Friday, 14 October 2016

"ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం,
నర జాతి చరిత్ర సమస్తం పర పీడన పరాయణత్వం" అన్నాడు శ్రీశ్రీ
కానీ ఈ ప్రపంచంలో ఏదో మూలన యుద్ధోన్మాదం లేని దేశం ఒకటుంటుంది.
మనదలాంటి దేశమే.
మంచికో చెడుకో మన పక్కలో బల్లెంలా మారిన శత్రువు
శాంతికాముకులైన మన దేశ ప్రజల్ని నిర్దాక్షిణ్యంగా చంపేస్తుంటే,
ఇంకా శాంతి శాంతంటూ చేతులు ముడుచుక్కూచోవటం ఒకటైతే,
మనదేశంలోనే కుహానా విలాస విశ్వనరులు బయల్దేరి మన సైనికులకు వ్యతిరేకంగా మాట్లాడుతుంటే...
నా దేశ సైనికుడు కనపడితే వాడు మీసం మెలేసేటందుకొక కవిత కావాలి.
అందుకే ఈ కవిత.

విరించి- llఒకింత గర్వ౦ కావాలిll
------------------------------------------

నా దేశానికొకింత గర్వం కావాలి
నా దేశ చరిత్రకొకింత గర్వం కావాలి
సరిహద్దుకవతల, సరిహద్దుకివతల అని
ప్రస్ఫుటంగా ఒక ముళ్ల కంచె,
నా కంటికెపుడూ కనిపిస్తూండాలి.

గాలికెగిరొచ్చిన శత్రు దేశ మట్టినయినా
బూటుకాలితో ఈ దేశ భూమిలోకి నేను తొక్కేయాలి.
అటువైపునుంచి చొచ్చుకొచ్చిన పిల్లగాలినైనా నేను
ముక్కుతో పీల్చి నోటితో ఉమ్మేయాలి.
నా దేశ జండా ముందు అటెన్షన్ తో సెల్యూట్ కొట్టినపుడు
గుండె దడ మీద గర్వం దరువేయాలి

నేను కర్కశంగా ఉండనేకూడదని
నీవెందుకనో సూత్రీకరిస్తుంటావు
నేను శాంతంగా మిన్నకుండటమే
మానవత్వమని నీవక్కడక్కడా వాపోతుంటావు
నీ లెవలుకు తెలిసేదా రెండు ముక్కలే
యుద్ధమంటే నీ ఇంటిముందు నల్లా దగ్గరి పోట్లాట కాదు
శత్రువంటే పక్కింటి సత్తిగాడూ కాదు

అరే...యుద్ధంలో నన్ను బతికించేది
నీ శాంతి వచనాలు కాదు
చీల్చుకు వచ్చే శత్రువు ముందు నన్ను నిలబెట్టేది
నీ కుహానా విశ్వ ప్రేమలు కాదు
నా యూనీఫాం, నా తుపాకులూ, నా తూటాలూ
నెత్తి మీది టోపీ, కాలి బూట్లూ,
గుండెలోని ధైర్యమూ ఇవేవీ కాదు.
ఒక్క భారతీయుడననే గర్వం తప్ప.
అందుకే...
నా దేశానికొకింత గర్వ౦ కావాలిపుడు

5-10-16

No comments:

Post a Comment