Friday, 9 September 2016

పవన్ మీటింగ్
...................
"పార్లమెంటును స్తంభింపజేయండి" అనేది ఒక పిలుపా?. పవన్ కల్యాణ్ స్టేజీ డ్రామాలో ఇదొక అద్భుత ఘట్టంగా నిన్న మనం చూశాం. ఇప్పటికే పార్లమెంటులో నలభై శాతం కాలాన్ని, దాన్ని సభ్యులు స్తంభింపజేయటం ద్వారా కోల్పోతున్నాం. ప్రజా సమస్యలని చర్చించాల్సిన సభ్యులు కొట్టుకుంటూ,బూతులు తిట్టుకుంటూ, స్లోగన్లూ ఇస్తూ, మైకులు విరిచేస్తూ చేస్తున్న భీభత్సాలని చూస్తున్నాం. చదువుకున్న సగటు భారత పౌరుడు పార్లమెంటు వ్యవహారాన్ని ఎంటర్ టైన్మెంటు ప్రోగ్రామ్ కంటే పెద్దగా ఉపయోగపడే విషయమేమీకాదని అనుకుంటున్నాడనటంలో సందేహం లేదు. ఇటువంటి సందర్భంలో కనీసం ఒక ఓటు కూడా సంపాదించుకోలేని పవన్ కల్యాన్ తనకు తాను సీమాంధ్ర ప్రజల రిప్రెసెంటేటివ్ ప్రకటించుకుని, పార్లమెంటును స్తంభింప జేయండి అని తెలుగు ఎం.పీ. లకు పిలుపునిస్తున్నాడు. ఇది అప్రజాస్వామికమన్న సెన్సుకూడా లేదు. ప్రత్యేక హోదా విషయం మీద పార్లమెంటులో ఇంకా సమర్థవంతంగా, సరయిన వ్యూహంతో పోరాడాలనే పిలుపు ఇవ్వాల్సింది పోయి, స్తంభింపజేయండి అని పిలుపునివ్వటం మరీ విడ్డూరం. స్తంభింపజేయటం ద్వారా, ఎన్నో ప్రజా సమస్యలను చర్చకు రానివ్వకుండా చేయండని పిలుపునివ్వటం ఏంటి?. ఈయన ఇపుడు దేశ భక్తుడంటే మనమంతా నమ్మాలి మరి.

ఒక పార్టీకి అధ్యక్షుడైనంత మాత్రాన, ఒక ప్రాంతం ప్రజలకంతా తానే రిప్రెజెంటేటివ్ అని ఎలా అనుకుంటున్నాడు. ఆ పార్టీ తరపున ఎలక్షన్లలో నిలబడాలి. గెలవాలి. అపుడు ఆ ప్రాంతానికి సంబంధించిన రిప్రెజెంటేటివ్ గా తనకు అర్హత వుంటుంది. కానీ పవన్ కల్యాణ్ ఇదేమీ లేకుండా తానే సీమాంధ్ర ప్రజల రిప్రెజెంటేటివ్ అని ప్రకటించుకున్నాడు. స్వయం ప్రకటిత రిప్రెజెంటేషన్ కి అంత వెయిటేజ్ ఉండదనే విషయం పాపం మరచిపోయాడు. ఎవరు చెప్పారాయనకు ఆయనే ఈ ప్రాంతానికి రిప్రెజెంటేటివ్ అని?. ఏ ఆధారంతో అలా ప్రకటించుకున్నాడు?. అర్థం కాని విషయాలు. ఆయనను పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకున్నదెవరు?. ఆయనంతాయనే ఒక పార్టీ ప్రకటించుకున్నాడు. దానిలో ఎవరరెవరున్నారు, ఎవరి రోల్ ఏంటిది ఎవరికీ ఏమీ తెలియదు. అంతా పిల్లలాటే.

ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాలనే ఊహ కూడా కనిపించటం లేదు. సొంత డబ్బా కొట్టుకోవడం లాంటివి పక్కకు పెడితే సగటు సీమాంధ్ర మనోగతాన్ని వ్యక్తం చేసే ప్రయత్నం చేశారు. కానీ ఇది సరిపోతుందా?. ఆయన చెప్పిన మూడంచెల కార్యాచరణ కూడా పేలవంగా ఉంది. క్లారిటీ లేదు. ఇపుడు ప్రతి జిల్లాలో మీటింగ్ లు పెట్టడం వల్ల ఒరిగేదేమిటి?. ప్రతీ సగటు సీమాంధ్ర పౌరుడు ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుకుంటున్నాడు. కొత్తగా వారికి మీటింగ్ ల ద్వారా చెప్పేదేమిటి?. ఈ మీటింగ్లు అయిపోయే సరికి, ఎలక్షన్లే ఒచ్చేస్తాయి. మల్లీ రంగం మారుతుంది, ప్రాధాన్యాలు మారతాయి. బయటనుండి మద్దతిచ్చే పవన్ కల్యాణ్ ఏమి చేయగలుగుతాడు?. తాను కూడా ఎలక్షన్లలో నిలబడి కొన్ని సీట్లు కలిగిఉండటం వల్ల, ఇపుడు మద్దతు ఉపసంహరించటం ద్వారానో ఏదో విధంగా ప్రభుత్వం పై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేసి ఉండేవాడు. కానీ బయటి మాటలకే పరిమితమైన పవన్ ఇపుడేమీ చేయలేడు. చంద్రబాబు ఇప్పటికే ప్రత్యేక హోదా తేవాలన్న దిశగా ప్రయత్నాలైతే చేస్తూనే ఉన్నాడు. ఆయన స్ట్రాటజికల్ గానే అడుగులు వేస్తున్నారు. ఇపుడు పవన్ ప్రసంగం వల్ల, ఇన్వాల్మెంటు ద్వారా కొత్తగా ఒరిగేదేమిటి?. దీన్నొక ప్రజా ఉద్యమం లా చేయాలనుకుంటే, అదేదో ఇపుడే చేయాలి. దానికి కార్యాచరణ ఏమిటి?. ముందు జిల్లాల్లో మీటింగ్ లు పెడితే, అది కూడా షూటింగ్ లు లేని ఖాలీ సమయాల్లో చేయాలి అంటే, పదమూడు జిల్లాలకు ఆవరేజిగా ఈ ప్రహసనం ముగిసే సరికి రెండు సంవత్సరాలే పడుతుంది.  ఇపుడొక బంద్ కి పవన్ పిలుపునిస్తే అది విజయవంతం కాగలుగుతుందా?. అంత ఫాలోయింగ్ పవన్ కి ఉందా?. అంతగా పవన్ ఇన్ప్లూయెన్స్ చేయగలిగితే బంద్ కి పిలిపివ్వటం ద్వారా తన సత్తా ఏంటో నిరూపించుకోవచ్చు. తద్వారా బలమైన సంకేతాలు పంపవచ్చు, కానీ పవన్ పైపై చర్యలకే పరిమితమైనట్టు కనిపిస్తోంది.

మొత్తానికి పవన్ ఇంతకు ముందు తప్పులే మల్లీ చేశాడు. కొత్త సీసాలో పాత సారాలాగే ఆయన వ్యవహారం సాగింది. ఆవేశం తప్ప ఆలోచన లేనట్టే అనిపించింది. చేతకాక ఇపుడున్న ప్రభుత్వం ప్రత్యేక హోదా తేలేకపోతున్నదనే అభిప్రాయం, తెలుగువారంటే ఉండే నిర్లక్షం వల్ల కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వటం లేదనే అభిప్రాయాన్నే పలు రకాలుగా చెప్పే ప్రయత్నం చేశాడు. మధ్య మధ్యలో సొంత డబ్బా చెబుతూ మొత్తానికి ఆయనేం చెప్పదలచుకున్నాడో ఎవరికీ అర్థం కాకుండా చెప్పి పోయాడు. అరుపులు, కేకలు స్పీచ్ కాదు అని ఇంకా తెలుసుకోకపోవటం వింతే. రెండు పడవల మీద స్వారీ అంత తేలికా కాదు. రాజకీయం రంగంలో ఉంటూ, సినిమాలు తీస్తూ రెంటికీ అన్యాయం చేస్తున్నాడు. దేనికో ఒకదానికి ఆయన పరిమితమౌతే ఈ పరిస్థితిలో మార్పు వచ్చి, ఇంకాస్త స్పష్టత రావొచ్చు.

No comments:

Post a Comment