విరించి ll బూమెరాంగ్ ll కథ
................................
"ఇదిగో చూడు మామా...ఈ రోజే మన కష్టాలకు లాస్ట్ రోజు కావాలి. రేపు మన ప్లాన్ సక్సెస్ అయిందంటే మనం కాలు మీద కాలేసుకుని దర్జాగా బతకొచ్చు....ఏమంటావ్". బార్ లో గోల గోల గా ఉంది. గట్టిగా మాట్లాడితే గానీ వినబడదు. అయినా సాధారణంగా మాట్లాడే మాటలను కూడా రహస్యంగా చెబుతున్నట్టు చెప్పాడు సుధాకర్.
"ఇంక బస్ కర్ రే అయ్యా...!!ఎన్ని సార్లు చెప్పిందే చెబుతవ్?" విసుక్కున్నాడు సుధీర్. "అది సరే గానీ..డబ్బుతో దుబయ్ కి వెళ్ళి జిందగీ మస్త్ ఎంజాయ్ చెయ్యాలె రా. ముందు మా అయ్య కి దూరంగా ఉండాలె. లేక పోతే దిమాఖ్ ఖరాబ్ చేస్తడు.
-"హాహాహా...డబ్బొస్తే మీ అయ్యకు కూడా నీ మీద ప్రేమ ఒస్తది రో..." బల్ల చరుస్తూ గట్టిగా నవ్వాడు సుధాకర్. "కానీ మామా..ఈ విషయం మనిద్దరి మధ్యే వుండాలి". మళ్ళీ రహస్యం గా చెప్పాడు. బార్ లో బల్ల కి ఎదురెదురుగా కూర్చుని ఉన్నారు. బల్ల మీద ఆవురావురుమని ఆకలితో తిని పక్కకు పడేసిన ప్లేట్లు, ఫుల్ గా తాగినట్లు మందు సీసాలూ కనిపిస్తున్నాయి. మామూలుగా అంతగా తాగిన వారు ఇంత తెలివితో ఉండటం మనం చూడలేం. విపరీతంగా తాగినా ఇద్దరూ చాలా తెలివిడితో జాగ్రత్తగా ఉన్నట్టు కనిపిస్తున్నారు. ఈ రాత్రికి నిదురను కోరుకోని మనుషులు ఎదురెదురుగా కూర్చుని మాట్లాడు కుంటున్నారేమో, కళ్ళు చింత నిప్పుల్లా ఎర్రగా మండిపోతున్నాయి ఇద్దరికీ.
కుర్చీని బల్లకి ఇంకాస్త దగ్గరికి జరిపి కూర్చుని తల ముందుకి పెట్టి..రహస్యం చెబుతున్నట్టుగా చెప్పాడు సుధాకర్. "రేపు ఉదయం పది గంటలకు బ్యాంకు తెరుస్తారు. తెరిచే సమయానికే మనం అక్కడ ఉండగలిగితే ఎక్కువ మంది ఉండరు. బ్యాంకు లో పని చేసే వారు కూడా అందరూ అప్పటికి వచ్చి ఉండరు. మన పని ఈజీ అయిపోతుంది. నేను చేతిలో పిస్టోల్ పట్టుకుంటాను. అక్కడి వాళ్ళను బెదిరిస్తాను. నీవు బ్యాంకులో డబ్బంతా బ్యాగులోకి వేసేసుకో. బయట రాకేష్ గాడు కార్ లో రెడీ గా ఉంటాడు. వెంటనే మనం పారిపోవాలి. అంతా క్షణాల్లో జరిగి పోవాలి.
ఊ..ఊ...అన్నట్టుగా తలూపాడు సుధీర్. "ఈ రాకేష్ గాడు మనకి అవసరమా..? డబ్బును మనమిద్దరమే పంచుకుందాం. వాడికెందుకీయాలి?".
"అరే మామా..నీకు అర్థం అయితలే. మన దగ్గర కారు లేదు. వాడి దగ్గర ఉంది. వాడికి కిరాయిలకి తిప్పుకునే పాత మారుతీ డిజిల్ బండి ఉంది కదా...దాంట్లో ఒస్తాడ్ రా భయ్. మనం డబ్బు బ్యాగ్ ని మోస్తూ పారిపోవాలంటే కష్టం. వాడు ఎలాగూ డ్రైవర్. సిటీల ఫాస్ట్ గా తప్పించుకుని పారిపోవాలన్నా వాడు ఉండాలె. వాడు సిటీ ఔట్స్కర్ట్ ల మనల్ని దింపుతడు. మనం ఆడ్నించి జంప్ అంతే. ఇంకో విషయం..." అని కుర్చీని ఇంకాస్త దగ్గరగా జరుపుకుని, ఇంకా మెల్లిగా చెవిలో చెబుతున్నట్టు చెప్ప సాగాడు. "వాడికి మనం కొట్టేసిన డబ్బుని పంచం. వాడికి ఒక యాభై వేలు ఇస్తే చాలన్నడు. అంతకు మించి వాడు అడగడు. వాడిని అంతకే ఒప్పించిన కదా. వాడి విషయం మరచి పో" .
బార్ లో ఒక్కొక్క లైటూ తీసేస్తున్నారు. రాత్రి పదకొండు అవుతోంది. ఇంక బార్ మూసే సమయం. దాదాపు బార్ అంతా ఖాళీ అయిపోయింది. కానీ వీళ్ళిద్దరూ గుసగుసగా తమ బ్యాంక్ రాబరీ గురించి ప్లాన్స్ వేసుకుంటూనే ఉన్నారు. "అది సరే..పిస్టోల్ సంగతేంటి?. మీ జాన్ జిగ్రీ జిన్నాగాడు తెస్తాడా?" అడిగాడు సుధీర్.
" ఉష్షు ఉష్షు..!!. మెల్లగా బే...పిస్టోల్ గురించి ఎవడన్నా ఇన్నడంటే బొక్కలో తోస్తారు మనల్ని, నీ యబ్బ." హడావుడిగా తిడుతున్నట్టుగా చెప్పాడు. చుట్టూ కలియ జూసి..."అదంతా నేను చూసుకుంటారా భయ్. జిన్నా గాడు రేపటికల్లా మనకి తెచ్చిస్తాడు పిస్టల్".
బార్ లో స్టాఫ్ ఇంక మీరు బయలుదేరితే మూసేసుకుంటాం అన్నట్టు చూశారు. ఇద్దరూ లేచి బయలు దేరారు. పక్క సందులో ఉన్న సుధాకర్ ఇంటి వైపు నడుస్తున్నారు. "చూడు మామా ఇది పక్కా ప్లాన్. చాలా ఆలోచించి చేసినా. మనిద్దరమూ సెటిల్ ఐపోతాం. జిందగీల ఇదే ఫస్ట్ ఇదే లాస్ట్ దొంగతనం..నీవు నేనూ చిన్నప్పటి నుంచీ జిగ్రీలం. అవునాకాదా. నీకయినా మీ అమ్మ లేదు. నాయిన తో ఏగలేక పోతున్నవ్. ఎంతకాలం ఆడ ఈడ పన్జేస్తం చెప్పు. ఇదొక్కటే సారి. ఖతం. జిందగీ భర్..ఫుల్ బిందాస్. ఏమంటవ్?". కన్విన్సింగ్ గా చెప్పాడు. ఏమంటవ్ అని అడిగిన ప్రశ్న సమాధానం కోసం అడిగింది కాదు. ఆ ప్రశ్న కి సుధీర్ నుంచి సమాధానం కూడా ఆశించటం లేదు సుధాకర్. ఎందుకంటే ఇదంతా పక్కాగా జరిగిపోతుందనే నమ్ముతున్నాడు సుధాకర్. గత కొద్ది రోజులుగా వీరి మధ్య, వీరు కలిసినప్పుడల్లా దాదాపు ఇదే చర్చ. బ్యాంక్ దోపిడీ చేయటం. ప్లాన్ సుధాకర్ ది. హెల్పర్ సుధీర్. వచ్చన డబ్బులో ఇద్దరిదీ సగం సగం...ఆ తరువాత దుబాయ్ కి పరార్ కావటం. జిందగీ ఎంజాయ్ చేయటం. సందర్భాలు వేరు వేరయినా ఈ ఇద్దరూ ఇవే మాటలే మార్చి మార్చి మాట్లాడుకుంటుంటారు. ఈ రోజు స్పెషాలిటీ ఏమంటే...వాల్లు పెట్టుకున్న ముహూర్తం ఇక రేపే. ఉదయం పది గంటలకి.
సుధాకర్ ఒంటరి వాడు. అనాథ. చదువు బొటాబొటి. ఉద్యోగం అంటే చిన్నా చితకా పనులు చేయటం. సుధీర్ దీ దాదాపు అదే పరిస్థితి. కాక పోతే పెళ్ళి చేసుకోమని సతాయించే ముసలి రోగిష్టి నాన్న. అందుకే దాదాపు ఎపుడూ సుధాకర్ ఉండే రూమ్ లో ఉంటాడు. నిజానికి వారిద్దరినీ గురించి ఇంతకు మించిన పరిచయం మనకు అనవసరం. అవసరం అనుకున్నా అంతగా పరిచయం చేయటానికి కూడా ఏమీ లేదు. కాకపోతే చిన్నప్పటి నుంచీ స్నేహితులు. ప్రాణ స్నేహితులని చెప్పలేం. కాకపోతే ప్రాణం ఉండేంత వరకూ స్నేహితులే. ఇద్దరిలో ఉండే కామన్ లక్షణం ఏమంటే ఏ ఉద్యోగాన్నీ ఎక్కువ కాలం చేయలేక పోవటం. ఏదో గొడవ పెట్టుకుని బయటకు రావటం, మళ్ళీ కొత్త పని కోసం వేట. ఏ ఎదుగూ బొదుగూ లేని ఎగుడు దిగుడు జీవితాల్ని వారు విసుక్కోకుండా ఇంత వరకూ లాక్కు రావటం నిజంగా గొప్పే..కానీ దానికీ ఓ లిమిట్ ఉంటుంది కదా. అందుకే ఆ లిమిట్ కి చేరిన విసుగుదల యొక్క పరాకాష్టే ఇప్పటి బ్యాంకు దోపిడీ ఆలోచన.
రాత్రంతా మళ్ళీ మళ్ళీ చర్చిస్తూనే ఉన్నారు. గదిలో ఎవరూ లేకున్నా గుస గుసలు ఇద్దరి మధ్యనా నడుస్తూనే ఉన్నాయి. అయితే ఇపుడు చర్చ విళ్ళిద్దరూ నిద్ర పోవాలా వద్దా అనేదానిమీద. నిద్ర పోయి లేస్తే ఫ్రెష్ గా దోపిడీ చెయ్యొచ్చంటాడు సుధీర్. నిద్రపోతే ఇద్దరమూ ఏ మధ్యాహ్నం పన్నెండింటికో లేస్తాము ఒద్దంటాడు సుధాకర్. అప్పటిదాకా ఏం చేద్దామని సుధీర్ ప్రశ్న. ఇలాగే మన ప్లాన్ గురించి చర్చించుకుందాం అని సుధాకర్ సమాధానం. కానీ ఫుల్ గా తిని, ఫుల్ గా తాగాక నిద్ర రాకుండా ఉండదు కదా. సుధీర్ నోరంతా తెరిచి ఆవులిస్తున్నపుడు సుధాకర్ అంటాడు. "నీవు కాసేపు పడుకోరా భయ్. నేను లేపుతా" అని. "మరి నీవూ నిద్ర పోతే?. కష్టం కదా. అలారం పెట్టుకుని పడుకుందాం రా భయ్. ఇద్దరం పొద్దున ఏడు కల్లా లేద్దాం". అంటాడు సుధీర్. "అలారం నిద్ర లేపుతుందంటే నమ్ముతావ్ గానీ, నేను లేపుతానంటే నమ్మ వేందిరా ...ఒక వేళ అలారం మోగకపోతే..!?". సంశయమో సందేహమో సుధాకర్ కి. ఏమయితేనేం అలారమయితే పెట్టారు గానీ నిద్ర పడితేనే కదా...మరలా చర్చలోకి.
ఇంతలో తలుపు తట్టారెవరో. చూస్తే జిన్నా. జిన్నా అసలు పేరు చిన్నా. కానీ పాతబస్తీలో ఒకటీ రెండు మర్డర్ కేసుల్లో ఉన్నాడు. పోలీస్ స్టేషన్ లో పేరు రాసేప్పుడు జిన్నా అని రాశారని చెప్పుకుంటాడు. అది కూడా ఎవరయినా ఈ పేరేంటని అడిగితేనే చెబుతాడు. చిన్నా పేరు ఉన్నప్పటికంటే జిన్నా పేరు ఒచ్చాక తనని చూసి భయపడే వారు ఎక్కువయ్యారని చెప్పుకుంటాడు. జిన్నా నిజంగా మర్డర్ చేసి ఉంటాడని అతన్ని చూస్తే నమ్మలేం. చేసినట్టు ఒప్పుకుని ఉండింటాడనేంత పొట్టిగా పీలగా ఉంటాడు. పొట్టిగా పీలగా ఉన్న వ్యక్తిని భయపెట్టి ఒప్పించటం తేలిక కదా. కానీ సుధాకర్ నమ్మాడు. అందుకే తను జిన్నా మనిషినని అవసరం ఉన్న చోట చెప్పుకుంటాడు. లోకం కూడా నమ్మినట్టే వుంది. జిన్నా పేరు చెబితే మారు మాట్లాడకుండా పని చేసి పెట్టేవారు తయారయ్యారు. అయితే బ్యాంక్ దోపిడీ ప్లాన్ సుధాకర్ వేసుకున్నాక ఒకసారి జిన్నాను కలిసాడు. తను ఒక వ్యక్తికి ధంఖీ ఇవ్వాలి, అందుకు ఒక రోజుకి పిస్టోల్ ఇవ్వమని అడిగాడు. కావాలంటే దానికి తగ్గ అద్దెని ఇస్తా అని చెప్పి, ఒక రోజుకి ఇరవై ఐదు వేలని చెప్పి ఒప్పించాడు. జైలు ఊచలు లెక్క పెట్టడం అలవోకగా నేర్చుకున్న జిన్నా, సుధాకర్ మాటల్ని అంత ఈజీగా నమ్మేస్తాడనుకోలేం. అదిగో అందుకే ఇపుడిక్కడ సుధాకర్ రూమ్ లో ప్రత్యక్షం. సుధీర్ కి జిన్నా నచ్చడు. ఏం దందాలు చేసినా మర్డర్ చేసేటోల్లకి దూరం ఉండాలనుకుంటాడు. అందుకే ఎపుడూ పెద్దగా మాట్లాడిందీ లేదు. మిత్రుడికి మిత్రుడు కాబట్టి పలకరించటం. అంతే.
"ఇదిగో భయ్ నీవడిగిన తుపాకీ..మస్త్ మాల్. చెప్పు ఎవర్ని ధంఖి ఇవ్వాలె? ఎపుడివ్వాలె?. వాడి పేరేంది ఊరేంది అడ్రస్ ఏంది అని ఆరాలు తీయటం మొదలెట్టాడు జిన్నా. ఇలా జరుగుతుందని సుధాకర్ ఊహించలేదు. జిన్నా ఎవరితోటయినా పిస్టోల్ ని పంపిస్తాడనుకున్నాడు. కానీ జిన్నానే సీన్ లోకి ఒస్తాడని ఊహించలేదు. అబద్దం చెబితే, అది కనుక అబద్దం అని తెలిస్తే, జిన్నా ఇంకో మర్డర్కయానా వెనుకాడడు. కాబట్టి తప్పని సరి పరిస్థితుల్లో జిన్నాకు అసలు విషయం వివరంగా చెప్పేశాడు. జిన్నా సావధానం గా విని, పెదవి విరిచాడు. ఈ ప్లాన్ వర్కవుట్ కాదన్నాడు. "అరే..బ్యాంక్ దోపిడీ అంటే పిల్లలాటనుకున్నావ్. డేంజర్. సీ సీ కెమెరాలుంటయ్...సెక్యూరిటీ కూడా ఉంటుంది. పాగల్ గానివా?. దిమాఖ్ గిట్టా ఖరాబ్ అయిందా?. చాలా ఎక్స్పీరియన్స్ ఉండే దొంగలకే భయం ఐతుంటది. ఏదీ ఈ పిస్టల్ ఎలా పట్టుకుంటవో చూపీయ్యి.
చూసినవా నీకీ పిస్టోల్ పట్కోటందుకే వస్తలేదు, సడన్ గా అక్కడెవరైనా తుపాకీ తో ఒస్తే ఎట్లా కాలుస్తవ్. నీవు వేశాలేసే లోపల వాడే నిన్ను కాల్చి దొబ్బుతడు. ఏమనుకుంటున్నవ్ జోకా?".
మొదటిసారి సుధీర్ ముందర ఇజ్జత్ తీసేసినందుకు సుధాకర్ ఖంగారు పడ్డాడు. ఇంతకాలం తనే ప్లాన్ ని గీసి ముందుకు నడిపిస్తున్నట్టూ, తమ ఇద్దరికీ గొప్ప మేలును కలిగిస్తున్నట్టూ లోలోపల తృప్తి పడిపోయే సుధాకర్ కి ఇది అవమానంగా తోచింది. ఎలాగయినా తను వేసిన ప్లాన్ ని నడిపించాలి అనుకున్నాడు. సుధీర్ కూడా మొదటి సారి సుధాకర్ మీద నమ్మకం లేనట్టు చూశాడు. పిస్టోల్ ని ఎలా పట్టుకోవాలో...ఎలా బెదిరించాలో రిహార్సల్ లాగా చేసి చూపించాడు జిన్నా...కానీ జిన్నా అంత పకడ్బందీగా తీవ్రం గా సుధాకర్ రిహార్సల్స్ లో బెదిరించలేక పోతున్నాడు. అప్పటిదాకా జిన్నాని తిట్టుకున్న సుధీర్, హమ్మయ్య జిన్నా రావటమే మంచిదయింది అనుకున్నాడు. "ఇపుడిలా యాక్షన్ చేయమంటే చేయలేను, కానీ అక్కడ సీన్ లో ఆటోమేటిక్ గా బాగా చేస్తాను" అని నమ్మకాన్ని కలిగించేలా చెప్ప ప్రయత్నించాడు సుధాకర్. కానీ లాభం లేకపోయింది. "ఇదేమైనా సిన్మానారా భయ్. నటించేటోడికి ఏ ఎక్స్పీరియన్సూ అవసరం లేదు. కానీ ఇది జిందగీర భయ్. అనుభవం ఉండాలె. అయినా నీకు ఈ పనికైతే నేను పిస్టల్ ఇయ్యను. పొరపాటున నీవు దొరికావంటే...పిస్టల్ నాది కాబట్టి నా జిందగీ కూడా బర్బాత్ ఐపోతది..." అని ఆల్మోష్ట్ అబద్దాలన్నిటినీ వరుస పెట్టి ఒదిరాడు జిన్నా. ముగ్గురూ ఆలోచించి ఆలోచించి చివరికొక నిర్ణయానికొచ్చేశారు. అది ఏమంటే...జిన్నాయే బ్యాంకులో బెదిరిస్తాడు. సుధాకర్ అండ్ సుధీర్ మిత్రులు డబ్బుని సంచిలోకి ఎత్తాలి అని. సీసీ కెమెరాల్ని సైతం జిన్నా పిస్టోల్ తో కాల్చి, ఆధారాలు లేకుండా చేస్తాడు. అయితే డబ్బును ఇంతకు ముందులాగా ఇద్దరు కాకుండా ముగ్గురు పంచుకుంటారు.
మరలా ప్లాన్ కి సంబంధించిన చర్చలు మొదలయ్యాయి. సరే..డబ్బు కాస్త తగ్గినా..తన ప్లాన్ వర్కవుట్ అవుతున్నందుకు సుధాకర్ సంతోషంగానే ఉన్నాడు. జిన్నా రాకుంటే ఎంత దారుణం జరిగేది. అనవసరంగా పోలీసులకి చిక్కి జైలు కూడు తినాల్సి ఒచ్చేది. జిన్నా రావటమే మంచిదయిందని సుధీర్ లోలోపల ఆనందపడ్డాడు. సుధాకర్ తన చిరకాల మిత్రుడయినా, నిజానికి ఇలాంటివి ఇంతకు ముందు చేసి ఎరుగడు. అనవసరంగా వాడు చెప్పింది వినుంటే...? ఓ మై గాడ్..సుధీర్ కి బౌద్ద వృక్షం కింద జ్ఞానోదయం అయినట్టుగా అనిపించింది. అప్పటికే సమయం ఉదయం ఐదయింది.
తొమ్మిది గంటలకల్లా బ్యాంకు దగ్గరికే డైరెక్ట్ గా కార్ తీసుకుని ఒచ్చేస్తా అని చెప్పిన రాకేశ్ ఐదు గంటలకే సుధాకర్ ఇంటికి ఒచ్చేశాడు. నాకు కూడా నిద్ర పడ్తలేదురా భయ్. బ్యాంకు దోపిడీ చేసేటోల్లు మీరు హాయిగా ఉన్నరు, కార్ నడిపేటోన్ని నాకు మాత్రం నిద్ర పడ్తలేదు. పైపైనే నిద్ర. కలలో కూడా మనం డబ్బుల్దీసుకుని పారిపోతున్నట్టే ఒస్తుంది. ఈ టెన్షన్ ఎందుకనీ ఈడికే వొచ్చినా అని లోపలికి వస్తూ వస్తూ లొడ లొడా చెప్పేశాడు. రాకేష్ ఎవరో సుధీర్ కి, జిన్నాకి తెలియదు. కానీ సుధీర్ కి మాత్రం రాకేష్ కూడా డబ్బులో వాటా కోసమే ఒచ్చి ఉంటాడు అనుకున్నాడు. లేకపోతే యాభైవేలిస్తా అంటే ఎందుకు ఒప్పుకుంటాడు. అందరూ ఒకరికొకరు పరిచయం చేసుకున్నారు. మారిన తమ ప్లాన్ ని రాకేష్ కి వివరించారు. అంతా శ్రద్ధగా విన్నాడు రాకేష్.
ఈ ప్లాన్ వర్కవుట్ కాదన్నాడు రాకేష్. అందరూ ప్రశ్నార్థకాల్లా మారిపోయారు. "చూడండి...ఆలోచించండి. మీరు మొత్తం ప్లాన్ చెప్పాక, మీరు పప్పులో కాలేశారనిపిస్తుంది. ఎందుకంటే..ఉదయం పది గంటలకి బ్యాంకు తెరుస్తారు. జనాలు ఎక్కువగా ఉండరని మీరనుకుంటున్నారు. కానీ రేపు శని వారం. మధ్యాహ్నం ఒంటిగంట వరకే బ్యాంకు. కాబట్టి ఉదయం పది గంటల నించే జనాలు తమ బ్యాంకు పనులకి క్యూ కట్టి ఉంటారు. రెండవది, బ్యాంకులో పని చేసేవారు పది గంటలకే టంచనుగా ఒచ్చేస్తారని చెప్పలేం. దానికి కారణం కూడా శని వారమే. కాస్త లేట్ ఒస్తే రెండు మూడు గంటలు పని చేస్తే ఈ రోజు పని ఐపోతుంది కాబట్టి, పని ఎగ్గొట్టడానికైనా లేట్ గనే ఒస్తారు. మూడవది, బ్యాంకు వాల్లు లేట్ గా రావటం, జనాలు ఎక్కువగా ఉండటం వల్ల రేపు సెక్యూరిటీని టైట్ చేస్తారు. ఒకడు బయట,ఒకడు లోపల కంపల్సరీ జనాల్ని అదుపు చేయడానికి నిలబడి ఉంటారు. అంటే కొద్దిగా కష్టమే. ఇక నాలుగవది, బ్యాంకుకు లేటుగా రావాలనుకోవటం వల్ల, అందరూ ఒకే సమయం కి రారు. ఒకరిద్దరు ఎంప్లాయిస్ ఒచ్చినా మిగతా వారు బయటే ఉంటారు. కాబట్టి లోపలున్న వారు ఎవరైనా ఇంకా బ్యాంకుకి రాని ఉద్యోగులకి వి ఆర్ ఇన్ డేంజర్ అని మెసేజ్ ఇవ్వ గలిగగితే, బయట ఉన్న వారు పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తారు. కాబట్టి మనకి కష్టం. సరే అది కూడా మనం లోపలున్న వారందరి సెల్ఫోన్లనూ ఒక బ్యాగ్లో వేయమని బెదిరించగలిగినా..,మనం ఫెయిలవుతాం. ఎందుకంటే..బ్యాంకులో మనం తీసుకోబోయే డబ్బు క్యాషియర్ దగ్గర ఉండేది మాత్రమే. క్యాషియర్ కనుక ఇంకా బ్యాంకుకి రాకుండింటే మనం దోచుకోవటానికి ఏమీ ఉండదు. ఒక వేల క్యాషియర్ లోపలికి ఒచ్చేసి తన సీట్ లో కూర్చుని ఉన్నా, మనం దోపిడీ చేసేది ఉదయం బ్యాంకు మొదలవగానే కాబట్టి, క్యాషియర్ దగ్గర అప్పటికీ అంతగా డబ్బు జమ అయ్యుండదు. కాబట్టి మన దోపిడీ మనకు పెద్దగా ఇచ్చే డబ్బేమీ ఉండదు. అంటూ చెప్పుకుంటూ పోయాడు.
మొదట్లో..సుధీర్ గమనించాడు. బ్యాంకు దోపిడీ చేసేది 'మీరు' అని అనకుండా 'మనం' అని రాకేష్ అంటూ తనని కూడా కలుపుకు పోవటం.. కానీ రాకేష్ చెప్పిన పాయింట్స్ వింటూ పోతుండగా 'మనం' అంటున్నా పెద్దగా పట్టించుకోలేదు. మిగతా వారైనా అంతే. సుధాకరైతే అసలు రాకేష్ ని యాభై వేలకే ఒప్పించాననే విషయమే మరచి పోయాడు. ఆటోమేటిక్ గా డబ్బును నలుగురమూ పంచుకుందాం అనుకున్నారు. రాకేష్ ఇచ్చిన జ్ఞాన బోధ వల్ల ఉదయం పది గంటలకి కాకుండా మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతం లో బ్యాంక్ లోపలికి చొరబడాలని సంకల్పించారు. ఎవరెవరి రోల్స్ ఏంటో మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకున్నారు. రిహార్సల్స్ చేశారు. చర్చలు జరిపారు. అంతా ఒక ఆలోచనకి ఒచ్చినందుకు సంతోష పడ్డారు.
తాము నలుగురూ కలిసి ఎంత గొప్పటి ఆలోచన చేశారో నెమరు వేసుకోవటం మొదలెట్టారు?. మొదట ఈ బ్యాంకు దోపిడీ ఆలోచన వచ్చింది సుధాకర్ కి. బ్యాంకు లో కూడా సుధాకర్ కీలకంగా క్యాషియర్ డ్రావర్ నుంచి డబ్బును సంచిలోకి వేస్తాడు. ఇక, పిస్టల్ ని ఒడుపుగా తిప్పుతూ అందర్నీ భయపెడుతూ, సీసి కెమెరాలని కూడా పిస్టల్ తో కాల్చి, మరో కీలక పాత్రని జిన్నా పోషించబోతున్నాడు. అసలు బ్యాంకు టైమింగ్స్ గూర్చి పూర్తి అవగాహన ఇవ్వటమే కాక బయట కార్ లో రెడీగా ఉండి వేగంగా సిటీ దాటించే మరో కీలకమైన పని రాజేష్ ది. బ్యాంకులో డబ్బు సంచిలోకి సుధాకర్ డబ్బును వేస్తుంటే ఆ సంచిని పట్టుకునే బాధ్యత సుధీర్ ది. ఇదంత కీలకం కాదే...అనుకున్నాడు సుధాకర్. అనేశారు, జిన్నా అండ్ రాకేష్. చిన్న పాత్ర పోషించే సుధీర్ కి వాటా ఇవ్వటం అవసరమా...?
బూమెరాంగ్ లా తిరిగి తిరిగి తన మీదికే ఒస్తుందని అనుకోలేదు సుధీర్. కానీ ఇదంతా సుధాకర్ పన్నినపక్కా ప్రీ ప్లాన్ అనుకున్నాడు. అనేశాడు కూడా. "నన్ను తప్పించటానికే నీవీ ప్లాన్ వేశావురా...లేకపోతే ఇన్నాల్లు గా కలిసున్నాము నీవు నాకు వాటా ఇవ్వటం ఏంటి. లేకుంటే ఈ ఎర్ర గుడ్లోడు, ఈ పులి గుడ్లోడు ఈ అర్ధ రాత్రి రావటం ఏంటి , ఒక పథకం ప్రకారం మాట్లాడుతూ నన్ను మెల మెల్లగా పక్కకు జరిపటం ఏంటి?. లాస్ట్ కి నన్ను ప్లాన్ నుంచి తప్పించాలని చూస్తార్రా...? నన్ను వెర్రి పప్పను చెస్తార్రా....చూస్తాను బ్యాంకు దోపిడీ ఎలా చేస్తారో నేనూ చూస్తాను. మాటా మాటా పెరిగింది. బాహా బాహీ తల పడ్డారు. బలవంతుడయిన సుధీర్ ముగ్గుర్నీ ఎత్తి కింద పడేశాడు. ముగ్గురికీ అర్థం ఐపోయింది, ఏదో ఒకటి చేయక పోతే సుధీర్ చేతిలో మెత్తగా తన్నులు తినటం ఖాయం అని. ఉదయం ఆరు గంటల ప్రాంతంలో పైన పెంట్ హవుజ్ నుంచి వినపడే గట్టి గట్టి అరుపులు విని అపుడే నిద్ర లేచిన సుధాకర్ రూం ఓనరు అప్రమత్తమవుతూ ఉండగా...సుధీర్ ని నిలువరించటం కోసం జిన్నా గాలిలోకి పిస్టల్ ని కాల్చాడు. ధన్ మని.
కట్ చేస్తే.....
నలుగురూ జైలులో ఒకే గదిలో ఉన్నారు. ఒకరితో ఒకరు మాట్లాడకుండా కూర్చుని ఉన్నారు. సుధాకర్ అనుకున్నాడు. "ఒరేయ్ సుధీరు మామా..! నీ పాత్ర నిడివిని పెంచుదామనుకున్నానే కానీ, నీకు పాత్ర ఇవ్వకూడదని అనుకుంటానారా...?. ప్రాణ మిత్రుడివి ఎంత పని చేశావురా సుధీరూ..!!"
6/9/15

No comments:
Post a Comment