Saturday, 29 October 2016

విరించి ll అడవి చెట్లు ll
..............................
అడవి చెట్లన్నీ
ఆకుపచ్చగానే పుట్టి పెరుగుతాయి
ఎర్రెర్రటి పూలే విరగబూస్తాయి
ఆకుల్ని జెండాల్లా ఎగిరేస్తాయి
కొమ్మల్ని తుపాకుల్లాగా చాస్తాయి
అంతాకలిసి,
ఒక్క సూర్యోదయాన్నే కలగంటాయి

అడవి చెట్ల మీద
కోయిలలు పాటలు కడతాయి
వసంతం నుండి శిశిరం దాకా అవి
చెట్ల భాషే వినిపిస్తాయి
ఆ చెట్ల మీదే అవి గూళ్ళు కడతాయి
అంతా కలిసి,
ఒక్క సూర్యుడినే ముక్కుతో కొరుక్కుతింటాయి.

అడవిలో చెట్లెందుకని అడిగాడు వాడు
లోకంలో పచ్చదనం కోసమన్నాయవి
అడవిలో వుండి ప్రయోజనమేమన్నాడు వాడు
వర్షాలకోసమన్నాయవి
నగరంలో వుంటే నీడుండేదన్నాడు వాడు
అక్కడంతా కాలుష్యమన్నాయవి
అడవి పూలెందుకన్నాడు వాడు
కొమ్మలు, ఆకులెందుకన్నాడు
చెట్లన్నీ కూలుస్తానన్నాడు
అడవుల్ని కాలుస్తానన్నాడు వాడు
*       *       *       *       *
అడవిలో రాళ్లు శ్వాసిస్తున్నాయిపుడు
కోయిలలన్నీ పైకెగిరాయిపుడు
పక్షి కంటికన్నీ కనిపిస్తాయి,
వాటికి
అడవీ తెలుసు, నగరమూ తెలుసు

26/10/16

Tuesday, 25 October 2016

ఓటరు సణుగుడు

ఈ మధ్య చాలా విచ్చలవిడిగా వాడబడుతున్న పదాలు రెండున్నాయి. ఒకటి భక్తులు( కొద్దిగా వెటకారంగా బత్తులు), రెండు మేథావులు.
ప్రజాస్వామ్య దేశంలో ఎవరి మనోభావాలకనుగుణంగా వారు మాట్లాడే హక్కు ఉంటుంది గానీ, మరీ అయిందానికీ కానిదానికీ ఈ పదాలు ఉపయోగించేస్తూంటే అసలెవరు భక్తులో ఎవరు మేథావులో అర్థం కాని పరిస్థితి ఉంది.ప్రభుత్వం తీసుకునే ఏదైనా ఒక నిర్ణయాన్ని స్వాగతించే వాళ్లు అందరూ భక్తులు గానూ, వ్యతిరేకించే వారందరూ మేథావులుగానూ ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్లు నిర్వచించేస్తూ ఉన్నారనిపిస్తుంది.

     ఇపుడుండే ప్రభుత్వం బీజేపీ పార్టీతో కూడిన ఎన్డీయే కూటమి కాబట్టి, ప్రభుత్వ నిర్ణయాన్ని ఎవరైనా ఏ సందర్భంలోనైనా సమర్థిస్తే వారు అదే క్షణంలో భక్తులుగా అభివర్ణింపబడటం చూస్తున్నాం. అసలు భక్తులనే పదమే సరయినదికాదు. ఎన్నికల ద్వారా దేశంలోని మెజారిటీ ప్రజలు ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు ప్రజాస్వామ్య బద్ధంగా. ఇపుడా ఎన్నుకోబడిన ప్రభుత్వం నుండి తమ హక్కులను అవసరాలను పొందే ప్రజలు, ప్రభుత్వ విధానాలను సమర్థించినంత మాత్రాన వారిని భక్తులని హేళన చేయనవసరం లేదు. బీజేపీ కూటమిని ఏదో ఓ విషయంలో సమర్థించినంత మాత్రాన పక్కా హిందూ వాదులుగా, పరమ భక్తులుగా, తొత్తులుగా చిత్రించే ప్రయత్నాలు కనిపిస్తూంటాయి. ఇది ఒక వైపు మాత్రమే, ఇంకో వైపు ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా జేజేలు పలికే వారు లేక కాదు. ఐతే సమర్థనలూ, వ్యతిరేకతలూ ఎపుడూ ఉండేవే..వారికో వెటకారమైన పేరు పెట్టడమే ఇపుడుండే ట్రెండ్.

ప్రజాస్వామ్యంలో పార్టీలుంటాయి. వాటికి ఎజెండాలుంటాయి. ప్రజలుంటారు. ప్రభుత్వాలని ఎన్నుకుంటారు. ఐతే ఎన్నుకునేది ప్రభుత్వాలను, అంతేగానీ పార్టీలను కాదనే విషయం పార్టీలు, లీడర్లు తెలుసుకోవాలి. ప్రభుత్వాలను పార్టీ ప్రయోజనాలకు వాడుకోవడం, ఏ పని చేసినా తమ పార్టీ గొప్పదనం వలననే సాధ్యమయిందన్న పోకడ కనిపించటం చూసినపుడు, అసలు ప్రభుత్వాన్ని ఎన్నుకున్నామా పార్టీని ఎన్నుకున్నామా అని సామాన్యుడు బుర్ర గోక్కోక తప్పదు. ఆ మధ్యన బీజేపీ పార్టీ అధ్యక్షుడు తెలంగాణా కు వచ్చి 'కేసీ ఆర్ అండ్ కంపనీ పాలన 'అంటూ ఏదో వెటకారాలు చేసి పోయాడు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు గానీ, కంపనీలను కాదు అని ఆ సదరు లీడరంగారికి తెలీదు అనుకోలేం. తెలిసినా తాత్కాలికంగా పడే చప్పట్లు, అయిదేండ్ల తర్వాత ఓట్లుగా మారకపొతాయా అనే దుగ్ధ. ఆయన లెక్క ప్రకారమే తీసుకుంటే, ఇపుడు కేద్రంలో 'మోడీ అండ్ కంపనీ' పరిపాలనలో ఉన్నట్టా?. రాజ్యాంగంలో ప్రభుత్వాలని ఎన్నుకోవాలని కదా ఉన్నది, ఈస్ట్ ఇండియా, సౌత్ ఇండియా కంపనీలను కాదు కదా..ప్రభుత్వాన్ని నడిపే పార్టీకి చెందిన అధ్యక్షుడే ఇలాగున్నాడు మరి. ఇక సామాన్య నోటి దురుసు మనుషుల సంగతి చెప్పనేల?.

ఇక, ప్రజలుండగా, పార్టీలుండగా, ప్రభుత్వాలుండగా.. మధ్యలో ఈ మేథావులంటే ఎవరు?. ప్రభుత్వాన్ని ఆ విధానాల్ని విమర్శించే వారినందరినీ కట్టగట్టి మేథావులు అని వెటకారంగా అంటున్నారనటంలో ఎంత నిజం వుందో, ప్రభుత్వ విధానాల్ని వ్యతిరేకించే ప్రతీవాడూ తనను తానో మేథావి అని అనుకుంటుంటాడనటంలో అంతే నిజం ఉంది. నిజానికి మేథావులు అనే వారు పార్టీ సిద్ధాంత కర్తలు. వీరు రాజకీయాలకు ఒకింత దూరంగా ఉంటూ, సమాజాన్ని, రాజకీయాలను దగ్గరి నుండి పరీక్షిస్తూ, పరిశీలిస్తూ పార్టీ సిద్ధాంతాలను ఎప్పటికప్పుడు ఆ కాలానికి అనుగుణంగా రూపొందిస్తూ సూచనలిస్తూ ఉండేవారు. కమ్యూనిష్టు పార్టీకి ఈ సిద్ధాంత కర్తల బలమే అసలైన బలం. మిగితా పార్టీలకు అలాంటి సిద్ధాంత కర్తలున్నారని అనిపించదు. ఉన్నా, ఒక సిద్ధాంతం కోసం కాక ఎలక్షన్లలో పార్టీని ముందుకు తీసుకుపోవడానికి ఎలాంటి దందాలు చేయాలనే సలహాలిచ్చే వారుగా తప్ప ఇంకోలా ఉన్నట్టు అనిపించదు. పైగా కొన్ని పార్టీలకు కర్త భర్త కార్యకర్త సకలమూ ఆ పార్టీ అధ్యక్షుడే. అంతే కాక ఆ అధ్యక్షుడి కొడుకు, కొడుకుకి కొడుకు, ఇలా ఆ ఇంట్లో పొరపాటున పుట్టిన ప్రతి వాడు ఆటోమేటిక్ గా అధ్యక్షుడు అయ్యుంటాడు. వయసొచ్చి తల నెరిసినా చోటా భీం ఆటలు ఆడుకునే వాడైన సరే..ఆ ఇంట్లో పుట్టిన మహానుభావుడిగా సర్వమూ తానే కావాల్సిందే.  ఇపుడు "సిద్ధాంత రాజకీయాలు" అనే మాటే వినిపించటం లేదు. ఆ పదాన్నే మరచిపోయాం. "ఓటు బ్యాంకు రాజకీయాలు" అనే మాటే వింటుంటాం. ఓటు బ్యాంకు కోసం పనిచేసే వారిని మేథావులు అనగలమా?. చివరికి కమ్యూనిస్టు పార్టీ వారు కూడా అవసరానికనుగుణంగా పార్టీలతో పొత్తులు కుదుర్చుకుంటూ సైద్ధాంతిక మేథావులను బలహీన పరిచేసరికి, మేథావులనే పదం చాలా నీచంగా వెటకారంగా తయారై కూర్చుంది. అందువల్ల ఏదైనా ప్రభుత్వ నిర్ణయాన్ని ఎవరైనా, సామాన్య మానవుడైనా కొంత వ్యతిరేకించగానే మేథావి ఐపోతుంటాడు.

చివరగా, ఓటరు అనే సామాన్యుడు కొన్ని విషయాల్లో ప్రభుత్వం తనకు నచ్చినది చేసిందని సంతోష పడతాడు, ఇంకొన్ని విషయాల్లో ఇదేంటి ఇలా చేసిందని బాధపడతాడు. వాడు భక్తుడూ కాడు, మేథావీ కాదు. ఓటరు ఓటరే. సామాన్యుడే.

విరించి విరివింటి

కవిత్వ సందర్భం 28 juluru

ఓ జెండా నీవెటు వైపు?
-------------------------------

సమసమాజ కాంక్ష అనేది అకస్మాత్తుగా ఆకాశం నుండి ఊడిపడినట్టుగా మనిషిలోకి ప్రవేశించదు. దాని పునాదులు సమాజంలోనే, అది కూడా పెట్టుబడిదారీ వ్యవస్థలోనే నిగూఢంగా వేళ్లూనుకుని ఉంటాయి. సారంలో పెట్టుబడీ దారీ లక్షణాల్ని పుణికి పుచ్చుకున్న సమాజం సోషలిస్ట్ భావజాల విత్తులకు కూడా అవసరమైనంత శక్తిని కలిగించేదిగా వుంటుంది.  పెట్టుబడిదారీ వ్యవస్థలోని పారడాక్స్ ఏమంటే అది సమాజాన్ని ముక్కలు ముక్కలుగా, వర్గాలుగా ఒకవైపు విడగొడుతూ నే, మరో వైపు అనంత విశ్వంలో మానవుడు తాను బావిలోని కప్పను కాదనీ, తానూ ఈ ప్రపంచంలో ఒక భాగమనీ, తనకూ పరిపూర్ణ మానవుడిగా మారే సర్వ హక్కులూ ఉన్నాయనీ తెలుసుకోగలిగేలా కూడా చేస్తుంది. పెట్టుబడిదారీ వ్యవస్థ ఒకవైపు పీడితులపై పీడకుల అణచివేతను వివిధ రూపాల్లో ప్రదర్శిస్తున్నా, మరో వైపు అదే అణచివేతకు వ్యతిరేకంగా పోరాడగలిగే ఆలోచననీ పీడితుల్లో తీసుకువస్తుంది. పెట్టుబడిదారీ వ్యవస్థలో దయ, నిస్వార్థత, ఏకత, ఆధ్యాత్మికత, సంస్కృతి వంటి గుణాలు తమకవసరం లేనపుడు నీచమైన వాటిగా, అవసరమొచ్చినపుడు గొప్ప విషయాలుగా చూపించబడితే, సోషలిస్ట్ భావజాలం వీటి వెనుకాల ఎంతటి దోపిడీ నిగూఢంగా దాగి వుందో చూపిస్తుంది. ఒక సమాజంలో ఈ భావనల బలాబలాల్ని తేల్చటం అంత సులువేం కాకున్నా, పెట్టుబడిదారీ వ్యవస్థలో సోషలిస్ట్ భావనల విత్తులు ఉన్నపుడు మాత్రమే ఆ సమాజంలో దోపిడీ, తిరుగుబాటు, అణచివేత వంటి మాటలు, కనీసం భావనల రూపం దాల్చే ప్రయత్నం చేస్తాయన్నది వాస్తవం. ఈ విత్తులు లేని సమాజంలో దోపిడీపై తిరుగుబాటు కాదు కదా, కనీసం దోపిడీని గుర్తించగలిగే శక్తిని కూడా మనిషి కలిగి ఉండడు. తెలంగాణా సమాజం అటువంటి విత్తులు పుష్కలంగా ఉన్న సమజం. ఏ సోషలిస్ట్ భావనల్నైతే కమ్యూనిస్ట్ పార్టీ ఈ సమాజంలోకి తీసుకుని వచ్చిందో, అవే భావనల విత్తులు పెరిగి ప్రత్యేక తెలంగాణా ఉద్యమ రూపంలో మొక్కలుగా, వృక్షాలుగా మారుతున్న సమయాన కవి జూలూరీ గౌరి శంకర్ కమ్యూనిస్ట్ పార్టీ ఆశయాలకూ, దాని ఆచరణకూ మధ్య దొరకని లంకెను పట్టుకునే ప్రయత్నం చేస్తాడీ కవితలో.

తెలంగాణా సమాజానికి సోషలిస్ట్ భావనలని తీసుకొచ్చింది నిస్సందేహంగా కమ్యూనిస్ట్ పార్టీనే. అంతేకాక కమ్యూనిస్ట్ పార్టీ మనదేశంలో బలపడటానికి కూడా తెలంగాణా సమాజం అంతే కారణం. తెలంగాణా భూ పోరాటాలు, సమైక్య రాష్ట్రంలోని నక్సలైట్ ఉద్యమాలూ, పాలకులలో, పరిపాలనలో తెచ్చిన మార్పులు తక్కువేం కాకున్నా , అంతకన్నా ఎక్కువగా ప్రజలలో ప్రశ్నంచే తత్వాన్నీ, అందుకు తగ్గ రాజకీయ సామాజిక చైతాన్యాన్నీ కలిగించింది. కానీ ప్రత్యేక తెలంగాణా ఉద్యమం సమయంలో కమ్యూనిస్ట్ పార్టీ పాత్ర ఒక ప్రశ్నార్థకంగా మిగిలింది. కమ్యూనిస్ట్ ఆశయానికి అనుగుణంగా, అణచివేతకూ, దోపిడీకి వ్యతిరేకంగా ఏ వేర్పాటువాద ఉద్యమం మొదలైందో, అదే ఉద్యమం విషయంలో ఆ పార్టీ అవలంబించిన మౌనం కమ్యూనిస్ట్ అభిమానులనూ ఆశ్చర్యపరిచింది. రాజకీయ కారణాలో ఇంకే కారణాలోగానీ, వారి  వ్యూహాత్మక మౌనం, ప్రత్యేక తెలంగాణా వాదులకు ఊహ లేని మౌనంగా కనిపించింది. నైతిక మద్ధతు అవసరమైన సమయంలో మొండి చేతులు చూపించవలసిన అవసరం ఏముందో నిజానికెవ్వరికీ తెలీదనే చెప్పాలి కమ్యూనిస్ట్ పార్టీ వర్గాలకు తప్ప. కమ్మునిస్టు అభిమానిగా కవి జూలూరి గౌరీశంకర్ ఆ పార్టీతో సైద్ధాంతికంగా తాడోపేడో తేల్చుకోవాలనుకుంటాడీ కవితలో. "ఓ ఎర్రజెండా నీవెటు దిక్కో తేలాలిపుడు" అని పట్టుబడతాడు. "విముక్తి పోరాటమే ఎర్రజెండా మ్యానిఫెస్టో కదా, తెలంగాణా విముక్తి అంటే ఎర్ర జెండా రక్తవర్ణమై రెపరెపలాడదా?" అంటూ ప్రశ్నిస్తాడు.  కమ్యూనిస్ట్ భావజాలం మీద, కమ్యూనిస్ట్ పార్టీ మీద అపారమైన ప్రేమ నమ్మకం కూడా కనిపిస్తుందీ కవితలో. ఆ ప్రేమతోటే కాబోలు ఒకింత గట్టిగా అడుగుతాడు నీవెటువైపని. ఆ నమ్మకంతోటే కాబోలు, ఈ పోరు గడ్డ మీద రియలెస్టేట్ కబ్జాలను తుడిచేయడానికి నీవే కట్టమైసమ్మవి కమ్మంటూ ప్రార్థిస్తాడు.

తెలంగాణ  రగల్ జెండా
------------------------------
         జూలూరి గౌరీ శంకర్.

నిన్నెట్ల  సాదుకున్నం
మా నెత్తురు  పోసి  ఎట్లపెంచుకున్నం

నువ్వు
అనగారినోల్లకు  అండవని
నేల  విముక్తి  నేతవని
ఆకలి  కడుపుకు  బువ్వవని
నేర్రలు  బాసిన మట్టికి  నీళ్లవని
నిన్ను  పిచ్చిగా  ప్రేమించినోన్ని
ఈ వెర్రి  గొంతుకతో  ఎర్రపాట పాడినోన్ని

మా  కలతలల్ల  కస్టాలల్ల
కన్నీళ్ళల్ల  కల్లోలాలల్ల
పాడుకున్న పాటకదే నువ్వు
నా  మనసు ఎగరేసిన ఎరుపు  కదే నువ్వు
మా  వాకిళ్ళ నొదిలి
సెట్టు సెలకల్ని బట్టి
ఈ  బొందిల  పాణం
నీకోసమేనన్నోళ్ళ నొదిలి
ఎట్ల  బోతవే సెప్పు ఓ నా ఎర్రజెండా
నన్ను నీకు  ఎడబాసేదేవరో సెప్పు  రగల్ జెండా

నా నేలను  సెరబట్టినోళ్ళపై కదా
దండు కట్టాల్సింది
అక్రమణతత్వం మీద  కదా
ఎర్రజెండా కలబడాల్సింది
నా బువ్వ లో మన్నుబోసినోడి చెంత
ఎట్ల  నిలుస్తవే  సెప్పు నా  ఎర్రజెండా
ఎర్ర జెండంటే సాయంకోరినోళ్ళ  సేతికర్ర  కదా

నా నేలని  నాకిస్తవని  కదా
కొడవలికి  కంకినైoది
సుత్తి  కొడవలి  నక్షత్ర మైంది

ఈ సేత్తో  ఉగ్గుపాలు తాపికదా
నిన్ను  ఎర్రగా  ఎగరేసింది
నా  నేల  పొత్తిళ్ళలో పెరిగే కదా
దేశానికీ  ఎర్రజెండానిచ్చింది

నా నేలను  ఉచ్చుల్లో బిగిస్తున్న వాళ్ళ సేతుల్లో
సిక్కినవు  కదే  ఓయమ్మా

ఓ ఎర్ర  జెండా
నువ్వు  ఎటుదిక్కో  తేలాలిప్పుడు
ఎర్రజెండాకిది  పరీక్షాకాలం
పేగుబంధాల్ని తెగతెంచేటొల్ల  జోలేందుకే  అవ్వ

మా బాధలు  తీర్చే ఓదార్చే
కట్టమైసమ్మవి  కావే ఓ నా ఎర్రజెండా
పోరాట జాగపైన రియలెస్టేట్ ల్ని తుడిసేయవే తల్లీ

కసికసిగా  ఎర్రెర్రగా
తెలంగాణ  పాట పాడవే ఎర్రజెండా

ఆ  నాయకత్వం  సేతులిడిసిపెట్టి
ఈ ప్రత్యెక  పాట  పల్లవించవే అమ్మా
ఈ నేలపై  ఏ ఆధిపత్యం  సెల్లదని సెప్పవే  ఎర్రజెండా
మూడు  కోట్లమంది  పక్కన  నిలవవే ఎర్రజెండా
నా  ఎర్రజెండాను  ఎట్ల ఎగరేయాలో తెలుసు నాకు
విముక్తి పోరాటమే  ఎర్రజెండా  మ్యానిఫెస్టో కదా
తెలంగాణా  విముక్తి  అంటే
ఎర్రజెండా రక్తవర్ణమై రెపరెపలాడదా?

ఇప్పటికీ తెలంగాణా ఉద్యమం ప్రాంతీయ వాదమనే వారూ ఉన్నారు. ప్రత్యేక తెలంగాణా వాదం ఎంత అప్రాంతీయమో, అంతకన్నా ఎక్కువగానే సమైక్యాంధ్ర వాదం ప్రాంతీయం. కాల పరీక్షకు నిలవని ఒకే భాషవాదం, విశాలాంధ్ర వాదం వంటివి వాటిలోని దోపిడిని ఎంతో అందంగా అలంకరించి దాచి వుంచుతాయి. చివరికి ఆ చారిత్రక ఘట్టమైతే ముగిసింది. సుదీర్ఘ పోరాటాల ఫలితంగా తెలంగాణా ఐతే విముక్తి పొందింది. కానీ కేవలం భౌతికమైన విముక్తి విముక్తికి పూర్తి రూపం కాదు. ఆ లెక్కన కమ్మునిస్టు ఆశయం అప్పటికీ ఇప్పటికీ కూడా సజీవమే. ఉద్యమసమయంలో ఏకాగ్రతతో కొంగ జపం చేసిన పార్టీ, ఇపుడు ఆశయాన్ని ఆచరణను కలిపుతూ  సాగాలని కోరుకు౦దాం. కవితలో కవి ఆశయం ప్రత్యెక తెలంగాణా మాత్రమె కాదు, కమ్యూనిస్ట్ భావన అందించే ఉద్యమ స్ఫూర్తి కూడా.


కవిత్వ సందర్భం 28
26-10-16

Saturday, 15 October 2016

జాతకం ll విరించి ll

జాతకం ll విరించి ll
........................
మనుషులూ నక్షత్రాలు
గ్రహాలూ బంధువులూ
ఆకాశమూ, భూమి

కనుచూపు మేరలోనే
భూమ్యాకాశాల కలయిక
నాసాలో, ఇంకా తొలిదశలో..

మనిషి గీసుకున్న నమూనాలు
ఆకాశంలో పన్నెండు దేశాలు
భూమ్మీద నూటతొంభైయ్యారు రాశులు

కొండలు, సముద్రాలు, కాంతి సంవత్సరాలు
మనసులు దూరాలు దూరాలు

బిగ్ బ్యాంగ్ లో జన్మ కుండలి
కృష్ణ బిలం లో ఒబిచ్యువరీ

అవును, విశ్వం వ్యాపిస్తోంది

మనుషుల ప్రభావం నక్షత్రాల మీద
ఒంటరితనం.

7-10-16

Friday, 14 October 2016

కవిత్వ సందర్భం 27 vimala



వంటింట్లో ఏముంది?
-----------------------------

ఎపుడైతే మనం మన అస్తిత్వం కోసం పోరాటం మొదలు పెడతామో...మనమీద ప్రపంచానికున్న దృష్టికోణంతో కూడా పోరాడాల్సి వుంటుంది. ఆ దృష్టికోణాన్ని బద్దలు చేయాల్సి వుంటుంది. అలా చేయాలంటే ఎన్నుకునే మార్గం కఠినంగా ఉండాలా లేక మృదువుగా ఉండాలా అన్నది ప్రపంచానికున్న ఆ దృష్టికోణపు కర్కశత్వాన్ని బట్టి ఉండాలి. సాహిత్యంలో పదాల సహాయంతో అస్తిత్వ పోరాటం చేయటమంత సులభమైనది కాదు. స్త్రీ వాద కవిత్వం స్త్రీల పట్ల ప్రపంచ దృక్కోణాన్ని ఎంతవరకు మార్చిందో తెలుసుకోవటానికి కంటిముందున్న ప్రస్తుత సమాజమే సాక్షి. దీనికి ఈ కవిత్వం, దురదృష్టవశాత్తూ  వాసి ఉన్నంతగా రాశి తగినంతగా లేకపోవడం బహుశా ఒక కారణంగా కనిపిస్తున్నది. శారీరక స్త్రీని, సమాజం ఏర్పరిచిన మానసిక స్త్రీని వేరుచేసి చూపించటం ద్వారా, తన అస్తిత్వం శరీరంలో కాదు, మనసులో ఉందని చెప్పటానికి 80 వ దశకంలో మొదలైన తెలుగు స్త్రీ వాద కవిత్వం ఇంకా ఎక్కవలసిన శిఖరాలెన్నో ఉన్నాయన్నది కాదనలేని నిజం. ఈనాటికీ స్త్రీల మీద జరుగుతున్న లైంగిక దాడులూ, యాసిడ్ దాడులూ స్త్రీ వాద కవిత్వపు పటుత్వాన్ని పెంచాల్సిన అవసరాన్ని తెలుపే సవాళ్లుగా మిగిలిపోతున్నాయి. ఒక సంఘటన జరిగినపుడు దానిని ఖండిస్తూ వచ్చే కవిత్వం వచ్చినట్టుగా, ఆ విషయం పట్ల ప్రపంచపు దృష్టికోణం మార్చగలిగిన కవిత్వం రావాల్సిన అవసరం ఉంది.

 స్త్రీ కానీ పురుషుడు కానీ, ఒక తల్లికే పుడతారు. ఈమె భౌతిక మైన స్త్రీ. కానీ మానసికమైన స్త్రీ లేదా సమాజపపు దృష్టికోణంలోని స్త్రీ మాత్రం వంటింట్లో పుడుతుంది. ఇది సమాజం నిర్మించిన ఒక నమూనా. దానిని బద్దలు కొట్టడానికి ప్రయత్నం చేస్తుంది కవయిత్రి విమల ఈ కవితలో. డాll కాత్యాయినీ విద్మహే గారి ప్రకారం, స్త్రీ వాద కవిత్వంలో నాలుగు ప్రధాన ధోరణులు. ఒకటి స్త్రీల ఉనికికి సంబంధించిన కవిత్వం, రెండు కుటుంబ సంబంధాల్లో తమ స్థానాన్ని గురించి వివేచించిన కవిత్వం. మూడోది కుటుంబం నుంచి బయటకు వచ్చినపుడు తనకు సంబంధించి సమాజంలో వచ్చే స్పందనను చిత్రించే కవిత్వమైతే, నాలుగవది సామాజిక పరిణామాలు, సామాజిక సమూహాలను స్త్రీగా తను చూసే పద్దతికి సంబఁధించినది.  ఈ కవితలో మొదటి రెండు ధోరణులూ కనిపిస్తాయి. స్త్రీల పట్ల ప్రపంచ దృక్కోణం మారటానికి ఈ రెండు ధోరణులూ ఎంత వరకు సహకరిస్తాయన్నది ఆలోచించ వలసి ఉంటుంది. చిన్న ఆయుధంతో పెద్ద శత్రువును ఎదుర్కోవడం వంటిదిది. అయినా కవయిత్రి విమల విమలంగానే రాడికల్ స్త్రీవాదాన్ని వినిపించే ప్రయత్నం చేస్తారీ కవితలో.

మగ, ఆడ అనేవి లింగ బేధాన్ని సూచిస్తే, తల్లి పాత్ర అనేది ఒక మానసిక స్థితిని సూచించే సింబల్ అవుతుంది. భార్య గానీ, భర్తగానీ, ఇంకెవరైనాగానీ తల్లి పాత్రను పోషించకపోతే ఆ పిల్లలు చనిపోయే అవకాశం ఎక్కువని సైన్సు చెబుతోంది. తల్లి పాత్రను కన్వీనియంట్ గా స్త్రీకి అప్పజెప్పడం పితృ స్వామ్య  సమాజం నేర్చుకున్న పోకడ. తల్లి, తల్లి పాత్ర కేవలం ఒక సింబల్ గా మనం తీసుకోలేనపుడు, దానిని ఒక జెండర్ కు మాత్రమే పరిమితమైన అంశంగా మార్చినపుడు, దాని చుట్టూ ఎన్నో దోపిడి వ్యవస్థలు మొదలవుతాయి. అటువంటి దోపిడిలో వంటిల్లు ప్రధాన పాత్ర పోషిస్తూ స్త్రీ జీవితాన్నే శాసిస్తున్నపుడు, ఆ వంటింటిని కూల్చేయాలి అనుకోవటం ఏ మాత్రం తప్పు కాదు. కవయిత్రి విమల తన వంటింటిలో తన బాల్య జ్ఞాపకాలు నెమరేసుకుంటున్నపుడు వంటిల్లు వంటిల్లు లాగానే అద్భుతంగా, ప్రాణంతో శ్వాసించే దానిలా, రుచులతో ముస్తాబయ్యే దానిలా, మేల్కోవటం, పడుకోవటం తెలిసిన దానిలా అనిపిస్తుంది, కానీ బాల్యం కరిగిపోయాక, ఆ వంటింటిలోనే తన స్త్రీత్వం కూడా పుడుతుందని తెలిసినపుడు, అదే వంటింటిలో బందీ అయిన తన తల్లి, గరిటలా, పెనం లాగా కనిపించటమూ, నిశ్శబ్దంగా, నిరాశగా, భయం భయంగా జీవించే ఆమె ఒక ప్రేతంగా కనిపించటమూ మనం ఈ కవితలో చూస్తాం. తల్లి పాత్ర ద్వారా సమాజం స్త్రీ మీద చేసే అదనపుదోపిడీని కవయిత్రి చాలా సమర్థవంతంగా చూపిస్తారీ కవితలో. తరం మారినా, శ్రమ దోపిడిని తగ్గించే ఆధునిక ఎలక్ట్రానిక్ పరికరాలు వచ్చినా, వంట వండే పదార్థాలు మారినా, వంట చేయడం స్త్రీకి, ఇంకా చెప్పాలంటే, తల్లి పాత్ర పోషిస్తున్న స్త్రీ కి తప్పటం లేదు. ఆ వంట పాత్రలన్నింటి మీదా, అమ్మ తరం లో నాన్న పేరు ఉండటం, ఈ తరంలో తన భర్త పేరు ఉండటాన్ని సూచించటం ద్వారా, చాలా బలమైన అస్తిత్వ వాదనను వినిపిస్తారు కవయిత్రి విమల.

వంటిల్లు
          ----------- విమల
--------------------------------

ఎంత అద్బుతమైంది ఈ వంట గది
రుచులు రుచులుగా పరిమళాన్ని వెదజల్లుతూ
తెరచిన తినుబండారాల దుకాణంలా
ఎంత నోరురిస్తుందో !
తాలింపు ఘుమాయిన్పులతో
పూజ మందిరం అగరొత్తుల సువాసనలతో
మా వంటిల్లు నిత్యం శ్వాసిస్తూ  ఉంటుంది.
వసారాలో చల్ల చిలికే చప్పుడుతోనో
అంట్ల గిన్నెలు తోమే చప్పుడుతోనో
రోజు ఉదయమే మా వంటిల్లు మేల్కొంటుంది
అలికి ముగ్గులు దిద్దిన పొయ్యి
మండేందుకు ముస్తాబవుతుంది
వంటింటి పోపు డబ్బాలో చిల్లర పైసలు
దాచుకు తిన్న మిటాయి ఉండలు
పప్పు బెల్లలతో ఉత్తుత్తి  వంటా-వడ్డనలు
అమ్మ నాన్న ఆటలు
ఈ వంటిల్లోక వదలని మొహమై
నా బాల్యాన్నంత చుట్టేసుకుంది .
నాకు మా వంటిల్లోక అద్బుత మాయా బజార్
ఇప్పుడు వంటిల్లోక ఆట స్థలం కాదు .
మెల్లగా బాల్యపు చాయలు వదిలిపెడుతున్డగానే
ఇక్కడే నన్ను తీర్చి దిద్దటం మొదలయ్యింది
"వంటింటి తనాన్ని" ఇక్కడే నేర్పారు  నాకు
మా అమ్మ, మా అమ్మమ్మ,
ఇంట్లో అమ్మలంతా ఇక్కడే "స్త్రీ" లయ్యారట
గిన్నెలు, డబ్బాలు, బస్తాలతో
రకరకాల శవాలు నిండిన శ్మశానంలా
మా వంటిల్లు -
తడి కట్టెల పొగ మేఘాల మధ్య
మా వంటిల్లు వేలాడుతూ ఉంటుంది
భయం, భయంగా నిశ్శబ్దంగా, నిరాశగా
మా అమ్మొక ప్రేతంలా తేలుతూ ఉంటుందిక్కడ
అస్సలు మా అమ్మే నడుస్తున్న వంట గదిలా ఉంటుంది,
ఏడ్చి ఏడ్చి ఆమె కళ్ళు ఎక్కడో కారి పోయాయి.
తోమి  తోమి ఆమె చేతులు అరిగి పోయాయి
మా అమ్మకు చేతులు లేవు
ఆమెను చుస్తే
ఒక గరిటగానో, పెనం లానో
మా వంటింటిని అలంకరించిన ఓ పరికరం లానో ఉంటుంది.
ఒక్కో సారి ఆమె మండుతున్న పొయ్యిలా కూడా ఉంటుంది.
అప్పుడు బంది అయిన పులిలా ఆమె
వంట గదిలో అశాంతిగా తిరుగుతుంది .
నిస్సహాయతతో గిన్నెలు తిప్పితే చాలు
వంట సిద్దం అంటారంతా !
తినేందుకు తప్ప ఇటుకేసి రారు ఎవ్వరూ
ఈ వంటింటి సామ్రాజ్యానికి మా అమ్మే రాణి
అయనా చివరకు వంటింటి గిన్నేలన్నింటి పైనా
మా నాన్న పేరే !
అదృష్ట వశాత్తూ నేనో మంచి వంటిట్లో పడ్డనన్నరంత !
గ్యాసు, గ్రైన్దర్లు, సింకులు , టైల్స్ ...
అమ్మలా గారెలు, అరిసెలు కాక
ఇప్పుడు కేకులు , పుడ్డింగులు చేస్తున్నాను నేను
ఇంకా గిన్నెలపై పేర్లు మాత్రం నా భర్తదే
కుక్కర్ కూత తోనో , గ్రైండర్ మోత తోనో
నా వంటిల్లు మేల్కొంటుంది .
నేనొక అలంకరించిన వంట గదిలా
కీ ఇచ్చిన బొమ్మలా ఇక్కడ తిరుగుతూ ఉంటాను
నా వంటిల్లోక యంత్రశాల ల ఉంది
రకరకాల చప్పుళ్ళతో ఈ వంటిల్లోక కసాయి
దుకాణంలా ఉంది
కడిగిందే కడిగి ఏళ్ళ తరబడి , వండి ,వండి,
వడ్డిస్తూ ఎంగిళ్ళు ఎత్తెసుకుంటూ
చివరకు నా కలలలోను వంటిల్లె
కళాత్మకమయిన వంటింటి కలలు
మల్లె పూవుల్లోను పోపు వాసనలే !
ఈ వంటింటి ని తగలెయ్య
ఎంత అమానుష మయ్యిందీ    వంట గది !
మన రక్తం పీల్చేసి , మన ఆశల్ని , కలల్ని కాజేసి
కొద్ది కొద్దిగా జీవితాంతం పీక్కు తింటున్న
రాకాసి గదా ఈ వంటిల్లు
వంటింటి సంస్కృతి ; వంటింటి ముచ్చట్లు
వంటలక్కలమైన మనం
మనం ఏమయినా మన అంతిమ కర్తవ్యం
గరిట తిప్పడం గా చేసిన ఈ వంటిళ్ళను
ద్వంసం చేద్దాం రండి !
ఇక గిన్నెలపై ఎవ్వరి పేర్లు వద్దూ
వేర్వేరు స్వంత పొయ్యిలను
పునాదులతో సహా తవ్వి పొద్దం రండి!
మళ్లి మన పాపలు ఈ వంటరి  వంటిళ్ళలోకి
అడుగిడపోతున్నారు.
మన పిల్లల కోసం
వంటరి వంట గదులు కూల్చేందుకు రండి
 వంటల పుస్తకాలు నిజానికి ఎంత మంది చదువుతారో గానీ, ఈ రోజుకీ ప్రపంచంలో బెస్ట్ సెల్లర్ లిస్ట్ లో ఈ వంటింటి సాహిత్యమే టాప్ లో ఉంటోంది. పొరపాటున ఈ వంటింటి సామ్రాజ్యానికంతటికీ స్త్రీ యే ఇప్పటికీ మహారాజ్ఞి. స్త్రీ వాద కవిత్వమిస్తున్న పిలుపులోని బలాన్ని ప్రశ్నించేదిగా ఈ లెక్కలున్నాయి. వంటింటిని కూల్చేయలేక పోయినా, వంట చేయటం నీచమైన కార్యమేమీ కాదనే దృష్టికోణమొకటి ప్రపంచంలో మొదలైంది. అది స్త్రీవాదం వలన కలిగిందా, లేక వంటను వ్యాపారంగా మార్చే కాపిటలిస్ట్ పోకడలు మార్చాయో తెలుసుకోవాలంటే, హోటల్ మేనేజ్మెంటు కోర్సుల్లోని పురుషాధిక్యతను గమనించకతప్పదు. స్త్రీ వాదం నిర్దేశించిన వంటిల్లు లేకపోవడం అన్నది, కాపిటలిస్ట్ సమాజంలో పురుషులతో పాటుగా స్త్రీల ఆఫీసు పనిగంటల దోపిడీగా, రెడీ మేడ్ ఫుడ్ ని అందించే కే.ఎఫ్.సీ, డొమినో, మ్యాక్ డొనాల్డ్ వంటి బహుల జాతి కంపనీలు పుట్టుకురావడంగా రూపాంతరం చెందుతూ వస్తూంది. పనిలో పనిగా ఈ మారుతూన్న కుటుంబ వ్యవస్థలను కంపనీలు పలువిధాలుగా క్యాష్ చేసుకునే పనిలో పడ్డాయి. కాపిటలిస్ట్లకు పనికొచ్చే విధంగా స్త్రీ వాదం మారుతోందని, దీనిని బూచిగా చూపించి స్త్రీ వాదాన్ని పలుచన చేసే పోకడల్ని చూస్తున్నపుడు, వంటల పుస్తకాల స్థానాన్ని వంటింటి కవితలు నింపాల్సి ఉంటుంది. ఈరోజు వంటిల్లు ఉందా లేదా అంటే..లేదు, కాపిటలిస్ట్ లకు అవసరమైనంత మేరకే లేదు, ఉంది కాపిటలిస్ట్లకు వంటింటి సామాగ్రిని అమ్ముకోవడం వరకూ ఉంది. కానీ స్త్రీ మాత్రం వంటింట్లోనే వుంది, ఆఫీసుకు ముందూ, ఆఫీసుకి తరువాత. ఇది వాస్తవం. మారుతున్న సామాజిక రూపంలోని మితుల్నీ, పరిమితుల్నీ దాటి స్త్రీవాద కవిత్వం తన విస్తృతిని పెంచుకోవటం కేవలం స్త్రీలకే కాదు, మొత్తం సమాజానికి కూడా అవసరం.

My posts in fb

1.   మతం ఒక పజిల్, పద్మవ్యూహం.
పరమపద సోపానంలో ఉన్నట్లు ఇందులో విషనాగులుంటాయి, మెట్లూ ఉంటాయి.
వీటన్నింటినీ దాటూకుంటూ సత్యాన్ని చేరటమే ఆధ్యాత్మిక సాధన

------------------

2-    చైనాలో ఆడపిల్లకు పెళ్ళి చేసి, భర్త తో పంపించేటపుడు, అమ్మాయి తల్లిదండ్రులు అమ్మాయికి కొన్ని సుద్దులు చెబుతూ  ఉంటారు మన దేశంలో లాగే.
ఆ సుద్దుల్లో ముఖ్యంగా చెప్పే అంశం "ఇంటి నిప్పు బయటకు పోనీయకు, బయటి నిప్పు లోపలికి రానీయకు" అని.
నిప్పు అంటే మాట అని అర్థం. నిజంగా మాట నిప్పువంటిదే, దానిని సరిగా ఉపయోగించుకోక పోతే అది తప్పకుండా కాల్చేస్తుంది.
ముఖ్యంగా సంసారానికి సంబంధించిన విషయాల్లో, చాలా జాగ్రత్తగా ఉండటం ఎంతో అవసరం.
ఇపుడు బతుకు జట్కాబండి వంటి ప్రోగ్రాంలలో ఇంటి నిప్పును తీసుకొచ్చి అందరి ముందరా ఆరేస్తున్నట్టుగా అనిపిస్తూంటుంది.
డబ్బులకు నటించే నటీమణులు, కౌన్సిలర్ల అవతారం కాదు, ఏ అవతారం ఎత్తమన్నా ఎత్తుతారు.
డబ్బులకు ఆశపడే టీవీ ఛానల్స్ అడ్డమైన ప్రతీ ఆలోచననూ ప్రోగ్రాంలాగా మలుస్తూ ఉంటారు,  క్రియేటివ్ జీనియస్ లు మరి.
ఈ సదరు ప్రోగ్రాంలను స్పాన్సర్ చేసే కంపనీలు, ఏ చెత్త ప్రోగ్రాంకైనా స్పాన్సర్ చేసేస్తారు డబ్బుల కోసం.
కాబట్టి ఈ నటీనటులనూ, టీవీ ఛానల్స్ నూ, ఆ స్పాన్సరర్లనూ అంతకు మించి గొప్పగా ఊహించడం కష్టం.
అందుకే, డబ్బులకోసం గడ్డితినమన్నా తినే గాడిదల మధ్యకు పచ్చని సంసారాన్ని తీసుకెల్లడం ఎంతవరకు అవసరమో, ఆ ప్రోగ్రాంలకు వెళ్ళే ప్రజలు నిర్ణయించుకోవాలి. చదువుకున్న లాయర్లు, కౌన్సిలర్లు కూడా, ఈ టీవీ ప్రోగ్రాంలకు ఎగబడటం కొంత ఇబ్బంది కలిగించే విషయమే.
ఒక వ్యక్తి కానీ, ఒక కుటుంబం కానీ, ఒక లాయర్ దగ్గరికో, ఒక డాక్టర్ దగ్గరికో,ఒక పర్సనల్ కౌన్సిలర్ దగ్గరికో వెళ్ళినపుడు, పూర్తి ప్రైవసీని కలిగించడం ఆ సదరు ప్రొఫెషనల్స్ ల యొక్క మినిమం కర్టసీ. తమ బాధను చెప్పుకోవటానికి వచ్చిన వారితో పరాచకాలూ, పరిహాసాలూ చేయటం ఆ ప్రొఫెషన్ కే కళంకం. బయట ఎందరో తమ బాధను చూసి నవ్వుతారని నొచ్చుకునే కదా మనం వారి దెగ్గరకు వెళ్ళేది. ఇంక వాళ్లు కూడా ఆ మినిమం ప్రైవసీని కాదని గేలి చేయటానికీ, పదుగురిలో నవ్వుల పాలు చెయ్యటానికి తమ ప్రొఫెషన్ ని ఉపయోగించుకుంటే ఆ బాధాతప్త హృదయులకు దిక్కెవరు?. ఇలాంటి చెత్త ప్రోగ్రాములకు వెళ్ళే ప్రొఫెషనల్స్ ఈ విషయమై పునరాలోచించుకోవాలి.

కుటుంబాల్లో సమస్యలు ఉండవని కాదు. వాటిని పరిష్కరించుకునే మార్గాలు ఈ రచ్చకె్క్కడాలు కాదు. తమ తమ హ్యూమన్ డిగ్నిటీని కోల్పోకుండా సమస్యలను పరిష్కరించుకోలాల్సిన అవసరం ఉంటుంది. చదువుకోక పోవటం వలననో, బీదరికం వలననో ఇంకెవరో తమ సమస్యలను తీరుస్తారని అనుకున్నపుడు చిత్త శుద్ధిలేని యాంకరమ్మలు కూడా కొడదామని చేతులెత్తడాలు చూస్తున్నాం. వీరికెవరిచ్చారీ కొట్టే అధికారం. ప్రోగ్రాంకి వచ్చిన వారంటే అంత అలుసా?. అయినా ఇంకొకరి ప్రాబ్లంని పబ్లిక్ గా చూపిస్తూ డబ్బులు సంపాదించాలనుకోవడం, ఎంత లేకితనం!!. టీవి ఛానల్సనీ ఆపలేం, బాధల్లో పరిష్కారాల కోసం  వెతికే తోటి మనుషులనూ ఆపలేం, కానీ గౌరవ ప్రదమైన ప్రొఫెషన్స్ లో ఉండే లాయర్లూ, కౌన్సిలర్లూ, హ్యూమన్ డిగ్నిటీని కించపరిచే ఇటువంటి ప్రోగ్రాంలకు దూరంగా ఉంటారని ఆశిద్దాం.

3. రాజకీయాల్లో పదాల మార్పులు

1."ప్రతిపక్షం" అనడంలోనే, ఆ పదంలోనే దాన్ని తీసి పక్కన పడేయడం ఉంది.
ప్రతిపక్షం పదాన్ని "ప్రత్యామ్నాయ పక్షం" అనాలని మనం డిమాండ్ చేయాలి...మీరేమంటారు??.

2.దక్షిణ పక్షం అనే పదమే లేనపుడు, "వామ పక్ష"మనే పదమెందుకు వచ్చింది?. ఇది కూడా పక్కకు తోసేసే ప్రయత్నమే.
ఉదయించే సూర్యుడు సింబాలిక్ కాబట్టి "తూ రుపు పక్షం" లేదా "అరుణ పక్షం" అనాలని మనం డిమాండ్ చేయాలి....మీరేమంటారు?.

4. స్వచ్ఛ భారత్ వీధి నాటకంలో చీపురు పట్టుకుంది వీధి ఊడవటానికి కాదట!!
విద్యార్థుల్లో స్పూర్తి నింపి వీధంతా ఊడిపించటానికట

      విరించి విరివింటి
ఒక ముద్దులొలికే బుజ్జి పిల్లి మా వసారాలోకి ప్రతీ మధ్యాహ్నం వచ్చి, ఒక రెండు గంటలు ఆ వెచ్చటి సూర్యకాంతిలో చుట్ట చుట్టుకుని కునుకు తీస్తుంటుంది.కునుకునుండి లేవగానే, తన పాదాలమీద అలవోకగా లేచినిలబడి, వెన్నును చాచి వంచి ఆవలించి, ఆ తర్వాత తనొచ్చిన దారినే మెల్లిగా వెళ్ళి పోతుంది. ప్రతీ రోజూ అది అక్కడే పడుకుంటుంది, అలాగే పడుకుంటుంది. లేచి అదే విధంగా, అంతే మెల్లిగా వెళ్ళి పోతుంది.
పడుకోవడానికి, సేద తీరడానికీ, ఇంతకంటే వెచ్చనయిన, నిశ్శబ్దమైన ప్రదేశం, అపుడపుడూ పక్షుల కిలకిలరావాలు వినిపించే ప్రదేశం ఆ పిల్లి వెతికితే దొరకవచ్చు కూడా. కానీ ఖచ్చితంగా దొరుకుతుందని చెప్పలేం. వెతుకులాట అనేది వెంటనే ముగిసేదేమీ కాదు. వెతికింది దొరికిన తర్వాతైనా ప్రశాంతంగా నిద్రపోవటానికి ఎపుడోకానీ సమయం దొరకొదు.

నాకినిపిస్తుంటుంది, ఈ పిల్లి మహా జ్ఞానేమో అని. అలా అని చెప్పి నా ఉద్దేశంలో మరీ కఠినమైన నియమాలుగల జ్ఞాని కాదు. జ్ఞానం కోసం తదేక దీక్షతో మాత్రమే ఉండే వ్యక్తి ఎవరైనా, దానిని పొందుతాడని నేననుకోను. ఒక సుజ్ఞాని అనేవాడు, సాత్వికంగా, సున్నితంగా, ప్రపంచం పట్లే కాకుండా తన పట్ల కూడా కరుణతో ఉంటాడనుకుంటాను. కనిపించిన ప్రతీ ఉన్నతాన్నీ ఎక్కకపోవడమే సబబని అతడు తెలుసుకుని ఉంటాడు.

నిజమైన జ్ఞాని ఐనవాడు తృప్తిని సంపాదించడం ఆనందాన్ని పొందగలిగినదానికన్నా సులువనీ, అదే చాలుననీ తెలుసుకుంటాడు.

A translation from A BOOK OF SIMPLE LIVING --by Ruskin Bond

My posts in fb

1.   మతం ఒక పజిల్, పద్మవ్యూహం.
పరమపద సోపానంలో ఉన్నట్లు ఇందులో విషనాగులుంటాయి, మెట్లూ ఉంటాయి.
వీటన్నింటినీ దాటూకుంటూ సత్యాన్ని చేరటమే ఆధ్యాత్మిక సాధన

------------------

2-    చైనాలో ఆడపిల్లకు పెళ్ళి చేసి, భర్త తో పంపించేటపుడు, అమ్మాయి తల్లిదండ్రులు అమ్మాయికి కొన్ని సుద్దులు చెబుతూ  ఉంటారు మన దేశంలో లాగే.
ఆ సుద్దుల్లో ముఖ్యంగా చెప్పే అంశం "ఇంటి నిప్పు బయటకు పోనీయకు, బయటి నిప్పు లోపలికి రానీయకు" అని.
నిప్పు అంటే మాట అని అర్థం. నిజంగా మాట నిప్పువంటిదే, దానిని సరిగా ఉపయోగించుకోక పోతే అది తప్పకుండా కాల్చేస్తుంది.
ముఖ్యంగా సంసారానికి సంబంధించిన విషయాల్లో, చాలా జాగ్రత్తగా ఉండటం ఎంతో అవసరం.
ఇపుడు బతుకు జట్కాబండి వంటి ప్రోగ్రాంలలో ఇంటి నిప్పును తీసుకొచ్చి అందరి ముందరా ఆరేస్తున్నట్టుగా అనిపిస్తూంటుంది.
డబ్బులకు నటించే నటీమణులు, కౌన్సిలర్ల అవతారం కాదు, ఏ అవతారం ఎత్తమన్నా ఎత్తుతారు.
డబ్బులకు ఆశపడే టీవీ ఛానల్స్ అడ్డమైన ప్రతీ ఆలోచననూ ప్రోగ్రాంలాగా మలుస్తూ ఉంటారు,  క్రియేటివ్ జీనియస్ లు మరి.
ఈ సదరు ప్రోగ్రాంలను స్పాన్సర్ చేసే కంపనీలు, ఏ చెత్త ప్రోగ్రాంకైనా స్పాన్సర్ చేసేస్తారు డబ్బుల కోసం.
కాబట్టి ఈ నటీనటులనూ, టీవీ ఛానల్స్ నూ, ఆ స్పాన్సరర్లనూ అంతకు మించి గొప్పగా ఊహించడం కష్టం.
అందుకే, డబ్బులకోసం గడ్డితినమన్నా తినే గాడిదల మధ్యకు పచ్చని సంసారాన్ని తీసుకెల్లడం ఎంతవరకు అవసరమో, ఆ ప్రోగ్రాంలకు వెళ్ళే ప్రజలు నిర్ణయించుకోవాలి. చదువుకున్న లాయర్లు, కౌన్సిలర్లు కూడా, ఈ టీవీ ప్రోగ్రాంలకు ఎగబడటం కొంత ఇబ్బంది కలిగించే విషయమే.
ఒక వ్యక్తి కానీ, ఒక కుటుంబం కానీ, ఒక లాయర్ దగ్గరికో, ఒక డాక్టర్ దగ్గరికో,ఒక పర్సనల్ కౌన్సిలర్ దగ్గరికో వెళ్ళినపుడు, పూర్తి ప్రైవసీని కలిగించడం ఆ సదరు ప్రొఫెషనల్స్ ల యొక్క మినిమం కర్టసీ. తమ బాధను చెప్పుకోవటానికి వచ్చిన వారితో పరాచకాలూ, పరిహాసాలూ చేయటం ఆ ప్రొఫెషన్ కే కళంకం. బయట ఎందరో తమ బాధను చూసి నవ్వుతారని నొచ్చుకునే కదా మనం వారి దెగ్గరకు వెళ్ళేది. ఇంక వాళ్లు కూడా ఆ మినిమం ప్రైవసీని కాదని గేలి చేయటానికీ, పదుగురిలో నవ్వుల పాలు చెయ్యటానికి తమ ప్రొఫెషన్ ని ఉపయోగించుకుంటే ఆ బాధాతప్త హృదయులకు దిక్కెవరు?. ఇలాంటి చెత్త ప్రోగ్రాములకు వెళ్ళే ప్రొఫెషనల్స్ ఈ విషయమై పునరాలోచించుకోవాలి.

కుటుంబాల్లో సమస్యలు ఉండవని కాదు. వాటిని పరిష్కరించుకునే మార్గాలు ఈ రచ్చకె్క్కడాలు కాదు. తమ తమ హ్యూమన్ డిగ్నిటీని కోల్పోకుండా సమస్యలను పరిష్కరించుకోలాల్సిన అవసరం ఉంటుంది. చదువుకోక పోవటం వలననో, బీదరికం వలననో ఇంకెవరో తమ సమస్యలను తీరుస్తారని అనుకున్నపుడు చిత్త శుద్ధిలేని యాంకరమ్మలు కూడా కొడదామని చేతులెత్తడాలు చూస్తున్నాం. వీరికెవరిచ్చారీ కొట్టే అధికారం. ప్రోగ్రాంకి వచ్చిన వారంటే అంత అలుసా?. అయినా ఇంకొకరి ప్రాబ్లంని పబ్లిక్ గా చూపిస్తూ డబ్బులు సంపాదించాలనుకోవడం, ఎంత లేకితనం!!. టీవి ఛానల్సనీ ఆపలేం, బాధల్లో పరిష్కారాల కోసం  వెతికే తోటి మనుషులనూ ఆపలేం, కానీ గౌరవ ప్రదమైన ప్రొఫెషన్స్ లో ఉండే లాయర్లూ, కౌన్సిలర్లూ, హ్యూమన్ డిగ్నిటీని కించపరిచే ఇటువంటి ప్రోగ్రాంలకు దూరంగా ఉంటారని ఆశిద్దాం.

3. రాజకీయాల్లో పదాల మార్పులు

1."ప్రతిపక్షం" అనడంలోనే, ఆ పదంలోనే దాన్ని తీసి పక్కన పడేయడం ఉంది.
ప్రతిపక్షం పదాన్ని "ప్రత్యామ్నాయ పక్షం" అనాలని మనం డిమాండ్ చేయాలి...మీరేమంటారు??.

2.దక్షిణ పక్షం అనే పదమే లేనపుడు, "వామ పక్ష"మనే పదమెందుకు వచ్చింది?. ఇది కూడా పక్కకు తోసేసే ప్రయత్నమే.
ఉదయించే సూర్యుడు సింబాలిక్ కాబట్టి "తూ రుపు పక్షం" లేదా "అరుణ పక్షం" అనాలని మనం డిమాండ్ చేయాలి....మీరేమంటారు?.

4. స్వచ్ఛ భారత్ వీధి నాటకంలో చీపురు పట్టుకుంది వీధి ఊడవటానికి కాదట!!
విద్యార్థుల్లో స్పూర్తి నింపి వీధంతా ఊడిపించటానికట

      విరించి విరివింటి
"ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం,
నర జాతి చరిత్ర సమస్తం పర పీడన పరాయణత్వం" అన్నాడు శ్రీశ్రీ
కానీ ఈ ప్రపంచంలో ఏదో మూలన యుద్ధోన్మాదం లేని దేశం ఒకటుంటుంది.
మనదలాంటి దేశమే.
మంచికో చెడుకో మన పక్కలో బల్లెంలా మారిన శత్రువు
శాంతికాముకులైన మన దేశ ప్రజల్ని నిర్దాక్షిణ్యంగా చంపేస్తుంటే,
ఇంకా శాంతి శాంతంటూ చేతులు ముడుచుక్కూచోవటం ఒకటైతే,
మనదేశంలోనే కుహానా విలాస విశ్వనరులు బయల్దేరి మన సైనికులకు వ్యతిరేకంగా మాట్లాడుతుంటే...
నా దేశ సైనికుడు కనపడితే వాడు మీసం మెలేసేటందుకొక కవిత కావాలి.
అందుకే ఈ కవిత.

విరించి- llఒకింత గర్వ౦ కావాలిll
------------------------------------------

నా దేశానికొకింత గర్వం కావాలి
నా దేశ చరిత్రకొకింత గర్వం కావాలి
సరిహద్దుకవతల, సరిహద్దుకివతల అని
ప్రస్ఫుటంగా ఒక ముళ్ల కంచె,
నా కంటికెపుడూ కనిపిస్తూండాలి.

గాలికెగిరొచ్చిన శత్రు దేశ మట్టినయినా
బూటుకాలితో ఈ దేశ భూమిలోకి నేను తొక్కేయాలి.
అటువైపునుంచి చొచ్చుకొచ్చిన పిల్లగాలినైనా నేను
ముక్కుతో పీల్చి నోటితో ఉమ్మేయాలి.
నా దేశ జండా ముందు అటెన్షన్ తో సెల్యూట్ కొట్టినపుడు
గుండె దడ మీద గర్వం దరువేయాలి

నేను కర్కశంగా ఉండనేకూడదని
నీవెందుకనో సూత్రీకరిస్తుంటావు
నేను శాంతంగా మిన్నకుండటమే
మానవత్వమని నీవక్కడక్కడా వాపోతుంటావు
నీ లెవలుకు తెలిసేదా రెండు ముక్కలే
యుద్ధమంటే నీ ఇంటిముందు నల్లా దగ్గరి పోట్లాట కాదు
శత్రువంటే పక్కింటి సత్తిగాడూ కాదు

అరే...యుద్ధంలో నన్ను బతికించేది
నీ శాంతి వచనాలు కాదు
చీల్చుకు వచ్చే శత్రువు ముందు నన్ను నిలబెట్టేది
నీ కుహానా విశ్వ ప్రేమలు కాదు
నా యూనీఫాం, నా తుపాకులూ, నా తూటాలూ
నెత్తి మీది టోపీ, కాలి బూట్లూ,
గుండెలోని ధైర్యమూ ఇవేవీ కాదు.
ఒక్క భారతీయుడననే గర్వం తప్ప.
అందుకే...
నా దేశానికొకింత గర్వ౦ కావాలిపుడు

5-10-16

దేశంలా కాదు ఒక ఖండంలా ఆలోచిద్దాం.

దేశంలా కాదు ఒక ఖండంలా ఆలోచిద్దాం.
.....................................................

ఇపుడు భారత దేశం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకోబోతోందా లేదా అన్న విషయం ఎంతో ప్రాముఖ్యమైనది. పాకిస్థానుతో మనం యుద్దం చేయటమా చేయకపోవటమా అనేది ముఖ్యం కాదిక్కడ, స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి మనం తల మీద మోస్తున్న భారాన్ని వదిలించుకోగలమా లేదా అన్నది ప్రశ్న. దానికై యుద్ధం ఒక మార్గం మాత్రమే, బహుశా చాలా బలమైన సమర్థవంతమైన మార్గం కూడా కావొచ్చు. మన ఆసియా దేశాలనే తీసుకుంటే, తూర్పు ఆసియా దేశాలైన జపాన్, సౌత్ కొరియా, తైవాన్, హంగ్ కాంగ్, సింగపూర్ లు అభివృద్ధిలో పశ్చిమ దేశాలవలే చొచ్చుకుపోతున్నాయి. మలేషియా, థాయ్ లాండ్, ఇండోనేసియాలు కూడా వడివడిగా అటు వైపే అడుగులు వేస్తున్నాయి. మధ్య, సౌత్ ఏసియన్ దేశాలలో ఉండే మనం మాత్రం పశ్చిమ దేశాలతో పోల్చుకుంటే దశాబ్దాల వెనుక పడి ఉన్నామన్నది వాస్తవం. ప్రపంచ జనాభాలో దాదాపు డెభ్భై శాతం మన ఆసియా దేశాల్లోనే ఉన్నా గానీ, మనం ఆధునిక నాగరికతని నడిపించే పగ్గాల్ని మాత్రం పశ్చిమ దేశాలకు అప్పగించేసి, అంతర్గత కుమ్ములాటలలో పడిపోయి ఉన్నాం. నిజానికి ఈ ఆసియా దేశాల మధ్య యుద్ధాలు జరగటం అనేది పశ్చిమ దేశాలకు బాగా కలిసొచ్చే విషయం. ప్రపంచంలో అత్యధికంగా ఆయుధాలు ఉత్పత్తి చేసే దేశం అమెరికా అయితే, మధ్య ప్రాచ్యం అత్యధికంగా ఆయుధాల్ని కొనుగోలు చేస్తూన్నది. ఈ లెక్కన మన మధ్యన యుద్ధాల్ని కోరుకునే వారిలో ముందెవరుంటారో చెప్పనవసరం లేదు. అంతే కాక యూరోప్ లో పదహారవ శతాబ్దంలో రెనీసాన్స్ ఆ తరువాత పంతొమ్మిదవ శతాబ్దంలో పారిశ్రామికీకరణ జరగనంత వరకూ ప్రపంచాధిపత్యం ఆసియానే వహిస్తూ వస్తోంది. వలస వాదం కూడా జత కావడంతో ప్రపంచ పటం లోని ఆసియా ఆధిపత్యం తారుమారై యూరోప్ చేతిలోకి పోయింది. ఇప్పటికిపుడు యుద్ధోన్మాదాలు, మత భావజాలాలు లేని ఆసియాను పశ్చిమ దేశాలు ఊహించలేవు సరి కదా, తమ ఆధిపత్యాన్ని కోల్పోకుండా ఉండటం కోసం, కనీసం ఆశించవు కూడా..

ఆసియాలో పెద్ద దేశాలైన చైనా ఇండియాల మధ్య స్పర్థలూ, మధ్యలో చిన్న దేశం పాకిస్థాన్ లో అంతర్గత పోరాటాలు, ఇండియా పాకిస్థాన్ పోట్లాటలూ, వాస్తవానికి పశ్చిమ దేశాలకు కలిసొచ్చే అంశం. రెండు ప్రపంచ యుద్ధాల్లో విపరీతంగా నష్టపోయిన బ్రిటన్, ఫ్రెంచ్, జర్మనీ దేశాలకు యుద్ధమనేది ఇపుడొక చరిత్రగా మాత్రమే మారుతోందనిపిస్తోంది. అవి వాటి మధ్య ఉండే సమస్యలను యుద్దాలతో పరిష్కరించుకోవాలనే పిచ్చి ఆలోచనను ఇప్పట్లో చేస్తాయనిపించట్లేదు. లౌకిక వాదం, పారిశ్రామికీకరణ, ప్రజాస్వామ్యం వంటి ఆయుధాలను చేబట్టి పశ్చిమ దేశాలు ముందుకెల్తూన్న సమయంలో మన ఆసియా వ్యవస్థల్లో ఈ భావాలు సగం సగాలుగా, అటూ ఇటూ కాకుండా కలగాపులగంగా తయారయ్యాయి. మతాలకూ తీవ్రవాదాలకూ ఎంత లంకె పెట్టామో, మతాలకూ రాజకీయాలకూ అంతే లంకె పెట్టుకున్నాం. అఫ్ఘానిస్థాన్ లో ప్రగతిశీల నజీబుల్లాను కిందికి తోయడానికి తాలీబాన్లను ఉపయోగించుకున్న అమెరికాకు, మన సమాజాల తెలివితేటలల స్థాయి ఏమిటో తెలియదని అనుకోలేం. ఇప్పటికీ మన ఆసియా సమాజాల్లోని మేధావులు పురాతన కాలంలో లాగానే మతానుయాయులుగా, మత వ్యతిరేకులుగా విడిపోయి మాత్రమే పోట్లాడుకుంటున్నారు తప్ప( మత వ్యతిరేకత కూడా మతం చుట్టే తిరుగుతుంటుంది కాబట్టి, అదేదో గొప్పగా,ఊడొచ్చి పడిన ఫిలాసఫీ కాదనేది గ్రహించాలి), యూరోపియన్ మేధావుల్లాగా మతాతీతులుగా, కొత్త ప్రపంచాన్ని కనీసం ఊహించనైనా ఊహించటం లేదనిపిస్తోంది. ఈ కారణాల వల్లనే కావచ్చు బహుశా ఈనాటికీ మనం యూరోపియనులకంటే తక్కువవారమనే భావాన్నే మోస్తూ, మన సొంతమైనటువంటి నూతన నాగరికతా విధానాన్ని దేన్నీ ప్రపంచానికి అందివ్వలేకున్నాం.

మన ఆలోచనా స్థాయి పెరిగినపుడు మాత్రమే మన దేశాలమధ్య జరుగుతూన్న ఘర్షణలు పశ్చిమ దేశాలకు ఆహారాన్నందిస్తున్నాయనే విషయాన్ని మనం గ్రహించగలుగుతాం. కనీసం తోటి ఆసియా దేశమైన జపాన్ ని చూసయినా మనం బుద్ధి తెచ్చుకోవలసిన అవసరం ఉంది. మన అంతర్జాతీయ సంబంధాలు, పక్క దేశాన్ని బూచిగా తనను తాను శుచిగా చూపించుకోవటానికి తప్ప ఒక్క నూతన సామాజిక ఆవిష్కరణాకూ ఉపయోగ పడటం లేదన్నది వాస్తవం. ఈ లెక్కన, పశ్చిమ దేశాలన్నీ ఏవో అత్యద్భుతాలు చేసేస్తున్నాయనీ కాదు, వాటి సమస్యలు వాటికున్నాయి, కానీ అవి కాలానుగుణంగా ఆలోచించడం నేర్చుకున్నాయి, మనం ఆలోచించటమే మానివేశాం. అవి సమస్యలను పరిష్కరించుకునే స్థాయి, మన స్థాయికంటే ఉన్నతంగా సహజంగా మేథోపరంగా ఉంటే, మనవి ఇంకా పాత చింతకాయ పచ్చడిని తలపిస్తున్నాయి. ఇపుడు పాకిస్థాన్ తో మనకున్న సమస్యనే తీసుకుంటే యుద్ధం చేయాలా వద్దా అనేదానికి కూడా రాజకీయ కార్యాకారణ సంబంధాలు, వోట్ల వ్యూహ ప్రతివ్యూహాలూ ముందరేసుకుని కూర్చుంటాం. మనకు సిగ్గుండదు, ఎందుకంటే మనం ఆలోచించం. అరే..! ఎడతెగని ఈ సమస్యను ముందు పరిష్కరించుకుని, ఇంకొంచం ముందుకు పోదాం అనుకోము. ఒక చిన్న పాటి భూభాగం కోసం తరాల తరబడి తల బద్దలు కొట్టుకుంటాం. దీనికి పైగా సామ్రాజ్య కాంక్ష అని బోడి పేరొకటి పెట్టుకుంటాం, నవ్వి పోవుదురు గాక. ఇదే సామ్రాజ్య కాంక్ష ఐతే, మన మధ్యన చిచ్చుపెట్టి ఆయుధాలమ్ముకుంటున్న అమెరికాది ప్రజారంజకమా?. ఇక బానిసత్వమూ, పురాతన మత భావజాలమూ తలకెక్కిన వాళ్లు యుద్ధం రాకమునుపే యుద్ధం శాంతికి విఘాతమని కోడై కూస్తూ ఉంటారు..అరే!!  ఏదీ యుద్ధం? ఏది శాంతి?. తరాలబడి జరిగే తెలివి తక్కువ యుద్ధానికి చరమ గీతం పాడటం, శాంతికెట్లా విఘాతమౌతుందో ఈ మహా మహా మేధావులే చెప్పాలి. వీళ్లను చూస్తుంటే ప్రజా చైతన్యం మన దేశం వరకే రాలేదు, ఇక ఆసియా అంతటా వచ్చేస్తుందనుకోవటం ఎంతటి మూర్ఖత్వం అనిపిస్తుంటుంది. ఇపుడు మనకు మన దేశాన్నో పక్క దేశాన్నో నడిపే నాయకుడు సరిపోడు. మొత్తం ఆసియాను ఒక దేశంగా పరిగణించి తుర్పును మొత్తంగా సూర్యోదయం చేయించగల నాయకుడు కావాలి. అది జరిగితే తప్ప పశ్చిమ దేశాలాడే యుద్ధమాట ఆగడం అనేది సాధ్యం కాదు. అలా జరిగితేగానీ ప్రపంచంలో శాంతి అనేది ఏర్పడటం సాధ్యపడదు. ఇకనైనా ఒక దేశంగా కాకుండా ఒక ఖండంగా ఆలోచిచండం నేర్చుకుందాం.
                       ---- విరించి విరివింటి