Stigma kills. So kill stigma.
-----------------------------------------
2001 లో టెక్సాస్ లో ఒక మహిళ తన సంతానమైన ఐదుగురు చిన్నపిల్లల్ని నీటిలో ముంచి చంపేసింది. ఈ సంఘటన జరిగిన తర్వాత ఆమె post partum psychosis తో బాధ పడుతుందని డాక్టర్లు గుర్తించారు. అంటే బిడ్డజననం తర్వాత బాలింతలో వచ్చే సైకోసిస్. ఐతే ప్రసవం తర్వాత ఆమె తనకు కలుగుతున్న మానసిక వైపరీత్యాలను గుర్తించింది. కానీ కౌన్సెలింగ్, బిహేవియరల్ థెరపీ తీసుకుంటూ తత్సారం చేసింది. ఫలితంగా ఆమె జబ్బు సకాలంలో డయాగ్నోసిస్ కాలేదు. ఆమె సైకియాట్రిస్టు ద్వారా చికిత్స చేసుకొని ఉంటే ఇది జరగకపోయేది.
అలాగే 2012 లో కొలరోడా లోని అరోరా థియేటర్ లో ఒకతను కాల్పులు జరిపి కొందరిని చంపేశాడు అకారణంగా. అతడిదీ ఇదే పరిస్థితి. తనలోని మానసిక కల్లోలాన్ని కౌన్సెలింగ్ ద్వారా తగ్గించుకోవాలని సైకియాట్రి మందులను వదిలేశాడు.
క్లినికల్ ప్రాక్టీసు లో ఇలాంటివెన్నొ కేసులను సైకియాట్రిస్టు లు చూస్తుంటారు. కొన్ని కేసులు భార్యాభర్తల మధ్య పొరపొచ్చాలు వచ్చేదాకా రెండు కుటుంబాలు పోట్లాడుకునేదాకా పోతాయి. వీటికి కారణాలు అబ్బాయి లేదా అమ్మాయి పెంపకంలో లోపాలు అనో లేక వారు ఎమోషనల్ గానో లేదా ప్రవర్తనా పరంగానో తేడాగా ఉంటారనో అనుకుని సైకాలజిస్టులను కలిసి కౌన్సెలింగ్ తీసుకుంటారు. నిజానికి ఎమోషనల్ లేదా బిహేవియరల్ సమస్యలను సైకాలజిస్టులు చక్కగా సరిదిద్దగలరు. కానీ అంతకంటే ముందు వీరి ప్రవర్తనకు ఏవైనా మెడికల్ కారణాలు ఉన్నయా అనేది చూడవలసి ఉంటుంది. మొదటే సైకియాట్రిస్టు దగ్గరికి వచ్చికూడా వాళ్ళిచ్చిన మందులు వేసుకోవాలంటే ఇష్టం లేక మళ్ళీ సైకాలజిస్టులను కలిసి అక్కడ నెలల తరబడి సమయం వృథా చేసి ఆ తర్వాత అదే జబ్బును మురగబెట్టుకుని తీవ్రదశలో మళ్ళీ సైకియాట్రిస్టు ల దగ్గరికి వచ్చేవారు తరచూ ఉంటారు.
సైకియాట్రీ అనేది ఎంబీబీఎస్ చేసిన తర్వాత చదివే స్పెషలైజేషన్ కానీ సైకాలజీ చదవాలంటే మెడికల్ డాక్టర్ ఐవుండనవసరం లేదు. ఐతే ఇవి రెండూ ఒకదానికొకటి కాంప్లిమెంటరీ. సైకియాట్రిస్టు జబ్బు డయాగ్నోసిస్ చేసిన తర్వాత మందులూ అలాగే కౌన్సెలింగ్ కూడా అవసరం ఔతాయి కొందరికి. కొందరికి మందులు సరిపోతాయి. కొందరికి కౌన్సెలింగ్ మాత్రమే సరిపోతుంది. ఎవరికి ఏది అని డిసైడ్ చేయాలంటే సైకియాట్రిస్టుని కలిసి అతడి సలహా మీద మందులు వాడుతూ సైకాలజిస్టుని కూడా కలవచ్చు. ఐతే మన దగ్గర ఈ అవగాహన లేకపోవడంతో చాలా సమస్యలు వస్తుంటాయి. సైకాలజీ విభాగం సైకాయాట్రీకి సపోర్టింగ్ బ్రాంచ్ వంటిది. సైకాలజిస్టుకి సైకియాట్రీ తెలియకపోయినా పర్వాలేదు కానీ సైకియాట్రిస్టుకి సైకాలజీ తెలిసి ఉండాలంటారు వృద్ధుల కళ్యాణ రామారావు గారు. ఇందులో మరింత లోతుకు పోవడం వ్యాసం ఉద్దేశ్యం కాదు కాబట్టి దీనిని ఇక్కడికి వదిలేద్దాం.
ఐతే చాలామంది సైకియాట్రిస్టుని కలిసే బదులు సైకాలజిస్టుని కలవడం సేఫ్ అనుకుంటారు. ఇది తప్పని కాదు. సైకాలజీస్టుల హోలిస్టిక్ అప్రోచ్ వారితో కలిసి మాట్లాడటం వలన ఏర్పడే నమ్మకం పర్సనల్ రిలేషన్ వంటివి నిజానికి కొంతమందికి స్వాంతన కలిగిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ అలాకాకుండా నిజంగా సైకియాట్రీ జబ్బే కనక ఉంటే కేవలం కౌన్సెలింగ్ సెషన్స్ వలన ట్రీట్మెంట్ సకాలంలో అందదు. ఐతే చక్కటి సైకాలజిస్టులు తమ పరిధి కాదనుకుంటే వెంటనే సైకాయాట్రిస్టుకి పంపడమూ లేకపోలేదు. అందుకే ఇవి రెండూ కాంప్లిమెంటరీ విభాగాలు. తమ మందులు వాడుతూ కౌన్సెలింగ్ కూడా తీసుకోమని చెప్పే సైకియాట్రిస్టులు ఎక్కువ. వారి క్లినిక్ లోనే సైకాలజిస్టుల సేవలను వినియోగించుకునేవారు ఉంటారు.
ముఖ్యంగా ఈ రెంటి మధ్యా విభజన మాత్రమే కాదు అసలు మానసిక జబ్బులు అంటేనే భయంకరమైన స్టిగ్మా మన సమాజంలో అలుముకుని ఉంటుంది. మన భారతీయ సమాజంలోనే కాదు దాదాపు అన్ని సమాజాల్లో ఈ స్టిగ్మా ఉంది. ఒకరకంగా యూరప్ అమెరికాలలోనే ఎక్కువ ఏమో అనిపిస్తుంది వారికున్న చరిత్రను చూస్తే. ఒకప్పుడు సైకియాట్రీ జబ్బులను దయ్యం పూనిందనే వారు (evil spirits). లేదా దేవుని శాపం అనో అనేవారు. ఆ స్థితి మన దేశంలో ఈ రోజుకి ఉందనిపిస్తుంది. ఐతే యూరోప్ అమెరికాలలో మధ్య యుగాలకు వచ్చేసరికి హిస్టీరియాలను గుర్తించారు. ఈ పూనకాలతో ఊగిపోయేవారిని మంత్రగత్తెలని ముద్రవేసి చంపేసేవారు. ఒక స్టడీ ప్రకారం యూరోపులో పూర్వ ఆధునిక యుగ సమయం 15 నుండి 18 వ శతాబ్దం వరకూ దాదాపు ఐదు లక్షల మహిళలను మంత్రగత్తెలని చంపేశారు. ఐతే 19 శతాబ్దం వచ్చేసరికి పరిస్థితి మారింది. మానసిక జబ్బులున్న వారిని asylum లలో పెట్టడం ఒక రకంగా కూరడం గా మరింది. వందల కొద్దీ మందిని ఒకేచోట కూరి కట్టేసి ఉంచే పరిస్థితి ఉండింది. కానీ ఇరవైయవ శతాబ్దంలో సైకియాట్రీ మందులు కనుగోవడం మానసిక జబ్బులను అర్థం చేసుకోవడంలో విప్లవాత్మకమైన మార్పులను తీసుకుని వచ్చింది. Deinstitutionalization ఒక ఉద్యమంగా వచ్చింది. పిచ్చాసుపత్రులను మూసేశారు. హాయిగా డాక్టర్ ఓపీలో మందులు ఇస్తే అవి వేసుకుంటే తగ్గిపొవడం మొదలైంది. ట్రీట్మెంట్ సులభతరమైంది. చూశారా..! మానసిక జబ్బుల చుట్టూ స్టిగ్మా ఉండదా అంటే ఎందుకుండదు. ప్రజలను దైవ వ్యతిరేకులుగా, దయ్యం పట్టిన వారిగా మంత్రగత్తెలుగా లేదా గొలుసులతో కట్టేయబడిన వారిగా మన సమాజాలు చూశాక మానసిక జబ్బులంటే వివిధ అపోహలు ఉండవా అంటే ఉంటాయి.
ఐతే ఇంత సైకియాట్రీ మందులు అభివృద్ధి చెందినతర్వాతకూడా 20వ శతాబ్దం నుండి కొత్త రకమైన స్టిగ్మా మొదలైంది. అదేంటంటే మానసిక జబ్బు కలిగి ఉండటం ఒక వ్యక్తిగత బలహీనతగా చూపడం మొదలైంది. బలవంతుడైన వాడు లేదాదృఢ చిత్తుడైన వాడికి మానసిక జబ్బులు రావనుకోవడం. వస్తే నామోషీగా ఫీలవడం. యూరోప్ అమెరికాలలో క్యాపిటలిజం వ్యక్తిగత విజయానికి పెద్ద పీట వేయడం మొదలెట్టాక మానసిక జబ్బు కలిగి ఉండటం వ్యక్తిగత బలహీనతగా లేదా బలహీనమనస్తత్వంవలననే మానసిక జబ్బు వచ్చి ఉండవచ్చనే ఊహ పెరిగిందనుకుంటాను. మనదేశంవంటి సాంప్రదాయ దేశాలలో మతభావనలు పెరగడంతో మానసిక సమస్య ఉండటం వ్యక్తిగత దుర్బలత్వం వలననే అనే భావన పెరిగి ఉండవచ్చు. ఐతే ఇవే భావనలు ఈ రోజుకీ మనదేశంలో ఉన్నాయి. డిప్రెషన్ లేదా యాక్జైంటీ ఉంది అంటే మెడిటేషన్ చేస్తేనో యోగా చేస్తేనో లేదా భగవద్గీత చదివితేనో మనసు బలంగా తయారౌతుందనీ బలమైన మనసులోనుండి జబ్బులు పటాపంచలైపోతాయనీ అనుకునేవారు సర్వ సాధారణంగా కనబడుతుంటారు.
ఇలాంటి స్టిగ్మాలను పెంచి పోషించడంవలన మానసిక జబ్బులు ముదురుతాయే తప్ప ఆ వ్యక్తి కి ఎలాంటి ఉపయోగమూ ఉండదని తెలుసుకోవాలి. నాకు తెలిసిన ఒక పిల్లగాడి సమస్యను సకాలంలో చూపించకుండా స్వామీజీలకు చూపించి, వివిధ పుణ్యక్షేత్రాలకు తిప్పి, పూజలు హోమాలు చేస్తే తగ్గిపోతుందనీ ఒక రాత్రి అమ్మవారి గుడిలో పడుకుంటే తగ్గిపోతుందనీ చెప్పి తత్సారం చేసి జబ్బు ముదిరిపోయేలా చేశారు. నిజానికి ఆ పిల్లగాడిని డాక్టర్ కి చూపించడానికి వారికి చదువు లేక కాదు తెలివి లేక కాదు. పదుగురూ ఏమనుకుంటారోననే స్టిగ్మా వలన ఎవరికీ తెలియకుండా ఉంచేందుకై ఇలాంటి అపసోపాలు పడుతుంటారు. మానసిక జబ్బుల పట్ల అపోహలు తొలగించేందుకు మన ప్రభుత్వాలు కూడా పూనుకున్నట్టు కనబడవు. మందుల మాటెత్తే సరికి మాఫియా అంటూ పెట్రేగి పోయే బ్యాచ్ ఎలానూ ఉంది. ఇంత కాంప్లెక్స్ సిచువేషన్ మనమే తయారు చేసుకుని స్టిగ్మాలను పెంచి పోషిస్తుంటాం. సినిమాలు కూడా వ్యాధిగ్రస్తులను ఉన్న వారిని సైకోలుగా చిత్రించడం, లేదా వారిని గొలుసులతో కట్టేసినట్టు చూపడం, లేదా కరెంటు షాకిస్తారని చూపడం( electro convulsive therapy) వంటివి అతిగా చూపిస్తుంటాయి. సైకియాట్రీ మందుల చుట్టూ కూడా లేనిపోని అపోహలు వాట్సాప్ లలో చక్కర్లు కొడుతూనే ఉంటాయి. ఇరవైయవ శతాబ్దంలో మొదలైన ఈ కొత్తరకం స్టిగ్మాలు ఈరోజుకీ కొనసాగుతున్నాయంటే మనం ఆధునికత దేనిలో సాధించినట్టో నాకు అర్థం కాదు. ఐతే శరీరానికి జ్వరం వచ్చినప్పుడు పారాసిటమాల్ ఎంత సహజంగా వేసుకుంటామో మనసుకి జ్వరం వచ్చినపుడు అంతే సులువుగా మందులు వేసుకునే పరిస్థితి రావాలి. సైకియాట్రీ మందుల చుట్టూ అల్లుకుని ఉన్న అపోహలు తొలగాలి. మొదటే గుర్తిస్తే చాలా సులువుగా చాలా తక్కువ కాలంలో తగ్గిపోయే జబ్బులను సైతం ఈ రకమైన అపోహలవలన తత్సారం చేస్తూ తీవ్రదశకు తీసుకుని పోకుండా ఉండే రోజులు రావాలి. లేకపోతే సైకియాట్రీ జబ్బు ఆ వ్యక్తి కే కాదు పైన చెప్పినట్లు చుట్టుప్రక్కల వారికి కూడా ప్రమాదమే.
విరించి విరివింటి
16/2/24
No comments:
Post a Comment