Tuesday, 21 July 2015

విరించి ll   పరాయీకరణ   ll
............................................
ఒక రంగుల కల చుట్టుకున్న దేహంలోకి
మృత్యునొప్పి లాంటిదేదో
బొట్లు బొట్లుగా
నిదురలోకి జారుతూ..జారుతూ..
భళ్ళున ఎప్పటిలాగే తెల్లారిపోతుంది.

వడలి పోతున్న పై రెప్ప పైని అరణ్యాల్లోకి
ఒంటరితనమొక తుపాకీలా పేలిపోతుంది.
శబ్దానికి గొల్లున లేచిన పక్షుల్లా..
అనుభవాలో ఆశలో అఆలై ఎగిరిపోతాయి.
కింది రెప్ప లోతుల్లోకి జలపాతాలు ఎండిపోతాయి.

గుండె కలుగుల్లో ఊరే ఊహలనుంచి
తల ఫౌంటెయిన్ లో వెలిగే ఉపాయాల దాకా
వేసుకున్న జీవితపు ఘాట్ రోడ్డు పెచ్చలూడి వుంటుంది.
అక్కడే కదా..ఆ హయిర్ పిన్ బాండ్ మలుపు లోనే కదా..
నేను రెండుకాళ్ళ మీద నిలబడిన ఒంటరి బాటసారిని..!
రక్త మాంసాలతో ఊయలలూగే ప్రాణానికీ
జడ మనుషులతో తులతూ గే సమాజానికీ నడుమ
చర్మపు తొడుకొకటి చుట్టలా చుట్టుకుని
నన్ను నేను వేరు పరచుకున్న దేహాన్ని..!

గుంపులు..గుంపులు..!
వందలుగా వేలుగా
ఒంటరితనాల సమూహాలు.
రోడ్ల మీద..ఇండ్ల లోపల
జైళ్ళల్లో..ఉత్సవాల్లో..
అన్నింటా, శ్మశానంలో సమాధుల్లా
ఎవరికి వారుగా
ఇంకొకరికి వేరుగా
గుంపులు..గుంపులు
ఒంటరి మనుషుల గుంపులు..

గుంపుల్లోనే ఈ గోలంతా.
అంతరంగాల్లో అంతా నిశ్శబ్దత
నిశబ్దాల్లో మరింత అసంబద్ధత
బాహ్యాన్ని అంతరంగాల్లోకి
ఆత్మీకరించుకోలేని సందిగ్ధత.

ఎంతటి భగీరథ ప్రయత్నమీ ఒంటరితనం..
సంవేదనా భరిత జీవితంనుంచి
ఒక ఉద్వేగంగా
ఒక ఊహాలోకంగా
ఒక పిచ్చి నమ్మకంగా..
తప్పించుకు తిరిగే
ఒకానొక చివరి ప్రయత్నమీ ఒంటరితనం.

దేహాన్ని పరవశంగా చిత్రహింసలు పెట్టుకోవటం
ఆత్మని అత్యవసరంగా ఆక్రమించుకోవటం
ఒక వ్యసనంగా మారుతున్న నా కాలాల్లోకి..
చర్వణ చర్వితమూ, ప్రతి క్షణమూ
ఒక నిజం చచ్చి ఇంకో నిజంలోకి మేలుకునే సమయంలో..
నాకు నేను దొరకక 'ఐ మిస్ మై సెల్ఫ్'
అని పాడుకుంటున్న తరుణంలో..
ఒక చుట్టపు చూపుగా ఒచ్చిపోతుంటుంది నీ ఒంటరితనం
నా నిండు జీవితసారాన్ని
కొన్ని పదాల్లోకి కుంచింపజేస్తూ
నన్ను నిర్వచించేయాలనుకునే నీ తొందరపాటులో..
నీ తల బద్దలై, పది వేల గద్దలై ఎగిరిపోనీ గాక...
ఒంటరితనంలో పోయేదీమీలేదు..నీకైనా, నాకైనా.

నాకు నేనుగా నిర్వచించుకోవడానికి
నాకంటూ కొన్ని చివరి క్షణాలు అదృష్టంలా మిగిలుండాలి
అంతకు ముందుకొన్ని వందల రోజులు నేను బతికుండాలి.

20/7/15


No comments:

Post a Comment