Thursday, 29 October 2015

Sick leave ( poem)

విరించి ll సిక్ లీవ్ ll
...............................
నా టేబుల్ కి ఎదురుగా
ఒంటరిగా కూర్చుని వున్న
అతడిని చూస్తే
ముడతలు పడిన రాళ్ళ ను చూసినట్టుంది

అయస్కాంతంలా అతుక్కుపోయే ఆ కళ్ళు
ఆకాశపు ఆవలి గట్టుని
దిగుడు బావుల్లోంచి వెతుకుతున్నట్టున్నాయి

పొగ గొట్టాల్లాంటి చేతివేళ్ళ నడుమ
ఎన్ని ఆలోచనలు బీడీ పొగలా మారివుంటాయో..

ఆ మసిబారిన పెదవుల నడుమ
ఊపిరితిత్తులు కాలిన వాసన

యంత్రపు శబ్దాల్ని చెవులకు బిగించుకుని
ఏకబిగిన మాట్లాడే అతడి మాటల్లో..
నామీదొక నిర్దాక్షిణ్యమైన నిర్లక్షం.

అపుడపుడూ మా మధ్య తారసిల్లే నిశబ్దంలోకి
అతడు కొత్తగా తొంగిచూస్తున్నట్టు కనిపించాడు.

తెరలుగా లేచే దగ్గు అంకాల నడుమ
నీటి ఒరిపిడికి నునుపు తేలి
బయటపడిన మైలు రాయిలా కనిపించాడు

సరే...సిక్ లీవ్ కి డాక్టర్ సర్టిఫికేటే కదా...!
ఇస్తానన్నాను.
రాసిస్తే మౌనంగా తీసుకున్నాడు.

శరీరాన్ని ఒక ఎక్స్ప్రెషన్ గా మార్చినవాడి దగ్గరినుంచి
నేనే ఎక్స్ప్రెషన్నీ ఆశించలేదనే చెప్పాలిపుడు.

అతడి కాలి కింద నలిపేసిన బీడీ ముక్కలో
అస్పష్టంగా ఒక నిప్పుకణం కనిపిస్తోందిపుడు.

28/10/15

Sunday, 25 October 2015

Telangana news of tomorrow

రేపటి తెలంగాణా వార్తలు
.................................        
* అంతరించి పోతున్న పులులు..ఐటం గర్ల్ లు గా మారి భారతదేశంలో కనుమరుగవుతున్న పులులు.

* ఐటం గర్ల్ స్థానం కోసం సడన్ గా పోటీ పెరిగిందంటున్న సినీ రాజకీయ విశ్లేషకులు

* తమని చివరికి ఒక దొంగతో పోల్చినందుకు మనోభావాలు దెబ్బతిన్నాయంటున్న ఐటం గర్ల్స్.

* ఐటం గర్ల్ ను సభా ప్రాంగణం లో చూసి కేరింతలు కొట్టి విజిల్లేసిన ఆంధ్రా జనం.

* ఐటం గర్ల్ గా మారినందుకు ఊరేగింపుగా పండగ చేసుకుంటూన్న అభిమానులు.

* తన బిడ్డ ఐటం గర్ల్ గా మారినందుకు అడవిలో ఉరేసుకున్న పులి.

* కొత్త ఐటం గర్ల్ కోసం ఐటం సాంగ్ ను రెడీ చేసుకుంటున్న దర్శకేంద్రుడు.

* ముంబాయి భామల అవసరం లేకుండా ఎట్టకేలకు తెలుగు నేలలోనే దొరికిన ఐటం గర్ల్.

* కొత్తగా వచ్చిన ఐటం గర్ల్,  తొడగొడుతూ,  మీసం తిప్పుతూ  డాన్స్ ఇరగదీసిందంటున్న అభిమాన సంఘాలు.

* చీకట్లో పనిచేసినందుకే తనకీ ఐటం గర్ల్ ఛాన్స్ ఒచ్చిందటున్న ఈ కొత్త భామ.

* తప్పించుకున్న పులి ఐటం గర్ల్ గా మారిందని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్న జూ అధికారులు.

Amaravathi. A telanganite view

అవశేషాంధ్రలో అమరావతి..తెలంగాణైట్ వ్యూ
..........................................................
ఇక ఈ రోజు నుండి ఆంధ్ర ప్రజలు హైదరాబాదు మీద ఉండే మమకారాన్ని వదలుకుని తమ స్వంత రాజధాని మీద మమకారాన్ని పెంచుకుంటారని ఆశించవచ్చు. తెలుగు వారికందరికీ హైదరాబాదు మీది మమకారం ఈ రోజుదికాదు. అది ఒకే సారి తెగిపోమంటే తెగిపోదు. తెలంగాణా వచ్చిన మరుక్షణమే "మీరిక హైదరాబాదుతో ఉండే మానసిక బంధాన్ని తెంచివేయాల్సిందే" అని అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు తట్టుకోలేక పోయారు. ఉద్వేగానికి గురయ్యారు. దీనికంతటికీ కారణం అయిన కేసీఆర్ ను విమర్శించటం వల్ల వారి మనస్సును కాస్త శాంతింపజేసుకునే వారు. అకస్మాత్తుగా రాజధాని లేకుండా ప్రజలు పాలకులు కొంత అస్థిరతను అనుభవించి ఉండింటారు. అది గమనించే చంద్రబాబు ఘనంగా ప్రతిష్ఠాత్మకంగా నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన చేపట్టి ఉండింటాడు. దీనితో చంద్రబాబు, హైదరాబాదు పట్ల ఆంధ్రా ప్రజలకు మానసికంగా ఉండే కనెక్టివిటీని సమర్థవంతంగా అమరావతి వైపు తిప్పగలిగాడు. ప్రజలలో హైదరాబాదును తన్నుకుపోయిన తెలంగాణా పట్ల ఉండే వ్యతిరేకత కూడా దీనివల్ల సమసి పోతుంది. ఇకపై పక్క రాష్ట్రంలో పుల్లలు పెట్టకుండా ఎవరి రాష్ట్రాన్ని వారు అభివృద్ధి చేసుకునే పనిలో పడటం వల్ల మాత్రమే మంచి జరుగుతుందని తెలుసుకుంటారు. తెలుగు వారంతా ఒకే రాష్ట్రంలో ఉండాలనే సెంటిమెంటు-సమైక్య వాదులు, ఇకనైనా కాస్త నోరు మూసుకుని ఉండే అవకాశం ఉంది. పనీ పాట లేక ఎంత సేపూ తెలంగాణా ప్రభుత్వాన్నీ, కేసీఆర్ నూ, తెలంగాణా ప్రజలనీ చులకన చేసి మాట్లాడే వెధవలకీ, పత్రికలకీ, ఛానల్స్ కి, ఇకపై వేరే పని దొరికింది కాబట్టి, వారి నోరూ కూడా మూలనపడే అవకాశముంది.

ఎటొచ్చీ రాయలసీమ వాసులు అసంతృప్తితో ఉన్నారు. అమరావతివల్ల సమీప భవిష్యత్తులో రాయలసీమకు ఒచ్చే లాభమేమీ కనిపించటం లేదనే ఉద్దేశం వారిలో కనిపిస్తున్నది. ఇప్పటికే ఒకసారి కర్నూలు ని రాజధానిగా చూసుకోవటంలో అవకాశాన్ని కోల్పోయిన వారు, మరలా ఇంకోసారి రాజధాని తమకి రాకుండా కాకుండా పోయిందనే బాధలో ఉన్నారు. ఇదే సమయంలో ప్రత్యేక రాయలసీమ రాష్ట్ర కల కూడా సాకారమౌతుందనే దిశగా ప్రజలు ఆలోచిస్తున్నారు. అయితే ప్రజల్లో ఈ కోరిక ఎంత బలంగా ఉన్నదో..ఎంత బలమైన నాయకత్వం దీనిని పార్లమెంటుదాకా తీసుకు పోగలదో అనేది మునుముందు మనకు తెలిసే అవకాశమున్నా ప్రస్తుతానికి ఈ అంశం అకడక్కడా మిణుకుమంటూ కనిపిస్తుంది. తెలంగాణా కల అరవై యేండ్లకు సాకారమయింది. చైతన్య వంతులైన ప్రజలు, సమర్థ నాయకత్వం రెండూ కలిస్తేనే ఇలాంటి ఉద్యమాలు ముందుకు సాగుతాయి. ప్రత్యేక తెలంగాణా కల ఏ ఒకరిద్దరి కలనో కాకుండా యావత్ తెలంగాణా ప్రజల కల కనుక, ఆ ప్రజల్లోంచే ఒక బలమైన నాయకత్వం పుంజుకుంది. ప్రజల్లో బలంగా ఆ కోరిక లేనిదే ఒక్క కేసీఆర్ ఏమీ చేయలేడని, కేసీఆర్ మీద మాత్రమే నిప్పులు చెరిగే ఆంధ్రా మిత్రులు ఈ సందర్భంగా తెలుసుకోవాలి. అదే విధంగా ప్రత్యేక రాయల సీమ ని కాంక్షించే వారు మొదట ప్రజల్లో ఆ కోరిక ఎంతవరకు ఉందనేది తెలుసుకోవాలి. తెలంగాణాలోలాగా పల్లె పల్లెలో మనిషి మనిషిలో గూడు కట్టుకుని ఉన్న ఆ సాహిత్యం నిజంగా ఉందా అని పరిశీలించుకోలాలి. ఒక నాయకుణ్ణి విమర్శించటమో ఇంకో నాయకుణ్ణి పొగడటమో చేసినంత మాత్రాన ప్రత్యేక రాష్ట్రం రాదని, ప్రజల్లోనే ఉద్యమమన్నది రావాలని తెలుసుకోవాలి.

ఏది ఏమైనా అవశేషాంధ్ర ప్రదేశ్ కి ఒక రాజధాని ఉండటం, నిజమైన తెలంగాణా వాదులకి, పట్టిన దయ్యం విడిచిందన్నంత ఊరట.

Highlites of Amaravathy inaugaration

అమరావతి శంకుస్థాపన హైలైట్స్.
..............,,........................
*రేవంత్ రెడ్డి సభా ప్రాంగణంలో కనబడగానే ఆంధ్రా జనం చప్పట్లు కొడుతూ కేరింతలు పెట్టారని ఒక టీవి ఛానల్ ఆంధ్ర ప్రజల్ని అవమానించింది.
మరీ దొంగను చూసి అంత ఆనంద పడే ప్రజలు ఆంధ్రా ప్రజలని అలా ఎలా చెప్పిందో అర్థం కాలేదు. ఆ ఛానల్ ఏదో సెపరేట్ గా చెప్పాల్సిన పని లేదనుకుంటాను.

*"మా తెలుగు తల్లికీ మల్లె పూదండ" పాటను ఎందుకనో ఏడుపు పాటలా పాడిన సింగర్ సునీత. పాట ఎత్తుకున్నపుడు శ్రావ్యంగా వినిపించినా..పాట చివరికి వచ్చేసరికి మరీ బాధతో పాడుతున్నట్టుగా పాడింది. శంకుస్థాపన రోజు ఇలా పాడటమా?. నరేంద్ర మోడీ ఈ పాట విని ఖంగు తిన్నట్టే అనిపించింది.

*ఒక్క కేసీఆర్ ముఖం తప్ప అందరీ ముఖాల్లో ఎందుకనో నవ్వే కనిపించలేదు. ముఖ్యంగా మోడీ చంద్రబాబు అసలు నవ్వలేదు. మోడీ కి పుష్ప గుచ్ఛం ఇచ్చేటపుడు చంద్రబాబు ఎందుకనో వంగి వంగి నవ్వాడు. కేసీఆర్ మాత్రం చాలా నిర్మలంగా కనిపించాడు. వేదిక మీదే కాక కింద కూర్చుని ఉన్న నారా లోకేష్ తదితరుల ముఖాల్లో కూడా ఆనందం కనిపించనే లేదు.

*అనర్గళంగా ఉపన్యసించే కేసీఆర్ సూటిగా సుత్తి లేకుండా తెలంగాణా ప్రజల ఆకాంక్ష ని వినిపించారు. మూడు నిముషాల్లో తన ప్రసంగాన్ని ముగించేసాడు.

*చంద్రబాబు ఉపన్యాసం పేలవంగా సాగింది. గతం లో హైదరాబాదు నేనే కట్టాను అని అంటాడనుకున్నాం కానీ ఎందుకో ఆ ముక్క మరచినందుకేమో పేలవంగా ముగిసింది. ఎక్కడా ప్రత్యేక ప్రతిపత్తిని గురించి ఊసెత్తలేదు. పైన్నుంచి ఊసెత్తొద్దని ఆర్డర్స్ ఉండిండొచ్చు.

*అలవాటులో పొరపాటుగా చంద్రబాబు ఉపన్యాసాన్ని ముగిస్తూ...జై హింద్...జై జన్మభూమి..అని మరోసారి జన్మభూమిని వేదికనెక్కించాడు. అంటే సింగపూరు ఆధ్వర్యంలో ఆంధ్ర ప్రజలందరూ ఉచితంగా పని చేసి రాజధాని కట్టుకోవాలని పిలిపిచ్చాడేమో. జై ఆంధ్ర ప్రదేశ్ ..జై అమరావతి అనకుండా జై జన్మభూమి అనటం అర్థంకాలేదు.

*పచ్చని బట్టలలో వేదిక మీద ఉన్న వారందరికంటే చాలా నీట్ గా హుందాగా చంద్రబాబు కనిపించాడు. మాట్లేడపుడు కూడా చెప్పదలచుకున్నది చాలా చక్కగా ప్రజెంట్ చేశాడనిపించింది.

*వెంకయ్య నాయుడు ఒక కన్ను మూసుకుని మాట్లాడినా రెండు రాష్ట్రాల గురించీ..తెలుగు ప్రజల గురించి మాట్లాడటంతో, కేంద్రం ఇరు రాష్ట్రాల అభివృద్ధికీ సహాయాన్నందిస్తుందన్న సందేశమిచ్చారు.

*నరేంద్ర మోడీ హిందీలోనే మాట్లాడింటే బాగుండేది. వెంకయ్య నాయుడు తెలుగు అనువాదం వల్లనేమో ఆయన సహజమైన ఫ్లో కాస్త తగ్గినట్టనిపించింది. ప్రత్యేక ప్రతిపత్తిని గురించి గానీ, ప్రత్యేక ప్యాకేజీగానీ ఏదైనా చెబుతాడేమో అని నాలుగు వందల కోట్లు ఖర్చు పెడితే...ఇంత మట్టి మొఖాన కొట్టి పోయాడని జనాలు గుసగుసలాడుకుంటున్నారు.

*వేదిక మీద జరిగే అంశాలను వివరిస్తూ యాంకరింగ్ చేసిన సాయి కుమార్ అండ్ సునీతల మాట్లడే తీరు హుందాగా కాక సినిమా ఫక్కీలో జరిగింది. ఏదో సినిమా హీరోని మాట్లాడటానికి పిలుస్తున్నట్టు ఒక్కో నాయకున్ని పిలుస్తున్నపుడు ఆ నాయకులు కాస్త విసుక్కున్నట్టు కనబడింది.

*ప్రతిపక్ష హోదా ఉన్న నాయకుడు జగన్ ని చంద్రబాబు నాయుడు పర్సనల్ గా వెళ్ళి పిలిచి ఉంటే బాగుండేది. రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు సభలో లేకపోవటం ఒక లోటుగానే వుంటుంది.

*మొత్తానికి చంద్రబాబు నాయుడు అనుకున్నట్టుగానే శంకుస్థాపనా కార్యక్రమాన్ని అదరగొట్టారనిపించారు..

Tuesday, 20 October 2015

REM (poem)

విరించి ll రెం (REM) II
................................
తలుపులెవరో బాదుతున్నారు.
అతడి ఒంటి నిండా రక్తం.
కాదు అతడి ఒంటి నిండా ఇంకు
వేలమంది ముందు వేదికనెక్కాను నేను
తలుపులు పగులగొట్టేశారు వాళ్ళు
ఇవ్వాల్సిందే గద్దించారు వాళ్ళు
ఒక ఇనుప ముక్క నా చేతిలో వుంది
ఎన్ని పదాలు కూర్చాను..ఎంతగా శ్రమించాను
అతడి ఒంటి నిండా రక్తం
కాదు కాదు అది రక్తం కాదు ఇంకు
వాళ్ళు నా ఇంటిలోకి దూరారు.
వాళ్ళు తలుపులు బద్దలు కొట్టేశారు.
నా భార్యా పిల్లలు ఎగిరి గంతేశారు.
నా తల్లిదండ్రుల కళ్ళ లో ఆనందం
అతడిని దారుణంగా చంపేశారు.
అవును అతడినే చంపేశారు
ఎంతగా నా వాళ్ళ ని దూరం చేసుకున్నాను.
నా చేతిలో ఒక కాగితం ముక్క ఉంచారు.
చంపి అవతలికి ఈడ్చేశారతన్ని.
జనాలందరూ చప్పట్లు చరిచారు
హాలంతా మారు మ్రోగేలా చప్పట్లు
ఇచ్చి తీరాల్సిందే పూనకం పట్టిన వాడిలా అరిచాను
నల్ల బ్యాడ్జీ ధరించి ఊరేగింపుగా నిరసన చేశాం
అలమారాలో అందంగా అలంకరించబడిన బహుమతి
ఇంటినిండా జనం గుమిగూడారు
పత్రికల్లో నా ఇంటర్వ్యూలు,ఫోటోలు.. నా మీద ఆర్టికల్సూ
అలమారా బద్దలు కొట్టేశారు వారంతా
నా నరాలు బిగుసుకున్నాయి
గుండెలనిండా గర్వం ఉప్పొంగింది
కాళ్ళు పట్టి ఒక మూలకి పాడేశారతని శవాన్ని
ఆనంద భాష్పాలు నా కంటిని కప్పేశాయి
నిన్నెపుడో మరచారు జనం అన్నారు వాళ్ళు
ఇది అన్యాయం అక్రమం అని గట్టిగా అరిచాం అందరమూ
ఎన్ని పదాలు కూర్చాను..ఎంతగా శ్రమించాను
ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా గడిపాను
ఎంతగా నా వారిని దూరం చేసుకున్నాను
అలమారాలోంచి బహుమతిని బయటకు లాగారు
నేను నా భార్య పిల్లలూ, అందరం అడ్డుకున్నాం
ఇస్తావా ఈయవా ఈ బహుమతిని..వారంతా బెదిరించారు
ఆ పెద్దమనిషి..నవ్వుతూ  నా మెడలో మెడల్ వేశాడు
నీ పుస్తకం నేనూ చదివాను గొప్పగా ఉందంటూ బహుమతి అందించాడు
గట్టిగా అరుస్తున్నాను నేను
నశించాలి నశించాలి దౌర్జన్యం నశించాలి
అతడి ఒంటినిండా రక్తం...కాదు కాదు అది ఇంకు
ఇంటినిండా జనం గుమిగూడారు...
ఇది అరుదైన బహుమతని కొనియాడారు
మరొక్క సారి ఆలోచించుకోండని ప్రాధేయపడింది భార్య.
అసలు ఇచ్చేయటమేంటని కసరుకున్నారు పిల్లలు

నాది నాది అని అరిచాను నేను
నాకిచ్చారు నాకిచ్చారని ఏడ్చాను
వెనక్కిచ్చేసేయ్ గద్దించారు వాళ్ళు
నా ఇన్నేళ్ళ కష్టం..ఇన్నేళ్ళ శ్రమ,కృషి
నా పదాలు..నా వాక్యాలు..నా కవితలు..
నా పేరుప్రఖ్యాతులు...నా బహుమతి
గట్టిగా నవ్వారు వాళ్ళంతా
నిన్నెపుడో మరచి పోయారు జనం..
వెనక్కిస్తే మళ్ళీ ఇపుడు గుర్తుచేసుకుంటారన్నారు
చరిత్రలో రాస్తారన్నారు.
అతడి ఒంటి నిండా రక్తం...అవునదిరక్తం
కాదది ఇంకు
ఆయన చచ్చి పోయాడు
నన్ను వీళ్ళు చంపేశారు
నా బహుమతిని చంపేశారు
ప్రజాస్వామ్యాన్ని ఈ దేశంలో చంపేశారు..
అందరూ ఇచ్చారు..నీవూ ఇచ్చేయాలన్నారు
నిరసన జెండాలెత్తి...వెనక్కివ్వాల్సిందేనని అరుస్తున్నాను నేను
ఇంకొక్కసారి ఆలోచించండంటోంది భార్య

మూసి వుంచిన నా కనుగుడ్లు వణుకుతున్నాయి
నా నరాలు కండరాలు బిగుసుకున్నాయి
అతడు చచ్చిపోయాడు.
తెగిన ఏనుగు తలలు, కంకాళాలు
తలకిందులుగా నడిచే మనుషులు
జడలు విరబోసుకుని నవ్వే పిశాచాలు
వికృతమైన రూపంతో మీదికొచ్చిన దయ్యం...

చెమటలు చెమటలు..
నిద్రలోంచి దుడుక్కున లేచి కూర్చున్నాను నేను
మనోజవం మారుత తుల్య వేగం..
అలమారాలో బహుమతి నవ్వుతూ కనిపించింది.
ముఖం కడుక్కున్నాను.
నిరసన వాదులంతా బయట నాకోసం వేచి ఉన్నారు.
వెనక్కివ్వాల్సిందే..ఇక తప్పదు.

20/10/15

Siraa pootha (poem)

విరించి ll సిరా పూత ll
.................................................................
పరిస్థితులు ప్రచండ వేగంగా మారిపోతున్నందుకేమో..
ప్రపంచానికి కావలసినంత తీరిక దొరికినట్టున్నది
నా ఏడుపు మీద పడి ఒకటే ఏడుస్తున్నది.

రాయీ రప్పల నడుమ ఎండుతున్న మొండి తలకాయతో
పెన్ను రీఫిల్ లోకి గాలివూపుకుంటూ బతికేవాడిని
సిరా వాసనలోంచి పచ్చి రక్తపు వాసనని పిండాలని
బొట్లు బొట్లుగా అక్షర కొలిమిలో కాలిపోయే రసవాదిని

ఈ లోకం దూరంగా విసిరేయబడిన అసైలమని తెలిసికూడా
ఒక చేతిలో స్వర్గాన్నీ ఒక చేతిలో పరుసవేదినీ చేజిక్కించుకుని
ఊహల్లోంచి, చరిత్రల్లోంచి పదాలై జారిపోయే మనుషులకోసం
ఆశగా ఆత్రంగా వెతుకుతూ  పుస్తకాల్లోకి ఉరికినవాణ్ణి
చివరికి సమాధి పలకలమీది పదాలుగా మిగిలిపోయే
మనుషుల కథల్ని అదృశ్యంగా అల్లిందెవరో...

అదిగో..కలత నిద్రలో నడిచే ఆ పిచ్చివాళ్ళిపుడే వచ్చారు.
సిరానూ, మకిలి మనసుల్నీ నా ముఖమంతా పులిమి
నేనొక కవితగా కథగా నిలబడగలనో లేదో చూద్దామని బెట్టు చేశారు.

చచ్చిబతికిన వాడెపుడూ జీవితాన్ని కొత్తగానే చూడాలనుకుంటాడు
తెల్లని గోడమీది చిన్న మరకైనా పెద్దదిగానే కనిపిస్తుంటుంది.
మంచులా కురిసిన ఆశ, క్షణాల్లో నిరాశగా ఘనీభవిస్తుంటుంది
కాళ్ళ కింద జేబుర్లాడుతున్న చీకటి మెట్లకోసం తడుముకుంటుంది.
ఏ ఆకాశ వాణో..స్నేహితుడేసిన భుజం మీది చెయ్యో..
పలికే పదాలు నిజమైనపుడు పెదవులెందుకు వణుకుతాయని అడిగినట్టుంటుంది.
పౌర్ణమి ఆటుపోటుల తాకిడి దాటిన సముద్రానికి కాసింత తీరిక దొరికితే..
అలలన్నిటినీ అదిమి ప్రశాంతంగా పాడ్యమి నిదుర చేయాలని ఉంటుంది.

అయినా వేగంగా తిరిగే ప్రపంచంకదా..
కావలసినంత తీరిక దొరికినట్టున్నది.
నా ఏడుపు మీద పడి ఒకటే ఏడుస్తున్నది.
నా ఏడుపు చూసి నేనే నవ్వుకుంటానని దానికి తెలియనట్టున్నది.

17/10/15

Wednesday, 14 October 2015

Kankara raallu (poem)

విరించి ll కంకర రాళ్ళు ll
.....................................
మనమిద్దరమూ కలిసి తిరిగే రోజుల్లో
వారంతా ఎంతటి అనుమానాస్పదంగా చూసేవారు..!

అంకం తరువాత అంకంగా
ఒక షేక్స్పియర్ నాటకంలా
మన ఉద్వేగాలూ మన స్నేహాలూ
కలిసి జీవించేవి ఆ రోజుల్లో

ఇబ్బడిమబ్బడిగా మనుషులు తిరిగే వీధుల్లో
తెలియని ముఖాల మధ్య వెలిగి పోయే తెలిసినముఖాల్లా
అటునుంచి నీవూ ఇటు నుంచి నేనూ ఒకరికొకరం ఎదురుపడినపుడు
సంవత్సరాల తరబడి కలువని ప్రేమ జంటలాగ
ఒకరి ఛాతి మీద ఒకరి ఛాతిని వుంచి గట్టిగా హత్తుకునే వాళ్ళం

అయిదురూపాయల ఇరానీ ఛాయ్ ని వన్ బై టూ తాగుతూ
మధ్య మధ్య లో మలాయ్ లో చక్కర కలుపుకుని తింటూ
ఛాయ్ వాడు చేతులెత్తి దండం బెట్టి నెట్టివేసే వరకూ
గంటలు గంటలు అమ్మాయిల గురించి మాట్లాడుకునే వాళ్ళం

మిరపకాయ బజ్జీలోడి దగ్గర ముక్కులోంచి కారే కన్నీటిని తుడుచుకుంటూ
కట్లెట్ బండీ దగ్గర ప్యాస్ నింపిన పానీపూరీని
నోరంతా తెరచి కుక్కుకుంటూ
ఇండియా గ్రేట్ నెస్ గురించి చర్చించుకునే వాళ్ళం

చార్మినార్బ స్టాప్ లో బస్ గురించి వెయిట్ చేసే వారి మధ్యన కూర్చుని
దేశ రాజకీయాల గురించి, సినిమా హీరోల గురించి
ఊగిపోతూ  గొడవపడి..అదే కోపంతో వెళ్ళి పోయేవాళ్ళం

అడ్డదారిలో వచ్చి ట్రాఫిక్ పోలీసుకి దొరికి జేబులంతా గుల్ల చేసుకున్నపుడు
నో స్మోకింగ్ జోన్ లో స్మోకింగ్ చేసిన పొల్లగాడిని పొటుకు పొటుకు తిట్టి పంపించినపుడు
తెలంగాణోళ్ళమని చిన్న చూపు చూసిన సాలే గాణ్ణి పడేసి తొక్కినపుడు
అవసరమొచ్చిన ప్రతీ అడ్డమైన సందర్భాల్లో
మా కీ కసం అంటూ మనం చెప్పిన అబద్ధాల్లో..
ఊపర్ వాలాకీ కసం అంటూ మనం చెడగొట్టిన ప్రమాణాల్లో..
బేగం బజార్ సెంటు సీసాల్లాగా అమాయకమైన స్నేహమే గుభాళించేది.

ఆ రోజుల్ని ఈ రోజు గుర్తు చేసుకున్నప్పుడు
మనల్ని అనుమానాస్పదంగా చూసిన ముఖాలే గుర్తుకు వస్తాయి.
పాత బస్తీ అల్లర్ల లో మనల్ని చెదరగొట్టిన కంకర రాళ్ళే గుర్తుకు వస్తాయి

నేను హిందువుననీ
నీవు ముస్లిమువనీ..
మన స్నేహం ఈ లోక సమ్మతం కాదనీ
నమ్మకాల్ని కలిగున్న వారెవరూ
మనిషికి మరో మనిషి స్నేహం తప్ప
ఇంకేమీ అవసరం లేదని నమ్మగలిగిన వారైతే అయ్యుండరు

ఒక సూర్యుడూ..ఒక చంద్రుడూ
కలిసి ఉండలేరనుకునే లోకానికి
మనం గ్రహణాల్ని ఊతంగా చూపించలేక పోయాం
గ్రహణం మూఢనమ్మకం కాదు
ఆకాశం లో జరిగే అద్భుతమని చెప్పలేకపోయాం

అందుకే కదా నేస్తం
ఒకనాడు చిన్న చిల్లు కూడా లేని మన స్నేహం లాగే
ఇపుడు మనమధ్య పెరిగిన గోడకు చిన్న చిల్లు కూడా లేకపోయింది
ఇన్షా అల్లాహ్ అనుకుంటూ నీవు, నేను బాగుండాలనీ
రాముడి గుడిలో చేతులు జోడించి నేను, నీవు బాగుండాలనీ
కోరుకోవటమొక్కటి మనకు దేవుడిచ్చి ఉండకూడదనే మనం కోరుకుందాం.
మనరోజొకటి మనకోసం మునుముందు వేచి ఉంటుందనే ఆశపడదాం.

14/10/15

Friday, 9 October 2015

Oka kitikee deggara (poem)

విరించి ll ఒక కిటకీ దగ్గర ll
.......................................
ప్రతీ సాయంత్రమూ ఎందుకనో
మసిబారిన పాత జ్ఞాపకాల్ని వెంటబెట్టుకొస్తుంది.

ఆ చల్లటి నీరెండల్లో..
నీరెండలు చిత్రించే పొడుగాటి నీడల్లో
మంద్రంగా ఊగే పచ్చని చెట్లల్లో
ఇంటికి గుంపులు గుంపులుగా తిరిగెళ్ళే
పక్షుల్లో..ఆవుల మందల్లో
నావంటూ కానివాటన్నింటిలో
నా జ్ఞాపకాలెందుకు దాగున్నాయో
అర్థం కాకుండా ఉంటుంది.

ఏ సముద్రపు ఒడ్డో..నదీ తీరమో..
కనీసం చెరువు గట్టో లేని
ఈ మహా నగరంలో..
ఉతికిన  దుస్తులు ఆరేసుకోవడానికి తప్ప
పనికిరాని నా గది కిటికీ కూడా,
మండువేసవి ఉక్కపోతలో తెరుచుకున్న
ఒక కిటికీ రెక్కలా మారిపోయినపుడు
సాయంత్రపు నీరెండలలో దాగున్న జ్ఞాపకాలు
ఉప్పెనలా పిల్లగాలిలోకి దూరుతుంటాయి.
కిటకీ లోంచి కనిపించే కొత్తటి తారు రోడ్డు మీద
ఒక సన్నటి సంతోషం వేలాడుతూ  కనిపిస్తుంది.

రణగొణ శబ్దం  చేస్తూ బర్రున దూసుకు పోయే
కార్లూ, బైక్ లూ, బస్సులూ
నిశ్శబ్దంగా ఒక పద్దతిగా నడుస్తూ పోయే మనుషులూ,
ఎవరూ కూడా, ఏవీ కూడా
నాతో సంబంధం లేనట్టు
నన్ను పలకరించకుండా పోతున్నందుకు
నా సంతోషంలో ఒకరకమైన నిశ్శబ్దం అలుముకుని ఉంటుంది.

యూట్యూబ్ లో పిచ్చుక శబ్దాల్ని
ఇయర్ ఫోన్లో వినే నేను
కిటికీ లోంచి ఒక పిచ్చుకైనా కనిపిస్తుందని
ఆరాటపడటంలో తప్పేమీ లేదనుకుంటాను.
గూగుల్ పిక్చర్స్ లో
డెస్క్ టాప్ వాల్ పేపర్ లో
అందమైన పూలనూ, చెట్లనూ, లాండ్ స్కేప్ లనూ
చూసి ఆనందపడే నేను
తామూ ఇక్కడే ఉన్నామని తలలూపే పచ్చని చెట్లకోసమైనా
వెతకటంలో ఆశ్చర్యమేమీ లేదనుకుంటాను.

కిటికీ ఊచలు పట్టుకుని నిలబడుకున్నప్పుడు
అందమైన ఊహాలోకాలకు దూరంగా
ఎక్కడో కారాగారంలో ఉన్నట్టు ఉంటుంది.

చల్లని జ్ఞాపకం కోసం కిటికీ దగ్గర నిలబడిన
నన్ను చూసిన మా అమ్మ అంటుంది కదా..
"కన్నా..! దుమ్మూ, ధూలి, పొగ తో కాలుష్యమైపోయిన ఆ గాలి
నీ ఆరోగ్యానికి మంచిది కాదు..కిటికీ రెక్క మూసేయమని"
జ్ఞాపకాలతో పాటు కిటికీ రెక్కను మూసేసిన నేను
అమ్మ ఒడిలో ఆ ప్రకృతినంతా కలగంటూ పడుకుంటాను.

9/10/15
విరించి   ll నొప్పి అనుభవం ll
...................................................
రోజంతా తీవ్రమైన నడుము నొప్పితో
నొప్పిని మరచి పోవటానికి మధ్య మధ్యలో
కునుకులాంటి నిద్రతో గడిపేసాక
అర్ధరాత్రికి అయిదు నిముషాలముందు
ఈ విషయం గుర్తుకు వచ్చింది.

ఉదయం నిదుర లేచినప్పటినుంచి
సీలింగు మీద తిరిగే ఫ్యాను
గిర్రున తిరుగుతూ  కనిపించినప్పటికీ
నా కళ్ళు కూడా దానితో పాటు గిర్రున తిరగకుండా
దానినే నిర్లిప్తంగా చూస్తూ ఉంటాయి
రాత్రి పదకొండు యాభై ఐదు అయ్యే వరకు
ఈ ఫ్యాను ఎంతగా తిరిగి అలసిపోవాల్నో...

సీలింగు మీద బల్లితో సహవాసం చేశానని
ఎవరైనా ప్రగల్భాలు పలకొచ్చేమో..
కానీ, బల్లుల్లేని తెల్లటి సీలింగు మీద
ఆలోచనల్ని అతికించుకుని చదవాలనిపిస్తుంటుంది.
ఆలోచనలు రావాలని కోరుకునే ధ్యానమిదేనేమో..
బెడ్ మీదే పడుకుని బయటి లోకం తెలియనపుడు..
ఒక కిటికీ కూడా నా వైపు చూడనపుడు
ఉన్న ఆలోచనలు కూడా అరిగిపోయిన క్యాసెట్టులా
బరువైన తలను గిర్రున తిప్పేస్తాయి.

కుడివైపుకి తిరిగితే ఒక నొప్పి..
ఎడమవైపుకి తిరిగినా మరలా కలుక్కున అదేనొప్పి
కండరమో..నరమో..ఉడుం పట్టులా పట్టి..
నడ్డిని మొసలి చీల్చినట్టు చీలుస్తుంటే...
నెత్తి మీద ఇనుప ఫ్యాను రెక్కలు కాకుండా..
స్వర్గాలు కనిపిస్తాయా..
కంటి ముందు అప్సరసలూ నర్తిస్తారా?.

మధ్య మధ్యలో టీ బ్రేక్..టిఫిన్ బ్రేకూ..
లంచ్ బ్రేక్..డిన్నర్ బ్రేకూ నూ..
ఇక ఒకటీ రెండు బ్రేకులంటావా తప్పనిసరి.
బ్రేకు ఏదయినా..పదింతలయ్యే నొప్పి
ఆ తరువాత పది రకాల టాబ్లెట్లు.
ఒకటి పసుప్పచ్ఛగా జారుతున్నపుడే అనుకున్నా
కడుపులో టాబ్లెట్ల జనాభా పెరిగి
కిడ్నీని బంజారా హిల్స్ చేసుకున్నాయని.

అమ్మా..నాన్న..భార్య ఎవరో ఒకరు
అన్నం కలిపి ముద్దలు నోట్లో పెడుతూ
కాసేపు బాధ పడుతూ  నొప్పిని పదింతలు చేస్తూ
కాసేపు ధైర్యం చెబుతూ..నొప్పికి సున్నా చుడుతూ
ఈ పదిహేను రోజులూ సపర్యలు చేశారు.
కంటికి రెప్పలా అనే కదా మామూలుగా చెప్పేది..
అలాగేనన్నమాట.

రాత్రయ్యాక అందరూ పడుకున్నాక
దిక్కు తెలియని సమయంలో..
ఒక దిక్కుమాలిన ఆలోచన ఒచ్చింది
ఒస్తే ఒచ్చింది..
అదెప్పుడొచ్చినా కవితలాగే వస్తుందని తెలుసుకదా.

ఇంకేముంది చకచకా కవిత రాసేసాక..
నడుము నొప్పిలోని అనుభవ సారమంతా పిండేశాక
అర్ధ రాత్రికి అయిదు నిముషాలకు ముందు
ఈ విషయం గుర్తుకు వచ్చింది.
వేసి ఉంచిన ట్యూబు లైటు తీయనేలేదని.
ఇపుడెవరు తీయాలి..?
ఎడతెగక రాత రాసే కవిత తీయాలా..?
ఎడతెగక తీపు తీసే నొప్పి తీయాలా..?

7/10/15

Monday, 5 October 2015

భాను మూర్తి గారూ...నన్ను ఇరికించారా..?
మా ఇంట్లో మీరూ, హెచ్చార్కే గారూ, నేనూ ఎదురెదురుగా కూర్చుని ఒక అందమైన సాయంత్రాన్ని మన మాటలతో నింపేసిన రోజు గుర్తుకొస్తోందిప్పుడు. హెచ్చార్కే గారు రాసిన ఈ పోస్ట్, కల్యాణీ గారు రాసిన 'పిపీలక సోదరులారా' అనే వ్యాసం లోనిది. అందులో ఆమె మధ్యతరగతి మేధావులు రాజ్యం చేస్తున్న దౌర్జన్యాన్ని ఖండించాలని పిలుపునిచ్చింది. రాజ్య దౌర్జన్యాన్ని శతృవుగా, పాముగా,  మధ్యతరగతి వారందరూ చీమలుగా రాశారు. మొత్తానికి కల్యాణి గారి వ్యాసము కూడా ఇంకేదో వ్యాసానికి వ్యంగ్య సమాధానమనేది హెచ్చార్కే గారి సమాధానం చదివాక అర్థం అయింది. అసలును వదిలేసి మనం సమాధానాలు చదువుతూ పోయాము కాబట్టి, అసలు ఎవరు దేని గురించి మాట్లాడుతున్నారో చూచాయగా తప్ప వివరంగా అర్థంకాలేదు.

అయితే హెచ్చార్కే గారి సమాధానం సడన్ గా మహాభారతమూ, బ్రాహ్మణులూ, శూద్రులూ ఎందుకొచ్చారో అర్థంకాలేదు. అసలు మొత్తానికీ ఏమీ అర్థం సరిగా కావటం లేదు కాబట్టి, ఈజీగా అర్థం అయిన ఈ ముక్క అందర్నీ ఆకర్షించింది. ప్రతీ పది పద్యాలకొకసారి బ్రాహ్మణులను పూజించాలని చెప్పిన ఆ మహాభారత పుస్తకమేదో, ఆ గ్రంధకర్త ఎవరో మనకు తెలియదు. ఆయన కూడా రిఫరెన్స్ ఇవ్వలేదు. మహా భారతం రాసిన వేద వ్యాసుడు పడవనడిపేవాడి కూతురైన సత్యవతికీ, పరాశరుడికీ కలిగిన కుమారుడు. జన్మ రీత్యా బ్రాహ్మణుడు అనటానికి లేదు. అయితే ఇక్కడ రెండే విషయాలు చెప్పదలచాను. ద్వాపర యుగం లో జరిగిన మహాభారత కథని, ఇపుడు ఈ సమాజానికి ఆపాదించి మాట్లాడుకోవటం విడ్డూరం. ఆ సమాజమే వేరు కదా. ఎంతో మార్పు వచ్చింది. గతి తార్కిక భౌతిక వాదం ప్రకారం ఆ మార్పు ఎక్కడినుంచో ఊడిపడదు. ఆ వస్తువు లోపలే ఉంటుంది. ద్వాపర యుగం నుంచి ఇప్పటి దాకా అసలు మార్పే జరగలేదంటే అది రీజన్ కి అతకదు. మహాభారతం ఒకప్పటి సాహిత్యంగా పరిగణిస్తే, నికరంగా చరిత్ర తెలియని సాహిత్యాన్ని కూడా మార్క్సిస్టు దృక్పథంతో విమర్శ చేయటం ఒక దోషమని వేల్చేరు నారాయణ రావుగారి అభిప్రాయం. ఆ విషయాన్ని అటు వదిలేస్తే...

మహభారత కాలంలో వర్ణాశ్రమ ధర్మం ఉండేది, కుల వ్యవస్థ కాదు. ఆ కాలంలో ప్రతీ నాలుగు సంవత్సరాలకొకసారి వర్ణాశ్రమ ధర్మం మార్చుకునే అవకాశం ఉండేదని బొజ్జాతారకం గారి ఒక పుస్తకంలో చదివినట్టు గుర్తు. రిఫెరెన్స్ తప్పక తరువాత ఇస్తాను. గీతలో కూడా శ్రీకృష్ణుడు 'చాతుర్వర్ణం మయా సృష్ట్వా గుణ కర్మ విభాగశః' అన్నాడు. గుణాన్ని బట్టి, కర్మని బట్టే ఆ కాలంలో వారి వారి వర్ణాన్ని నిర్ధారణ చేసేవారనేది స్పష్టం. రాధేయుడి ఉదంతమే ఇందుకు ఉదాహరణ. క్షాత్రమున్న వాడే క్షత్రియుడని, కర్ణుని క్షాత్ర పరిక్ష కు గురి చేసి, అతడు ఆ పరీక్షలో నెగ్గాకనే క్షత్రియుడయ్యి అంగ రాజ్యాధిపతి అయ్యాడు తప్ప, ఇప్పటి సమాజంలా క్షత్రియ కుమారుడు కాబట్టి క్షత్రియుడు కాలేదు. ఇక హెచ్చార్కే గారు, 'గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు' అనే అంశాన్ని ఉటంకించి ఇలా ప్రతీ పది పద్యాలకూ....అనే ఆరోపణ చేసినట్టైతే..ఆ సమాజంలో మేధావులనేవారు ఎవరైనా బ్రాహ్మణులనబడుతున్నారని అర్థం అవుతున్నది. అంటే మేథావులపై రాజ్య హింస ఉండేది కాదనేది కూడా స్పష్టం. గోవులు వ్యవసాయానికీ, ఎద్దులను కనటానికీ, తద్వారా రైతులకూ లాభం చేకూర్చుతాయి కాబట్టి, అవి శుభంగా ఉండాలి అని అంటే..కష్టజీవుల మీద కూడా రాజ్య దౌర్జన్యం లేదనేది స్పష్టం. మొత్తానికి మహాభారతం వర్గ పోరాటం కాదు. రాజ్యంకోసం ఒక రాజకుటుంబంలోని అన్నదమ్ముల మధ్య పోరాటం.

కాబట్టి హెచ్చార్కే గారు ఉటంకించిన ఈ ఉదాహరణ సందర్భానికి అతకదు. అయితే తరువాతి కాలంలో బ్రాహ్మణులు శూదృలమీద చేసిన దాష్టీకాలు ఖండించవలసిందే. దానికి మహాభారతాన్ని బూచిగా చూపటమంటే ఇంకా గతంలో, ద్వాపర యుగంలో జీవించటమే. హెచ్చార్కే గారు ఒకరు సేఫ్ పొజిషన్ లో కూర్చుని ఇంకొకరిని పోరాటం చేయండని పురమాయించటమేమిటని ప్రశ్నించారు. అంత వరకు బాగుంది. ఆ కాంటెక్స్ట్ల్ లో ఈ మహాభారత బ్రాహ్మణ ఉదాహరణ పొరపాటున ఒక రకంగా తొందరపాటున ఉటంకించి ఉంటారని నా అవగాహన. ఘటుగా రెస్పాండు అయ్యారు కాబట్టి ఇలాంటి తొందరపాటు పొరపాటు దొర్లి ఉంటుందని నా అవగాహన.  అయితే "మిమ్మల్ని కలాలు పట్టుకోమని ఎవరు నిర్ణయించారు, మీరే నిర్ణయించారు.. "అని అన్నపుడు, ప్రజల్ని కలాలు పట్టుకోమని ఇంకెవరు నిర్ణయించాలబ్బా అని నేను ఆలోచనలో పడ్డాను. మీరు రాయాలి, మీరు రాయకూడదు అని నిర్ణయించేవారున్నారా ఎవరైనా..? నాకైతే తెలియదు. వారెవరో చెబితే అసలు నేను రాయవచ్చో రాయకూడదో తెలుసుకుంటాను.
విరించి ll వెలుగుముద్దలు ll
......................................
ఈ దీపాలు ఎక్కడ ఆరిపోతాయో తెలియదు
ఈ మల్లెలు ఎపుడు విరబూస్తాయో తెలియదు
                *
చెట్ల ఆకుల మధ్య ఖాళీల్లోంచి
దట్టమైన అడవుల్లోకి చొచ్చుకెళ్ళే కిరణాలు
కారు చీకట్లలో కలలుగనే
ఒక వెలుగు ముద్దలా కనిపిస్తుంటాయి

కంటిముందు నాటకంలా వేలాడే ప్రపంచంలో
కొన్ని పగటి కలలు రాత్రి నిద్రని కలగంటాయి

బొంగురుబోయిన ఇనుప గొట్టం గొంతులోంచి
తుప్పుపట్టిన తూ టాలు కూని రాగాలు తీస్తుంటాయి

ఏమో ఎవరికి తెలుస్తుంది..!
దూరంగా ముసురుకున్న మేఘం
నిజంగానే వర్షంలా కురిసిందో..
గుట్టుగా రెండు పిడుగుల్ని రాల్చిపోయిందో..

రక్తపు ముద్దలుగా పాలిపోయిన వెలుగు ముద్దల్ని
పతాక శీర్షికల్లో చూస్తున్నపుడు
నాకెందుకనో తెలిసిరాలేదు
ఈ మల్లెలు నలిపివేయబడ్డాయని,
ఆ దీపాలిపుడే వెలగటం మొదలయ్యిందని

5/10/15

Friday, 2 October 2015

ఫేస్బుక్ సరదాలు (నాలుగున్నరవ భాగం part 4 1/2)
............................................................................
కొన్ని అనివార్య, అత్యవసర కారణాల వల్ల పార్ట్ ఫోర్ చిన్నగా రాయటమైనందుకిది నాలుగున్నరవ భాగం. వేషాల్రావుల కథలను ఇలా ఎగ్గొట్టి తెగ్గొట్టిన భాగాల్లో రాసుకుంటే తప్ప ఓ పది పన్నెండు భాగాల్లో ముగించలేం. లేకపోతే టీవీ సీరియల్స్ లాగా నెలల తరబడి సాగాదీయాల్సిన పరిస్థితి వచ్చే అవకాశమూ ఉంది. ఇలా నాలుగున్నరా, నాలుగూ ముక్కాల్ వంటి భాగాలు త్వరలోనే టీవీ సీరియల్స్ కి కూడా పాకి ఎంటర్టైన్మెంటు పీక్ స్థాయిలోకి పోతుందనే అనిపిస్తుంది. క్రికెట్టూ, సినిమాలూ, టీవీ, ఇంటర్నెట్టూ అన్నీ ఒక రోజులోని ఎక్కువ సమయాన్ని ఆక్రమించేసి, ఎంటర్టైన్మెంటు, ఎంజాయ్మెంటు తప్పిస్తే ఇంకోటి లేదు జీవితంలో అనే స్థాయికి తీసుకొచ్చేసాయి. సమాజంకోసం సినిమాలు తీస్తున్నాం అని చెప్పుకున్న దర్శకులు కూడా, ఇపుడు ఎంటర్టైన్మెంటు కోసం దయ్యాల సినిమాలు తీసుకుంటూ క్రియేటివ్ డైరెక్టర్స్ గా, మేధావులుగా చలామణి ఐపోతున్నారు. జిడ్డు కృష్ణమూర్తి గారినొకసారి అడిగారు, ప్రపంచ భవిష్యత్తు ఎలా ఉండబోతుందని..."రాబోయే కాలంలో సంస్థలు, పరిశ్రమలు, ఉద్యోగాలూ అన్నీ ఖాళీగా ఉన్న మనుషులను ఎంటర్టైన్ చేయటానికోసమే ఏర్పడతాయని" చెప్పారాయన. అది నిజమే కదా.

ఇక, వేషాల్రావు ఫేస్బుక్ లో వేసే రకరకాల వేషాల్లోకి వచ్చేస్తే, ప్రొఫైల్ పిక్ లో గానీ ప్రొఫైల్ నేమ్ లో గానీ ఫీమేల్ జండర్ కన్పిస్తే, వేషాల్రావు కండ్లు చాటంతవుతాయి. కేవలం గుడ్ మార్నింగ్ కామెంటు దగ్గరే ఆగడనీ, కవితల్రావు వేషం కట్టి కష్టపడి తస్కరించిన కవితనో, తిరస్కరించిన కవితనో కామెంటుతో కూడా జత చేస్తాడనీ అనుకున్నాం. కానీ అక్కడే ఆగితే వేషాల్రావెందుకవుతాడు. ఇన్ బాక్స్ కి చేరతాడు. సందర్భాన్ని బట్టి మెసేజ్ చేస్తాడు. ఒక్కో ప్రొఫైల్ కి ఒక్కో మెసేజ్ పెడతాడు. "మీ నవ్వు అద్భుతం మేడం. మీ పలు వరుస సూపర్బ్. మీరు రోజా పువ్వులా నవ్వుతారు. మీ నవ్వుతో నవ లోకాలూ నవనవలాడుతున్నాయి. మీ పెదవులు సీతాకోక చిలుక రెక్కల్లా విచ్చుకుంటే..నేను బద్దె పురుగులా ఒచ్చేస్తా". ఇలా ఒక్కొక్కరికే ఒక్కో మెసేజ్. పెళ్ళయి ఇద్దరు పిల్లలుండిన ఒక మహిళకు 'ఐ లవ్యూ' అని ఒకరోజు పెట్టాడు. ఇలా ఎందుకు మెసేజ్ చేశావని ఆమె అడిగితే, చాంతాడంత కథ చెప్పాడు. తను ప్రేమ రాహిత్యంలో కొట్టుమిట్టాడుతున్నాననీ, తనకిపుడు ప్రేమ కావాలనీ, దిగ్విజయ్ సింగయిపోయాడు. ఖంగుతిన్న ఆ మహిళ బ్లాక్ చేసేస్తుంది. ఏముందీ..ఇంకో ఇన్ బాక్స్ లో ఐలవ్యూ కనిపిస్తుంది. గొప్పవాడనీ, ఉదార స్వభావుడనీ, గొప్ప చదువులు చదివినవాడనీ, మర్యాదగా మాట్లాడతాడనీ ఫ్రెండు రిక్వెస్ట్ ఆక్సెప్ట్ చేసిన ఆమె, ఈ కంగాలీ మెసేజ్ చూసి కంగారు పడక తప్పదు కదా. అసలాడవారెవరైనా ఈయననెందుకు ఆక్సెప్ట్ చేస్తారంటే..పరిచయమైన కొత్తలో 'కోతల్రావు' వేషం కట్టింటాడు కాబట్టి. లోపలున్న వేషాల్రావుని ఇంకా అప్పటికి రిలీజ్ చేయలేదు కాబట్టి.

కోతల్రావుగా వేషాల్రావు నాటకాన్ని రక్తి కట్టిస్తాడు. యూనివర్సిటీ ప్రొఫెసర్ననో, డాక్టర్ననో, లాయర్ననో చెప్పుకున్నా పరవాలేదుగానీ, తనకు తానో పెద్ద సెలబ్రిటీననేంతగా బిల్డప్ ఇస్తాడు.అసలు సమాజం ఎంతగా చెడిపోయిందోనని లెక్చర్లిస్తాడు. ఇంగ్లీషులో మూడు నాలుగు కవుల పేర్లూ, రచయితల పేర్లూ బట్టీకొట్టి, వారి రచనల్ను చదువుతానంటాడు. ఇంగ్లీషు సినిమాలు తప్ప తెలుగు సినిమాలు చూడనంటాడు. ఈ కుళ్ళు సమాజాన్ని చూసి భరించలేక పోతున్న సమయంలో...నా సత్తా తెలిసిన నా మిత్రబృందం నన్ను ప్రాధేయపడటం వల్ల తాను కలం పట్టి కవిగా మారాననీ, సమాజోద్ధరణే ధ్యేయమనీ వివేకానంద లెవెల్లో ఫోజిస్తాడు. కావాలంటే ఈ కవిత చూడండి అని ఒకటి విసురుతాడు. "బండికింద కుక్కపిల్ల బండి లాగుతున్నదా..ఇంటిలోన పిల్లి పిల్ల పాలు తాగకున్నదా...రాజ్యం రెండు ముక్కలైతే రామరాజ్యమొస్తదా...కౌరవుల సేనలోన శకుని దాగి ఉన్నడా..వేర్పాటు వాదమా లేక సమైక్య నినాదమా..కుస్తీ పోటీలు పెట్టి లెక్క తేల్చుకుందమా..?" తెలంగాణా విడిపోతుంటే కడుపుమండి ఇలా రాసుకున్నానని చెప్పుకున్నాడు. ఈ వీర లెవెల్లో బిల్డప్ ఇచ్చేవాడు అలా సడెన్ గా ఈమెకి రోజుకొకసారి ఐలవ్యూ చెప్పటమే కాక, రోజుకోసారి మీ ఫోటో చూడకపోతే బతకలేనేమో అని కళ్ళల్లో ఒత్తులు పెట్టుకున్నానంటాడు. మీ చెప్పు తెగినా, నా పండ్లు రాలినా మీరే నాలోకమంటాడు. ఇక విషయం భర్తగారి దగ్గరికి తీసుకుపోతుంది పాపం ఆ ఇల్లాలు. ఏముందీ రెండు తిట్లు ఆవిడనే తిట్టి, ఫేస్బుక్ ఐడీ డీ-ఆక్టివేట్ చేయమంటాడాయన. కథ ముగుస్తుందనుకుంటామా..నోనో...వేషాల్రావు చేతిలో ఇంకా చాలా రాళ్ళు ఉన్నాయి విసరటానికి.
ఫేస్బుక్ సరదాలు ( part 4)
......................................
నిజానికి ఇవి సరదాల్లాగా కనిపిస్తున్నా..ఆడవారి మీద జరుగుతున్న అన్యాయాలు. కొంతమంది ఆడవారు ఇలాంటి సరదా రాయుల్ల ని తమ 'గుడ్డు పోస్ట్ల' తో ప్రోత్నహించటం వలన కూడా కొంతమంది వేషాల్రావులు దాన్ని గ్రాంటెడ్ గా తీసుకుని, కనిపించిన ప్రతీ లేడీ తో పిచ్చి వేషాలు వేయటం కనిపిస్తోంది. గాడిదెక్కడైనా గాడిదే. నువ్వు గాడిదవు గాడిదవు అని ప్రోత్సహించినంత మాత్రానికే గాడిదలా మారిపోదనే విషయమూ ఇందు మూలముగా మరచి పోకూడదు. 'గుడ్డు పోస్టు'లతో గాడిదల పెంపకం చేపట్టొద్దని మనవి.

ఇక,  వేషాల్రావు, ఏం చేస్తాడంటే...కనపడిన ఆడవారి ప్రోఫైల్ పిక్ కనుక ఒరిజినల్ ది ఐతే...ఆ ఫోటోని లాగి, బయటకు తీసి, దాన్ని ఫోటోషాప్ లో మెరుగులు దిద్ది, మల్లీ ఆమెకే పంపిస్తాడు ఇన్ బాక్స్ లో, ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్టు. వేషాల్రావుకి ఫోటోషాప్ చేయటమంటే అదో పెద్ద విషయం అన్నట్టు.  'అమ్మ, వెధవ, జన్మ,  కొడతా, సిగ్గు, లేరురా, తీసి, లేని, అక్క, చెప్పుతో '  వంటి పదాల్ని కలిపి పాపం ఆవిడ బాగానే వడ్డిస్తుంది. సిగ్గు లేని వేషాల్రావు,ఒక వెకిలి నవ్వు నవ్వి ఊరుకూుంటాడు తప్ప, మారడు. ఇలా కాదని ఆవిడ, తన భర్తతో దిగిన ఫోటోని ప్రొఫైల్ పిక్ గా పెట్టుకుంటుంది. అయినా వేషాల్రావు వేషాలకేం తక్కువ, ఆమె భర్తని తొలగించి, మిగిలిన ఫోటోకి ఫోటోషాప్ చేసి మరలా పంపిస్తాడు. ఇలా చేసే ఎంతో మంది వేషాల్రావులున్నారు. కానీ ఇలా చేసి నాకు దొరికిపోయిన ఒక వేషాల్రావు గారి వయసు డెబ్భై. బాబాయ్ గారు, బాబాయ్ గారూ అంటే, బురిడీ బాబా అవతారమెత్తాడు. ఈ మధ్య ఒక వేషాల్రావు, పోర్న్ ఫోటోస్ ని కనిపించిన ఆడవారికందరికీ పంపిస్తుంటే...తెలిసి, అయ్యగారిని బహిరంగంగా ఫేస్బుక్ వాల్ మీద వేలాడతీశాము ఫోటోతో సహా. సైబర్ క్రైం కి కూడా కంప్లయింట్ చేశారు. వేపమండలతో దయ్యం దిగే దాక బాదేలా ఉన్నారు ఆ కంప్లయింట్ ఇచ్చిన ఆడవారు. కాబట్టి వేషాల్రావుల సరదాలు ఇలా కూడా ఉంటాయని, జాగ్రత్త పడమని సలహా.
ఫేస్ బుక్ సరదాలు. (Part 3)
...............................................
పార్ట్ టూ లోని వేషాల్రావు ని గురించి చదివిన పార్ట్ వన్ లోని గుడ్డు అమ్మాయి ఒకామె నిన్న నాతో మాట్లాడింది. ఆ అమ్మాయి మా బంధువులమ్మాయి. అయితే ట్విస్ట్ ఏమంటే ఈ 'గుడ్డు అమ్మాయి' కావాలనే 'గుడ్డు పోస్ట్లను' పెడుతూ  ఉంటుందట. ఇలాంటి వేషాల్రావుల కామెడీలు చూసి తెగ నవ్వుకోవటానికి. వారి కాలేజ్ ఫ్రెండ్స్ అందరూ కామెంటులపుడు ఒక్కోరు ఒక్కో ఐడియా ఇచ్చి ఈ వేషాల్రావుల ఓ..తెగ ఇదై పోవటాన్ని, వాళ్ళ తింగిరితనాన్ని చూసి కడుపుబ్బ నవ్వుకుంటుంటారట. హమ్మయ్య తెలుగోడికి హాస్య ప్రియత్వం చావలేదని భరోసా ఒచ్చేసింది.

ఇక, వేషాల్రావు కవితల్రావు వేషం కట్టాడు. చెప్పాకదా, మనోడికి కవితల్రావు. అయినా కవితల్రావవతారం ఎత్తాడు. కారణాలు రెండు. ఎంత కాలమని గుడ్ మార్నింగులతో గుడ్ నైట్లతో గూడు పుఠానీ నడపగలడు. హి మస్ట్ డూ సంథింగ్ నో..ఇక రెండవది తన ఫ్రెండులిస్ట్ లో ఉండే కవితల్రాయుడు అనేవాడు కవితలతో అదరగొడుతుంటే..కింద కామెంట్ లలో లేడీ ఫాలోవర్స్ అదుర్స్ అంటుంటే..మనోడు బెదుర్స్ ఐపోతున్నాడు.జెలసీ తన్నుకొస్తుంది. ఎలాగోలా వన్ ఫైన్ మార్నింగ్ డిసైడ్ అయిపోయాడు. కవితలను అదరగొట్టాలని.

ఇంతలో ఓ గుడ్డు అమ్మాయి గుడ్ మార్నింగ్ పోస్ట్ తో పాటు, ఓ కవిత రాసేసింది. "నిశి వంచిన విల్లంబులో పదనిసల కోలహలపు ప్రచ్ఛన్న కరుణాలయం, విద్వత్ మహోగ్రధ వింజామరల సమయంలో బూటకపు బెల్లపు పాకపు బలిస్థానం, వారుణి పీడిత బృహత్ తాడిత పద ఘట్టనలో చామంతి పూవుల చకోర పిండి పదార్థం, గజ రజనీ సమోజ్జ్వల విశ్వాఖిల ఝంఝామారుత ఉల్లి గడ్డల పద కోణం". అని రాసింది. మనోడికి అర్థం కాలే. బెల్లం, ఉల్లి గడ్డ తప్ప. ఇంత అద్భుతమైన కవిత్వమా అని నోరెల్ల బెట్టాడు. ఇందుకు తగ్గ కవితనే పెట్టి గుడ్ మార్నింగ్ చెప్పాలని డిసైడ్ అయ్యాడు. ఇంతలో ఒకడు కామెంటాడు. "ఇది మేడం కావాల్సింది. ఇది. మీరు కేకో కేక మాడం. ఇట్లా అడిగేటోల్లే కావాలి ఈ దేశానికి. లేకుంటే సామాన్య మానవునికి అందకుండా ఉల్లిగడ్దల ధరలు పెంచేస్తే ఎలా మేడం. ఏం చేస్తున్నాయీ ప్రభుత్వాలు. ఇక మారరా..థూ తుచ్చపు రాజకీయనాయకులు. మీ సామాజిక స్పృహ నాకు చాలా నచ్చింది మేడం. మీ కవితలు నాలో స్పూర్తిని రగిలిస్తున్నాయి. ఎప్పటినుంచో నేను మీ కవితల్ని ఫాలో అవుతున్నాను. థ్యాంక్యూ."  అని ఆకాశానికి ఎత్తేసాడు అనే బదులు, ఆకాశంలోకి వాడే  ఎగిరి దూకాడు అనుకోవచ్చు.  పొరపాటున అటుగా ఏ రాజకీయ నాయకుడు పోతుండినా ఈ కవిత ఇచ్చిన స్పూర్తితో ముఖం మీద ఉమ్మించినా ఉమ్మిస్తాడు. మన వేషాల్రావుకి వొళ్ళు మండిది. మాటర్ అయితే క్లియర్. ఉల్లి గడ్డల మీద రాసిందన్న మాట. ఇంతకు మించిన జంబలహా కవిత రాసి కామెంటులో పెట్టాలని డిసైడ్ అయ్యాడు. సామాజిక స్పృహ ఉట్టిపడేలా ఉండాలనుకున్నాడు. బాగా థింకాడు. చివరికి తట్టింది. "పల్లం వైపు నీరు, పట్టాల వైపు రైలు, ఆకాశం వైపు ఉల్లిగడ్డలు, ఆవేశం వైపు రాజకీయ నాయకులు, నీ వైపు నేను, నా లైఫు నీవు. గుడ్ మార్నింగ్ మాడం" అని రాసేశాడు.

చూస్తూ ఉన్నాడు నిముషానికోసారి. ఇక ఫ్లాట్ అనుకున్నాడు. ఆ అమ్మాయి రెస్పాన్స్ ఇవ్వలే. ఇంతకు ముందు కామెంటిన వీరుడికి "థ్యాంక్యూ సో మచ్ అండీ..నా కవిత మీకు నచ్చినందుకు, చాలా చాలా థ్యాంక్స్. యూ మేడ్ మై డే". అని రిప్లై ఇచ్చింది. వేషాల్రావుకి జలసీ నషాళానికెక్కింది. తన కవితకి రెస్పాన్స్ రాలేదు. ఇక కామెంటాడు. "ఉల్లి గడ్డలేంటండీ ఉల్లి గడ్డలు. ఎంత సేపూ రాజకీయ నాయకులని ఆడి పోసుకోవవటమేనా..?మనం ఉల్లిగడ్డలు వాడటం తగ్గించాలి. అప్పుడే వాటి ధరలు తగ్గుతాయి. ఈ రోజు నుంచి మనం ఉల్లి గడ్డలు నెల పాటు వాడకూడదని ఒట్టేసుకుందాం. సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలండీ, ఏమంటారు?" అని. "వావావావావ్. ఆసం ఐడియా. యూ మేడ్ మైడే" అని రిప్లై ఇచ్చింది. ఎంత మంది డే చేస్తారో. ఆ తరువాత మనోడి కవితకీ లైకింది. ఉత్తర కుమారుడి చరిత్ర తంతే బూరెల గంపలో పడ్డట్టు ఇన్ బాక్స్ కి వచ్చింది. హాహాహాహాయ్య్య్య్య్.