Tuesday, 19 July 2016

కవిత్వ సందర్భం23 yakoob

హమ్ బుల్ బులే హై ఐస్ కీ...
----------------------------------------

'తాము సహితం దేశ భక్తులమే' అని చెప్పుకోవలసిన పరిస్థితి వచ్చినపుడు, అది కూడా 'తాము మాత్రమే దేశ భక్తులమ'ని విర్రవీగేవారికి చెప్పుకోవాల్సి వచ్చినపుడు, కేవలం చెప్పినంత మాత్రాన నమ్మకాలు కుదిరిపోతాయనుకోలేం. ఢంకా బజాయించినట్టుగా చెప్పాలి, అంటే ఇంకేదో చేయాలి. తమ గుండెలు చీల్చి, తమ గుండెల్లో గూడుకట్టుకున్న భారతదేశాన్ని చూపించే ప్రయత్నం చేస్తేగాని తమ దేశభక్తి ఋజువుకానట్టి పరిస్థితులు దాపురించినపుడు, అయినదానికీ కానిదానికీ తామూ దేశభక్తులమే అని చెప్పాల్సి వచ్చినపుడు విసిగి పోయి, మూగవోయి ఇక మాట్లాడ్డం వృథా అని ఈ విషయమై మాట్లాడటం ఆపేసిన ఈ దేశంలోని తన మైనారిటీ వర్గం వారిని చూసిన కవి, "నేను మాట్లాడటం మొదలెట్టాలని నిర్ణయించుకున్నా"నంటూ కవిత్వం వినిపిస్తున్నాడు. ఈ దేశపు మెజారిటీ వర్గం వారు తన గుండెలోతుల్లో ఉన్న దేశ భక్తిని గుర్తిస్తారేమోనని ఆశ పడుతున్నాడు. ఎంతటి నిర్హేతుకమైన పరిస్థితుల్లో ఎంతటి సహేతుకమైన ఆశను మోస్తున్నాడో కదా కవి. అది కేవలం ఆశ మాత్రమే కాదు, ఒక నిజమైన దేశ భక్తుడి బాధ్యత కూడా. మేము, మీరు అనే భావన నుండి మనము అనే భావన వైపు నడిపించగలిగిన దార్శనికునిలాగా పదాలతో దేశభక్తి మూలాల్ని, వేర్లనీ తడిమే ప్రయత్నం చేస్తాడు. ఆ ఆశను మోస్తూ బాధ్యతగా దేశం వైపు పయనించే ఆ కవే యాకూబ్.

దేశభక్తికీ, ఎథ్నోసెంట్రిక్ దేశభక్తికీ తేడా వుంటుందన్నది ఆధునిక శాస్త్రీయ అవగాహన. ఎథ్నో సెంట్రిక్ దేశభక్తినే నేషనలిజం, జాతీయతా భావన అనవచ్చు. ఎథ్నోసెంట్రిక్ దేశ భక్తి అభద్రతా భావజాలం పెరిగిపోయిన సమూహాలు వ్యక్తం చేస్తాయనీ, పూర్తి భద్రతా భావన కలిగిన సమూహాలు దేశభక్తిని మాత్రమే వ్యక్తం చేస్తాయనీ అంటాడు డక్కిట్ ( Duckitt-1989).  ఈ సందర్భంగా మన దేశాన్ని అభద్రతా భావనలోకి నెట్టివేస్తున్న రాజకీయ, సాంఘిక శక్తులేవో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దేన్ని ఆశించి దేశ ప్రజలల్లో అవి అభద్రతా భావాన్ని పెంచుతున్నాయో గమనించుకోవాల్సిన అవసరం వుంది. ఇతర దేశాల్నీ, జాతుల్నీ ద్వేషించి యుద్ధానికి తలపడే ఎథ్నో సెంట్రిక్ దేశ భక్తీకీ , తన దేశంలో ఉన్న వారినందరినీ సమానంగా ప్రేమించగలిగే దేశభక్తీకీ అసలు సంబంధం లేదనీ ఈ రెండూ వేరు వేరు అంశాలు అనే విషయ౦ (feshbach et al- 1987,1989,1990)  అర్థం చేసుకోవడం ఈ ఆధునిక యుగంలో ఎంతో అవసరం. లేకపోతె క్రికెట్ వంటి ఆటల్లో కూడా ఉద్రేకావేశాలకు లోనయ్యే బలహీన దేశభక్తులను తయారు చేసుకునే దౌర్భాగ్యం ఏర్పడే ప్రమాదమూ ఉంది. పైగా ఇదే దేశభక్తి అని ఊదరగొట్టే స్పాన్సర్డ్ వ్యాపారమూ దానికి జత కూడుతోన్న తరుణ౦ ఇది. భారత దేశంలో హైందవానికీ, ఇస్లాం కీ ఎటువంటి సహజీవనం సాధ్యంకాదనీ, అవి ఉత్తర దక్షిణ ధృవాలనీ నిరూపించాలని చూసే రాజకీయ శక్తులకు, ముస్లీం రాజుల పాలన మన దేశ చరిత్రలో 'చీకటి యుగ'మని ప్రచారం చేసుకోవాల్సిన అవసరం ఉంటుందేమో గానీ, గంగా జమునా తెహజీబ్ వంటి ఈ సంగమం, మన దేశ ప్రజల జీవితంలో అడుగడుగునా కలిసి పోయి అద్భుతమైన మిశ్రమ సంస్కృతిని ప్రతిఫలిస్తుంటే చూసి తాదాత్మ్యం చెందిన ఎందరో ఈ దేశపు బిడ్డల్ని తనవారుగా హత్తుకుంటాడీ కవి. అటువంటి వారిలో ఇంకే దేశభక్తిని వెలికితీయాలంటూ ప్రశ్నిస్తాడు.

'సారే జహాసే అచ్ఛా' అని
ఈ నేలను పూజించిన వాడిలో
'మా తుజే సలాం' అని
తల వంచి మొక్కిన వాడిలో
కాశీ విశ్వేశ్వరుడి ముంగిట మైమరచి
షెషనాయీ వినిపించిన వాడిలో
ఇంకా ఏ దేశ భక్తి వెలికి తీయను?.
మెహదీ హసన్, గులాం అలీ రాగాల
విశ్వ జనీన సత్యాల ప్రేమల్లోంచి
ఇంకే ద్వేషం గురించి ఆరా తీయను?

భారతదేశ చరిత్రను క్రీ.శ. 11వ శతాబ్దం వరకు హిందూ యుగం అనీ, అప్పటి నుంచి బ్రిటీష్ పాలన మొదలయ్యే వరకూ ముస్లిం యుగమనీ, అక్కడి నుంచి స్వాతంత్ర్యం వచ్చేవరకు బ్రిటీష్ యుగమనీ విభజించడం పూర్తిగా అశాస్త్రీయమని చరిత్రకారుడు రోమిలా థాపర్ వాదన. ముస్లీం రాజుల ఆగమనం మన దేశానికి పెద్ద మార్పేమీ తీసుకురాలేదని ఆయన వాదించినా, ఆ వచ్చిన మార్పు విధ్వంసకరమైనది కాకుండా మిశ్రమ సంస్కృతిని తీసుకు వచ్చిందని తద్వారా దేశ జీవితాన్ని అద్భుతమైన వైవిధ్యానికి గురిచేసిందనీ ఈ కవికి చెందిన జీవన గీతాల్ని చదివేటపుడు అనిపిస్తుంది.

గుర్నమ్మ తిర్నాలలో నేను పెట్టుకున్న దండాలేమైనయ్, కోట మైసమ్మ
భద్రాచలం రాముడు, ద్రాక్షారామం, శ్రీశైల శివలింగాలూ, జాన్ పాడు
సైదులూ దయగల దర్గాలు, నాగుల్ మీరాలు నాలో ఉన్న ప్రేమైక
జీవన గీతాలు

నిజానికి మనిషి మనుగడకు అతడి ఆలోచనలకూ, చర్యలకూ చుట్టూ ఉన్న సామాజిక పరిస్థితులే కారణం అవుతాయి, అందులో కేవలం మతం ఒకానొకటి మాత్రమే కానీ మతం మాత్రమే కారణం కాదు అనే విషయం ప్రాథమికంగా అర్థం చేసుకోవలసిన అవసరం ఉంది. అలాగే సామాన్య ప్రజలలో ఇతర మతాల పట్ల ఎంతోకొంత అయిష్టత ఉండదని కాదుగానీ, అయిష్టత మాత్రమే ఉంటుందనుకోవటం కూడా ప్రాథమిక అవగాహనా లోపమే అవుతుంది. భిన్న మతాలవలంబించే మన దేశంలో ఈ ప్రాథమిక అవగాహనా రాహిత్యం చేసే నష్టం అంతా ఇంతా కాదు. దానిని పూరించే బాధ్యత ఎంత మంది చేస్తున్నారో తెలియదు కానీ, ఈ కవి చాలా సమర్థవంతంగా ఈ ఖాళీలను పూరించే ప్రయత్నం చేస్తాడీ కవితలో. వ్యక్తి యొక్క సాంఘిక జీవనంలో మతానికుండే పాత్ర ఎంత తక్కువదో..అందువల్ల ఎన్నో విషయాల్లో కలిసిపోయిన మనం మతం విషయాల్ని పట్టుకుని జీవన రేఖకు అటూ ఇటూ రెండు తుపాకులమైపోయామేమిటని బాధ పడతాడు. అంతేకాకుండా భూకంపాలొచ్చినపుడు, ఉప్పెనలొచ్చినపుడు మతాల గోడలు చెదిరిపోయి, కలిసి బతికేందుకు, కలిసి నవ్వేందుకు భూకంపాలే రావాలా? ఉప్పెనలే రావాలా అని అడుగుతూ లోలోపల్లో ఆ ప్రేమలు దాచుకోవాలా? అని ధ్వనిస్తాడు.

ఎదురెదురైతే ప్రేమగా పలకరించుకున్నాం
ఒకే గాలిని పతంగాలమై పంచుకున్నాం
ఒకే నీటిని నల్లాల్లోంచి ఒంపుకున్నాం
దవాఖానాల్లో, స్టేషన్లలో, రోడ్లమీద
రోగులమై ప్రయాణీకులమై
ఒకే జీవన సంక్షుభిత రహదారులమై సాగిపోయాం
పీడకలలు వచ్చినప్పుడల్లా ఒకేలా దుఃఖించాం
ఆకాశం తల నిమిరినప్పుడల్లా ఒకేలా తడిశాం
మీ నెత్తురు నా నరాల్లోకి ప్రాణమై ప్రవహించింది
నా గజల్ నీ సంగీతమై ఉప్పొంగింది
సరిగమలు, జానపదాలు ప్రతి గుండెమీంచి రాగాలై ఎగిరాయి
అల్లారఖాలు, బిస్మిల్లాఖాన్లు, పండిత్ రవిశంకర్ లు, భీంసేన్ జోషీలు
ఒకేరాగపు బిడ్డల్లా కలిసి మెలిశారు
ఇపుడిదేమిటి?.

మనదేశంలో ముస్లిములు తమ దేశ భక్తిని పదే పదే నిరూపించుకోవాల్సి రావడం, పైకి కనిపించకున్నా, ఈ దేశపు ప్రధాన సమస్యల్లో ఇదీ ఒకటి. దేశ భక్తీకీ మతానికీ సంబంధం అంటగట్టే కుయుక్తులు కొన్నిసార్లు రాజకీయ స్వలాభాలకు ఉపయోగపడొచ్చేమోగానీ, దేశ సంస్కృతిలో ప్రధాన భూమిక పోషించిన హిందూ ముస్లిం మతాలనూ, వాటిని ఆచరించే ప్రజలను వేరు చేయటం అంత సులభమేమీకాదు. మన దేశంలో బ్రాహ్మణ పండితులూ, ముస్లిం ఇమాంలూ మాత్రమే ఉన్నారనుకునే వారు ఉండనీగాక, మేమంతా ప్రజలమంటూ పలికే ఆశేష జనవాహినిని ముందు, ఇటువంటి ఛాందసవాదుల ఆటలు సాగవన్నది దాదాపు వేయ్యి సంవత్సరాల తరబడి ఈ మతానుయాయుల సాంఘిక సహజీవనం నిరూపిస్తూనే ఉన్నది. ముస్లిములందరినీ ఒకే గాటున కట్టి వారి వేష భాషలను కదలికలనూ అనుమాన దృక్కులతో కాల్చేస్తూ, నిలువెల్లా పరీక్షలకు గురిచేస్తుంటే ఈ దేశంలో 'హమ్ బుల్ బులేహై ఇస్ కీ' అని తెగిన రెక్కలతో ఇంకెలా స్వేచ్ఛగా విహరించను అని కవి బాధపడుతున్నపుడు, మెజారిటీ హిందువులుగా ముస్లింల పట్ల మన దృక్పథం సరైనదేనా అని ఇకనైనా అవలోచించుకోక తప్పదు. ఇస్లాంకు తామే రక్షకులమని చెప్పుకునే రాజకీయ వాదులకూ, హైందవానికి తామే ప్రతినిధులమని చెప్పుకునే రాజకీయ వాదులకూ వేయి సంవత్సరాలుగా పరిఢవిల్లిన సాంస్కృతిక వైవిధ్యం, వైరుధ్యంలా కనిపించటం కేవలం తాత్కాలిక రాజకీయ తక్షణావసరమే అని ప్రజలు గుర్తించే రోజులొస్తాయని ఆశిద్దాం. ఈ కవి మనందరికోసం, తనలోపల మండే నిప్పును తీసుకుని వచ్చాడు, దాని మూలాల్ని పరీక్షిద్దాం..చేతనైతే అందరమూ కలిసి చల్లారుద్దాం.

దేశ భక్తి కూర్చి, గురించి
------------------------------
                 Kavi Yakoob

విరిగిపోతున్నాను
నాలో బీటలు వారుతున్న దేహం
కదులుతున్న మూలాలు, వేర్లు
పెళ పెళ లాడుతున్న మందిరాలు, మసీదులు, కమానులు
రంగు; జాతి, తెగ, భాష
విరిగి, ఆపై కూలి, చీలిన దేశం

ఆ మండుతున్న మంటల్లోంచి
మీకోసం నిప్పును తెచ్చాను
పరీక్షించండి
చేతనైతే చల్లార్చండి
                  1
భుజ్ వీధుల్లో మసీదులు ఊడ్చి
నమాజు చేసుకొమ్మని ఆహ్వానించిన హిందూ వీధుల్లోకి
భూకంపం ఎంత ప్రేమను తెచ్చిందో!
మనుషులంతా కలిసి బతికేందుకు, కలిసి నవ్వేందుకు
భూకంపాలే కావాలా! ఉప్పెనలే రావాలా!
                     2
పచ్చి అబద్దాల్ని నిజాలుగా పదే పదే నమ్ముతున్నాం
అదే నిజమని వాదిస్తున్నాం
పేర్లలోనో, ఉండే వీధుల్లోనో, పుట్టిన ఇళ్లలోనో
వేరు వేరు గీతలుగా,మారిపోతున్నాం.

ఎదురెదురైతే ప్రేమగా పలకరించుకున్నాం
ఒకే గాలిని పతంగాలమై పంచుకున్నాం
ఒకే నీటిని నల్లాల్లోంచి ఒంపుకున్నాం
దవాఖానాల్లో, స్టేషన్లలో, రోడ్లమీద
రోగులమై ప్రయాణీకులమై
ఒకే జీవన సంక్షుభిత రహదారులమై సాగిపోయాం
పీడకలలు వచ్చినప్పుడల్లా ఒకేలా దుఃఖించాం
ఆకాశం తల నిమిరినప్పుడల్లా ఒకేలా తడిశాం
మీ నెత్తురు నా నరాల్లోకి ప్రాణమై ప్రవహించింది
నా గజల్ నీ సంగీతమై ఉప్పొంగింది
సరిగమలు, జానపదాలు ప్రతి గుండెమీంచి రాగాలై ఎగిరాయి
అల్లారఖాలు, బిస్మిల్లాఖాన్లు, పండిత్ రవిశంకర్ లు, భీంసేన్ జోషీలు
ఒకేరాగపు బిడ్డల్లా కలిసి మెలిశారు
ఇపుడిదేమిటి?.
నిల్చున్న నేల మీద నీదో రాగం నీదో బాణీలా
నిప్పుల్నిదోసిళ్లలో పట్టినట్టు
బాధను భరించలేకపోతున్నాం
జీవన రేఖలకటూ ఇటూ
నువ్వూ నేనూ తుపాకులమయ్యాం
                  3
నిజానికి మాకేం అక్కర్లేదు ఈ మరణ శాసనాల్తో
మాకేం అక్కర్లేదు ఈ అగ్నిని రాజేసే ఆజ్యాల్తో
చెట్టు పూలని ప్రేమించినట్టు
నీళ్లు చేలని ప్రేమించినట్టు
నేనీ నేలను ప్రేమించాను
చెట్టుకొమ్మలమీద కూర్చుని మేలుకొలుపులు పాడే పక్షిలా
నేనెపుడూ దేశభక్తి గురించే మాట్లాడాను
నా దేహాన్ని కోల్పోలేనట్లు నా దేశాన్ని ఎవరికోసమో కోల్పోలేను
ఉప్పలమ్మల్నీ, బొడ్రాయిల్నీ పూజించాను
తంగెడు పూల మండల్ని బాలింతగా మా అమ్మ
నారాకకు గుర్తుగా దారినిండా ణా ఊరిదాకా పరుచుకుంటూ వచ్చింది
నేను ఏ ఊరువాడినో ఈ పూలకి తెలుసు
పూలను ప్రేమించే ఈ గాలులకు తెలుసు

బందగీ పాడిన విముక్తి గీతాలూ
షోయబుల్లాఖాన్, గులాం యాసీన్ రాసిన నల్ల నినాదాలూ
గాలిబ్ గానం చేసిన మనోహరాలూ
మగ్దూం ఫైజ్ మాటల మంటలూ
నేను వరించిన పదాలు

'సారే జహాసే అచ్ఛా' అని
ఈ నేలను పూజించిన వాడిలో
'మా తుజే సలాం' అని
తల వంచి మొక్కిన వాడిలో
కాశీ విశ్వేశ్వరుడి ముంగిట మైమరచి
షెషనాయీ వినిపించిన వాడిలో
ఇంకా ఏ దేశ భక్తి వెలికి తీయను?.
మెహదీ హసన్, గులాం అలీ రాగాల
విశ్వ జనీన సత్యాల ప్రేమల్లోంచి
ఇంకే ద్వేషం గురించి ఆరా తీయను?

నేనేసుకునే బట్టలు, పెంచుకునే గడ్డాలు, మాట్లాడే భాషలూ
నిలువెల్లా పరీక్షకు నిల్చునేటప్పుడు
నా కదలికలను కుట్రల జాడలుగా ముద్రలేస్తున్నపుడు
నేనేం హాయిగా శ్వాసించను
ఇంకెంతకాలం నిప్పుల మధ్య దహించుకుపోను!
"హమ్ బుల్ బులేహై ఇస్ కీ" అని తెగిన రెక్కల్తో
ఇంకెలా స్వేచ్ఛగా విహరించను!

గుర్నమ్మ తిర్నాలలో నేను పెట్టుకున్న దండాలేమైనయ్, కోట మైసమ్మ
భద్రాచలం రాముడు, ద్రాక్షారామం, శ్రీశైల శివలింగాలూ, జాన్ పాడు
సైదులూ దయగల దర్గాలు, నాగుల్ మీరాలు నాలో ఉన్న ప్రేమైక
జీవన గీతాలు
          4

ఈ భూమ్మీది చెట్లను తొలగించలేనట్లు
ప్రాణవాయువులాంటి నా దేశభక్తినెవరూ తొలగించలేరు
దేశభక్తి ఎవడి దొడ్లోనో పెంచుకునే
పెరటి మొక్క కాదు
విధానాలు నిర్ణయించడానికి
నిజానికి దేశభక్తి గురించి మాట్లాడినప్పుడల్లా
ద్వేషాన్ని ఎదురుగా నిలబెట్టారు
అందుకనే అందరూ మాట్లాడటం ఆపేసిన దగ్గర్నుండే
నేను మాట్లాడ్డం మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నాను.

(కవిత్వ సందర్భం23)
20-7-16

No comments:

Post a Comment