Friday, 14 October 2016

దేశంలా కాదు ఒక ఖండంలా ఆలోచిద్దాం.

దేశంలా కాదు ఒక ఖండంలా ఆలోచిద్దాం.
.....................................................

ఇపుడు భారత దేశం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకోబోతోందా లేదా అన్న విషయం ఎంతో ప్రాముఖ్యమైనది. పాకిస్థానుతో మనం యుద్దం చేయటమా చేయకపోవటమా అనేది ముఖ్యం కాదిక్కడ, స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి మనం తల మీద మోస్తున్న భారాన్ని వదిలించుకోగలమా లేదా అన్నది ప్రశ్న. దానికై యుద్ధం ఒక మార్గం మాత్రమే, బహుశా చాలా బలమైన సమర్థవంతమైన మార్గం కూడా కావొచ్చు. మన ఆసియా దేశాలనే తీసుకుంటే, తూర్పు ఆసియా దేశాలైన జపాన్, సౌత్ కొరియా, తైవాన్, హంగ్ కాంగ్, సింగపూర్ లు అభివృద్ధిలో పశ్చిమ దేశాలవలే చొచ్చుకుపోతున్నాయి. మలేషియా, థాయ్ లాండ్, ఇండోనేసియాలు కూడా వడివడిగా అటు వైపే అడుగులు వేస్తున్నాయి. మధ్య, సౌత్ ఏసియన్ దేశాలలో ఉండే మనం మాత్రం పశ్చిమ దేశాలతో పోల్చుకుంటే దశాబ్దాల వెనుక పడి ఉన్నామన్నది వాస్తవం. ప్రపంచ జనాభాలో దాదాపు డెభ్భై శాతం మన ఆసియా దేశాల్లోనే ఉన్నా గానీ, మనం ఆధునిక నాగరికతని నడిపించే పగ్గాల్ని మాత్రం పశ్చిమ దేశాలకు అప్పగించేసి, అంతర్గత కుమ్ములాటలలో పడిపోయి ఉన్నాం. నిజానికి ఈ ఆసియా దేశాల మధ్య యుద్ధాలు జరగటం అనేది పశ్చిమ దేశాలకు బాగా కలిసొచ్చే విషయం. ప్రపంచంలో అత్యధికంగా ఆయుధాలు ఉత్పత్తి చేసే దేశం అమెరికా అయితే, మధ్య ప్రాచ్యం అత్యధికంగా ఆయుధాల్ని కొనుగోలు చేస్తూన్నది. ఈ లెక్కన మన మధ్యన యుద్ధాల్ని కోరుకునే వారిలో ముందెవరుంటారో చెప్పనవసరం లేదు. అంతే కాక యూరోప్ లో పదహారవ శతాబ్దంలో రెనీసాన్స్ ఆ తరువాత పంతొమ్మిదవ శతాబ్దంలో పారిశ్రామికీకరణ జరగనంత వరకూ ప్రపంచాధిపత్యం ఆసియానే వహిస్తూ వస్తోంది. వలస వాదం కూడా జత కావడంతో ప్రపంచ పటం లోని ఆసియా ఆధిపత్యం తారుమారై యూరోప్ చేతిలోకి పోయింది. ఇప్పటికిపుడు యుద్ధోన్మాదాలు, మత భావజాలాలు లేని ఆసియాను పశ్చిమ దేశాలు ఊహించలేవు సరి కదా, తమ ఆధిపత్యాన్ని కోల్పోకుండా ఉండటం కోసం, కనీసం ఆశించవు కూడా..

ఆసియాలో పెద్ద దేశాలైన చైనా ఇండియాల మధ్య స్పర్థలూ, మధ్యలో చిన్న దేశం పాకిస్థాన్ లో అంతర్గత పోరాటాలు, ఇండియా పాకిస్థాన్ పోట్లాటలూ, వాస్తవానికి పశ్చిమ దేశాలకు కలిసొచ్చే అంశం. రెండు ప్రపంచ యుద్ధాల్లో విపరీతంగా నష్టపోయిన బ్రిటన్, ఫ్రెంచ్, జర్మనీ దేశాలకు యుద్ధమనేది ఇపుడొక చరిత్రగా మాత్రమే మారుతోందనిపిస్తోంది. అవి వాటి మధ్య ఉండే సమస్యలను యుద్దాలతో పరిష్కరించుకోవాలనే పిచ్చి ఆలోచనను ఇప్పట్లో చేస్తాయనిపించట్లేదు. లౌకిక వాదం, పారిశ్రామికీకరణ, ప్రజాస్వామ్యం వంటి ఆయుధాలను చేబట్టి పశ్చిమ దేశాలు ముందుకెల్తూన్న సమయంలో మన ఆసియా వ్యవస్థల్లో ఈ భావాలు సగం సగాలుగా, అటూ ఇటూ కాకుండా కలగాపులగంగా తయారయ్యాయి. మతాలకూ తీవ్రవాదాలకూ ఎంత లంకె పెట్టామో, మతాలకూ రాజకీయాలకూ అంతే లంకె పెట్టుకున్నాం. అఫ్ఘానిస్థాన్ లో ప్రగతిశీల నజీబుల్లాను కిందికి తోయడానికి తాలీబాన్లను ఉపయోగించుకున్న అమెరికాకు, మన సమాజాల తెలివితేటలల స్థాయి ఏమిటో తెలియదని అనుకోలేం. ఇప్పటికీ మన ఆసియా సమాజాల్లోని మేధావులు పురాతన కాలంలో లాగానే మతానుయాయులుగా, మత వ్యతిరేకులుగా విడిపోయి మాత్రమే పోట్లాడుకుంటున్నారు తప్ప( మత వ్యతిరేకత కూడా మతం చుట్టే తిరుగుతుంటుంది కాబట్టి, అదేదో గొప్పగా,ఊడొచ్చి పడిన ఫిలాసఫీ కాదనేది గ్రహించాలి), యూరోపియన్ మేధావుల్లాగా మతాతీతులుగా, కొత్త ప్రపంచాన్ని కనీసం ఊహించనైనా ఊహించటం లేదనిపిస్తోంది. ఈ కారణాల వల్లనే కావచ్చు బహుశా ఈనాటికీ మనం యూరోపియనులకంటే తక్కువవారమనే భావాన్నే మోస్తూ, మన సొంతమైనటువంటి నూతన నాగరికతా విధానాన్ని దేన్నీ ప్రపంచానికి అందివ్వలేకున్నాం.

మన ఆలోచనా స్థాయి పెరిగినపుడు మాత్రమే మన దేశాలమధ్య జరుగుతూన్న ఘర్షణలు పశ్చిమ దేశాలకు ఆహారాన్నందిస్తున్నాయనే విషయాన్ని మనం గ్రహించగలుగుతాం. కనీసం తోటి ఆసియా దేశమైన జపాన్ ని చూసయినా మనం బుద్ధి తెచ్చుకోవలసిన అవసరం ఉంది. మన అంతర్జాతీయ సంబంధాలు, పక్క దేశాన్ని బూచిగా తనను తాను శుచిగా చూపించుకోవటానికి తప్ప ఒక్క నూతన సామాజిక ఆవిష్కరణాకూ ఉపయోగ పడటం లేదన్నది వాస్తవం. ఈ లెక్కన, పశ్చిమ దేశాలన్నీ ఏవో అత్యద్భుతాలు చేసేస్తున్నాయనీ కాదు, వాటి సమస్యలు వాటికున్నాయి, కానీ అవి కాలానుగుణంగా ఆలోచించడం నేర్చుకున్నాయి, మనం ఆలోచించటమే మానివేశాం. అవి సమస్యలను పరిష్కరించుకునే స్థాయి, మన స్థాయికంటే ఉన్నతంగా సహజంగా మేథోపరంగా ఉంటే, మనవి ఇంకా పాత చింతకాయ పచ్చడిని తలపిస్తున్నాయి. ఇపుడు పాకిస్థాన్ తో మనకున్న సమస్యనే తీసుకుంటే యుద్ధం చేయాలా వద్దా అనేదానికి కూడా రాజకీయ కార్యాకారణ సంబంధాలు, వోట్ల వ్యూహ ప్రతివ్యూహాలూ ముందరేసుకుని కూర్చుంటాం. మనకు సిగ్గుండదు, ఎందుకంటే మనం ఆలోచించం. అరే..! ఎడతెగని ఈ సమస్యను ముందు పరిష్కరించుకుని, ఇంకొంచం ముందుకు పోదాం అనుకోము. ఒక చిన్న పాటి భూభాగం కోసం తరాల తరబడి తల బద్దలు కొట్టుకుంటాం. దీనికి పైగా సామ్రాజ్య కాంక్ష అని బోడి పేరొకటి పెట్టుకుంటాం, నవ్వి పోవుదురు గాక. ఇదే సామ్రాజ్య కాంక్ష ఐతే, మన మధ్యన చిచ్చుపెట్టి ఆయుధాలమ్ముకుంటున్న అమెరికాది ప్రజారంజకమా?. ఇక బానిసత్వమూ, పురాతన మత భావజాలమూ తలకెక్కిన వాళ్లు యుద్ధం రాకమునుపే యుద్ధం శాంతికి విఘాతమని కోడై కూస్తూ ఉంటారు..అరే!!  ఏదీ యుద్ధం? ఏది శాంతి?. తరాలబడి జరిగే తెలివి తక్కువ యుద్ధానికి చరమ గీతం పాడటం, శాంతికెట్లా విఘాతమౌతుందో ఈ మహా మహా మేధావులే చెప్పాలి. వీళ్లను చూస్తుంటే ప్రజా చైతన్యం మన దేశం వరకే రాలేదు, ఇక ఆసియా అంతటా వచ్చేస్తుందనుకోవటం ఎంతటి మూర్ఖత్వం అనిపిస్తుంటుంది. ఇపుడు మనకు మన దేశాన్నో పక్క దేశాన్నో నడిపే నాయకుడు సరిపోడు. మొత్తం ఆసియాను ఒక దేశంగా పరిగణించి తుర్పును మొత్తంగా సూర్యోదయం చేయించగల నాయకుడు కావాలి. అది జరిగితే తప్ప పశ్చిమ దేశాలాడే యుద్ధమాట ఆగడం అనేది సాధ్యం కాదు. అలా జరిగితేగానీ ప్రపంచంలో శాంతి అనేది ఏర్పడటం సాధ్యపడదు. ఇకనైనా ఒక దేశంగా కాకుండా ఒక ఖండంగా ఆలోచిచండం నేర్చుకుందాం.
                       ---- విరించి విరివింటి

No comments:

Post a Comment