాయకుడు ఏమి చెప్పినా చప్పట్లు కొట్టేవారికి

తలలూపేవారికీ

ఏ పార్టీలోకి జంప్ చేసినా నాయకుడిని అంటిపెట్టుకునే ఉండేవారికి

ఎన్నికల్లో తమ నాయకుడి కోసం దొంగవోట్లు వేసేవారికి

తమనాయకుడికే వేయమని పోలింగ్ బూత్ దగ్గర చెప్పే వారికి

నాయకుడు చెప్పాడని రహస్యంగా డబ్బులు పంచేవారికి 

మందు పోసేవారికి 

నాయకుడు గెలిస్తే ఊగిపోతూ అరిచేవారికి

బాణాసంచా కాల్చి వీరంగం చేసేవారికి

ఓడిపోతే ఏడుస్తూ ముక్కు చీదేవారికి...


ఇత్యాది సకల ప్రజానీకానికీ

హృదయపూర్వక

ఎన్నికల పండుగ శుభాకాంక్షలు.

Sunday, 18 February 2024

Internal Bossism - Essay

 Internal Bossism - A threat 


అంతర్గత ప్రజాస్వామ్యం కాంగ్రెసు లో ఎక్కువ అని అంటుంటారు. కాంగ్రెసు కంటే భారతదేశంలో ఎక్కువ. లేకపోతే మనమనుకునే భిన్నత్వం, వైవిధ్యం వంటివి అసాధ్యం.  భారతదేశంలో ప్రజలమధ్య వైరుధ్యాలు వైషమ్యాలు లేవని కాదు. అవి ఎంతగా ఉన్నా అంతకంటే ఎక్కువో తక్కువో వైవిధ్యాలు కూడా ఉన్నాయి. వైవిధ్యాలు ఉన్నా కలిసి జీవించడమూ ఉంది. 


భారతీయులలో ఎంత వైరుధ్యాలు ఉన్నా వైవిధ్యాలు విభిన్నతలూ ఉన్నా భారతీయత అనే అంశం మనమందరం 'భారతీయులం' అనే అంశం పట్టి ఉంచవచ్చు. అలాగే మనకు కాంగ్రెసు పార్టీ లో ఇటువంటిదే కనిపిస్తుంది. విభిన్న దృక్పథాలు ఆలోచనలు వైరుధ్యాలు వైవిధ్యాలూ కలిగిన నాయకులు ఒకచోట పనిచేయడం 'పార్టీ' అనే అంశం వారిని పట్టి ఉంచుతున్నట్టు మనం చూడగలం. గాంధీజీ నెహ్రూ జీ అంబేద్కర్ గారు పటేల్ గారు నేతాజీ, తిలక్ వంటి వారు ఒక్కొక్కరు ఒక్కో విభిన్న దృక్పథాలనుండీ నేపథ్యాలనుండి వచ్చినా ఎంతగా వారిలో వారు విబేధించుకున్నా వారంతా ఒకే పార్టీకి చెందిన వారు. కలిసే పని చేశారు. ఈ దేశం తత్వమే ఈ భిన్నత్వంలో ఏకత్వంలా మారిందనిపిస్తుంది. ఐతే చరిత్రలో ఎపుడెపుడైతే ఈ తత్వానికి గండి పడిందో అపుడంతా దేశం పతనం వైపు పయనించిందని మనం మన చరిత్రలోనే కనుగొనగలం. ఇది దేశానికే కాదు దేశ తత్వాన్ని పుణికిపుచ్చుకున్న కాంగ్రెసు పార్టీకీ కూడా వర్తిస్తుంది. థీసీస్ యాంటీ థీసీస్ సింథెసిస్ గా ఏ వ్యవస్థ ఐనా ఉండకపోతే మన దేశంలో అది పతనం చెందక తప్పదు అని చరిత్ర చూస్తే అర్థమౌతుంది.


స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జరిగిన పాలన కానీ ఎలక్షన్లుకానీ పార్లమెంటు వంటి చట్ట సభల్లో జరిగే వాదోపవాదాలు కానీ అన్నీ ఇదే తత్వాన్ని ప్రతిఫలింపజేస్తాయి. కాంగ్రెసు పార్టీకూడా అందుకే అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువని పేరు తెచ్చుకుంది. ఐతే ఈ పార్టీలో ఈ తత్వానికి పెద్ద ఎత్తున గండి పడిన సమయాలు చెప్పుకోతగ్గవి రెండు. ఒకటి ఎమర్జెన్సీ ఐతే రెండవది పీవీ నరసింహారావు గారి తర్వాత రోజులు. ఎమర్జెన్సీ సమయంలో ఏం జరిగిందో మనకు తెలుసు. ఇది కేవలం ఆ పార్టీ మాత్రమే అంతర్గత ప్రజాస్వామ్యాన్ని కోల్పోవడం కాదు. దేశం మొత్తం ఏకవ్యక్తి పాలనలోకి పోవడం. ఈ దేశంలో రాజరికాలను చూసింది కనుక ఈ దేశానికి రాజరీకమే కరెక్టని మనం అనుకోవచ్చుగానీ రాజరికంపై మన దేశపౌరులు పెద్దగా తిరుగుబాటు చేయకపోవచ్చుగానీ దానిని ఈసడించుకున్నారని మనకర్థమౌతుంది. ఎంత రాజుగారిని పొగిడినా రాజు మీదికెక్కి కూర్చుంటానంటే ఒప్పుకోని ప్రజలే మనకున్నారు. అందుకే ఇతర దేశాలమాదిరి బానిసత్వాన్ని మన పూర్వీకులు పూర్తిగా institutionalize చేయలేకపోయారు.  పీవీ నరసింహారావు గారి పాలన తర్వాత కాంగ్రెసు పార్టీలో 'అధీష్టానం' అనేదొకటి బలంగా ఏర్పడి తన సహజమైన విభిన్నతనూ ఇంటర్నల్ డెమోక్రసీని కోల్పోయింది. అది తనతో తాను యుద్ధంలో ఇరుక్కుంది. ఇది అందరూ అనుకుంటున్నటువంటి కుటుంబ పాలన కాదు. అంతకు మించిన తాత్విక పునాదినే కోల్పోవడం ఇది. అప్పటినుండే పార్టీ పతనం కూడా ప్రారంభమైంది. 


మౌన ముద్రకి కేరాఫ్ అడ్రస్ ఐన పీవీ నరసింహారావు ఈ 'పార్టీ' అనే ఏకత్వ భావనను నిలిపేందుకే మౌనంగా ఉన్నారని మనం అనుకోక తప్పదు. తన అభిప్రాయాలూ దృక్పథాలూ ఎలా ఉన్నా ఒక కామన్ కాజ్ కోసం పని చేయాలంటే కొంత మౌనం ఉండక తప్పదు. ఇదే భారతీయ తత్వం. ఇది మంచిదా చెడ్డదా అని అడిగితే మంచిదీ చెడ్డదీ. రెండూనూ.  అందుకే 'పార్టీ' అనే అంశం దానికి కట్టుబడి ఉండటం అనే అంశం కాంగ్రెసు పార్టీ తాత్విక పునాది. పీవీ దానిని పాటించారు. కానీ పీవీ పాలన తర్వాత పీవీని పట్టించుకోవడం పార్టీ మానేసింది. అటునుంచి 'అధిష్టానం' అనబడే ఇంటర్నల్ నియంతృత్వం వైపుకి కదిలింది. ఇంటర్నల్ బాసిజం పార్టీలకే కాదు ఈ దేశంలో సంస్థలకైనా చివరికి మన ఇళ్ళకు కూడా ప్రమాదకరమైనది. తండ్రియే ఇంటికి బాసు, ఆయన చెప్పినట్టు విని తీరాల్సిందే అనేటువంటి ధోరణి కలిగిన కుటుంబాలు పతనం చెందుతాయి అనేది నా థియరీ. కావాలంటే ఏ ఇంటినైనా పరికించి చూడండి. 


పీవీ నరసింహారావు గారికి భారతరత్న ఇవ్వడంలో బీజేపీ రాజకీయ ఎత్తుగడ ఔనా కాదా అంటే ఖచ్చితంగా ఎత్తుగడనే. వర్తక బీజేపీ పార్టీకి ఇది ఓట్ల వ్యాపారం. ఐతే ఆ అవకాశం ఇచ్చింది మాత్రం కాంగ్రెసు పార్టీనే కదా. తన అధిష్టాన స్థాయిని నిలుపుకునే క్రమంలో ఎవరినైతే కాంగ్రెస్ పార్టీ వదులుకుందో అతడిని పావుగా ప్రస్తుతం బీజేపీ వాడుకుంటోంది. ఒక మేధావిగా పార్టీ సూత్రధారిగా నెహ్రవియన్ గా సంస్కరణవాదిగా ఎదిగిన పీవీ గురించి కాంగ్రెస్ పార్టీ ఎపుడూ మాట్లాడలేదు. ఇపుడూ పెద్దగా మాట్లాడట్లేదు. ప్రచారం కల్పించడం లేదు. మంత్రిగా విద్యాసంస్కరణలు, జైలు సంస్కరణలు, ముఖ్యమంత్రిగా భూసంస్కరణలూ, చివరికి ప్రధానిగా ఆర్థిక సంస్కరణలూ తెచ్చిన తనదైన ముద్రవేసిన పీవీని పార్టీ విస్మరించింది. పదవినుండి దిగాక ఉత్తర ప్రదేశ్ బీహార్ ని బాగు చేయలేకపోయాననే ఆయన అసంతృప్తి లో అక్కడ నేటికీ ఉన్న భూస్వామ్య వ్యవస్థ విషయమే మాట్లాడారు. ఈ భూసంస్కరణలు తెలుగు రాష్ట్రం లో జరగకుండా చూసిన భూస్వాములే ఆయన ముఖ్యమంత్రి పదవికి ఎసరు పెట్టారన్నది జగమెరిగిన సత్యం. కాంగ్రెసు ముఖ్యంగా ఇందిరమ్మ భూస్వాముల పోషక పార్టీ అనే విమర్శలు లేకపోలేదు.  పాలన విషయంలో ఆయనతో విబేధాలున్నంత మాత్రాన ఆయనను విస్మరించడం అంటే తన తాత్విక పునాదిని కోల్పోవడమే. గాంధీజీ తో ఎంతో విబేధించిన అంబేద్కర్ గారిని కాంగ్రెసు పార్టీకానీ నెహ్రూజీ కానీ పక్కన పెట్టేసిన సందర్భం లేదు. కానీ పీవీ ఘనతను విస్మరించడం కాంగ్రెస్ పార్టీ బలహీన పడటం రెండూ వేరు వేరు అంశాలు కాదు. శతృవు బలహీనత మీదే కదా కొట్టవలసినది. ప్రస్తుతం బీజేపీ అదే చేసింది.

కాంగ్రెస్ పార్టీ కాదనుకున్న పీవీని బీజేపీ తనవాడిగా మలుచుకుంది. 


బాబ్రిమసీదు కూల్చివేత అంశంలో పీవీ మౌనం, కళ్యాణ్ సింగు పీవీతో నిలుపుకోలేని హామీ ఇత్యాదివన్నీ పీవీని బిజెపి కి అనుకూలమైన వ్యక్తి గా అనుకునేటట్లు నేపథ్యాన్ని ఏర్పరిచాయి. బీజేపీకి కావలసింది కూడా అదే. నెహ్రూవియన్ ఐన పీవీ సంస్కరణవాది ఐన పీవీని తమ తరపు వాడని ప్రజలను నమ్మించడమే బీజేపీ ఎత్తుగడ. ఐతే పీవీకి భారతరత్న వచ్చిన ఈ సందర్భంలో  చాలామంది మేధావులు ఈ ఉచ్చులో పడి ఆయనను బీజేపీ ఏజెంట్ అనేదాకా వెళ్ళారు. నా దృష్టిలో ఇది నెహ్రూవియన్ థాట్ గొప్పదనాన్ని అవమానించడమే. ఇప్పుడు పీవీ ఘనతను కాంగ్రేసే కాదు ఆలోచించగలిగిన మేధావులూ తుడిచిపెట్టేందుకు బీజేపీ పన్నిన ఉచ్చులో పడేందుకు సిద్ధంగా ఉవ్విళ్ళూరుతున్నారు.దీనికంతటికీ  పీవీ గంభీరమైన మౌనం మాత్రమే కాదు కారణం. పీవీ విషయంలో కాంగ్రెస్ పాటించిన గంభీరమైన మౌనమే అసలు కారణం. పీవి గారి పార్థివ దేహాన్ని పార్టీ ఆఫీసులోకి సైంతం రానివ్వనంత కండకావర ఫలితం. ఐతే ఒక్క పీవీ విషయమే కాదు. విభిన్నమైన దృక్కోణం కలిగి ఉన్నారని తనతో కలిసి ఒక కామన్ కాజ్ కోసం పనిచేస్తున్న వారినందరినీ విస్మరించిన ప్రతి సందర్భంకూడా ఇలాంటి పతనాన్నే మనం గమనిస్తాం. అనుభవిస్తాం కూడా. 


విరించి విరివింటి 

18-2-24

Stigma kills. Essay

 Stigma kills. So kill stigma.

-----------------------------------------


2001 లో టెక్సాస్ లో ఒక మహిళ తన సంతానమైన ఐదుగురు చిన్నపిల్లల్ని నీటిలో ముంచి చంపేసింది. ఈ సంఘటన జరిగిన తర్వాత ఆమె post partum psychosis తో బాధ పడుతుందని డాక్టర్లు గుర్తించారు. అంటే బిడ్డజననం తర్వాత బాలింతలో వచ్చే సైకోసిస్. ఐతే ప్రసవం తర్వాత ఆమె తనకు కలుగుతున్న మానసిక వైపరీత్యాలను గుర్తించింది. కానీ కౌన్సెలింగ్, బిహేవియరల్ థెరపీ తీసుకుంటూ తత్సారం చేసింది. ఫలితంగా ఆమె జబ్బు సకాలంలో డయాగ్నోసిస్ కాలేదు. ఆమె సైకియాట్రిస్టు ద్వారా చికిత్స చేసుకొని ఉంటే ఇది జరగకపోయేది. 


అలాగే 2012 లో కొలరోడా లోని అరోరా థియేటర్ లో ఒకతను కాల్పులు జరిపి కొందరిని చంపేశాడు అకారణంగా.  అతడిదీ ఇదే పరిస్థితి. తనలోని మానసిక కల్లోలాన్ని కౌన్సెలింగ్ ద్వారా తగ్గించుకోవాలని సైకియాట్రి మందులను వదిలేశాడు. 


క్లినికల్ ప్రాక్టీసు లో ఇలాంటివెన్నొ కేసులను సైకియాట్రిస్టు లు చూస్తుంటారు. కొన్ని కేసులు భార్యాభర్తల మధ్య పొరపొచ్చాలు వచ్చేదాకా రెండు కుటుంబాలు పోట్లాడుకునేదాకా పోతాయి. వీటికి కారణాలు అబ్బాయి లేదా అమ్మాయి పెంపకంలో లోపాలు అనో లేక వారు ఎమోషనల్ గానో లేదా ప్రవర్తనా పరంగానో తేడాగా ఉంటారనో అనుకుని సైకాలజిస్టులను కలిసి కౌన్సెలింగ్ తీసుకుంటారు. నిజానికి ఎమోషనల్ లేదా బిహేవియరల్ సమస్యలను సైకాలజిస్టులు చక్కగా సరిదిద్దగలరు. కానీ అంతకంటే ముందు వీరి ప్రవర్తనకు ఏవైనా మెడికల్ కారణాలు ఉన్నయా అనేది చూడవలసి ఉంటుంది. మొదటే సైకియాట్రిస్టు దగ్గరికి వచ్చికూడా వాళ్ళిచ్చిన మందులు వేసుకోవాలంటే ఇష్టం లేక మళ్ళీ సైకాలజిస్టులను కలిసి అక్కడ నెలల తరబడి సమయం వృథా చేసి ఆ తర్వాత అదే జబ్బును మురగబెట్టుకుని తీవ్రదశలో మళ్ళీ సైకియాట్రిస్టు ల దగ్గరికి వచ్చేవారు తరచూ ఉంటారు.


సైకియాట్రీ అనేది ఎంబీబీఎస్ చేసిన తర్వాత చదివే స్పెషలైజేషన్ కానీ సైకాలజీ చదవాలంటే మెడికల్ డాక్టర్ ఐవుండనవసరం లేదు. ఐతే ఇవి రెండూ ఒకదానికొకటి కాంప్లిమెంటరీ. సైకియాట్రిస్టు జబ్బు డయాగ్నోసిస్  చేసిన తర్వాత మందులూ అలాగే కౌన్సెలింగ్ కూడా అవసరం ఔతాయి కొందరికి. కొందరికి మందులు సరిపోతాయి. కొందరికి కౌన్సెలింగ్ మాత్రమే సరిపోతుంది. ఎవరికి ఏది అని డిసైడ్ చేయాలంటే సైకియాట్రిస్టుని కలిసి అతడి సలహా మీద మందులు వాడుతూ సైకాలజిస్టుని కూడా  కలవచ్చు. ఐతే మన దగ్గర ఈ అవగాహన లేకపోవడంతో చాలా సమస్యలు వస్తుంటాయి. సైకాలజీ విభాగం సైకాయాట్రీకి సపోర్టింగ్ బ్రాంచ్ వంటిది. సైకాలజిస్టుకి సైకియాట్రీ తెలియకపోయినా పర్వాలేదు కానీ సైకియాట్రిస్టుకి సైకాలజీ తెలిసి ఉండాలంటారు వృద్ధుల కళ్యాణ రామారావు గారు. ఇందులో మరింత లోతుకు పోవడం వ్యాసం ఉద్దేశ్యం కాదు కాబట్టి దీనిని ఇక్కడికి వదిలేద్దాం.  


ఐతే చాలామంది సైకియాట్రిస్టుని కలిసే బదులు సైకాలజిస్టుని కలవడం సేఫ్ అనుకుంటారు. ఇది తప్పని కాదు. సైకాలజీస్టుల హోలిస్టిక్ అప్రోచ్ వారితో కలిసి మాట్లాడటం వలన ఏర్పడే నమ్మకం పర్సనల్ రిలేషన్ వంటివి నిజానికి కొంతమందికి స్వాంతన కలిగిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ అలాకాకుండా నిజంగా సైకియాట్రీ జబ్బే కనక ఉంటే కేవలం కౌన్సెలింగ్ సెషన్స్ వలన ట్రీట్మెంట్ సకాలంలో అందదు. ఐతే చక్కటి సైకాలజిస్టులు తమ పరిధి కాదనుకుంటే వెంటనే సైకాయాట్రిస్టుకి పంపడమూ లేకపోలేదు. అందుకే ఇవి రెండూ కాంప్లిమెంటరీ విభాగాలు. తమ మందులు వాడుతూ కౌన్సెలింగ్ కూడా తీసుకోమని చెప్పే సైకియాట్రిస్టులు ఎక్కువ. వారి క్లినిక్ లోనే సైకాలజిస్టుల సేవలను వినియోగించుకునేవారు ఉంటారు. 


ముఖ్యంగా ఈ రెంటి మధ్యా విభజన మాత్రమే కాదు అసలు మానసిక జబ్బులు అంటేనే భయంకరమైన స్టిగ్మా మన సమాజంలో అలుముకుని ఉంటుంది. మన భారతీయ సమాజంలోనే కాదు దాదాపు అన్ని సమాజాల్లో ఈ స్టిగ్మా ఉంది. ఒకరకంగా యూరప్ అమెరికాలలోనే ఎక్కువ ఏమో అనిపిస్తుంది వారికున్న చరిత్రను చూస్తే. ఒకప్పుడు సైకియాట్రీ జబ్బులను దయ్యం పూనిందనే వారు (evil spirits). లేదా దేవుని శాపం అనో అనేవారు. ఆ స్థితి మన దేశంలో ఈ రోజుకి ఉందనిపిస్తుంది. ఐతే యూరోప్ అమెరికాలలో మధ్య యుగాలకు వచ్చేసరికి హిస్టీరియాలను గుర్తించారు. ఈ పూనకాలతో ఊగిపోయేవారిని మంత్రగత్తెలని ముద్రవేసి చంపేసేవారు. ఒక స్టడీ ప్రకారం యూరోపులో పూర్వ ఆధునిక యుగ సమయం 15 నుండి 18 వ శతాబ్దం వరకూ దాదాపు ఐదు లక్షల మహిళలను మంత్రగత్తెలని చంపేశారు. ఐతే 19 శతాబ్దం వచ్చేసరికి పరిస్థితి మారింది. మానసిక జబ్బులున్న వారిని asylum లలో పెట్టడం ఒక రకంగా కూరడం గా మరింది. వందల కొద్దీ  మందిని ఒకేచోట కూరి కట్టేసి ఉంచే పరిస్థితి ఉండింది. కానీ ఇరవైయవ శతాబ్దంలో సైకియాట్రీ మందులు కనుగోవడం మానసిక జబ్బులను అర్థం చేసుకోవడంలో విప్లవాత్మకమైన మార్పులను  తీసుకుని వచ్చింది. Deinstitutionalization ఒక ఉద్యమంగా వచ్చింది. పిచ్చాసుపత్రులను మూసేశారు. హాయిగా డాక్టర్ ఓపీలో మందులు ఇస్తే అవి వేసుకుంటే తగ్గిపొవడం మొదలైంది. ట్రీట్మెంట్ సులభతరమైంది. చూశారా..! మానసిక జబ్బుల చుట్టూ స్టిగ్మా ఉండదా అంటే ఎందుకుండదు. ప్రజలను దైవ వ్యతిరేకులుగా, దయ్యం పట్టిన వారిగా  మంత్రగత్తెలుగా లేదా గొలుసులతో కట్టేయబడిన వారిగా మన సమాజాలు చూశాక మానసిక జబ్బులంటే వివిధ అపోహలు ఉండవా అంటే ఉంటాయి. 


ఐతే ఇంత  సైకియాట్రీ మందులు అభివృద్ధి చెందినతర్వాతకూడా 20వ శతాబ్దం నుండి కొత్త రకమైన స్టిగ్మా మొదలైంది. అదేంటంటే మానసిక జబ్బు కలిగి ఉండటం ఒక వ్యక్తిగత బలహీనతగా చూపడం మొదలైంది. బలవంతుడైన వాడు లేదాదృఢ చిత్తుడైన వాడికి మానసిక జబ్బులు రావనుకోవడం. వస్తే నామోషీగా ఫీలవడం. యూరోప్ అమెరికాలలో క్యాపిటలిజం వ్యక్తిగత విజయానికి పెద్ద పీట వేయడం మొదలెట్టాక మానసిక జబ్బు కలిగి ఉండటం వ్యక్తిగత బలహీనతగా లేదా బలహీనమనస్తత్వంవలననే మానసిక జబ్బు వచ్చి ఉండవచ్చనే ఊహ పెరిగిందనుకుంటాను. మనదేశంవంటి సాంప్రదాయ దేశాలలో మతభావనలు పెరగడంతో మానసిక సమస్య ఉండటం వ్యక్తిగత దుర్బలత్వం వలననే అనే భావన పెరిగి ఉండవచ్చు. ఐతే ఇవే భావనలు ఈ రోజుకీ మనదేశంలో ఉన్నాయి. డిప్రెషన్ లేదా యాక్జైంటీ ఉంది అంటే మెడిటేషన్ చేస్తేనో యోగా చేస్తేనో లేదా భగవద్గీత చదివితేనో మనసు బలంగా తయారౌతుందనీ బలమైన మనసులోనుండి జబ్బులు పటాపంచలైపోతాయనీ అనుకునేవారు సర్వ సాధారణంగా కనబడుతుంటారు. 


ఇలాంటి స్టిగ్మాలను పెంచి పోషించడంవలన మానసిక జబ్బులు ముదురుతాయే తప్ప ఆ వ్యక్తి కి ఎలాంటి ఉపయోగమూ ఉండదని తెలుసుకోవాలి. నాకు తెలిసిన ఒక పిల్లగాడి సమస్యను సకాలంలో చూపించకుండా స్వామీజీలకు చూపించి, వివిధ పుణ్యక్షేత్రాలకు తిప్పి, పూజలు హోమాలు చేస్తే తగ్గిపోతుందనీ ఒక రాత్రి అమ్మవారి గుడిలో పడుకుంటే తగ్గిపోతుందనీ చెప్పి తత్సారం చేసి జబ్బు ముదిరిపోయేలా చేశారు. నిజానికి ఆ పిల్లగాడిని డాక్టర్ కి చూపించడానికి వారికి చదువు లేక కాదు తెలివి లేక కాదు. పదుగురూ ఏమనుకుంటారోననే స్టిగ్మా వలన ఎవరికీ తెలియకుండా ఉంచేందుకై ఇలాంటి అపసోపాలు పడుతుంటారు.  మానసిక జబ్బుల పట్ల అపోహలు తొలగించేందుకు మన ప్రభుత్వాలు కూడా పూనుకున్నట్టు కనబడవు. మందుల మాటెత్తే సరికి మాఫియా అంటూ పెట్రేగి పోయే బ్యాచ్ ఎలానూ ఉంది. ఇంత కాంప్లెక్స్ సిచువేషన్ మనమే తయారు చేసుకుని స్టిగ్మాలను పెంచి పోషిస్తుంటాం. సినిమాలు కూడా వ్యాధిగ్రస్తులను ఉన్న వారిని సైకోలుగా చిత్రించడం, లేదా వారిని గొలుసులతో కట్టేసినట్టు చూపడం, లేదా కరెంటు షాకిస్తారని చూపడం( electro convulsive therapy) వంటివి అతిగా చూపిస్తుంటాయి.   సైకియాట్రీ మందుల చుట్టూ కూడా లేనిపోని అపోహలు వాట్సాప్ లలో చక్కర్లు కొడుతూనే ఉంటాయి. ఇరవైయవ శతాబ్దంలో మొదలైన ఈ కొత్తరకం స్టిగ్మాలు ఈరోజుకీ కొనసాగుతున్నాయంటే మనం ఆధునికత దేనిలో సాధించినట్టో నాకు అర్థం కాదు. ఐతే శరీరానికి జ్వరం వచ్చినప్పుడు పారాసిటమాల్ ఎంత సహజంగా వేసుకుంటామో మనసుకి జ్వరం వచ్చినపుడు అంతే సులువుగా మందులు వేసుకునే పరిస్థితి రావాలి. సైకియాట్రీ మందుల చుట్టూ అల్లుకుని ఉన్న అపోహలు తొలగాలి. మొదటే గుర్తిస్తే చాలా సులువుగా చాలా తక్కువ కాలంలో తగ్గిపోయే జబ్బులను సైతం ఈ రకమైన అపోహలవలన తత్సారం చేస్తూ తీవ్రదశకు తీసుకుని పోకుండా ఉండే రోజులు రావాలి. లేకపోతే సైకియాట్రీ జబ్బు ఆ వ్యక్తి కే కాదు పైన చెప్పినట్లు చుట్టుప్రక్కల వారికి కూడా ప్రమాదమే.


విరించి విరివింటి

16/2/24

Wednesday, 7 February 2024

Celiotomy fad -. A shaping of dangerous attutudes. Essay

 Celiotomy fad -. A shaping of dangerous attutudes.


"గృహిణిలతో  పోలిస్తే సెక్స్ వర్కర్లలో సెర్వైకల్ క్యాన్సర్ ఎక్కువ prevalent గా ఉంది". అని ఒక పేపర్ పబ్లిష్ ఐతే.., సైన్స్ పట్ల అవగాహన లేనివాడు ఓహో సెక్స్ వర్కర్స్ సెక్స్ లో ఎక్కువగా పాల్గొంటారు కాబట్టి వారికి క్యాన్సర్ వచ్చిందేమోననుకుని అంగలారుస్తాడు. కానీ సైన్స్ చదివితే ఏమౌతుందంటే ఇదే ఇన్ఫర్మేషన్ మరో రకంగా అర్థమౌతుంది. ఏంటంటే-  సామాజిక స్టిగ్మాలవలన, discrimination వలన సెక్స్ వర్కర్ లలో కాన్సర్ స్క్రీనింగ్ సరిగ్గా జరగదనీ, ఒకవేళ జరిగినా ఇవే పై కారణాలవలన వారికి సరైన మెరుగైన వైద్యం సకాలంలో అందే అవకాశం తగ్గుతుందని అర్థం అవుతుంది. అందువలన సర్వైకల్ కాన్సర్ పై జరిగిన ఈ కంపారేటివ్ స్టడీ సామాజిక వ్యవస్థను అర్థం చేసుకుని ఎక్కడ వైద్య సదుపాయాలు పెంచాలనే విషయానికి, అందుకు అవసరమైన చట్టాలు తేవడానికి ఉపయోగపడుతుందే తప్ప ఈ స్టడీని మరో discrimination కి ఊతంగా వాడటానికి కాదు.


ఐతే ప్రపంచ వ్యాప్తంగా సైన్సుని అర్థం చేసుకోలేని చాలా మంది సామాన్యులు తెలిసీ తెలియక కొన్ని చదివి కొన్ని పుకార్లను తోటివారితో పంచుకుంటూ వ్యాపింపజేస్తూ ఉంటారు. Woman sexuality చుట్టూ అలుముకున్న పుకార్లు చరిత్రకు కొత్తవి కావు. అవన్నీ తెలుసుకుంటే మానవ చరిత్రలో మగవాడు ఏర్పరచుకున్న వ్యవస్థల్లో స్త్రీల స్థానం ఏంటనేది అర్థమౌతుంది. సెక్స్ చుట్టూ స్త్రీ లపై జరిగిన దాష్టీకాలు ఎన్నో ఉన్నా రికార్డెడ్ ఐవున్నవి కొన్ని ఉన్నాయి. Early modern Europian history ని చూస్తే పదమూడవ శతాబ్దంలో వివాహం చేసుకోని ఒంటరి మహిళలను , భర్త చనిపోయిన మహిళలను , వృద్ధ మహిళలను, ఆర్థిక స్వాతంత్య్రాన్ని సాధించిన మహిళలను, సమాజం విధించిన జెండర్ రోల్స్ ని కాదని పురుషులపై ఎదురుతిరిగాన మహిళలను మంత్రగత్తెలని చెప్పి చంపేవారు. ఎందుకంటే వీరు సెక్సువల్లీ యాక్టివ్ గా ఉంటారనీ వీళ్ళు దయ్యాలతో సంభోగిస్తారనే మూఢనమ్మకాలు వారిలో ఉండేవి. "The Name of the Rose" Novel by Umberto Eco లో ఒకరకంగా ఇది ప్రధానాంశంగా సాగుతుంది.


మనమిపుడు సైంటిఫిక్ గా చాలా ముందుకు పోయామనుకుంటాం. కానీ మోరల్ గా మనం, అంటే మనుషులం పదమూడవ శతాబ్దంకంటే ఇంకా పురాతనంలోనే ఆగిపోయాం. ఈ రోజుకీ వర్జినిటీకి స్త్రీ క్యారెక్టర్ కీ లింక్ పెట్టే ప్రబుద్ధత్వం నిలిచే ఉంది. తాము చేస్తే వీరత్వం ఆడవాళ్లు చేస్తే జారత్వం అనే పోకడలు ఈనాటికీ బలంగా వేళ్ళూనుకుని ఉన్నాయి. మెనుస్ట్రేషన్ 'మైల' అనీ అపవిత్రమనీ అది సాధారణ శారీరక ధర్మం కాదనీ అనుకునేవారు డాక్టరీ చదువుకున్నవారు కూడా ఉంటారు.  ఇటువంటి సమయంలో కోతి చేతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు స్మార్ట్ ఫోనూ వంటివి మనకు దొరికాయి.  స్త్రీలను మనుషులుగా కాకుండా వస్తువులుగా సంపదలుగా చూసే మత భావజాలాలూ ఎలాగూ కుప్పలు తెప్పలుగా మనచుట్టూ తిరిగే శవాల్లాగా నిండి ఉన్నాయి. కాబట్టి సైన్సు ఈ పాతుకుపోయిన మూఢనమ్మకాలను మరింత బలంగా చేయడానికే ఉపయోగించేవారు పెరిగిపోయారు. ఇరవైయ్యో శతాబ్దం ప్రారంభంలో స్త్రీల శారీరక మానసిక సమస్యలకు కారణం వారిలో ఉండే విపరీతమైన కామ కోరికలేనని ఒక మూఢనమ్మకం మొదలైంది.   అప్పటి సామాజిక వ్యవస్థలు సరిగ్గా లేక సరైన సపోర్ట్ లేక కష్టాలు పడే యువతులు హిస్టీరిక్ గా ప్రవర్తించేవారు. ఐతే ప్రజలు వీళ్ళిలా ప్రవర్తించడానికి కారణం వారిలో నిబిడీకృతంగా ఉన్న కామ కోరికలే అని అనుకోవడం మొదలెట్టారు.  అది ప్రజలలో ఎంతగా పెరిగిందంటే ఈ ప్రజల నమ్మకాలను ప్రోది చేస్తూ కొందరు డాక్టర్లూ బయలుదేరారు. ప్రజలు తానా అంటే వీళ్ళు తందానా అనేవారు. అంటే చదువుకుని సమాజానికి దారి చూపవలసిన డాక్టర్లు మూఢనమ్మకాలలో పడిపోతే జరిగే నష్టం ఇది. సామాన్యులతో పాటు సమాజపు దారి దీపాల వంటి వారుకూడా ఒకేరకమైన మూఢనమ్మకాలను కలిగి ఉంటే ఆ సమాజం పెంచి పోషించే విలువలు ఎలా మారుతాయో ఇదొక ఉదాహరణ. డాక్టర్ కుల్లింగ్ వుడ్ అనీ డాక్టర్ మరియోన్ సిమ్ అనేవాళ్ళు మహిళలలో కనిపించే ఈ హిస్టీరియా పెల్విక్ న్యూరోసిస్ తగ్గాలి అంటే కడుపు కోసి ఓవరీలనూ యుటిరస్ నీ తీసేస్తే బాగైతారని నమ్మి ఆ ఆపరేషన్ లు మొదలెట్టారు. దీనినే celiotomy అనేవారు. అపుడపుడే సర్జికల్ హైజీనాక్ మెథడ్స్ అనెస్తీషియా వంటివి అభివృద్ధి చెందడంతో చాలామంది మహిళలకు ఈ సర్జరీలు చేసి పడేశారు. ఇది ఒక డేంజర్ యాటిట్యూడ్ ని తెలుపుతుంది. సైన్సు మూఢనమ్మకాలకు మహిళలపై మోరల్ పోలీసింగ్ కూ పాల్పడటంతో వారిపై అనవసరంగా బలవంతపు సర్జరీలు జరిగాయి. (ఇటువంటివి తరువాత జరగలేదని కాదు). 


సైన్స్ బోధన స్టిగ్మటైజ్ చేసేందుకు కాదు. అది enlighten చేసేందుకు జరగాలి. ఈ రోజు పొద్దున వచ్చిన రెండు మూడు వాట్సప్ ఫార్వర్డ్ లు చూశాక ఈ ముక్క రాద్దామనుకున్నాను. సర్వైకల్ కాన్సర్ సెక్సువల్లీ ట్రాన్స్ మిటెడ్ జబ్బనీ అనీ మల్టిపుల్ పార్టనర్లు ఉండేవారికీ సెక్స్ వర్కర్లకూ వాక్సిన్ వేయడం మంచిదనీ ఒక రైటప్ వచ్చింది. ఈ ధోరణి నాకు కొత్తగ అనిపించలేదు. ఇది మన సమాజంలో ఎప్పటినుంచో ఉన్న స్త్రీ అణచివేతలో భాగంగా వచ్చిన భావజాలమే. నా భయమంతా ఇదంతా రేప్పొద్దున విక్టిమ్ బ్లేమింగ్ కి దారి తీస్తుందేమోనని. రేప్ చేయబడిన స్త్రీ దే తప్పు అని ఈరోజు ఏవిధంగా మోరల్ పోలీసింగ్ నడుస్తుందో..అదే విధంగా రేప్పొద్దున కాన్సర్ బారిన పడిన అభాగ్యురాలిని టార్గెట్ చేస్తూ ఆమె క్యారెక్టర్ ని కించపరిచే రోజు వస్తుందేమోనని. దీనినే మనం celiotomy fad లో చూశాం. ఇవి సమాజాన్ని అన్ సైంటిఫిక్ పద్ధతులవైపు ఆటవికతవైపు మూఢనమ్మకాలవైపు తీసికెళ్ళే ధోరణులు. కాబట్టి సైంటిఫిక్ పేపర్లను మిస్ రీడ్ చేయకుండా అనుమానాలుంటే మంచి డాక్టర్ల తో చర్చించి నిజానిజాలు తెలుసుకోవడం మంచిది. 


విరించి విరివింటి 

6/2/24