Saturday, 26 September 2015

ఫేస్బుక్ సరదాలు( part 2)
.................................
పార్ట్ వన్ లో నేను ఆడవారిని వేలెట్టి చూపానని, కొందరు మిత్రులు వేలెట్టి చూపించారు. అలాంటిదేమీ లేదనీ, ఈ విషయాలు ఎవరినీ ఉద్దేశించినవి కావనీ, భుజాలు తడుముకున్న వారికి మాత్రమే వర్తించే అవకాశం ఉంది కాబట్టి మీరందరూ భయపడనవసరం లేదనీ నా మనవి. ఆడవారి పోస్ట్ ల వెనుక పడే మగ పుంగవుల గురించే నేను రాసి వుంటిని తప్ప ఇంకోటికాదు. వచ్చిన వంద కామెంటులకి అన్నింటికీ సమాధానాలిచ్చిన ఆడవారి ఓపికకీ ఈ సందర్భంగా వందనాలు. ఇవన్నీ ఫేస్ బుక్ లో కనిపించే సరదా సన్ని 'వేషాలు' మాత్రమే. ఎవరూ ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. నవ్వుకుంటే భోగం, నవ్వుకోలేక పోతే రోగం. తెలుగు వాడు హాస్య ప్రియత్వం మరచిపోకూడదు మరి.

ఇక, వేషాల్రావు ఉదయాన్నే లేచి కూచుంటాడు. ఏజీ ఎంతని వీజీ గా అడగకండి, ఎంతున్నా వేషాల్రావు కదా..మేనేజ్ చేసేస్తాడు. పాచి పండ్లు తోముకుంటూ, ఫేస్ బుక్ లో సెర్చ్ లోకి పోతాడు. స్వాతి, స్వేత, పూజ, అర్చన, హారతి, కర్పూరం, అగరొత్తి, గుర్తుకొచ్చిన అమ్మాయిల పేర్లన్నీ వరుసగా చూస్తాడు. ఫ్రెండు రిక్వెష్ట్ పెట్టేస్తాడు. ఇంకా డిటైల్స్ లోకి పోతే చాలా బాగోదు గనక, కామా ని కాస్త పక్కకి తిప్పితే..మనోడు ఆడవారి పోస్ట్ లు చదువుతుంటాడు. "ఇవాళ మా అక్క కొడుకు పుట్టిన రోజు, విష్ చేయండి" అని ఒకామె ఓ పిల్లగాణ్ణి ఎత్తుకుని ఉన్న పోస్ట్ పెట్టి వుంటుంది. ఓ పదిహేను వందల మంది కామెంటి వుంటారు అప్పటికే. జస్ట్ అయిదు నిమిషాల ముందు కూడా ఒక వీరుడు ఓ కవితలాంటి తవిక తో 'హాపీ బర్త్ డే' అని విష్ చేసి ఉంటాడు. మనోడికి చిర్రెత్తుతూంది. పోటీ కి ఇంకెవడో వచ్చాడనుకుని బుర్ర గోక్కుని కష్టపడి, ఆ తవిక కి తాత లాంటి తవికతో విష్ చేస్తాడు. నాలాంటి ముదనష్టపు వెధవలకి పొరపాటున ఆ పోస్ట్ కనిపిస్తుంది. మన కళ్ళు ఊరికే ఉండవు కదా..సెర్చ్ లోనే రీసెర్చ్ కూడా ఉంటుందేమో..అక్కడ జరిగే భూంశకలక ఇషయమంతా ఒకే ఒక్క సెకనులో కనిపిస్తుంది. అది టూ థౌజండ్ టువల్వ్ (2012) లో పెట్టిన పోస్ట్. ఇప్పటికీ దానికింద కామెంటులు వస్తూనే ఉంటాయి. అది ఎవరు ఎప్పుడు పెట్టారు అనవసరం. అమ్మాయి ఫోటో కనబడింది. ఐదు నిముషాల కిందే పోటీదారుడు పోస్ట్ పెట్టాడు. మనమూ పెట్టాలి. గొర్రె తోక వెనుక గొర్రె మూతి.

గుడ్ మార్నింగ్ అని పోస్ట్ పెడితే 'వెరీ గుడ్ మార్నింగ్' అని సమాధానం పుచ్చుకున్న వేషాల్రావు ఇక భూమి మీద ఉండడు. ఇక ఆ అమ్మాయి ఏ పోస్ట్ పెట్టినా గుడ్ మార్నింగ్ అని పెట్టి, ఆశగా ఆకాశంకేసి చూస్తుంటాడు. ఆ అమ్మాయి కష్ట పడి ఒక కవిత రాస్తుంది. మన వేషాల్రావుకి కవితల్రావు. తవికలైతే ఒస్తాయి. ఇంకేముంది అలవాటుగా గుద్దేస్తాడు 'గుడ్ మార్నింగ్' అని. నేను కవిత రాస్తే గుడ్ మార్నంగ్ అంటాడేంటని ఆ అమ్మాయి నిరాశగా ఆకాశానికేసి చూస్తుంటుంది. అయినా మేనేజ్ చేయడం ఎలాగో తెలిసినోడు కాబట్టి సాయంత్రం దాకా ఓపిక పట్టి అదే కవిత కింద గుడ్ ఈవెనింగ్...ఇంకాస్త రాత్రి దాకా ఓపిక పట్టి, గుడ్ నైటూ చెప్పేసి, ఉబ్బితబ్బిబ్బవుతుంటాడు. పాపం ఆ అమ్మయి ఉక్కిరిబిక్కిరౌతుంటుంది. ఇలా నడుస్తున్న చోద్యాన్ని చూసి మనం నవ్వుకునే లోపల తెల్లారుతుంది. వేషాల్రావు మళ్ళీ అదే కవిత కింద గుడ్ మార్నింగ్ అంటూ కనిపిస్తాడు ఎంతకీ వదలని ఉత్తర కుమారుడిలా.

Friday, 25 September 2015

భూమధ్య రేఖ ll కాశిరాజు కవిత్వం ll ఒక అవగాహన
....................................................................
దాదాపు గత సంవత్సర కాలంగా నా బుక్ షెల్ఫ్ లో ఒక మూలకు పడి వుంది ఈ భూమధ్య రేఖ. ఏదయినా పుస్తకాన్ని తీసుకుంటున్నపుడో వెతుక్కుంటున్నపుడో..భూమధ్య రేఖ కదా..చేయిని వేడిగా తాకుతుా కనిపించేది. వేడిగా ఉంటుందేమో తర్వాత చదువుదాం లే అని వదిలేసే వాడిని. కానీ  ఇపుడు వర్షం మొదలైంది కదా..కాసింత వెచ్చగా ఉంటుందేమో అనుకుని భూమధ్య రేఖను పట్టుకున్నాను. అమ్మా నాన్నల ప్రేమంత వెచ్చగా గుండెని తగిలి, వాన నీళ్ళలా మనసులో మట్టిని కడిగేసింది. ఇంత కాలం చదవనందుకు బాధ పడాలో ఇపుడు ఈ వర్షం కురిసిన రోజు చదివి ముద్దయినందుకు సంతోష పడాలో అర్థం కాలేదు.

రవీంద్రుడి గీతాంజలిలో ఆయనకూ దేవునికీ పేచీ. ఎడ తెగని పేచీ. ఆ సంభాషణ లో అంతర్లీనంగా ఒక ఫిలాసఫీ. దేవుడంటే ఎవరో ఎక్కడుంటాడో తెలిపే ఫిలాసఫీ. అది మధురం. అమృతం. మళ్ళీ అంతటి ఆ అమృతాన్ని ఇంకో రకంగా కురిపిస్తాడు కాశీరాజు. ఇక్కడ దేవుడుండడు. జీవితం ఉంటుంది. అమ్మ ఉంటుంది. నాన్న ఉంటాడు. ఊరు ఉంటుంది. జీవితంలో జరిగే ప్రతీ రోజునీ, ప్రతీ అంశాన్నీ తరచి చూసే కవి ఉంటాడు. జీవన సౌందర్యాన్ని ప్రతీ సంఘటనలో ప్రతీ పండగలో చూపించే కాశీరాజు ఉంటాడు. కవిత్వాన్ని చదువుతూ  చాలా చోట్ల ఆగిపోతాం. ఒక ఉద్వేగాన్ని మనస్సు అకస్మాత్తుగా పొందినపుడు, చలనం లేకుండా ఐపోతుందేమో. 'ఇంక ఇది చాలు అనుభవించటానికి' అనిపించేలా ఉండే ఆ పదాల్లోంచి అంత త్వరగా బయటకి రాలేకపోతాము. 'పుస్తకం మొత్తం చదవాలి కదా..!' అనే స్పృహ మనల్ని ముందుకు తోయాలే తప్ప, మనల్ని ఆ భావాలంత సులభంగా వదిలి పెట్టవు. అవి కేవలం భావాలు కాదు. వాస్తవ జీవిత చిత్రాలు. ఆ జీవిత చిత్రాల్ని కంటి ముందు చూపిస్తూ, కవిత్వం చేస్తాడు కాశీరాజు.

ఒక్కో కవిత ఒక జీవితం లోని ఒక సంఘటనను చూపిస్తుంది. అందుకే కోట్ చేయటానికీ, ఇదిగో ఇక్కడ బాగుంది, ఇక్కడ బాగాలేదు అనటానికీ ఏమీ ఉండదు. చేస్తే కవితనంతా కోట్ చెయ్యాలి. పుస్తకమంతా వేరు వేరు కవితలు కాదు. అందుకే ఇది కవిత్వ సంకలనం కాదు. కవిత్వం. కాశిరాజు కవిత్వం. అన్ని కవితలూ ఒక విషయాన్నే చెబుతాయి. ఒక జీవితాన్ని, ఊరినీ, అమ్మనీ, నాన్ననీ, ఆ తీయటి సంబంధాల్నీ చూపుతాయి. నేరేడు లంక ఊరినుంచి మొదలై..జీవితంలోని ప్రతీ చిన్న అంశాన్నీ అందంగా మనముందు చిత్రిస్తాడు. ఆ చిత్రణలో పాత్రలు అమ్మా, నాన్న, కాశీరాజులతో పాటు ప్రకృతిలోని గడ్డిపరక, వొంగపువ్వు, జమ్మి చెట్టు, మందారపువ్వు, మిణుగురు పురుగు, చిరు దీపం, దేవగన్నేరు, అర్ధరూపాయి, చేతి రుమాలు, పాత మొలతాడు, రేమండ్ ప్యాంటూ, రాతిరి, నిశ్శబ్దం, ఆకలి ఇలా అన్నీ పాత్రలై మనల్ని పలుకరిస్తాయి.

"అరచెయ్యి ఆనంద భాష్పాల్ని వడ్డిస్తుంటే..గిన్నెలోని గుప్పెడు మెతుకులు ఎంతకీ ఐపోవు/ అక్కడ మమకారం ఎక్కువై మెడబడితే..తాగాల్సింది నీళ్ళు కాదు, ఎదురుగా కూర్చున్న కళ్ళ లోని కంగారు/ అపుడు చేయి కడగటానికి చెంబు నీళ్ళి స్తే..అవి ఊటబావులైన హృదయాంతరాలు .." ఇలాసాగుతుందీ కవిత్వం...ఎక్కడ ఆపగలం..ఎక్కడ ముందుకి సాగగలం. నేరేడులంకలో రాత్రిని ఎంతో రొమాంటిక్ గా చూపిస్తాడు. "కూరదాకలోని కుతుహలం కుతకుతమంటోంది. సలాది సుబ్బయ్య వీధి దీపాలార్పేశాక నా సామిరంగా...గుట్టుగా గుసగుసలాడుతూ మా నేరేడులంక నిద్దరోతుంది".

 వానొస్తే బస్సులో కలిసిన వైజాగ్ శర్మగారు ఏం చేస్తాడో మనం పట్టించుకోక పోవచ్ఛు, కానీ కవి ఎవరినీ వదిలి పెట్టడు. అలాగే కమలమ్మతో తిట్లుతింటూ, గుమ్మంముందు పారే వాననీటి లాగే గలగలా నవ్వేసి తల తుడుచుకోవటానికి కమలమ్మ మొగుడు దగ్గరికొస్తాడట. చిల్లులున్న చోట చెంబులూ గిన్నెలూ పెడితే..టిక్ టిక్ మనే వర్షపు చినుకుల సంగీతానికి పేదరికపు దర్శకత్వం భలే బాగుంటుందంటాడు. తన తల్లిని భూమితోనూ, తండ్రిని ఆకాశంతోనూ పోల్చటం రెండు మూడు కవితల్లో కనిపిస్తుంది. అంతా నింపుకున్న శూన్యం ఆకాశమనీ, వొట్టి ఓర్పుతో నిండిన ఖాళీ గుండె భూమిదనీ ఒక కవితలో చెప్పి, 'ఆకాశమేమో నేలపైకి దిగొచ్చి, అమ్మ పక్కన నిల్చుని నాన్నై పోయేదట' అని భావన చేస్తాడు.

పల్లెలో కరెంటు పోయినా అందమైన కవిత్వం చేస్తాడు. "ఆ సందామాట్ల చీకట్లో, ఎంతకీ రాని కరెంటుని అందరం కల్సి తిట్టుకుని, తిందామని తీర్మనించుకున్నాక/, ఆ చిన్న దీపం వెలుగులో..నవ్వుతున్న ముఖాలు మాత్రమే కనబడే వెలుతుర్ని మనకెందుకిచ్చాడో అర్థమై మరింత నవ్వొచ్చేది నాకు/పేదరిక మని విసుక్కున్నా, ప్రశాంతత బాగున్నపుడు, నవ్వు మాత్రమే నేర్వాలి మనం. "  ప్రతీ కవితలో ఒక సందర్భం వుంటుంది, నాన్న జోబులో అర్ధ రూపాయి కొట్టేయటమో..పెళ్ళి సంబంధానికి పోవటమో..అమ్మ పురుడు పోసుకోవడమో..వాగులో స్నానాలు చేయటమో..ఉగాదో, దీపావళో .. ఒకటని కాదు, నిత్య జీవితంలోని ప్రతీ చిన్న అంశమూ కవితలోకి ఒదిగిపోతుంది. ఆ ప్రతీ అంశాన్ని ఆనుకుని ఒక ప్రేమ, ఒక ఆర్ద్రత, ఒక ఫిలాసఫీ ఉంటుంది. ఇలా కవిత్వాన్ని చేయటం అంత సులభం కాదు.

ఈ కవిత బాగుంది, ఈ కవిత బాగాలేదు అని చెప్పటానికి అవకాశమివ్వడు కాశీరాజు. జీవితంలోకి చొచ్చుకుపోయి ఈ గ్రామీణ జీవన సౌందర్యాన్ని తలమునకలుగా ఆస్వాదించాలంటే చదవాల్సిందే. ఏకాంతం మీద బాణమేసినట్టు ఒక్కో కవిత సాగుతుంది. ఈ కవితల్లో దుఃఖమూ సంతోషమూ తీసుకున్నోళ్ళ కు తీసుకున్నంతగా ఉంటుంది.  పుస్తకమంతా చదివాక సీసాలూ గ్లాసులూ కాదు గానీ, గడ్డ కట్టిన గాజు హృదయాలు ఖాళీ అవుతాయి. ఒక ఆశ్చర్యానందానుభూతికి లోను చేసి, 'ఆహా ఈ వాక్యం చాలు' అనిపించే ఎన్నో కవితా వాక్యాలున్నా,  కొన్నిటిని ఈ కింద తెలుపుతున్నాను.

కాలాన్ని వెనక్కు తిప్పలేమని అన్నాక
తీస్కొచ్చి నిన్ను చూపించాలనుంది.
                     *
ఎక్కడ బతుకు బాసగా మారి
ఎక్కడ మనుషులు సాహిత్యమయ్యారో..
అక్కడ మనం నవ్వుతూ ఉండాలి
నవ్వుల్ని లిఖిస్తుండాలి.
                      *

వర్షం వచ్చిన జాడ ఆ వానకళ్ళకి తెలీదు
అమ్మది ఆకాశమంత దుఃఖం.
అమ్మ కళ్ళకి నాన్న ఉపనది.
                        *
అరచేతిలోని ఉగాది పచ్చడి
అందరివొంకా చూసి తింటే అదో తృప్తి.
ఏండ్లు గడిచి మేం గడసరులయ్యాక కూడా
ఆ పచ్చడిది అదే రుచి.
                        *

చివరిగా ఇది చూడండి.

వదిలి రాలేని ప్రేమతో వచ్చిన ఒక తల్లి
వొరిసేలో ఏం చేస్తదో తెలుసా..?
ఆకు కట్ట ఇప్పినట్టే అమ్మ గుండెని ఇప్పేస్తది.
గుబులు మూన నీట్లో గుచ్చి వరి నాటుతున్నట్టు
ఓ రోజంతా ప్రేమను దుఃఖంతో నాటేస్తది.
రోజుకూలీ బతుకులో రోజంతా అలా బిడ్డ తలపులో వుండి
ఇంటికి పోయాక  పిల్లాన్నెత్తుకుని మొగుడు దేవుడిలా కనిపిస్తే
కళ్ళ నీళ్ళు కారుస్తూ ఆ తల్లి దేవగన్నేరైపోతాది.
                           *

ఇంతకు మించి చెప్పేదేమీ ఉండదు, చదివి కవిత్వం లోని ఆనందాన్ని అనుభవించటం తప్ప. ఇక ఆలోచించేదేమీ లేదు. పుస్తకాన్ని చేతిలోకి తీసుకోవటమే కదా మిగిలింది.

25/9/15
ఫేస్బుక్ సరదాలు ( part 1)
.......................
ఎఫ్ బీ ని ఎలా వాడుకోవాలో చాలా మందికి తెలుసు. సోషియల్ నెట్ వర్కింగ్ ఈ నయా జమానా మీడియాలా ఎదుగుతున్నది. మంచిదే. కానీ నార్సిస్టిక్ పర్సనాలిటీలు కూడా ఈ సందర్భంగా ఎక్కువగా కనిపించటం మొదలయ్యింది. నార్సిసిజం అంటే..తన మీద తనకుండాల్సిన ప్రేమ మామూలుగా కంటే అతిగా ఉండటం. మొదట ఉండే ఐడెంటిటీ క్రైసిస్ ఫేస్ బుక్లో నాస్సిసిజంగా మారిపోతున్నట్టున్నది.

దాన్ని పక్కకి పెడితే, వర్చువల్ ఫ్రెండ్షిప్ ల మీద ఎక్కడాలేని ఆసక్తి కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇక ఆడవారు ఏదయినా పోస్ట్ పెడితే కామెంట్ లలో రెచ్చిపోయే మగవారు ఎందరో. ఒకామె పొద్దున్నే లేచి 'గుడ్ మార్నింగ్' అని రెండు ముక్కలు రాస్తుంది. ఇంకాస్త ఓపిక ఉంటే దానికో హీరోయిన్ ఫోటోని తగిలిస్తుంది. ఇక చూడండి, నవ్వుకోడానికి సరిపడా కామెంట్లన్నీ అక్కడే వుంటాయి. ఒక వంద కామెంట్లూ, ఒక మూడొందల లైక్ లు. ఆ తెలివిగల అమ్మాయి, అందరికీ తెలిసిన హీరోయిన్ బొమ్మని పెట్టదు. మనమెవరమూ చూసి ఉండని ఒక హీరోయిన్ ని పెడుతుంది. ఇక అందులో కొందరు ఆ ఫోటోలో ఉన్న లేడీనే ఈమె కావచ్చు అనుకుని ఉబలాట పడతారు. ఇంతలో ఒకడంటాడు కదా..'మీలాగానే మీరు పెట్టే పోస్ట్ లూ బాగుంటాయి మేడం' అని. వారెవా..గుడ్ మార్నింగ్ అనే పోస్ట్ లో అంత ఇన్ఫర్మేషన్ ఉందా అని మనం తలగోక్కోవాలి. ఇంత జరిగినా ఆ అమ్మాయి ఈ ఫోటోలో ఉన్నది నేను కాదు అని చెప్పుకోదు, పైగా అందరికీ ఓపికగా 'థ్యాంక్స్' చెబుతూంటుంది. ఈ సినిమా ఇక్కడితో ఆగదు. పొద్దున అయిపోయాక మధ్యాహ్నం ఉందనీ, మధ్యాహ్నం ఐపోయాక సాయంత్రమూ ఆ తరువాతే రాత్రి అవుతుందనీ, ఇలా రోజుకి మూడు పూటలుంటాయనీ మనకు తెలియని విషయాన్ని అప్పుడే తాను తెలుసుకున్నట్టుగా ఆ అమ్మాయి బిహేవ్ చేస్తుంది. మధ్యాహ్నం గుడ్ ఆఫ్టర్ నూన్, సాయంత్రం గుడ్ ఈవెనింగ్ మరలా రాత్రికి గుడ్ నైట్ పోస్ట్ లను పెట్టేస్తుంది. ఇలాంటి అమ్మాయిలని 'గుడ్డు అమ్మాయిలు' అనాలని, పోస్ట్ లని 'గుడ్డు పోస్ట్' లూ అనాలని సెలవిచ్చాడు మా విజయ్ అన్నయ్య.

ఇక ఆ అమ్మాయి అక్కడితో ఊర్కుంటుందా..రోజుకు మూడు పూటలుంటాయని 'ఫేస్బుక్కు కోడై' కూస్తుంటుంది. అపుడే నిద్ర లేచినట్టు 'ఎస్ మేడం' అని సెల్యూట్ కొట్టినట్టు తిత్తిరి రాయుల్లు వెనువెంటనే కామెంటుతూనే ఉంటారు. పొరపాటున ఈమెగారికి కొద్దిపాటి సోషల్ అవేర్నెస్ ఉండి చచ్చిందా..ఇక మనం చచ్చామే. కామెంట్ లలో విపరీత ధోరణులన్నీ కనిపిస్తాయి. ఇంకాస్త పాపులర్ కావాలంటే హిందూయిజాన్ని తిట్టడమో మహాభారతాన్నో..రామాయణాన్నో..రాముడినో..సీతనో..ప్రభుత్వ పెద్దల్ని తిట్టడమో...కేసీఆర్ నో చంద్రబాబునో అన్నమాట..వారి మీద కల్పిత కథలు రాయటమో మున్నగునవి చేస్తే...ఆహా...మూడొందల పై చిలుకు కామెంట్లు రాకపోతే చూడండి. 'అసలు ఈ దేశం లో మీలా ఆలోచించేవారే కరువయ్యారు మేడం' అంటాడొకడు. 'మీరు వచ్చే ఎన్నికల్లో ఎలక్షన్లలో నిలబడితే..మిమ్మల్ని ప్రైమ్ మినిష్టర్ గా చూసుకుంటాం మేడం' అని కల్లల్లో నీల్లు పెట్టుకుంటాడింకొకడు. పొరపాటున మనం ఆ పోస్ట్ ని వ్యతిరేకించామా...ఆ వీర అభిమాన సంఘపు ప్రముఖులు మనల్ని చీల్చి జీరండాలు పెట్టి పంపిస్తారు. నిజంగా కాదులేండి...కామెంట్ లలో..ఇక్కడేదీ నిజం కాదుగా....అంతా వర్చువల్. అంతా మాయ. అంతా నటన. కానీ భలే సరదాగా ఉంటుంది.
తీరం దాటిన నాలుగు కెరటాలు.ll  అనిల్ నరేష్ వర్ణలేఖ చైతన్యll ఒక అవగాహన.
...................................................................................................
సముద్రం ఒడ్డున ఇసుక తెన్నెల మీద కూర్చున్నపుడు కొన్ని కెరటాలు తీరాన్ని దాటి మన కాళ్ళ ని తాకాలని ప్రయత్నిస్తాయి. అవి అలా తాకినపుడు కొన్ని జ్ఞాపకాలు, కొన్న బాధలూ, కొన్ని సంతోషాలూ, కొన్ని ప్రశ్నలూ, కొన్ని సమాధానాలూ అన్నీ కలగాపులగమై మనల్ని చేరినట్టుంటుంది. అలా తాకే నాలుగు కెరటాలే ఈ పుస్తకంలోని నలుగురు కవులు. కెరటాలు సముద్రపు ఉప్పు నీటితో తయారు చేయబడ్డాయి. కన్నీరు కూడా ఉప్పగా ఉంటుంది. చమట కూడా ఉప్పగా ఉంటుంది. కలలూ, ఆశలూ, జీవితాలూ, శరీరాలు కూడా ఉప్పగానే ఉంటాయేమో. జీవాతపు రుచి కూడా ఉప్పగా ఉంటుందేమో..అందుకే కొంత కషాయంగా అనిపించినా, జీవితం కదా.. ఉప్పగానే కవితల్ని మనకందించి రుచి చూపిస్తారీ యువకవులు. చైతన్య, వర్ణ లేఖ, అనీల్ డ్యానీ, నరేష్కుమార్ లు. ఎవరి జీవితం వారిది, ఎవరి అనుభవం వారిది. కానీ స్నేహమనే అనుభవంలోకి, కలిసి నడుస్తూ నలుగరూ కలిసి ఒక పుస్తకమై మనమముందు ఒకరిలాగానే కనిపిస్తారు. ఒక్కటిగా, కలిసే కవితల్ని వినిపిస్తారు.

ఈ తరం యువకుల్లోని ఆశలూ, ఆశయాలు, జీవితాన్ని చూసే దృక్కోణమూ, ప్రేమ, ప్రేమ రాహిత్యమూ, సమాజమూ, సమాజములోని వ్యక్తుల జీవితమూ, భగవంతుడూ ఇలా చాలా విషయాలమీద వీరి కవితలు సాగుతాయి. జీవితం పట్ల ఒక నిరసన, అదే విధంగా ఒక సమ్మతమూ కనిపిస్తాయి. గుడ్డి నమ్మకాలకీ..అనుసరణలకీ తిలోదకాలిచ్చి, తమ బతుకును కొత్తగా బతికేందుకు ఉద్యుక్తులైన నలుగురు మనమముందు నిలుస్తారు. అసలు ఇలాంటి కవితా సంకలనాన్ని నలుగురూ కలిసి తీసుకురావటంలోనే వారిలో ఆధునికత కనిపిస్తుంది.  ఒక పద్దతిగా ఒకరితర్వాత ఒకరి కవితల్ని పేర్చక పోవటంలోనే, సాంప్రదాయాల్ని కాదనే తత్వం అర్థమవుతుంది. తీరం యొక్క పరుధుల్లోనే  ఎగిరి దూకలనే క్లాసికల్ కండీషనింగ్ నుంచి బయట పడ్డారు కాబట్టే, వారు తీరం దాటిన నాలుగు కెరటాలు. తీరం దాటిన కెరటానికి లక్ష్యం అంటూ ఏమీ ఉండదు. తన ఆనందం కోసం దాటేస్తుంది. తన పరిధిని దాటడంలో అది ఆనందాన్ని కనుగొంటుంది. సముద్రం ఒడ్డున కూర్చున్న మనం మన కాలికి తగిలిన కెరటాన్ని తప్పక ప్రేమించి తీరుతాము.

ఈ నలుగురిలో అనీల్ డ్యానీ కవితాత్మకంగా సున్నితంగా కనిపిస్తాడు. పరి పూర్ణంగా కనిపిస్తాడు. వేశ్యా వృత్తిలోని ఆకలిని చెబుతూ..నాకు తెలిసిన విద్య ఒకటే- మల్లెపూలని అన్నం మెతుకులుగా మార్చటం అంటాడు. వితంతువు జీవితాన్ని విశ్లేషిస్తూ..అకస్మాత్తుగా తెల్లటి చీర ఒంటిని చీకటిగా చుట్టుకుందని వర్ణిస్తాడు. బావిని ఊరి పెద్ద ముత్తైదువుగా పోల్చి, కామందు కామానికి బలయిన అమాయకురాలు బావిలో దూకినపుడు, బావిని కూడా వెలేసి, బావిని ముండమోపిగా చేసేశారేంటని ప్రశ్నిస్తాడు. దారి పక్కన నిద్రిస్తున్న ముదుసలిని చూసి మానవత్వాన్ని జేబులో వెతుక్కోవడం, కూడలిలో కుర్రాడు కారు అద్దంతో పాటు తన మనసునీ తుడిచాడనటం, జీవితాన్ని రోడ్డు చివరి బడ్డీ కొట్లో సిగరెట్ లకు తాకట్టు పెట్టాననటం, చెత్త కుప్పలు తల్లులవుతున్నాయనటం,  అనీల్ డ్యానీ కవితా శక్తిని తెలియజేస్తాయి.

నరేష్కుమార్, చక్కటి పదగాంభీర్యంతో భిన్న అభివ్యక్తితో కనిపిస్తాడు. తనలోకి తాను చూసుకుంటున్నట్టు అనిపిస్తాడు. "దునియా సే హంనే లియా క్యా" అని అడుగుతున్నట్టుంటాడు. నిర్లక్యంగా, దుందుడుకుగా కనిపిస్తాడు. రోజుకి థీస్ రూపాయ్ సంపాదిస్తాండు, వాడేం నిరుపేద అని అడిగి సమాజంలో  అంతకు మించిన బీదవాడు కూడా ఉన్నాడనే స్పృహని కలిగిస్తాడు. పోలిసన్న ని తోటి కార్మిక సోదరుడిగా గుర్తించి, నువ్వు నియమించబడ్డావు, నేను నిబద్దించబడ్డానని నక్సలైట్ గొంతుతో మాట్లాడతాడు. ఎలాగూ విడిపోతున్నాం కదా, ఈ ఎడబాటనే విషాదాన్ని చెరోవైపున్న మనం స్వేచ్చ అనే రంగేసుకుని బతికేద్దాం అని ఆధునిక జీవితమిచ్చే స్వేచ్ఛని, అందులోని డొల్లతనాన్నీ నిర్ద్వంద్వంగా ఈసడిస్తాడు. దేవుడు కూడా 'పాపపుణ్యాల్ని మీరు గ్రంధాల్లో రాసుకున్నారనీ, గుండెల్లోంచి గుడిలోకి మీరే వెలేసారని' తనతో గొడవ పెట్టుకున్నట్టు అద్భుతంగా ఊహిస్తాడు. కిటికీకి చంద్రుడు తనకు తాను కట్టేసుకున్నాడన్నా, నా గుండెకో కార్నియాని అతికించండి మనసులో అక్షరాలకి దారి చూపాలని అడిగినా, నాన్నయే తన అసలు హీరో అని ప్రకటించినా,నరేష్ యొక్క భావనా గాఢత మనకు అర్థం అవుతుంది.

వర్ణలేఖ కవితల గురించి చెప్పే కన్నా చదివితేనే బాగుంటుంది. మనకి కనిపించే వివిధ రకాల జీవితాల్లోకి తానూ దూకి, తానూ అందులో ఓ పాత్రలా మారి మనతో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. ఫ్లోరైడు బారిన పడిన జీవితాల్నీ, రోడ్డు పక్కని ఛాయ్ కొట్టు నడిపే వారి జీవితాల్నీ, పక్కింటి శకుంతలనీ, తన అత్తగారింటి పయనాన్నీ, రోగాల బారిన పడ్డ బీదవాడి బతుకుల్నీ, వలస పోయిన కొడుకు కోసం ఎదురు చూసే తల్లినీ, ఇలా రకరకాల జీవితాల్ని, అందులోని బాధల్నీ వర్ణలేఖ మనముందుంచుతుంది. సంఘానికి భయపడి విడిపోయిన ప్రేమికులని సంఘం సమ్మతించి వుండింటే..మనమొక ప్రేమకావ్యమై ఉండేవారిమని బాధ పడుతుంది. డిస్క్రిప్టివ్ కవితలు కథను చెబుతున్నట్టుగా ఉంటాయి కనుక కవిత్వీకరించే సమయంలో ఇంకాస్త మెళకువలు పాటించి ఉంటే బాగుంటుందనిపిస్తుంది.

చైతన్య చాలామటుకు తను అనుభవించే ఒక ప్రేమ రాహిత్యాన్ని కవితల్లో మనముందుంచే ప్రయత్నం చేస్తాడు. కానీ అక్కడక్కడా సమాజపు బోలు తనాన్ని ప్రశ్నిస్తాడు. నేను కవిని, 'క'నిపించని 'వి'కారాన్ని అని కవిలోని మిస్టర్ హైడ్ నీ, హిపోక్రసీనీ చూపిస్తాడు. అలాగే అద్దం ముందుకూడా మిస్టర్ హైడ్ అవమాన పడాల్సిందే అంటాడు. చనిపోయిన వాడి నవ్వెందుకు అంత స్వచ్ఛంగా వుంది, ఇంకెవడికోసం నటిస్తున్నాడని అడిగి నిజజీవితంలోని నటనని చూసి నవ్వేస్తాడు. చైతన్య కవిత్వం ఇంకా మెరుగులు దిద్దుకోవాలి. ప్రయత్నిస్తే ఇతడి భావుకత్వం కూడా పరిణతిని సాధిస్తుంది.

పుస్తకంలోని కవితలు హఫాజార్డ్ గా కనిపించటం వలన పాఠకుడు ఎవరి కవిత్వం ఏదనే సందిగ్ధతతకి లోనవుతాడు. ఏది ఏమైనా ఒక మంచి ప్రయత్నం. ఇంకాస్త మెరుగులతో ఈ యువ కవులు మరోసారి తీరం దాటి మనల్ని పలకరించాలని ఆశిద్దాం.
20/09/15
ll కొన్ని రాత్రులు...ll  పుష్యమీ సాగర్ గారి కవితా సంకలనం. ఒక అవగాహన.
...........................................................................................
కొన్ని సంఘటనల్ని మనం చూసినపుడు అవి మనసు మీద కొన్ని బలమైన ముద్రల్ని వేస్తాయి. ఏ రోజైతే అలా జరుగుతుందో, మనకు ఆ రాత్రి నిదుర పట్టదు. ఆ జ్ఞాపకం వెంటాడుతుంది. వేధిస్తుంది. అలాంటి ఎన్నో రాత్రుల్ని గడిపిన పుష్యమీ సాగర్, అలాంటి కొన్ని రాత్రులని మనతో పంచుకుంటాడు ఈ పుస్తకంలో. అలా పంచుకోవాలి అనుకున్నపుడు మనకు మాటలూ కథలూ చెప్పినట్టు చెప్పడు. ఆ సంఘటన ముందు తాను నిలబడి తనకు తాను, మన ముందు ఒక అద్దంలా మారిపోతాడు. ఆ అద్దంలోకి మనం చూస్తే చాలు, ఆ సంఘటనని మనమూ చూసేస్తాము. ఒక సంఘటనని మనముందు మాటలతో వినిపించినపుడు అక్కడ కేవలము మాటలే ఉంటాయి. కానీ కవి అద్దంలా మారి మనకు చూపించినపుడు, మనలో కూడా ప్రశ్నలు మొదలవుతాయి. మనలో ప్రశ్నలు మొదలు కాలేదంటే, కవి అద్దంలా మారి కవిత రాయటంలో ఇక ఏ గొప్ప ఉద్దేశమూ ఉండదు. కేవలం సమయాన్ని నింపుకోవటం తప్ప.

సాగర్ గారు మనలకి రెక్కలు విసురుకుంటూ ఆవలి తీరం వైపు తీసికెళ్ళే రాత్రుల్ని చూపిస్తారు. కవిత చదివాక, మన మధ్యే ఉంటూ మనకంటే భిన్నమైన జీవితాన్ని గడిపే ఓ కొత్త వ్యక్తి మనకు కవితలో పరిచయం అవుతాడు. ఆ పరిచయం చేసుకోవటమే ఆవలి తీరానికి చేరగలగటం. ఆవలి గట్టునించి మనముండే గట్టుని చూపిస్తాడు. ఆవలి గట్టులో జీవితమెంత భయానకంగా ఉందో తెలిసేలా చేస్తాడు. నింగికి నిచ్చనలేసే కాలంలో మనం ఉన్నామనుకుంటున్న సమయంలో..బతుకు గడపని కూడా దాటలేని జీవితం ఒకటుందని చూపుతాడు. డిసెంబర్ థర్టీ ఫస్ట్ పార్టీల్లో మనం మునిగి తేలుతున్నపుడు, బుక్కెడు బువ్వ పెట్టలేని పండుగలెందుకని అవహేళన చేస్తాడు. దేశం వెలిగిపోతోందని దండోరాలేసుకుంటున్న సమయంలో ఆమడ దూరంలో నిలువెత్తు విగ్రహంలా ఉన్న అంటరాని వాన్ని చూడలేకపోయావా అని ప్రశ్నిస్తాడు. వ్యసనాల బారిన పడి చితిపై హాయిగా పడుకున్న వాడినీ, కన్నీటి కుండను పగులగొట్టి, ఇరవైయ్యేండ్ల కుంపటిని ఊరు దాటించి వచ్చిన వితంతువునీ, పొగ చూరుతున్న కూడలి దగ్గరి బిక్షగాల్ల బతుకులనీ, ముగిసిపోయిన నేత వృత్తులనీ, ప్రాణాలతో చెలగాటమాడే సరోగేట్ తల్లుల్నీ, నయా నాగరికతలో అర్ధాంతరంగా ముగిసిన పాత్రలా కనిపించే ఓల్డేజ్ హోమ్ తల్లుల్నీ, మనకు పరిచయం చేస్తాడు. "చూడండి..! వీరు ఇలా ఉన్నారు"  అని చూపటంలోనే మనం వారికోసం ఏదైనా చేయలేమా అనే ప్రశ్ననీ మనలో ఉదయింపజేస్తాడు కవి.

ఇంత సత్యాల్ని చూస్తున్న తన కనులకి, సత్యాల్ని చూడలేని ప్రపంచపు కళ్ళు గుడ్డిగానే కనిపిస్తాయి. తనలోకి నడుచుకుంటూ వచ్చిన జీవితాలని చూసి తనతో తానొక యుద్ధాన్ని చేస్తాడు. మాటల వంతెన కోసం మధన పడతాడు. అవ్యక్తంగా తనను పట్టుకుని వేళ్ళాడే భావాలలోకి మరింత తొంగి చూస్తాడు. నిశ్శబ్దంగా తనని కలవర పెట్టే మాటలని, గొంతు చివరే ఉరితీసి, మాటలు వచ్చిన మూగవాడిలా మనముందు ఒంటరిగా మౌనం చాటున దాక్కుంటానంటాడు. అయినా నిత్య అన్వేషిలా గుండెను తడిమే ఒక స్పర్శ కోసం వెతుకుతూనే ఉంటానంటాడు. అందుకేనేమో తనలోని బాధను మనతో పంచుకోవాలనుకునే ఉద్దేశంలో..'దుఃఖాన్ని చెరిసగం పంచుకు తినే వారికోసం మరో ముద్దను మిగిల్చానని' మనలో ఆకలితో ఉన్న వారిని ఊరిస్తున్నట్టుగా మాట్లాడి ఆకలి రుచి చూపిస్తాడు.

లోకంలో వివిధ రకాలుగా దాక్కుని ఉన్న బాధని మనముందు ఉంచే ప్రయత్నం చేస్తారు సాగర్ గారు. తను చూసిన బాధల్ని తను అనుభూతి చెంది, "ఆ చూడండి, ఈ బాధ ఇలా ఉంటుంది"  అని మనల్ని కూడా అనుభూతి చెందమంటాడు. కాస్త జాగ్రత్తగా చదివితే మనమూ ఆ అనుభూతిని పొందగలం. ఒక్కో సారి కవిత స్టాంజాలుగా కనపడినా..ప్రతీ స్టాంజాలోని ప్రతీ వాక్యాన్నీ విడిగా చదివితేనే మనకు కవిత అర్థం అవుతుంది. ఆయన వాక్య నిర్మాణం చిన్నదిగా చేస్తారు. స్టాంజాలో నాలుగు వాక్యాలూ ఒకే అంశానికి చెందినవి కాక, దేనికవే ప్రత్యేక అంశాన్ని తెలుపుతాయి. స్టాంజా మొత్తం ఒకే అంశంగా చదవటం, రాయటం అలవాటైన వారికి ఈ పద్దతి కొత్తగానే కాక వేగంగా చదివేస్తే కాసింత ఇబ్బందిగా కూడా అనిపిస్తుంది. కానీ ఈ టెక్నిక్ అర్థం అయితే   సాగర్ గారి కవితా లోతులు సులువుగా అర్థం అవుతాయి. అయితే కొన్ని కవితల్లో తాను చూసిన ప్రపంచాన్ని తాను చూసినట్టుగానే చూపే ప్రయత్నంలో, వేరే అంశాలని పరిగణలోనికి తీసుకోకపోవటం కనిపిస్తుంది. ఉదాహరణకి అద్దె అమ్మలు కవితలో అద్దె అమ్మల బాధని చూపించినా సంతానం కలుగని జంటలకి సైన్స్ అందించిన వరం అన్న విషయాన్ని మనకి చూపించరు. అదే కోపంతో 'ఎక్కడెక్కడి వారో వారి తరం కోసం నీ అనుభూతులతో ఆడుకుంటున్నారు' అనేస్తారు. నిజానికి 'కన్సెంట్' లేకుండా ఎవరూ ఎవరినీ సరోగేట్ మదర్ గా మార్చలేరనే విషయాన్ని మనకోసం మరచిపోతారు. అయినా మనల్ని ఇబ్బంది పెట్టకుండానే చదివించగలరాయన.

మొత్తానికి..కొన్ని నిదురలేని రాత్రులని గడిపైనా ఈ లోకం తీరుని గమనించండంటూ ప్రతీ కవితలో ప్రయత్నిస్తూ సాగుతాడు కవి. ఇంకా ఎన్నో సంకలనాలని మనం ఈ కవి నుండి ఆశించవచ్చు. ఇంకాస్త కొత్తగా, కొత్త అనుభవాల్ని, అనుభూతుల్నీ వెంటేసుకోవాలనే జీవితేచ్ఛ బలంగా ఉన్నవారెవరూ ఇంట్లో కూర్చుని కవితలు రాయరు. సమాజంలో కూర్చునే రాయాలి. సమాజానికే చూపించాలి ఇదిగో సమాజమా..! నీవిలా ఉన్నవని. అలా చూపించే అరుదైన కవుల్లో పుష్యమీ సాగర్ గారు కూడా చేరతారు. మరింత బలంగా ఆయన కలం మరిన్ని కోణాల్ని స్పృశించాలని కోరుకుంటూ...
    మీ విరించి.

Monday, 21 September 2015

అందమా..! సెల్ఫీ గీసిన చిత్రమా..!
-----------------------------------------------
నాకో మిత్రుడున్నాడు. ఈ రోజొక గిఫ్ట్ పచ్టుకొచ్చాడు. ఏమంటే...'సెల్ఫీ స్టిక్' అంట. దాని మూతికి సెల్ ఫోన్ పెట్టాలంట. చేతిలో ఒక రిమోట్ లోని బటన్ ని నొక్కితే ఫోటో పడుద్దంట. నా దెగ్గర కెమేరా ఉండే స్మార్ట్ ఫోన్ లేదు మరి. ఏదో వెయ్యిరూపాయల సెల్లు నాది. అదికూడా నా బామ్మర్ది నా మీద ప్రేమతో గిఫ్ట్ గా ఇచ్చింది. అవాక్కయ్యాడు. 'ఏంటీ.. డాక్టర్ అయుండి ఇలాంటి సెల్లా?' అన్నాడు అదో రకమైన చూపుతో. ఆ చూపు ఎలా ఉందంటే..ప్రపంచంలో నా అంత పాపాత్ముడు ఉండడన్నట్టు ఉందన్నమాట. సెల్ ఫోన్ లో అవతలి వ్యక్తితో మాట్లాడటానికి ఇరవై వేల స్మార్ట్ ఫోన్ లో మాట్లాడితేనే వినిపిస్తుందా..లేకపోతే వినిపించదా అని అడిగాను. అయినా అతడు ఆ పాపపు దృక్కులను నా మీద ప్రసరించటం ఆపలేదు. "ఈ గిఫ్ట్ ఇస్తే అయినా నీవు మంచి సెల్ కొంటావని ఆశిస్తున్నా"  అని దాన్నక్కడ పెట్టి వెల్లిపోయాడు. ఇడ్లీ మిగిలిందని సాంబారు, సాంబారు మిగిలిందని ఇడ్లీ వేయించుకుంటూ పోతే ఇక తిండి ముగిసేదెప్పుడో. ఇపుడా స్టిక్ కోసమైనా సెల్ కొనాల్సిన పరిస్థితినా. ఓరి భగవంతుడా ఏమి ఔడియాలురా సామి...!

 సెల్ ఫోన్ కంపనీ వారు సెల్ ఫోన్ స్టిక్ ని కూడా తయారు చేసి అమ్ముకోవటం మంచి ఔడియానే కదా అనుకుంటాం కానీ, మొన్న ఒక హోటల్ కి పార్టీకి వెళితే అక్కడ 'సెల్ఫీ జోన్' అని ఉంది. అంటే ఆ బ్యాక్ గ్రౌండ్ ని సెల్ఫీ తీసుకోవటానికి అనుకూలంగా ఆ హోటల్ వాళ్ళు ఆ గోడని మలిచారన్నమాట. అంటే సెల్ఫీల పిచ్చి ఏ రేంజ్ లో పెరిగి  పోయిందో అర్థమైంది కదా. మనకుండే సెలబ్రిటీలు కూడా సెల్ఫీలకి మంచి బ్యాక్ గౌండ్ లే. ఒక స్టార్,  సెలెబ్రిటీ రేంజ్ కి ఎదిగాడా లేడా అంటే..అతడితోటి ఇప్పటిదాకా ఎంతమంది సెల్ఫీలు దిగారనేది కౌంట్ చెయ్యాలి. "ఏం మేం కాదా..మేం లెజెండ్లము కాదా..మేము సెల్ఫీలకి బ్యాక్ గ్రౌండ్ గా నిలబడలేదా.? మీరేనా లెజెండ్లు?"  అని ఫ్యూచర్ లో ఎవరైనా తమకు  అవార్డ్ రాకుంటే ఇలా అడిగి కడిగేయొచ్చు కూడా. మోడీగారు తన్నుతాను సెల్ఫీ బ్యాక్ గ్రౌండ్ గా మలచుకోగలిగారంటే ఆ కష్టం ఏంటో మనం ఊహించనే లేము. మంచు లక్ష్మి అలా ఆయన సెల్ఫీ సెంటిమెంటు మీద కొట్టింది ఇలా బ్రాండ్ అంబాసిడర్ పదవి కొట్టింది. చూశారా సెల్ఫీయా మజాకా..?

సెల్ఫీ పిచ్చి మరీ ఎక్కువై నార్సిస్టిక్ పర్సనాలిటీ డిసార్డర్లోకి దిగిపోతే కష్టమంటున్నారు సైకాలజిస్ట్ లు. సోషల్ మీడియాలో సెల్ఫీలు పోస్ట్ చేస్తూ లైకులనూ కామెంటులనూ పొందుతున్న వారు, మిగతావారి కంటే ఒకింత సెల్ఫ్ ఇమేజ్ ని పెంచుకుని, సెల్ఫ్ కాన్ఫిడెంట్ తో ఉంటున్నారంట. రకరకాల ప్రదేశాల్లో దిగేసి, "చూడండి నేను ఇక్కడకూడా ఉన్నాను"  అని చెప్పుకుంటున్నారు. కాదేదీ సెల్ఫీ తీసుకోడానికి అనర్హం. బస్ స్టాప్ లో....బస్సులో..రైల్వే స్టేషన్ లో.. రైలులో..ఎయిర్ పోర్ట్ లో..విమానంలో...బాత్ రూం లో....ఆ..ఆ.. అక్కడ కూడా. ఆ మధ్య ఒక సెల్ఫీ పిచ్చోడు, తన తాత శవం పక్కన నిలబడి మరీ తీసుకుంటే సోషల్ మీడియాలో తిట్టనోడు లేడు. ప్రతీ రోజూ ఒక సెల్ఫీ మారుస్తూ ఉండే సోగ్గాళ్ళ ని ఫ్రెండ్ లిస్ట్ లో ఉన్న వారు పెద్దగా పట్టించుకోవటం లేదట. పైగా అలా విపరీతంగా సెల్ఫీలు తీసుకుని సోషల్ మీడియాలో పెట్టే వారిమీద చెడు అభిప్రాయం కలిగి ఉన్నవారే ఎక్కువగా ఉన్నారట. ఇది కూడా ఒక స్టడీయే. "ఎవరూ ఆ సుత్తి మనిషినా..రోజుకో సెల్ఫీ మారుస్తుంది రా బాబూ..చూడలేక చచ్చిపోతున్నాం"  అని ఆ మధ్య ఒక మిత్రుడు బాధ పడ్డాడు. వాడిదీ పాయింటే మరి. ఈమె రోజుకూ ఒక సెల్ఫీ పెట్టుద్దట. ఫ్రెండు లిస్ట్ లో ఉంది కాబట్టి మనకు కనపడి చచ్చుద్ది. చూసిన తరువాత లైకాలి. లేదా కామెంటాలి. ఆహా అద్భుతమనో..ఆసం అనో. అలా చేయక పోతే  చా......లా.... బా.....గో......దు. అది రోజూ చేయాలి..ఆమె రోజుకో సెల్ఫీ పెట్టుద్ది కాబట్టి. రోజూ అదే కామెంటాలి. "సెల్ఫీలు ఎన్నో రకాలు ఉన్నా..కామెంటులు కొన్నే కదా..అదే అద్భుతమూ.అదే ఆసమ్మూ..." అని తలబాదుకున్నాడు మావోడు.

సెల్ఫీ తీసుకుంటే తీసుకున్నారు. దాని మీద బ్యూటీ కాన్షస్ ఒకటి. తల వంచటమో..మెడ వంచటమో..కను బొమ్మలు ఎన్టీఆర్ స్టైల్లో లేపడమో..కెమెరాని చూడకుండా అటేటో చూడటమో...తల ఓ వైపు కళ్ళు కెమెరా వైపు పెట్టి క్రీగంట చూడటమో, చిత్ర విచిత్ర ఫేషియల్ ఎక్స్ ప్రెషన్స్..అంటే అలిగినట్టు బుంగ మూతి పెట్టడమూ లేదా వెక్కిరిస్తున్నట్టు పెదవులు పెట్టడమూ( మున్నగునవన్నమాట) , ఒక వేళ బాడీ మొత్తం దిగారంటే..నడుము మీద చేయి వేయటమో..ఒక కాలు ముందుకి పెట్టి మోకాలి వద్ద బెండ్ చేయటమో మన్నగునవి సెల్ఫీల్లో కనబడ్డాయంటే బ్యూటీ కాన్షస్ ఎక్కువగా ఉన్నట్టే. మరచితిని, ఇలా ఫేస్ వంకరగా..కళ్ళు చొట్టగా..బాడి వంగినట్టుగా పెట్టాలి అని అనుకున్న వారికో సులభమైన అవుడియా ఉంది. రెండు వేళ్ళనూ తెరిచి, చిన్నప్పుడు టూ నంబర్ కి పోవటానికి టీచర్ ని అడిగే వాళ్ళం కదా, అష్ట వంకర్లు పోతూ..(ఈ రోజుల్లో అది విక్టరీకి సింబల్ అట. దేనికి విక్టరీనో మరి)...ఆ రెండు వేళ్ళనూ చూపిస్తున్నట్టుగా పెడితే సరి. బ్యూటీఫుల్ బ్యూటీ కాన్షస్ సెల్ఫీ రెడీ. సెల్ఫీ దిగామా, పోస్ట్ చేశామా కాదన్నయ్యా...లైకూ కామెంటూ పడిందా లేదా..అనేది ముఖ్యం. Be smart with a smart phone. కాప్షన్ బాగుంటే వాడుకోండి. కానీ  నాకు మాత్రం సెల్ఫీ ని ట్యాగ్ చేయకండి. పలీజ్ .

Wednesday, 16 September 2015

విరించి ll సంధి పత్రం ll
..........................................
కాలాల్లో కల్లోలాలు పుట్టే రోజుల్లోకి
మనసంతా తలుపులు తెరుచుకుని
పనిలేని పద శాస్త్రజ్ఞుడిలా తిరిగేవాడిని.

కంటిముందు సాష్టాంగపడిన దుస్సంఘటనో
చెవిపక్కన సాగిలపడిన అరుదైన విషయమో
ఏదైనాగానీ..నుదుటిమీద కాసిన్ని
ఆందోళనా ముడతలను పుష్పింపజేసినపుడు
నోటి మీద రెండు
ఆశ్చర్య పెదవుల్ని వికసింపజేసినపుడు
నా హృదయాన్నొక ఫైరింజన్ గంటలా మ్రోగించేవాణ్ణి.

చచ్చి పోయిన మహానుభావుడో
చంపబడిన నక్సలైటో
పోయేవాడు ఎవడైనా సరే..
ఊరక పోయేవాడే కాదు
ఒక కొవ్వొత్తి కక్కినంత మైనాన్నయినా
అర్ధరాత్రి నా కాగితం మీద కక్కిపోయేవాడు

'కానీ ఇపుడేమైంది నాలో'  అనే అనుమానం
ఇపుడిపుడే నాలో పుడుతున్నట్టున్నది.
నిలువ ఉంచుకున్న భావాలకి
పురుగు పట్టినట్టు
చింతపండుతో తోమని వెండిపాత్రలా
వెలవెల పోతున్నట్టు
నాతో నేనేదో రహస్య అవగాహన కొచ్చినట్టు
నానుండి నన్ను బయటకి తోసేసుకున్నట్టు
నా మీద నాకే పుట్టిన ఓ అనుమానం
నన్నో అవమానంలా వెంటాడుతున్నట్టున్నది.

ఉల్లి, కందిపప్పు ధరలు తగ్గి పెరిగాయన్నా..
పెట్రోలు డీజిలు ధరలు పెరిగి తగ్గాయన్నా..
అభం శుభం తెలియని ఆడపిల్లలను
రేప్ చేసి చంపేస్తున్నా..
పేలిన బాంబులతో పాటు శరీరాలు పేలిపోతున్నా
ప్రపంచం పగిలిపోతుందన్నా...
చిన్న మొక్కలమీద వడగండ్ల వాన కురుస్తున్నా..
సిరా ఒలికి పాడైపోయిన కాగితంలా
ఏ భావమూ సరిగా చెప్పలేని అబ్స్ట్రాక్ట్ చిత్రం లా
నవ్వుతున్నట్టుండే జోకర్ మాస్క్ ని ధరించుకుంటున్నాను.

అలవాటు పడిపోయానేమో..
బాహ్యానికో అంతరంగపు సంధి పత్రం దొరికిందేమో
అందుకే అలవాటుగా ఇపుడబద్దం చెబుతున్నాను
ఓ కవితకోసం ఇక్కడో పూవు నవ్వుతోందని.

16/9/15

Saturday, 12 September 2015

Few comments of mine here n there

హెచ్చార్కే గారి ఎన్నో వ్యాసాలు చదివాక, ఇది హెచ్చార్కే స్థాయి వ్యాసం కాదని చెప్పగలను. అయితే ఇది వారి మీద వల్లమాలిన ప్రేమ అభిమానం వల్లనే. సరలా కొడాలి గారి ప్రశ్నలో క్లారిటీ ఉందని కూడా నేను అనుకోవటం లేదు. సరల గారి ప్రశ్నలోని అంశాన్ని తప్ప హెచ్చార్కే గారు వేరే అంశాలనే ఎక్కువగా మాటాడారనిపించింది. ప్రశ్న బేసిక్ మెటీరియల్ ఏమంటే ఒక చిరాకుని, ఒక కోపాన్ని మనం అసభ్య పదజాలంతో వ్యక్తం చేస్తాం. కవితలో కూడా ఇవి వాడటం మంచిదా కాదా అనేది వారి ప్రశ్నగా నాకు అర్థం అయింది.

చిన్నపిల్లల బిహేవియర్ పాటర్న్స్ లో వారు ఉపయోగించే భాష చాలా మటుకు అనుకరణలోంచి ఒచ్చిందే తప్ప, అవగాహన లోంచి ఒచ్చింది అయ్యుండదు. చిన్నపుడు నేను ఆటలాడుకునేపుడు..నా జతగాల్లంతా పశువుల్ని గొర్రెల్ని కాపుకునే వారు ఉండేవారు. ఒక పశువు కాస్త పక్కకి వెలితే మరలా దానిని లైన్ లో కి తేవటం కోసం...దాన్ని చెర్నకోలతోనో కట్టెతోనో కొట్టేవారు. ఆ కొడుతున్న సమయంలో అచ్చ తెలుగులో ఫక్ అనే పదాన్నే ఉపయోగించేవారు. అయితే నా బుజ్జి బుర్రకి ఆ వర్డ్ కొట్టటానికి ఉపయోగిస్తారేమో అని అర్థమయింది. ఒక సారి మా ఇంట్లోకి ఒక కుక్క వస్తే అమాయకంగా నేను మా తాతయ్య ముందు దానిని కొట్టమనే ఉద్దేశంలోనే అదే మాటను వాడాను. పట్టుమని నాలుగేల్లు నిండని నా నోటి నుండి ఆ మాటలు రావటం విని హతాశయుడయిన మా తాతయ్య తరువాత ఏమి చేసి ఉంటాడో నేను చెప్పనక్కరలేదు. వీపు, విమానం, మోత వంటి పదాలన్నమాట. నిజానికి ఆ మాటల్ని అర్థం చేసుకునే వయసు నాది కాదు. పలకటం కూడా సరిగా రాని వయసనే అనుకోవాలి.  కేవలం అనుకరణ. ఇలాంటివెన్నో విషయాలు మనకు అవగాహన లేకున్నా మనం వాడతాం పెద్దగయ్యాక కూడా, ఆ అనుకరణ స్థిరీకరణ చెందటం వలన.

కోపం లో ఉన్నపుడు మనిషి తన మాటమీద అదుపు కోల్పోతాడు. ఆ సమయంలో అతడు చేసే ఏ పని అయినా, అతడిలోని ఫ్రస్ట్రేషన్ (కుంఠనము) ని తగ్గించి, శరీరాన్ని సమతుల దిశకు కొని వస్తుంది.  కుంఠనాన్ని వ్యక్త పరిచే విధానం కూడా వయసును బట్టి మారుతుంది. సాంఘిక పరమైన కుంఠనాల్ని అనుభవించిన కవి తన కవితల్లో దాన్నుంచి బయటపడే మార్గాన్ని అన్వేషిస్తాడు. సాంఘిక కుంఠనాల్నించి బయటపడ్డాక అతడికి ఆ భాష వాడాల్సిన పని ఉండదు. దిగంబర కవిత్వం ఒకానొక సోషల్ అవస్థది అని మనం అనుకుంటే...ఆ వ్యవస్థ ఉన్నంత వరకూ , ఆ ఫ్రస్ట్రేషన్ ఉన్నంత వరకూ ఆ భాష ఉంది. ఆ ఆదరణా వుంది. అయితే దీనికి శృంగార కవిత్వానికి పచ్చి సెక్స్  కవిత్వానికి సంబంధం ఏంటో హెచ్చార్కే గారు వివరించాలి. కడుపు మాడిన వాడి మాట కఠినంగా, పచ్చిగానే వుంటుంది. సుఖభోగలాలసులై శృంగార కవిత్వం రాసుకోవచ్చు. తప్పు లేదు. చదివే వారు చదువుకుంటారు. శృంగారంలో అశ్లీలమనేదెక్కడ?. పనీ పాట లేక సరదాగా సెక్స్ సాహిత్యమూ రాసుకోవచ్చు. మా కాలేజ్ లో ఆ మధ్య వచ్చిన ప్రతీ తెలుగు సాంగ్ కీ సెక్స్ పేరడీ పాటల్ని పాడుకునే వాల్లం. స్నేహితులందరమూ అలా పాడుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేసె వారం. మేమే కాదు మా మిత్రురాల్లు కూడా ఇటువంటి పాటలు పాడుకునే వారట. అదొక స్టేజ్. ఇపుడు దాంట్లో మజా లేదు. ఆ అవసరమూ ఇపుడు లేదు.

వ్యాసంలో నాకు ఎన్నో ప్రి కంన్సీవ్డ్ నోషన్స్ కనిపించాయి. ఉదాహరణకి, మీరు చూపిన ఓ శ్రీశ్రీ రాశారు అని. అంటే శ్రీశ్రీ ఏది రాసినా అది కరెక్టయి పోతుందనో..లేదా శ్రీశ్రీ అంతటి వాడే అలా అన్నాడనో ఒక నోషన్ ఉంది. ఇవి రెండూ తప్పు సంకేతాల్నే ఇస్తాయి. నా ఖర్మగాలి ఇలాంటి సినిమా పాటలు రాయాల్సి ఒచ్చిందని శ్రీశ్రీ రాసిన సినిమా పాటల పుస్తకంలో ఒక అథో జ్ఞాపికలో పాపం ఆయన రాసుకుని ఉన్నారు. ఇలాంటివెన్నొ నాకు మీ వ్యాసంలో కనిపించాయి. వ్యాసం అనవసరంగా వేరే విషయాలమీదకి పోయిందనిపించింది. ఇంకా చర్చంచగలను. కానీ సమయాభావం. మన్నించగలరు.

*  జ్యోతిష్యం మన శాస్త్రమే కాదు కదా ఫణీ..
మనల్ని కర్మయోగం నుంచి తప్పించి బలహీనుల్ని చేసే ఏ శాస్త్రమూ మనది కాదు.
స్వామీ వివేకానంద జ్యోతిష్యం మీద చేసిన ప్రసంగం కింద ఉంచుతున్నాను.@ Phani Shashanka Sharma

I think the Greeks first took astrology to India and took from the Hindus the science of astronomy and carried it back with them from Europe. Because in India you will find old altars made according to a certain geometrical plan, and certain things had to be done when the stars were in certain positions, therefore I think the Greeks gave the Hindus astrology, and the Hindus gave them astronomy.
I have seen some astrologers who predicted wonderful things; but I have no reason to believe they predicted them only from the stars, or anything of the sort. In many cases it is simply mind reading. Sometimes wonderful predictions are made, but in many cases it is arrant trash.
In London, a young man used to come to me and ask me, “What will become of me next year?” I asked him why he asked me so. “I have lost all my money and have become very, very poor.” Money is the only God of many beings. Weak men, when they lose everything and feel themselves weak, try all sorts of uncanny methods of making money, and come to astrology and all these things. “It is the coward and the fool who says, ‘This is fate'” – so says the Sanskrit proverb. But it is the strong man who stands up and says, “I will make my fate.” It is people who are getting old who talk of fate. Young men generally do not come to astrology. We may be under planetary influence, but it should not matter much to us. Buddha says, “Those that get a living by calculation of the stars by such art and other lying tricks are to be avoided”; and he ought to know, because he was the greatest Hindu ever born. Let stars come, what harm is there? If a star disturbs my life, it would not be worth a cent. You will find that astrology and all these mystical things are generally signs of a weak mind; therefore as soon as they are becoming prominent in our minds, we should see a physician, take good food and rest.

*  ఫణి, మీరు కర్మ యోగాన్ని, కర్మ సిద్ధాంతాన్ని ఒకేలా భావన చేసినట్టనిపించింది.
జ్ఞానయోగేనా సాంఖ్యానాం, కర్మ యోగేన యోగినాం అని గీతా వాక్యం. ఏది గొప్ప ఏది తక్కువ అని చెప్పినట్టు లేదు.
ఆచరణ లేని జ్ఞానం, కేవలం మానసిక శ్రమలాగా ఔతుందనో,
జ్ఞానం లేని ఆచరణ కేవలం గుడ్డి నమ్మకంగా మిగుసుతుందనో ఉద్దేశంతోటి రెంటిలో దేనికీ పై చేయి ఇవ్వలేదనుకుంటాను.
శంకరుల కాలంలో వేద వేదాంగాలని పునర్నిర్మాణించే అవసరంలాంటిదొచ్చిందనుకుంటాను. శంకరులు అవతార పురుషుడు కనుక ఆయన తన కార్యాన్ని నిర్వర్తించి ఉండింటారు.
కానీ ప్రస్థుతమది (జ్యోతిష్యం) జ్ఞానంలేని మతంగా మారుతోంది. అంగడి సరుకయి బిజినెస్ కి పనికొస్తుంది.
ఇపుడు దాని బిచాణా అయినా ఎత్తేయాలి, లేకపోతే అసలైన జ్ఞానాన్నయినా అందులో నింపాలి.

*  ఫణి మీతో ఏకీభవిస్తాను. ఎమ్బీబీయస్ డిగ్రీని ఒక యూనివర్సిటీ ఇస్తోంది. ఒక రెండుమూడు జ్యోతిషం మీద పుస్తకాలు చదివేసి, బోర్డ్ లు పెట్టుకునే వారిని అరికట్టేదెవరు?. ఫ్రాడ్ జరగటానికే అవకాశం ఎక్కువ. ఇపుడు బ్యాన్ చేయకపోతే ఫూర్తి వెధవల చేతిలోకి పోయి టోటల్ గా డామేజ్ అయిపొయ్యాక, అసలైన పండితులొచ్చి చేసేదీ ఏమీ ఉండదు. సేఫ్ హ్యాండ్స్ లో శాస్త్రం ఉండటం వేరు, పిచ్చివాడి చేతిలో రాయిలా ఉండటం వేరు. అంతా చేసి వీరు చేసేది, లేని మూఢనమ్మకాలని హిందూ మతంలోకి వీరి సొంత పైత్యం లా ఎక్కించటమే. ఆ మధ్య ఒక టీవీ బురిడీ వెధవ ఏం కూశాడు. పెల్లి చేసుకోడానికి జాతక శాఖ గోత్రాదులతో పాటు కుల దైవం కూడా ఒకటే అయి వుండాలట?. అన్నీ కలిసినా కులదైవం కలవకపోతే ఆ పెల్లి పెటాకులౌతుందట. ఇది ఏ శాస్త్రంలో వుంది. ఇలా అతుకుబొతుకూ లేకుండా చెప్పే వాల్లని ఏమనాలి?. శాస్త్రం చదువుకున్న మీవంటి వారు ఏమీ మాటాడనపుడు, బ్యాన్ చేయమనటమే సరి అయిన పని అని అనుకుంటున్నా.

*  ఫణీ మీ చొరవ కి కృతజ్ఞతలు. Astrology and astronomy కి బేధం ఉంది కదా. భారతీయుల astronomical knowledge కి తిరుగులేదు. దానిని ఎవరూ శంకించటం లేదు. దాని ఆధారంగా astrology మానవ జీవితాల్లో జరిగే సంఘటనల సంభావ్యతల్ని అంచనా వేసే ప్రయత్నం చేసిందనుకుంటాను. ప్రతీ శాస్త్రానికీ హద్దులున్నాయి. ఒక శాస్త్రం హద్దులే లేనిది అని అనుకున్నపుడు ఒక నష్టం జరుగుతుంది. అదేమంటె, ఆ శాస్త్రం ఇక ఫైనల్ వర్డ్ అయి కూచోవటమే కాక, మరలా పునస్సమీక్షించుకోవటానికీ, పునః శాస్త్రీకరించుకోవటానికీ అవకాశాల్ని శాశ్వతంగా మూసేసుకుంటుంది. శాస్త్రానికి శాస్త్రీయత ప్రమాణికం కాకుండా, నమ్మకం మాత్రమే ప్రామాణికమయి కూచుంటే..కాల రిత్యా నమ్మకం సడలినపుడు శాస్త్రం మనుగడ ప్రశ్నార్థకమౌతుంది. ఇపుడు జ్యోతిష్యం శాస్త్రం మీద కాకుండా, నమ్మకం మీద మాత్రమే ఆధార పడేలా తయారయింది. తయారు చేయబడింది. దానికి గల కారణాలు వ్యక్తి స్వార్థమే తప్ప నిజమైన శాస్త్ర దృక్పథం కానేకాదు. రెండు పుస్తకాలు చదివేసి బోర్డు పెట్టేసుకుని రెండాకులు వెనుకేసుకోవటానికీ, రెండు బంగారు కడియాలు పెట్టుకోవటానికే తప్ప, నిజమైన శాస్త్రీయ పరిశోధన, అవగాహన
కరువైపోయిన కాలంలో, ఒక శాస్త్రం మూఢనమ్మకం లాగా కాక ఇంక వేరేలా కనిపించే అవకాశమే లేదు. గ్రహ స్థితిగతుల ఆధారంగా మానవ జీవితపు సంఘటనల సంభావ్యతలని పరిశీలించాల్సినది పోయి, అది వారి జీవితాల్ని శాసించే దిశగా మారటం దానిని సోకాల్డ్ జ్యోతిష్యులు క్యాష్ చేసుకోవటం తప్ప వేరే చూడలేకపోతున్నాం. జ్యోతిష్యం ప్రస్తుతం జీవితానికి సహాయకారిగా లేనేలేదు. భారంగా మారింది. మార్చబడింది. 

Thursday, 10 September 2015

ఓ మోస్తరు లావు పుస్తకం. పెపెంచకం లో ఏ మూల ఏం జరిగినా అందులో ఉందంటారు. అన్నీ అందులో ఎలా ఇరికించిరాసి ఉంటారో, వీరు దాన్ని ఎలా కనుగొంటారో అర్థం కాదు. అదేనండీ, మీరనుకున్నట్టు మత గ్రంధాల గురించే చెబుతున్నాను. "స్వచ్ఛమైన మనసు గల మానవుని అలుపెరుగని ప్రార్థనా గీతం"  అని చెప్పబడ్డ వేదాలకి కూడా మతపు రంగు పూసేశారు. "వేదాల్లో అన్నీ ఉన్నయని అన్నా,  అసలేమీ లేదని అన్నా నీకు వేదం గురించి ఏమీ తెలియదంటాను"  అన్నారు నాలుగు వేదాల్ని తెలుగులోకి అనువాదం చేసిన దాశరథి రంగాచార్య గారు. అయినా ఎవరింటారు?. ఇంకా వేదాల్లోనే అన్నీ ఉంటాయంటారు. చివరికి అది ఎక్కడి దాకా సాగిందంటే....xxx వారి వేద సూచిత పవిత్ర ఆవు నెయ్యి, వేద సూచిత పవిత్ర అగరొత్తులూ, yyy వారి వేదసూచిత పవిత్ర అరిసెలూ పవిత్ర బొబ్బట్లూ కొనండి అనేదాకా..చూశారా.. వీరి కంపనీ వారు తయారు చేసిన పవిత్ర పిడకల గురించి ఎపుడో వేదాల్లో సూచించారట. ఇలాంటి పిచ్చి మరీ పీక్స్ కి పోయి, బైబిల్ సూచిత పవిత్ర తైలమూ, జీసస్ సూచిత ఫాస్టర్ గారి పవిత్ర వీర్యమూ భక్తుల కోసం రెడీగా ఉన్నాయ్.
సారీ....నేనింక టైం వేస్ట్ చేసేది లేదు. అర్జంటుగా నా క్లినిక్ బోర్డు మార్చాలి. వేద సూచిత వైద్యుడు..వేద సూచిత వైద్యమూ,  అని పేరు మార్చుకోవాలి. సేవ ముసుగున బిజినెస్ పెంచుకోవాలి కదా...పవిత్ర అనే పదము మతాలకి మత పుస్తకాలకి మత పూజా వస్తువులకి మాత్రమే పేటెంట్ కాబట్టి, నా బోర్డు మీద 'పవిత్ర' అనే పదాన్ని వాడనుగాక వాడనని హామీ ఇస్తున్నా.
విరించి ll సాధన ll
.............................................. ...
జీవితం కోల్పోయిన సునిశితమైన అనుభవాల్ని
తిరిగి పొందాలంటే..
ముందుగా మనమందరం
జంతువుల్ని ప్రేమించటం నేర్చుకోవాలి.

కలుషితమనే పదం తెలియని స్నేహాన్ని
అనేక భావాల్ని ఒకేసారి వ్యక్త పరిచే మౌనాన్ని
నీవపుడే మొట్టమొదటి సారి కనుగోవచ్చేమో..

ఒక జంతువుతో నీవు ఆకర్షింపబడటానికి
నీలో మానవాతీత శక్తి ఏదో దాగుండాలి
మెదడులో పండితుడవనే గర్వాన్ని
నాలుక మీద తారాడే గ్రాంధిక భాషనీ
జంతువే కదాని చూసే చిన్న చూపుని
డిగ్రీలని, డబ్బునీ, పదవులనీ అన్నిటినీ వదిలేసి..
నిర్మలమైన మనసుతో దానిని చేరితేనే
అది నిన్ను దగ్గరికి రానిస్తుంది.

చిన్నగా ఉన్న జంతువుని పెంచి పెద్ద చేయటం
అంత సులువైన పనేమీ కాదు..
ఆరోగ్య కరమైన వాతావరణంలోనే
దానిని ఎదగనివ్వాలి.
అనవసరంగా క్రూరంగా పెరిగే గోళ్ళని
ఎప్పటికప్పుడు కత్తిరించాలి.
రోజూ ఆఫీసు నుండి వచ్చాక
కాసేపు దానితో గడపాలి
దాని మాటల్ని శ్రద్ధగా వినడం
నిత్యం సాధన చేయాలి.

జంతువు పెరిగి పెద్దదవుతున్న కొలదీ
నీకది అలవాటుగా మారుతున్న కొలదీ
నీతో అది మాట్లాడటం మొదలవుతుంది.
నీ గొంతునే అది వినిపిస్తుంది.
ఒక్కో సారి నీతో అది అబేధాన్ని ప్రకటిస్తుంది.

నేనీ మధ్యే కొన్ని జంతువుల్ని పెంచుతూ
జీవితపు ఆనందాల్ని చవిచూస్తున్నాను.
నాలుగు పాదాలతో సాగే ప్రతీ పద్యమూ
ఒక జంతువే కదా...

10/9/15

English Translation of My poem Aksharalu Kavitalu By Nauduri Murty Garu

Phonemes and Poems… Virinchi Sharma, Telugu, Indian

What if a lone faceless idea
Gets lost like a homeless child
In the spectacle of words?
Enough if one has an enduring faith
That it would come back as a poem
Should it survive somewhere, somehow.

If it were a dream
To be able to pen a good poem,
Well, at dawn, I would close my eyes
And pretend asleep
To dream it over and again.

Just because you sow the seeds of words
In a very expansive field of memory
You can’t expect to beget a harvest
Of poems, like tender and ripe fruits.    

This long poem
I write at this odd hour
Chasing myself through
The narrow confines of this paper
Stands but like a running commentary
To the wonderful discourse Life delivers.

No matter how fast I write
Nor how crooked my hand is…
Once the word spills onto the paper
It exists there forever as it is.
Perhaps, it’s the reason why
Whenever I peep into my poems
Written in my adolescent days
I could feel the whiskers on those words.  

Words are just like people!
They just can’t keep quiet
Whenever they assemble at one place.
A poem is but me
Playing hiding seek
With the hiding self within.
.
Virinchi  
Dear Doctor

Here is the translation of your lovely poem.

Please check if it reflects what you exactly mean.

Phonemes and The poems

.
What if a lone faceless idea
Gets lost like a homeless child
In the spectacle of words?
Enough if one has an enduring faith
That it would come back as a poem
Should it survive somewhere, somehow. 

If it were a dream
To be able to pen a good poem,
Well, at dawn, I close my eyes 
And pretend asleep
To dream it over and again. 

Just because you sow the seeds of words
In a very expansive field of memory
You can’t expect to beget a harvest
Of poems, like tender and ripe fruits.    

This long poem
I write at this odd hour
Chasing myself through
The narrow confines of this paper
Stands but like a running commentary
To the wonderful discourse Life delivers. 

No matter how fast I write
Nor how crooked my hand is… 
Once the word spills onto the paper
It exists there forever as it is. 
Perhaps, it’s the reason why
Whenever I peep into my poems
Written in my adolescent days
I could feel the whiskers on those words.  

Words are just like people!
They just can’t keep quiet 
Whenever they assemble at one place.
A poem is but me 
Playing hiding seek 
With the hiding self within.
.
Virinchi  


regards

Sunday, 6 September 2015

విరించి ll బూమెరాంగ్ ll కథ
................................

"ఇదిగో చూడు మామా...ఈ రోజే మన కష్టాలకు లాస్ట్ రోజు కావాలి. రేపు మన ప్లాన్ సక్సెస్ అయిందంటే మనం కాలు మీద కాలేసుకుని దర్జాగా బతకొచ్చు....ఏమంటావ్". బార్ లో గోల గోల గా ఉంది. గట్టిగా మాట్లాడితే గానీ వినబడదు. అయినా సాధారణంగా మాట్లాడే మాటలను కూడా రహస్యంగా చెబుతున్నట్టు చెప్పాడు సుధాకర్.

"ఇంక బస్ కర్ రే అయ్యా...!!ఎన్ని సార్లు చెప్పిందే చెబుతవ్?" విసుక్కున్నాడు సుధీర్. "అది సరే గానీ..డబ్బుతో దుబయ్ కి వెళ్ళి జిందగీ మస్త్ ఎంజాయ్ చెయ్యాలె రా. ముందు మా అయ్య కి దూరంగా ఉండాలె. లేక పోతే దిమాఖ్ ఖరాబ్ చేస్తడు.

-"హాహాహా...డబ్బొస్తే మీ అయ్యకు కూడా నీ మీద ప్రేమ ఒస్తది రో..." బల్ల చరుస్తూ గట్టిగా నవ్వాడు సుధాకర్. "కానీ మామా..ఈ విషయం మనిద్దరి మధ్యే వుండాలి". మళ్ళీ రహస్యం గా చెప్పాడు. బార్ లో బల్ల కి ఎదురెదురుగా కూర్చుని ఉన్నారు. బల్ల మీద ఆవురావురుమని ఆకలితో తిని పక్కకు పడేసిన ప్లేట్లు, ఫుల్ గా తాగినట్లు మందు సీసాలూ కనిపిస్తున్నాయి. మామూలుగా అంతగా తాగిన వారు ఇంత తెలివితో ఉండటం మనం చూడలేం. విపరీతంగా తాగినా ఇద్దరూ చాలా తెలివిడితో జాగ్రత్తగా ఉన్నట్టు కనిపిస్తున్నారు. ఈ రాత్రికి నిదురను కోరుకోని మనుషులు ఎదురెదురుగా కూర్చుని మాట్లాడు కుంటున్నారేమో, కళ్ళు చింత నిప్పుల్లా ఎర్రగా మండిపోతున్నాయి ఇద్దరికీ.

కుర్చీని బల్లకి ఇంకాస్త దగ్గరికి జరిపి కూర్చుని తల ముందుకి పెట్టి..రహస్యం చెబుతున్నట్టుగా చెప్పాడు సుధాకర్. "రేపు ఉదయం పది గంటలకు బ్యాంకు తెరుస్తారు. తెరిచే సమయానికే మనం అక్కడ ఉండగలిగితే ఎక్కువ మంది ఉండరు. బ్యాంకు లో పని చేసే వారు కూడా అందరూ అప్పటికి వచ్చి ఉండరు. మన పని ఈజీ అయిపోతుంది. నేను చేతిలో పిస్టోల్ పట్టుకుంటాను. అక్కడి వాళ్ళను బెదిరిస్తాను. నీవు బ్యాంకులో డబ్బంతా బ్యాగులోకి వేసేసుకో. బయట రాకేష్ గాడు కార్ లో రెడీ గా ఉంటాడు. వెంటనే మనం పారిపోవాలి. అంతా క్షణాల్లో జరిగి పోవాలి.

ఊ..ఊ...అన్నట్టుగా తలూపాడు సుధీర్. "ఈ రాకేష్ గాడు మనకి అవసరమా..? డబ్బును మనమిద్దరమే పంచుకుందాం.  వాడికెందుకీయాలి?".

"అరే మామా..నీకు అర్థం అయితలే. మన దగ్గర కారు లేదు. వాడి దగ్గర ఉంది. వాడికి కిరాయిలకి తిప్పుకునే పాత మారుతీ డిజిల్ బండి ఉంది కదా...దాంట్లో ఒస్తాడ్ రా భయ్. మనం డబ్బు బ్యాగ్ ని మోస్తూ పారిపోవాలంటే కష్టం. వాడు ఎలాగూ డ్రైవర్. సిటీల ఫాస్ట్ గా తప్పించుకుని పారిపోవాలన్నా వాడు ఉండాలె. వాడు సిటీ ఔట్స్కర్ట్ ల మనల్ని దింపుతడు. మనం ఆడ్నించి జంప్ అంతే. ఇంకో విషయం..." అని కుర్చీని ఇంకాస్త దగ్గరగా జరుపుకుని,  ఇంకా మెల్లిగా చెవిలో చెబుతున్నట్టు చెప్ప సాగాడు. "వాడికి మనం కొట్టేసిన డబ్బుని పంచం. వాడికి ఒక యాభై వేలు ఇస్తే చాలన్నడు. అంతకు మించి వాడు అడగడు. వాడిని అంతకే ఒప్పించిన కదా. వాడి విషయం మరచి పో" .

బార్ లో ఒక్కొక్క లైటూ తీసేస్తున్నారు. రాత్రి పదకొండు అవుతోంది. ఇంక బార్ మూసే సమయం. దాదాపు బార్ అంతా ఖాళీ అయిపోయింది. కానీ వీళ్ళిద్దరూ గుసగుసగా తమ బ్యాంక్ రాబరీ గురించి ప్లాన్స్ వేసుకుంటూనే ఉన్నారు. "అది సరే..పిస్టోల్ సంగతేంటి?. మీ జాన్ జిగ్రీ జిన్నాగాడు తెస్తాడా?"  అడిగాడు సుధీర్.

" ఉష్షు ఉష్షు..!!. మెల్లగా బే...పిస్టోల్ గురించి ఎవడన్నా ఇన్నడంటే బొక్కలో తోస్తారు మనల్ని, నీ యబ్బ."  హడావుడిగా తిడుతున్నట్టుగా చెప్పాడు. చుట్టూ కలియ జూసి..."అదంతా నేను చూసుకుంటారా భయ్. జిన్నా గాడు రేపటికల్లా మనకి తెచ్చిస్తాడు పిస్టల్".

బార్ లో స్టాఫ్ ఇంక మీరు బయలుదేరితే మూసేసుకుంటాం అన్నట్టు చూశారు. ఇద్దరూ లేచి బయలు దేరారు.  పక్క సందులో ఉన్న సుధాకర్ ఇంటి వైపు నడుస్తున్నారు. "చూడు మామా ఇది పక్కా ప్లాన్. చాలా ఆలోచించి చేసినా. మనిద్దరమూ సెటిల్ ఐపోతాం. జిందగీల ఇదే ఫస్ట్ ఇదే లాస్ట్ దొంగతనం..నీవు నేనూ చిన్నప్పటి నుంచీ జిగ్రీలం. అవునాకాదా. నీకయినా మీ అమ్మ లేదు. నాయిన తో ఏగలేక పోతున్నవ్. ఎంతకాలం ఆడ ఈడ పన్జేస్తం చెప్పు. ఇదొక్కటే సారి. ఖతం. జిందగీ భర్..ఫుల్ బిందాస్. ఏమంటవ్?". కన్విన్సింగ్ గా చెప్పాడు. ఏమంటవ్ అని అడిగిన ప్రశ్న సమాధానం కోసం అడిగింది కాదు. ఆ ప్రశ్న కి సుధీర్ నుంచి సమాధానం కూడా ఆశించటం లేదు సుధాకర్. ఎందుకంటే  ఇదంతా పక్కాగా జరిగిపోతుందనే నమ్ముతున్నాడు సుధాకర్. గత కొద్ది రోజులుగా వీరి మధ్య, వీరు కలిసినప్పుడల్లా దాదాపు ఇదే చర్చ. బ్యాంక్ దోపిడీ చేయటం. ప్లాన్ సుధాకర్ ది. హెల్పర్ సుధీర్. వచ్చన డబ్బులో ఇద్దరిదీ సగం సగం...ఆ తరువాత దుబాయ్ కి పరార్ కావటం. జిందగీ ఎంజాయ్ చేయటం. సందర్భాలు వేరు వేరయినా ఈ ఇద్దరూ ఇవే మాటలే మార్చి మార్చి మాట్లాడుకుంటుంటారు. ఈ రోజు స్పెషాలిటీ ఏమంటే...వాల్లు పెట్టుకున్న ముహూర్తం ఇక రేపే. ఉదయం పది గంటలకి.

సుధాకర్ ఒంటరి వాడు. అనాథ. చదువు బొటాబొటి. ఉద్యోగం అంటే చిన్నా చితకా పనులు చేయటం. సుధీర్ దీ దాదాపు అదే పరిస్థితి. కాక పోతే పెళ్ళి చేసుకోమని సతాయించే ముసలి రోగిష్టి నాన్న. అందుకే దాదాపు ఎపుడూ సుధాకర్ ఉండే రూమ్ లో ఉంటాడు. నిజానికి వారిద్దరినీ గురించి ఇంతకు మించిన పరిచయం మనకు అనవసరం. అవసరం అనుకున్నా అంతగా పరిచయం చేయటానికి కూడా ఏమీ లేదు. కాకపోతే చిన్నప్పటి నుంచీ స్నేహితులు. ప్రాణ స్నేహితులని చెప్పలేం. కాకపోతే ప్రాణం ఉండేంత వరకూ స్నేహితులే. ఇద్దరిలో ఉండే కామన్ లక్షణం ఏమంటే ఏ ఉద్యోగాన్నీ ఎక్కువ కాలం చేయలేక పోవటం. ఏదో గొడవ పెట్టుకుని బయటకు రావటం, మళ్ళీ కొత్త పని కోసం వేట. ఏ  ఎదుగూ బొదుగూ లేని ఎగుడు దిగుడు జీవితాల్ని వారు విసుక్కోకుండా ఇంత వరకూ లాక్కు రావటం నిజంగా గొప్పే..కానీ దానికీ ఓ లిమిట్ ఉంటుంది కదా. అందుకే ఆ లిమిట్ కి చేరిన విసుగుదల యొక్క పరాకాష్టే ఇప్పటి బ్యాంకు దోపిడీ ఆలోచన.

రాత్రంతా మళ్ళీ మళ్ళీ చర్చిస్తూనే ఉన్నారు. గదిలో ఎవరూ లేకున్నా గుస గుసలు ఇద్దరి మధ్యనా నడుస్తూనే ఉన్నాయి. అయితే ఇపుడు చర్చ విళ్ళిద్దరూ నిద్ర పోవాలా వద్దా అనేదానిమీద.  నిద్ర పోయి లేస్తే ఫ్రెష్ గా దోపిడీ చెయ్యొచ్చంటాడు సుధీర్. నిద్రపోతే ఇద్దరమూ ఏ మధ్యాహ్నం పన్నెండింటికో లేస్తాము ఒద్దంటాడు సుధాకర్. అప్పటిదాకా ఏం చేద్దామని సుధీర్ ప్రశ్న. ఇలాగే మన ప్లాన్ గురించి చర్చించుకుందాం అని సుధాకర్ సమాధానం. కానీ ఫుల్ గా తిని, ఫుల్ గా తాగాక నిద్ర రాకుండా ఉండదు కదా. సుధీర్ నోరంతా తెరిచి ఆవులిస్తున్నపుడు సుధాకర్ అంటాడు. "నీవు కాసేపు పడుకోరా భయ్. నేను లేపుతా" అని. "మరి నీవూ నిద్ర పోతే?. కష్టం కదా. అలారం పెట్టుకుని పడుకుందాం రా భయ్. ఇద్దరం పొద్దున ఏడు కల్లా లేద్దాం". అంటాడు సుధీర్. "అలారం నిద్ర లేపుతుందంటే నమ్ముతావ్ గానీ, నేను లేపుతానంటే నమ్మ వేందిరా ...ఒక వేళ అలారం మోగకపోతే..!?". సంశయమో సందేహమో సుధాకర్ కి. ఏమయితేనేం అలారమయితే పెట్టారు గానీ నిద్ర పడితేనే కదా...మరలా చర్చలోకి.

ఇంతలో తలుపు తట్టారెవరో. చూస్తే జిన్నా. జిన్నా అసలు పేరు చిన్నా. కానీ పాతబస్తీలో ఒకటీ రెండు మర్డర్ కేసుల్లో ఉన్నాడు. పోలీస్ స్టేషన్ లో పేరు రాసేప్పుడు జిన్నా అని రాశారని చెప్పుకుంటాడు. అది కూడా ఎవరయినా ఈ పేరేంటని అడిగితేనే చెబుతాడు. చిన్నా పేరు ఉన్నప్పటికంటే జిన్నా పేరు ఒచ్చాక తనని చూసి భయపడే వారు ఎక్కువయ్యారని చెప్పుకుంటాడు. జిన్నా నిజంగా మర్డర్ చేసి ఉంటాడని అతన్ని చూస్తే నమ్మలేం. చేసినట్టు ఒప్పుకుని ఉండింటాడనేంత పొట్టిగా పీలగా ఉంటాడు. పొట్టిగా పీలగా ఉన్న వ్యక్తిని భయపెట్టి ఒప్పించటం తేలిక కదా. కానీ సుధాకర్ నమ్మాడు. అందుకే తను జిన్నా మనిషినని అవసరం ఉన్న చోట చెప్పుకుంటాడు. లోకం కూడా నమ్మినట్టే వుంది. జిన్నా పేరు చెబితే మారు మాట్లాడకుండా పని చేసి పెట్టేవారు తయారయ్యారు.  అయితే బ్యాంక్ దోపిడీ ప్లాన్ సుధాకర్ వేసుకున్నాక ఒకసారి జిన్నాను కలిసాడు. తను ఒక వ్యక్తికి ధంఖీ ఇవ్వాలి, అందుకు ఒక రోజుకి పిస్టోల్ ఇవ్వమని అడిగాడు. కావాలంటే దానికి తగ్గ అద్దెని ఇస్తా అని చెప్పి, ఒక రోజుకి ఇరవై ఐదు వేలని చెప్పి ఒప్పించాడు. జైలు ఊచలు లెక్క పెట్టడం అలవోకగా నేర్చుకున్న జిన్నా, సుధాకర్ మాటల్ని అంత ఈజీగా నమ్మేస్తాడనుకోలేం. అదిగో అందుకే ఇపుడిక్కడ సుధాకర్ రూమ్ లో ప్రత్యక్షం. సుధీర్ కి జిన్నా నచ్చడు. ఏం దందాలు చేసినా మర్డర్ చేసేటోల్లకి దూరం ఉండాలనుకుంటాడు. అందుకే ఎపుడూ పెద్దగా మాట్లాడిందీ లేదు. మిత్రుడికి మిత్రుడు కాబట్టి పలకరించటం. అంతే.

"ఇదిగో భయ్ నీవడిగిన తుపాకీ..మస్త్ మాల్. చెప్పు ఎవర్ని ధంఖి ఇవ్వాలె? ఎపుడివ్వాలె?. వాడి పేరేంది ఊరేంది అడ్రస్ ఏంది అని ఆరాలు తీయటం మొదలెట్టాడు జిన్నా. ఇలా జరుగుతుందని సుధాకర్ ఊహించలేదు. జిన్నా ఎవరితోటయినా పిస్టోల్ ని పంపిస్తాడనుకున్నాడు. కానీ జిన్నానే సీన్ లోకి ఒస్తాడని ఊహించలేదు. అబద్దం చెబితే, అది కనుక అబద్దం అని తెలిస్తే, జిన్నా ఇంకో మర్డర్కయానా వెనుకాడడు. కాబట్టి తప్పని సరి పరిస్థితుల్లో జిన్నాకు అసలు విషయం వివరంగా చెప్పేశాడు. జిన్నా సావధానం గా విని, పెదవి విరిచాడు. ఈ ప్లాన్ వర్కవుట్ కాదన్నాడు. "అరే..బ్యాంక్ దోపిడీ అంటే పిల్లలాటనుకున్నావ్. డేంజర్. సీ సీ కెమెరాలుంటయ్...సెక్యూరిటీ కూడా ఉంటుంది. పాగల్ గానివా?. దిమాఖ్ గిట్టా ఖరాబ్ అయిందా?. చాలా ఎక్స్పీరియన్స్ ఉండే దొంగలకే భయం ఐతుంటది. ఏదీ ఈ పిస్టల్ ఎలా పట్టుకుంటవో చూపీయ్యి.
చూసినవా నీకీ పిస్టోల్ పట్కోటందుకే వస్తలేదు, సడన్ గా అక్కడెవరైనా తుపాకీ తో ఒస్తే ఎట్లా కాలుస్తవ్. నీవు వేశాలేసే లోపల వాడే నిన్ను కాల్చి దొబ్బుతడు. ఏమనుకుంటున్నవ్ జోకా?".

మొదటిసారి సుధీర్ ముందర ఇజ్జత్ తీసేసినందుకు సుధాకర్ ఖంగారు పడ్డాడు. ఇంతకాలం తనే ప్లాన్ ని గీసి ముందుకు నడిపిస్తున్నట్టూ, తమ ఇద్దరికీ గొప్ప మేలును కలిగిస్తున్నట్టూ లోలోపల తృప్తి పడిపోయే సుధాకర్ కి ఇది అవమానంగా తోచింది. ఎలాగయినా తను వేసిన ప్లాన్ ని నడిపించాలి అనుకున్నాడు. సుధీర్ కూడా మొదటి సారి సుధాకర్ మీద నమ్మకం లేనట్టు చూశాడు. పిస్టోల్ ని ఎలా పట్టుకోవాలో...ఎలా బెదిరించాలో రిహార్సల్ లాగా చేసి చూపించాడు జిన్నా...కానీ జిన్నా అంత పకడ్బందీగా తీవ్రం గా సుధాకర్ రిహార్సల్స్ లో బెదిరించలేక పోతున్నాడు. అప్పటిదాకా జిన్నాని తిట్టుకున్న సుధీర్, హమ్మయ్య జిన్నా రావటమే మంచిదయింది అనుకున్నాడు. "ఇపుడిలా యాక్షన్ చేయమంటే చేయలేను, కానీ అక్కడ సీన్ లో ఆటోమేటిక్ గా బాగా చేస్తాను" అని నమ్మకాన్ని కలిగించేలా చెప్ప ప్రయత్నించాడు సుధాకర్. కానీ లాభం లేకపోయింది. "ఇదేమైనా సిన్మానారా భయ్. నటించేటోడికి ఏ ఎక్స్పీరియన్సూ అవసరం లేదు. కానీ ఇది జిందగీర భయ్. అనుభవం ఉండాలె. అయినా నీకు ఈ పనికైతే నేను పిస్టల్ ఇయ్యను. పొరపాటున నీవు దొరికావంటే...పిస్టల్ నాది కాబట్టి నా జిందగీ కూడా బర్బాత్ ఐపోతది..." అని ఆల్మోష్ట్ అబద్దాలన్నిటినీ వరుస పెట్టి ఒదిరాడు జిన్నా. ముగ్గురూ ఆలోచించి ఆలోచించి చివరికొక నిర్ణయానికొచ్చేశారు. అది ఏమంటే...జిన్నాయే బ్యాంకులో బెదిరిస్తాడు. సుధాకర్ అండ్ సుధీర్ మిత్రులు డబ్బుని సంచిలోకి ఎత్తాలి అని. సీసీ కెమెరాల్ని సైతం జిన్నా పిస్టోల్ తో కాల్చి, ఆధారాలు లేకుండా చేస్తాడు. అయితే డబ్బును ఇంతకు ముందులాగా ఇద్దరు కాకుండా ముగ్గురు పంచుకుంటారు.

మరలా ప్లాన్ కి సంబంధించిన చర్చలు మొదలయ్యాయి. సరే..డబ్బు కాస్త తగ్గినా..తన ప్లాన్ వర్కవుట్ అవుతున్నందుకు సుధాకర్ సంతోషంగానే ఉన్నాడు. జిన్నా రాకుంటే ఎంత దారుణం జరిగేది. అనవసరంగా పోలీసులకి చిక్కి జైలు కూడు తినాల్సి ఒచ్చేది. జిన్నా రావటమే మంచిదయిందని సుధీర్ లోలోపల ఆనందపడ్డాడు. సుధాకర్ తన చిరకాల మిత్రుడయినా, నిజానికి ఇలాంటివి ఇంతకు ముందు చేసి ఎరుగడు. అనవసరంగా వాడు చెప్పింది వినుంటే...? ఓ మై గాడ్..సుధీర్ కి బౌద్ద వృక్షం కింద జ్ఞానోదయం అయినట్టుగా అనిపించింది. అప్పటికే సమయం ఉదయం ఐదయింది.

తొమ్మిది గంటలకల్లా బ్యాంకు దగ్గరికే డైరెక్ట్ గా కార్ తీసుకుని ఒచ్చేస్తా అని చెప్పిన రాకేశ్ ఐదు గంటలకే సుధాకర్ ఇంటికి ఒచ్చేశాడు. నాకు కూడా నిద్ర పడ్తలేదురా భయ్. బ్యాంకు దోపిడీ చేసేటోల్లు మీరు హాయిగా ఉన్నరు, కార్ నడిపేటోన్ని నాకు మాత్రం నిద్ర పడ్తలేదు. పైపైనే నిద్ర. కలలో కూడా మనం డబ్బుల్దీసుకుని పారిపోతున్నట్టే ఒస్తుంది. ఈ టెన్షన్ ఎందుకనీ ఈడికే వొచ్చినా అని లోపలికి వస్తూ వస్తూ లొడ లొడా చెప్పేశాడు. రాకేష్ ఎవరో సుధీర్ కి, జిన్నాకి తెలియదు. కానీ సుధీర్ కి మాత్రం రాకేష్ కూడా డబ్బులో వాటా కోసమే ఒచ్చి ఉంటాడు అనుకున్నాడు. లేకపోతే యాభైవేలిస్తా అంటే ఎందుకు ఒప్పుకుంటాడు. అందరూ ఒకరికొకరు పరిచయం చేసుకున్నారు. మారిన తమ ప్లాన్ ని రాకేష్ కి వివరించారు. అంతా శ్రద్ధగా విన్నాడు రాకేష్.

ఈ ప్లాన్ వర్కవుట్ కాదన్నాడు రాకేష్. అందరూ ప్రశ్నార్థకాల్లా మారిపోయారు. "చూడండి...ఆలోచించండి. మీరు మొత్తం ప్లాన్ చెప్పాక, మీరు పప్పులో కాలేశారనిపిస్తుంది. ఎందుకంటే..ఉదయం పది గంటలకి బ్యాంకు తెరుస్తారు. జనాలు ఎక్కువగా ఉండరని మీరనుకుంటున్నారు. కానీ రేపు శని వారం. మధ్యాహ్నం ఒంటిగంట వరకే బ్యాంకు. కాబట్టి ఉదయం పది గంటల నించే జనాలు తమ బ్యాంకు పనులకి క్యూ కట్టి ఉంటారు. రెండవది, బ్యాంకులో పని చేసేవారు పది గంటలకే టంచనుగా ఒచ్చేస్తారని చెప్పలేం. దానికి కారణం కూడా శని వారమే. కాస్త లేట్ ఒస్తే రెండు మూడు గంటలు పని చేస్తే ఈ రోజు పని ఐపోతుంది కాబట్టి, పని ఎగ్గొట్టడానికైనా లేట్ గనే ఒస్తారు. మూడవది, బ్యాంకు వాల్లు లేట్ గా రావటం, జనాలు ఎక్కువగా ఉండటం వల్ల రేపు సెక్యూరిటీని టైట్ చేస్తారు. ఒకడు బయట,ఒకడు లోపల కంపల్సరీ జనాల్ని అదుపు చేయడానికి నిలబడి ఉంటారు. అంటే కొద్దిగా కష్టమే. ఇక నాలుగవది, బ్యాంకుకు లేటుగా రావాలనుకోవటం వల్ల, అందరూ ఒకే సమయం కి రారు. ఒకరిద్దరు ఎంప్లాయిస్ ఒచ్చినా మిగతా వారు బయటే ఉంటారు. కాబట్టి లోపలున్న వారు ఎవరైనా ఇంకా బ్యాంకుకి రాని ఉద్యోగులకి వి ఆర్ ఇన్ డేంజర్ అని మెసేజ్ ఇవ్వ గలిగగితే, బయట ఉన్న వారు పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తారు. కాబట్టి మనకి కష్టం. సరే అది కూడా మనం లోపలున్న వారందరి సెల్ఫోన్లనూ ఒక బ్యాగ్లో వేయమని బెదిరించగలిగినా..,మనం ఫెయిలవుతాం. ఎందుకంటే..బ్యాంకులో మనం తీసుకోబోయే డబ్బు క్యాషియర్ దగ్గర ఉండేది మాత్రమే. క్యాషియర్ కనుక ఇంకా బ్యాంకుకి రాకుండింటే మనం దోచుకోవటానికి ఏమీ ఉండదు. ఒక వేల క్యాషియర్ లోపలికి ఒచ్చేసి తన సీట్ లో కూర్చుని ఉన్నా, మనం దోపిడీ చేసేది ఉదయం బ్యాంకు మొదలవగానే కాబట్టి, క్యాషియర్ దగ్గర అప్పటికీ అంతగా డబ్బు జమ అయ్యుండదు. కాబట్టి మన దోపిడీ మనకు పెద్దగా ఇచ్చే డబ్బేమీ ఉండదు. అంటూ చెప్పుకుంటూ పోయాడు.

మొదట్లో..సుధీర్ గమనించాడు. బ్యాంకు దోపిడీ చేసేది 'మీరు' అని అనకుండా 'మనం' అని రాకేష్ అంటూ తనని కూడా కలుపుకు పోవటం.. కానీ రాకేష్ చెప్పిన పాయింట్స్ వింటూ పోతుండగా 'మనం' అంటున్నా పెద్దగా పట్టించుకోలేదు. మిగతా వారైనా అంతే. సుధాకరైతే అసలు రాకేష్ ని యాభై వేలకే ఒప్పించాననే విషయమే మరచి పోయాడు. ఆటోమేటిక్ గా డబ్బును నలుగురమూ పంచుకుందాం అనుకున్నారు. రాకేష్ ఇచ్చిన జ్ఞాన బోధ వల్ల ఉదయం పది గంటలకి కాకుండా మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతం లో బ్యాంక్ లోపలికి చొరబడాలని సంకల్పించారు. ఎవరెవరి రోల్స్ ఏంటో మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకున్నారు. రిహార్సల్స్ చేశారు. చర్చలు జరిపారు. అంతా ఒక ఆలోచనకి ఒచ్చినందుకు సంతోష పడ్డారు.

తాము నలుగురూ కలిసి ఎంత గొప్పటి ఆలోచన చేశారో నెమరు వేసుకోవటం మొదలెట్టారు?. మొదట ఈ బ్యాంకు దోపిడీ ఆలోచన వచ్చింది సుధాకర్ కి. బ్యాంకు లో కూడా సుధాకర్ కీలకంగా క్యాషియర్ డ్రావర్ నుంచి డబ్బును సంచిలోకి వేస్తాడు. ఇక, పిస్టల్ ని ఒడుపుగా తిప్పుతూ అందర్నీ భయపెడుతూ, సీసి కెమెరాలని కూడా పిస్టల్ తో కాల్చి, మరో కీలక పాత్రని జిన్నా పోషించబోతున్నాడు. అసలు బ్యాంకు టైమింగ్స్ గూర్చి పూర్తి అవగాహన ఇవ్వటమే కాక బయట కార్ లో రెడీగా ఉండి వేగంగా సిటీ దాటించే మరో కీలకమైన పని రాజేష్ ది. బ్యాంకులో డబ్బు సంచిలోకి సుధాకర్ డబ్బును వేస్తుంటే ఆ సంచిని పట్టుకునే బాధ్యత సుధీర్ ది. ఇదంత కీలకం కాదే...అనుకున్నాడు సుధాకర్. అనేశారు, జిన్నా అండ్ రాకేష్. చిన్న పాత్ర పోషించే సుధీర్ కి వాటా ఇవ్వటం అవసరమా...?

బూమెరాంగ్ లా తిరిగి తిరిగి తన మీదికే  ఒస్తుందని అనుకోలేదు సుధీర్. కానీ ఇదంతా సుధాకర్  పన్నినపక్కా ప్రీ ప్లాన్ అనుకున్నాడు. అనేశాడు కూడా. "నన్ను తప్పించటానికే నీవీ ప్లాన్ వేశావురా...లేకపోతే ఇన్నాల్లు గా కలిసున్నాము నీవు నాకు వాటా ఇవ్వటం ఏంటి. లేకుంటే ఈ ఎర్ర గుడ్లోడు, ఈ పులి గుడ్లోడు ఈ అర్ధ రాత్రి రావటం ఏంటి , ఒక పథకం ప్రకారం మాట్లాడుతూ  నన్ను మెల మెల్లగా పక్కకు జరిపటం ఏంటి?. లాస్ట్ కి నన్ను ప్లాన్ నుంచి తప్పించాలని చూస్తార్రా...? నన్ను వెర్రి పప్పను చెస్తార్రా....చూస్తాను బ్యాంకు దోపిడీ ఎలా చేస్తారో నేనూ చూస్తాను. మాటా మాటా పెరిగింది. బాహా బాహీ తల పడ్డారు. బలవంతుడయిన సుధీర్ ముగ్గుర్నీ ఎత్తి కింద పడేశాడు. ముగ్గురికీ అర్థం ఐపోయింది, ఏదో ఒకటి చేయక పోతే సుధీర్ చేతిలో మెత్తగా తన్నులు తినటం ఖాయం అని. ఉదయం ఆరు గంటల ప్రాంతంలో పైన పెంట్ హవుజ్ నుంచి వినపడే గట్టి గట్టి అరుపులు విని అపుడే నిద్ర లేచిన సుధాకర్ రూం ఓనరు అప్రమత్తమవుతూ  ఉండగా...సుధీర్ ని నిలువరించటం కోసం జిన్నా గాలిలోకి పిస్టల్ ని కాల్చాడు. ధన్ మని.


కట్ చేస్తే.....
నలుగురూ జైలులో ఒకే గదిలో ఉన్నారు. ఒకరితో ఒకరు మాట్లాడకుండా కూర్చుని ఉన్నారు. సుధాకర్ అనుకున్నాడు. "ఒరేయ్ సుధీరు మామా..! నీ పాత్ర నిడివిని పెంచుదామనుకున్నానే కానీ, నీకు పాత్ర ఇవ్వకూడదని అనుకుంటానారా...?. ప్రాణ మిత్రుడివి ఎంత పని చేశావురా సుధీరూ..!!"

6/9/15

Friday, 4 September 2015

విరించి  ll అక్షరాలూ కవితలూ ll
....................................
అక్షరాల ఉరుసులో
ఏ పేరూ ఊరు లేని ఓ ఒంటరి భావం
పసి పిల్లవానిలా తప్పిపోతే ఏమి?.
ఎక్కడో చోట బతికి ఉంటే చాలు
ఏదో ఓ రోజు కవితలా తిరిగి వస్తుందనే నమ్మకం
కాసింత బలంగా ఉంటే చాలు.

మంచి కవితని రాయగలగటం
ఒక కలే అయితే...
తెల్లవారు ఝామునే కళ్ళు గట్టిగా మూసుకుని
నిద్రను నటిస్తూ అయినా
ఆ కలే మళ్ళీ మళ్ళీ కంటాను.

ఒక ఎకరా పొలమంత జ్ఞాపకాల్లోకి
అక్షరాల్ని విత్తులుగా చల్లినంత మాత్రాన
పండ్లూ కాయల్లాగా కవితలు కోతకు
వచ్చేస్తాయని అనుకోలేం..

ఒక ఎండిన బావంత అనుభవంలోంచి
మనసుని పొరలు పొరలుగా పూడిక తీయాలి.

ఈ ఇరుకైన కాగితంలోకి
వేళ కాని వేళ లో
నన్ను నేను తరుముకుంటూ రాసుకుంటున్న
ఈ దీర్ఘ కవిత,
జీవిత మిచ్చే అద్భుతమైన లెక్చర్ కి
రన్నింగ్ నోట్స్ తీసుకుంటున్నట్టుగానే ఉంటుంది.

ఎంత వేగంగా రాసినా
ఎంత గజిబిజిగా రాసినా
చేయి జారి కాగితం మీదికి పడిపోయిన అక్షరం
తను ఉన్నది ఉన్నట్టుగానే ప్రకటించుకుంటుంది.
అందుకేనేమో..
తెలిసీ  తెలియనితనంలో
రాసుకున్న కవితల్లోకి తొంగి చూసుకున్నపుడు
అక్షరాలకి నూనూగు మీసాలు కనిపిస్తుంటాయి.

మనుషుల్లాగే అక్షరాలూనూ..!
గుంపులుగా ఒక చోట చేరాయంటే
నిశ్శబ్దంగా ఉండనే లేవు.

కవితంటే..
నాకు తెలియకుండా
నాలో దాక్కున్న నేనే.

4/9/15

Tuesday, 1 September 2015

విరించి ll గమనం ll
.....................................
అడుగు అడుగుకీ శిలగా మారిపోతూ
నీ ముందుకొచ్చి నిరుత్తరుడనయ్యే సరికి
పద్దతిగా చేతులు కట్టుకుని నిలుచోవటంలోనే
నీవెంతటి అసహనాన్ని ప్రదర్శిస్తావో...

అపుడిక మన మధ్య కొన్ని క్షణాలే,
దాదాపు చివరిగా, మిగిలుంటాయి.

భావైక్యం లేని ఇద్దరు మనుష్యులం
ఎదురెదురుగా నిలబడి వుంటాం..

నీ కళ్ళు నా హద్దుల్ని నిర్ణయిస్తుంటాయి
నీ చిరునవ్వొక తిరస్కారాన్ని తెలుపుతూ ఉంటుంది.

ఎంతటి వసంతమైనా
రెండు నెలలేనని అపుడే తెలుసుకుంటాను.

ఎగిరి గంతేద్దామని దూరం నుంచి చూసే
కమ్యూనిష్టు మిత్రుడు
కళ్ళ లో నీరు తుడుచుకుంటాడు.

ఆ  వసంత కాలపు సాయంత్రాల్లోకి
భుజం మీద భుజం వేసుకుని
రెండు స్నేహితాలు నడచిపోతాయి
జీవితాన్ని కొత్తగా అంగీకరిస్తూ..

1/9/15