Tuesday, 27 September 2016

దోమల బాధ, గాధ

దోమల బాధ, గాధ. A short notes on the way.
-----------------------------------------------------------------------
దోమలు లేని రాష్టంగా తయారుకావాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సమర్థించదగినదే, కానీ మనకులాగా దోమలకు రాష్ట్ర సరిహద్దులూ తెలియదు, రాజమౌళి ఈగ లాగా పారిపోవడానికీ పగబట్టడానికీ వాటికంత తెలువులు కూడా లేవు. రాష్ట్రాన్నంతా ఒక పెద్ద దోమతెరలో కుట్టేయకపోతే పక్క రాష్ట్రాలనుండి ఎప్పటికప్పుడు దాడి చేస్తూనే ఉంటాయవి. మలేరియా, డెంగ్యూ ,ఎల్లో ఫీవర్ వంటి జబ్బులకు సంబంధించిన వ్యాధికారక క్రిములను దోమలు ఒక మనిషి నుండి ఇంకో మనిషికి వ్యాపింప చేస్తూ ఉంటాయి. ప్రతీ యేటా ప్రపంచ వ్యాప్తంగా పది లక్షలమందికి పైగా ఈ జబ్బుల బారిన పడి మరణిస్తున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. మన దేశంలో ఈ మరణాల సంఖ్య కాస్త తగ్గినా, జబ్బుల బారిన పడేవారి సంఖ్య పెద్దగా తగ్గలేదనే చెప్పాలి. నేటికీ ట్రైబల్ ఏరియాల్లో దోమల వల్ల విషజ్వరాలు సోకుతూ నే ఉన్నాయి. వర్షాకాలంలో ఐతే ఇక చెప్పనవసరం లేదు. ఆడదోమ గుడ్లు పెట్టడానికి నిలువ ఉన్న మంచి నీరు అవసరం కాబట్టి, ఇక ఆడదోమలకు వర్షాకాలం పండగనే చెప్పాలి. రెండు రాష్ట్రాలనూ వర్షాలు తడిపేస్తుంటే, ఏ పీ గవర్నమెంట్ దోమలు లేని రాష్ట్రంగా మారాలనుకోవటం హర్షణీయం.

అయితే దోమలని ఒక రాష్ట్రం నుండి పూర్తిగా నాశనం చేయటం సాధ్యమా..? అలా చేయటం శ్రేయస్కరమా అనేది చర్చించాల్సిన విషయం. దోమలలో దాదాపు 3500 రకాల జాతులున్నాయి. వాటిలో కేవలం 100 జాతులు మాత్రమే మనుషులకు ఈ భయంకర జబ్బులను కలిగిస్తున్నాయి. మిగతా జాతులన్నీ పూవుల మీద, పండ్ల మీదా, చిన్న కీటకాలమీద ఆధారపడి బతుకుతాయి. ఈ మిగతా రకాల దోమలు కూడా ఎన్నో పక్షులకు, చేపలకూ ఆహారంగా పనికొస్తూ ఉంటాయి. అంటే పర్యావరణ ఫుడ్ చెయిన్ (food chain) లో ఇవి ప్రధాన పాత్ర పోషిస్తాయి. అంతే కాక ఈ దోమలు పుప్పొడిని పూవులకు అందించే బాధ్యతను కూడా నిర్వహిస్తాయి కాబట్టి, ఫలదీకరణలో ఎన్నో ఇతర కీటకాలవలె, ఇవి కూడా ప్రధాన పాత్ర పోషిస్తాయి. దోమలంటే ఇవన్నీ వస్తాయి కాబట్టి, వీటన్నింటినీ నాశనం చేయాలనుకోవడం వలన ఈ ఫుడ్చెయిన్ తెగిపోయి ఇతర జీవులకు కూడా ఇబ్బందులను సృష్టిస్తాయని పర్యావరణవేత్తలంటారు. ఇంకో విషయమేమంటే ఈదోమలను చంపాలంటే రెండు రకాల మందులుంటాయి. లార్వీసిడల్ మందులు, దోమల గుడ్లు పొదగకుండా లార్వా దశలోనే నాశనం చేయగలిగితే, అడల్టీసిడల్ మందులు, లార్వాలు దోమలుగా రూపాంతరం చెందిన తర్వాత నాశనం చేస్తాయి. ఐతే ఈ మందులు కేవలం దోమలనే కాక ఎన్నో ఇతర క్రిమి కీటకాలను కూడా చంపుతున్నాయని, అందువల్ల ఇకో సిస్టం (eco system) సమతౌల్యం దెబ్బతింటూందని కూడా అధ్యయనాలు వెల్లడి చేస్తున్నాయి. డేవిడ్ కామెన్ అనే సైన్స్ రైటర్ ఏమంటాడంటే..దోమలు మనుషులు చేసే పర్యావరణ విధ్వంసాన్ని సమర్థవంతంగా ఆపగలుగుతున్నాయని. ఆఫ్రికాలోని రెయిన్ ఫారెస్ట్ లు ఈ రోజుకీ మానవుల ఆక్రమణల బారిన పడకుండా బతికి మనగలుగుతున్నాయంటే కేవలం ఈ దోమలే కారణం అంటాడు. క్రూర జంతువులనైనా బంధించో చంపో ఆ అరణ్యాలను జయించగలడేమో గానీ, చిన్న చిన్న దోమలని జయించి బతకగలగటం సాధ్యం కాకపోవటం వలననే నేటికీ ఆ రెయిన్ ఫారెస్ట్ లు అలాగే ఉన్నాయంటాడీయన. అంటే మనకు తెలియకుండా ప్రకృతిలో దోమలు నిర్వహించే బాధ్యత ఎంతో అర్థం చేసుకోవాలి.

వ్యాధుల బారిన పడవేసే దోమల వృద్ధి జరగకుండా తగు సహజ జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. నిలువ ఉన్న మంచి నీరు ఎక్కడున్నా దోమలు గుడ్లు పెడతాయి. ముఖ్యంగా తెరచి వుంచిన కొబ్బరి బోండాల్లో వర్షపు నీరు చేరి వుంటుంది. వాటిల్లో లక్షల సంఖ్యలో దోమలు గుడ్లు పెడతాయి. కొబ్బరి బొండాలు తాగి అక్కడే పడవేయకుండా వీలైతే వాటిని ఇంటికి తెచ్చుకుని కాల్చేయాలి. అలాగే మనం బయట ఉంచిన నీటి బకెట్ లూ, చెత్త కుండీలు, నీల్ల టాంకులూ కూడా. వీటినన్నింటినీ గట్టిగా మూసి ఉంచటం వలన దోమలనువృద్ధి చెందకుండా చేయవచ్చు. వర్షాలు పడినపుడు నీరు నిలువకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. నిలువ ఉన్న నీటి మీద కొంత కిరోసిన్ లేదా, మంచి నూనె పోయటం ద్వారా, లార్వాలకు ఆక్సిజన్ సప్లై లేకుండా చేయవచ్చు. దోమల లార్వాలను తినే గంబూసియా వంటి చేపలను కుంటలలో పెంచటం కూడా ఒక మంచి పద్దతి. ఆ తరువాత దోమతెరలూ, ఆలౌట్ లూ ఎలాగూ ఉన్నాయి. అంతేకాకుండా మలేరియా డెంగ్యూ వ్యాధులు ప్రజలలో కొంత అవగాహన పెంచి సకాలంలో మందులు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో దొరికేలా చర్యలు తీసుకోవాలి. ముఖ్యన్గా ట్రైబల్ ఏరియాల్లో వర్షాకాలం లో తగు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలి. చివరగా చెప్పేదేమంటే, దోమ రహిత రాష్ట్రంగా మారాలి అనడం కంటే దోమల మీద అవగాహన పెరిగిన రాష్ట్రంగా తయారు కావాలి. దోమలన్నింటినీ చంపేయటం పరిష్కారం కాదని మనం గ్రహించాలి.    --- virinchi virivinti

No comments:

Post a Comment