Sunday, 24 July 2016

ఆనందం  ఒక అన్వేషణ (part4)
----------------------------------------------

ప్రపంచమంతా ఒకేలా ఉండాలి, అందరూ ఒకేలా ఆలోచించాలి అనేది ఒక ఇల్లాజికల్ ఆలోచన. ఒకేలా ఉండటం జరిగితే ప్రపంచం చాలా అసహ్యంగా ఉండిండేది. ఏ ఇద్దరు మనుషులు ఒకేలా లేనపుడు, అందరి ఆలోచనలూ ఒకేలా ఉండాలనుకోవడం ఖచ్చితంగా అర్థం లేని విషయమే. మనుషులందరూ ఒకేలా ఆలోచిస్తారు అని నమ్మకాన్ని స్థిరీకరించుకోవటం కూడా కనిపిస్తూ ఉంటుంది. అంతే కాక మనిషి ఆలోచన మార్పుకు గురికానిది అనే నమ్మకం కూడా మనం కలిగి వుంటాం. ఇవన్నీ మనం అర్థం చేసుకునే, అవగాహన చేసుకునే అంశానికి సంబంధించిన ఫాల్లసీలు. ఒకేలా ఆలోచించాలి అనుకోవడం, ఒకేలా ఆలోచిస్తారు అనుకోవడం, ఒక ఆలోచననే మార్పులేకుండా కలిగివుంటాడు అనుకోవడం. ఈ మూడు కూడా అవగాహనా లోపాలు, ఫాల్లసీలే. ఫండమెంటలిజం మనలోపల్నే ఈ విధంగా మొదలవుతుంది. మనం ఆ మతాలు ఈ మతాలని ఆడిపోసుకుంటాం కానీ, మన ప్రాథమిక ఆలోచనా రీతిలోనే లోపం ఉందనే విషయాన్ని గుర్తించము. మనిషి ఫండమెంటల్ కాబట్టే మనిషి తయారు చేసుకున్న మతాలు ఫండమెంటల్గానే ఉంటాయి. వేరేగా ఉదాత్తంగా ఉండటానికి వీలే లేదు. మతాలనన్నింటినీ కాదనే నాస్తికుడయినా, ప్రపంచంలో అందరూ నాస్తికులుగా, తనలాగానే ఆలోచించాలి అనుకుంటాడే తప్ప, ఇంకో రకంగా ఆలోచించడానికి వీల్లేదు అంటాడు. దానికతడు చూపించే కారణం, మతాలవల్ల మారణ హోమాలు జరిగాయి కాబట్టి, ఇక అవి ఉండటానికి వీలు లేదంటాడు. తద్వారా అతడు కూడా అందరూ దేవుడులేడు అనే ఆలోచించాలి తప్ప ఇంకో రకంగా ఆలోచించకూడదు అనే అనుకుంటున్నాడు. ఇతడి ఆలోచనలకి, కరడుగట్టిన మతవాదులకీ ఏమీ తేడాలేదనే విషయాన్నతడు గుర్తించడు. మతాల వల్లకానీ, ఇంకదేనివల్లకానీ జరిగే మారణ హోమమంతా, మనిషి ఒకేలా ఆలోచించాలి అనే ఫాల్లసీ వల్లనే వచ్చి ఉన్నాయి.

ఇక మత ఛాంధస వాదుల కరడుగట్టిన డోగ్మాలను పలుచన చేయడానికి ఎవరైనా అన్ని మతాలు ఒక్కటే, దేవుడు ఒక్కడే కాబట్టి అని అంటే, మత ఛాంధస వాదులు పుస్తకాల గ్లోసరీలు చదువుతూ నిరూపించగలరు, ఎలా వేరే మతం, తన మతం ఒక్కటి కావో, ఏ విధంగా తన మతం వేరే మతానికంటే గొప్పదో. వీరంతా ఒక విషయం యొక్క రూపాన్నీ సారాన్నీ వేరుగా చూడలేకపోవటం వలన వచ్చిన చిక్కులో చిక్కుకుపోయారని చెప్పక తప్పదు. కనిపించిందంతా బంగారం కాదు అంటాడు షేక్స్పియర్. రూపానికీ, సారానికీ మధ్య మోసపూరితమైన తేడా ఉంటుంది. సరి ఐన దృష్టిలేకపోతే ఈ రెండూ ఒకేలాగా కనిపిస్తాయి, వినిపిస్తాయి, అనిపిస్తాయి. స్వభావోక్తికీ, ధన్వోక్తికీ ఉన్నటువంటి తేడా కన్నా క్లిష్టమైన తేడానే ఇది. సాయనాచార్యుడైనా వేదంలోని ధన్వోక్తిని, స్వభావోక్తిలా గ్రహించి, వేదానికి తప్పుడు భాష్యం చెప్పేశాడు అంటాడు శ్రీ అరవిందులు. అయితే రూపానికీ,  సారానికీ ఉన్న తేడా, రూపంలో దాగి వుంటుంది కానీ, సారంలో కాదు. అంటే రూపము సారములా భ్రమింప జేయవచ్చు కానీ, సారము ఎప్పటికీ సారముగానే ఉంటుంది తప్ప రూపములా భ్రమింపజేయలేదు. ఇపుడు మతాల్ని వివరించే క్రమంలో రూపాన్నే మనం సారమనుకుంటున్నాం. అందువల్ల సారం మనకు కనిపించకుండానే ఉండిపోతుంటుంది. ఇక్కడ ఒక ఉదాహరణ చెప్పుకోవాలి. ఒక సైనుకులను ఉద్దేశించి, సైనికాధికారి ప్రసంగిచేటపుడు, శత్రు దేశంతో జరిగిన యుద్ధంలోని ఒక ఘట్టాన్ని వివరిస్తున్నాడు

             "ఆ రోజేమయ్యిందంటే, శత్రువులు ఆ వీర సైనికుని కాళ్ళు చేతులూ కోసి పడేశారు. కేవలం మొండెం, తల మాత్రమే మిగిలివుంది. అయినా ఆ సైనికుడు లెక్కచేయక, ఒక బాంబుని నోటిలో పెట్టుకుని శత్రువుల మీదకు ఉరికాడు. శత్రువులను ఉద్దేశించి మాట్లాడుతూ ఓరీ ధూర్తుల్లారా, మీరు నా కాళ్ళు తీసేశారు, చేతులు తీసేశారు, అయినా నేను నా దేశంకోసం ప్రాణాలర్పించటానికి సిద్ధ పడ్డాను. ఈ ప్రాణాన్ని నా దేశం కోసం తృణ ప్రాయంగా భావిస్తున్నాను. నాకు భార్యా పిల్లల మీద మమకారం ఏమీ లేదు, మీకు కనుక ఉంటే నా దేశ సైనికుల దాఠికి తట్టుకోగల శక్తి లేకుంటే ఇపుడే పారిపోండి, అంటూ తన నోట్లో ఉన్న బాంబును కొరికి శత్రులుల మధ్యనే పేలిపోయి ప్రాణ త్యాగం చేశాడు".

ఈ మాటల్లో అభిదార్థాన్ని తీసుకున్నట్టైతే, మనకు అంతా తప్పుగానే అనిపిస్తుంది. చేతులూ కాళ్ళూ లేని వ్యక్తి శతృవుల మీదకు ఉరకటం ఏమిటి?, నోట్లో బాంబు పెట్టుకుని ఎలా మాట్లాడాడు?, ఆయన మాట్లాడుతుంటే శతృవులు కాల్చి పారేయక చూస్తూ ఎందుకు,కూచున్నారు? భయంకర యుద్ధంలో ఆహోరులో అంతసేపు మాట్లాడటానికి తీరికెక్కడిది?, ఆయన మాట్లాడినంత మాత్రాన శతృవులకు వినిపించి ఉంటుందనటానికి ఆదారాలేంటి?, నోటితో బాంబును ఎలా కొరికి పేల్చాడు, ఇత్యాదులన్నీ. కానీ వ్యంజనార్థం అది కాదు. ఇది కట్టుకథే, కానీ సైనికాధికారి సైనికుల్లో నింపాలనుకున్న స్పూర్తిని మనం గ్రహించగలిగితే అదే సారం. మనం ఒకానొక సందర్భంలో, ఒక విషయంలోకి పూర్తిగా ఇన్వోల్వ్ అయినపుడు, రూపం కంటే సారాన్నే గ్రహిస్తాము. కానీ పూర్తిగా ఇన్వోల్వ్ కానపుడు రూపం మాత్రమే గ్రహిస్తాము. పాత సినిమాల్లో హీరో కార్ నడుపుతూ ఉంటాడు. బ్యాక్ గ్రౌండ్ లో కనబడే చెట్లూ, కార్ స్టీరింగ్ ని పట్టుకుని తిప్పే విదానమూ, కార్ ఊగుతున్న విధానమూ గమనిస్తే ఆ షాట్ స్టూడియోలో తీశారనే విషయం అర్థం అవుతుంది. ఎంతో ఆర్టిఫిషియల్గా అనిపిస్తుంటుంది. కానీ మనం ఆ కథలో ఇన్వాల్వ్ అయినపుడు, హీరో నిజంగానే కార్ ను నడిపిస్తూ విలన్ ను ఛేజ్ చేస్తున్నాడని అనుకుంటాం. ఇన్వాల్వ్ కానపుడు రూపం మాత్రమే కనిపించింది, ఇన్వాల్వ్ అయినపుడు సారం కనిపించింది. ఈ రెండింటి మధ్య తేడా రూపంలోనే దాగి ఉంటుంది. ఇపుడు మనం హీరో విలన్ ని ఛేజ్ చేయటం, స్టూడియోలో కాకుండా బయట షూట్ చేసామంటే, రూపం మాత్రమే మారినట్టు, కానీ సారం అదే.

కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు యుద్ధం చేయనని బిగుసుకుపోయినపుడు, శ్రీ కృష్ణుడు భగవద్గీత చెబుతాడు. నడి యుద్ధంలో ఈ సుదీర్ఘ మీటింగులేంటని మనం అనుకుంటాం. అది రూప గ్రహింపు మాత్రమే. సారం అది కాదు. అర్జునుడు బాధ పడుతున్న వ్యక్తికి ప్రతినిధిగా నిలబడ్డాడు. జీసస్ శిలువ మీద బాధ పడుతున్న వ్యక్తికి ప్రతినిధిగా నిలబడి ఉన్నాడు. ఏదైనా ఒక నాటకం మనం చూస్తున్నపుడు, నాటకంలో ఒక విషాద పాత్ర, ఒక కామెడీ పాత్ర ఉంటే ప్రేక్షకుడు విషాద పాత్రతో తాదాత్మ్యం చెందుతాడు తప్ప, కామెడీ పాత్రతో కాదు. కామెడీ పాత్రధారుడు, కామెడీ పాత్రధారుడడిగానే మిగిలిపోతాడు కానీ విషాద పాత్రధారుడు ప్రేక్షకుని ఆంతర్యంలో చోటు సంపాదించుకుంటాడు. అర్జునుడి విషాదము అందరి విషాదమయ్యింది. జీసస్ చిందించిన రక్తము అందరి రక్తమయ్యింది. అర్జునుడు నేనిక యుద్ధం చేయలేనని బాధపడతాడు. జీసస్ భగవంతుడా నన్నెందుకు విడిచిపెట్టావని దుఃఖితుడౌతాడు.  కృష్ణుడు జ్ఞాన బోధ చేసి అర్జునుడు నిమిత్త మాత్రుడే చేసేదంతా తానేనని తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తాడు. తానూ దేవుడు వేరు వేరు కాదని జీసస్ మరణం మీదినుంచి లేచి వస్తాడు. మరణం అజ్ఞానం, దైవం జ్ఞానం. మతాలూ కథలూ వేరుగా అనిపిస్తాయి, సారం ఒకేలాగా ఉంటుంది. మతవాదులకు సారంతో పని లేదు, రూపాన్ని సారంలా భ్రమపడటంతో రుపంలోనే కూరుకుని పోతుంటారు. మనిషిని ఉన్నతి వైపు నడపటమే సారమైతే, ఆ సారం ఏ రూపంలో అయినా ఉండి ఉండవచ్చు. తమకు తెలిసిన రూపమే అసలైన సారము అనుకోవడంలోనే ఇబ్బంది.
ఆనందం- ఒక అన్వేషణ( part3)
____________________________

ప్రస్తుత ప్రపంచమంతా మధ్యే మార్గమును కనుక్కునే దశలో ఉన్నట్టున్నది. అటు అటూ కాక ఇటు ఇటూ కాక, మధ్యలో. ఇపుడు మనకు సోషలిజమూ వద్దు, కాపిటలిజమూ వద్దు. లిబెరల్ సోషలిజం కావాలి. మిక్స్డ్ ఎకానమీ కావాలి. మనకు మెజారిటీ గవర్నమెంటు వద్దు, మైనారిటీ గవర్నమెంటూ వద్దు. హంగ్ కావాలి. ఇటువంటి పరిస్థితి సమాజములో మూస పోత ఆలోచనలు కాక కొత్త ఆలోచనలు ఉత్పన్నమౌతున్నాయనడానికి ఉదాహరణ. ఉన్న అందరూ ఒకే రకంగా ఆలోచించి, ఒకే రకమైన పార్టీకో, ఆర్థిక పద్దతికో, జీవన పద్దతికో ముడివేసుకోవటం లేదు. అందరూ వేరు వేరుగా ఆలోచిస్తున్నారు కనుకనే వేరు వేరు భావజాలాలకు మద్దతు లభిస్తున్నది. ఉదాహరణకు ఎన్నికలను తీసుకుంటే, గెలిచినపార్టీకి, ఓడిన పార్టీకి ఈ మధ్య కాలంలో.ఓట్ల శాతంలో పెద్ద తేడా ఏమీ ఉండటం లేదు. థీసీస్ కి ఎంత బలం ఉంటున్నదో యాంటీ థీసీస్ కి కూడా దాదాపు అంతే బలం ఉంటున్నది. ఇది శుభ పరిణామమా కాదా అన్నది కాలమే తేల్చాలి. అయినా అందరూ ఒకేలా ఆలోచించాలి అనుకోవడంలో ఉండే లాజిక్ నిజానికంటూ ఏమీ లేదు. అందరూ ఒకేరకంగా ఆలోచించాలనుకోవటం పూర్తిగా ఇల్లాజికల్ అంశం. మనిషి ఒకపుడు ఒక రకంగా ఆలోచించి, ఆ తరువాత పూర్తిగా దానికి భిన్నంగా ఆలోచించటం మొదలు పెట్టినపుడే, ఈ రెండింటి సగటును ఆధారంగా చేసుకుని మధ్యే మార్గానికి రాగలుగుతాడు. మధ్యే మార్గం రెండు విభిన్న అంశాలు ఒకదానితరువాత ఒకటిగా పరిగణలోకి ఒచ్చినపుడే సాధ్యం అవుతుంది తప్ప, ఒక అంశం ఆధారంగా మధ్యే మార్గం అనేది రాదు. కాపిటలిజం ఒక చివర ఉన్నపుడు, సోషలిజం దానికి వ్యతిరేకంగా ఒచ్చినపుడే, ఆ తరువాత లిబెరల్ సోషలిజం అనేది వస్తుంది తప్ప, కాపిటలిజం తరువాత డైరెక్టుగా లిబెరల్ సోషలిజం ఉత్పన్నం కాదు. ఆ విధంగా చూసుకుంటే మానవ సమాజం అటువంటి విభిన్న ధృవాలను చూసి వచ్చి, ఇపుడు  మధ్యే మార్గాలను అన్వేషించే పనిలో పడిపోయిందనుకుంటాను.

ఆనందాన్వేషణలో మనిషికి ఎంత జ్ఞానమవసరం, ఎంత అజ్ఞానమవసరమో మనం ఆలోచించుకోవాలి. అజ్ఞానమొక వరం అన్నారొకప్పుడు. నిజంగానే అజ్ఞానం వరమా?. అలాగే జ్ఞానం తోటే మోక్షమన్నారు. జ్ఞానం తోటే ఆనందమన్నారు. ఈ రెంటిలో సత్యం ఏది?. ఇక్కడ జ్ఞానమంటే వారి ఉద్దేశం పారమార్థిక జ్ఞానం అయ్యుండొచ్చు.  లౌకిక జ్ఞానం కాకపోయి ఉండవచ్చు. కానీ జ్ఞానం పేరుతో ఈ రోజు మనం పొందుతున్నదంతా లౌకిక జ్ఞానమే. పారమార్థిక జ్ఞానం అంటూ ఒకటి ఉన్నదా. డోగ్మాటిక్ వాదనలు ఎన్నో మాదంటే మాదే అసలైన పారమార్థిక జ్ఞానాలని గొప్పలు చెప్పుకునే అవకాశం ఎప్పటికీ ఉండనే ఉంటుంది. అయితే తెలుసుకున్నదంతా జ్ఞానమేనా?. తెలుసుకున్న దానిలో జ్ఞానమేది అజ్ఞానమేదని తెలుసుకోవడం కూడా జ్ఞానమే. కానీ ప్రాగ్మాటిక్ స్పందనలు నశించి, డోగ్మాటిక్ భావనలు స్థిరీకరించబడిన తరువాత, తెలుసుకున్నదంతా మహా జ్ఞానమనే అజ్ఞానంలోకి పడిపోతుంటాం. మానవుడి ఆధునిక జీవనం, తెలుసుకోవడమనే ఒక ప్రక్రియను విపరీతమైన స్థాయిలోకి తీసుకుని పోయింది. ఏ స్థాయి అంటే, ఈ ప్రపంచంలో ఏ విషయాన్నయినా గూగుల్ లో మీటలు నొక్కి తెలుసుకునేటంతగా. ఉదాహరణకు ఈ మధ్య టిఫిన్ బాక్స్ బాంబులు పేల్చి కొంత మంది మరణానికి కారణమైన వాడు, టిఫిన్ బాక్స్ బాంబును ఎలా తయారు చేయాలనే విషయాన్ని గూగుల్ లో చూసి నేర్చుకున్నాడట. ఇది కూడా జ్ఞానమే కదా..? ఇపుడు దీన్ని కూడా జ్ఞానం కిందకే పరిగణించాలా?. తెలుసుకున్నదంతా జ్ఞానం అనటానికి వీల్లేదు. మానవ సమాజానికి కించిత్తూ  ఉపయోగపడని విషయ సేకరణ అసలు జ్ఞానం కిందకు రాదు. అసలది అజ్ఞానం కూడా కాదు. ఆధునిక మానవుడు జ్ఞానాన్ని సమకూర్చుకుంటున్నాననే భావనలో కేవలం విషయ సేకరణ, విషయ అవగాహన చేసుకుంటున్నాడు. అద౦తా కూడా అతనికిగానీ, మానవ సమాజానికి గానీ ఉపయోగపడే అవకాశమే లేని విషయ సంగ్రహం మాత్రమే.

మతాల డోగ్మాలలో కూడా ఇంటర్ రిలీజియస్ డోగ్మాలన్నింటినీ కంఠస్థం చేసి తమ మతానికనుకూలంగా, తమ మతాన్ని ఎక్కువ చేసుకుని చెప్పుకునే విధానం కూడా ఈ మధ్య పెరిగింది. గౌరవనీయులు డాక్టర్ జాకీర్ నాయక్ ఆధునిక మానవ సమాజం తయారు చేసుకున్న డోగ్మాటిక్ గ్లోసరీ రీడర్ గా మనముందుకొచ్చాడు. అతడి అపార పాండిత్యమంతా జ్ఞానం అనబడదు. పాండిత్యమనే అనబడుతుంది. అదేదీ అతనికిగానీ, సమాజానికిగానీ ఉపయోగపడే అవకాశం లేని విషయ సంగ్రహణ. "నిన్ను తెలుసుకో గలిగిన ఆ కొద్ది పాటి జ్ఞానమే నాకివ్వు, అది చాలు నాకు" అని రవీంద్రుడు భగవంతుడిని వేడుకుంటాడు, గీతాంజలిలో. ఆ కొద్ది పాటి జ్ఞానమైతే సరిపోతుంది నిజానికి మనిషికి. ఆనందంగా ఉండటానికి ఏమంత జ్ఞానమవసరమని?. శుష్క పాండిత్యం ఆనందమౌతుందా?. లేక మెదడు మీద అనవసర భారమౌతుందా?. మనిషి ఎన్నిటినో నేర్చుకుంటాడు తన జీవిత ప్రయాణంలో..కానీ ఎన్హింటినో అన్ లెర్న్ చేయాల్సిన అవసరముందనే విషయం మరచిపోతుంటాడు. లెర్నింగ్ అండ్ అన్ లెర్నంగ్ జాగ్రత్తగా చేయవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది. తెలుసుకున్న జ్ఞానాన్ని తెలియని అజ్ఞానంగా మలచుకోవడం లేదా అనవసర జ్ఞానాన్ని తొలగించుకోవడం నిజంగా సాధ్యమేనా? సాధ్యమయే అవకాశం ఎప్పటికీ ఉంటుంది. మధ్యే మార్గమేదో ఒకటి ఉండిండాలి. ఏ విషయం తెలుసుకోవాలి, ఏది తెలుసుకుని వదిలేయాలి, లేదా ఏది అసలు తెలుసుకోనే కూడదు అనేది ముందుగా తెలుసుకోవాలి.

ది విలేజ్ అని ఒక హాలీవుడ్ సినిమా ఉంది. నైట్. జీ. శ్యామలన్ అనే భారతీయ సంతతికి చెందిన హాలీవుడ్  దర్శకుడు ఉన్నాడు. అతడు తీసిన సినిమాలలో ది విలేజ్ అనే సినిమా కూడా ఒకటి. శ్యామలన్ పేరు వినగానే మనం భారతీయులుగా ఆహా మనవాడేనోయ్ అనుకుంటామేమోగానీ, హాలీవుడ్ క్రిటిక్స్ అతడి సినిమాల్ని టిపికల్ న్యూ ఏజ్ క్రాప్ కింద కొట్టి పాడేస్తారు. "న్యూ ఏజ్ రిలీజియన్" అని పశ్చిమ దేశాల్లో ఒక కొత్త ప్రచ్ఛన్న మతమొకటి మొదలయింది. ఇది అన్నీగాకపోయినా కొన్ని మతాల కలగాపులగంలాగా ఉంటుంది. ప్రాణిక్ హీలింగ్లూ, ఆస్ట్రల్ ట్రావెల్లూ, UFO లూ, ఇల్ల్యుమినాటిలూ ఇత్యాదులన్నీ వీరి సృష్టే. లోబ్సాంగ్ రాంపా, దీపక్ చోప్రా ఇత్యాది వారంతా కూడా దీనికి పుట్టినవారే. ఆ విషయాన్ని పక్కన పెడితే అటువంటి విషయాల్ని తీసుకుని సినిమాలు తీసేస్తాడని ప్రతీతి. ది విలేజ్ సినిమాకూడా అటువంటి ఒక న్యూ ఏజ్ క్రాప్ అయినా, దీనిలో గమనించదగ్గ విషయాలున్నాయి. కథ విషయానికి వస్తే, పంతొమ్మిదవ శతాబ్దానికి చెందిన ఒక గ్రామం. ఆ గ్రామానికో అధికారి. గ్రామానికి చుట్టూ దట్టమైన అడవి ఉంటుంది. ఆ అడవిలో రాక్షసులుంటాయని గ్రామస్థులు నమ్ముతారు. ఎవరైనా గ్రామం వదిలి బయటకి వెల్లాలి అంటే అడవిని దాటాలి, కానీ అడవిలోకి ఎవరు ప్రవేశిస్తే రాక్షసులు వారిని చంపేస్తారు. అక్కడ గ్రామస్థులకూ రాక్షసులకూ ఒక ఒప్పందం ఏర్పడి ఉంటుంది. మీరు మా అడవిలోకి రాకండి, మేము మీ గ్రామంలోకి రాము అని. ఈ ఒప్పందం ప్రకారం గ్రామం తన పరిధిలో తాను సంతోషంగా ఉంటుంది. గ్రామ పెద్ద కూతురు పుట్టుగుడ్డి. కానీ లూసియస్ అనే ఒకతన్ని ప్రేమిస్తుంది. ఇంతలో ఈ ప్రేమ విషయాన్ని తెలుసుకున్న గ్రామంలోని ఒక పిచ్చోడు, లూసీయస్ ని కత్తితో పొడిచేస్తాడు. కత్తి పోటు  గాయాలకు ఇన్ఫెక్షన్ సోకి అనారోగ్యం పాలవుతాడు లూసియస్. హీరోయిన్ అతడిని ఎలాగయినా బతికించాలనుకుంటుంది. పక్కనున్న పట్నం వెల్లి మందులు కొనుక్కుని తెస్తే అతడు బతుకుతాడు. కానీ పట్నం వెళ్ళాలంటే అడవిని దాటాలి. అడవిలో రాక్షసుల బారిన పడకుండా పట్నం చేరడం జరగనిపని. ఏమి చేయాలో తోచని పరిస్థితుల్లో హీరోయిన్ తండ్రి, గ్రామ పెద్ద, ఆమెకొక సీక్రెట్ చెబుతాడు. నిజానికి సీక్రెట్ని రివీల్ చేస్తాడు. అసలు రాక్షసులుంటారనడం వొట్టి కట్టు కథ అని. నిజానికి గ్రామ పెద్ద ఒక బిలియనీర్. ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్.  అతడు కొంతమంది గ్రామ పెద్దల సహాయంతో ఈ రాక్షసులున్నారనే కట్టుకథను కల్పిస్తాడు. రాత్రులల్లో వాళ్లలోనే కొందరు రాక్షసులుగా వేషం కట్టి జనాలను భయభ్రాంతులుగా చేస్తుంటారు. కారణం ఏమంటే వారంతా కాపిటలిస్ట్ ప్రపంచం యొక్క డిగ్రేడేషన్, పతనాన్ని చూసి అనుభవించి ఉంటారు. ఆ ప్రపంచంలోకి అడుగు పెట్టబోయే తమ తరువాతి తరం వారు కూడా అలాగే పతనం చెందకూడదని, వారిని ఆ ప్రపంచం నుండి కాపాడుకోవాలని ఈ కట్టుకథ అల్లుతారు. నిజానికి గ్రామస్థులు ఇరవైయ్యో శతాబ్దం లో నివసిస్తూన్నా, పంతొమ్మిదో శతాబ్దం లొనే నివసిస్తున్నట్టు గ్రామస్థులని నమ్మిస్తారు.  కాపిటలిస్ట్ ప్రపంచం, ఓపెన్ ప్రపంచం, అందులో ఒక వ్యక్తి యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుందో, ఎపుడు ఏ అపాయం ముంచుకొస్తుందో ఎవరూ చెప్పలేరు. కానీ వీళ్ళు క్రీయేట్ చేసిన ఈ గ్రామం ఒక మూసి ఉన్నప్రపంచం. ఇక్కడి వ్యక్తి యొక్క భవిష్యత్తంతా ఎలా ఉండబోతోందో ముందే స్పష్టంగా తెలుస్తుంది. ఏది అవసరమో ఏది అనవసరమో తెలుసుకున్న తెలివయిన ఆ గ్రామ పెద్దలు వారి పిల్లల్లోని అజ్ఞానాన్ని ఉన్నది ఉన్నట్టుగా కాపాడుకొనే ప్రయత్నం చేస్తారిక్కడ. ఇక్కడ గమనిస్తే, ఇగ్నోరాన్స్ అనేది మనిషికవసరం అంతేకాక అనవసర జ్ఞానం అనవసరం అని గ్రామ పెద్దలు అర్థం చేసుకున్నట్టు కనిపిస్తుంది. నిజానికి గ్రామం వారు భయపడే ఆ రాక్షసులు ఎవరోకాదు బయటి ప్రపంచంలో నివసించే కాపిటలిస్ట్ మనుషులే. దానిని సింబాలిక్ గా "అడవిలోని రాక్షసులు" అని చెబుతాడు దర్శకుడు. ఇక కథలలోకి వస్తే, ఆ అమ్మాయి మందులు తేవడం, అతడు బతకడమూ, ఈ ప్రక్రియలో గ్రామంలోని పిచ్చోడు చనిపోవడమూ, తద్వారా ఆ రాక్షసులు బలి తీసుకున్నారని నమ్మించటమూ జరిగిపోతాయి. బలి తీసుకున్నారని చెప్పడం ద్వారా, గ్రామస్థుల్లో ఉండే భయాన్ని మరలా రీ ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుందన్నమాట.   పిల్లల్లోని సహజమైన అజ్ఞానాన్ని, సహజమైన భయాన్ని కాపాడుకోవటం అవసరమా కాదా అనేదిపుడు మనం ఆలోచించాల్సిన విషయం. ఈ రోజు ఉన్న ఆధునిక జీవనం, జ్ఞానం పేరుతో, విజ్ఞానం పేరుతో పిల్లలకుండే ఈ సహజ గుణాల్ని అందిస్తున్నదా?. జ్ఞానాన్ని ఎక్కడ అందించాలి, ఎక్కడ అజ్ఞానంగానే ఉంచేయాలి అనేదిపుడు మనం అన్వేషించాలి. ముందే అనుకున్నట్టు, జ్ఞాన అజ్ఞానాలకు మధ్యే మార్గాన్నొకదాన్ని కనుక్కోవాలి.

Friday, 22 July 2016

ఆనందం - ఒక అన్వేషణ( part2)
----------------------------------------------

"బీదవాడిగా పుట్టడం తప్పుకాదు కానీ బీదవాడిగా చచ్చిపోవడం పెద్ద తప్పు" అని ఒక జగమెరిగిన కోట్ ఒకటి వుంటుంది. ఇదేదో "జన్మనాజయతే శూద్రః కర్మణా జాయతే ద్విజః" అన్నట్టు వుంటుంది. బీదవాడిగా పుట్టడం, శూద్రుడుగా పుట్టడం ఘోరతర విషయాలు కాకపోయినా బీదవాడిగా శూద్రుడిగా చావటం మహా పాతకం అన్నట్టు ఇవి చూపెడుతుంటాయి. ఇదంతా ఒక పోటీ తత్వాన్ని మనుషుల్లోకి దింపడానికి ఉపయోగ పడేవే. పుట్టిన వాడు ప్రతీ ఒక్కడూ సంపాదించాల్సిందే. సంపాదిస్తేనే జీవితం. ఐతే ఆ సంపాదన జీవితానికి సరిపడా సంపాదన కాదు. జీవితానికి సుఖాన్ని ఇచ్చేటంతటి సంపాదన. ఎక్కడ కూర్చుని స్విచ్ వేసినా పనులు జరిగిపోయేటంతటి సుఖం మనుషులకు కావాలి. అదిగో అపుడే సంపాదించినట్టు. ఒక మహా మేధావి సంపాదిస్తేనే అతడు మహా మేధావి. సంపాదించలేకపోతే అతడు మేధావే కాదు. అందుకే మేధావి అనిపించుకోవాలంటే మేధ వుంటే సరిపోదు, ఆ మేధతో అతడు అందరికన్నా ఎక్కువగా సంపాదించాలి. ఇతర సంపాదకులతో పోటీ పడాలి. "సరస్వతీ లక్ష్మి ఒక చోట మనలేరు" అని ఎవరన్నారో కానీ నిజమే అన్నారు. సంపాదించిన వారందరూ మేధావులు కాదనే విషయాన్ని ఇది తెలిపినా, సంపాదించాలంటే మేధావితనం పనికి రాదనే విషయం కూడా దాగి ఉంది. కానీ సమాజం అలా ఆలోచించదు. సంపాదించిన వాడు తప్పని సరి మేధావే అన్నది దాని నమ్మకం. అమెరికాలో అదే జరిగింది. డెబ్భైయవ దశకం నుండి వేరు వేరు కారణాల వల్ల కార్మికుల జీతాలు పెరగటం ఆగిపోయింది. అదే సమయంలో ఆధునిక టెక్నాలజీ వల్లనో, కార్మికుల డిమాండ్ కన్నా  సప్లై ఎక్కువగా కావడం వల్లనో ఉత్పాదన శక్తి కూడా పెరిగిపోయింది. దానితో అదనపు విలువ విపరీతంగా పెరిగిపోయింది. ఇంకేముంది,ఈ సామాజిక మార్పు వల్ల ఎందరో ధనవంతులయ్యారు. వారంతా తమ తమ వ్యాపార మేధావితనంతోటే ధనువంతులమయ్యామని చెప్పుకుంటున్నారు. వారికి సంబంధించిన వారి జీవిత విశేషాలకు సంబంధించిన వారి ఇష్టానిష్టాలకూ అభిరుచులకూ సంబంధించిన పుస్తకాలు కోకొల్లలుగా వచ్చేశాయి. ఇదంతా వారి ఎంటర్ప్రీనియర్ జీనియస్ వల్లే వచ్చేసిందని ప్రపంచం నమ్మేసింది. సంపాదించాలంటే మేధావితనం కన్నా సామాజిక పరిస్థితులు అనుకూలించాలి అనే అసలు నిజం ఎవ్వరూ చెప్పరు. ఇంకేముంది, బీదవాడిగాపుట్టడం తప్పుకాదు, బీదవాడిగా చనిపోవడం తప్పని చెప్పే మహత్తర సందేశాలు ఒచ్చేశాయి. హౌ టు బికం రిచ్, రిచ్ డాడ్ పూర్ డాడ్, సెవెన్ హాబిట్స్ ఆఫ్ గ్రేట్ పర్సన్స్, వంటి పుస్తకాలకు గిరాకీ పెరిగింది. అంన్నింటిలో ఒకటే సారాంశం, ఎక్కువ సంపాదించటం అంటే ఎక్కువ తెలివి తేటలు కలిగి ఉండటం అని నమ్మించటానికే. ఎక్కువ సంపాదిస్తే ఎక్కువ హాపీనెస్, ఎక్కువ ఆనందం.

ఊపిరని ఈ మధ్య ఒక సినిమా వచ్చింది. డబ్బుతెచ్చే సాహసం వల్ల వచ్చిన ఆవేశంతో కాళ్ళు చేతులు చచ్చుబడిన ఒక ధనవంతుడి కథ. ఒక పెయింటింగ్ గాలరీకి వెళ్ళి, ఒక అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్ ను చూస్తూ కూర్చోవటం అతడికి ఆనందం కలిగించే విషయమని దర్శకుడు మనల్ని మభ్య పెట్టే ప్రయత్నం చేస్తాడు. జీవితంలో లేని అబ్స్ట్రాక్ట్ నెస్ ని ఇష్ట పడటంలోనే రియాలిటీని ఎదుర్కొనలేని ఒక పలాయనత్వం, ఊహల్లో విహరించే తత్వం మనకు అర్థమవుతుంటుంది. ఆ పెయింటింగ్ ధర ఇరవై లక్షలు అని చెప్పగానే ప్యాక్ చేయమని ఆర్డర్ ఇచ్చేయటం, పనికిమాలిన అర్థంలేని దానికోసం డబ్బుని మంచి నీళ్ల ప్రాయంలాగా ఖర్చుచేయటం, పైగా ఇదంతా అతడి ఉదార స్వభావంగానో గొప్పదనంలాగానో మనం భ్రమ పడటం, మనకు ఆనందం అంటే ఏమిటో నేర్పించాలనుకునే తెంపరితనం వల్ల వచ్చినదే. విపరీతంగా డబ్బు సంపాదించేసుకోవాలనే విపరీత పోటీ తత్వం, ప్రపంచంలో కర్మేంద్రియాలు కోల్పోయి, జ్ఞానేంద్రియాలు కూడా పనిచేయని ఒక ధనవంతుడిలా మనకు హీరో కనిపిస్తాడిందులో. అతడు నేటి సమాజానికి ఆదర్శ ప్రాయుడే..అతడిలా అర్థంకాని విషయాల్లో ఆనందం ఉందని భ్రమ పడే వారు, నిజ జీవితాలకి భిన్నంగా భ్రమ జీవితాల్లో జీవించేవారే ప్రస్తుత సమాజంలో ఎక్కువ. అందుకే దశేంద్రియాలూ పని చేయని వాడైనా మనకు నచ్చుతాడు. అయితే ఆయన జీవితంలోని డొల్లతనాన్ని కూడా దర్శకుడు చూపించే ప్రయత్నం చేస్తాడు. మీటలు నొక్కితే సుఖం లభిస్తుందేమో కానీ ఆనందం కాదన్నది చూపే ప్రయత్నం చేస్తాడు. ఆనందం అనేది కలిసి జీవించడం,లో విభిన్నంగా జీవించడంలో, కుటుంబంలో ఉంటుందనే సందేశంతో కథ ముగియటం, దీని కంతటికీ జైలు నుండి వచ్చిన ఒక అనామకుడు కారణం కావడం ఎట్సెట్రా అంతా కథకు ఎగస్ట్రా. పోటీ తత్వం కళ ను ఏ విధంగా చూస్తుంది అనే కోణం మనమిక్కడ ఆలోచించతగ్గది. పెయింటింగ్ ని అంత ధర పెట్టి ఇరవై లక్షలకు కొనడం, కేవలం పోటీ కోసమే తప్ప, ఎవరి దగ్గరా లేనిది తన దగ్గర ఉందనో, దానికి ఇంత ఖర్చు పెట్టానని చెప్పటం కోసమో తప్ప నిజంగా కళ మీద అభిరుచితోనే అని చెప్పటానికి ఉండదు. ధనవంతుల ఇండ్లల్లో పుస్తకాల పరిస్థితి కూడా ఇలాగే ఉంటుందట. ఫలానా గొప్ప పుస్తకం కొన్నట్టు చదువుతున్నట్టు కనిపించటం అన్నమాట. టేబుల్ మీద ఎప్పుడు పోయినా ఆ పుస్తకం చెక్కు చెదరకుండా మనకు కనిపిస్తున్నా, పేపరైనా నలగని పుస్తకాన్ని అసాంతం నమిలి మింగేసామన్నంతగా బిల్డప్ కూడా మనకు కనిపిస్తుంటుంది. అభిరుచి ఉందని చూపించుకునే అభిరుచి అన్నమాట.

ఆమధ్య హారీ పోట్టర్ సిరీస్ లు వచ్చేవి. ఇదే చివరి సిరీస్ అని ప్రకటన వెలువడ్డదట, ఆ పుస్తకాన్ని అర్జంటుగా కొనేయాలని ఉన్నత వర్గపు ఆడవారు పిల్లలూ లైన్లో నిలబడి హంగామా చేస్తున్నపుడు ఆ పుస్తకాల షాపులో నేనూ ఉన్నాను. చిరిగి పోయిన ప్యాంటుతో, షార్టుతో, టీ షర్టుతో జడలు  విరబోసుకుని నిలబడిన పదో తరగతి వయసు ఆడ పిల్లల్ని దాదాపు అదే వేష ధారణలో ఉన్న వారి తల్లులనీ చూసి షావుకార్లు కాదని ఎవరూ అనలేరు. మధ్య తరగతి పిల్లలు, వారి తల్లిదండ్రులు కూడా ఆషాపులో ఆ సమయంలో ఉండిన్నారు. వారంతా చందమామ, బాలానందం వంటి పుస్తకాలని వెతుక్కోవడంలో బిజీగా కనిపించారు, చూడీదార్లు చీరలు ఇత్యాది వస్త్రధారణలతో. ఆధునికతంతా మా లోనే ఉందన్నట్టు హారీ పోట్టర్ చదివే పిల్లలంతా ఇంగ్లీషులోనే సంభాషించుకుంటున్నారు. నిజజీవితంలో లేని మాయమంత్రాల్ని చదివి ఆనంద పడిపోతున్నారా ధనవంతులు అనిపించింది. నిజంగా చదువుతుంటారని నాకు నమ్మకం లేదు. చదివినట్టుగా కనిపించటం అనే అభిరుచి ఉన్నవారు, ఎట్టి పరిస్థితుల్లో చదవరు అనేది నా ప్రగాఢ నమ్మకం. ఇది కూడా ఆనందంగా కనిపించటం వంటిదే కానీ ఆనందంగా ఉన్నట్టు కాదు. పుస్తకం కొనటానికి, ఈ విధంగా రెండు కారణాలుంటాయి. ఒకటి చదివి ఆనందించటం, రెండు కొన్నాను, చదివాను అని చెప్పుకుని ఆనందించటం. సమాజంలో రిచ్ నెస్, సుఖలాలసత పెరిగే కొద్దీ, మేధతో పనిచేయవలసిన కళ లు నిరాదరణకు గురవుతాయేమో. మంచి సాహిత్యాభిలాష అనేది మన పూర్వీకుల్లో ఉండే సర్వ సాధారణ అభిరుచి ఇపుడు కేవలం అభిరుచికోసమే అనిచెప్పుకునేటందుకే మిగిలిపోయింది. పోటీ తత్వం ఫరిఢవిల్లిన సమాజంలో జ్ఞానేంద్రియాల సహజ గుణం క్షీణిస్తూ పోయి, మనసు కేవలం పోటీని తట్టుకునే విధంగానే మార్చబడుతుంటుంది. అందుకే సాహిత్యం అందించే ఆనందం, సాహిత్యం చదవుతాడని చెప్పుకునే అభిరుచిలోని సుఖంగా మార్చబడుతుంది.

అంటే, పోటీ తత్వం అనేది మనిషి చేసే పనినే కాక, అతడి ఖాళీ సమయాల్లోని అభిరుచుల్ని కూడా ప్రభావితం చేస్తుంటుందని అర్థం అవుతుంది. పని గంటలకీ, ఖాళీ సమయాలకు మధ్య జరిగే ప్రయాణం కూడా కలుషితంగానే ఉంటుంది. ఆఫీసు నుండి ఇంటికి వాహనంలో వెళ్ళే ఘట్టమే తీసుకుందాం. నరాలు బిర్ర బిగుసుకుపోయి వాహనాన్ని నడిపేస్తుంటాం. అందరి దృష్టీ ఎపుడెపుడు ఈ ట్రాఫిక్నంతా దాటేసుకుని ఇంటిలో పోయి పడదామా అనే ఉంటుంది. సిగ్నల్ దగ్గర ఎర్ర లైట్ పడ్డప్పుడు పక్కనున్న వాడిని కాసేపు గమనిస్తే చాలు, వాడి జీవితంలో అసలు ఆనందమనేది ఉందా అని అనుమానం వస్తుంటుంది. స్టీరింగును పట్టుకునే విధానంలోనే వాడి స్ట్రెస్ అంతా కనబడుతుంటుంది. ఎర్ర లైట్ నుండి పచ్చ లైట్ పడగానే సెకండ్లలో వాడి వాహనం ముందుకు నడవకపోతే వాడికి విపరీతంగా కోపం వచ్చేస్తుంది. ముందు ఉన్న వాహనం ఒక సెకండ్ లేట్ గా మొదలైనా, అప్పటికి పది సార్లు హారన్ గుయ్యని మోగించటం అయుంటుంది. పొరపాటున ఆ సమయంలో అనామకుడెవరైనా అడ్డు వచ్చాడంటే వీడి నాలుక    ఇక పాము నాలుకే...పదాల్లో విషం గక్కాల్సిందే..లేకపోతే ఆ స్ట్రెస్ కిందకు దిగే మార్గమేదీ లేదు. వేగం నలభైలో పోయినా, అరవైలో పోయినా తరువాతి సిగ్నల్ దగ్గర ఆగటంలో ఏ మాత్రం తేడా ఉండదు. సిటీలో అరవైలో పోయిన వాడూ, నలభైలో పోయినవాడూ తరువాతి సిగ్నల్ దగ్గర తప్పక కలుసుకుంటారు. అనుమానం ఏమీ అక్కరలేదు. అరవైని మించి పోయే అవకాశం ఈ హెవీ ట్రాఫిక్ కలిగించదు. అయినా అరవైలో..వీలైతే ఎనభైలో పోయైనా ఇంటికి తొందరగా చేరుకోవాలనే ఉబలాటం కనిపిస్తూ ఉంటుంది. డ్రైవింగ్ చేస్తూ పక్కకు తిరిగి చూస్తే ఆక్సిడెంట్ జరుగుతుందని తెలుసు కాబట్టి, నరాలు, గుండె, సకల జీవ కోశాలూ, ముందుకు చూస్తూ జాగ్రత్తగా నడిపేయటం మనకు కనిపిస్తుంటుంది. నవ్వుతూ  మాట్లాడుకుంటూనో..పాటలు వినుకుంటూనో ఎంజాయ్ చేసేవారిని ఎప్పుడోకానీ చూడము. అంటే ఇక్కడ మాట్లాడుతూ  నడపటం అంటే ఆక్సిడెంట్ చేసేయ్యటమే అనే భ్రమ మరింత ఒత్తిడిని కలిగిస్తూ ఉంటుంది. డ్రైవింగ్ చేసే వారికంటే పక్కనున్న వారి పరిస్థితి మరీ దారుణం. వారు కూడా డ్రైవింగ్ చేసే వారిలాగే ఉద్రేకంతో ఉంటారు. వారికైనా ఇంటికెప్పుడెప్పుడు వెళ్లాలా అనే కదా ఉంటుంది. వారు కూడా రోడ్ మీద జరిగే జగన్నాటకాన్ని చూస్తున్నట్టయితే అగ్గికి ఆజ్యం పోసినట్టే ఉంటుంది పరిస్థితి. ఇద్దరూ కలిసి ఇపుడంటే ఇపుడు ఎగిరిపోతాం అన్నట్టుగా కనిపిస్తుంటారు. ఒకవేళ వారు ఈ జగన్నాటకాన్ని చూడకపోతే భయంకరమైన విసుగుదలను ప్రదర్శిస్తూ ఉంటారు. నడిపేవాడికి ఖాళీ సమయంలో నడపడమనే వ్యాపకమైనా ఉంది. అది ఆ పక్కనున్న వాడికి లేదుగా. చాలా మటుకు ఆక్సిడెంట్లు ఒంటరిగా వెళ్ళినప్పటికన్నా పక్కన ఇంకొకరు కూచున్నపుడే అవుతూ ౦డటం గమనించతగ్గ విషయం.

TO be contunued...
ఆనందం- ఒక అన్వేషణ.  (Part1)
___________________________

మన పూర్వీకుల కంటే మనం ఎక్కువ ఆనందంగా ఉన్నామా? అనేది ఇపుడు మనం వేసుకోవలసిన ప్రాథమిక ప్రశ్న. ఆధునిక టెక్నాలజీ మనకు సుఖాన్ని ఇచ్చిందా, సుఖంతో పాటు ఆనందాన్ని కూడా ఇస్తోందా?. సుఖమూ ఆనందమూ రెండూ ఒకటేనా లేక రెండూ వేరు వేరా అన్నది మనం చర్చించవలసి ఉంటుంది. ఒకప్పటి జీవితంలో వ్యవసాయమే ప్రధాన అంశం కనుక రోజులో సగ భాగం, సంవత్సరంలో సగ భాగం, పని లేకుండా ఖాళీ సమయం కావలసినంతగా ఉండేది. మనిషి ఈ ఖాళీ సమయాన్ని ఆనందంగా సుఖంగా గడిపేవాడు. కుటుంబ సభ్యులతో, ప్రకృతితో అవినాభావ సంబంధాన్ని నెలకొల్పుకోవడానికి వీలైనంత సమయం ఈ విధంగా చిక్కేది. ఒక పాట పాడినా, విన్నా అందులో ఆనందమే ప్రవహించేది. తనని తరుముకుచ్చే అత్యవసర విషయాలేవీ జీవితంలో అతడికప్పుడు ఏవీ లేవు కదా. చదువుకోవటమో, రాసుకోవటమో, పాడుకోవటమో, ఏదైనాకానీ, చాలా సుఖంగా ఏ తొందరా లేకుండా చేసుకునేవాడు. అవేవీ చేయాలని లేకపోతే అన్నీ పక్కకు పాడేసి హాయిగా పడుకుని కంటినిండా నిద్రపోయే వాడు. పారిశ్రామిక విప్లవం వచ్చాక, వ్యవసాయ కార్మికుడు ఫ్యాక్టరీ కార్మికుడిలా మారిపోయాడు. ఇపుడు వారానికి ఆరు రోజులూ పనే. ఏడో రోజు తప్పని సరిగా  దొరికిన ఖాళీ సమయాన్ని, తప్పని సరిగా ఏదో ఒక 'ఆనందం' అనబడుదానితో నింపుకోవాల్సిన అవసరం వచ్చి పడింది. ఆరు రోజుల పని వత్తిడి, అలసట ఆ ఖాళీ సమయంలో తప్పక తీర్చేసుకోవాలి, లేకపోతే మరుసటి ఆరు రోజులకు కావలసిన శక్తి ఎక్కడి నుండి వస్తుంది తనకు?. కుటుంబ సభ్యులతో కలిసి ఉండటమైనా, పాడుకోవడమైనా తప్పని సరియై చేయాల్సిందే. ఆరోజు చేయకపోతే,మరలా ఆరు రోజుల వరకూ అవకాశమే రాదు.

పారిశ్రామిక విప్లవం ముగిసి, ఆధునిక టెక్నాలజీ విప్లవం వచ్చేశాక, పారిశ్రామిక కార్మికుడిపుడు వైట్ కాలర్ కార్మికుడయ్యాడు. ఇపుడు రోజులో ఎనిమిది గంటల పని కాదు, చేయాలనుకుంటే ఇరవై నాలుగు గంటలూ పని దొరుకుతుంది. ప్రపంచంలో ఏ దేశం కోసమైనా పని చేయగల గ్లోబల్ మల్టీ పర్పస్ కార్మికుడిని ఆధునిక టెక్నాలజీ తయారు చేసుకుంది. ఇపుడు ఆనందం అనే పదం అర్థమే మారిపోయింది. సుఖమనేది ఆనందానికి పర్యాయపదంలా మారిపోయింది. సమయం దొరికినపుడు సుఖంగా ఉండాలి, ఆనందం లేకున్నా పరువాలేదు. పైగా సుఖాన్ని వెల కట్టి కొనుక్కోవచ్చు కూడా. జిడ్డు కృష్ణమూర్తిని ఒకసారి భవిష్యత్తు ఎలా ఉండబోతోంది అని ఎవరో అడిగారట. భవిష్యత్తంతా మానవుడిని సుఖంగా ఉంచటమెలాగా అనే విషయం మీదనే కృషి చేస్తుంటుందని చెప్పాడంట. ఇపుడు మనకున్న టెక్నాలజీ అంతా మనిషిని సుఖంగా ఉంచటానికే పనిచేస్తోంది కదా. సుఖాన్ని అందించే శాస్త్రమే టెక్నాలజీ అని మనం నిర్వచించుకోవచ్చు. అయితే అది ఆనందం మాత్రం కాదు. కేవలం సుఖమే.

ఆధునిక టెక్నాలజీ ప్రధానంగా అందజేసే స్ట్రెస్ కి మందుగా సుఖాన్ని కనుక్కున్నాడు మానవుడు. స్ట్రెస్ ఏ రూపంలో ఉంటుంది?. అవేర్నెస్ రూపంలో స్ట్రెస్ అనేది అందించబడుతుంది. ఎన్నో విషయాల గురించి, ఎందరో మనుషుల గురించి అవసరం లేకున్నా మనకు అవేర్నెస్ ని కలగజేస్తుంది ఈ ఆధునిక జీవితం. ఉదాహరణకు అలసిపోయి ఇంటికి వచ్చినపుడు 'చల్లని నీళ్లు తాగితే సుఖం' అని ఒక నమ్మకాన్ని మనసులో మొదట కలిగించటం, ఆ చల్లని నీళ్ళు ఫ్రిజ్ వాటర్ అయ్యుండటం అనేది తరువాత అందించే అడిషనల్ సుఖం. ఇపుడు ఫ్రిజ్ ఉండాలనుకోవటం, చల్లని నీరు తాగాలనుకోవటం ఒక అవేర్నెస్. మన పూర్వీకులకు లేని మనకు మాత్రమే కలిగిన కొత్త అవేర్నెస్. ఫ్రిజ్ నీళ్లు తాగక పోవటం వలన మన పూర్వీకులు మనంత ఆనందాన్ని అనుభవించారా లేదా అన్నదే ఇపుడు ప్రశ్న. ఆనందించి ఉండవచ్చు లేదా లేకపోయి వుండవచ్చు, కానీ ఫ్రిజ్ కొనుక్కోవాలి అనుకునే ఒత్తిడి అయితే వారికి లేదు. ఈ ఒత్తిడి మనకు ఫ్రిజ్ కొనుక్కోవాలనుకునే అవేర్నెస్ వల్లనే వచ్చింది. ఇటువంటి ఎన్నో నూతన అవేర్నెస్ లు రావటం, అవన్నీ మనకిపుడు మినిమం లక్జరీస్ అయిపోవటం జరిగింది. ఈ మినిమం లక్జరీస్ లేకపోవడం నరకంతో సమానమనే అవగాహన సర్వ సాధారణం చేయబడింది.

"మా వాడు ఇంట్లో అన్నీ కొనేసి పెట్టాడు మాకు ఏదీ తక్కువ చేయలేదు" అని సంతోషపడే తల్లిదండ్రులు ఉంటారు. ముందు వాళ్లబ్బాయి ఇంట్లో తమతో ఉంటున్నాడా అనేది ఇపుడు అనవసరం. ఆనందం అవసరం లేదిపుడు, సుఖం ఉంటే చాలు. "మావాడిది మంచి సంపాదన, చాలా కష్టపడి సంపాదిస్తాడు. రోజుకి ఇరవై గంటలు పని చేస్తాడు". రోజుకు ఇరవై గంటలు పని చేయటం ఇపుడు మనకొక గొప్ప ఆదర్శం. రోజులో అధికభాగం పనికే సరిపోతే, ఆ సదరు వ్యక్తి జీవితంలో ఆనందం అనేది ఎక్కడున్నట్లు? ఎప్పుడున్నట్లు?. ఉన్న ఖాళీ సమయంలో నిద్రపోతే జీవితంలో ఆనందం దొరికేసినట్టా?. ఇలా యంత్ర ప్రాయంలా పని చేసే మనిషికి తృప్తినిచ్చేది అతడి సంపాదనే. పని, అందుకు తగ్గ సంపాదనా, ఒకదానికొకటి తృప్తిపడిపోతాయి. ఎపుడైతే తృప్తి కొంతకాలం నిలుస్తుందో అపుడు బోర్ డం లేదా విసుగుదల కూడా వచ్చి చేరుతుంది. ఆ విసుగుదలను పోగొట్టుకోవడానికి మనసు తాత్కాలికంగా ఉవ్విళ్ళూరుతుంది. ఒక సినిమాకి పోవటమో, షాపింగ్ చేయటమో ఆ విసుగుదలను తగ్గించేస్తుంది. ఆ తాత్కాలిక సుఖం తెచ్చిన ఖర్చు మళ్లీ మనిషి పని చేయటానికి ఊతాన్నిస్తుంది. మరలా ఇంకో సైకిల్ మొదలవుతుంది. పని, అందుకు తగ్గ జీతం, తృప్తి, అది కొనసాగితే ఒచ్చే విసుగుదల, తాత్కాలిక ఉబలాటం, విసుగుదల తగ్గటం, పనికి సమాయత్తమవటం. ఇదంతా ఒక సైకిల్. ఈ సైకిల్ మొత్తంలో ఆనందం అనేది ఎక్కడా కానిపించదు. సంపాదనతో ఒచ్చే తృప్తి, ఆనందం ఒకటి కాదు. పనికి తగ్గ ఫలితం పొందటం తృప్తే తప్పిస్తే ఆనందం కాదు. ఎందుకంటే తృప్తి తప్పని సరిగా విసుగుదలను కలిగిస్తుంది. అలాగే, విసుగుదల తగ్గించుకోవటంలోని తాత్కాలిక ఉబలాటం కూడా, ఆనందం కాదు. ఈ సైకిల్ కి తగ్గట్టుగా ఆఫీస్ పని వేళలు అమర్చబడి ఉంటాయి. ఆఫీసు యాజమాన్యం కావాలంటే 'కబాలి' సినిమాకు ఒక రోజు సెలవు కూడా ఇవ్వగలదు. కేవలం ఈ వైట్ కాలర్ ఉద్యోగుల కోసమే సినిమాలు తీసి గట్టెక్కిన సినిమా నిర్మాతలూ లేకపోలేదు. తాత్కాలిక ఉబలాటాన్ని పెంచి పోషించటానికి ట్రయలర్లు, ఫస్ట్ లుక్ ఫోటోలు, ఆడియో రిలీజ్ ఫంక్షన్స్ మున్నగునవి. ఇదంతా టెక్నాలజీ అందించిన అవేర్నెస్. అందుకు తగ్గ స్ట్రెస్. మొదటి ఆటకు టికెట్టు దొరక్క పోతే, సచిన్ అవుటయి పోతే ఆత్మహత్యలు చేసుకూనే వారున్నారంటే అవేర్నెస్ తెచ్చిన స్ట్రెస్ ఎటువంటిదో అర్థం చేసుకొవచ్చు. ఆ ఒక్క రోజులో వారు జీవితంలోని ఎంతటి విసుగుదలను సున్నా స్థాయికి తేవాలని అనుకున్నారో మనం అంచనా వేయవచ్చు. వారాశించినంత స్థాయిలో విసుగుదల తగ్గలేదు, అందుకే స్ట్రెస్, ఫలితం సులువైన మార్గం, ఆత్మహత్య. ఇపుడున్న ట్రెండు ప్రకారం హత్యలూ ఆత్మహత్యలూ ఎక్కువగా చదువుకుని వైట్ కాలర్ ఉద్యోగాలు చేస్తున్నవారివే. మరి వారంతా సుఖంగా లేరా?. ఉన్నారు. ఆనందమే లేదు.

To be continued...

Tuesday, 19 July 2016

కవిత్వ సందర్భం23 yakoob

హమ్ బుల్ బులే హై ఐస్ కీ...
----------------------------------------

'తాము సహితం దేశ భక్తులమే' అని చెప్పుకోవలసిన పరిస్థితి వచ్చినపుడు, అది కూడా 'తాము మాత్రమే దేశ భక్తులమ'ని విర్రవీగేవారికి చెప్పుకోవాల్సి వచ్చినపుడు, కేవలం చెప్పినంత మాత్రాన నమ్మకాలు కుదిరిపోతాయనుకోలేం. ఢంకా బజాయించినట్టుగా చెప్పాలి, అంటే ఇంకేదో చేయాలి. తమ గుండెలు చీల్చి, తమ గుండెల్లో గూడుకట్టుకున్న భారతదేశాన్ని చూపించే ప్రయత్నం చేస్తేగాని తమ దేశభక్తి ఋజువుకానట్టి పరిస్థితులు దాపురించినపుడు, అయినదానికీ కానిదానికీ తామూ దేశభక్తులమే అని చెప్పాల్సి వచ్చినపుడు విసిగి పోయి, మూగవోయి ఇక మాట్లాడ్డం వృథా అని ఈ విషయమై మాట్లాడటం ఆపేసిన ఈ దేశంలోని తన మైనారిటీ వర్గం వారిని చూసిన కవి, "నేను మాట్లాడటం మొదలెట్టాలని నిర్ణయించుకున్నా"నంటూ కవిత్వం వినిపిస్తున్నాడు. ఈ దేశపు మెజారిటీ వర్గం వారు తన గుండెలోతుల్లో ఉన్న దేశ భక్తిని గుర్తిస్తారేమోనని ఆశ పడుతున్నాడు. ఎంతటి నిర్హేతుకమైన పరిస్థితుల్లో ఎంతటి సహేతుకమైన ఆశను మోస్తున్నాడో కదా కవి. అది కేవలం ఆశ మాత్రమే కాదు, ఒక నిజమైన దేశ భక్తుడి బాధ్యత కూడా. మేము, మీరు అనే భావన నుండి మనము అనే భావన వైపు నడిపించగలిగిన దార్శనికునిలాగా పదాలతో దేశభక్తి మూలాల్ని, వేర్లనీ తడిమే ప్రయత్నం చేస్తాడు. ఆ ఆశను మోస్తూ బాధ్యతగా దేశం వైపు పయనించే ఆ కవే యాకూబ్.

దేశభక్తికీ, ఎథ్నోసెంట్రిక్ దేశభక్తికీ తేడా వుంటుందన్నది ఆధునిక శాస్త్రీయ అవగాహన. ఎథ్నో సెంట్రిక్ దేశభక్తినే నేషనలిజం, జాతీయతా భావన అనవచ్చు. ఎథ్నోసెంట్రిక్ దేశ భక్తి అభద్రతా భావజాలం పెరిగిపోయిన సమూహాలు వ్యక్తం చేస్తాయనీ, పూర్తి భద్రతా భావన కలిగిన సమూహాలు దేశభక్తిని మాత్రమే వ్యక్తం చేస్తాయనీ అంటాడు డక్కిట్ ( Duckitt-1989).  ఈ సందర్భంగా మన దేశాన్ని అభద్రతా భావనలోకి నెట్టివేస్తున్న రాజకీయ, సాంఘిక శక్తులేవో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దేన్ని ఆశించి దేశ ప్రజలల్లో అవి అభద్రతా భావాన్ని పెంచుతున్నాయో గమనించుకోవాల్సిన అవసరం వుంది. ఇతర దేశాల్నీ, జాతుల్నీ ద్వేషించి యుద్ధానికి తలపడే ఎథ్నో సెంట్రిక్ దేశ భక్తీకీ , తన దేశంలో ఉన్న వారినందరినీ సమానంగా ప్రేమించగలిగే దేశభక్తీకీ అసలు సంబంధం లేదనీ ఈ రెండూ వేరు వేరు అంశాలు అనే విషయ౦ (feshbach et al- 1987,1989,1990)  అర్థం చేసుకోవడం ఈ ఆధునిక యుగంలో ఎంతో అవసరం. లేకపోతె క్రికెట్ వంటి ఆటల్లో కూడా ఉద్రేకావేశాలకు లోనయ్యే బలహీన దేశభక్తులను తయారు చేసుకునే దౌర్భాగ్యం ఏర్పడే ప్రమాదమూ ఉంది. పైగా ఇదే దేశభక్తి అని ఊదరగొట్టే స్పాన్సర్డ్ వ్యాపారమూ దానికి జత కూడుతోన్న తరుణ౦ ఇది. భారత దేశంలో హైందవానికీ, ఇస్లాం కీ ఎటువంటి సహజీవనం సాధ్యంకాదనీ, అవి ఉత్తర దక్షిణ ధృవాలనీ నిరూపించాలని చూసే రాజకీయ శక్తులకు, ముస్లీం రాజుల పాలన మన దేశ చరిత్రలో 'చీకటి యుగ'మని ప్రచారం చేసుకోవాల్సిన అవసరం ఉంటుందేమో గానీ, గంగా జమునా తెహజీబ్ వంటి ఈ సంగమం, మన దేశ ప్రజల జీవితంలో అడుగడుగునా కలిసి పోయి అద్భుతమైన మిశ్రమ సంస్కృతిని ప్రతిఫలిస్తుంటే చూసి తాదాత్మ్యం చెందిన ఎందరో ఈ దేశపు బిడ్డల్ని తనవారుగా హత్తుకుంటాడీ కవి. అటువంటి వారిలో ఇంకే దేశభక్తిని వెలికితీయాలంటూ ప్రశ్నిస్తాడు.

'సారే జహాసే అచ్ఛా' అని
ఈ నేలను పూజించిన వాడిలో
'మా తుజే సలాం' అని
తల వంచి మొక్కిన వాడిలో
కాశీ విశ్వేశ్వరుడి ముంగిట మైమరచి
షెషనాయీ వినిపించిన వాడిలో
ఇంకా ఏ దేశ భక్తి వెలికి తీయను?.
మెహదీ హసన్, గులాం అలీ రాగాల
విశ్వ జనీన సత్యాల ప్రేమల్లోంచి
ఇంకే ద్వేషం గురించి ఆరా తీయను?

భారతదేశ చరిత్రను క్రీ.శ. 11వ శతాబ్దం వరకు హిందూ యుగం అనీ, అప్పటి నుంచి బ్రిటీష్ పాలన మొదలయ్యే వరకూ ముస్లిం యుగమనీ, అక్కడి నుంచి స్వాతంత్ర్యం వచ్చేవరకు బ్రిటీష్ యుగమనీ విభజించడం పూర్తిగా అశాస్త్రీయమని చరిత్రకారుడు రోమిలా థాపర్ వాదన. ముస్లీం రాజుల ఆగమనం మన దేశానికి పెద్ద మార్పేమీ తీసుకురాలేదని ఆయన వాదించినా, ఆ వచ్చిన మార్పు విధ్వంసకరమైనది కాకుండా మిశ్రమ సంస్కృతిని తీసుకు వచ్చిందని తద్వారా దేశ జీవితాన్ని అద్భుతమైన వైవిధ్యానికి గురిచేసిందనీ ఈ కవికి చెందిన జీవన గీతాల్ని చదివేటపుడు అనిపిస్తుంది.

గుర్నమ్మ తిర్నాలలో నేను పెట్టుకున్న దండాలేమైనయ్, కోట మైసమ్మ
భద్రాచలం రాముడు, ద్రాక్షారామం, శ్రీశైల శివలింగాలూ, జాన్ పాడు
సైదులూ దయగల దర్గాలు, నాగుల్ మీరాలు నాలో ఉన్న ప్రేమైక
జీవన గీతాలు

నిజానికి మనిషి మనుగడకు అతడి ఆలోచనలకూ, చర్యలకూ చుట్టూ ఉన్న సామాజిక పరిస్థితులే కారణం అవుతాయి, అందులో కేవలం మతం ఒకానొకటి మాత్రమే కానీ మతం మాత్రమే కారణం కాదు అనే విషయం ప్రాథమికంగా అర్థం చేసుకోవలసిన అవసరం ఉంది. అలాగే సామాన్య ప్రజలలో ఇతర మతాల పట్ల ఎంతోకొంత అయిష్టత ఉండదని కాదుగానీ, అయిష్టత మాత్రమే ఉంటుందనుకోవటం కూడా ప్రాథమిక అవగాహనా లోపమే అవుతుంది. భిన్న మతాలవలంబించే మన దేశంలో ఈ ప్రాథమిక అవగాహనా రాహిత్యం చేసే నష్టం అంతా ఇంతా కాదు. దానిని పూరించే బాధ్యత ఎంత మంది చేస్తున్నారో తెలియదు కానీ, ఈ కవి చాలా సమర్థవంతంగా ఈ ఖాళీలను పూరించే ప్రయత్నం చేస్తాడీ కవితలో. వ్యక్తి యొక్క సాంఘిక జీవనంలో మతానికుండే పాత్ర ఎంత తక్కువదో..అందువల్ల ఎన్నో విషయాల్లో కలిసిపోయిన మనం మతం విషయాల్ని పట్టుకుని జీవన రేఖకు అటూ ఇటూ రెండు తుపాకులమైపోయామేమిటని బాధ పడతాడు. అంతేకాకుండా భూకంపాలొచ్చినపుడు, ఉప్పెనలొచ్చినపుడు మతాల గోడలు చెదిరిపోయి, కలిసి బతికేందుకు, కలిసి నవ్వేందుకు భూకంపాలే రావాలా? ఉప్పెనలే రావాలా అని అడుగుతూ లోలోపల్లో ఆ ప్రేమలు దాచుకోవాలా? అని ధ్వనిస్తాడు.

ఎదురెదురైతే ప్రేమగా పలకరించుకున్నాం
ఒకే గాలిని పతంగాలమై పంచుకున్నాం
ఒకే నీటిని నల్లాల్లోంచి ఒంపుకున్నాం
దవాఖానాల్లో, స్టేషన్లలో, రోడ్లమీద
రోగులమై ప్రయాణీకులమై
ఒకే జీవన సంక్షుభిత రహదారులమై సాగిపోయాం
పీడకలలు వచ్చినప్పుడల్లా ఒకేలా దుఃఖించాం
ఆకాశం తల నిమిరినప్పుడల్లా ఒకేలా తడిశాం
మీ నెత్తురు నా నరాల్లోకి ప్రాణమై ప్రవహించింది
నా గజల్ నీ సంగీతమై ఉప్పొంగింది
సరిగమలు, జానపదాలు ప్రతి గుండెమీంచి రాగాలై ఎగిరాయి
అల్లారఖాలు, బిస్మిల్లాఖాన్లు, పండిత్ రవిశంకర్ లు, భీంసేన్ జోషీలు
ఒకేరాగపు బిడ్డల్లా కలిసి మెలిశారు
ఇపుడిదేమిటి?.

మనదేశంలో ముస్లిములు తమ దేశ భక్తిని పదే పదే నిరూపించుకోవాల్సి రావడం, పైకి కనిపించకున్నా, ఈ దేశపు ప్రధాన సమస్యల్లో ఇదీ ఒకటి. దేశ భక్తీకీ మతానికీ సంబంధం అంటగట్టే కుయుక్తులు కొన్నిసార్లు రాజకీయ స్వలాభాలకు ఉపయోగపడొచ్చేమోగానీ, దేశ సంస్కృతిలో ప్రధాన భూమిక పోషించిన హిందూ ముస్లిం మతాలనూ, వాటిని ఆచరించే ప్రజలను వేరు చేయటం అంత సులభమేమీకాదు. మన దేశంలో బ్రాహ్మణ పండితులూ, ముస్లిం ఇమాంలూ మాత్రమే ఉన్నారనుకునే వారు ఉండనీగాక, మేమంతా ప్రజలమంటూ పలికే ఆశేష జనవాహినిని ముందు, ఇటువంటి ఛాందసవాదుల ఆటలు సాగవన్నది దాదాపు వేయ్యి సంవత్సరాల తరబడి ఈ మతానుయాయుల సాంఘిక సహజీవనం నిరూపిస్తూనే ఉన్నది. ముస్లిములందరినీ ఒకే గాటున కట్టి వారి వేష భాషలను కదలికలనూ అనుమాన దృక్కులతో కాల్చేస్తూ, నిలువెల్లా పరీక్షలకు గురిచేస్తుంటే ఈ దేశంలో 'హమ్ బుల్ బులేహై ఇస్ కీ' అని తెగిన రెక్కలతో ఇంకెలా స్వేచ్ఛగా విహరించను అని కవి బాధపడుతున్నపుడు, మెజారిటీ హిందువులుగా ముస్లింల పట్ల మన దృక్పథం సరైనదేనా అని ఇకనైనా అవలోచించుకోక తప్పదు. ఇస్లాంకు తామే రక్షకులమని చెప్పుకునే రాజకీయ వాదులకూ, హైందవానికి తామే ప్రతినిధులమని చెప్పుకునే రాజకీయ వాదులకూ వేయి సంవత్సరాలుగా పరిఢవిల్లిన సాంస్కృతిక వైవిధ్యం, వైరుధ్యంలా కనిపించటం కేవలం తాత్కాలిక రాజకీయ తక్షణావసరమే అని ప్రజలు గుర్తించే రోజులొస్తాయని ఆశిద్దాం. ఈ కవి మనందరికోసం, తనలోపల మండే నిప్పును తీసుకుని వచ్చాడు, దాని మూలాల్ని పరీక్షిద్దాం..చేతనైతే అందరమూ కలిసి చల్లారుద్దాం.

దేశ భక్తి కూర్చి, గురించి
------------------------------
                 Kavi Yakoob

విరిగిపోతున్నాను
నాలో బీటలు వారుతున్న దేహం
కదులుతున్న మూలాలు, వేర్లు
పెళ పెళ లాడుతున్న మందిరాలు, మసీదులు, కమానులు
రంగు; జాతి, తెగ, భాష
విరిగి, ఆపై కూలి, చీలిన దేశం

ఆ మండుతున్న మంటల్లోంచి
మీకోసం నిప్పును తెచ్చాను
పరీక్షించండి
చేతనైతే చల్లార్చండి
                  1
భుజ్ వీధుల్లో మసీదులు ఊడ్చి
నమాజు చేసుకొమ్మని ఆహ్వానించిన హిందూ వీధుల్లోకి
భూకంపం ఎంత ప్రేమను తెచ్చిందో!
మనుషులంతా కలిసి బతికేందుకు, కలిసి నవ్వేందుకు
భూకంపాలే కావాలా! ఉప్పెనలే రావాలా!
                     2
పచ్చి అబద్దాల్ని నిజాలుగా పదే పదే నమ్ముతున్నాం
అదే నిజమని వాదిస్తున్నాం
పేర్లలోనో, ఉండే వీధుల్లోనో, పుట్టిన ఇళ్లలోనో
వేరు వేరు గీతలుగా,మారిపోతున్నాం.

ఎదురెదురైతే ప్రేమగా పలకరించుకున్నాం
ఒకే గాలిని పతంగాలమై పంచుకున్నాం
ఒకే నీటిని నల్లాల్లోంచి ఒంపుకున్నాం
దవాఖానాల్లో, స్టేషన్లలో, రోడ్లమీద
రోగులమై ప్రయాణీకులమై
ఒకే జీవన సంక్షుభిత రహదారులమై సాగిపోయాం
పీడకలలు వచ్చినప్పుడల్లా ఒకేలా దుఃఖించాం
ఆకాశం తల నిమిరినప్పుడల్లా ఒకేలా తడిశాం
మీ నెత్తురు నా నరాల్లోకి ప్రాణమై ప్రవహించింది
నా గజల్ నీ సంగీతమై ఉప్పొంగింది
సరిగమలు, జానపదాలు ప్రతి గుండెమీంచి రాగాలై ఎగిరాయి
అల్లారఖాలు, బిస్మిల్లాఖాన్లు, పండిత్ రవిశంకర్ లు, భీంసేన్ జోషీలు
ఒకేరాగపు బిడ్డల్లా కలిసి మెలిశారు
ఇపుడిదేమిటి?.
నిల్చున్న నేల మీద నీదో రాగం నీదో బాణీలా
నిప్పుల్నిదోసిళ్లలో పట్టినట్టు
బాధను భరించలేకపోతున్నాం
జీవన రేఖలకటూ ఇటూ
నువ్వూ నేనూ తుపాకులమయ్యాం
                  3
నిజానికి మాకేం అక్కర్లేదు ఈ మరణ శాసనాల్తో
మాకేం అక్కర్లేదు ఈ అగ్నిని రాజేసే ఆజ్యాల్తో
చెట్టు పూలని ప్రేమించినట్టు
నీళ్లు చేలని ప్రేమించినట్టు
నేనీ నేలను ప్రేమించాను
చెట్టుకొమ్మలమీద కూర్చుని మేలుకొలుపులు పాడే పక్షిలా
నేనెపుడూ దేశభక్తి గురించే మాట్లాడాను
నా దేహాన్ని కోల్పోలేనట్లు నా దేశాన్ని ఎవరికోసమో కోల్పోలేను
ఉప్పలమ్మల్నీ, బొడ్రాయిల్నీ పూజించాను
తంగెడు పూల మండల్ని బాలింతగా మా అమ్మ
నారాకకు గుర్తుగా దారినిండా ణా ఊరిదాకా పరుచుకుంటూ వచ్చింది
నేను ఏ ఊరువాడినో ఈ పూలకి తెలుసు
పూలను ప్రేమించే ఈ గాలులకు తెలుసు

బందగీ పాడిన విముక్తి గీతాలూ
షోయబుల్లాఖాన్, గులాం యాసీన్ రాసిన నల్ల నినాదాలూ
గాలిబ్ గానం చేసిన మనోహరాలూ
మగ్దూం ఫైజ్ మాటల మంటలూ
నేను వరించిన పదాలు

'సారే జహాసే అచ్ఛా' అని
ఈ నేలను పూజించిన వాడిలో
'మా తుజే సలాం' అని
తల వంచి మొక్కిన వాడిలో
కాశీ విశ్వేశ్వరుడి ముంగిట మైమరచి
షెషనాయీ వినిపించిన వాడిలో
ఇంకా ఏ దేశ భక్తి వెలికి తీయను?.
మెహదీ హసన్, గులాం అలీ రాగాల
విశ్వ జనీన సత్యాల ప్రేమల్లోంచి
ఇంకే ద్వేషం గురించి ఆరా తీయను?

నేనేసుకునే బట్టలు, పెంచుకునే గడ్డాలు, మాట్లాడే భాషలూ
నిలువెల్లా పరీక్షకు నిల్చునేటప్పుడు
నా కదలికలను కుట్రల జాడలుగా ముద్రలేస్తున్నపుడు
నేనేం హాయిగా శ్వాసించను
ఇంకెంతకాలం నిప్పుల మధ్య దహించుకుపోను!
"హమ్ బుల్ బులేహై ఇస్ కీ" అని తెగిన రెక్కల్తో
ఇంకెలా స్వేచ్ఛగా విహరించను!

గుర్నమ్మ తిర్నాలలో నేను పెట్టుకున్న దండాలేమైనయ్, కోట మైసమ్మ
భద్రాచలం రాముడు, ద్రాక్షారామం, శ్రీశైల శివలింగాలూ, జాన్ పాడు
సైదులూ దయగల దర్గాలు, నాగుల్ మీరాలు నాలో ఉన్న ప్రేమైక
జీవన గీతాలు
          4

ఈ భూమ్మీది చెట్లను తొలగించలేనట్లు
ప్రాణవాయువులాంటి నా దేశభక్తినెవరూ తొలగించలేరు
దేశభక్తి ఎవడి దొడ్లోనో పెంచుకునే
పెరటి మొక్క కాదు
విధానాలు నిర్ణయించడానికి
నిజానికి దేశభక్తి గురించి మాట్లాడినప్పుడల్లా
ద్వేషాన్ని ఎదురుగా నిలబెట్టారు
అందుకనే అందరూ మాట్లాడటం ఆపేసిన దగ్గర్నుండే
నేను మాట్లాడ్డం మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నాను.

(కవిత్వ సందర్భం23)
20-7-16

Friday, 15 July 2016

విరించి ll వెలిసిన వర్షం ll
.............................

ఆకాశంలో మునకలు వేసి
తడిగుడ్డలతో అలాగే వచ్చి నిలుచున్నట్టుందీ రోజూ
ఏదీ..!! ఒక్క చుక్కా కిందికి రాలదే..!
పిడుగులు ఉరిమే పెన్ను గొంతులో
ఎన్ని సైలెన్సర్లు బిడాయించుకుని కూచున్నాయో
దిక్కుమాలిన గాలి తప్ప కాగితాలు తడిసిందెప్పుడు?

చకోర పక్షులు గొంతులో ఎగిరినప్పుడో
ముత్యపు చిప్పలు విత్తనాల్లో దాక్కున్నప్పుడో
వాతావరణ శాఖ ప్రకటించినప్పుడో
మేఘ మదనానికి హెలికాప్టర్ని తిప్పినప్పుడో
ఇంకెవరో ఆజ్ఞాపించినప్పుడో
మనకిష్టం వచ్చినపుడో
కురవమన్నప్పుడల్లా కురవదు వర్షం
కవిత్వంలాగే వర్షం కూడా..
ఆకాశంలో మేఘాలు మేరు పర్వతమవ్వాలి
నిప్పులు చిప్పిల్లేలా మెరుపుల్నెక్కు పెట్టాలి
అమృతం కురియాలంటే పెన్ను గొంతుకలో
ప్రపంచ౦లోని విషాన్నంతా దాచేయాలి.

అరే..వీపుమీద తుపాకీ మోసే వాడికే అంతుంటే..
సప్త సముద్రాల్ని దాటి
ఈదురుగాలులకోర్చి
దిగంతాల్నీ ఆకాశ తీరాల్నీ ఈది
మన ముంగిట కురిసిన చినుకుకు
ఇంకెంత గర్వం వుండాలి.

చంపేయబడిన మనిషీ, కొట్టేయబడిన పదమూ
ఎన్నటికీ ఒకటి కాదు నేస్తం
చంపేయబడిన మనిషెవ్వడూ ఇంకొక్క మనిషిని
బతికించలేడు, కానీ..
కవిత్వంలో కొట్టేయబడిన పదాలే ఎక్కువ

తలకట్టూ దీర్ఘాలూ కొమ్ములూ పొల్లులూ ఔత్వాలు
ఎక్కుపెట్టిన మర తుపాకులు
వొత్తులూ ఋత్వాలు సున్నాలూ విసర్గలు
భుజానికి తగిలించుకున్న బుల్లెట్ సంచులు

వర్షం అందరిని వంగి ఉండమంటుంది తనకింద
గొడుగైనా తల వంచే వుండాలి
ఎన్ని తలల్ని తడవకుండా ఆపగలిగినా..
టెర్రరిస్టయినా తలమీద చేతులెత్తి పరిగెత్తాలి
ఎన్ని తుపాకులు వీపుమీద మోస్తున్నా

తెరచి వుంచిన పూదొన్నెలే ఈ ప్రపంచంలో
వర్షానికెదురు నిలుస్తాయి
వర్షం ఆగిపోయాక బొట్లు బొట్లుగా అవి
కవిత్వాన్ని కారుస్తాయి.

గమనించావా..?
చుక్క కారలేదనుకుంటూ వర్షమై కురిసాన్నేను
ఓ పాఠకుడా ఆగిపోయావేమి?

15/7/16

Wednesday, 13 July 2016

విరించి  ll ఒక్క రోజు సెలవు.ll
..............................
హృదయాల మీద లిఖించగలిగే నాలిక అది
కలల్ని వర్షించే కన్నులవి
జ్ఞానాన్ని పసితనంగా అందించే నవ్వులవి
భవిష్యత్తుతో స్నేహించే చేతులవి
మనిషిని సమున్నతంగా నిలిపే పాదాలవి.

ఎందుకో ..ఈరోజొక సెలవు కోరింది.
అలసట తీర్చుకోవటానికి కాదు,
రేపటి రోజున మరో చరిత్రై పుట్టేటందుకొక సెలవడిగింది.
రగిలించిన మెదడుకి ప్రాణంతో పని ఏమని ప్రశ్నిస్తూ..
ఈ ఒక్క రోజుకి కాస్త సెలవడిగింది.

ఈ సాయంత్రం ఒకచుక్క నేలరాలితే..
ఈ దేశపు ఆకాశం కన్నీటి చుక్కల్ని మోసింది.
నడిచే గ్రంథాలయం మూసుకుపోయింది.
కలల కర్మాగారం మూతపడింది.
చరిత్ర పుస్తకం అశ్రు నయనాలతో ఆహ్వానించింది.

ఒక ఆలోచన తన స్వేచ్ఛను ప్రకటించుకుంది.
అగ్ని రెక్కలతో నింగికెగసింది.
అజ్ఞానానికి అందని ఆత్మ నంటూ
తన ప్రయాణం నింగి వైపంటూ
మిసైల్లా దూసుకుపోయింది.

ఆచరణలో ఈ స్వప్నం ఒక మిసైల్ మాత్రమే
మనిషిగా ఆయనొక మెసైయ్య.

(మహనీయుడు, చివరి క్షణం వరకు జ్ఞానాన్నే శ్వాసించిన వాడు, నిరంతర స్పూర్తి ప్రదాత, శాస్త్రవేత్త
మాజీ రాష్ట్రపతి శ్రీ అబ్దుల్ కలాం పాదాలకి అశ్రు నివాళి.)

Thursday, 7 July 2016

కవిత్వ సందర్భం22 n gopi

మనిషికాడతడు..ఒక ఫెనామినాన్
--------------------------------------------

మనిషి ఒక 'ఫెనామినాన్' గా మారటం మామూలు విషయం కాదు. యాసర్ ఆరాఫత్ నిజానికొక మనిషి కాదు. ఒక ఫెనామినాన్. ఐదు శతాబ్దాలు మిడిల్ ఈస్ట్ పొలిటికల్ హిస్టరీలో యాసర్ ఆరాఫత్ పేరులేని రోజంటూ దాదాపు ఉండిండదు. ప్రపంచం కళ్లన్నీ తన వైపుకు తిప్పుకోగలిగి తాను మాత్రం నల్లని కళ్లద్దాల్లోంచే ప్రపంచపు రంగుల్ని చూశాడు. ఆయన రచించుకున్న జీవితపు కథలో ఆయనే కథానాయకుడు. ఆయనే ప్రతినాయకుడు. ఆయనే సమస్య. ఆయనే సమాధానం. ఆయన మీద రాయబడ్డ జీవిత కథలు సైతం, ఎన్ని ఆయన్ని హీరో అని పొగిడాయో, అన్ని విలన్ అని తెగిడాయి. ఆయన విషయంలో తటస్థంగా ఉండగలిగిన వారు బహుశా ఎవరూ ఉండరు.  ముఖ్యంగా మధ్య ప్రాచ్యంలో అరబ్ దేశాలకన్నిటికీ ఆయనొక హీరో ఒక లీడర్..కానీ, ఇజ్రాయిల్ కీ ఇతర పశ్చిమ దేశాలకీ ఆయనొక గెరిల్లా దళ నాయకుడు, ఒక కరడుగట్టిన తీవ్రవాది. ఎవరు ఎంత అంగీకరించినా అంగీకరించకపోయినా భుజానికీ తుపాకీతో ఉండే బెల్టు వేలాడదీసుకుని మరీ యూఎన్ (UN) ని ఉద్దేశించి మాట్లాడినవాడీయనొక్కడే (1974). ఇజ్రాయిల్ తో అగ్రీమెంటు చేసుకునే విషయంలో (1994) సైతం ప్రపంచం మొత్తం చూస్తుండగా ప్రొటోకల్ కి వ్యతిరేకంగా కొన్ని పేపర్ల మీద సంతకం పెట్టనంటే పెట్టనని మొండిపట్టు పట్టడం కూడా బహుశా ఆరాఫత్ ఒక్కడే చేయగలడు. ఎంతటి ఇండోర్ సభలోనైనా నల్లటి కళ్లద్దాలు మాత్రం తీయని ఏకైక నాయకుడు కూడా బహుశా ఈయనే.  ఎందుకంటే ఆరాఫత్ ఒక మనిషి కాదు. ఒక ఫెనామినాన్. ధిక్కారమనే ఫెనమినోన్.

వాస్తవాలు ఎలా ఉన్నా పాలస్తీనా నెత్తుటి కథగానీ, యాసర్ ఆరాఫత్ పోరాట కథగానీ, ప్రపంచంలో వివిధ సంస్కృతులు గల మనుషులు ఒకే చోట కలిసి జీవించలేరు అనేదానికి ప్రత్యక్ష ఉదాహరణ. అతివాద తీవ్రవాదం ఎవరినీ ప్రశాంతంగా బతకనీయదు అనడానికి ఉదాహరణ. యూదులు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ఇబ్బంది లేదు, కానీ జియోనిస్ట్ లనబడే అతివాదులుగా మారినపుడు సమస్య. అరబ్బులు ఎక్కడున్నా సమస్య లేదు. కానీ హమాస్ గా మారితేనే సమస్య. పాలస్తీనా పంతొమ్మిదో శతాబ్దం ఆరంభం వరకూ అరబ్, క్రిస్టియన్, జ్యూస్ జాతుల వారితో నిండి ఉంది. ఎపుడైతే జియోనిస్ట్ లు ఈ ప్రాంతానికి వలసలు మొదలు పెట్టారో, అపుడే ఈ జాతుల మధ్య సమస్య మొదలైంది. హిట్లర్ WWII లో జ్యూస్ ఊచకోత కూడా అనేక శరణార్థులను ఈ నేలవైపు చూసేలా చేసింది. ఫలితం అరబ్బులతో నిండి ఉన్న పాలస్థీనా నేల మెలి మెల్లిగా యూదులతో నిండటం మొదలైంది. ఫలితం జాతుల మధ్య వైరం. అమెరికా రంగ ప్రవేశం చేసింది. జనాభాలో ముప్పై శాతం ఉండి, ఏడు శాతం భూమిని కలిగివున్న యూదులకు 55 శాతం భూమిని కేటాయించి దానిని ఇజ్రాయిల్ గా గుర్తించింది. ఇజ్రాయిల్ దేశం ఏర్పడిన తరువాత జియోనిస్ట్లూ రెచ్చిపోయారు. 1948 లో జరిగిన మారణకాండ( catastroph)లో ఎనిమిది లక్షల మంది పాలస్తీనియన్లు సొంత దేశం పాలస్తీనాలో శరణార్థులుగా మార్చబడ్డారు. జియోనిస్ట్లు  వారిని ఊచకోత కోశారు. పాలస్థీనాలో నాలుగింట మూడొంతుల నేల ఇజ్రాయిల్ అధికారంలోకి వచ్చేసింది. మిగిలిన వెస్ట్ బ్యాంక్, గజాలు కూడా 1967 లో జరిగిన "ఆరు రోజుల యుద్ధం"లో ఇజ్రాయిల్ కి హస్తగతమయ్యాయి. 1948 లో జియోనిస్ట్లతో ముఖాముఖి పోరాడటంతో ఆరాఫత్ ఈ రణరంగంలోకి ప్రవేశించాడు. 1969 లో PLO ( Palastine Liberation Organisation)  కి ఛైర్మన్ అయ్యాడు. అప్పటి నుంచి పాలస్తీనాను ఇజ్రాయిల్ కబంధ హస్తాలనుంచి విడిపించటానికే పోరాడాడు. పాలస్థీనియన్లకు నైతిక రాజకీయ గొంతుకలా మారాడు. రెండు దశాబ్దాల భీకర పోరాటాల అనంతరం తన పోరాట రీతుల్ని మార్చి ఇజ్రాయిల్ని ఇజ్రాయిల్ దేశాన్ని తాను గుర్తిస్తున్నట్టుగా ప్రకటించాడు. ఓస్లో ఎక్కార్డ్ పత్రాల మీద సంతకాలు చేసి, ఇజ్రాయిల్తో శాంతియుతంగా పాలస్థీనా భూభాగాన్ని పంచుకోడాణికి అంగీకరించాడు.

ఈ నిర్ణయం ఆరాఫత్ కు నోబెల్ శాంతి బహుమతి తీసుకుని వచ్చినా, అదే కారణం జిహాదీ తీవ్రవాదం హమాస్ రూపంలో ఈ ప్రాంతంలో బలపడటానికి కారణం అయ్యింది. ఇజ్రాయిల్ అధ్యక్షుడు రాబిన్ హత్యకూ, ఆ తరువాత యాసర్ ఆరాఫత్ హౌస్ అరెస్ట్ కీ దారితీసింది. చివరికి ఆరాఫత్   అనుమానాస్పద మరణానికి దారి తీసింది 2004. అపుడు ఒక శకం ముగిసినట్టయింది. ఒక పోరాటం ఆగినట్టయింది. సొంత గడ్డ మీద కాందిశీకులుగా జీవిస్తున్న పాలస్థీనియన్ల జీవితం ఇక బాగుపడదేమో అనిపించినట్టయింది. కవి డాll ఎన్.గోపీ ఆరాఫత్ మీద ఒక ఎలిజీని ప్రేమగా రాసుకున్నా, ఆయనలోని ఫెనామినాన్ మీద అపారనమ్మకం చూపిస్తాడీ కవితలో

ఎక్కు పెట్టిన వేళ్ళు
ఎక్కుపెట్టినట్టే వున్నాయి.
వేళ్ళు స్తంభించినా
బాణాల వర్షం ఆగదు.
ఒక మహా స్వప్నాన్ని వదిలి
దేహం వెల్లిపోయింది
స్వప్నం
లక్ష శరీరాలను తొడుక్కుంటుంది
పాలస్తీనా ఆకాశంలో
ఆరాఫత్ సూర్యుడు రోజూ ఉదయిస్తాడు....
పాలస్తీనియన్లకు ఒక భరోసా ఇస్తాయీ మాటలు. ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా మతాల పేరుతో జాతుల పేరుతో దేశాల్ని కబళి౦చే ముష్కరుల నుంచి ప్రపంచం తప్పక విముక్తిని పొందుతుందని భరోసా ఇస్తాయీ మాటలు.

ఉగ్రవాదం అసలు రూపాన్ని, దాని దౌష్ట్యాన్నీ, జాతుల పేర జరిగే హింసనూ దాని అసలు రూపాన్ని మనం పాలస్తీనా గడ్డ మీదే చూడవచ్చు. ఆరాఫత్ వీటన్నింటికీ ఒక నిలువెత్తు ప్రశ్న. ఒక నిలువెత్తు చూపుడు వేలు. ప్రపంచం అంతా ఆ ప్రశ్న వైపు చూసింది..నిలబడి ఉన్న చూపుడు వేలు ఏం మాట్లాడిందో విన్నది . అన్నింటికీ జోర్డాన్ నదిలా చిరునవ్వు ఆరాఫత్ సమాధానం,రక్తాన్ని పొత్తిళ్లలో కనిపించకుండా దాచుకున్న ఆ నదీ ప్రవాహపు గలగలలా ఆరాఫత్ మాట. సొంతగడ్డ మీద పరాయివాడిలా బ్రతికిన ప్రతిక్షణం, ఆరాఫత్ పోరాడుతూ నే ఉన్నాడు. ఏమి పిడికిలి అది?, అసలెప్పుడూ కాసేపయినా సడలదా అనిపించే పిడికిలి. ప్రపంచం ఆ పిడికిలిని చూచి ఉగ్రవాది అన్నది..కానీ ఆ మాటకెంతో గౌరవాన్ని తెచ్చాడంటాడు కవి. ఏది ఉగ్రవాదమో ఏది శాంతికాముకత్వమో తెలిసిన కవి.

ఆరాఫత్!
నీకెవడి కితాబూ అక్కర్లేదు
ఉగ్రవాదివే నువ్వు.
ఆ మాటకెంత గౌరవం తెచ్చావు!

ఈరోజుకీ పరిస్థితులు మారలేదు. వెస్ట్ బ్యాంకు, గజా ప్రాంతాలు పాలస్తీనియన్ల బహిరంగ కారాగారాల్లా తయారయ్యాయి. ఈ మధ్యే గజా మీద ఇజ్రాయిలీల దాడులు చూశాం. ఒకే వేరు నుండి పుట్టిన వేరువేరు మతాల ప్రజాలు, వేరు వేరు జాతులుగా విడిపోయిన ప్రజలు శాంతియుతంగా సహజీవనం చేయలేని పరిస్థితి నెలకొని ఉన్నపుడు, యాసర్ ఆరాఫత్ వంటి శాంతి కాముకులు, హింస అసలు రూపాన్ని బయటపెట్టే ధైర్యవంతులు మరణించినపుడు ఎక్కడో లోలోతుల్లో మానవత్వం మీద దాగి ఉన్న చిన్న నమ్మకం, కవిని ఈ ఎలిజీ రాయటానికి ప్రేరేపించి వుంటుందనిపిస్తుంది. కవి ఎప్పటికైనా శాంతికాముకుడే కాబట్టి సుదూర తీరాన ఉన్న యాసర్ ఆరాఫత్ ని తన ఆలోచనల ప్రతిబింబంగా ఐండెంటిఫై అవుతాడీ కవితలో. బహుశా తను పుట్టినపుడే ఆరాఫత్ పోరాటం మొదలుకావటం కూడా ఒక కారణం కావొచ్చు. తన మానసిక ఆప్త మిత్రుడిని కోల్పోయాననే బాధను తన ప్రాంతంలోని టాగోర్ ఆడిటోరియంలో "ఆరాఫత్! నీ పాద ముద్రల్ని వెతుకుతున్నాను మిత్రమా!" అని ఆర్తిగా ముగిస్తాడీ కవితను. ఒక నమ్మకాన్ని, ఒక ఆర్తినీ, ఒక మానసిక స్నేహాన్ని, ఒక పోరాటాన్ని ఈ కవితలో చూస్తాం మనం. ఇంకో ఆరాఫత్ వస్తాడా అనే సందిగ్ధంలోంచి వస్తాడేమో అనే సమాధానంతో ఊరడిల్లుతాం.

ఆరాఫత్ కీ యాద్ మే
-------------------------------
                      డా . ఎన్.గోపి 29-11-94

ఎక్కుపెట్టిన వేళ్ళు
ఎక్కుపెట్టినట్టే వున్నాయి
వేళ్ళు స్తంభించినా
బాణాల వర్షం ఆగదు.
మహా స్వప్నాన్ని వొదిలి
దేహం వెల్లిపోయింది
స్వప్నం
లక్ష శరీరాలను తొడుక్కుంటుంది
పాలస్తీనా ఆకాశంలో
ఆరాఫత్ సూర్యుడు రోజూ ఉదయిస్తాడు
ఒక మహా ధిక్కారానికి
దిక్కుల తేడా ఉండదు
ఒక విరాట్ బింబంలోని ఎరుపును
ఎవరూ దొంగలించలేరు.

ఆరాఫత్!
ఆకాశమంతా వ్యాపించిన అరబ్బు మబ్బువి
నువ్వు కురిసేది నిప్పుల్నే.
భూగోళం మీద మొలిచిన
ఒకే ఒక్క చూపుడు వేలు వృక్షానివి నువ్వు
ముష్కరులు సృష్టించిన చలి తుఫానులో
ఈ శతాబ్దం నిండా పరచుకున్న ఎండవు నువ్వు
రాలిపోతున్న ఆకులను
మళ్లీ చెట్లకు అతికించే వసంతానివి నువ్వు
ఆరు రుతువుల్నీ
ఒకే పోరాట రుతువుగా మలచిన విశాల ఆకాంక్షవు నువ్వు.
ఆరాఫత్ !
నా పుట్టుకా నీ పోరాటం
ఒకేసారి మొదలయ్యాయి
ఒక అర్ధ శతాబ్దం పాటు
భూమి తన చుట్టూ తిరుగుతూ
నీ చుట్టే తిరిగింది
ఎన్ని కష్టాలు
ఎన్ని కడగండ్లు
క్షణక్షణం ఎన్నెన్ని ఉద్విగ్న అగ్నికణాలు
వేటను వెక్కిరిస్తూ
ఎన్ని రాబిన్ హుడ్ విచిత్ర పరాక్రమాలు
రాళ్ల ను బుల్లెట్లుగా మలిచిన
తిరస్కారం నీది
భుజం మీద తుపాకీ ధరించిన
శాంతి వీరుడా!
మట్టికి ముడి వేసుకున్న పేగుదారంతో
ప్రపంచమంతా ఎగిరిన పతంగానివి నువ్వు
సొంత గడ్డ మీద
ప్రవాస జీవితం గడిపిన వింత ఖైదీవి నువ్వు
అయినా
చెక్కు చెదరని గట్టి గుండెనీది
నీ ధైర్యంతో పోల్చడానికి
భూమ్మీద ఏ లోహమూ సరిపోదు

ఆరాఫత్!
నువ్విక లేవంటే
నీ నవ్వులే గుర్తుకొస్తున్నాయి
చేతిలో చంద్రహాసం
పెదవులపై దరహాసం
జోర్డాన్ నది విన్యాసాలు నీ ముఖ కవలికలు
ఎంత ప్రేమ మూర్తివయ్యా ఆరాఫత్
ప్రేమించేవాడే
దుష్టత్వాన్ని ద్వేషిస్తాడు
ప్రేమించేవాడే
హింస నిజస్వరూపాన్ని బట్టబయలు చేస్తాడు.

ఆరాఫత్!
నీకెవడి కితాబూ అక్కర్లేదు
ఉగ్రవాదివే నువ్వు
ఆ మాటకెంత గౌరవం తెచ్చావ్
నీ మరణోదయ వేళ
భూమ్మీద చెట్లన్నీ
బిగించిన పిడికిళ్లైనాయి
నీ ప్రస్థానానికి
సముద్ర తరంగాలన్నీ
కోట్లాది పాదాలై నర్తిస్తున్నాయి

ఒక మహా పర్వతం మీద నీడ తొలగిపోతున్నది
వెనువెంటనే పెద్ద వెలుగు దుప్పటిపరుచుకుంటున్నది
తారలు ఖిన్నులై చూస్తున్నాయి
చంద్రుడి మొహమ్మీద కన్నీళ్ళు గడ్డకట్టాయి
దేవతలు రేపటి రవిబింబాన్ని
తూ ర్పు కొండమీద నిలబెడ్తున్నారు

మా ఉస్మానియా గౌరవ డాక్టరేట్ నిన్ను వరించినప్పుడు
పీడిత ప్రజలంతా జేజేలు పలికిన చప్పుడు
టాగోర్ ఆడిటోరియం ముంగిట్లో
నీ పాద ముద్రల్ని వెతుకుతున్నాను మిత్రమా
ఆజా మేరే షహీద్!
అరాఫత్ జిందాబాద్!!

6-7-16
(కవిత్వ సందర్భం22)
విరించి ll తడి ll
--------------------------

జీవితం ఎంతటి బాధనిస్తుందో..!!
కొన్ని పదాలు కళ్ళు తుడుచుకోవడానికి

మెదడు బిరడా గట్టిగా బిగించి
అక్షరాల్ని దాచి ఉంచకపోయి వుంటే
ఈ చీకట్లెంత నిరర్ధకంగా తడిసి ముద్దయ్యేవో !

చెక్కిళ్ల  మీద ఆగిపోవాల్సిన కన్నీళ్ల ను
కిలోమీటర్ల కొద్దీ
కాగితం మీద ఉరికిస్తున్నపుడు అనుకుంటాను
మనిషిని నడిపే పెట్రోలియం బావులు
కళ్లలోనే వున్నాయని
అవి ఎక్కడో గుండెలోతుల్లోంచి ఊరుతున్నాయని.

అయినా, పదాలతో తడిసిన కాగితమేదయినా
టిష్యూ కాగితం కాకుండా పోతుందా?

బ్లూ ఇంకు తడి ఆరక ముందే తుడిచేసిన అక్షరం
చేతికి చెమట పట్టకముందే ముగించిన కథ
జీవితపు తడి తగలకముందే ఆపేసిన కవిత
ఎన్ని కాగితాల్ని కొత్త ప్రపంచానికి రెక్కలుగా మలచగలవు?

మనసుకింత తడి తగిలినపుడు అనిపిస్తుంది
మనిషనే నేనొక కవినని
కవి'త' లేని కవిగా మిగిలినపుడు అనిపిస్తుంది
పదంలో చివరి అక్షరమే కవితని....
కవికి అంటిన తడే కవితని...

2/7/16
2090 సంవత్సరం, పదో తరగతి తెలుగు వాచకంలో..ఒక పాఠం లోని కొంత భాగం.
---------------------------------------------

అవి తెలుగు వారికి నలుపు రోజులు. రాష్ట్రం రెండు ముక్కలుగా చేయబడి తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ గా విడివడిన రోజులు. ఆం.ప్ర. ముఖ్యమంత్రి డాబుగారు తనన ప్రత్యర్థి భగ్నన్ మీద ఒక శాతం అధిక వోటుతో గెలవకపోయివుంటే ప్రపంచ పటంలో అమరావతి నగరాన్ని మనమెప్పుడూ చూసేవారిమి కాదు. హైదరాబాదుని ప్రపంచ పటంలో గుర్తించి తెలుగువారు ప్రపంచంలో బతికే ఉన్నారని చాటిన డాబుగారు అమరావతిని కూడా ప్రపంచపటంలో పెట్టడానికి బాధ్యతలను నెత్తికెత్తుకుని పరిపాలన సాగించారు. రైతులు ఎంతో మంది ముందుకు వచ్చి, తమ భూములను అమరావతి నగరం కోసం త్యాగం చేశారు. డాబుగారికి రైతులను చూస్తే ఆనందం వేసేది. వాళ్లని చూడగానే నవ్వేవాడాయన. ఆ నవ్వు ఎంతో మందికి స్పూర్తినిచ్చేది. అమెరికా అధ్యక్ష గృహంలో డాబుగారి నవ్వు పటం వేలాడేదంటే, ఆ నవ్వులో ఉండే మహత్తు అర్థం చేసుకోవచ్చు. అందుకనే ఆయన ఎంతో ఆచి తూ చి నవ్వేవాడు. ప్రతిపక్షాలెంత  ఇబ్బందుల్ని సృష్టించినా 'చెక్కులు' చెదరకుండా వ్యవహారం నడిపుతూ  ముందుకు పోయేవాడు. హైదరాబాదును సైబరాబాదును చూస్తేనే డాబుగారికి తృప్తి కలిగేది. ఆ తృప్తిని ఎక్కడైనా నిర్భయంగా వ్యక్తం చేయగలిగేవాడు. అటువంటి హైదరాబాదును సైబరాబాదునూ వదులుకోవడంతో సర్వస్వాన్ని వదిలేసుకున్నవాడయ్యాడు. అయినా ధైర్యంగా నిద్రలేని రాత్రులను గడుపుతూ అమరావతికోసం శ్రమించాడు. సింగపూరు జపాన్ వంటి దేశాలకు భూముల్ని తక్కువ ధరకే అమ్మి అమరావతిలో ఆకార హార్మ్యాలు కట్టాడు. ఈ రోజు మనమిన్ని భవనాల్ని అమరావతిలో చూడగలుగుతున్నామంటే అప్పటి డాబుగారి ఉదారవాద హృదయమే కారణం. రోడ్డుకిరుపక్కలా చెట్లను గుడులనూ కూల్చి కంప్యూటర్ సంస్థలను నెలకొల్పాడు. ఒకప్పటి సమైక్య రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా గడించిన అపారమైన అనుభవం ఎటువంటి స్కాములనైనా ఎదుర్కునే శక్తినిచ్చింది. అటు కేజీఆర్ ఇటు భగ్నన్ కుమ్మక్కయ్యి ఓటుకు నోటు కేసులో ఫోన్ ట్యాంపరింగ్ కి పాల్పడినా "వాటయాం సేయింగ్" అంటూ తన వాణిని ప్రపంచానికి చాటి చెప్పాడు. కాల్ మనీ అంటూ ప్రతిపక్షాలు ఆయన్ని అణగదొక్కే ప్రయత్నం చేసినా తాజమ్మ అనబడే ఐరన్ లెగ్ నాయకురాలి మీద ఉక్కు పాదం మోపి చాకచక్యంగా అసెంబ్లీ నుండి బహిష్కరణ చేయించగలిగాడు. తెలంగాణా వారికి నిద్ర లేపడం దగ్గరినుంచి అన్నం తినిపించే దాకా, విద్యార్థులు స్కూలుకూ కాలేజీలకు పోయేదాక శ్రమించిన డాబు, ఆం.ప్ర లో కూడా అన్నీ తానే ఐ ముందుకు సాగాడు. అన్నింటిలో తానే ఉన్నాననీ- అన్నింటిలో తననే చూసుకునే అరుదైన అద్వైత వాది ఆయన.

ఆరోజుల్లో ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబడిన కంప్యూటర్ మేధావి నిత్య ఆదెల్ల కైనా, ప్రపంచ మేధావిగా వేనోళ్ళా కొనియాడబడ్డ షోకేష్ కైనా డాబు గారే స్పూర్తి. చైనా జపాన్ దేశాల అధ్యక్షులే కాకుండా అమెరికా అధ్యక్షులు కూడా డాబుగారి స్పూర్తితో పనిచేసేవారు. ఎటువంటి సమస్య వచ్చినా డాబుగారినే సలహా అడిగే వారు.  ఉన్న నూటా తొంభై ఐదు దేశాల్నించే కాక లేని ఐదు దేశాల అధికారులు కూడా అమరావతిలో పెట్టుబడులు పెడతామని పరిగెత్తుకొచ్చేవారు. వారందరికీ ఆ రోజుల్లో విమానాల అవసరం ఉండేది కాదు. డాబు గారు ఫోన్ చేస్తే చాలు ఎక్కడున్నా ఉన్నపళంగా పరిగెత్తుకొచ్చే పరిస్థితికొచ్చారంటే డాబుగారి పనితీరు వారిలో నింపిన స్పూర్తే కారణం తప్ప మరొకటి కాదు.

(కొంత భాగం మాత్రమే ఇది.
కేవలం సరదాకి మాత్రమే. )