ఎంతో అన్యోన్యంగా పెరిగిన అన్నాదమ్ములే ఆస్తి పంపకాలొస్తే ఎవరివాటా ఎంత అని కొట్టుకుంటుంటారు. నీకున్న బెస్ట్ శత్రువెవరయ్యా అంటే ఎవరితో ఐతే నీవు నీ ఆస్తిని పంచుకోవాల్సి వస్తుందో వాడే నీకు అత్యుత్తమ శత్రువౌతాడు.
ఇద్దరిలో మొత్తం వాటామీద ఎవరికి ఎక్కువ పెత్తనం ఉంటుందో వాడు మరింత పట్టుదలతో ఉంటాడు. ఎందుకంటే ఆస్తి పంచుకోవడమంటే కొంత ఆస్తి వదులుకోవడమే కాదు తన పెత్తనంని కూడా కోల్పోవడం. ఆస్తి , పెత్తనం రెండూ కలిసే ఉంటాయి.
మహాభారతమంతా అన్నదమ్ముల మధ్య రాజ్యమనే ఆస్తి తగాదా వంటిదే.
పెద్ద రారాజైన దుర్యోధనుడు పాండవులకు మిగిలిన కొద్ది పాటి అధికారాన్ని కూడా కుయుక్తులతో లాక్కొని అడవికి పంపిస్తాడు. అతడి బాధంతా అతడి పెత్తనం పోతుందనే. రోడ్డుమీద బిక్షగాడి వేషంలో వెళ్ళి కూర్చుంటే అక్కడున్న అసలైన బిక్షగాడొచ్చి వెళ్ళిపోమని బెదిరిస్తాడు. వినకుంటే తన్నినా తంతాడు. అడుక్కోవడంలో అది వాడబ్బజాగీరని వాడనుకుంటాడు. వాడిదే పెత్తనం. సముద్రం అందరిదైనా పెద్ద చేప పెత్తనం ఎక్కువ గనుక చినచేపను తినేయడం న్యాయమే అనుకుంటుంది.
ఎలక్షన్ లలో సీట్లు పంచుకునే పార్టీల పరిస్థితి ఇదే. వాటా ఇచ్చేపార్టీకి పుచ్చుకునే పార్టీ అంటే లోకువ. ఇలాంటి పరిస్థితి లో తేడాలొస్తే వీళ్ళకు బయటనుండి వేరే శత్రువు అవసరం లేదు. పెద్ద చేప పెత్తనం ఒప్పుకున్నంత వరకే చిన్నచేప మనుగడ.
No comments:
Post a Comment