Wednesday, 16 September 2015

విరించి ll సంధి పత్రం ll
..........................................
కాలాల్లో కల్లోలాలు పుట్టే రోజుల్లోకి
మనసంతా తలుపులు తెరుచుకుని
పనిలేని పద శాస్త్రజ్ఞుడిలా తిరిగేవాడిని.

కంటిముందు సాష్టాంగపడిన దుస్సంఘటనో
చెవిపక్కన సాగిలపడిన అరుదైన విషయమో
ఏదైనాగానీ..నుదుటిమీద కాసిన్ని
ఆందోళనా ముడతలను పుష్పింపజేసినపుడు
నోటి మీద రెండు
ఆశ్చర్య పెదవుల్ని వికసింపజేసినపుడు
నా హృదయాన్నొక ఫైరింజన్ గంటలా మ్రోగించేవాణ్ణి.

చచ్చి పోయిన మహానుభావుడో
చంపబడిన నక్సలైటో
పోయేవాడు ఎవడైనా సరే..
ఊరక పోయేవాడే కాదు
ఒక కొవ్వొత్తి కక్కినంత మైనాన్నయినా
అర్ధరాత్రి నా కాగితం మీద కక్కిపోయేవాడు

'కానీ ఇపుడేమైంది నాలో'  అనే అనుమానం
ఇపుడిపుడే నాలో పుడుతున్నట్టున్నది.
నిలువ ఉంచుకున్న భావాలకి
పురుగు పట్టినట్టు
చింతపండుతో తోమని వెండిపాత్రలా
వెలవెల పోతున్నట్టు
నాతో నేనేదో రహస్య అవగాహన కొచ్చినట్టు
నానుండి నన్ను బయటకి తోసేసుకున్నట్టు
నా మీద నాకే పుట్టిన ఓ అనుమానం
నన్నో అవమానంలా వెంటాడుతున్నట్టున్నది.

ఉల్లి, కందిపప్పు ధరలు తగ్గి పెరిగాయన్నా..
పెట్రోలు డీజిలు ధరలు పెరిగి తగ్గాయన్నా..
అభం శుభం తెలియని ఆడపిల్లలను
రేప్ చేసి చంపేస్తున్నా..
పేలిన బాంబులతో పాటు శరీరాలు పేలిపోతున్నా
ప్రపంచం పగిలిపోతుందన్నా...
చిన్న మొక్కలమీద వడగండ్ల వాన కురుస్తున్నా..
సిరా ఒలికి పాడైపోయిన కాగితంలా
ఏ భావమూ సరిగా చెప్పలేని అబ్స్ట్రాక్ట్ చిత్రం లా
నవ్వుతున్నట్టుండే జోకర్ మాస్క్ ని ధరించుకుంటున్నాను.

అలవాటు పడిపోయానేమో..
బాహ్యానికో అంతరంగపు సంధి పత్రం దొరికిందేమో
అందుకే అలవాటుగా ఇపుడబద్దం చెబుతున్నాను
ఓ కవితకోసం ఇక్కడో పూవు నవ్వుతోందని.

16/9/15

No comments:

Post a Comment