Thursday, 7 July 2016

కవిత్వ సందర్భం22 n gopi

మనిషికాడతడు..ఒక ఫెనామినాన్
--------------------------------------------

మనిషి ఒక 'ఫెనామినాన్' గా మారటం మామూలు విషయం కాదు. యాసర్ ఆరాఫత్ నిజానికొక మనిషి కాదు. ఒక ఫెనామినాన్. ఐదు శతాబ్దాలు మిడిల్ ఈస్ట్ పొలిటికల్ హిస్టరీలో యాసర్ ఆరాఫత్ పేరులేని రోజంటూ దాదాపు ఉండిండదు. ప్రపంచం కళ్లన్నీ తన వైపుకు తిప్పుకోగలిగి తాను మాత్రం నల్లని కళ్లద్దాల్లోంచే ప్రపంచపు రంగుల్ని చూశాడు. ఆయన రచించుకున్న జీవితపు కథలో ఆయనే కథానాయకుడు. ఆయనే ప్రతినాయకుడు. ఆయనే సమస్య. ఆయనే సమాధానం. ఆయన మీద రాయబడ్డ జీవిత కథలు సైతం, ఎన్ని ఆయన్ని హీరో అని పొగిడాయో, అన్ని విలన్ అని తెగిడాయి. ఆయన విషయంలో తటస్థంగా ఉండగలిగిన వారు బహుశా ఎవరూ ఉండరు.  ముఖ్యంగా మధ్య ప్రాచ్యంలో అరబ్ దేశాలకన్నిటికీ ఆయనొక హీరో ఒక లీడర్..కానీ, ఇజ్రాయిల్ కీ ఇతర పశ్చిమ దేశాలకీ ఆయనొక గెరిల్లా దళ నాయకుడు, ఒక కరడుగట్టిన తీవ్రవాది. ఎవరు ఎంత అంగీకరించినా అంగీకరించకపోయినా భుజానికీ తుపాకీతో ఉండే బెల్టు వేలాడదీసుకుని మరీ యూఎన్ (UN) ని ఉద్దేశించి మాట్లాడినవాడీయనొక్కడే (1974). ఇజ్రాయిల్ తో అగ్రీమెంటు చేసుకునే విషయంలో (1994) సైతం ప్రపంచం మొత్తం చూస్తుండగా ప్రొటోకల్ కి వ్యతిరేకంగా కొన్ని పేపర్ల మీద సంతకం పెట్టనంటే పెట్టనని మొండిపట్టు పట్టడం కూడా బహుశా ఆరాఫత్ ఒక్కడే చేయగలడు. ఎంతటి ఇండోర్ సభలోనైనా నల్లటి కళ్లద్దాలు మాత్రం తీయని ఏకైక నాయకుడు కూడా బహుశా ఈయనే.  ఎందుకంటే ఆరాఫత్ ఒక మనిషి కాదు. ఒక ఫెనామినాన్. ధిక్కారమనే ఫెనమినోన్.

వాస్తవాలు ఎలా ఉన్నా పాలస్తీనా నెత్తుటి కథగానీ, యాసర్ ఆరాఫత్ పోరాట కథగానీ, ప్రపంచంలో వివిధ సంస్కృతులు గల మనుషులు ఒకే చోట కలిసి జీవించలేరు అనేదానికి ప్రత్యక్ష ఉదాహరణ. అతివాద తీవ్రవాదం ఎవరినీ ప్రశాంతంగా బతకనీయదు అనడానికి ఉదాహరణ. యూదులు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ఇబ్బంది లేదు, కానీ జియోనిస్ట్ లనబడే అతివాదులుగా మారినపుడు సమస్య. అరబ్బులు ఎక్కడున్నా సమస్య లేదు. కానీ హమాస్ గా మారితేనే సమస్య. పాలస్తీనా పంతొమ్మిదో శతాబ్దం ఆరంభం వరకూ అరబ్, క్రిస్టియన్, జ్యూస్ జాతుల వారితో నిండి ఉంది. ఎపుడైతే జియోనిస్ట్ లు ఈ ప్రాంతానికి వలసలు మొదలు పెట్టారో, అపుడే ఈ జాతుల మధ్య సమస్య మొదలైంది. హిట్లర్ WWII లో జ్యూస్ ఊచకోత కూడా అనేక శరణార్థులను ఈ నేలవైపు చూసేలా చేసింది. ఫలితం అరబ్బులతో నిండి ఉన్న పాలస్థీనా నేల మెలి మెల్లిగా యూదులతో నిండటం మొదలైంది. ఫలితం జాతుల మధ్య వైరం. అమెరికా రంగ ప్రవేశం చేసింది. జనాభాలో ముప్పై శాతం ఉండి, ఏడు శాతం భూమిని కలిగివున్న యూదులకు 55 శాతం భూమిని కేటాయించి దానిని ఇజ్రాయిల్ గా గుర్తించింది. ఇజ్రాయిల్ దేశం ఏర్పడిన తరువాత జియోనిస్ట్లూ రెచ్చిపోయారు. 1948 లో జరిగిన మారణకాండ( catastroph)లో ఎనిమిది లక్షల మంది పాలస్తీనియన్లు సొంత దేశం పాలస్తీనాలో శరణార్థులుగా మార్చబడ్డారు. జియోనిస్ట్లు  వారిని ఊచకోత కోశారు. పాలస్థీనాలో నాలుగింట మూడొంతుల నేల ఇజ్రాయిల్ అధికారంలోకి వచ్చేసింది. మిగిలిన వెస్ట్ బ్యాంక్, గజాలు కూడా 1967 లో జరిగిన "ఆరు రోజుల యుద్ధం"లో ఇజ్రాయిల్ కి హస్తగతమయ్యాయి. 1948 లో జియోనిస్ట్లతో ముఖాముఖి పోరాడటంతో ఆరాఫత్ ఈ రణరంగంలోకి ప్రవేశించాడు. 1969 లో PLO ( Palastine Liberation Organisation)  కి ఛైర్మన్ అయ్యాడు. అప్పటి నుంచి పాలస్తీనాను ఇజ్రాయిల్ కబంధ హస్తాలనుంచి విడిపించటానికే పోరాడాడు. పాలస్థీనియన్లకు నైతిక రాజకీయ గొంతుకలా మారాడు. రెండు దశాబ్దాల భీకర పోరాటాల అనంతరం తన పోరాట రీతుల్ని మార్చి ఇజ్రాయిల్ని ఇజ్రాయిల్ దేశాన్ని తాను గుర్తిస్తున్నట్టుగా ప్రకటించాడు. ఓస్లో ఎక్కార్డ్ పత్రాల మీద సంతకాలు చేసి, ఇజ్రాయిల్తో శాంతియుతంగా పాలస్థీనా భూభాగాన్ని పంచుకోడాణికి అంగీకరించాడు.

ఈ నిర్ణయం ఆరాఫత్ కు నోబెల్ శాంతి బహుమతి తీసుకుని వచ్చినా, అదే కారణం జిహాదీ తీవ్రవాదం హమాస్ రూపంలో ఈ ప్రాంతంలో బలపడటానికి కారణం అయ్యింది. ఇజ్రాయిల్ అధ్యక్షుడు రాబిన్ హత్యకూ, ఆ తరువాత యాసర్ ఆరాఫత్ హౌస్ అరెస్ట్ కీ దారితీసింది. చివరికి ఆరాఫత్   అనుమానాస్పద మరణానికి దారి తీసింది 2004. అపుడు ఒక శకం ముగిసినట్టయింది. ఒక పోరాటం ఆగినట్టయింది. సొంత గడ్డ మీద కాందిశీకులుగా జీవిస్తున్న పాలస్థీనియన్ల జీవితం ఇక బాగుపడదేమో అనిపించినట్టయింది. కవి డాll ఎన్.గోపీ ఆరాఫత్ మీద ఒక ఎలిజీని ప్రేమగా రాసుకున్నా, ఆయనలోని ఫెనామినాన్ మీద అపారనమ్మకం చూపిస్తాడీ కవితలో

ఎక్కు పెట్టిన వేళ్ళు
ఎక్కుపెట్టినట్టే వున్నాయి.
వేళ్ళు స్తంభించినా
బాణాల వర్షం ఆగదు.
ఒక మహా స్వప్నాన్ని వదిలి
దేహం వెల్లిపోయింది
స్వప్నం
లక్ష శరీరాలను తొడుక్కుంటుంది
పాలస్తీనా ఆకాశంలో
ఆరాఫత్ సూర్యుడు రోజూ ఉదయిస్తాడు....
పాలస్తీనియన్లకు ఒక భరోసా ఇస్తాయీ మాటలు. ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా మతాల పేరుతో జాతుల పేరుతో దేశాల్ని కబళి౦చే ముష్కరుల నుంచి ప్రపంచం తప్పక విముక్తిని పొందుతుందని భరోసా ఇస్తాయీ మాటలు.

ఉగ్రవాదం అసలు రూపాన్ని, దాని దౌష్ట్యాన్నీ, జాతుల పేర జరిగే హింసనూ దాని అసలు రూపాన్ని మనం పాలస్తీనా గడ్డ మీదే చూడవచ్చు. ఆరాఫత్ వీటన్నింటికీ ఒక నిలువెత్తు ప్రశ్న. ఒక నిలువెత్తు చూపుడు వేలు. ప్రపంచం అంతా ఆ ప్రశ్న వైపు చూసింది..నిలబడి ఉన్న చూపుడు వేలు ఏం మాట్లాడిందో విన్నది . అన్నింటికీ జోర్డాన్ నదిలా చిరునవ్వు ఆరాఫత్ సమాధానం,రక్తాన్ని పొత్తిళ్లలో కనిపించకుండా దాచుకున్న ఆ నదీ ప్రవాహపు గలగలలా ఆరాఫత్ మాట. సొంతగడ్డ మీద పరాయివాడిలా బ్రతికిన ప్రతిక్షణం, ఆరాఫత్ పోరాడుతూ నే ఉన్నాడు. ఏమి పిడికిలి అది?, అసలెప్పుడూ కాసేపయినా సడలదా అనిపించే పిడికిలి. ప్రపంచం ఆ పిడికిలిని చూచి ఉగ్రవాది అన్నది..కానీ ఆ మాటకెంతో గౌరవాన్ని తెచ్చాడంటాడు కవి. ఏది ఉగ్రవాదమో ఏది శాంతికాముకత్వమో తెలిసిన కవి.

ఆరాఫత్!
నీకెవడి కితాబూ అక్కర్లేదు
ఉగ్రవాదివే నువ్వు.
ఆ మాటకెంత గౌరవం తెచ్చావు!

ఈరోజుకీ పరిస్థితులు మారలేదు. వెస్ట్ బ్యాంకు, గజా ప్రాంతాలు పాలస్తీనియన్ల బహిరంగ కారాగారాల్లా తయారయ్యాయి. ఈ మధ్యే గజా మీద ఇజ్రాయిలీల దాడులు చూశాం. ఒకే వేరు నుండి పుట్టిన వేరువేరు మతాల ప్రజాలు, వేరు వేరు జాతులుగా విడిపోయిన ప్రజలు శాంతియుతంగా సహజీవనం చేయలేని పరిస్థితి నెలకొని ఉన్నపుడు, యాసర్ ఆరాఫత్ వంటి శాంతి కాముకులు, హింస అసలు రూపాన్ని బయటపెట్టే ధైర్యవంతులు మరణించినపుడు ఎక్కడో లోలోతుల్లో మానవత్వం మీద దాగి ఉన్న చిన్న నమ్మకం, కవిని ఈ ఎలిజీ రాయటానికి ప్రేరేపించి వుంటుందనిపిస్తుంది. కవి ఎప్పటికైనా శాంతికాముకుడే కాబట్టి సుదూర తీరాన ఉన్న యాసర్ ఆరాఫత్ ని తన ఆలోచనల ప్రతిబింబంగా ఐండెంటిఫై అవుతాడీ కవితలో. బహుశా తను పుట్టినపుడే ఆరాఫత్ పోరాటం మొదలుకావటం కూడా ఒక కారణం కావొచ్చు. తన మానసిక ఆప్త మిత్రుడిని కోల్పోయాననే బాధను తన ప్రాంతంలోని టాగోర్ ఆడిటోరియంలో "ఆరాఫత్! నీ పాద ముద్రల్ని వెతుకుతున్నాను మిత్రమా!" అని ఆర్తిగా ముగిస్తాడీ కవితను. ఒక నమ్మకాన్ని, ఒక ఆర్తినీ, ఒక మానసిక స్నేహాన్ని, ఒక పోరాటాన్ని ఈ కవితలో చూస్తాం మనం. ఇంకో ఆరాఫత్ వస్తాడా అనే సందిగ్ధంలోంచి వస్తాడేమో అనే సమాధానంతో ఊరడిల్లుతాం.

ఆరాఫత్ కీ యాద్ మే
-------------------------------
                      డా . ఎన్.గోపి 29-11-94

ఎక్కుపెట్టిన వేళ్ళు
ఎక్కుపెట్టినట్టే వున్నాయి
వేళ్ళు స్తంభించినా
బాణాల వర్షం ఆగదు.
మహా స్వప్నాన్ని వొదిలి
దేహం వెల్లిపోయింది
స్వప్నం
లక్ష శరీరాలను తొడుక్కుంటుంది
పాలస్తీనా ఆకాశంలో
ఆరాఫత్ సూర్యుడు రోజూ ఉదయిస్తాడు
ఒక మహా ధిక్కారానికి
దిక్కుల తేడా ఉండదు
ఒక విరాట్ బింబంలోని ఎరుపును
ఎవరూ దొంగలించలేరు.

ఆరాఫత్!
ఆకాశమంతా వ్యాపించిన అరబ్బు మబ్బువి
నువ్వు కురిసేది నిప్పుల్నే.
భూగోళం మీద మొలిచిన
ఒకే ఒక్క చూపుడు వేలు వృక్షానివి నువ్వు
ముష్కరులు సృష్టించిన చలి తుఫానులో
ఈ శతాబ్దం నిండా పరచుకున్న ఎండవు నువ్వు
రాలిపోతున్న ఆకులను
మళ్లీ చెట్లకు అతికించే వసంతానివి నువ్వు
ఆరు రుతువుల్నీ
ఒకే పోరాట రుతువుగా మలచిన విశాల ఆకాంక్షవు నువ్వు.
ఆరాఫత్ !
నా పుట్టుకా నీ పోరాటం
ఒకేసారి మొదలయ్యాయి
ఒక అర్ధ శతాబ్దం పాటు
భూమి తన చుట్టూ తిరుగుతూ
నీ చుట్టే తిరిగింది
ఎన్ని కష్టాలు
ఎన్ని కడగండ్లు
క్షణక్షణం ఎన్నెన్ని ఉద్విగ్న అగ్నికణాలు
వేటను వెక్కిరిస్తూ
ఎన్ని రాబిన్ హుడ్ విచిత్ర పరాక్రమాలు
రాళ్ల ను బుల్లెట్లుగా మలిచిన
తిరస్కారం నీది
భుజం మీద తుపాకీ ధరించిన
శాంతి వీరుడా!
మట్టికి ముడి వేసుకున్న పేగుదారంతో
ప్రపంచమంతా ఎగిరిన పతంగానివి నువ్వు
సొంత గడ్డ మీద
ప్రవాస జీవితం గడిపిన వింత ఖైదీవి నువ్వు
అయినా
చెక్కు చెదరని గట్టి గుండెనీది
నీ ధైర్యంతో పోల్చడానికి
భూమ్మీద ఏ లోహమూ సరిపోదు

ఆరాఫత్!
నువ్విక లేవంటే
నీ నవ్వులే గుర్తుకొస్తున్నాయి
చేతిలో చంద్రహాసం
పెదవులపై దరహాసం
జోర్డాన్ నది విన్యాసాలు నీ ముఖ కవలికలు
ఎంత ప్రేమ మూర్తివయ్యా ఆరాఫత్
ప్రేమించేవాడే
దుష్టత్వాన్ని ద్వేషిస్తాడు
ప్రేమించేవాడే
హింస నిజస్వరూపాన్ని బట్టబయలు చేస్తాడు.

ఆరాఫత్!
నీకెవడి కితాబూ అక్కర్లేదు
ఉగ్రవాదివే నువ్వు
ఆ మాటకెంత గౌరవం తెచ్చావ్
నీ మరణోదయ వేళ
భూమ్మీద చెట్లన్నీ
బిగించిన పిడికిళ్లైనాయి
నీ ప్రస్థానానికి
సముద్ర తరంగాలన్నీ
కోట్లాది పాదాలై నర్తిస్తున్నాయి

ఒక మహా పర్వతం మీద నీడ తొలగిపోతున్నది
వెనువెంటనే పెద్ద వెలుగు దుప్పటిపరుచుకుంటున్నది
తారలు ఖిన్నులై చూస్తున్నాయి
చంద్రుడి మొహమ్మీద కన్నీళ్ళు గడ్డకట్టాయి
దేవతలు రేపటి రవిబింబాన్ని
తూ ర్పు కొండమీద నిలబెడ్తున్నారు

మా ఉస్మానియా గౌరవ డాక్టరేట్ నిన్ను వరించినప్పుడు
పీడిత ప్రజలంతా జేజేలు పలికిన చప్పుడు
టాగోర్ ఆడిటోరియం ముంగిట్లో
నీ పాద ముద్రల్ని వెతుకుతున్నాను మిత్రమా
ఆజా మేరే షహీద్!
అరాఫత్ జిందాబాద్!!

6-7-16
(కవిత్వ సందర్భం22)

No comments:

Post a Comment