Saturday, 18 July 2015

రాజమండ్రి--పుష్కరాలు

ప్రతీ ఊరి జనానికీ ఒక 'స్పిరిట్' ఉంటుందేమో. అలాంటి స్పిరిట్ రావటానికి ఆ ఊరిలో ఉన్న ఎవరో ఒక గొప్ప పేరున్న మనిషి కారణం అయి ఉంటారు. రాజమండ్రిలో 'డొక్కా సీతమ్మ' గారి స్పిరిట్ అక్కడి ప్రజల్లో అంతర్లీనంగా ఉంటుంది. డొక్కా సీతమ్మ ఇంటికి ఎవరొచ్చినా కొసరి కొసరి అన్నం ప్రేమతో పెట్టేదట. ఆమె అందరినీ పిలిచి పిలిచి వడ్డించేదట. నా మిత్రుడు రవి కిరణ్ లో, వారి అమ్మగారిలో కూడా డొక్కా సీతమ్మ గారి స్పిరిట్ ప్రవహిస్తుందేమో. అసలు మన దగ్గరి బంధువుల ఇంటికి పోతే కూడా మనం స్వేచ్ఛగా మన ఇంట్లో ఉన్నట్టే ఉంటామని నమ్మకం లేదు. కానీ ఈ మిత్రుడి ఇంట్లో మాకు మా ఇంట్లో ఉన్నట్టే అనిపించింది. 'ఆ ఆప్యాయతలు, ప్రేమలు ఈ కాలంలో ఎక్కడున్నాయండీ?' ... అనేవారికి రాజమండ్రిని చూపించాలి. అక్కడి ప్రజల్ని చూపించాలి అనిపించింది. శివరాత్రి వంటి పండగలల్లో రాజమండ్రిలో ప్రజలు అన్నం తినే వారికోసం వేచి చూస్తుంటారట. అందరూ పెట్టే వారే కాబట్టి, తినే వారిని వెతుక్కోవాల్సి వస్తుంటుందని ఒక పెద్దాయన చెబుతున్నపుడు నిజమనిపిస్తుంది.

పుష్కరాలకు వచ్చే బంధు మిత్రుల బాగోగులు చూసుకోడానికోసమే హైదరాబాదు నుండి సొంత ఊరు రాజమండ్రికి, సకుటుంబ సమేతంగా వెల్లి, అక్కడ ఈ పది రోజులు మాలాంటి మిత్రులని, బంధువులనీ సాదరంగా ఇంటికి ఆహ్వానిస్తూ రుచికరమైన ఆంధ్రా వంటలను వండి పెడుతూ  ఆ కుటుంబం ఎంత సేవ చేస్తోందో. పుణ్యాల కోసం మునగండని చెప్పే మత పెద్దలు, పండగంటే 'సెలెబ్రేషన్ ఆఫ్ లైఫ్ విత్ యువర్ ఫెలో హ్యూమన్ బీయింగ్స్'  అని చెప్పనే చెప్పరెందుకనో. నదీ స్నానం, బంధు మిత్రుల కలయిక, మాటా మంతీ, మంచీ చెడ్డా, ఆప్యాయతలూ, ఇచ్చి పుచ్చుకోవడాలూ, కలసి జీవించటంలో ఉండే ఆనందాలు, పిండ ప్రధానమని గతించిన పెద్దవారిని జ్ఞాపకం తెచ్చుకోవడాలూ, ఇవేమీ చెప్పక పుణ్యం పాపం అని అసంబద్దమైనదేదో చెప్పేసి 'మమ' అనిపిస్తుంటారు.

మూడు రోజులెలా గడిచాయో అర్థం కాలేదు. ఆనందంగా, నిండుగా గడిచిపోయాయి. రాజమండ్రిలో అక్కడి చుట్టుపక్క గ్రామాల్లో ఎన్నో స్నాన ఘట్టాలున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లని చాలా చక్కగా చేసిందని చెప్పే ముందు, సగటు రాజమండ్రి వాస్తవ్యులెవరూ మొదటి రోజు జరిగిన దారుణాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. "మా రాజమండ్రికి మచ్చయితే పడిపోయింది కదండీ..." అని నొచ్చుకుంటున్నారు. తిరుపతిలోనో లేదా మరో పుణ్యక్షేత్రాల్లోనో వీఐపీ టికెట్లెందుకు, వీ ఐ పీ దర్శనాలెందుకని అమాయకంగా వాపోయే వారికిపుడైనా తెలిసొచ్చుంటుంది. వారికి ఒచ్చినా రాకున్నా..కనీసం ఆ వీ ఐ పీ లకైనా ఒచ్చుంటుంది. రోడ్డుకు ఎడమవైపే కారు నడపమంటే, కాదు నేను కుడివైపే నడుపుతా అనే తింగరోడ్ని ఏమీ చేయలేం కానీ, వీ ఐ,పీ టాగ్ తగిలించుకుని 'నేను సామాన్యుల మధ్యే స్నానం చేస్తా'  అని సాక్షాత్తూ  ముఖ్యమంత్రే నియమాల్ని తుంగలో తొక్కితే జరిగే నష్టం చూశాం. తప్పు చిన్నదిగానే ఉంటుంది. కానీ పర్యవసానంగా ఒచ్చే విపత్తు ఎప్పటికీ పెద్దదిగానే ఉంటుంది. చేతులు కాలాక, ఆకులు పట్టుకుని పిసుక్కుంటే ఏం లాభం. ప్రతీ దాన్నీ మీడియా దృష్టికి తేవాలి, జాతీయ అంతర్జాతీయ గుర్తింపు పొందాలి అనే ఐడెంటిటీ క్రైసిస్ లాంటిదేదో ముఖ్యమంత్రి గారిని పట్టి పీడిస్తుందేమో..ఏదో షార్ట్ ఫిల్మ్ టైప్ లో ఈ తతంగాన్ని జరిపించటం కోసం, మేకప్ వేసుకుని నేషనల్ మీడియాని వెంటబెట్టుకుని బయలు దేరాడనీ, నాలుగు వేల పోలీసుల మధ్య ఈయనొక 'సా...మా...న్యు...డి'  లా పూజలు జరిపాడనీ, ఎన్టీఆర్ లా ఉండే శ్రీ కృష్ణ విగ్రహావిష్కరణలో అపశృతి అనీ, అధికార వికేంద్రీకరణకి ముఖ్యమంత్రి వ్యతిరేకం కాబట్టి 'ఎనీ వేర్, ఎనీ సెంటర్.. సింగిల్ హాండ్'..అనీ,  'అంతా నేనే...అన్నిటా నేనే' ..అని అధికార కేంద్రీకరణకే ప్రాధాన్యం ఇవ్వటం వల్లా అనీ, ఇలా రకరకాల కథనాలు వినిపిస్తున్నా, మొదటి రోజు తన స్పెక్ట్స్ షాపు ముందర కనపడని పోలీసులు, సంఘటన జరిగిన మరుసటి రోజునుంచి విపరీతంగా పనులు చేస్తూ కనిపించారని ఒక పెద్దాయన చెబుతున్నపుడు, మొదటి రోజుటి అధికారుల నిర్లక్ష పాత్ర కూడా ఎంతో కొంత లేకపోలేదు అనిపిస్తుంది. 'తిలా పాపం తలా పిడికెడు' కాబట్టి, మీడియా 'మహా' అత్యుత్సాహం, కేవలం ఒక్క పుష్కర ఘాట్ నే హైలైట్ చేయటం, తక్కిన ముప్పై పై చిలుకు పుష్కర ఘాట్ లను మరచి పోవటం, దానికి తగ్గట్లు అక్కడా ఇక్కడా టీవీ అయ్యవార్లు మైకుల ముందు ఊదరగొట్టడం,  మనకు ప్రతీదీ అఖండమే అనే విషయాన్ని విస్మరించి, కనీసం అంతకు రెండు రోజుల ముందు విడుదలయిన బాహుబలి సినిమా టికెట్లకోసం కొట్టుకున్న పిచ్చి జనాల్ని చూసయినా, మన పిచ్చిని అంచనా వేయటంలో ఘోరంగా విఫలమవడం మున్నగునవన్నీ వెరసి ముప్పై ప్రాణాలు అధికారికంగా. అనధికారిక ప్రాణనష్టాల్ని బహిరంగ రహస్యమైనా, రహస్యంగా పెట్టకపోతే..'మిస్సింగ్' అని కొంత కాలం వెనక్కి జరపకపోతే..ప్రతిపక్షాల దాడుల భయం మిన్నంటుతుంది కాబట్టి ప్రస్తుతానికి ఓ ముప్పై వేసుకుని, దానితో పాటు ఎవరి హయాంలో ఎంతెంత, ఏ పండగలో, ఏ కుంభమేలా లో, ఏ పుష్కరాల్లో ఎంతెంత మంది అని లెక్కలు కూడా పక్కనే రాసేస్తే..సగటు జీవి 'ఓ..ఇపుడు నయమే'  అనుకోకుండా ఉండడు, మరుసటి రోజునుండే మళ్ళీ మునగకా మానడు, 'అయితే అయింది,ఇక కానివ్వం'  అని పోలీసాయన బెల్ట్ ని టైట్ చేసుకోకుండా మానడు.

బాహుబలి ఔట్ అండ్ ఔట్ కొన్ని హాలివుడ్ సినిమాలకి కాపీ అంటే నమ్మం కానీ, కాశీలో గంగా నది ఒడ్డున ఇచ్చే హారతిని ఇపుడు అఘమేఘాల మీద, అదీ ఈ పుష్కర సమయంలో ఏదో పొడిచేసినట్టు మన గోదావరి నది ముందు ప్రారంభించినపుడైనా మనం నమ్మాలి, మనం పక్కా కాపీ కాట్ లమని. ఇపుడు, ఈ రద్దీలో, కాశీలో ఎప్పటినుంచో జరుగుతున్న హారతి కార్యక్రమాన్ని ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయటంలో ఏమి ఔచిత్యమో అర్థం కాదు. సాయంత్రం ఆరున్నరకి అని డిక్లేర్ చేశాక జనాలు ఊర్కుంటారా...అదే సమయానికి ఫస్ట్ షో చూసిన ఎక్స్పీరియన్స్ ని గుర్తు తెచ్చుకుని మరీ ఎగబడతారు. అనవసర డాంబికాలకి కొంత దూరం ఉండటం ఎంత అవసరమో ఇలాంటివి చూసి నేర్చుకోవచ్చు.

కానీ, మొత్తానికేమంటే, సంఘటన జరిగిన రెండవ రోజు నుంచి, 'చూస్కో..నా సామిరంగా..' అన్నట్టు అటు అధికారులూ, ఇటు ముఖ్యమంత్రీ కష్టపడుతున్నారనటంలో సందేహం లేదు. బూట్లు కూడా విప్పకుండా పూజలు చేసాడు, కానీ మేము చూడండి అని ప్రతి పక్షాలూ, నోరు విప్పని సినీ- రాజకీయ నటుడూ తమ వంతు కృషి చేస్తూ..., 'ప్రజలను కన్న బిడ్డలా చూసుకోవాలనీ..చూసుకోలేక పోతే రాజీనామా చేసేయాల'నీ హిత వాక్యాలు, భర్తృహరి సుభాషితాలు పలకక పోతే..మనబోటి సామాన్యుడు వారిని గుర్తు పెట్టుకోరనే ప్రగాఢ నమ్మకాలతో..రెండు పరుష వాక్యాలు మీడియా ముందు వెదజల్లి పోతుంటారనటంలో కూడా సందేహం లేదు. ఎక్స్గ్రేషియాలూ, ఇంట్లో ఒకరికి ఉద్యోగ హామీలూ మనం వినక పోతే, మనల్ని మనం గిచ్చి చూసుకోవాలి బతికే ఉన్నామా లేక చచ్చామా అని. 'రాబోయే అసెంబ్లీకి దొరకక దొరకక భలే మంచి సబ్జెక్ట్ దొరికింది...హమ్మయ్య'  అనుకుని తృప్తి పడిపోయే ప్రతిపక్షమూ, ఎలా 'మేనేజ్'  చేయాలో మాకు తెలుసనుకునే పాలక పక్షమూ నడుమ, ఒక పక్షం రోజులు టీవీల ముందు జనాలకి తిట్లతో కూడిన ఎంటర్టైన్మెంటు ఉచితం.

ఇక పుష్కర ఘాట్ లవద్ద ఏర్పాట్లు చాలా బాగున్నాయి. మంచి నీటి నుంచి, ఆడవారు బట్టలు మార్చుకోవటానికి సౌకర్యాల దాకా సకల సదుపాయాలూ కల్పించారు. మురికి నీటిని కూడా పక్కకు తొలగించి మంచి నీటిని ప్రవహింప చేయటానికి మోటర్ లని కూడా వాడుతున్నారు కాబట్టి, అంటు వ్యాధులూ, చర్మ వ్యాధుల బెడద కాస్త తగ్గిందనే చెప్పాలి. వైద్య సదుపాయం, వలంటీర్లు, నిత్యాన్నదాన సంతర్పణలూ, పిండ ప్రదానాది కార్యక్రమాలకి పురోహితుల సేవలూ వంటివి కూడా ప్రతీ ఘాట్ లో మనకు కన్పిస్తాయి. ముఖ్యంగా టీవీల్లో ఊదరగొట్టినట్టు ఒకటి రెండు పుష్కర ఘాట్ లే కాకుండా, కాస్త ముందుకు వెళితే ఖాళీ పుష్కర ఘాట్లు అనేకం ఉన్నాయి. మేమయితే ప్రతీ రోజూ నీటిలో దాదాపు పది నిమిషాలకు పైనే ఎలాంటి ఇబ్బందులూ లేకుండా స్నానం చేశామంటే కారణం, రాజమండ్రి కి కాస్త దూరంగా ఉన్న 'ముగ్గళ్ళ' స్నాన ఘాట్ ని ఎంచుకోవటమే కారణం. కాబట్టి మిత్రులకి చెప్పేదేమంటే..కాస్త దూరం అయినా ఊరి బయట ఉండే స్నాన ఘట్టాల్ని ఎంచుకోండి. తనివితీరా పుష్కర స్నానం చేయండి. పాప పుణ్యాల గోల అటుంచి, సకుటుంబ, మిత్రు వర్గ సమేతంగా హాయిగా నదీ స్నానం ఆచరించి, పచ్చటి రాజమండ్రి పరిసర ప్రాంతాల్లోని సహజ ప్రకృతిని మనసారా ఆస్వాదించి రండి.

No comments:

Post a Comment