Sunday, 18 February 2024

Internal Bossism - Essay

 Internal Bossism - A threat 


అంతర్గత ప్రజాస్వామ్యం కాంగ్రెసు లో ఎక్కువ అని అంటుంటారు. కాంగ్రెసు కంటే భారతదేశంలో ఎక్కువ. లేకపోతే మనమనుకునే భిన్నత్వం, వైవిధ్యం వంటివి అసాధ్యం.  భారతదేశంలో ప్రజలమధ్య వైరుధ్యాలు వైషమ్యాలు లేవని కాదు. అవి ఎంతగా ఉన్నా అంతకంటే ఎక్కువో తక్కువో వైవిధ్యాలు కూడా ఉన్నాయి. వైవిధ్యాలు ఉన్నా కలిసి జీవించడమూ ఉంది. 


భారతీయులలో ఎంత వైరుధ్యాలు ఉన్నా వైవిధ్యాలు విభిన్నతలూ ఉన్నా భారతీయత అనే అంశం మనమందరం 'భారతీయులం' అనే అంశం పట్టి ఉంచవచ్చు. అలాగే మనకు కాంగ్రెసు పార్టీ లో ఇటువంటిదే కనిపిస్తుంది. విభిన్న దృక్పథాలు ఆలోచనలు వైరుధ్యాలు వైవిధ్యాలూ కలిగిన నాయకులు ఒకచోట పనిచేయడం 'పార్టీ' అనే అంశం వారిని పట్టి ఉంచుతున్నట్టు మనం చూడగలం. గాంధీజీ నెహ్రూ జీ అంబేద్కర్ గారు పటేల్ గారు నేతాజీ, తిలక్ వంటి వారు ఒక్కొక్కరు ఒక్కో విభిన్న దృక్పథాలనుండీ నేపథ్యాలనుండి వచ్చినా ఎంతగా వారిలో వారు విబేధించుకున్నా వారంతా ఒకే పార్టీకి చెందిన వారు. కలిసే పని చేశారు. ఈ దేశం తత్వమే ఈ భిన్నత్వంలో ఏకత్వంలా మారిందనిపిస్తుంది. ఐతే చరిత్రలో ఎపుడెపుడైతే ఈ తత్వానికి గండి పడిందో అపుడంతా దేశం పతనం వైపు పయనించిందని మనం మన చరిత్రలోనే కనుగొనగలం. ఇది దేశానికే కాదు దేశ తత్వాన్ని పుణికిపుచ్చుకున్న కాంగ్రెసు పార్టీకీ కూడా వర్తిస్తుంది. థీసీస్ యాంటీ థీసీస్ సింథెసిస్ గా ఏ వ్యవస్థ ఐనా ఉండకపోతే మన దేశంలో అది పతనం చెందక తప్పదు అని చరిత్ర చూస్తే అర్థమౌతుంది.


స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జరిగిన పాలన కానీ ఎలక్షన్లుకానీ పార్లమెంటు వంటి చట్ట సభల్లో జరిగే వాదోపవాదాలు కానీ అన్నీ ఇదే తత్వాన్ని ప్రతిఫలింపజేస్తాయి. కాంగ్రెసు పార్టీకూడా అందుకే అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువని పేరు తెచ్చుకుంది. ఐతే ఈ పార్టీలో ఈ తత్వానికి పెద్ద ఎత్తున గండి పడిన సమయాలు చెప్పుకోతగ్గవి రెండు. ఒకటి ఎమర్జెన్సీ ఐతే రెండవది పీవీ నరసింహారావు గారి తర్వాత రోజులు. ఎమర్జెన్సీ సమయంలో ఏం జరిగిందో మనకు తెలుసు. ఇది కేవలం ఆ పార్టీ మాత్రమే అంతర్గత ప్రజాస్వామ్యాన్ని కోల్పోవడం కాదు. దేశం మొత్తం ఏకవ్యక్తి పాలనలోకి పోవడం. ఈ దేశంలో రాజరికాలను చూసింది కనుక ఈ దేశానికి రాజరీకమే కరెక్టని మనం అనుకోవచ్చుగానీ రాజరికంపై మన దేశపౌరులు పెద్దగా తిరుగుబాటు చేయకపోవచ్చుగానీ దానిని ఈసడించుకున్నారని మనకర్థమౌతుంది. ఎంత రాజుగారిని పొగిడినా రాజు మీదికెక్కి కూర్చుంటానంటే ఒప్పుకోని ప్రజలే మనకున్నారు. అందుకే ఇతర దేశాలమాదిరి బానిసత్వాన్ని మన పూర్వీకులు పూర్తిగా institutionalize చేయలేకపోయారు.  పీవీ నరసింహారావు గారి పాలన తర్వాత కాంగ్రెసు పార్టీలో 'అధీష్టానం' అనేదొకటి బలంగా ఏర్పడి తన సహజమైన విభిన్నతనూ ఇంటర్నల్ డెమోక్రసీని కోల్పోయింది. అది తనతో తాను యుద్ధంలో ఇరుక్కుంది. ఇది అందరూ అనుకుంటున్నటువంటి కుటుంబ పాలన కాదు. అంతకు మించిన తాత్విక పునాదినే కోల్పోవడం ఇది. అప్పటినుండే పార్టీ పతనం కూడా ప్రారంభమైంది. 


మౌన ముద్రకి కేరాఫ్ అడ్రస్ ఐన పీవీ నరసింహారావు ఈ 'పార్టీ' అనే ఏకత్వ భావనను నిలిపేందుకే మౌనంగా ఉన్నారని మనం అనుకోక తప్పదు. తన అభిప్రాయాలూ దృక్పథాలూ ఎలా ఉన్నా ఒక కామన్ కాజ్ కోసం పని చేయాలంటే కొంత మౌనం ఉండక తప్పదు. ఇదే భారతీయ తత్వం. ఇది మంచిదా చెడ్డదా అని అడిగితే మంచిదీ చెడ్డదీ. రెండూనూ.  అందుకే 'పార్టీ' అనే అంశం దానికి కట్టుబడి ఉండటం అనే అంశం కాంగ్రెసు పార్టీ తాత్విక పునాది. పీవీ దానిని పాటించారు. కానీ పీవీ పాలన తర్వాత పీవీని పట్టించుకోవడం పార్టీ మానేసింది. అటునుంచి 'అధిష్టానం' అనబడే ఇంటర్నల్ నియంతృత్వం వైపుకి కదిలింది. ఇంటర్నల్ బాసిజం పార్టీలకే కాదు ఈ దేశంలో సంస్థలకైనా చివరికి మన ఇళ్ళకు కూడా ప్రమాదకరమైనది. తండ్రియే ఇంటికి బాసు, ఆయన చెప్పినట్టు విని తీరాల్సిందే అనేటువంటి ధోరణి కలిగిన కుటుంబాలు పతనం చెందుతాయి అనేది నా థియరీ. కావాలంటే ఏ ఇంటినైనా పరికించి చూడండి. 


పీవీ నరసింహారావు గారికి భారతరత్న ఇవ్వడంలో బీజేపీ రాజకీయ ఎత్తుగడ ఔనా కాదా అంటే ఖచ్చితంగా ఎత్తుగడనే. వర్తక బీజేపీ పార్టీకి ఇది ఓట్ల వ్యాపారం. ఐతే ఆ అవకాశం ఇచ్చింది మాత్రం కాంగ్రెసు పార్టీనే కదా. తన అధిష్టాన స్థాయిని నిలుపుకునే క్రమంలో ఎవరినైతే కాంగ్రెస్ పార్టీ వదులుకుందో అతడిని పావుగా ప్రస్తుతం బీజేపీ వాడుకుంటోంది. ఒక మేధావిగా పార్టీ సూత్రధారిగా నెహ్రవియన్ గా సంస్కరణవాదిగా ఎదిగిన పీవీ గురించి కాంగ్రెస్ పార్టీ ఎపుడూ మాట్లాడలేదు. ఇపుడూ పెద్దగా మాట్లాడట్లేదు. ప్రచారం కల్పించడం లేదు. మంత్రిగా విద్యాసంస్కరణలు, జైలు సంస్కరణలు, ముఖ్యమంత్రిగా భూసంస్కరణలూ, చివరికి ప్రధానిగా ఆర్థిక సంస్కరణలూ తెచ్చిన తనదైన ముద్రవేసిన పీవీని పార్టీ విస్మరించింది. పదవినుండి దిగాక ఉత్తర ప్రదేశ్ బీహార్ ని బాగు చేయలేకపోయాననే ఆయన అసంతృప్తి లో అక్కడ నేటికీ ఉన్న భూస్వామ్య వ్యవస్థ విషయమే మాట్లాడారు. ఈ భూసంస్కరణలు తెలుగు రాష్ట్రం లో జరగకుండా చూసిన భూస్వాములే ఆయన ముఖ్యమంత్రి పదవికి ఎసరు పెట్టారన్నది జగమెరిగిన సత్యం. కాంగ్రెసు ముఖ్యంగా ఇందిరమ్మ భూస్వాముల పోషక పార్టీ అనే విమర్శలు లేకపోలేదు.  పాలన విషయంలో ఆయనతో విబేధాలున్నంత మాత్రాన ఆయనను విస్మరించడం అంటే తన తాత్విక పునాదిని కోల్పోవడమే. గాంధీజీ తో ఎంతో విబేధించిన అంబేద్కర్ గారిని కాంగ్రెసు పార్టీకానీ నెహ్రూజీ కానీ పక్కన పెట్టేసిన సందర్భం లేదు. కానీ పీవీ ఘనతను విస్మరించడం కాంగ్రెస్ పార్టీ బలహీన పడటం రెండూ వేరు వేరు అంశాలు కాదు. శతృవు బలహీనత మీదే కదా కొట్టవలసినది. ప్రస్తుతం బీజేపీ అదే చేసింది.

కాంగ్రెస్ పార్టీ కాదనుకున్న పీవీని బీజేపీ తనవాడిగా మలుచుకుంది. 


బాబ్రిమసీదు కూల్చివేత అంశంలో పీవీ మౌనం, కళ్యాణ్ సింగు పీవీతో నిలుపుకోలేని హామీ ఇత్యాదివన్నీ పీవీని బిజెపి కి అనుకూలమైన వ్యక్తి గా అనుకునేటట్లు నేపథ్యాన్ని ఏర్పరిచాయి. బీజేపీకి కావలసింది కూడా అదే. నెహ్రూవియన్ ఐన పీవీ సంస్కరణవాది ఐన పీవీని తమ తరపు వాడని ప్రజలను నమ్మించడమే బీజేపీ ఎత్తుగడ. ఐతే పీవీకి భారతరత్న వచ్చిన ఈ సందర్భంలో  చాలామంది మేధావులు ఈ ఉచ్చులో పడి ఆయనను బీజేపీ ఏజెంట్ అనేదాకా వెళ్ళారు. నా దృష్టిలో ఇది నెహ్రూవియన్ థాట్ గొప్పదనాన్ని అవమానించడమే. ఇప్పుడు పీవీ ఘనతను కాంగ్రేసే కాదు ఆలోచించగలిగిన మేధావులూ తుడిచిపెట్టేందుకు బీజేపీ పన్నిన ఉచ్చులో పడేందుకు సిద్ధంగా ఉవ్విళ్ళూరుతున్నారు.దీనికంతటికీ  పీవీ గంభీరమైన మౌనం మాత్రమే కాదు కారణం. పీవీ విషయంలో కాంగ్రెస్ పాటించిన గంభీరమైన మౌనమే అసలు కారణం. పీవి గారి పార్థివ దేహాన్ని పార్టీ ఆఫీసులోకి సైంతం రానివ్వనంత కండకావర ఫలితం. ఐతే ఒక్క పీవీ విషయమే కాదు. విభిన్నమైన దృక్కోణం కలిగి ఉన్నారని తనతో కలిసి ఒక కామన్ కాజ్ కోసం పనిచేస్తున్న వారినందరినీ విస్మరించిన ప్రతి సందర్భంకూడా ఇలాంటి పతనాన్నే మనం గమనిస్తాం. అనుభవిస్తాం కూడా. 


విరించి విరివింటి 

18-2-24

No comments:

Post a Comment