Friday, 9 September 2016

గణేష్ నిమజ్జనం చెరువులలో చేస్తే ఏమౌతుంది?.
..........................................................
బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్(BOD) అనేదొకటి ఉంటుంది. అదేంటో ఇపుడు తెలుసుకుందాం.  చెరువుల్లోని సూక్ష జీవులు నీటిలోని ఆక్సిజన్ ను తమ లో జరిగే రసాయన చర్యలకు ఉపయోగించుకుని శక్తిని పొందుతాయి.  అలాగే చెరువుల్లోని ఆల్గే, సైనోబ్యాక్టీరియా వంటివి ఆక్సిజన్ ను విడుదల చేస్తాయి. ఎపుడైతే చెరువులో సేంద్రియ పదార్థాలు ఎక్కువవుతాయో..సూక్మ జీవులు వాటిని గ్రహించి ఎక్కువ శక్తిని పొందటానికి ఎక్కువ ఆక్సిజన్ ను నీటినుండి గ్రహిస్తాయి. ఇలా జరగటం వల్ల నీటిలో ఆక్సిజన్ శాతం తగ్గిపోయి, ఆక్సిజన్ మీద ఆధారపడే నీటి జీవులైన చేపలు, కీటకాల జీవితం మీద ప్రభావం చూపి అవి నశించి పోయే ప్రమాదానికి దారి తీస్తాయి. అదే సమయంలో ఆక్సిజన్ లేని వాతావరణంలో బతికే ఎనరోబిక్ బ్యాక్టీరియాలు వృద్ధి చెందుతాయి, ఆక్సిజన్ మీద బతికే ఏరోబిక్ బ్యాక్టీరియాలు నశించిపోతుంటాయి. ఈ విధమైనటువంటి ఆక్సిజన్ డిమాండ్ నీటిలోకి సేంద్రియ పదార్థాలు (organic matter) విపరీతంగా వచ్చి చేరటం వల్ల సంభవిస్తూ ఉంటుంది. ఒక నీటి కుంటలోని బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ ని మిల్లీ గ్రాములు పర్ లీటర్( mg/L) లలో కొలుస్తారు, స్వచ్ఛమైన నదీ జలాలలో 1mg/L గా ఉంటుంది. మామూలునదుల్లో 2 to 8 mg/L గా వుంటుంది. అదే మురుగు నీటి శుద్ధీకరణ జరిగిన తరువాత 20 mg/L గా ఉంటే, శుద్ధి చేయబడని మురుగు నీటిలో 600mg/L పై గా ఉంటుంది. మన హుసేన్ సాగర్ లో మామూలు సమయాల్లోనే 50 mg/L గా ఉంటుంది. అదే గణేష్ నిమజ్జనం జరిగాక అది 150mg/L కి పెరుగుతూ ౦టుంది. దీనివల్ల హుసేన్ సాగర్ లో ఉండే చేపలు కావచ్చు లేదా చుట్టూ ఉండే చిన్న చిన్న మొక్కలు కావొచ్చు, తీవ్రమైన ఆక్సిజన్ లేమితో చనిపోతూ ఉంటాయి. హుస్సేన్ సాగర్లో గాలిలోని ఆక్సిజన్ ను పీల్చే ముర్రెల్ (బత్తిని సోదరులు వాడేది), క్లైంబింగ్ పెర్చ్ వంటి చేపలు తప్ప, చాలా రకాల చేపలు పూర్తిగా నశించిపోయాయట.

ఇదే కాక, నీటిలో భార లోహాల (heavy metals) శాతం కూడా నిమజ్జనం తరువాత విపరీతంగా పెరుగుతుందట. ఉదాహరణకు ఇనుము పది శాతం పెరిగితే, కాపర్ మూడువందల శాతం పెరుగుతోందట. లెడ్, మెర్క్యూరీ వంటి లోహాలు కూడా నీటిలో పెరిగిపోతాయట. విగ్రహాలు తయారు చేసే కాల్షియం సల్ఫేట్ హెమీ హైడ్రేట్ (plaster of paris) చెరువు కింద భార లోహాలతో కలిసి గట్టి అవక్షేపం(sediment) లా ఏర్పడి వాటి కింద చిక్కుకున్న జల జీవులకు ప్రాణ హానిని కలిగిస్తుంటాయి. అవి పేరుకుపోయి, చెరువు లోతు తగ్గి పోవటానికి కారణమౌతాయి. హుసేన్ సాగర్లో లోతు తగ్గి పోయి, కొన్ని చోట్ల లోతు ముప్పై అడుగుల కంటే తక్కువగా ఉంటుందంటే ఈ అవక్షేపాలు ఎంతగా పెరిగి పోయాయో గ్రహించవచ్చు.

కూకట్పల్లి బాలానగర్ ప్రాంతాల్లో ఉండే మూడువందలకు పైగా ఫ్యాక్టరీలనుండి వచ్చే వ్యర్థాలు కూకట్ పల్లీ నాలా ద్వారా వచ్చి హుసేన్ సాగర్ లో కలుస్తుంటాయి. ఈ కాలుష్యమంతా ఈ పరిశ్రమల నుండి వచ్చే వ్యర్థాలదే తప్ప, గణేశ్ నిమజ్జనం వలన కాదని కొందరి వాదనగా ఉంది. ఇందులో కొంత వాస్తవం ఉన్నా పూర్తిగా సమర్థనీయం కాదు. డొమెస్టిక్ వేస్టేజ్, ఇండస్ట్రియల్ ఎఫ్లూయంట్లూ వచ్చి చేరే హుసేన్ సాగర్ లో భగవంతుడిని నిమజ్జనం చేయడమేమిటి?. ముందే మురుగునీరు కలిసి ఉన్నాయని తెలిసీ, మనం పూజించిన దేవుడిని అదే మురుగులో వేయడం ఏమి ఆనందం?. పరిశ్రమలే చెరువుల్ని పాడు చేస్తున్నాయని తెలిసీ, అందులోనే నిమజ్జనం చేయటం అన్నది, మనవంతు కృషిగా పర్యావరణాన్ని నాశనం చేయటమే తప్ప మరొకటి కాదు. మనం పండుగను తప్పని సరిగా చేసుకోవాల్సిందే.."గణపతి మప్పా మోరియా" అని కేరింతలు కొట్టాల్సిందే, కానీ భవిష్యత్తులో మన పిల్లలు ఎటువంటి పర్యావరణ కాలుష్యంలోకి అడుగుపెడుతున్నారో ఆలోచించాలి. మన వేడుక రాబోవు తరాలకు శాపంగా మారకుండా చూసుకోవాలి. ఇపుడున్న శాస్త్ర సాంకేతికతను ఉపయోగించి మన వేడుకలను హుందాగా ఆరోగ్యవంతంగా మలచుకోలేనపుడు, మన సైన్సు చదువులు వ్యర్థమని గ్రహించాలి. విద్యను ప్రసాదించే గణేషుడిని మనం పరిశుద్ధంగా గౌరవించుకోవాలి.

గణేష్ చతుర్థి శుభాకాంక్షలతో..

No comments:

Post a Comment