Wednesday, 14 October 2015

Kankara raallu (poem)

విరించి ll కంకర రాళ్ళు ll
.....................................
మనమిద్దరమూ కలిసి తిరిగే రోజుల్లో
వారంతా ఎంతటి అనుమానాస్పదంగా చూసేవారు..!

అంకం తరువాత అంకంగా
ఒక షేక్స్పియర్ నాటకంలా
మన ఉద్వేగాలూ మన స్నేహాలూ
కలిసి జీవించేవి ఆ రోజుల్లో

ఇబ్బడిమబ్బడిగా మనుషులు తిరిగే వీధుల్లో
తెలియని ముఖాల మధ్య వెలిగి పోయే తెలిసినముఖాల్లా
అటునుంచి నీవూ ఇటు నుంచి నేనూ ఒకరికొకరం ఎదురుపడినపుడు
సంవత్సరాల తరబడి కలువని ప్రేమ జంటలాగ
ఒకరి ఛాతి మీద ఒకరి ఛాతిని వుంచి గట్టిగా హత్తుకునే వాళ్ళం

అయిదురూపాయల ఇరానీ ఛాయ్ ని వన్ బై టూ తాగుతూ
మధ్య మధ్య లో మలాయ్ లో చక్కర కలుపుకుని తింటూ
ఛాయ్ వాడు చేతులెత్తి దండం బెట్టి నెట్టివేసే వరకూ
గంటలు గంటలు అమ్మాయిల గురించి మాట్లాడుకునే వాళ్ళం

మిరపకాయ బజ్జీలోడి దగ్గర ముక్కులోంచి కారే కన్నీటిని తుడుచుకుంటూ
కట్లెట్ బండీ దగ్గర ప్యాస్ నింపిన పానీపూరీని
నోరంతా తెరచి కుక్కుకుంటూ
ఇండియా గ్రేట్ నెస్ గురించి చర్చించుకునే వాళ్ళం

చార్మినార్బ స్టాప్ లో బస్ గురించి వెయిట్ చేసే వారి మధ్యన కూర్చుని
దేశ రాజకీయాల గురించి, సినిమా హీరోల గురించి
ఊగిపోతూ  గొడవపడి..అదే కోపంతో వెళ్ళి పోయేవాళ్ళం

అడ్డదారిలో వచ్చి ట్రాఫిక్ పోలీసుకి దొరికి జేబులంతా గుల్ల చేసుకున్నపుడు
నో స్మోకింగ్ జోన్ లో స్మోకింగ్ చేసిన పొల్లగాడిని పొటుకు పొటుకు తిట్టి పంపించినపుడు
తెలంగాణోళ్ళమని చిన్న చూపు చూసిన సాలే గాణ్ణి పడేసి తొక్కినపుడు
అవసరమొచ్చిన ప్రతీ అడ్డమైన సందర్భాల్లో
మా కీ కసం అంటూ మనం చెప్పిన అబద్ధాల్లో..
ఊపర్ వాలాకీ కసం అంటూ మనం చెడగొట్టిన ప్రమాణాల్లో..
బేగం బజార్ సెంటు సీసాల్లాగా అమాయకమైన స్నేహమే గుభాళించేది.

ఆ రోజుల్ని ఈ రోజు గుర్తు చేసుకున్నప్పుడు
మనల్ని అనుమానాస్పదంగా చూసిన ముఖాలే గుర్తుకు వస్తాయి.
పాత బస్తీ అల్లర్ల లో మనల్ని చెదరగొట్టిన కంకర రాళ్ళే గుర్తుకు వస్తాయి

నేను హిందువుననీ
నీవు ముస్లిమువనీ..
మన స్నేహం ఈ లోక సమ్మతం కాదనీ
నమ్మకాల్ని కలిగున్న వారెవరూ
మనిషికి మరో మనిషి స్నేహం తప్ప
ఇంకేమీ అవసరం లేదని నమ్మగలిగిన వారైతే అయ్యుండరు

ఒక సూర్యుడూ..ఒక చంద్రుడూ
కలిసి ఉండలేరనుకునే లోకానికి
మనం గ్రహణాల్ని ఊతంగా చూపించలేక పోయాం
గ్రహణం మూఢనమ్మకం కాదు
ఆకాశం లో జరిగే అద్భుతమని చెప్పలేకపోయాం

అందుకే కదా నేస్తం
ఒకనాడు చిన్న చిల్లు కూడా లేని మన స్నేహం లాగే
ఇపుడు మనమధ్య పెరిగిన గోడకు చిన్న చిల్లు కూడా లేకపోయింది
ఇన్షా అల్లాహ్ అనుకుంటూ నీవు, నేను బాగుండాలనీ
రాముడి గుడిలో చేతులు జోడించి నేను, నీవు బాగుండాలనీ
కోరుకోవటమొక్కటి మనకు దేవుడిచ్చి ఉండకూడదనే మనం కోరుకుందాం.
మనరోజొకటి మనకోసం మునుముందు వేచి ఉంటుందనే ఆశపడదాం.

14/10/15

No comments:

Post a Comment