Sunday, 26 July 2015

Bahubali - a view
................................
బాహుబలి బలమంతా ఇంటర్వల్ తరువాత వచ్చే యుద్ధం సీన్ లో ఉంది. అదొక అద్భుత చిత్రీకరణ. కొన్ని హాలీవుడ్ సినిమాల సీన్స్ ని కాపీ కొట్టారని చాలా మంది చెబుతూనే ఉన్నారు. అయినాకానీ ఇంత భారీ యుద్ధ సీన్ ని క్షణం కూడా బోర్ కొట్టించకుండా తెలుగు ప్రజలకు అందించటం, నిజంగా హర్షణీయం.

నెగేటివ్ టాక్ ఎలా ఉన్నా, ఈ ప్రయత్నాన్ని స్వాగతించాలి. నేల విడిచి సాము చేసినట్టుగా లాజిక్ కి అందని కొన్ని సీన్స్ ఉన్నాయి. వంద సార్లు కొండమీంచి కిందపడ్డా కనీసం నడ్డి విరుగని శివుడు, శివ లింగాన్ని ఎత్తుకుని నదిలోకి బొక్క బోర్లా పడినా మునిగి పోని శివుడు, తమన్నా నది ఒడ్డున నిద్రపోయినపుడు అరచేయి వరకు నీటిలో మునిగినట్టు కనిపించినా, నీటిలో ఉండే కెమెరా లో మాత్రం, మోచేయి వరకు మునిగినట్టు చూపటం, రాయి పైపొరని చేతితో వొలిచేయటం, అది సరిగ్గా పడవలాగా బయటకి ఊడిరావటం, మంచుతుఫానులో ఇద్దరూ ఆ పడవలాంటి దానిలో జారుతూ పోతున్నపుడు, ఒక చోట ప్రభాస్ పడవలోంచి ఎగిరి పడిపోయిన సమయంలో, పడవలో ఉండాల్సిన తమన్నా ఉండకపోవటం, కొండ మీద లోకంలో అక్కడే నదీ తీరం, అక్కడే మంచు కొండలు, అక్కడే మంచు తుఫాన్లు రావటం, వంద మంది తాల్లతో లాగినా లేవని పడిపోయే విగ్రహాన్ని ఒకే ఒక్కడు తాడేసి లాగగానే లేవటం, కట్టప్పలాగా ముసలి వాడిగా ఉండాల్సిన భల్లాలకి కనీసం ఒక వెంట్రుక కూడా నెరవక పోవటం మున్నగునవి.

దున్నపోతు అసలు దున్నపోతులా కనిపించకపోవటంతో అద్భుతంగా ఉండాల్సిన సీన్ కాస్తా తేలిపోయింది. కొన్ని చోట్ల చెప్పిన డైలాగ్స్ లో కనీసం ఉండాల్సిన మాడ్యులేషన్ లేక పోవటంతో రాసిచ్చిన మాటల్ని అప్పజెపుతున్నట్టుగా అనిపించింది. ఈ విషయంలో శ్రీ రామదాసు, శిరిడీ సాయి వంటి సినిమాలకంటే చాలా బెటర్. తమన్నా కత్తి యుద్దం తేలిపోయింది. హాలీవుడ్ లో హీరోయిన్స్ ఫైట్స్ చూసాక ఇది మరీ పేలవంగా అనిపిస్తుంది. అక్కడ ఫిమేల్ కారాక్టర్ కదా అని పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించదు. ప్రభాస్ కి, తమన్నాకీ మధ్య ఉండే అడల్ట్ సీన్స్ అసలు అవసరమే లేదు. అది లేకున్నా స్టోరీలో పెద్ద మార్పేమీ ఉండదు. విదేశీ పడుచులతో ప్రభాస్ పాటలో కూడా అంత వల్గారిటీ ఉండాల్సిన అవసరం లేదు. చిన్న పిల్లలు కూడా చూస్తారు కాబట్టి కాస్త హుందాగా ప్రభాస్ పాత్రని మలచి వుండాల్సిందనిపిస్తుంది. అందునా ఆ పాత్ర బాహుబలిది కాబట్టి.

గూడెంలో ఒకడిగా కనిపించే తనికెల్ల భరణి మరల ఎక్కడా కనిపించడు. బాహుబలి కి గానీ, భల్లాల తండ్రి పాత్ర వేసిన నాజర్ కి కానీ లేని జంధ్యం, భల్లాలకి ఉంటుంది. అదికూడా బుల్ ఫైట్ సీన్ లో మాత్రమే. బుల్ ఫైట్ కి ముందు జంధ్యాన్ని తీసేస్తున్నట్టు చూపించి, ఆ తరువాత అక్కడే కట్టప్ప తో జరిగే సంభాషణలో వేయబడి ఉంటుంది. మరలా సినిమాలో ఎక్కడా కనిపించదు. అది కూడా ఒక తాడంత మందంగా ఉంటుంది. కాలకేయుడే కాక ఆ సైన్యం మొత్తం నల్లగా ఎందుకుంటారో తెలియదు. ఇలాంటి సీన్స్ కల్చర్ ని సరిగా స్టడీ చేయవలసిన అవసరాన్ని చెబుతాయి. పాటలు పరవాలేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతః. యుద్ధం సీన్స్ లో అదరగొట్టే స్కోర్స్ ఉన్నాయి. మొత్తానికి ఇంటర్వెల్ వరకూ ఓకే లా ఉన్నా, ఇంటర్వెల్ తరువాత స్టోరీ గ్రిప్పింగ్ గా ఉంది. వెంట్రుకలు నిక్కబొడుచుకుంటాయి. ప్రభాస్ యాక్షన్ బాగుంది. భల్లాల పాత్రలో పట్టు కనిపించదు. ఒక సాఫ్ట్ విలన్ గానే ఎష్టాబ్లిష్ చేశారు. కాలకేయుడులో ఉండే విలనిజం కూడా భల్లాల పాత్రలో లేదు. కేవలం అసూయ, అమాయకత్వం, తండ్రి ఏది చెబితే అది. దుర్యోధనుడిలా అవిటి తండ్రిని పక్కన కూర్చో పెట్టినట్టు కూడా కనిపించదు. మహా భారతం ఛాయలు చాలానే ఉన్నాయి.

నిజానికి సినిమాని సడన్ గా ఆపేసినట్టు అనిపించినా, ప్రేక్షకుడు సాటిస్ఫై అవుతాడు. రెండవ భాగం కోసం తప్పక వెయిట్ చేస్తుంటాడు.

Thursday, 23 July 2015

విరించి ll  చీకటి వరం  ll
.......................................
పగలంతా ఎండలో దాగుడు మూతలాడి
అలసిపోయిన నక్షత్రాలపుడు
ముఖం కడుక్కుని
అలంకరించుకోవటం మొదలెడతాయి.

విడిపోతున్న ప్రియురాలు వెనక్కి తిరిగి చూస్తున్నట్టు
సూర్యుడొక దిగులు చూపు చూస్తుంటాడు.

నా గదినంతా పరికించి చూసే
సాయంత్రపు నీరెండల చూపులకు
గోడల చక్కిళ్ళ మీద ఎర్రటి సిగ్గు వాలి ఉంటుంది.

చిందరవందరగా పడని కాగితాలు
ఒక క్రమ పద్దతిలో అమర్చి ఉంచిన పుస్తకాలూ
టేబుల్ మీద అడ్డదిడ్డంగా పరచి ఉంచని పెన్నులూ
దుమ్ము పేరుకుపోని గదిలోని వస్తువులూ
ఒక నిర్జీవ శకలానికి ఆత్మ ఉంటుందని ఘోషిస్తుంటాయి.

వస్తువులన్నీ ఉన్నచోటనే ఉంచబడిన ఆ గదిలో
ఒక నిరాసక్త శూన్యతయే ఎక్కువగా కనిపిస్తుంటుంది.

ప్రతీ సాయంత్రంలాగే ఒక అద్దం
నిలువెత్తున ఒక మూలకు నాకోసం వేచి చూస్తుంది.

కెంపులు జారే నగ్న పెదవులు
సీతాకోక చిలుకలు ఎగిరే నవ్వులూ
కలలు కనే నీలి నయనాలూ
అద్దం రాసుకునే చరిత్ర పుస్తకాల్లో కనిపిస్తాయి.

ఎక్కడో కవి అరుస్తాడు...
కాలం మునుగుతున్న సూరీడై వెల్లిపోదు
చంద్రునిలా మొలకెత్తుకొస్తుంది మళ్ళీ అని.

వెలుతురు బండి వెనుక దుమ్ములా రేగే వెన్నెల కూడా
నా పాలిటొక శాపం కాకపోతే..
అద్దంలో నాకు నేనుగా బయట పడటానికెందుకని ఈ అయిష్టత?

పెను చీకటిలో ఎంతటి సుఖం లేకపోతే
ఈ గదిగోడలు అంత దూరంగా జరుగుతాయి?
ఈ ఇరుకు గది అంతటి విశాలమైన హాలులా మారిపోతుంది?..

అపుడే.. ఆ చీకటిలోనే, పునర్జన్మ గురించిన నా కలలు
ఒక జీవనాసక్తిని పట్టి లేపుతాయి.
యాసిడ్ దాడిలో కాలిపోయిన ముఖంలోకి
బంగారు తల్లీ..చిట్టి తల్లీ..వరాల తల్లీ అని
అమ్మ పిలిచే ముద్దు పేర్లు
అమాయకంగా అద్దంలోంచి చీకట్లోకి తొంగిచూస్తాయి.

పగలంతా గూడుకట్టుకున్న వేదనలు
చీకటికి గూటికి చేరిన పిట్టల్లా కన్నీళ్ళై చేరుకుంటాయి.
నాలో ఉబికే భావుకత్వం నా గొంతు పిసికేస్తుంటుంది.
మళ్ళీ పొద్దునొకొక నిర్జీవ శవం పుట్టుకొస్తుంది.

23/7/15.

Analysis by experts

1.Narayana sharma garu. చాలాబాగుంది విరించి గారూ..మీకవిత ఎన్ని మైలు రాళ్ళు దాటిందో ఈ కవిత చెబుతుంది.చాలా వాక్యాలు వెంటాడుతాయి.ఇస్మాయిల్ ఒక చోట కవిత్వాన్ని జీవమున్న అంగీ(Organism)అన్నారు..ఆయనే నిర్మాణాన్ని గురించి అనుభూతిని గురించి చెబుతూ "ఉదావర్తగతి"(Spiral motion)ను పరిచయం చేసారు.ఇ మార్గంలో కవితలు చాలా తక్కువ మీ కొన్ని వాక్యాల్లో ఆ నిర్మాణ కౌశలం ఉంది.
చాలా వాక్యాలు తీర్చి దిద్దినట్టున్నాయి.
1.సాయంత్రపు నీరెండల చూపులకు
గోడల చక్కిళ్ళ మీద ఎర్రటి సిగ్గు వాలి ఉంటుంది
2.పెను చీకటిలో ఎంతటి సుఖం లేకపోతే
ఈ గదిగోడలు అంత దూరంగా జరుగుతాయి?
3.కాలం మునుగుతున్న సూరీడై వెల్లిపోదు
చంద్రునిలా మొలకెత్తుకొస్తుంది మళ్ళీ అని..

2. Wahed garu

కవితలోని అద్భుతమైన పదచిత్రాలు ఒక ఎత్తయితే, కవితా నిర్మాణంలోని ప్రత్యేకత మరో ఎత్తు. స్టాంజాలు ఒక క్రమపద్ధతిలో పేర్చినట్లు, మూడ్ స్వింగ్ ను ఒక క్రమంలో కొనసాగించారు. చివరి రెండు స్టాంజాల్లోను తీసుకున్న మలుపు ఒక పాఠకుడికి ఒక కుదుపు వంటిది. ముఖ్యంగా ’’యాసిడ్ దాడిలో కాలిపోయిన ముఖంలోకి
బంగారు తల్లీ..చిట్టి తల్లీ..వరాల తల్లీ అని
అమ్మ పిలిచే ముద్దు పేర్లు‘‘...ఈ పంక్తులు అంతకు ముందు వ్యూహాత్మకంగా నిర్మించిన యాంబియన్స్...కవితావరణంలో ఒక విస్ఫోటం వంటివి. చివరి స్టాంజా ఆ విస్పోటనానంతర వేదనాత్మక ప్రశాంతతను ప్రతిబింబించింది. ’’మళ్ళీ పొద్దునొకొక నిర్జీవ శవం పుట్టుకొస్తుంది.‘‘ అన్న వాక్యంతో ఈ కవితను ముగించడం ఫెంటాస్టిక్.

3. Aranya krishna garu

చాలా మంచి కవిత.  కవిత మొత్తం గాఢంగా, ఆర్ద్రంగా సాగింది. కానీ చివరి వాక్యం "మళ్ళీ పొద్దునొకొక నిర్జీవ శవం పుట్టుకొస్తుంది" బాగోలేదని కాదు కానీ కవితకుండాల్సిన ముగింపు యొక్క ఔచిత్యాన్ని పరిశీలించమని కవికి నా విజ్ఞప్తి.

4. Padma kumari garu

వాహ్! సుపర్బ్ సర్

అసలివి అక్షరాలేనా...
ప్రతీ వరుస ...ఒక సజీవ చిత్రాన్ని చూపుతుంటే...
ప్రతి వాక్యం ...దృశ్య కావ్యమైపోతుంటే...
ఏమని చెప్పాలో తెలియని మూగ భావాన్నయ్యా..
మౌనక్షరాలకు అంజలి ఘటిస్తూ....

comments 2

* ఆహా.. గుల్జార్ కవిత ఎంత బాగుంది. మొదటి కవిత చదువుతుంటే గుండె పిండేసినంత బాధ. ఈ చెట్టు కొట్టేస్తున్నపుడు..ఆ వీధిలోకి పోలేక పోవటం. ఎంతటి హృదయ విదారకరం. నలుగురు కలిసి దాన్ని చంపేస్తుంటే...మీ వ్యాసం చదువుతుంటే..ఎవరో అన్నట్టు ఆధునికత కొత్త మార్గాలను ఆవిష్కరిస్తుంది కానీ, నిర్దేశించలేదు అనే మాటలు గుర్తుకు వచ్చాయి. ఈ మార్పులను పరిణామాలను నిర్దేశించే మెఖానిజం మనమే కనుక్కోవలసి వుంది. మనమింకా అటువైపసలు అడుగులే వేయలేదు. ముఖ్యంగా పర్యావరణం విషయంలో మనకే దిశా నిర్దేశమూ లేదు. మన పనులన్నీ మన పర్యావరణాన్ని నాశనం చేయటానికే అనే విషయాన్ని మనమింకా తెలుసుకోనేలేదు. మనలోని ఈ నిర్దేశక స్థితి యొక్క అసాహాయతని గుల్జార్ మొదటి కవిత పట్టి ఇస్తుంది. సత్య శ్రీనివాస్ గారూ మీకు మీ ఉద్యమంలో మీరు నన్ను మేల్కొలిపే విధానంలో సదా ఋణగ్రస్తుడిని. జయహో.

*ఊరా మజాకా.
జీవితాన్ని అంబలి తాగినట్టు ఉండాలి. అలవోకగా, ఆబగా.
ఎలా వుండాలో చెబుతూ, ఎలా లేమో కూడా చెప్పారు. వండర్ఫుల్.

*ఆహా..ఎన్నో అభిప్రాయాలు. వాహెద్ గారూ వేదనాత్మక ప్రశాంతత చివరి స్టాంజాలో మొదటి రెండు పంక్తుల్లో కనిపిస్తుందనుకుంటాను. నిజానికి నాకు అలాటి ఉద్దేశం లేదు. వేదనతోనే ముగిద్దామనుకున్నాను. చివరి పంక్తుల్లో వేదనంతా గొంతులో దిగబడి గొంతు పిసికేస్తున్నట్టుండగా..అదే మరుసటి రోజుటి జీవచ్ఛవానికి కారణం అన్నట్టు ముగుస్తుంది. ఏమైనా మన కవి సంగమంలో మీలాంటి ఎందరో అనుభవజ్ఞుల మధ్యన కవితల్ని అందులోని లోతుపాతుల్ని, లోటుపాటుల్నీ సరి దిద్దుకోవటం నిజంగా అదృష్టం.

* అరణ్య కృష్ణ గారూ.., రాసేటపుడు ఔచిత్యం గురించి ఆలోచించలేదు. వేదన అనే ఒక ఉద్విగ్నతనుంచి వచ్చిన మాట అయుండొచ్చు. మనం కోపంలో బండబూతులు తిట్టడం, ఫ్రస్టేషన్ లో చేతిలో ఉన్నది పగలగొట్టడం లాంటి స్థితిలో ఉన్నపుడు ఔచిత్యం గురించి మరిచిపోతామేమో. కానీ మీ సలహాను తప్పక పాటించ ప్రయత్నిస్తాను. కవిగా ఉచితానుచితాలు కూడా పరికించుకోవాలి కదా.

* యెస్. అణచివేతకి దేన్ని గురిచేసినా అది రెట్టింపు శక్తితో తిరగబడుతుందనేది ఫ్రాయిడ్ సిద్ధాంతం.
రవికుమార్ గారన్నట్టు, పోర్న్ అండ్ మద్యాల్లో, ఒకటి ఉద్వేగాల్ని చల్లార్చేది, ఇంకోటి ఉద్వేగాల్ని రెచ్చగొట్టేది. ఎవరికి ఏది అనేది వారి వారి పరిస్థితులు మానసిక అవస్థ మీద ఆధారపడి ఉంటుంది. సమర్థవంతమైన వ్యవస్థని తయారు చేసుకోలేక తప్పుని ప్రజలమీదకే తోసేసే ప్రయత్నంలో ఇదొక భాగం. నిర్భయ నిందితులని ఇంతవరకు శిక్షించింది లేదు.  దానికో పకడ్బందీ ఆలోచన చేసింది లేదు. అది చేయకుండా మీదే తప్పండీ..అని చేతులు దులుపుకునే ఒక చిన్న అరేంజ్మెంట్. బడా బాబుల సెల్ ఫోన్ సర్వీస్ ప్రొవైడర్లు అందించే నెట్ లో మరి ఎందుకు బాన్ కావటంలేదో కూడా చెప్పాలి

* థోథ్...ఆ మనసు సంచికొక బొక్క పొడిచినా బాగుండేది.
ఇన్ని ఆలోచనలు ఒకే సారి మా మీద గుమ్మరించి, మీరేమో ఎంచక్కా రాతిరి కౌగిలిలో నిదురపోతారా..?
ఏంటిది అధ్యక్షా...నేనెల్లి అర్జంటుగా సుడోకు ఆడుకుంటాను. కనీసం నా బేజాలో దిమాక్ ఉన్నదనే విషయాన్నయినా కనుక్కుంటా.

Tuesday, 21 July 2015

విరించి ll   పరాయీకరణ   ll
............................................
ఒక రంగుల కల చుట్టుకున్న దేహంలోకి
మృత్యునొప్పి లాంటిదేదో
బొట్లు బొట్లుగా
నిదురలోకి జారుతూ..జారుతూ..
భళ్ళున ఎప్పటిలాగే తెల్లారిపోతుంది.

వడలి పోతున్న పై రెప్ప పైని అరణ్యాల్లోకి
ఒంటరితనమొక తుపాకీలా పేలిపోతుంది.
శబ్దానికి గొల్లున లేచిన పక్షుల్లా..
అనుభవాలో ఆశలో అఆలై ఎగిరిపోతాయి.
కింది రెప్ప లోతుల్లోకి జలపాతాలు ఎండిపోతాయి.

గుండె కలుగుల్లో ఊరే ఊహలనుంచి
తల ఫౌంటెయిన్ లో వెలిగే ఉపాయాల దాకా
వేసుకున్న జీవితపు ఘాట్ రోడ్డు పెచ్చలూడి వుంటుంది.
అక్కడే కదా..ఆ హయిర్ పిన్ బాండ్ మలుపు లోనే కదా..
నేను రెండుకాళ్ళ మీద నిలబడిన ఒంటరి బాటసారిని..!
రక్త మాంసాలతో ఊయలలూగే ప్రాణానికీ
జడ మనుషులతో తులతూ గే సమాజానికీ నడుమ
చర్మపు తొడుకొకటి చుట్టలా చుట్టుకుని
నన్ను నేను వేరు పరచుకున్న దేహాన్ని..!

గుంపులు..గుంపులు..!
వందలుగా వేలుగా
ఒంటరితనాల సమూహాలు.
రోడ్ల మీద..ఇండ్ల లోపల
జైళ్ళల్లో..ఉత్సవాల్లో..
అన్నింటా, శ్మశానంలో సమాధుల్లా
ఎవరికి వారుగా
ఇంకొకరికి వేరుగా
గుంపులు..గుంపులు
ఒంటరి మనుషుల గుంపులు..

గుంపుల్లోనే ఈ గోలంతా.
అంతరంగాల్లో అంతా నిశ్శబ్దత
నిశబ్దాల్లో మరింత అసంబద్ధత
బాహ్యాన్ని అంతరంగాల్లోకి
ఆత్మీకరించుకోలేని సందిగ్ధత.

ఎంతటి భగీరథ ప్రయత్నమీ ఒంటరితనం..
సంవేదనా భరిత జీవితంనుంచి
ఒక ఉద్వేగంగా
ఒక ఊహాలోకంగా
ఒక పిచ్చి నమ్మకంగా..
తప్పించుకు తిరిగే
ఒకానొక చివరి ప్రయత్నమీ ఒంటరితనం.

దేహాన్ని పరవశంగా చిత్రహింసలు పెట్టుకోవటం
ఆత్మని అత్యవసరంగా ఆక్రమించుకోవటం
ఒక వ్యసనంగా మారుతున్న నా కాలాల్లోకి..
చర్వణ చర్వితమూ, ప్రతి క్షణమూ
ఒక నిజం చచ్చి ఇంకో నిజంలోకి మేలుకునే సమయంలో..
నాకు నేను దొరకక 'ఐ మిస్ మై సెల్ఫ్'
అని పాడుకుంటున్న తరుణంలో..
ఒక చుట్టపు చూపుగా ఒచ్చిపోతుంటుంది నీ ఒంటరితనం
నా నిండు జీవితసారాన్ని
కొన్ని పదాల్లోకి కుంచింపజేస్తూ
నన్ను నిర్వచించేయాలనుకునే నీ తొందరపాటులో..
నీ తల బద్దలై, పది వేల గద్దలై ఎగిరిపోనీ గాక...
ఒంటరితనంలో పోయేదీమీలేదు..నీకైనా, నాకైనా.

నాకు నేనుగా నిర్వచించుకోవడానికి
నాకంటూ కొన్ని చివరి క్షణాలు అదృష్టంలా మిగిలుండాలి
అంతకు ముందుకొన్ని వందల రోజులు నేను బతికుండాలి.

20/7/15


Sunday, 19 July 2015

విరించి ll  అకస్మాత్తుగా..ll
.............................................
అకస్మాత్తుగా..వెలిగే బల్బులు పేలిపోతాయి
అకస్మాత్తుగా వసంతాల్ని గ్రీష్మాలు మింగేస్తాయి
అకస్మాత్తుగా రోజుకి కొన్నివేల చుక్కలు రాలుతుంటాయి
అక్కడెక్కడో దూరంగా
నాకు తెలియకుండా..
నీ చేతుల మీదుగా
నాకు తెలియని నీ మనుషులెవరో..
నిన్నొదిలి రాలిపోతుంటారు
అకస్మాత్తుగా మేఘం కురియకుండా కరిగిపోతుంది
అకస్మాత్తుగా వరదగుడి తేలిపోతుంది
అకస్మాత్తుగా గిటార్ తీగ తెగిపోతుంది

లేలెమ్మని కుదుపుతున్న నీ చేతులు
అయ్యో అని తల బాదుకుంటాయి
నా నిశ్శబ్దాల్ని కొల్లగొడుతూ
దూరంగా ఒక వాహనపు రొద
నా రాత్రల్ని భగ్న పరుస్తూ
కొన్ని క్షణాల ముందటి మీ ఇద్దరి ఆనంద హేళ

సగం సున్నం వేసిన పాత గోడలుంటాయి
డెడ్ ఎండ్ తో ముగిసే వీధులుంటాయి
ఫుల్ స్టాప్ పెట్టాలో కామా పెట్టాలో తెలియని
ఒకటో తరగతి పసిమొగ్గలుంటాయి.
బాటిల్ నెక్ రోడ్లమీద ట్రాఫిక్ జాంలుంటాయి
నీ ఆలోచనల దారుల్లో మంచు తుఫాన్లుంటాయి
గోడలకు తగిలించిన ఫోటోలకు దండలు వేలాడుతాయి
రివర్స్ గేర్ లో వెనుకకు తిప్పుకునే దౌర్భాగ్యాలుంటాయి
పదే పదే చూపిస్తూ హింసించే న్యూస్ ఛానల్స్ ఉంటాయి
ప్రశ్నార్థకాలు నీ ముఖం మీద ముద్రించుకు తిరుగుతాయి

నీలో బాధ నీకొక శాశ్వత ఉద్వేగం.
చంద్రునిలో మచ్చ
సూర్యునిలో వేడి

నాలో అలజడి నాకొక తాత్కాలిక ఉపశమనం
చంద్రుడికి ప్రతీ అమావాస్య సెలవు
సూర్యుడికి గ్రహణం రోజున సెలవు

మెల్లిగా ఒక పండగ ముగుస్తుంది.
మెల్లిగా ఒక పుష్కరం ముగుస్తుంది.
మెల్లిగా ఒక జీవితం ముగుస్తుంది.
ఒక ఆనందం అకస్మాత్తుగా కనుమరుగవుతుంది.

18/7/15

పుష్కరాల్లో చనిపోయిన భార్యను కుదుపుతూ  తల బాదుకుంటున్న బాధితుడిని చూసాక రాసిన కవిత ఇది. అతడికి ఇది శాశ్వత నష్టం. నాకు కాసేపు కాల క్షేపం. ఎంత తేడా మా ఇద్దరిలో..అదే కవితగా రాశాను. 

Saturday, 18 July 2015

రాజమండ్రి--పుష్కరాలు

ప్రతీ ఊరి జనానికీ ఒక 'స్పిరిట్' ఉంటుందేమో. అలాంటి స్పిరిట్ రావటానికి ఆ ఊరిలో ఉన్న ఎవరో ఒక గొప్ప పేరున్న మనిషి కారణం అయి ఉంటారు. రాజమండ్రిలో 'డొక్కా సీతమ్మ' గారి స్పిరిట్ అక్కడి ప్రజల్లో అంతర్లీనంగా ఉంటుంది. డొక్కా సీతమ్మ ఇంటికి ఎవరొచ్చినా కొసరి కొసరి అన్నం ప్రేమతో పెట్టేదట. ఆమె అందరినీ పిలిచి పిలిచి వడ్డించేదట. నా మిత్రుడు రవి కిరణ్ లో, వారి అమ్మగారిలో కూడా డొక్కా సీతమ్మ గారి స్పిరిట్ ప్రవహిస్తుందేమో. అసలు మన దగ్గరి బంధువుల ఇంటికి పోతే కూడా మనం స్వేచ్ఛగా మన ఇంట్లో ఉన్నట్టే ఉంటామని నమ్మకం లేదు. కానీ ఈ మిత్రుడి ఇంట్లో మాకు మా ఇంట్లో ఉన్నట్టే అనిపించింది. 'ఆ ఆప్యాయతలు, ప్రేమలు ఈ కాలంలో ఎక్కడున్నాయండీ?' ... అనేవారికి రాజమండ్రిని చూపించాలి. అక్కడి ప్రజల్ని చూపించాలి అనిపించింది. శివరాత్రి వంటి పండగలల్లో రాజమండ్రిలో ప్రజలు అన్నం తినే వారికోసం వేచి చూస్తుంటారట. అందరూ పెట్టే వారే కాబట్టి, తినే వారిని వెతుక్కోవాల్సి వస్తుంటుందని ఒక పెద్దాయన చెబుతున్నపుడు నిజమనిపిస్తుంది.

పుష్కరాలకు వచ్చే బంధు మిత్రుల బాగోగులు చూసుకోడానికోసమే హైదరాబాదు నుండి సొంత ఊరు రాజమండ్రికి, సకుటుంబ సమేతంగా వెల్లి, అక్కడ ఈ పది రోజులు మాలాంటి మిత్రులని, బంధువులనీ సాదరంగా ఇంటికి ఆహ్వానిస్తూ రుచికరమైన ఆంధ్రా వంటలను వండి పెడుతూ  ఆ కుటుంబం ఎంత సేవ చేస్తోందో. పుణ్యాల కోసం మునగండని చెప్పే మత పెద్దలు, పండగంటే 'సెలెబ్రేషన్ ఆఫ్ లైఫ్ విత్ యువర్ ఫెలో హ్యూమన్ బీయింగ్స్'  అని చెప్పనే చెప్పరెందుకనో. నదీ స్నానం, బంధు మిత్రుల కలయిక, మాటా మంతీ, మంచీ చెడ్డా, ఆప్యాయతలూ, ఇచ్చి పుచ్చుకోవడాలూ, కలసి జీవించటంలో ఉండే ఆనందాలు, పిండ ప్రధానమని గతించిన పెద్దవారిని జ్ఞాపకం తెచ్చుకోవడాలూ, ఇవేమీ చెప్పక పుణ్యం పాపం అని అసంబద్దమైనదేదో చెప్పేసి 'మమ' అనిపిస్తుంటారు.

మూడు రోజులెలా గడిచాయో అర్థం కాలేదు. ఆనందంగా, నిండుగా గడిచిపోయాయి. రాజమండ్రిలో అక్కడి చుట్టుపక్క గ్రామాల్లో ఎన్నో స్నాన ఘట్టాలున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లని చాలా చక్కగా చేసిందని చెప్పే ముందు, సగటు రాజమండ్రి వాస్తవ్యులెవరూ మొదటి రోజు జరిగిన దారుణాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. "మా రాజమండ్రికి మచ్చయితే పడిపోయింది కదండీ..." అని నొచ్చుకుంటున్నారు. తిరుపతిలోనో లేదా మరో పుణ్యక్షేత్రాల్లోనో వీఐపీ టికెట్లెందుకు, వీ ఐ పీ దర్శనాలెందుకని అమాయకంగా వాపోయే వారికిపుడైనా తెలిసొచ్చుంటుంది. వారికి ఒచ్చినా రాకున్నా..కనీసం ఆ వీ ఐ పీ లకైనా ఒచ్చుంటుంది. రోడ్డుకు ఎడమవైపే కారు నడపమంటే, కాదు నేను కుడివైపే నడుపుతా అనే తింగరోడ్ని ఏమీ చేయలేం కానీ, వీ ఐ,పీ టాగ్ తగిలించుకుని 'నేను సామాన్యుల మధ్యే స్నానం చేస్తా'  అని సాక్షాత్తూ  ముఖ్యమంత్రే నియమాల్ని తుంగలో తొక్కితే జరిగే నష్టం చూశాం. తప్పు చిన్నదిగానే ఉంటుంది. కానీ పర్యవసానంగా ఒచ్చే విపత్తు ఎప్పటికీ పెద్దదిగానే ఉంటుంది. చేతులు కాలాక, ఆకులు పట్టుకుని పిసుక్కుంటే ఏం లాభం. ప్రతీ దాన్నీ మీడియా దృష్టికి తేవాలి, జాతీయ అంతర్జాతీయ గుర్తింపు పొందాలి అనే ఐడెంటిటీ క్రైసిస్ లాంటిదేదో ముఖ్యమంత్రి గారిని పట్టి పీడిస్తుందేమో..ఏదో షార్ట్ ఫిల్మ్ టైప్ లో ఈ తతంగాన్ని జరిపించటం కోసం, మేకప్ వేసుకుని నేషనల్ మీడియాని వెంటబెట్టుకుని బయలు దేరాడనీ, నాలుగు వేల పోలీసుల మధ్య ఈయనొక 'సా...మా...న్యు...డి'  లా పూజలు జరిపాడనీ, ఎన్టీఆర్ లా ఉండే శ్రీ కృష్ణ విగ్రహావిష్కరణలో అపశృతి అనీ, అధికార వికేంద్రీకరణకి ముఖ్యమంత్రి వ్యతిరేకం కాబట్టి 'ఎనీ వేర్, ఎనీ సెంటర్.. సింగిల్ హాండ్'..అనీ,  'అంతా నేనే...అన్నిటా నేనే' ..అని అధికార కేంద్రీకరణకే ప్రాధాన్యం ఇవ్వటం వల్లా అనీ, ఇలా రకరకాల కథనాలు వినిపిస్తున్నా, మొదటి రోజు తన స్పెక్ట్స్ షాపు ముందర కనపడని పోలీసులు, సంఘటన జరిగిన మరుసటి రోజునుంచి విపరీతంగా పనులు చేస్తూ కనిపించారని ఒక పెద్దాయన చెబుతున్నపుడు, మొదటి రోజుటి అధికారుల నిర్లక్ష పాత్ర కూడా ఎంతో కొంత లేకపోలేదు అనిపిస్తుంది. 'తిలా పాపం తలా పిడికెడు' కాబట్టి, మీడియా 'మహా' అత్యుత్సాహం, కేవలం ఒక్క పుష్కర ఘాట్ నే హైలైట్ చేయటం, తక్కిన ముప్పై పై చిలుకు పుష్కర ఘాట్ లను మరచి పోవటం, దానికి తగ్గట్లు అక్కడా ఇక్కడా టీవీ అయ్యవార్లు మైకుల ముందు ఊదరగొట్టడం,  మనకు ప్రతీదీ అఖండమే అనే విషయాన్ని విస్మరించి, కనీసం అంతకు రెండు రోజుల ముందు విడుదలయిన బాహుబలి సినిమా టికెట్లకోసం కొట్టుకున్న పిచ్చి జనాల్ని చూసయినా, మన పిచ్చిని అంచనా వేయటంలో ఘోరంగా విఫలమవడం మున్నగునవన్నీ వెరసి ముప్పై ప్రాణాలు అధికారికంగా. అనధికారిక ప్రాణనష్టాల్ని బహిరంగ రహస్యమైనా, రహస్యంగా పెట్టకపోతే..'మిస్సింగ్' అని కొంత కాలం వెనక్కి జరపకపోతే..ప్రతిపక్షాల దాడుల భయం మిన్నంటుతుంది కాబట్టి ప్రస్తుతానికి ఓ ముప్పై వేసుకుని, దానితో పాటు ఎవరి హయాంలో ఎంతెంత, ఏ పండగలో, ఏ కుంభమేలా లో, ఏ పుష్కరాల్లో ఎంతెంత మంది అని లెక్కలు కూడా పక్కనే రాసేస్తే..సగటు జీవి 'ఓ..ఇపుడు నయమే'  అనుకోకుండా ఉండడు, మరుసటి రోజునుండే మళ్ళీ మునగకా మానడు, 'అయితే అయింది,ఇక కానివ్వం'  అని పోలీసాయన బెల్ట్ ని టైట్ చేసుకోకుండా మానడు.

బాహుబలి ఔట్ అండ్ ఔట్ కొన్ని హాలివుడ్ సినిమాలకి కాపీ అంటే నమ్మం కానీ, కాశీలో గంగా నది ఒడ్డున ఇచ్చే హారతిని ఇపుడు అఘమేఘాల మీద, అదీ ఈ పుష్కర సమయంలో ఏదో పొడిచేసినట్టు మన గోదావరి నది ముందు ప్రారంభించినపుడైనా మనం నమ్మాలి, మనం పక్కా కాపీ కాట్ లమని. ఇపుడు, ఈ రద్దీలో, కాశీలో ఎప్పటినుంచో జరుగుతున్న హారతి కార్యక్రమాన్ని ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయటంలో ఏమి ఔచిత్యమో అర్థం కాదు. సాయంత్రం ఆరున్నరకి అని డిక్లేర్ చేశాక జనాలు ఊర్కుంటారా...అదే సమయానికి ఫస్ట్ షో చూసిన ఎక్స్పీరియన్స్ ని గుర్తు తెచ్చుకుని మరీ ఎగబడతారు. అనవసర డాంబికాలకి కొంత దూరం ఉండటం ఎంత అవసరమో ఇలాంటివి చూసి నేర్చుకోవచ్చు.

కానీ, మొత్తానికేమంటే, సంఘటన జరిగిన రెండవ రోజు నుంచి, 'చూస్కో..నా సామిరంగా..' అన్నట్టు అటు అధికారులూ, ఇటు ముఖ్యమంత్రీ కష్టపడుతున్నారనటంలో సందేహం లేదు. బూట్లు కూడా విప్పకుండా పూజలు చేసాడు, కానీ మేము చూడండి అని ప్రతి పక్షాలూ, నోరు విప్పని సినీ- రాజకీయ నటుడూ తమ వంతు కృషి చేస్తూ..., 'ప్రజలను కన్న బిడ్డలా చూసుకోవాలనీ..చూసుకోలేక పోతే రాజీనామా చేసేయాల'నీ హిత వాక్యాలు, భర్తృహరి సుభాషితాలు పలకక పోతే..మనబోటి సామాన్యుడు వారిని గుర్తు పెట్టుకోరనే ప్రగాఢ నమ్మకాలతో..రెండు పరుష వాక్యాలు మీడియా ముందు వెదజల్లి పోతుంటారనటంలో కూడా సందేహం లేదు. ఎక్స్గ్రేషియాలూ, ఇంట్లో ఒకరికి ఉద్యోగ హామీలూ మనం వినక పోతే, మనల్ని మనం గిచ్చి చూసుకోవాలి బతికే ఉన్నామా లేక చచ్చామా అని. 'రాబోయే అసెంబ్లీకి దొరకక దొరకక భలే మంచి సబ్జెక్ట్ దొరికింది...హమ్మయ్య'  అనుకుని తృప్తి పడిపోయే ప్రతిపక్షమూ, ఎలా 'మేనేజ్'  చేయాలో మాకు తెలుసనుకునే పాలక పక్షమూ నడుమ, ఒక పక్షం రోజులు టీవీల ముందు జనాలకి తిట్లతో కూడిన ఎంటర్టైన్మెంటు ఉచితం.

ఇక పుష్కర ఘాట్ లవద్ద ఏర్పాట్లు చాలా బాగున్నాయి. మంచి నీటి నుంచి, ఆడవారు బట్టలు మార్చుకోవటానికి సౌకర్యాల దాకా సకల సదుపాయాలూ కల్పించారు. మురికి నీటిని కూడా పక్కకు తొలగించి మంచి నీటిని ప్రవహింప చేయటానికి మోటర్ లని కూడా వాడుతున్నారు కాబట్టి, అంటు వ్యాధులూ, చర్మ వ్యాధుల బెడద కాస్త తగ్గిందనే చెప్పాలి. వైద్య సదుపాయం, వలంటీర్లు, నిత్యాన్నదాన సంతర్పణలూ, పిండ ప్రదానాది కార్యక్రమాలకి పురోహితుల సేవలూ వంటివి కూడా ప్రతీ ఘాట్ లో మనకు కన్పిస్తాయి. ముఖ్యంగా టీవీల్లో ఊదరగొట్టినట్టు ఒకటి రెండు పుష్కర ఘాట్ లే కాకుండా, కాస్త ముందుకు వెళితే ఖాళీ పుష్కర ఘాట్లు అనేకం ఉన్నాయి. మేమయితే ప్రతీ రోజూ నీటిలో దాదాపు పది నిమిషాలకు పైనే ఎలాంటి ఇబ్బందులూ లేకుండా స్నానం చేశామంటే కారణం, రాజమండ్రి కి కాస్త దూరంగా ఉన్న 'ముగ్గళ్ళ' స్నాన ఘాట్ ని ఎంచుకోవటమే కారణం. కాబట్టి మిత్రులకి చెప్పేదేమంటే..కాస్త దూరం అయినా ఊరి బయట ఉండే స్నాన ఘట్టాల్ని ఎంచుకోండి. తనివితీరా పుష్కర స్నానం చేయండి. పాప పుణ్యాల గోల అటుంచి, సకుటుంబ, మిత్రు వర్గ సమేతంగా హాయిగా నదీ స్నానం ఆచరించి, పచ్చటి రాజమండ్రి పరిసర ప్రాంతాల్లోని సహజ ప్రకృతిని మనసారా ఆస్వాదించి రండి.

Wednesday, 8 July 2015

ll అర్ధాంతరంగా ముగిసే కవిత ll విరించి
..................................
నీవు నిదురించిన చోటే
నీ ఉదయాలు మేలుకోవచ్చు.

నీ నిర్హేతుక సాయంత్రాలు
ఏ నిదురలో ముగుస్తాయో..

నీ పాక్షిక నిదురలోకి
నీ ఉదయాలు కలలై రావొచ్చు

నీ శాశ్వత నిదురలో
నీ జీవితం ఒక కలగా మిగలొచ్చు.

ఇలా తీక్షణంగా చెప్పే కవితా పంక్తులు
నీకు యమా బోర్ కొట్టీయొచ్చు.

ఉరుకులు పరుగుల జీవితంలో
తీరిగ్గా ఆలోచించే ఓపిక నీకున్నా..
టచ్ స్క్రీన్ మీద స్కేటింగాడే
నీ చేతుల కుండకపోవచ్చు.
పద కాస్త అలవోకగా కవితలోకి
కారులో దూసుకు పోదాం.

నీ కారు పయ్యలు ముందుకి ఉరుకుతుంటాయి
రోడ్దు మధ్యలోని తెల్లటి గీతలు వెనక్కు కదులుతుంటాయి.
జీవితం అతి వేగం కదా...
కుడికాలు కింది యాక్సిలరేటర్ లో
పంచ ప్రాణాలు ఎగిరి దూకుతుంటాయి.

సిగ్నల్ దగ్గర అమానుషంగా మెరిసే రెడ్ లైట్
వెంటనే ఆరి పోవాలనుంటుంది.
ఛా...వంద సెకండ్లు ఆపాడా ఈ దరిద్రుడు
అని కోపంగా అరవాలనుంటుంది.
గ్రీన్ లైట్ త్వరగా పడిపోవాలనుంటుంది.
అడ్డొచ్చిన ప్రతి వాన్ని ఎగిరి తన్నాలని ఉంటుంది.
ఏ ఆర్ రహ్మాన్ ఫాస్ట్ బీట్ పాట కారులో ఊపందుకుంటుంది.
బయటి జనాలకు ఆ గజ్జల శబ్దం వూఫర్ లోంచే ఊపేస్తుంటుంది.
నీ ఒంట్లో నరాలు ఉప్పొంగుతుంటాయి.
రక్తాలు వేడెక్కే కొద్దీ...కిక్కు ఎక్కేకొద్దీ
నీ కారు పంచ కళ్యాణిలా దూసుకు పోతుంటుంది.
చెట్లు వెనక్కి ఉరుకుతుంటాయి.
మనుషులు వెనక్కి ఉరుకుతుంటారు.
వంద... నూటా ఇరవై కి.మీ. వేగం..జస్ట్ అంతే కదా.
వ్యూ మిర్రర్ లో ప్రకృతి అందాలు పారిపోతుంటాయి.
ఎంతకు ఐపోని ఈ సుత్తి కవితా పంక్తులని
త్వరత్వరగా చదివేయాలని ఉంటుంది.
చూపుడు వేలుతో బర్రున కిందకి స్క్రోల్ చేయాలనుంటుంది.
ఎంత కష్టపడి రాస్తే ఏం..
ఒక్క క్షణంలో లైక్ కొట్టి
'వండర్ ఫుల్' అని ఓ కామెంట్ పడేయాలనుంటుంది.

కానీ క్షణంలో అంతా మారిపోతుంది.
పెద్దగా బ్రేకు పడిన శబ్దం తరువాత జరిగే విధ్వంసం
నీ చెవులకి నిశ్శబ్దంలా ఉంటుంది.
పాత క్యాసెట్ అరిగి పోయినట్టు
అంతా గందరగోళంగా ఉంటుంది.
చివరి క్షణాలు శ్వాసిస్తున్నట్లు
నీ ఆలోచనంతా సన్నగా అవుతుంటుంది.
ఈ కవితను మెల్లగా చదవటం మొదలవుతుంది.
చూపుడు వేలుకింది స్కేటింగ్ షూ స్ చటుక్కున ఆగిపోతాయి.
రక్తం ఒక వైపుకు చిమ్ముతుంది.
శరీరం ఇంకో వైపుకు ఒరుగుతుంది.
ఈగల్లాగా జనాలు చుట్టూ మూగుతారు.
అర్జంటుగా ఉరికి పోయే కార్లు కూడా
పక్కకు ఆగి అడుగుతుంటాయి
చనిపోయాడా లేదా అని.
లైకూ కామెంటూ పడని కవితలాగా
ముఖం కమిలిన ప్రతీవాడూ..
పెదవి విరుస్తూ..ఒక కామెంటు పెడతాడు జీవితానికి
'అయ్యో..పాపం' అని.
 RIP అనే కామెంటు కోసం
ఇంకెవడో ఒకడు సెల్ఫీతో అప్ లోడ్ చేసేసుకుంటాడు.

ఆ అందవిహీన భయంకర రక్తపాత దృష్యాన్ని
అందంగా చూపే ప్రయత్నంలో..
రోడ్డు పక్కని ఓ పువ్వు విఫలయత్నం చేస్తుంటుంది.
ఆ పూవు వంక చూసి
నీ ఆఖరి చూపులు నిట్టూరుస్తాయి.
అపుడు నీ జీవితం..
అర్ధాంతరంగా ముగిసిన అద్భుత కవితలాగా కనిపిస్తుంటుంది.
ఎన్నో లైకులతో కామెంట్ లతో ఈ కవిత కూడా ముగుస్తుంది.

8/7/15

Tuesday, 7 July 2015

అ కు అ వత్తిస్తే...పార్ట్ 3
......................................

* సినిమాల్లో పెద్ద హీరో....రాజకీయాల్లో పేద్ద కమెడియన్

* నేను పిల్లి లాంటోన్ని. అది గడ్డం చిన్నగా పెంచుద్ది, నేను పెద్దగా పెంచుతా. మిగతా అంతా సేమ్ టూ సేమ్.

* అవతలవాడికి ఏమీ అర్థం కాకుండా గంటసేపు మాట్లాడటం ఎలా?

* పొలిటికల్ లీడర్ ల ప్రభావం జనాల మీద ఎంతుందో తెలియదు కానీ, పొలిటికల్ కమేడియన్ ల ప్రభావం చాలానే ఉంది.

* బాగానే బట్టీ పట్టాను. కానీ ఈసారి కూడా రాసిచ్చిన స్క్రిప్ట్ పేపర్లు అటూ ఇటూ అయ్యాయి. లేకుంటేనా....

* నేను చెప్పనందుకే ప్రధాన మంత్రి ఏ ఆక్షనూ తీసుకోలేదు. ఇపుడు చెప్పా కదా...ఇపుడు తీసుకుంటాడు.

* చూడమ్మా సతీ సావిత్రీ..నీవేదైనా అడుగు...ఆ ఒక్క ప్రశ్న తక్క.

* నన్ను ఆంధ్రోడు అనొద్దు...పలీజ్. నేను విశ్వ మానవుణ్ణి

* క్రిమినల్స్ ని వెనుకేసుకొస్తే సివిల్ వార్ రాదు?.

* నేను ప్రశ్నిస్తా అన్నాను.మీరు నన్ను ప్రశ్నిస్తే ఎలా.

* నీవుఎవరైతే నాకేంటి . నేను బొమ్మా..ఒకరి చేతిలో కీలు బొమ్మ ని.aaahh

* కంచు మ్రోగినట్టు పంచు మ్రోగునా.
విరించి    ll  ఎవరు కవి  ll
........................................
నీ బాధ నానుండి ప్రవహించాలని
ఈ అక్షర గునపాలతో
నాలో నేనే ఒక వాగు తవ్వుకుంటాను.

మనుషుల జాడే కానరాని
నీ ఎడారిలో
నీ సముద్రంలో
నీ మైదానంలో
నేనూ ఒక సాటి మనిషిలా నిలబడతాను.

ఎంత పొంగినా కట్టలు తెంపలేని నదిలా
జాగ్రత్త పడుతూ  నీవు
ఎంత తవ్వినా నీరు పడని
బోరు బావిలా నేను
ఒకే సమరాంగనలో
రెండు పేలని తూ టాలమవుతాం.

ఏం..అనామక స్వప్నంలా వచ్చి పోయే
కవితా పంక్తుల్లోకైనా ఒక అక్షరమై ఒస్తే
నీ గంటేంపోతుంది?.

ఇన్ని వేల మాటలు నీ కోసం రాసీ రాసీ
చివరికి నీ అనుపానులు కూడా వాటిల్లో
నేను కనుగోలేనపుడు
నన్ను నాకు చూపించే ఈ కవితాద్దాలను
నెత్తికేసి కొట్టుకోనా..?

నీ ప్రాంగణంలో నిలబడినంతనే
పుంఖాను పుంఖాలుగా
కవిత్వం వచ్చేస్తుందనే నా వెర్రి భ్రమలో
నేను తలమునకలైనపుడు
విశ్వానికుండే బాధనంతా
భుజానికెత్తుకుని
శిలువేసిన యేసు ప్రభువులా
నువు నడుస్తుంటావు చూడు..
అపుడనుకుంటాను
కాళ్ళీడుస్తూ నీవు రాసే కవిత్వం ముందు
ఖాళీ కాగితాల మీది ఈ కవిత్వం ఎంతటిదని.

ఓ కష్ట జీవీ...
నీవే అసలు సిసలు కవివి.

5/7/15

Friday, 3 July 2015

ఎఫ్.బీ. లో మొదటిసారి నిన్నొక సోదరుడిని బ్లాక్ చేశాను. ఇది నా స్వభావానికి పూర్తిగా భిన్నం. పోట్లటకైనా 'సై' అంటాం కానీ, పూర్తిగా బ్లాక్ చేసేసేయటం a little bit  డిఫెరెంట్ గా అనిపించింది.  నిన్న ఈ సదరు సోదరుడు నా వాల్ మీదకొచ్చి తిట్లదండకం మొదలెట్టాడు. ఏంటో మరి ఏం మెంటల్ డిసార్డరో తెలియదు. భలే కామిడీ గా ఉండింది కాసేపు. స్మితా సబర్వాల్ గారిని ఇష్టం వచ్చినట్లు అన్నారని నేను రాసిన ఆర్టికిల్ కింద, నేను భారత దేశాన్ని అవమానిస్తున్నానట. Mind blowing...Gingiralu tiriging kadaa.. జేపీ గారు ఓటుకు నోటు విషయం లో చెప్పిన అభిప్రాయాన్ని షేర్ చేసినందుకు, దేడ్ దిమాక్ సాలేగాడు చెప్పిన విషయాన్ని దేడ్ దిమాక్ సాలేగాడిలా షేర్ చేశానట. సరే మరి, మనకంత తెలివేడిస్తే బాగానే ఉండేదికదా. ఏ ఐయేఎస్సో ఐపీఎస్సో ఐపోతుండె. అవి లేకనే గద గిట్ల ఉన్నం. అదే ఇషయం జెప్పిన. తిట్టడమే సోదరుడి ప్రధాన ఉద్దేశం కాబట్టి 'ల' కారాలతో తిట్లందుకున్నాడు. జీవితంలో కామెడీ మిస్ అయితుందనుకున్నపుడు ఇలాంటి వాల్లు మనకు మాంచి ఎంటర్ టైన్మెంట్. కాకపోతే మన సోదరుడు ఏ సినిమా హీరోకి తగ్గనంత అందగాడు. 'ఫేస్ ఈస్ ఇండెక్స్ ఆఫ్ ద మైండ్' తప్పని మరో సారి రుజువు చేసేంత బలంగా ఉన్నాయ్ ఆ అందమూ..ఆ మాటలూ. సరే మరీ ఇంత భీభత్సమైన కామెడీ ఎందుకులే అని ఇంకో చిరకాల మిత్రుడు చెప్పటం వలన బ్లాక్ చేసి పడేశాను. సరే.

ఇక అప్పట్లో భీభత్సమైన ప్రాంతీయాభిమానం చూపే ఫనాటిక్ మిత్రున్ని, అన్ ఫ్రెండ్ చేశాను. కొద్ది రోజులయ్యాక ఫ్రెండ్ చేద్దామనుకునేసరికి ఆయనే నన్ను బ్లాక్ చేసి పడేశాడు, అన్ ఫ్రెండు చేశానన్న అక్కసుతో. ఆ తరువాత యథావిధిగా నన్ను తిడుతూ ఏకంగా పైత్య రస కవితలు రాసేసుకున్నాడట. కామెడీ ఇషయాలకోసం వెతుక్కునే నా స్నేహితులు చూసి తెగ నవ్వుతూ  చెప్పేవారు. ఏం శాల్తీలు రా భయ్ అని.

మనం నవ్వుకోడానికి మన హాపీ అరవిందుడిలాంటి సహృదయ మితృలే  గాక అపుడపుడూ సీరియస్ గా కామిడీ చేసే ఇలాటి క్రేజీ గురవిందలు కూడా పనికొస్తుంటారని ఇందు మూలముగా చెప్పొచ్చాను.
ll  శవ యాత్ర  ll virinchi
................................................
మరణించాకే నీ యాత్ర మొదలవుతుంది.
శవాలు మోసే నిర్జీవ యాత్ర మొదలవుతుంది.
శవాలప్పుడు లేచి కూచుంటాయి.
బంధు మిత్ర వర్గం తోపాటు
నిన్ను చూసి జై కొడతాయి.
పూలు వేస్తాయి
దండలు కడతాయి..
పుష్ప గుచ్చాలు సమర్పించుకుంటాయి
కండువాలు మెడకు చుడుతాయి.
నుదుటిన తిలకం దిద్దుతాయి
ఇక తమ శవాల రారాజువి నీవేనని ప్రకటించుకుంటాయి.
నీ బంధువులు అమాయకంగా ఈ శవాల్ని చూడలేరు.
నీ మిత్రులు పాపం కంట నీరు పెట్టుకుంటారు.

నీవిక ప్రసంగిస్తావు.
అరవ లేవని తెలిసిన ప్రతిసారీ
నీ అరుపులు ఆకాశంలో అరణ్యాలవుతాయి
నీలో ముసురుకొస్తున్న భయానికి
నీ అరుపొక అద్దమౌతుంది
మైకు మీద విషం కక్కుతావు
శవాల చెవుల్లో
అమృతాన్ని వొంపుతావు
అవి వినాలనుకున్నవే నీవు చెబుతావు
చచ్చాక చెప్పే మాటలే కదా..
అలవాటుగానే అవి చప్పట్లు కొడతాయి.
డ్రమ్స్ వాయిస్తాయి.
బాణా సంచా కాలుస్తాయి.
నీ శవం మౌనంగా పడుకుని ఉంటుంది.

బతికున్న మనుషులు బిత్తరిల్లి పోతారు
పులిని చూసినంతగా నీ శవాన్ని చూసి భయపడతారు.
ట్రాఫిక్ జాంలో నడిరోడ్డు మీద వాచీని పోగొట్టుకుంటారు
వెనుక ఆంబులెన్స్ లో ఓ తల్లి ప్రసవ వేదన పడుతుంది
బురదలో పందులు దొర్లుతుంటాయి
ముందున్న కారుని గుద్దిన సైకిల్ వాడు వొచ్చి
కారతన్ని బండబూతులు తిడుతుంటాడు.
చుంచెలుకలు కలుగుల్లోంచి రోడ్డుమీదికి వచ్చి పోతుంటాయి
కుక్కలు మొరుగుతుంటాయి.

నీ శవం బరువెక్కుతుంటది.
మోసే వాళ్ళు వొంగిపోతుంటారు.
దింపుడు కల్లం దగ్గర ఒకసారి దింపుతారు
నారాయణ మంత్రం చెవిలో చదివి
బిగ్గరగా పేరుతో అరుస్తారు.
నీ వంశం పేరు, నీ ఊరి పేరు
నీ పిల్లల పేర్లు   వారి భవిష్యత్తు
అంతా మళ్ళీ నీకోసారి గుర్తుచేస్తారు.
నీవు మేలుకోవాలని చుట్టూ చేరిన బంధువులు
ప్రార్థనలు  చేస్తుంటారు
చటుక్కున లేచి కూర్చుని నవ్వాలని కోరుకుంటారు.
కానీ నీవు శవంలా బతకడానికే నిర్ణయించుకుంటావు
నారాయణ మంత్రాన్నసలు పట్టించుకోవు.
దండలేసిన శవాల్ని ఏడుస్తున్న బంధువుల్నీ పోల్చి చూసుకుంటావేమో,
శవాల్ని కౌగిలించుకుంటావు.
చరిత్రలో కట్టెవై కాలిపోతావు.

2/7/15
ఈ వార్తలు ఇంతటితో పునః ప్రసారం.
...............................................
* ఈ వార్తల్లోని అంశాలు కేవలం కల్పితాలు. ఎవరినీ ఉద్దేశించినవి కావు.

* కల్పిత కథలతో జనాలకి బోర్ ఒచ్చిందట సారూ...అందుకే ఈ కల్పిత వార్తలతో కొత్త రకం ఎంటర్టైన్మెంట్.

* అబద్దం చెప్పినా అతికినట్టుండాల. న్యూస్ రీడర్ లాగా.

* వాక్ స్వాతంత్ర్యం మనుషులకేనా...న్యూస్ ఛానల్స్ కి ఉండకూడదా.

* ఇవ్వాల్టికి బాంబులా పేలే న్యూస్ ఏమీ లేవు. అప్పట్లో బాంబు పేలినప్పటి న్యూస్ ని మల్లీ వేయండి.

* మన వాల్లందరికీ చెప్పు టీటీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి యెస్ అని కొట్టి, ఒకటి రెండు మూడు నాలుగుకి మెసేజ్ పంపమను...ఆ..యేదో చచ్చు ప్రశ్నలేవయ్యా..నీకవసరమా?.

* బ్రేకింగ్ న్యూస్....ఈ రోజు ఎలాంటి బ్రేకింగ్ న్యూస్లూ లేవు.

* స్టే ట్యూన్డ్ ...పార్టీ ఆఫీస్ బులిటెన్ మరి కాసేపట్లో.

* ఇపుడింకో బ్రేకింగ్ న్యూస్ కోసం బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ అస్.

* అన్ని రాజకీయ పార్టీలకతీతంగా వార్తలు ఉండాలనే ఉద్దేశంతోటే...ఈ ఒక్క పార్టీ వార్తలనే ప్రసారం చేస్తున్నాం.

* పొద్దున్నుంచి ఒకే విషయాన్ని మార్చి మార్చి చెబుతున్నా నేను...ఓ మూడు విషయాల్ని మూడు నిమిషాల్లో చెప్పమంటే 'ఎలా చెబుతారండీ'  అని ఏడుస్తావేంటయ్యా?.

* ఇపుడు ఫిల్మ్ బ్రేకింగ్ న్యూస్.

* వెల్ కం టూ న్యూస్ హవర్ డిబేట్. నా పేరు నారద.

* టీవీని ఈడియట్  బాక్స్ అని ఎలా అంటారు. ఇపుడసలది బాక్స్ లాగే ఉండటం లేదు కదా. వాల్ పేపర్ లాగా ఉంటున్నపుడు మీరెలా దాన్ని బాక్స్ అంటారు?.

* పీడనాన్ని నిరోధించే హక్కు మీకున్నంత మాత్రాన..న్యూస్ ప్రసారం చేసే వాక్ స్వాతంత్ర్య హక్కుని కాదంటారా?.

* న్యూస్ కి బ్రీఫింగ్ ఉండదు..బ్రేకింగే.

* సర్ మీరీమధ్య సంచలన తిట్లు తిడుతున్నారు. న్యూస్ హవర్ డిబేట్ కిదే మా ఆహ్వానం.

* మా ఛానల్ లో మిగతా ఛానల్స్ లాగా బ్రేకింగ్  న్యూస్  ఉండవ్. అన్నీ షాకింగ్ న్యూసే.

* ఏదో జరగబోతోందని నిన్న బ్రేకింగ్ న్యూస్. ఏమీ జరగటం లేదని ఈ రోజు బ్రేకింగ్ న్యూస్.

* బ్రేకింగ్ న్యూస్...ముసలితనం వచ్చి నిదురలో సహజ మరణం పొందిన సామాన్యుడు.