Tuesday, 31 January 2017

Radheya Kavithwa sandarbham

ముందు తరాల రిఫరెన్సు కోసం నేటి కవిత
...................................................

గతం ఒక స్వప్నంలా గోచరిస్తుంది. మనసులో రికార్డు అయిన గతం తాలూకు ప్రతీ చిన్న అనుభవమూ మనిషిని ఏదో ఒక సమయంలో నులిపెట్టి బాధిస్తుంది. గతం తాలూకు అనుభవం ఎప్పటికీ కనులముందు నిలిస్తే బాగుంటుంది అనిపిస్తుంది. కానీ అది అవాస్తవం. ప్రస్తుతమే గతం తాలూకు అనుభూతిని పట్టుకుంటుంది. కానీ ప్రస్తుతం గతంలా మారే వేగం దాని డైనమిక్స్ ఆధారంగా మనిషి మనసు ఫ్యూచర్ షాక్ కు గురవుతుందా లేదా చెప్పవచ్చు. వేగంగా మారుతున్న పరిస్థితులు, మనుషులు ఊహా శక్తి వేగం కంటే మించిపోయినపుడు, అనుభవించే మానసిక నిష్ఫలతనే ఫ్యూచర్ షాక్ అని చెప్పవచ్చు.

 గ్రామాలలో సంస్కృతి ఒక రకంగా ఉంటే, పట్టణాల సంస్కృతి ఇంకో రకంగా ఉంటుంది. పూర్తిగా పల్లెల్లోనే జీవించే వారుగానీ, పూర్తిగా పట్టణాల్లోనే నివసించేవారుగానీ ఎటువంటి సాంస్కృతిక అఘాతానికి గురి అయ్యే అవకాశం ఉండదు. కానీ పల్లెనుండి పట్నానికి వలస వచ్చినవారు లేదా పట్నం నుండి పల్లెకు తరలిన వారు ఒక తాత్కాలికమైన సాంస్కృతిక అఘాతానికి గురౌతారు. ఇదిలా వుంటే ఒకప్పుడు పల్లెగా ఉన్న తన వూరిని చాలా కాలం తరువాత చూద్దామని వెల్లిన కవి రాధేయ తన పల్లె పల్లెలాగా లేకపోవడం చూసి ఒక అఘాతానికి గురౌతాడు. అదే ఒక కవితగా మనముందుంచుతాడు. ఒక ఆత్మాశ్రయ నష్ట భావన, ఆత్మనుండి దూరంగా జరిగిన భావన, ఒంటరితనమును అనుభవిస్తాడు. ఒక నోస్టాల్జియాలో కాసేపు సేదదీరుతాడు. ఈ లక్షణాలనన్నింటినీ ఫ్యూచర్ షాక్ అనవచ్చు. రాధేయ కవిత చదివేటపుడు మనమూ దాని బాధితులమని గుర్తించగలుగుతాం. అంత సున్నితంగా కవితలో మనసును వ్యక్తపరుస్తాడు.

నేనెక్కడికి వచ్చాను? నేనెక్కడున్నాను? అనటం ద్వారా టైం అండ్ స్పేస్ తో పూర్తిగా విడిపోయిన ఒక మనస్తత్వ స్థితిని చూపిస్తాడు. ఊరు పరాయిదైపోవడం, ఊరికి తాను పరదేశీయుణ్సైపోవడం, వాస్తవిక స్థితిలో ఇమడలేకపోవడం, ఏలియనేషన్ ని అణుభవించటమూ కనిపిస్తుంది. ఇటువంటి మనసు ఒక నిష్ఫలతను తనలోపల దర్శిస్తుంది. అందుకే అంటాడు కవి ఆత్మను కోల్పోయిన సౌందర్య వాదినని. ఇండస్ట్రియలైజేషన్, మోడర్నైజేషన్, గ్లోబలైజేషన్ ఒకదానితరువాత ఒకటి తరంగాలుగా ప్రవహిస్తూ, మనిషి ఆశించినట్టు కాకుండా ఇంకో విధంగా పల్లె స్వరూపం మారిపోతుంటే, మార్పుకు తగ్గ మానసిక సంసిద్ధతను మనిషి పొందలేనపుడు పొందే ఫ్యూచర్ షాక్ స్వరూపాన్ని కవితలా మలచటం బహుశా దాచుకోతగ్గ అద్భుతమైన సంపద కావచ్చు. సంవత్సరం నాటికి భారత దేశంలో దాదాపు యాభైఐదు శాతం ప్రజలు నగరాల్లో నివసిస్తారని లెక్కలు గట్టారు. వేగంగా నగరీకరణలు చెందుతున్న ఈ దశలో,ఈ మార్పుకు తగ్గ సంసిద్ధతను ఏర్పరచుకోని ఇప్పటి మానవుల మనోస్థితులు ఏమిటో బహుశా ముందు తరాలవారికి ఉపయోగపడుతుందేమో...

సౌందర్య రాహిత్యంలో...
                   రాధేయ

అమాయకత్వానికి
అచ్చమైన ఆకృతిలా
ఇక్కడో పల్లె పట్టు వుండాలి
ఇప్పుడు కనిపించదేమిటి?

ఈ కొండల కోనల గుండెల్లోంచీ
వడివడిగా దూకే జలపాతముండాలి
అది మా బాలమూకకు
స్నాన ఘట్టమై తపన తీర్చేది
ఇప్పుడది అదృశ్యమైపోయిందా?

ఇక్కడే ఈ చీలిన కాలిబాటలో
ఓ మాతృమూర్తి నిలబడి
తన నుదురుకు చేయి అడ్డం పెట్టుకుని
పనికోసం పట్నం వలస బోయిన
కన్న పేగు కోసం ఎదురు చూసేది
నే నా బాట మీద నడిచినప్పుడల్లా
దుమ్మురేగిన ఆమె పాద ముద్రలు
వెన్నెల చేతి కర్రల్లా
నా వెన్నంటే నడిచేవి

నేను పట్నం బస్సుదిగి
ఆ మిట్ట పల్లాల మీద నడుస్తుంటే
గొల్ల గురవయ్య కూతురు ఎదురొచ్చి
నాచేతుల్లో బరువంతా తానే మోసేది

ఆ పిల్ల రెండు భుజాల మీద
చిరిగిపోయిన ఆ చోళీ
చిగురేసిన మా స్నేహాన్ని
ఎగతాళి చేసేది
ఓ బుజ్జి మేకపిల్ల
ఆ పిల్ల పరుగుతో పోటీ పడేది
ఇప్పుడా గుడిసేదీ?
ఆ గొల్ల గురవయ్యేడీ?
ఆ మేకపిల్లా, ఆ కన్నె పిల్లా
కన్పించదేమిటి?

సాయం సంధ్య బూడిద రంగులోంచి
పొగడపూల పొదల్లోంచి
నాటి స్వాప్నిక దర్శనం
నేడు గగనమై పోయిందా?
నేనెక్కడికి వచ్చాను?
నేనెక్కడున్నాను?

ఒంటెద్దు బండిలోంచి
నగరం నాగరికతలోకి దొర్లిపోయాక
నా ఊరే నాకు పరాయిదైపోయిందా?
నేను నాఊరికే పరదేశినయ్యానా?
ఇప్పటికీ
నా శ్వాస నా పల్లెది
నా ప్రాణం మాత్రం పట్నంది
నిజం చెప్పనా...
నేనిప్పుడు
ఆత్మను కోల్పోయిన
సౌందర్య వాదిని !!

1-2-17
(కవిత్వ సందర్భం 31)

Tuesday, 24 January 2017

కామిడీ బిట్స్ ఆఫ్ శాతకర్ణి.

క్రిష్ బాలయ్యకు ఏమి చెప్పింటాడు....

మీరైతే ఆపకుండా కత్తి తిప్పుతనే ఉండండి, నేను రెండు మూడు యాంగిల్స్లో కేమెరాలు పెట్టుకుంటాను..
కత్తి తిప్పి తిప్పి చేయి నొప్పెడితే తొడగొట్టండి...
రెండు చేతులూ నొప్పెడితే రెండు తొడలూ కొట్టుకోండి...ఓకేనా..
కేమెరా రోలింగ్, యాక్షన్.

నీవు చాలా తెల్లగా ఉన్నావ్..అచ్చం గ్రీకు వాడిలా....నిన్ను ప్రతి యుద్ధం సీనులో చంపుతాడు మా హీరో...రక్తం కక్కుకుంటా సచ్చిపోవాలి నీవు...ఓకేనా?

గ్రీకు వీరులకు మన చావు దెబ్బ అర్థం కాకూడదు...
ప్రేక్షకులకు సినిమా అర్థం కాకూడదు.

ఉంగరం ఉండే చేతితో భుజం మీద కొడితే, కాలకూట విషం శరీరమంతా పాకుతుంది.
కాలకూట విషం ఎక్కగానే శరీరం బిగుసుకుపోతుంది. నోటినుండి నురుగు రావడాలూ, ఆ టైములో సెంటిమెంటు డైలాగులూ పాతకాలం విషయాలు. కాబట్టి ఇపుడు కొత్తగా తీద్దాం..శరీరం బిగుసుకు పోవడం, సెంటిమెంటు డైలాగులు లేకుండా, మాట పడిపోవడం పెడదాం...ఏమంటారు?.

తమలపాకుల్ని వంటి నిండా కప్పి, వాటిమీద పచ్చగడ్డి చల్లుతా వుండాలి...వాటి మీద అపుడపుడూ నూనె పోస్తూ ఉండాలి...అపుడు వంట్లోకి ఎక్కిన విషం దిగిపోతుంది.

శాతకర్ణి గురించిన కథ ప్రజలకు చెప్పటానికి ఒక వేదిక ఉండాలి. అది హరి కథో, బుర్ర కథో, ఒగ్గు కథో ఎవరికీ అర్థం కాకూడదు. పదిహేడో శతాబ్దంలో పుట్టిన కథాకలి నృత్యకారులు రెండో శతాబ్దంలోనే ఉన్నట్టుగా మనం చూపించాలి. వాల్లంతా కథాకలి నాట్య ఆహార్యంలో ఆ పాట పాడేవాడి పక్కన ఉంటారంతే...అప్పటికింకా కథాకలి పుట్టలేదని ఆ విధంగా తెలియజేస్తాం..ఓకేనా..?

Tuesday, 3 January 2017

అద్దంలో మనిషి ll మైఖేల్ జాక్సన్ ll
-------------------------------------------

ఒక్కసారిగా నా జీవితంలో
మార్పు వచ్చెయ్యాలని అనుకుంటాను

ఆ మార్పు ఎంతో హాయి గొల్పాలనీ,
ఎంతో విభిన్నంగా ఉండాలనీ
అన్నింటినీ సవ్యంగా చేసేయ్యాలనీ కోరుకుంటాను

ఒక మంచు కురిసే ఉదయం పూట
నా చలి కోటు కాలర్ ని పైకి లాగినపుడు
చెవిలోకి దూరే గాలి కోరుకునే మార్పే అది.

పసిపిల్లలు వీధుల్లో చేరి
పస్తులు పడుకుంటుంటే..
వారి అవసరాలని పట్టించుకోనంత
గుడ్డి వాడిలా బతికేయటానికి..
నేనెవర్ని?

వాళ్లు కోరుకునేదంతా
తమని పట్టించుకోని వేడి వేసవినీ
మూతమూసిలేని నీళ్ల బాటిల్ నీ
తోడుగా ఒక మనిషి ఆత్మనీ
అంతే కదా!!

వారంతా ఒకరినొకరు అనుసరిస్తూ
అక్కడక్కడే నడుస్తుంటారు
అచ్చం ఈ గాలి లాగే...
ఎందుకంటే ఇంటికి పోవడానికి
దాక్కోవడానికి వాళ్లకు ఏమున్నదని?

అందుకే నేను నిన్ను తెలుసుకోమంటాను
అద్దంలో కనిపించే మనిషితో నేను మొదలు పెడతాను
పద్దతులు మార్చుకోమని అతడినే మొదట అడుగుతాను
ఇంతకు మించిన స్వచ్ఛమైన సందేశమేదీ లేదంటాను
ఈ ప్రపంచం నివాస యోగ్యంగా కావాలంటే
నిన్ను నీవు మొట్టమొదట చూసుకోవాలంటాను
మార్పు నీలోనే రావాలంటాను

ఒప్పుకుంటాను
నేనొక స్వార్థ పూరితమైన ప్రేమ బాధితుడను
కానీ ఇక్కడ కొందరు ఉండడానికి ఇల్లు లేకుండా
నయా పైసా అప్పు పుట్టకుండా ఉన్నారే..
ఇది నేనేనా...
ఈ కొద్దిమంది మాత్రమే ఇలా ఒంటరిగా జీవిస్తున్నారని
నటిస్తున్నది నేనేనా..

లేలేత తొలి చిగురుకు ఐన లోతు గాయం
ఇంకెవరిదో పగిలిపోయిన హౄదయం
ఇంకొక తుడిచిపెట్టుకుపోయిన స్వప్నం
ఇవన్నీ గాలిలాగా తరలిపోతుంటాయి ఎందుకో తెలుసా.?
వాటికుండటానికి ఈ ప్రపంచంలో స్థానమెక్కడని?.
అందుకే నేను నాతో మొదలు పెడతాను
అద్దంలో కనిపించే మనిషితోనే నేను మొదలు పెడతాను
పద్దతులు మార్చుకోమని అతడినే మొదట అడుగుతాను

నీకింకా సమయముంది కాబట్టి
నీవిప్పుడే ఆ పని చేయాలి
హృదయాన్నెపుడో మూసుకున్న నీవు
ఆలోచించే నీ మనసునైతే మూసుకోలేవు కదా..!

ఆ మనిషిని
ఆ మనిషిని
ఆ మనిషిని
అద్దంలో కనిపించే ఆ మనిషిని
పద్దతులు మార్చుకోమని అడుగుతాను

నీవే నీవే నీవే
ముందుకు కదలాలి సోదరా
లే లేచి నిలబడు
లే లేచి నిలబడు
లే లేచి నిలబడు
లేచి నిలబడి నిన్ను నీవు నిలబెట్టుకో సోదరా

నీకు తెలుసు
నీకు తెలుసు
నీకు తెలుసు
ఈ మార్పేంటో నీకు తెలుసు
మార్చివేసేయ్ సోదరా..!!

(Micheal jackson " Man in the mirror" కి స్వేచ్చానువాదం.)
26-11-16
విరించి ll చాక్లెట్ తీపి ll
--------------------------------

చిట్టి చేతులను ముందుకు చాపుతూ
నా చెల్లెలి కూతురు అడుగుతుంది..
"మామా..! చాక్లెట్ కోనీయ్యవా" అని.

ఒక అమాయకపు లోకం లోంచి
ఈ లోకం లోకి తొంగి చూస్తున్నట్టు
తను చూసే చూపుతో..
నాలో ఎన్నెన్ని ప్రశ్నలుదయిస్తాయో..!

ఐదు రూపాయల ఓ చిన్న చాక్లెట్...
తన ప్రపంచాన్నంతా ఆనందంగా మార్చేస్తుందంటే...
ఆనందం తనలో ఉందో చాక్లేట్లో ఉందో అర్థం కాకుండా ఉంటుంది.
బాల్యంలోని తీపినంతా నాలికమీద ఆ చిన్నారి చప్పరిస్తుంటే
పెద్దగైపోయామని, తీపిని మనం అసహ్యించుకోవడంలో
అర్థమే లేదనిపిస్తుంటుంది.

ఈ పసిపిల్లల ఆనందాన్ని
ఐదు రూపాయలకూ
పదిరూపాయలకూ
చాక్లెట్లలా అమ్ముకునే దౌర్భాగ్యుడెంత ముసలివాడయ్యుంటాడో
బాల్యాన్నెంతగా మరచిపోయుండి౦టాడో..
బతుకు తీపిని ఒకరికొకరు పంచుకోవడం
పసి పిల్లలకు మాత్రమే తెలుసిన రహస్యం.

చాక్లెట్ ని బుజ్జి నాలుకకూ, బుజ్జి పెదవులకూ
తీయటి మకరందంలా అంటించుకుని, పాప అంటుందీ...
"మామా..! నన్ను ఎత్తుకోవా"  అని.
చాక్లెట్ల కంపనీని భుజాలకెత్తుకున్నాననే భావనని
ఆ చిట్టి తల్లి తేలిక శరీరం
ఒక్క క్షణంలో తేలిక చేసేస్తుంటుంది.

27/11/16
విరించి ll ఒక ఆకాశం, నా దుప్పటి ll
............................................
అచ్చం ఈ రోడ్డులాగే
అర్ధరాత్రి
నీవూ ఒంటరివౌతావని తెలుసు
ఒకరికొకరు తోడుగా పడుకుని
చలి తీవ్రతకు నిశ్శబ్దాన్ని కప్పుకున్నారనీ తెలుసు

మనుషుల ఉనికి రోడ్డుమీద పారే సమయాల్లో
మనుషుల నీడల మధ్యన
నీ ఒంటరితనం జారిపోతున్న సమయాల్లో
ఎంతటి ప్రాణాన్ని నీవు రోడ్డులో కనుగొన్నావో...
అర్ధరాత్రి దానితోనే జతగడతావు

పగలంతా వెతికిన ఆకలిని
రాత్రి నిద్దురలో పట్టుకోవాలంటే...
ఒంటరి రోడ్డును మించిన జతగాడు నీకింకెవ్వరని?

వెల్లకిలా పడుకుని
చేతుల్ని మెత్తలాగా తలకింద పెట్టుకుని
నక్షత్రాల్ని కళ్లలోకి దింపుకోవాలంటే...
నీవెంత ఆకాశానివయ్యుంటావో నేనూహించగలను

మిత్రమా..!
నీ దగ్గరికి నన్నూ అనుమతించు
నక్షత్రాల్ని అక్షరాలుగా పట్టుకుపోతాను
నా దుప్పటిని ఆకాశానికి కప్పిపోతాను.

5/12/16
విరించి ll సాల్ సాల్ తీయ్ ll
..............................
తవ్వితే అది సింగరేణి ఊట
పాడితే అది పచ్చి బాలింత పాట
విప్పితే అది బంగారు మూట
అదంతా..
మూర్ఛనలు పోతున్న రుద్రవీణ

అన్నా..కులీ కుతుబ్ షా!!
నీ దిగులిక్కడ మూసీలా పారుతోంది
అవున్నిజం..
అడుగంటిన ఎండ
నిండుకున్న వాన
చెమ్మగిల్లిన సాయంత్రం
సూదులుగుచ్చే ఉషోదయం
నెర్రలీనిన నేలమీద
చచ్చిపోయిన ఓ వెచ్చని కల
దబ్బనాలు గుచ్చుకున్న నాలిక కథ మాది.
ముక్కుమూసుకుంటే ఓ తపస్వి
కళ్లు మూసుకుంటే ఓ కళా రవీ పవీ

ప్రశ్నను చూశావా?
కొడవలిలా కనిపిస్తోంది కదూ..!
దాచి పెట్టుకో తమ్ముడా..పంటకోతకు పనికొస్తుంది.
కాంతెందుకు అబద్దం చెప్పదనుకుంటావో..
నీ నీడ పొడవే సాక్షం.
రెండు సంవత్సరాల ఉదయం కదరా ఇది..!
నీ కాలికింద నక్కి కూచున్న నీడెవరిదని?

అది ఏడుపేనా
చెఱువుకు గండి పడినట్లు?.
మనదంతా
ఎడతెరిపిలేని వానంత నిద్ర కదరా..!
ఉన్న అన్ని భయాలూ మేల్కొంటే...
కనికరం లేని పగలు
సగం భయాలు మేల్కొంటే...
రాత్రి నిద్దురలో కల
ఉరుముల పిడుగుల కల
రాత్రీ పగలుల నిద్ర.
గడియారం ముల్లు గుచ్చుకున్న గాయం.

దండలేసుడు దండాలు పెట్టుడు
ఇంటి మూలల మీద పునాదులిప్పుడు
యజ్ఞాల్జేసుడు..
అతికారం మీద తీపి పూత పూసుడు
సాల్ సాల్ తీయ్..!
నమ్మకమీనేల మీదుంది గదా..
రిలయెన్సెందుకు తీయ్.

7/12/16
పడగొట్టు  || మేఖేల్ జాక్సన్ ||

_________________________________

వాళ్లు నిన్నెపుడూ ఇటు వైపు రావద్దంటారు
నీ ముఖం వాళ్ళకి చూపొద్దనీ
నీవు వాళ్ళకి కనిపించొద్దనీ అంటారు.
వాళ్ల కళ్ళల్లో నిప్పులుంటాయి
వాళ్ల మాటలెంతో స్పష్టంగా ఉంటాయి
నీవు దాన్నంత పగలగొట్టంతే...వారినంతా పడగొట్టంతే..

ఎప్పటిలాగే, నీవు వీలైతే పారిపో
ఏం చేయాలనుకుంటే అది చెయ్యి
రక్తం చూడాలనుకోకు
నీ సాహసం చూపాలనుకోకు...నీ ఇష్టం.
కానీ చెడుగా ఉండాలనుకుంటే మాత్రం
పగలగొట్టు...వారినంతా పడగొట్టు.
శక్తిమంతంగా ఉండు.
ఏం చేయాలనుకుంటావో అదే చెయ్యి.
ఎందుకంటే
ఎవరూ ఓడిపోవాలనుకోరు కదా నేస్తం.
నీవెంత అల్లరోడివో...
నీ పోరాటమెంత బలమైనదో
చూపాలంటే
తప్పొప్పుల పట్టింపెందుకని?
పగలగొట్టంతే...పడగొట్టంతే..

వాళ్లు నిన్ను పట్టుకోగలిగినపుడు
వీలైతే పారిపో..
పిల్లవాడివి కాదు కదా నీవు
బలమున్న మనిషివి కదా..
నీవు జీవించి ఉండాలనుకుంటే..
నీవేం చేయగలుగుతావో అదే చేయి.

నీవు వారికి భయపడటం లేదని
నీవు వారికి చూపాల్సి వుంటుంది
నీవు నీ జీవితంతో ఆడుకుంటున్నావు
ఇదేమీ అబద్దం కాదుగా, పిరికితనం కాదుగా
వాళ్లు నిన్ను కొడతారు..తంతారు
ఆపై నీతో అంతా బాగుందంటారు
కానీ నీవు చెడుగా ఉండాలనుకుంటే మాత్రం
పగలగొట్టు..వారినంతా పడగొట్టు.
ఎందుకంటే
ఎవరు ఓడిపోవాలనుకోరు నేస్తం
నీవెంత అల్లరోడివో
నీ పోరాటమెంత బలమైనదో
చూపాలంటే
తప్పొప్పుల పట్టింపెందుకని?
పగలగొట్టంతే....పడగొట్టంతే.

14-12-16

(మైఖేల్ జాక్సన్ Beat It పాటకు స్వేచ్ఛానువాదం
పాప్ కింగ్ మైఖేల్ జాక్సన్ పుట్టినరోజు శుభాకాంక్షలు)
విరించి ll  జ్వరం   ll
..................................
మూడు నాలుగు రోజులు సాగే
ఎడతెగని ధ్యానం జ్వరం.
దుప్పటికింది యోగనిద్ర
అందుకే, జ్వరమంటే నాకిష్టం.

బ్యాక్టీరియా వైరస్లు సరిహద్దు రేఖలు దాటినపుడు
శరీర భాగాల్లోకి చొరబాట్లు చేస్తున్నపుడు
ఇంటర్ల్యూకిన్లు, సైటోకైన్లు వంటి పటాలాన్నంతా
శరీరం తరలించటమే జ్వరం.
అందుకే జ్వరమొక యుద్ధవాతావరణం.
శారీరక అత్యయిక స్థితి.
ఎప్పటిలాగే యాంటీ బయాటిక్స్ అస్త్రాలను
విదేశాలు మనకమ్మాలి
బతకాలంటే
మనం తప్పక కొనుక్కోవాలి.

మనిషి శక్తి హీనతను
మాటిమాటికి గుర్తు చేస్తుంది జ్వరం.
బయటి శత్రువుల దాడికి
అంతర్ శత్రువులు భయపడినట్లు
బ్యాక్టీరియాల దాడికి
అరిషడ్వర్గాలు కుదేలవుతుంటయి.
మనసేలేని నిద్ర పోవాలంటే
జ్వరం రావాల్సిందే అపుడపుడూ.

భార్య, అమ్మ, నాన్న
చీమలవలె
మంచం పక్కన చేరి
అనుష్టుప్ ఛందస్సులో
కరుణరస వల్మీకాలు కడతారు.
ఇంటింటి రామాయణం కదా జ్వరం.
మాకు జ్వరమే రాదనే వారెంత దురదృష్టవంతులో..!

చలి తలనొప్పి జలుబు
రొంప వాంతులు
కడుపు నొప్పి వంటి నొప్పులు
ఇంకా ఎంతెంతమంది మిత్రులో..
ఈ ప్రియమైన శత్రువుకి.
శరీరాన్ని బార్ అండ్ రెస్టారెంటనుకున్నయేమో...!
మూకుమ్మడిగా చేరి రక్తాన్ని స్టఫ్ఫులాగా లాగిస్తుంటాయ్.
ఆఫీసుకు డుమ్మా మనది, సోకు వాటిది.

'మరేం భయం లేదులే' అంటాడో డాక్టరు
జ్వరం అందించే ఏకాంతపు రుచి మరిగినట్టుగా..
జ్వరాన్ని ఎంజాయ్ చేసేయమంటాడు.
యాంటీ బయాటిక్ యుగంలో జ్వరమిపుడు
తీవ్ర అస్వస్థతే కాదసలు..
మనసునీ శరీరాన్నీ ఐక్యం చేసుకోవటానికి దొరికే
మూణ్ణాలుగు రోజుల అవకాశం, అందుకే....
చుట్టపు చూపులా అపుడపుడూ వచ్చిపోయే
జ్వరమంటే నాకిష్టం.

 29-12-16
We the Indians
---------------------------

ఊపిరి అని ఒక సినిమా వచ్చింది. దాంట్లో హీరోకి ఒక యాక్షిడెంట్ జరిగి, కాళ్లూ చేతులు చచ్చుబడి ఉంటాయి. అయినా గానీ పారిస్ లో తన అసిస్టెంట్ ని కార్ వేగంగా పోనీయమని పురిగొల్పుతాడు. తద్వారా ఒక కార్ రేస్ లో గెలుస్తాడన్నమాట. అది మన హీరోయిజం. సివిక్ సెన్స్ ఏ మాత్రం లేని హీరోయిజం. వేగంగా పోవటం, రేసుల్లో గెలవటం ఇంతకు మించిన హీరోయిజం మనకు తెలియదేమో. మనకు అంటే భారతీయులకు. ప్రపంచంలో అతి తక్కువ సివిక్ సెన్స్ ఉన్న దేశాల్లో భారతదేశం కూడా ఒకటి. తాగి డ్రైవ్ చేయకండి అని చెబితే "మరి ప్రభుత్వం మందెందుకు అమ్ముతుందట?" అని అడిగే తెంపరితనం బహుశా మనకే సొంతం.

సివిక్ సెన్స్ అంటే సభ్యత. సామాజిక సభ్యత. సభ్యత లేని సంస్కారం మనలేదంటాడు సంజీవ్ దేవ్. సభ్యతలో బాధ్యత ఒక అంశం మాత్రమే. సమాజంలోని అందరి విలువలనూ గౌరవించడం, అందరి ఇబ్బందులనూ గుర్తించడం అన్నది సభ్యత. సమాజంలో నేనేవిధంగా ఒక సభ్యుడినో, నా తోటి వారందరూ కూడా సభ్యులే, నాకెటువంటి ఇబ్బందులు, సమస్యలుంటాయో, తోటి వారికి కూడా అలాంటివే ఉంటాయనే స్పృహ సభ్యత కలిగిస్తుంది. సంస్కారం మానసికమైనది. సభ్యత భౌతికమైనది. గొప్ప సంస్కారం ఉండిండవచ్చు. కానీ సభ్యత లేకపోతే ఆ సంస్కారానికి అర్థం లేదు. ఒక గొప్ప ఆధ్యాత్మిక వేత్త ఉన్నాడనుకుందాం. అందరినీ సమ దృష్టితో చూడగల గౌరవించగల సంస్కారం ఉండిండొచ్చు. కానీ అతడు నగ్నంగా ఉండిపోతాను అని అందరికీ ఇబ్బంది కరంగా తయారైతే?? సభ్యత లేనట్టే. గాంధీజీకి కూడా సంస్కారం ఉంది తప్ప, సభ్యత లేదంటాడు సంజీవ్ దేవ్. పది మందిలో ఉన్నపుడు నోరంతా తెరిచి ఒక రకమైన శబ్దంతో ఆవులించడమూ, మీదనే దగ్గడమూ వంటివి మహామహులనుకున్నవారు కూడా చేస్తూ ఉంటారు. వాడు మహామహుడైనందుకు వాడి నోటి కంపును మనలాంటి అల్పులు భరించాలన్నట్టు ఉంటుంది.  హోటళ్లలో చేతులు కడుక్కుందామని పోయామంటే..తప్పని సరిగా ఎవరో ఒకరు నోట్లో నీళ్ళు పోసుకుని పక్కవాడికి తుంపర్లు వచ్చి పడేలా తుపుక్కున ఉమ్మడమో, లేక గట్టిగా చీదటమో చూస్తుంటాం. ఇక బయట పెట్టే ఛాయ్ బండ్ల దగ్గర ఛాయ్ తాగుతూ  తాగుతూ  పక్కనే ఉమ్మేస్తుంటారు. అపార్ట్మెంట్లలోకి నడిచి పోయారంటే తెలుస్తుంది, మనదేశం ఎన్ని కిల్లీల్ని అమ్ముతుందో. ఇటువంటి చర్యలు ఎంత జుగుప్సాకరంగా ఇబ్బందికరంగా ఉంటాయో కనీసం అవగాహన కూడా లేనివారు మనదేశంలోనే ఉంటారు.

మన సామాజిక జీవితం లో ఉండవలసిన నాణ్యత పతనస్థాయికి చేరింది. ఒక రాజకీయ నాయకుడి విలువలూ, ఒక పోలీసు ఆఫీసర్ విలువలూ, ఒక క్రిమినల్ విలువలూ, ఒక కామన్ మ్యాన్ విలువలూ అన్నీ ఒకే రకంగా ఉంటున్నాయి. రోడ్లమీద పసి పిల్లలకు పెద్ద పెద్ద బైకుల్నిచ్చి పంపే తల్లిదండ్రులున్నారు. ఇరుకుగా ఉండే రోడ్డు మీద కూడా హీరోయిజం చూపి, అందరికంటే ముందు వెళ్ళిపోవాలనే తెలివి తక్కువ పెద్దవారూ ఉన్నారు. ఇరుకు సందుల్లో ఒక నిముషం పక్కకు ఆపుకుని నిలబడితే ఎవరికీ ఇబ్బంది లేకుండా వాహనాన్ని ముందుకు తీసుకుని పోవచ్చు. కానీ అప్పటికప్పుడు తమ ఆధిపత్యం చూపించాల్సిందే. ట్రిపుల్ రైండింగ్ ఎందుకు చేస్తున్నారని అడిగిన పాపానికి ఎమ్మెల్యే మనిషినే అడుగుతావా అని పోలీసులనే చేయి చేసుకుంటున్నారంటే, మనలో సివిక్ సెన్స్ ఎంత దిగజారిందో అర్థం చేసుకోవాలి. బయటి దేశాలనుంచి వచ్చే అతిథులకు రోడ్ల మీద మన పోకడలు భలే విచిత్రంగా అన్యాయంగా తోస్తాయిట. సింగపూర్లో సెటిలయిన ఒక మిత్రుడు ఈ మధ్య కలవడానికని ఫోన్చేశాడు. ఐదు నిముషాల్లో వస్తానన్నవాడు అర్దగంట తరువాత వచ్చాడు. చేతులకు, ముఖానికి రక్తం అంటి వుంది. వివరాలడిగితే రోడ్డు మీద అకారణంగా అతడిని కొట్టారుట. ఎడమ వైపుపద్దతిగా అతడు కార్లో వస్తుంటే, సడన్గా, ఇండికేటర్ లేకుండా తిరిగిన ఇంకో బడా బాబు కారును కంట్రోల్ కాక గుద్దేశాడట. చిన్న డామేజ్ మాత్రమే అయింది. కానీ మూల్యం మాత్రం- ఇతడి కాలర్ పట్టుకుని, అమ్మనా బూతులూ తిట్టి, దవడ పగలగొట్టి, నానా హంగామా చేసి పంపించారట. అతడు చాలా సేపటి వరకూ షాక్ నుండి కోలుకోలేకపోయాడు. అతడి తప్పేమీ లేదని అందరికీ తెలుసు. ఆ గొడవ చేసిన వ్యక్తి కూడా "హై లీ ఎడ్యుకేటెడ్" లాగే ఉన్నాడట, సూటూ బూటూ వేసుకుని 'ఆడీ' కారులో. కానీ ప్రవర్తన?. ఇదే సింగపూర్లో అయితే ఏమి జరిగేదని నేను అడిగాను అతణ్ణి.

" ఇలా ఖచ్చితంగా జరగదు బాస్. అక్కడ సివిక్ సెన్స్ ఎక్కువ. అసలలాగా అడ్డందిడ్డంగా రోడ్డు మీద నడపడం ఏమీ ఉండదు. వేగం లిమిట్ దాటితే, వెంటనే పోలీస్లు వెంటపడి పట్టుకుంటారు. ఒక వేళ యాక్సిడెంటు జరిగితే ఐదు నిముషాల్లో పోలీసులు అక్కడికి వచ్చేస్తారు. ఆక్సిడెంటు చేసిన, చేయబడిన వారు ఇక్కడిలాగా తిట్టుకోవడాలు, కొట్టుకోవడాలూ ఉండవు" అంటూ చెప్పాడు. ఆక్సిడెంట్ చేసిన వాడే వెంటనే కారు దిగి 'అయాం రియల్లీ సారీ...ఐ కుడ్ నాట్ కంట్రోల్ ది స్పీడ్ ఇన్ టైం' అని చెప్పేస్తాడట. అవతలి వ్యక్తి కూడా, "తప్పలు చేయటం మానవ సహజం కదా" అన్నట్టు వ్యవహరిస్తాడట. యాక్సిడెంటులో ఇంకో వ్యక్తి చనిపోయినాగానీ, మనుషుల పట్ల ఇలా పగ పట్టడాలూ, దురుసుగా ప్రవర్తించడాలూ ఉండవట. ఒకరినొకరు గౌరవించుకోవటం, అర్థం చేసుకోవటం అక్కడి సమాజంలో అంతర్భాగమై ఉంది. ఇక్కడ-, మనం మాత్రమే రాజులం, తక్కిన వారందరూ మూర్ఖులే.

ఇపుడు స్వచ్ఛ భారత్ అని గవర్నమెంటు చేస్తున్న హడావుడిలో ఈ సామజిక సభ్యత అంశం మచ్చుకు కూడా కనిపించదు. ఎలా ఉపయోగించాలో తెలియని ప్రజలకు రోడ్లను ఎంత శుభ్రంగా ఉంచినా ఏమీ ప్రయోజనముండదు. అటు ప్రభుత్వం కానీ, ఇటు మీడియా మేధావులు కానీ, ప్రజలలో సివిక్ సెన్స్ పెంచే ప్రయత్నం ఏమీ కనిపించదు. యాక్సిడెంటయితే, పోలీసులకంటే ముందు, ఆంబులెన్స్ కంటే ముందు, మీడియా అక్కడ ఉంటుంది. నెత్తురోడుతున్న బాధితులముందు మైక్ పట్టుకుని ప్రశ్నల వర్షం కురిపిస్తుంటుంది. అది బ్రేకింగ్ న్యూస్ లాగా చూడటంలో మనకు సివిక్ సెన్సు ఎంతుందో చెప్పవచ్చు.  నోబెల్ బహుమతి గ్రహీత, నేచురలిస్ట్, కోనార్డ్ లోరెంజ్ అంటాడు " I believe, I have found the missing link between animals and civilized man- it is We"  అని. నిజానికి మనం తెలుసుకోవాస్సింది, ఇట్ ఈజ్ వుయ్, ద ఇండియన్స్ అని.

30-12-16
Morality of Film Dangal
----------------------------------------

దంగల్ సినిమా చూశాక పేరెంట్స్ తమ పిల్లల్ని తాము అనుకున్నట్టుగా తయారు చేసుకోవచ్చా, లేక పిల్లలకు ఇష్టమైన ఫీల్డ్ లోకి వెల్లగలిగే స్వాతంత్ర్యం ఇవ్వాలా? అనే మోరల్ ప్రశ్న ఒకటి ఉదయించింది. తండ్రులు ఏదైతే తాము జీవితంలో కాలేక పోతారో, అదే తమ పిల్లల చేత సాధింపజేయటం ఎంత వరకు సమంజసం?. ఈ సినిమాలో తండ్రి పాత్ర ఆమీర్ ఖాన్ తన ఇద్దరు ఆడపిల్లల్నీ ఇంటర్నేషనల్ రెస్లర్స్ గా తయారు చేయటం కనిపిస్తుంది. గీతా కుమారీ, బబితా కుమారీ అనే రెస్లర్ల నిజ జీవిత చరిత్ర నుండి ప్రభావితమైన సినిమా ఇది. నిజ జీవితం నుండి ప్రభాహవితమయ్యింది కనుక ఇక ఇందులో చూపిందంతా నిజమే అనుకోవడానికి ఏమీ లేదు. కఠినంగా ఉంటూ ఇద్దరు చిన్నారులను ఛాంపియన్లుగా తయారు చేయడం ఈ సినిమా ప్రధాన ఇతివృత్తం. "తయారు చేయడం" అంటే వారు మనుషులు కాదనేగా..? నిజానికి ఇలా తయారు చేయకుండింటే వాళ్లు స్వతహాగా ఏమై ఉండేవారు..? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఒకవేళ తండ్రి పాత్రధారి మాజీ ఛాంపియన్ కాకుండా ఉండింటే, తమ పిల్లలను ఎటు వైపుగా "తయారు చేసి" ఉండేవాడు?. డాక్టర్ సంతానం డాక్టర్లు కావడం, రాజకీయ నాయకుల సంతానం రాజకీయ నాయకులు కావడం, సినిమా హీరోల సంతానం సినిమా హీరోలు కావడం, అలాగే ఈ సినిమాలో ఛాంపియన్ల సంతానం ఛాంపియన్లు కావడం తప్ప కొత్తగా ఏముంది?. దానిలో తప్పు లేదనుకుంటే "తయారు చేయటం" లో ఏమున్నట్టు?

పేరెంట్స్ తమ సంతానాన్ని స్వతహాగా స్వేచ్ఛగా ఎదగనీయాలా? లేక తాము అనుకున్న విధంగా, తాము కలలుగన్న ఫీల్డ్ లోకి బలవంతంగా పిల్లల్ని తోసేయాలా?. ఈ సినిమా గెలిచిన ఛాంపియన్ల గురించి మాత్రమే చూపిస్తుంది. ఇదే కాదు, ఏ సినిమా ఐనా అంతే.  ఇష్టం లేని ఫీల్డ్ ని పేరెంట్స్ బలవంతం మీద ఎంచుకుని చతికిలపడుతూ  జీవితాల్ని గడిపే వారి పరిస్థితి ఏమిటి?. ఇదే సినిమాలోనే రెస్లర్లుగా రాణించాలని ఆశపడే ఎంతో మంది( నిజ జీవితంలో బహుశా వేలమంది) ఆడపిల్లల్ని చూస్తాం. వారంతా ఫెయిల్యూర్స్. వారి జీవితాలు సినిమాలుగా రావు కాబట్టి, ప్రపంచానికి తెలిసే అవకాశం లేదు. వందల్లో ఒకడే ఛాంపియన్ ఉంటాడు. వాడి జీవిత గాధే మనం చూస్తాం, వింటాం, చదువుతాం. ఈ సినిమా చూసిన జోష్ లో ఎవరైనా తమ పిల్లల్ని ఆటలల్లో ఛాంపియన్లుగా చూసేయాలని కలగనొచ్చు. కానీ సత్యం అందుకు భిన్నంగా ఉంటుంది కదా..వేల మందిలో మన పిల్లలకే ఛాన్స్ రావటమూ, గెలవటమూ ఛాంపియన్ కావటమూ మామూలు విషయం కాదు. కానీ ఇవన్నీ కేవలం, ఆ చిన్నారి జీవితాన్ని ఫణంగా పెట్టి మాత్రమే చేయాలనుకోవటంలో స్వేచ్ఛా హననం ఎంతుందో గుర్తించాల్సి ఉంటుంది. వారి జీవితాల్ని మన ఆలోచనలకు తగ్గట్టుగా "తయారు చేసే" హక్కు మనకు ఎవరిచ్చారు?.

పైల్వాన్ల పిల్లలూ పైల్వాన్లవుతారు, "అది వారి రక్తంలోనే ఉంటుంది" వంటి మూఢనమ్మకం ఒకటి ఈ సినిమాలో కన్పిస్తుంది. రక్తంలో గ్రూపులుంటాయ్ గానీ, పైల్వానీ ఎలా ఉంటుంది?. అందుకనేమో ఆ పిల్లలు కూడా పిల్లల్లాగా కనిపివ్వరు, తండ్రిలాగే కనిపిస్తారు. వారిలో ఎటువంటి చైతన్యమూ లేక తండ్రి చైతన్యాన్నే నింపుకుని ఉన్నట్టూ, తండ్రి మీద పూర్తిగా ఆధారపడిపోయినట్టూ చూపిస్తారు. తండ్రి కోల్పోయిన బాల్యాన్నీ, యవ్వనాన్నీ తన పిల్లల జీవితాల్లలోకి బలవంతంగా ప్రవేశపెట్టి, వారి యవ్వనంలో తాను జీవిస్తాడు. అంటే ఆ పిల్లల జీవితం వారి సొంత జీవితం కాక, ఎక్ట్సెన్షన్ ఆఫ్ ఫాదర్స్ యూత్ ఇన్ దెమ్ అన్న మాట. అమీర్ ఖాన్ పెద్ద హీరో కాబట్టి, తండ్రి పాత్ర పోషించాడు కాబట్టి సినిమాలో మనకు ఆ పాత్రనే హైలైట్ చేసి చూపిస్తారు. ఆడపిల్లల పర్స్పెక్టివ్లో ఈ సినిమా ఉండదు. వారిద్దరూ ఎంత కష్ట పడ్డారో, ఎంతగా ప్రాక్టీసు చేశారో, వారి జీవితాశయాలేంటో మనకు తెలియదు. ఇద్దరూ, బొమ్మల్లాగా తండ్రి ఆశయం కోసమే జీవించే మర మనుషుల్లాగా కనిపిస్తుంటారు. తండ్రి ఆశలకూ ఆశయాలకూ బానిసలుగా తప్ప స్వతహాగా స్వంతంగా ఛాంపియన్లయేందుకు కృషి చేసినట్లెక్కడా కనిపించదు. ఇందులో ఛాంపియన్ల గొప్పతనం కంటే వారి తండ్రి గొప్పదనమే మిన్న అని చూపటం వుంటుంది. పూర్వాశ్రమంలో అమీర్ ఖాన్ పాత్ర రెస్లింగ్ లో గెలిచినపుడు, ఆయన మీద ఆయన తండ్రి ప్రభావం ఏమిటో మనకు తెలియదు. సినిమా లెక్క ప్రకారం ఆమీర్ పాత్ర తండ్రి కూడా పైల్వానే అయుండాలి, రక్తంలోనే ఉండాలి కాబట్టి. ఆ పిల్లల చదువేమయిపోయిందో కూడా మనకు తెలియదు. ఆడ పిల్లలు కూడా రెస్లింగ్ వంటి ఆటల్లో రాణించగలుగుతారు అని చెప్పటంలో తప్ప ఈ సినిమా ఎందులోనూ గొప్పది కాదు. ఇది కూడా ఒక ఇల్యూషన్ మాత్రమే. ఎందుకంటే మనం గెలిచిన వారి కథనే చూస్తుంటాం. రెస్లింగ్ లో ఓడిపోయిన ఆడపిల్లలు, "చూశారా మేము చెబితే వినలేదు, ఆడపిల్లలకు ఇటువంటి ఆటలు సరిపడవని చెప్పినా వినిపించుకోలేదు" అని అవమానాలకు గురైన ఆడపిల్లలూ, కష్ట పడికూడా చివరి క్షణంలో రాణించలేకపోయిన ఆడపిల్లల గురించి మనం ఈ సినిమాలో చూడం.

సింధూ గోల్డ్ మెడల్ సాధించినపుడు, కొంతమంది మా పిల్లల్ని కూడా అలా "తయారు చేస్తా"మంటూ పొలోమని హడావుడిగా తమ పిల్లల్ని గేమ్స్ కోచింగ్ సెంటర్లలో చేర్పించడం చూశాం. ఈ తయారు చేయటం ఏమిటి?. వారిలో ఆ విషయమే లేనపుడు తయారు చేయడం ఏమిటి? అనేది అర్థం కాని విషయమే. పైగా ఇప్పటికిప్పుడు ఒలంపిక్స్ లో ఇండియాకు స్వర్ణ పతకాలు వచ్చేయ్యాలన్నంత ఆర్భాటాలు ప్రభుత్వాలే చేయటం విడ్డూరం. పేదరికం ఎక్కువగా ఉన్న మన దేశంలో, కనీస చదువులు కూడా చదవలేక మధ్యలోనే డ్రాపవుట్స్ ఉన్న దేశంలో, క్రీడల కోసం లక్షల కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏముంది?. పాఠశాలల్లో క్రీడలు తప్పనిసరిగా ఉండాల్సిందే...ప్రతీ పాఠశాలలో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసినట్టైతే, పిల్లల శారీరక మానసిక ఎదుగుదల, చదువు పట్ల ఉత్సాహం పెంపొందించే అవకాశం ఎక్కువ. అది వదిలేసి, కోట్లు పెట్టి క్రీడా అకాడమీలని పెట్టి లాభమేమి?. అక్కడ కూడా అరకొర సదుపాయాలు కల్పించి, ఇప్పటికిప్పుడు మనకు ఒలంపిక్స్ లో పతకాలు రావాల్సిన అవసరం ఏమొచ్చింది?. ఆడపిల్లల చదువులే అంతంత మాత్రంగా ఉంటున్న దేశంలో ఒక ఒలంపిక్ పతకం రాగానే పొలోమని దేశం మొత్తం ఒలంపిక్ దేశమైపోవాలనీ, పుట్టిన ప్రతీ ఆడపిల్లా ఒలంపిక్ ఛాంపియన్ ఐపోవాలనీ ఆశించటంలో వెర్రితనం తప్ప ఇంకోటి కనిపించదు. క్రీడలు మన చదువుల కరికులంలో భాగం కానపుడు, క్రీడలూ, చదువూ పూర్తిగా వేరు వేరు అంశాలయినపుడు, తిండి ఉద్యోగం ఇవ్వగలిగే చదువును వదిలి, వేలలో ఒకరికి సొంతమయే ఛాంపియన్షిప్ కోసం పిల్లల్ని రుద్దటం ఎందుకు?. చదువుని పూర్తిగా వదిలి క్రీడల బాట పట్టిన మిగిలిన తొమ్మిదివందలా తొంభైతొమ్మిది పిల్లల పరిస్థితి ఏమిటి?. పునరాలోచిద్దాం.

30-12-16
స్త్రీ భాష కావాలిపుడు
-------------------------------

భాష ఒక సంస్కృతి మోసే విలువలను సమర్థవంతంగా ప్రతిఫలిస్తుంది. ముఖ్యంగా "జెండర్ స్టీరియోటైప్స్" ని సృష్టించటంలో తరాల తరబడి ఆ విలువలు మార్పు కాకుండా చూడటంలో భాష ప్రధాన పాత్ర పోషిస్తుంది. పితృస్వామ్య సమాజంలో స్త్రీ పురుష స్థానాలను నిర్వచిస్తూ, వాటిని సుస్థిర పరచటంలో తద్వారా స్త్రీకి కూడా తెలియకుండా స్త్రీ ఒక పద్దతి ప్రకారం దోపిడికి గురవటమూ ఉంటుంది. పితృస్వామ్య సమాజమంటే ఇపుడు మనం నివసిస్తున్న సమాజమే. మాతృస్వామ్య సమాజమనేదేదీ "అమేజాన్" వంటి కల్పిత గ్రీకు ద్వీప కథల్లో తప్ప ఇలలో ఉండటమనేది జరగనేలేదంటారు సామాజిక మానవ శాస్త్రజ్ఞులు (anthropologists).  స్త్రీ, పురుషుడి పక్కటెముక నుండి సృష్టించబడటానికి కారణం, అతడి పక్కనే నిలబడటానికనీ, అతడి భుజం కింద రక్షణ పొందటానికనీ, అతడి హృదయానికి దగ్గరగా ఉండటానికనీ అంటాడు బైబిల్ భాష్యకారుడు హెన్రీ మ్యాథ్యూ. మతమేదైనా పురుషుడి దృక్కోణంలోనిదే. మతగ్రంధమేదైనా పురుషుల చేత రాయబడ్డదే. చివరకు దేవుడు కూడా పురుషుడే. పురుషుడిని సాధారణ (norm) మనిషిగా, స్త్రీని వేరే (other) వ్యక్తిగా చిత్రించిన సమాజంలో భాష అనేక రూపాలలో పురుషుడి భాషగానే ఉంటుంది. ఈరోజు స్త్రీ రాసే భాషంతా పురుషుడిదే. ముందు పురుషుడు సృష్టించిన భాషను నాశనం చేయకపోతే, దానిని మార్చకపోతే స్త్రీ పురుష లింగబేధాలు తగ్గవనేది లాకానియన్ ఫెమినిస్టుల (Lacanian feminists) వాదన. రాడికల్ ఫెమినిస్టుగా పితృస్వామ్య స్త్రీ పురుష సంబంధాలను అర్థం చేసుకుంటూ లాకానియన్ పద్దతిలో వాటి మూలలు భాషలో దాగి ఉన్నాయనే స్పహను కవయిత్రి శిలాలోలిత గుర్తించినట్టు అనిపిస్తుంది.

ఇల్లాల్ని చూసి ఇల్లు చూడు, గృహ లక్ష్మి, దొడ్డ ఇల్లాలు, గొడ్రాలు, పని మనిషి, కార్యేషు దాసి, భోజ్యేషు మాత, శయనేషు రంభ, బరితెంగింపు, ధర్మ పత్ని ఇటువంటి పదాలన్నీ పురుష సృష్టినే. ఉదాహరణకు 'పని మనిషి' అనే పదం వినగానే, ఇంట్లో అంట్లుతోముతూనో, బట్టలుతుకుతూనో ఉండే ఒక స్త్రీ రూపం స్పురణకు వస్తుంది కానీ ఒక పురుషుడి రూపం స్ఫురించదు.. అలాగే 'గొడ్రాలు' అనే పదం. సంతాన అయోగ్యత అనే అంశం ఒక బయోలాజికల్ అంశం ఐనప్పటికీ, దానిని ఒక సామాజిక అంశంగా తయారు చేసినపుడు, స్త్రీలోని సంతాన అయోగ్యతనే 'గొడ్రాలు' అనే పదం ద్వారా హేళన చేయడం జరిగింది. ఈ  విషయంలో పురుషుడికి ఏ పేరూ లేదు. ఇటువంటి అన్ని పదాల వెనుక దాగి వున్న వివక్షనూ,పురుషహంకారాన్నీ, దోపిడీని కవయిత్రి మనకు ఈ కవితలో తెలపటం ద్వారా, భాషలో తీసుకు రావలసిన మార్పును సూచించడం జరిగిందనుకోవాలి. పురుష భాష నుండి తటస్థ భాషకు, అంటే ఏ జెండర్ నీ సూచించని భాషకు మరలడం అన్నది ప్రస్తుత స్త్రీ వాదుల ప్రధాన ప్రాముఖ్యతాంశం. కానీ అంతకు ముందు, పురుష భాషా పదజాలాన్ని తూ ర్పాపబట్టడం తప్పక జరగాలి. ఈ కవితలో శిలాలోలిత గారు అదే చేశారు.

జెండర్ ఆధారిత భాష నుండి తటస్థ భాష వైపు జరిగాల్సిన మార్పును కవయిత్రి ఈ కవితలో స్పష్టంగా సూచించదు. కానీ కవిత మొదటి వాక్యంలోనే "మాదయిన భాష కోసం పరితపించాము" అని అంటుంది. తద్వారా కవితలో చెప్పే ఈ పురుషహంకార పదాల ఔచిత్యాన్ని వ్యంగ్యంగా ఉటంకిస్తుంది. అంతే కాకుండా కవితలో పురుష సమాజంలోని స్త్రీ మూర్తిని వివిధ రూపాల్లో నిర్మాణం చేస్తుంది. ఒక కవితలో ఒక అంశాన్ని తీసుకుని కవిత్వం చేయవచ్చు. కానీ అదెప్పటికీ పూర్తి అవగాహనా రూపాన్నీయదు. ఆసిడ్ దాడిలో ముఖం కాలిపోయిన స్త్రీ దృక్కోణం లోంచీ, లేదా రేప్ చేయబడిన స్త్రీ దుృక్కోణంలోంచి సమాజాన్ని సబ్జెక్టివ్ గా వివరించినపుడు, ఆ కొంత మాత్రమే అవగతమౌతుంది. కానీ మొత్తంగా , ఈ రోజు పితృస్వామ్య సమాజంలో స్త్రీ అంటే ఏమిటి?. అని అడిగినపుడు, ఆబ్జెక్టివ్ గా ఆమె వివిధ రూపాలను దర్శింపజేయాల్సి వుంటుంది. అప్పుడే ఆమె ఏ విధంగా objectify అయిందో అర్థం అవుతుంది.  ఈ కవితలో శిలాలోలిత గారు సమాజం తయారు చేసిన స్త్రీ వాస్తవ రూపాన్ని ఆబ్జెక్టివ్ గా చూపటానికి ప్రయత్నం చేశారు. ఆ వాస్తవ రూపంలో అడుగడుగునా పురుషాధిక్యత ప్రతిఫలించే భాషా రూపాలే కనిపిస్తాయి. అంతే కాకుండా కవిత అడ్రస్ చేసేది కూడా పురుషులనే. ఇది స్త్రీ సాహిత్యపు ప్రస్తుత పరిస్థితి. స్త్రీలు తమ కోసం రాసుకునే స్థితి ఇంకా రాలేదనడానికి సాక్ష్యం. పురుషహంకారానికి వ్యతిరేకంగా చేసే యుద్ధ దశలోనే ఈనాటికీ స్త్రీసాహిత్యం ఉండిపోయినపుడు, స్త్రీత్వపు సొంత పదాలు లేదా తటస్థ పదాలూ సాహిత్యంలో ఇపుడిపుడే కనిపిస్తాయనుకోలేం.

కవిత ముగింపు ఆధునిక శాస్త్రమైన జెనెటిక్స్ మీద నమ్మకాన్ని కనబరుస్తుంది. రాడికల్ ఫెమినిష్టుగా కవయిత్రి ఆశించిన నిజమైన ముగింపు ఇది కాదేమో. కానీ సాంప్రదాయ సమాజపు వైఖరులను ఆధునిక విజ్ఞాన శాస్త్రాల వైపు తిప్పాలనే బాధ్యతతో ఇటువంటి ముగింపు ఇచ్చిందనుకుంటాను. నిజానికి జీవకణ మూలాల్లో దాగిన జన్యువులు ఎటువంటి లింగ బేధాన్నీ పాటించవు. సమాజం నిజంగా అంతటి సూక్ష్మదృష్టి వైపు మరలగలిగినపుడు, స్థూల దృష్టిని మలిన పరిచే స్త్రీ పురుష వ్యత్యాసాలు అంతరిస్తాయేమో. కానీ కవితంతా సమాజ స్త్రీ విశ్వరూపాన్ని వివరిస్తూ అకస్మాత్తుగా జన్యువులో సమాధానం కనుగోవటంతో ముగియటం కాస్త ఇబ్బందిగానే అనిపిస్తుంది. ఎక్కడ కోల్పోతామో అక్కడే వెతుక్కోవాల్సిన అవసరం ఉందేమో...ఎందుకంటే పూర్తి సాంప్రదాయక సమాజానికి ఆధునిక సైన్సుకూ కూడా బద్ద శతృత్వమే ఉంది. సమాజం ఏర్పరిచిన స్త్రీ రూపాన్నీ, పురుషాధిక్య భాషనూ వ్యతిరేకించటానికి జన్యు శాస్త్రం సరయిన అస్త్రం కాదేమో..ఇక్కడ కవయిత్రి సున్నితమైన మనసు పురుషహంకారాన్ని బాధ పెట్టడానికి ఇష్టపడలేదనుకోవాలో..లేక ఆధునిక సైన్సు మీద ఆమెకు ఉన్న నమ్మకం అనుకోవాలో తెలియదుకానీ, స్త్రీ వాదం తనదైన పదాల్ని సృష్టించుకోవలసిన అవసరాన్ని కూడా ఈ ముగింపు మనకు గుర్తుచేస్తుంది.

ఐనవాళ్ళ౦
----------------------
                                 శిలాలోలిత( Shilalolitha Kavi)
మాదయిన  భాష  కోసం  తపించాము
నాలుగ్గోడల  మధ్యకు  విసిరితే
దేహాత్మలేని  వాళ్ళలా  లోపల్లోపలే  దుఃఖించాము
ఎప్పటికీ  వీడని  కప్పెట్టిన
మేలిముసుగుల మధ్యన జీవచ్చవాలమయ్యాము
అంగాంగాల కొలతల మద్య  కోరికలమధ్య
దేహమొక్కటే  మిగిలిన వాంఛలమయ్యాము
అమ్మ నుంచి అమ్మమ్మదాకా  సాగిన ప్రయాణాల్లో
నకిలీ పరిపూర్ణత్వాల్ని  పులుముకున్న
“ ఇల్లాల్ని చూసి ఇల్లుచూడు  “  లాంటి  సామెతలమయ్యాము
బిగపట్టిన  పోత్తికడుపుల్తో
కాలకృత్యాలు  తీర్చుకోలేని ఆశక్తలతో
అందరిలోనూ  వినమ్రంగా మెలిగే  గృహలక్ష్ములమయ్యాము

పునరుత్పత్తి  చంక్రమణాల్లో
పదినెలలు మోసి , కనిపెంచిన
దొడ్డ ఇల్లాల్లమయ్యాము
లోపమే  లేకున్నా  తనువుల్తో
కడుపుపండని గొడ్రాళ్ళమయ్యాము
పాలిచ్చి పెంచిన సంతానం
లాభనష్టాల లెక్కల్తో వదిలేస్తే
వృద్ధాశ్రమాలకు  చేరే  తల్లులమయ్యాము
మనసులే  లేనితనాన  అంగడిలో
చితికిన దేహాల  సరుకులమయ్యాము
నల్లటి  పరదాలమాటున ఎగుమతి అయ్యే
చిన్నారి లేత యౌవ్వనాల మయ్యాము
‘ తాలిబన్ల ’ క్రూరశాసనాల  మద్య
సెకనుకో అవమానాల చిట్లిన బుడగల మయ్యాము
పిల్లల్ని ఎత్తుకునే  బాల్యమే లేని యంత్రాల మయ్యాము
ఎంగిళ్ళు కడిగి , ఇళ్ళను అద్దంలా మెరిపించే
పనిమనుషులమయ్యాము
టీజింగ్ కి  గురయ్యి  చితికిన  మనుషుల మయ్యాము
ప్రేమనంగీకరించని  నేరానికి  కాలిన మొఖాల  మయ్యాం
ఎవరికీ  కోపమొచ్చినా
దెబ్బలు తినే  కమిలిన  దేహాలమయ్యాము
శయనేసురంభ , భోజ్యేషుమాతా , కార్యేషుదాసిగా
వివరించిన  బాధ్యతల్లో మునిగితేలిన ఇరుసుల మయ్యాము
కలివిడిగా  మాట్లాడి
లోకం దృష్టిలో బరితెగించిన  వాల్లమయ్యాము
నీతి సూత్రాల  కొలబద్దలమయ్యాము
అమ్ముకునే సరుకుల్ని  ప్రచారం చేసే అర్ధనగ్న ప్రకటనలమయ్యాము
కదులుతున్న ప్రచార , ప్రసార సాధనాల్లో
మొఖంలేని దేహపటాలమయ్యాము
వెక్కిరింతల  ఎగతాళుల  నిరసనల మధ్య
ఇలా ఎదిగిన వాల్లమయ్యాము
గడియారపు ముళ్ళలా అన్నీ సమకూర్చి పెట్టి
తిరిగి అలసి పోయినా
చెరగని నవ్వుల మయ్యాము
ఆస్తి హక్కుల్ని ,మహిళా బిల్లుల్ని కోరి
అపహాస్యం  చేయబడే ఆకాశంలో సగాలమయ్యాము
నేతల్ని గెలిపించే  ఓటర్లమయ్యాము
నరకాన్ని అనుభవించి
సుఖాలిచ్చిన ధర్మపత్నులమయ్యాము
కనిపెంచిన  సంతాన జననపట్టికలో
‘మదర్ ఆఫ్’  అని లేని అనామక  తల్లులమయినాము
సంఘర్షణల్లో  అవిశ్రాంత తీరాల మయ్యాము

జన్యు  సందేశం కదిపిన  వేర్లలోకి  మళ్ళీ  వెళదాం
ఎరుపు ,తెలుపు ,నలుపు
జాతి, మతం, కులం  లేని అసలు జ్ఞానంలోకి చొరబడదాం
ఆమె , అతడు పరిభ్రమించిన
ఆదిక్యతల  వలయాల్లో
విరిగిన  శోక ఆకాశాలు, శోకించిన  నేల
ఉప్పొంగిన  సముద్రాల వైపుకు  మళ్లి దృష్టిని  మరల్చుదాం.

కవిత్వ సందర్భ౦ 30
3-1-17