Friday, 9 September 2016

కవిత్వ సందర్భం 25 Afsar


ఈ తనిఖీలెందుకో...
...........................
"ఉన్న స్థితి"కీ "ఉండాలనుకున్న స్థితి"కీ ఎప్పటికీ ఘర్షణ జరుగుతూ ఉంటుందంటాడు జిడ్డు కృష్ణమూర్తి. మనిషి మనసులో తన మీద తనకు ఒక అవగాహన ఆత్మ గౌరవం అనేవి ఉన్నపుడు, అతని ఎదుటే ఆ అవగాహన ఆత్మ గౌరవం అనేవి శూన్య స్థాయికి నెట్టి వేయబడినపుడు తనకూ తన చుట్టూ ఉన్న లోకానికీ మధ్య ఒక స్పష్టమైన అగాధాన్ని అతడు కనుగొంటాడు. తను ఉన్న స్థితిలోనే అతడు తీవ్ర ఘర్షణకు లోనవుతాడు. అటువంటి పరిస్థితిలో తన లోపలి అంతరాత్మకూ బయటిలోకానికీ మధ్య ఒక చైతన్య స్రవంతి( stream of consciousness) ని సృష్టించుకుంటాడు కవి అఫ్సర్. ఈ అంతరాత్మ ఘోష మనసులో సాగుతూ నే ఉంటుంది. బయటకు ఎవరికీ వినిపించనిది. అది ఆత్మ శోక గీతం. తాను అనుభవించిన ఉద్వేగాన్ని తిరిగి ప్రశాంతతలో ఎపుడైనా గుర్తుకుతెచ్చుకున్నపుడు, ఒక కవితలాగా పరుచుకుంటుందా అనుభవం. ఆ కవితలో తనకూ తన చుట్టూ ఉన్న లోకానికీ మధ్య స్పష్టమైన ఖాలీని మరలా కనుగొంటాడు. అపుడు ఆలోచిస్తే ఈ అనుభవం తనదొక్కనిదే కాదు, తనలాంటి వారిదెందరిదో అని తనలోపలి చైతన్యాన్ని వారందరితో ఐక్యం చేసుకునే ప్రయత్నం చేస్తాడు. తనలాగే తన వారందరి పేరు వెనుక ఒక అహ్మద్ అనో మహ్మద్ అనో, ఖాన్ అనో ఉంటుంది, కాబట్టి ఇది తన ఒక్కడి ఆత్మ శోక గీతం కాదు..ప్రతీ ముస్లీముదీ అని అంటాడు కవి అఫ్సర్.

సెప్టెంబరు పదొకొండు ట్విన్ టవర్ దాడుల తరువాత, "ఉగ్రవాదం మీద యుద్ధ"మనే ఒక అత్యవసర స్థితిలోకి అమెరికన్ సమాజం బలవంతంగా నెట్టివేయబడిందనుకోవాలి. "అంతా సవ్యంగా ఉంది, భయపడనవసరమే లేదు, రూల్స్ ని పాటించండి నిమ్మలంగా ఉండండి" అనేటటువంటి స్థితి, "ప్రజలందరూ రాబోయే విపత్తుకు సంసిద్ధులై ఉండండి" అని చెప్పినట్లుండే శాశ్వత అత్యవసరస్థితికి దారితీస్తుంది. అమెరికా రాజకీయాలకు ఇదే కావాలి కూడా. ఇటువంటి పరిస్థితుల్లో ట్రాన్స్పోర్టేషన్ సెక్యూరిటీ అడ్మినిష్ట్రేషన్ (TSA) అమెరికా విమానాశ్రయాల్లో భద్రతను పెంచే దిశగా జాతి మత పరమైనటువంటి అంశాలను పరిగణలోనికి తీసుకుంది. ఒక వ్యక్తి ముస్లిం పేరుతో ఉన్నా, అతని వస్త్రధారణ ఇస్లాం మతాన్ని సూచించేదానిలా ఉన్నా, అతడి చర్మంలో మెలనిన్ ఒకింత ఎక్కువగా ఉన్నా అతడిని అనుమానపు దృక్కులతో చర్యలతో పరీక్షించటం మొదలయ్యింది (racial and religious profiling). అమెరికాలో సైతం ఈ ధోరణి ఎన్నో విమర్శలకు లోనయ్యింది. బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ లిస్ట్ లో ఉన్న మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు కూడా అమెరికాలో ఇటువంటి అవమానకర పరిస్థితిని ఎదుర్కోవలసి వచ్చినపుడు, సామాన్య పౌరుడి విషయం వేరే చెప్పనవసరం లేదు. ప్రతీ ముస్లీం ఉగ్రవాది కాడు అని చప్పే ప్రయత్నాల్లో "మై నేమ్ ఈజ్ ఖాన్" వంటి సినిమాలు కూడా వచ్చాయి. హ్యూమన్ డిగ్నిటీని ప్రశ్నార్థకంగా మార్చేలా సాగే ఈ అనుమానపు తనిఖీలు ముస్లిం సమాజాన్ని ఆ కొంత సేపు ప్రపంచాన్నుంచి వేరు చేస్తున్నపుడు తన లోపల ఉన్న స్థితికీ బయట తను ఉన్న స్థితికీ మధ్య సంఘర్షణను ఒక గీతంలా పాడుకుంటాడు కవి అఫ్సర్.

నిజానికి ఈ తనిఖీలు నిజమైన ఉగ్రవాదులను కనుక్కోలేక పోగా, కేవలం ఒక జాతి లేదా మతాన్నే అనుమానించటం వల్ల అసలైన ఉగ్రవాదులు కూడా తప్పించుకోగలిగే అవకాశం ఉంటుంది. ఉగ్రవాదులు తమకన్నా చాలా తెలివి తక్కువ వారు అనుకోవడమనే ధోరణికూడా ఈ ప్రొఫైలింగ్ లో దాగి ఉందన్నది సత్యం. బైసీయన్ స్టాటిస్టిక్స్ ని పరిగణలోనికి తీసుకున్నపుడు, ముస్లిములలో ఉగ్రవాదుల శాతం చాలా చాలా తక్కువ అనుకుంటే, నిజానికి తనిఖీ చేయబడే ముస్లిం అమాయకుడయ్యే అవకాశమే ఎక్కువ. కానీ మనం బేస్ రేట్ ఫాల్లసీ (Base rate fallacy) లోకి పడిపోతుంటాము. తనిఖీలో ఫాల్స్ పాజిటివ్ ఫలితాన్ని పరిగణలోనికి తీసుకునే విషయంలో తడబడతాము. తనిఖీ చేసే పోలీసు అధికారులు బేస్ రేట్ ఫాలసీలో పడిపోవటం వల్ల ముస్లిముల్లో అమాయకుల సంఖ్యే ఎక్కువ అనే సాధారణ విషయాన్ని మరచి, ఉగ్రవాదులు ముస్లిముల పేరుతో ఉన్నారనుకునే స్పెసిఫిక్ సమాచారానికి వారు దాసోహమనాల్సి వస్తుంది. సైంటిఫిక్ గా జరిగిన ఎన్నో సర్వేలు జాతి, మతాల ఆధారంగా జరిగే ఈ తనిఖీల వలన ఉగ్రవాదులను కనుగొనే అవకాశమే లేదని తేల్చి చెప్పాయి. సైకాలజీని ఆధారంగా చేసుకునే "బిహేవియరల్ ప్రొఫైలింగ్" కూడా పరిగణలోకి వచ్చింది. ఇవైనా కూడా ఈ తనిఖీల ఖచ్ఛితత్వం ఒక అవకాశానికి దగ్గరగా మాత్రమే ఉందని తేల్చి చెప్పేశాయి. ఒక బిహేవియరల్ పరీక్ష యొక్క పూర్తి ఖచ్చితత్వం శాతంగా నిర్ధారించారు. అంటే ఒక కాయిన్ ఎగిరి వేసి, పలానా వ్యక్తి టెర్రరిస్టా కాదా అని చెప్పడం వంటిదే ఇది తప్ప, అంతకు మించి ఇదేమంత గొప్పది కాదు. సైన్స్ అండ్ టెక్నాలజీ ఇచ్చే ఆధారాలు ఈ విధంగా ఉన్నపుడు, అమెరికా చేసే ఈ జాతి, మత సంబంధమైన తనిఖీల నిజమైన ఆంతర్యం ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. ఇది కేవలం మతాన్ని బూచిగా చూపించే, అత్యహసర స్థితిని స్టేటస్ ఖో( STATUS QUO) లో ఉంచగలిగే ఒకానొక అమెరికా రాజకీయ కుయుక్తి తప్ప మరోటి కాదు. ఉగ్రవాదం పై యుద్ధం అమెరికా కొత్త ఆర్థిక విధానానికి ఒక సౌకర్యవంతమైన కొనసాగింపు కూడా.

లెనిన్ అన్నట్టు "చరిత్ర చాలా కఠినమైన నిర్ణయాధికారి. మనం ఈ క్షణాన్ని ఏదోలాగా గడవనిస్తే అది మనల్నెప్పుడూ క్షమించదు." అందుకే చరిత్ర మీద తిరగబడాలి తప్పదు. అందుకే ఈ కవిత ఇంటీరియర్ మోనోలాగ్ మాత్రమే కాదు. దానంతటకు అదే ఒక తిరుగుబాటు కూడా. ఈ అనుభవాన్ని ఎంత మంది ముస్లీము సోదరులు చెప్పడానికి ప్రయత్నించారో తెలియదు, కానీ కవి అఫ్సర్ ఆ భారాన్ని అతి సులువైన పదాల్లో మన మీద మోపేస్తారు. అర్థం చేసుకోవడం సహానుభూతి పొందటం మన బాధ్యతే.

నా పేరు
    Afsar Mohammed
-------------------------------------

నమ్మరా బాబూ నమ్మరా నన్ను ఈ పాస్పోర్టు సాక్షిగా ఇందులో వున్న నా అయిదారేళ్ల కిందటి నెరవని నా మీసాల నా తలవెంట్రుకల సాక్షిగా నమ్మరా, నేనేరా అది!

సరిహద్దులు లేవు లేవు నాకు అని రొమ్మిరుచుకుని అక్షరాలిరుచుకుని భాషలకతీతమే నేనని పలుకుల కులుకులన్నీ తీర్చుకుని నడుస్తూ పరిగెత్తుతూ వుంటా ఎయిర్ పోర్టుల గాజు అద్దాలు పగలవు నేనెంత ఘాట్టిగా కొండని ఢీ కొట్టినా.

నమ్మరా నన్ను నమ్మరా నా పేరు చివర మహమ్మదో అహమ్మదో షేకో సయ్యదో ఖానో వున్నా నేను మంచి బాలుణ్ణిరా. కాగితం తుపాకీని చూసినా మూర్ఛపోయే అమాయకుణ్ణిరా నమ్మరా నన్ను నమ్మరా.

భయపెట్టే నీ స్కాను కన్నుల గుండా నడిచెళ్లిన ప్రతిసారీ నా శల్యపరీక్ష లో సిగ్గుతో పది ముక్కలయి నా టికేటు మీద మూడు ఎస్సులు నా నిజాయితీనీ నా నీతినీ నా శీలాన్ని శంకించినా నమ్మరా నన్ను నమ్మరా

దేశాలు లేని వాణ్ణి రా
కన్న దేశమే తన్ని తరిమేసిన వాణ్ణిరా

తల్లీ తండ్రీ తాతా ముత్తాతా అందరికి అందరూ వున్నా
వొంటి మీది చొక్కా మాత్రమే మిగిలిన వాణ్ణిరా

నమ్మరా నన్ను నమ్మరా
నేనొట్టి ఆవారానిరా
నేనొట్టి పాగల్ గాణ్ణిరా

నిజమేరా
నన్ను చంపి పాతరేసినా
నా శవాన్ని ఎవ్వరూ మాదే మాదే అని పరిగెత్తుకు రారురా.

చచ్చి కూడా సాధిస్తాను రా
నమ్మరా నన్ను నమ్మరా

నా శవం కూడా నీకు మోయలేని భారం రా.

ఈ ఎయిర్పోర్టు దాటాక
ఎవరూ నా మొహం కూడా చూడరు రా.

నమ్మరా నన్ను నమ్మరా.

(ఇది ఎయిర్పోర్టులలో ప్రతి ముస్లిం పాడుకోవాల్సిన ఆత్మ శోక గీతం)

No comments:

Post a Comment