Thursday, 23 July 2015

విరించి ll  చీకటి వరం  ll
.......................................
పగలంతా ఎండలో దాగుడు మూతలాడి
అలసిపోయిన నక్షత్రాలపుడు
ముఖం కడుక్కుని
అలంకరించుకోవటం మొదలెడతాయి.

విడిపోతున్న ప్రియురాలు వెనక్కి తిరిగి చూస్తున్నట్టు
సూర్యుడొక దిగులు చూపు చూస్తుంటాడు.

నా గదినంతా పరికించి చూసే
సాయంత్రపు నీరెండల చూపులకు
గోడల చక్కిళ్ళ మీద ఎర్రటి సిగ్గు వాలి ఉంటుంది.

చిందరవందరగా పడని కాగితాలు
ఒక క్రమ పద్దతిలో అమర్చి ఉంచిన పుస్తకాలూ
టేబుల్ మీద అడ్డదిడ్డంగా పరచి ఉంచని పెన్నులూ
దుమ్ము పేరుకుపోని గదిలోని వస్తువులూ
ఒక నిర్జీవ శకలానికి ఆత్మ ఉంటుందని ఘోషిస్తుంటాయి.

వస్తువులన్నీ ఉన్నచోటనే ఉంచబడిన ఆ గదిలో
ఒక నిరాసక్త శూన్యతయే ఎక్కువగా కనిపిస్తుంటుంది.

ప్రతీ సాయంత్రంలాగే ఒక అద్దం
నిలువెత్తున ఒక మూలకు నాకోసం వేచి చూస్తుంది.

కెంపులు జారే నగ్న పెదవులు
సీతాకోక చిలుకలు ఎగిరే నవ్వులూ
కలలు కనే నీలి నయనాలూ
అద్దం రాసుకునే చరిత్ర పుస్తకాల్లో కనిపిస్తాయి.

ఎక్కడో కవి అరుస్తాడు...
కాలం మునుగుతున్న సూరీడై వెల్లిపోదు
చంద్రునిలా మొలకెత్తుకొస్తుంది మళ్ళీ అని.

వెలుతురు బండి వెనుక దుమ్ములా రేగే వెన్నెల కూడా
నా పాలిటొక శాపం కాకపోతే..
అద్దంలో నాకు నేనుగా బయట పడటానికెందుకని ఈ అయిష్టత?

పెను చీకటిలో ఎంతటి సుఖం లేకపోతే
ఈ గదిగోడలు అంత దూరంగా జరుగుతాయి?
ఈ ఇరుకు గది అంతటి విశాలమైన హాలులా మారిపోతుంది?..

అపుడే.. ఆ చీకటిలోనే, పునర్జన్మ గురించిన నా కలలు
ఒక జీవనాసక్తిని పట్టి లేపుతాయి.
యాసిడ్ దాడిలో కాలిపోయిన ముఖంలోకి
బంగారు తల్లీ..చిట్టి తల్లీ..వరాల తల్లీ అని
అమ్మ పిలిచే ముద్దు పేర్లు
అమాయకంగా అద్దంలోంచి చీకట్లోకి తొంగిచూస్తాయి.

పగలంతా గూడుకట్టుకున్న వేదనలు
చీకటికి గూటికి చేరిన పిట్టల్లా కన్నీళ్ళై చేరుకుంటాయి.
నాలో ఉబికే భావుకత్వం నా గొంతు పిసికేస్తుంటుంది.
మళ్ళీ పొద్దునొకొక నిర్జీవ శవం పుట్టుకొస్తుంది.

23/7/15.

Analysis by experts

1.Narayana sharma garu. చాలాబాగుంది విరించి గారూ..మీకవిత ఎన్ని మైలు రాళ్ళు దాటిందో ఈ కవిత చెబుతుంది.చాలా వాక్యాలు వెంటాడుతాయి.ఇస్మాయిల్ ఒక చోట కవిత్వాన్ని జీవమున్న అంగీ(Organism)అన్నారు..ఆయనే నిర్మాణాన్ని గురించి అనుభూతిని గురించి చెబుతూ "ఉదావర్తగతి"(Spiral motion)ను పరిచయం చేసారు.ఇ మార్గంలో కవితలు చాలా తక్కువ మీ కొన్ని వాక్యాల్లో ఆ నిర్మాణ కౌశలం ఉంది.
చాలా వాక్యాలు తీర్చి దిద్దినట్టున్నాయి.
1.సాయంత్రపు నీరెండల చూపులకు
గోడల చక్కిళ్ళ మీద ఎర్రటి సిగ్గు వాలి ఉంటుంది
2.పెను చీకటిలో ఎంతటి సుఖం లేకపోతే
ఈ గదిగోడలు అంత దూరంగా జరుగుతాయి?
3.కాలం మునుగుతున్న సూరీడై వెల్లిపోదు
చంద్రునిలా మొలకెత్తుకొస్తుంది మళ్ళీ అని..

2. Wahed garu

కవితలోని అద్భుతమైన పదచిత్రాలు ఒక ఎత్తయితే, కవితా నిర్మాణంలోని ప్రత్యేకత మరో ఎత్తు. స్టాంజాలు ఒక క్రమపద్ధతిలో పేర్చినట్లు, మూడ్ స్వింగ్ ను ఒక క్రమంలో కొనసాగించారు. చివరి రెండు స్టాంజాల్లోను తీసుకున్న మలుపు ఒక పాఠకుడికి ఒక కుదుపు వంటిది. ముఖ్యంగా ’’యాసిడ్ దాడిలో కాలిపోయిన ముఖంలోకి
బంగారు తల్లీ..చిట్టి తల్లీ..వరాల తల్లీ అని
అమ్మ పిలిచే ముద్దు పేర్లు‘‘...ఈ పంక్తులు అంతకు ముందు వ్యూహాత్మకంగా నిర్మించిన యాంబియన్స్...కవితావరణంలో ఒక విస్ఫోటం వంటివి. చివరి స్టాంజా ఆ విస్పోటనానంతర వేదనాత్మక ప్రశాంతతను ప్రతిబింబించింది. ’’మళ్ళీ పొద్దునొకొక నిర్జీవ శవం పుట్టుకొస్తుంది.‘‘ అన్న వాక్యంతో ఈ కవితను ముగించడం ఫెంటాస్టిక్.

3. Aranya krishna garu

చాలా మంచి కవిత.  కవిత మొత్తం గాఢంగా, ఆర్ద్రంగా సాగింది. కానీ చివరి వాక్యం "మళ్ళీ పొద్దునొకొక నిర్జీవ శవం పుట్టుకొస్తుంది" బాగోలేదని కాదు కానీ కవితకుండాల్సిన ముగింపు యొక్క ఔచిత్యాన్ని పరిశీలించమని కవికి నా విజ్ఞప్తి.

4. Padma kumari garu

వాహ్! సుపర్బ్ సర్

అసలివి అక్షరాలేనా...
ప్రతీ వరుస ...ఒక సజీవ చిత్రాన్ని చూపుతుంటే...
ప్రతి వాక్యం ...దృశ్య కావ్యమైపోతుంటే...
ఏమని చెప్పాలో తెలియని మూగ భావాన్నయ్యా..
మౌనక్షరాలకు అంజలి ఘటిస్తూ....

No comments:

Post a Comment