Friday, 25 September 2015

ll కొన్ని రాత్రులు...ll  పుష్యమీ సాగర్ గారి కవితా సంకలనం. ఒక అవగాహన.
...........................................................................................
కొన్ని సంఘటనల్ని మనం చూసినపుడు అవి మనసు మీద కొన్ని బలమైన ముద్రల్ని వేస్తాయి. ఏ రోజైతే అలా జరుగుతుందో, మనకు ఆ రాత్రి నిదుర పట్టదు. ఆ జ్ఞాపకం వెంటాడుతుంది. వేధిస్తుంది. అలాంటి ఎన్నో రాత్రుల్ని గడిపిన పుష్యమీ సాగర్, అలాంటి కొన్ని రాత్రులని మనతో పంచుకుంటాడు ఈ పుస్తకంలో. అలా పంచుకోవాలి అనుకున్నపుడు మనకు మాటలూ కథలూ చెప్పినట్టు చెప్పడు. ఆ సంఘటన ముందు తాను నిలబడి తనకు తాను, మన ముందు ఒక అద్దంలా మారిపోతాడు. ఆ అద్దంలోకి మనం చూస్తే చాలు, ఆ సంఘటనని మనమూ చూసేస్తాము. ఒక సంఘటనని మనముందు మాటలతో వినిపించినపుడు అక్కడ కేవలము మాటలే ఉంటాయి. కానీ కవి అద్దంలా మారి మనకు చూపించినపుడు, మనలో కూడా ప్రశ్నలు మొదలవుతాయి. మనలో ప్రశ్నలు మొదలు కాలేదంటే, కవి అద్దంలా మారి కవిత రాయటంలో ఇక ఏ గొప్ప ఉద్దేశమూ ఉండదు. కేవలం సమయాన్ని నింపుకోవటం తప్ప.

సాగర్ గారు మనలకి రెక్కలు విసురుకుంటూ ఆవలి తీరం వైపు తీసికెళ్ళే రాత్రుల్ని చూపిస్తారు. కవిత చదివాక, మన మధ్యే ఉంటూ మనకంటే భిన్నమైన జీవితాన్ని గడిపే ఓ కొత్త వ్యక్తి మనకు కవితలో పరిచయం అవుతాడు. ఆ పరిచయం చేసుకోవటమే ఆవలి తీరానికి చేరగలగటం. ఆవలి గట్టునించి మనముండే గట్టుని చూపిస్తాడు. ఆవలి గట్టులో జీవితమెంత భయానకంగా ఉందో తెలిసేలా చేస్తాడు. నింగికి నిచ్చనలేసే కాలంలో మనం ఉన్నామనుకుంటున్న సమయంలో..బతుకు గడపని కూడా దాటలేని జీవితం ఒకటుందని చూపుతాడు. డిసెంబర్ థర్టీ ఫస్ట్ పార్టీల్లో మనం మునిగి తేలుతున్నపుడు, బుక్కెడు బువ్వ పెట్టలేని పండుగలెందుకని అవహేళన చేస్తాడు. దేశం వెలిగిపోతోందని దండోరాలేసుకుంటున్న సమయంలో ఆమడ దూరంలో నిలువెత్తు విగ్రహంలా ఉన్న అంటరాని వాన్ని చూడలేకపోయావా అని ప్రశ్నిస్తాడు. వ్యసనాల బారిన పడి చితిపై హాయిగా పడుకున్న వాడినీ, కన్నీటి కుండను పగులగొట్టి, ఇరవైయ్యేండ్ల కుంపటిని ఊరు దాటించి వచ్చిన వితంతువునీ, పొగ చూరుతున్న కూడలి దగ్గరి బిక్షగాల్ల బతుకులనీ, ముగిసిపోయిన నేత వృత్తులనీ, ప్రాణాలతో చెలగాటమాడే సరోగేట్ తల్లుల్నీ, నయా నాగరికతలో అర్ధాంతరంగా ముగిసిన పాత్రలా కనిపించే ఓల్డేజ్ హోమ్ తల్లుల్నీ, మనకు పరిచయం చేస్తాడు. "చూడండి..! వీరు ఇలా ఉన్నారు"  అని చూపటంలోనే మనం వారికోసం ఏదైనా చేయలేమా అనే ప్రశ్ననీ మనలో ఉదయింపజేస్తాడు కవి.

ఇంత సత్యాల్ని చూస్తున్న తన కనులకి, సత్యాల్ని చూడలేని ప్రపంచపు కళ్ళు గుడ్డిగానే కనిపిస్తాయి. తనలోకి నడుచుకుంటూ వచ్చిన జీవితాలని చూసి తనతో తానొక యుద్ధాన్ని చేస్తాడు. మాటల వంతెన కోసం మధన పడతాడు. అవ్యక్తంగా తనను పట్టుకుని వేళ్ళాడే భావాలలోకి మరింత తొంగి చూస్తాడు. నిశ్శబ్దంగా తనని కలవర పెట్టే మాటలని, గొంతు చివరే ఉరితీసి, మాటలు వచ్చిన మూగవాడిలా మనముందు ఒంటరిగా మౌనం చాటున దాక్కుంటానంటాడు. అయినా నిత్య అన్వేషిలా గుండెను తడిమే ఒక స్పర్శ కోసం వెతుకుతూనే ఉంటానంటాడు. అందుకేనేమో తనలోని బాధను మనతో పంచుకోవాలనుకునే ఉద్దేశంలో..'దుఃఖాన్ని చెరిసగం పంచుకు తినే వారికోసం మరో ముద్దను మిగిల్చానని' మనలో ఆకలితో ఉన్న వారిని ఊరిస్తున్నట్టుగా మాట్లాడి ఆకలి రుచి చూపిస్తాడు.

లోకంలో వివిధ రకాలుగా దాక్కుని ఉన్న బాధని మనముందు ఉంచే ప్రయత్నం చేస్తారు సాగర్ గారు. తను చూసిన బాధల్ని తను అనుభూతి చెంది, "ఆ చూడండి, ఈ బాధ ఇలా ఉంటుంది"  అని మనల్ని కూడా అనుభూతి చెందమంటాడు. కాస్త జాగ్రత్తగా చదివితే మనమూ ఆ అనుభూతిని పొందగలం. ఒక్కో సారి కవిత స్టాంజాలుగా కనపడినా..ప్రతీ స్టాంజాలోని ప్రతీ వాక్యాన్నీ విడిగా చదివితేనే మనకు కవిత అర్థం అవుతుంది. ఆయన వాక్య నిర్మాణం చిన్నదిగా చేస్తారు. స్టాంజాలో నాలుగు వాక్యాలూ ఒకే అంశానికి చెందినవి కాక, దేనికవే ప్రత్యేక అంశాన్ని తెలుపుతాయి. స్టాంజా మొత్తం ఒకే అంశంగా చదవటం, రాయటం అలవాటైన వారికి ఈ పద్దతి కొత్తగానే కాక వేగంగా చదివేస్తే కాసింత ఇబ్బందిగా కూడా అనిపిస్తుంది. కానీ ఈ టెక్నిక్ అర్థం అయితే   సాగర్ గారి కవితా లోతులు సులువుగా అర్థం అవుతాయి. అయితే కొన్ని కవితల్లో తాను చూసిన ప్రపంచాన్ని తాను చూసినట్టుగానే చూపే ప్రయత్నంలో, వేరే అంశాలని పరిగణలోనికి తీసుకోకపోవటం కనిపిస్తుంది. ఉదాహరణకి అద్దె అమ్మలు కవితలో అద్దె అమ్మల బాధని చూపించినా సంతానం కలుగని జంటలకి సైన్స్ అందించిన వరం అన్న విషయాన్ని మనకి చూపించరు. అదే కోపంతో 'ఎక్కడెక్కడి వారో వారి తరం కోసం నీ అనుభూతులతో ఆడుకుంటున్నారు' అనేస్తారు. నిజానికి 'కన్సెంట్' లేకుండా ఎవరూ ఎవరినీ సరోగేట్ మదర్ గా మార్చలేరనే విషయాన్ని మనకోసం మరచిపోతారు. అయినా మనల్ని ఇబ్బంది పెట్టకుండానే చదివించగలరాయన.

మొత్తానికి..కొన్ని నిదురలేని రాత్రులని గడిపైనా ఈ లోకం తీరుని గమనించండంటూ ప్రతీ కవితలో ప్రయత్నిస్తూ సాగుతాడు కవి. ఇంకా ఎన్నో సంకలనాలని మనం ఈ కవి నుండి ఆశించవచ్చు. ఇంకాస్త కొత్తగా, కొత్త అనుభవాల్ని, అనుభూతుల్నీ వెంటేసుకోవాలనే జీవితేచ్ఛ బలంగా ఉన్నవారెవరూ ఇంట్లో కూర్చుని కవితలు రాయరు. సమాజంలో కూర్చునే రాయాలి. సమాజానికే చూపించాలి ఇదిగో సమాజమా..! నీవిలా ఉన్నవని. అలా చూపించే అరుదైన కవుల్లో పుష్యమీ సాగర్ గారు కూడా చేరతారు. మరింత బలంగా ఆయన కలం మరిన్ని కోణాల్ని స్పృశించాలని కోరుకుంటూ...
    మీ విరించి.

No comments:

Post a Comment