భూమధ్య రేఖ ll కాశిరాజు కవిత్వం ll ఒక అవగాహన
....................................................................
దాదాపు గత సంవత్సర కాలంగా నా బుక్ షెల్ఫ్ లో ఒక మూలకు పడి వుంది ఈ భూమధ్య రేఖ. ఏదయినా పుస్తకాన్ని తీసుకుంటున్నపుడో వెతుక్కుంటున్నపుడో..భూమధ్య రేఖ కదా..చేయిని వేడిగా తాకుతుా కనిపించేది. వేడిగా ఉంటుందేమో తర్వాత చదువుదాం లే అని వదిలేసే వాడిని. కానీ ఇపుడు వర్షం మొదలైంది కదా..కాసింత వెచ్చగా ఉంటుందేమో అనుకుని భూమధ్య రేఖను పట్టుకున్నాను. అమ్మా నాన్నల ప్రేమంత వెచ్చగా గుండెని తగిలి, వాన నీళ్ళలా మనసులో మట్టిని కడిగేసింది. ఇంత కాలం చదవనందుకు బాధ పడాలో ఇపుడు ఈ వర్షం కురిసిన రోజు చదివి ముద్దయినందుకు సంతోష పడాలో అర్థం కాలేదు.
రవీంద్రుడి గీతాంజలిలో ఆయనకూ దేవునికీ పేచీ. ఎడ తెగని పేచీ. ఆ సంభాషణ లో అంతర్లీనంగా ఒక ఫిలాసఫీ. దేవుడంటే ఎవరో ఎక్కడుంటాడో తెలిపే ఫిలాసఫీ. అది మధురం. అమృతం. మళ్ళీ అంతటి ఆ అమృతాన్ని ఇంకో రకంగా కురిపిస్తాడు కాశీరాజు. ఇక్కడ దేవుడుండడు. జీవితం ఉంటుంది. అమ్మ ఉంటుంది. నాన్న ఉంటాడు. ఊరు ఉంటుంది. జీవితంలో జరిగే ప్రతీ రోజునీ, ప్రతీ అంశాన్నీ తరచి చూసే కవి ఉంటాడు. జీవన సౌందర్యాన్ని ప్రతీ సంఘటనలో ప్రతీ పండగలో చూపించే కాశీరాజు ఉంటాడు. కవిత్వాన్ని చదువుతూ చాలా చోట్ల ఆగిపోతాం. ఒక ఉద్వేగాన్ని మనస్సు అకస్మాత్తుగా పొందినపుడు, చలనం లేకుండా ఐపోతుందేమో. 'ఇంక ఇది చాలు అనుభవించటానికి' అనిపించేలా ఉండే ఆ పదాల్లోంచి అంత త్వరగా బయటకి రాలేకపోతాము. 'పుస్తకం మొత్తం చదవాలి కదా..!' అనే స్పృహ మనల్ని ముందుకు తోయాలే తప్ప, మనల్ని ఆ భావాలంత సులభంగా వదిలి పెట్టవు. అవి కేవలం భావాలు కాదు. వాస్తవ జీవిత చిత్రాలు. ఆ జీవిత చిత్రాల్ని కంటి ముందు చూపిస్తూ, కవిత్వం చేస్తాడు కాశీరాజు.
ఒక్కో కవిత ఒక జీవితం లోని ఒక సంఘటనను చూపిస్తుంది. అందుకే కోట్ చేయటానికీ, ఇదిగో ఇక్కడ బాగుంది, ఇక్కడ బాగాలేదు అనటానికీ ఏమీ ఉండదు. చేస్తే కవితనంతా కోట్ చెయ్యాలి. పుస్తకమంతా వేరు వేరు కవితలు కాదు. అందుకే ఇది కవిత్వ సంకలనం కాదు. కవిత్వం. కాశిరాజు కవిత్వం. అన్ని కవితలూ ఒక విషయాన్నే చెబుతాయి. ఒక జీవితాన్ని, ఊరినీ, అమ్మనీ, నాన్ననీ, ఆ తీయటి సంబంధాల్నీ చూపుతాయి. నేరేడు లంక ఊరినుంచి మొదలై..జీవితంలోని ప్రతీ చిన్న అంశాన్నీ అందంగా మనముందు చిత్రిస్తాడు. ఆ చిత్రణలో పాత్రలు అమ్మా, నాన్న, కాశీరాజులతో పాటు ప్రకృతిలోని గడ్డిపరక, వొంగపువ్వు, జమ్మి చెట్టు, మందారపువ్వు, మిణుగురు పురుగు, చిరు దీపం, దేవగన్నేరు, అర్ధరూపాయి, చేతి రుమాలు, పాత మొలతాడు, రేమండ్ ప్యాంటూ, రాతిరి, నిశ్శబ్దం, ఆకలి ఇలా అన్నీ పాత్రలై మనల్ని పలుకరిస్తాయి.
"అరచెయ్యి ఆనంద భాష్పాల్ని వడ్డిస్తుంటే..గిన్నెలోని గుప్పెడు మెతుకులు ఎంతకీ ఐపోవు/ అక్కడ మమకారం ఎక్కువై మెడబడితే..తాగాల్సింది నీళ్ళు కాదు, ఎదురుగా కూర్చున్న కళ్ళ లోని కంగారు/ అపుడు చేయి కడగటానికి చెంబు నీళ్ళి స్తే..అవి ఊటబావులైన హృదయాంతరాలు .." ఇలాసాగుతుందీ కవిత్వం...ఎక్కడ ఆపగలం..ఎక్కడ ముందుకి సాగగలం. నేరేడులంకలో రాత్రిని ఎంతో రొమాంటిక్ గా చూపిస్తాడు. "కూరదాకలోని కుతుహలం కుతకుతమంటోంది. సలాది సుబ్బయ్య వీధి దీపాలార్పేశాక నా సామిరంగా...గుట్టుగా గుసగుసలాడుతూ మా నేరేడులంక నిద్దరోతుంది".
వానొస్తే బస్సులో కలిసిన వైజాగ్ శర్మగారు ఏం చేస్తాడో మనం పట్టించుకోక పోవచ్ఛు, కానీ కవి ఎవరినీ వదిలి పెట్టడు. అలాగే కమలమ్మతో తిట్లుతింటూ, గుమ్మంముందు పారే వాననీటి లాగే గలగలా నవ్వేసి తల తుడుచుకోవటానికి కమలమ్మ మొగుడు దగ్గరికొస్తాడట. చిల్లులున్న చోట చెంబులూ గిన్నెలూ పెడితే..టిక్ టిక్ మనే వర్షపు చినుకుల సంగీతానికి పేదరికపు దర్శకత్వం భలే బాగుంటుందంటాడు. తన తల్లిని భూమితోనూ, తండ్రిని ఆకాశంతోనూ పోల్చటం రెండు మూడు కవితల్లో కనిపిస్తుంది. అంతా నింపుకున్న శూన్యం ఆకాశమనీ, వొట్టి ఓర్పుతో నిండిన ఖాళీ గుండె భూమిదనీ ఒక కవితలో చెప్పి, 'ఆకాశమేమో నేలపైకి దిగొచ్చి, అమ్మ పక్కన నిల్చుని నాన్నై పోయేదట' అని భావన చేస్తాడు.
పల్లెలో కరెంటు పోయినా అందమైన కవిత్వం చేస్తాడు. "ఆ సందామాట్ల చీకట్లో, ఎంతకీ రాని కరెంటుని అందరం కల్సి తిట్టుకుని, తిందామని తీర్మనించుకున్నాక/, ఆ చిన్న దీపం వెలుగులో..నవ్వుతున్న ముఖాలు మాత్రమే కనబడే వెలుతుర్ని మనకెందుకిచ్చాడో అర్థమై మరింత నవ్వొచ్చేది నాకు/పేదరిక మని విసుక్కున్నా, ప్రశాంతత బాగున్నపుడు, నవ్వు మాత్రమే నేర్వాలి మనం. " ప్రతీ కవితలో ఒక సందర్భం వుంటుంది, నాన్న జోబులో అర్ధ రూపాయి కొట్టేయటమో..పెళ్ళి సంబంధానికి పోవటమో..అమ్మ పురుడు పోసుకోవడమో..వాగులో స్నానాలు చేయటమో..ఉగాదో, దీపావళో .. ఒకటని కాదు, నిత్య జీవితంలోని ప్రతీ చిన్న అంశమూ కవితలోకి ఒదిగిపోతుంది. ఆ ప్రతీ అంశాన్ని ఆనుకుని ఒక ప్రేమ, ఒక ఆర్ద్రత, ఒక ఫిలాసఫీ ఉంటుంది. ఇలా కవిత్వాన్ని చేయటం అంత సులభం కాదు.
ఈ కవిత బాగుంది, ఈ కవిత బాగాలేదు అని చెప్పటానికి అవకాశమివ్వడు కాశీరాజు. జీవితంలోకి చొచ్చుకుపోయి ఈ గ్రామీణ జీవన సౌందర్యాన్ని తలమునకలుగా ఆస్వాదించాలంటే చదవాల్సిందే. ఏకాంతం మీద బాణమేసినట్టు ఒక్కో కవిత సాగుతుంది. ఈ కవితల్లో దుఃఖమూ సంతోషమూ తీసుకున్నోళ్ళ కు తీసుకున్నంతగా ఉంటుంది. పుస్తకమంతా చదివాక సీసాలూ గ్లాసులూ కాదు గానీ, గడ్డ కట్టిన గాజు హృదయాలు ఖాళీ అవుతాయి. ఒక ఆశ్చర్యానందానుభూతికి లోను చేసి, 'ఆహా ఈ వాక్యం చాలు' అనిపించే ఎన్నో కవితా వాక్యాలున్నా, కొన్నిటిని ఈ కింద తెలుపుతున్నాను.
కాలాన్ని వెనక్కు తిప్పలేమని అన్నాక
తీస్కొచ్చి నిన్ను చూపించాలనుంది.
*
ఎక్కడ బతుకు బాసగా మారి
ఎక్కడ మనుషులు సాహిత్యమయ్యారో..
అక్కడ మనం నవ్వుతూ ఉండాలి
నవ్వుల్ని లిఖిస్తుండాలి.
*
వర్షం వచ్చిన జాడ ఆ వానకళ్ళకి తెలీదు
అమ్మది ఆకాశమంత దుఃఖం.
అమ్మ కళ్ళకి నాన్న ఉపనది.
*
అరచేతిలోని ఉగాది పచ్చడి
అందరివొంకా చూసి తింటే అదో తృప్తి.
ఏండ్లు గడిచి మేం గడసరులయ్యాక కూడా
ఆ పచ్చడిది అదే రుచి.
*
చివరిగా ఇది చూడండి.
వదిలి రాలేని ప్రేమతో వచ్చిన ఒక తల్లి
వొరిసేలో ఏం చేస్తదో తెలుసా..?
ఆకు కట్ట ఇప్పినట్టే అమ్మ గుండెని ఇప్పేస్తది.
గుబులు మూన నీట్లో గుచ్చి వరి నాటుతున్నట్టు
ఓ రోజంతా ప్రేమను దుఃఖంతో నాటేస్తది.
రోజుకూలీ బతుకులో రోజంతా అలా బిడ్డ తలపులో వుండి
ఇంటికి పోయాక పిల్లాన్నెత్తుకుని మొగుడు దేవుడిలా కనిపిస్తే
కళ్ళ నీళ్ళు కారుస్తూ ఆ తల్లి దేవగన్నేరైపోతాది.
*
ఇంతకు మించి చెప్పేదేమీ ఉండదు, చదివి కవిత్వం లోని ఆనందాన్ని అనుభవించటం తప్ప. ఇక ఆలోచించేదేమీ లేదు. పుస్తకాన్ని చేతిలోకి తీసుకోవటమే కదా మిగిలింది.
25/9/15

No comments:
Post a Comment