Friday, 15 July 2016

విరించి ll వెలిసిన వర్షం ll
.............................

ఆకాశంలో మునకలు వేసి
తడిగుడ్డలతో అలాగే వచ్చి నిలుచున్నట్టుందీ రోజూ
ఏదీ..!! ఒక్క చుక్కా కిందికి రాలదే..!
పిడుగులు ఉరిమే పెన్ను గొంతులో
ఎన్ని సైలెన్సర్లు బిడాయించుకుని కూచున్నాయో
దిక్కుమాలిన గాలి తప్ప కాగితాలు తడిసిందెప్పుడు?

చకోర పక్షులు గొంతులో ఎగిరినప్పుడో
ముత్యపు చిప్పలు విత్తనాల్లో దాక్కున్నప్పుడో
వాతావరణ శాఖ ప్రకటించినప్పుడో
మేఘ మదనానికి హెలికాప్టర్ని తిప్పినప్పుడో
ఇంకెవరో ఆజ్ఞాపించినప్పుడో
మనకిష్టం వచ్చినపుడో
కురవమన్నప్పుడల్లా కురవదు వర్షం
కవిత్వంలాగే వర్షం కూడా..
ఆకాశంలో మేఘాలు మేరు పర్వతమవ్వాలి
నిప్పులు చిప్పిల్లేలా మెరుపుల్నెక్కు పెట్టాలి
అమృతం కురియాలంటే పెన్ను గొంతుకలో
ప్రపంచ౦లోని విషాన్నంతా దాచేయాలి.

అరే..వీపుమీద తుపాకీ మోసే వాడికే అంతుంటే..
సప్త సముద్రాల్ని దాటి
ఈదురుగాలులకోర్చి
దిగంతాల్నీ ఆకాశ తీరాల్నీ ఈది
మన ముంగిట కురిసిన చినుకుకు
ఇంకెంత గర్వం వుండాలి.

చంపేయబడిన మనిషీ, కొట్టేయబడిన పదమూ
ఎన్నటికీ ఒకటి కాదు నేస్తం
చంపేయబడిన మనిషెవ్వడూ ఇంకొక్క మనిషిని
బతికించలేడు, కానీ..
కవిత్వంలో కొట్టేయబడిన పదాలే ఎక్కువ

తలకట్టూ దీర్ఘాలూ కొమ్ములూ పొల్లులూ ఔత్వాలు
ఎక్కుపెట్టిన మర తుపాకులు
వొత్తులూ ఋత్వాలు సున్నాలూ విసర్గలు
భుజానికి తగిలించుకున్న బుల్లెట్ సంచులు

వర్షం అందరిని వంగి ఉండమంటుంది తనకింద
గొడుగైనా తల వంచే వుండాలి
ఎన్ని తలల్ని తడవకుండా ఆపగలిగినా..
టెర్రరిస్టయినా తలమీద చేతులెత్తి పరిగెత్తాలి
ఎన్ని తుపాకులు వీపుమీద మోస్తున్నా

తెరచి వుంచిన పూదొన్నెలే ఈ ప్రపంచంలో
వర్షానికెదురు నిలుస్తాయి
వర్షం ఆగిపోయాక బొట్లు బొట్లుగా అవి
కవిత్వాన్ని కారుస్తాయి.

గమనించావా..?
చుక్క కారలేదనుకుంటూ వర్షమై కురిసాన్నేను
ఓ పాఠకుడా ఆగిపోయావేమి?

15/7/16

No comments:

Post a Comment