Tuesday, 25 October 2016

కవిత్వ సందర్భం 28 juluru

ఓ జెండా నీవెటు వైపు?
-------------------------------

సమసమాజ కాంక్ష అనేది అకస్మాత్తుగా ఆకాశం నుండి ఊడిపడినట్టుగా మనిషిలోకి ప్రవేశించదు. దాని పునాదులు సమాజంలోనే, అది కూడా పెట్టుబడిదారీ వ్యవస్థలోనే నిగూఢంగా వేళ్లూనుకుని ఉంటాయి. సారంలో పెట్టుబడీ దారీ లక్షణాల్ని పుణికి పుచ్చుకున్న సమాజం సోషలిస్ట్ భావజాల విత్తులకు కూడా అవసరమైనంత శక్తిని కలిగించేదిగా వుంటుంది.  పెట్టుబడిదారీ వ్యవస్థలోని పారడాక్స్ ఏమంటే అది సమాజాన్ని ముక్కలు ముక్కలుగా, వర్గాలుగా ఒకవైపు విడగొడుతూ నే, మరో వైపు అనంత విశ్వంలో మానవుడు తాను బావిలోని కప్పను కాదనీ, తానూ ఈ ప్రపంచంలో ఒక భాగమనీ, తనకూ పరిపూర్ణ మానవుడిగా మారే సర్వ హక్కులూ ఉన్నాయనీ తెలుసుకోగలిగేలా కూడా చేస్తుంది. పెట్టుబడిదారీ వ్యవస్థ ఒకవైపు పీడితులపై పీడకుల అణచివేతను వివిధ రూపాల్లో ప్రదర్శిస్తున్నా, మరో వైపు అదే అణచివేతకు వ్యతిరేకంగా పోరాడగలిగే ఆలోచననీ పీడితుల్లో తీసుకువస్తుంది. పెట్టుబడిదారీ వ్యవస్థలో దయ, నిస్వార్థత, ఏకత, ఆధ్యాత్మికత, సంస్కృతి వంటి గుణాలు తమకవసరం లేనపుడు నీచమైన వాటిగా, అవసరమొచ్చినపుడు గొప్ప విషయాలుగా చూపించబడితే, సోషలిస్ట్ భావజాలం వీటి వెనుకాల ఎంతటి దోపిడీ నిగూఢంగా దాగి వుందో చూపిస్తుంది. ఒక సమాజంలో ఈ భావనల బలాబలాల్ని తేల్చటం అంత సులువేం కాకున్నా, పెట్టుబడిదారీ వ్యవస్థలో సోషలిస్ట్ భావనల విత్తులు ఉన్నపుడు మాత్రమే ఆ సమాజంలో దోపిడీ, తిరుగుబాటు, అణచివేత వంటి మాటలు, కనీసం భావనల రూపం దాల్చే ప్రయత్నం చేస్తాయన్నది వాస్తవం. ఈ విత్తులు లేని సమాజంలో దోపిడీపై తిరుగుబాటు కాదు కదా, కనీసం దోపిడీని గుర్తించగలిగే శక్తిని కూడా మనిషి కలిగి ఉండడు. తెలంగాణా సమాజం అటువంటి విత్తులు పుష్కలంగా ఉన్న సమజం. ఏ సోషలిస్ట్ భావనల్నైతే కమ్యూనిస్ట్ పార్టీ ఈ సమాజంలోకి తీసుకుని వచ్చిందో, అవే భావనల విత్తులు పెరిగి ప్రత్యేక తెలంగాణా ఉద్యమ రూపంలో మొక్కలుగా, వృక్షాలుగా మారుతున్న సమయాన కవి జూలూరీ గౌరి శంకర్ కమ్యూనిస్ట్ పార్టీ ఆశయాలకూ, దాని ఆచరణకూ మధ్య దొరకని లంకెను పట్టుకునే ప్రయత్నం చేస్తాడీ కవితలో.

తెలంగాణా సమాజానికి సోషలిస్ట్ భావనలని తీసుకొచ్చింది నిస్సందేహంగా కమ్యూనిస్ట్ పార్టీనే. అంతేకాక కమ్యూనిస్ట్ పార్టీ మనదేశంలో బలపడటానికి కూడా తెలంగాణా సమాజం అంతే కారణం. తెలంగాణా భూ పోరాటాలు, సమైక్య రాష్ట్రంలోని నక్సలైట్ ఉద్యమాలూ, పాలకులలో, పరిపాలనలో తెచ్చిన మార్పులు తక్కువేం కాకున్నా , అంతకన్నా ఎక్కువగా ప్రజలలో ప్రశ్నంచే తత్వాన్నీ, అందుకు తగ్గ రాజకీయ సామాజిక చైతాన్యాన్నీ కలిగించింది. కానీ ప్రత్యేక తెలంగాణా ఉద్యమం సమయంలో కమ్యూనిస్ట్ పార్టీ పాత్ర ఒక ప్రశ్నార్థకంగా మిగిలింది. కమ్యూనిస్ట్ ఆశయానికి అనుగుణంగా, అణచివేతకూ, దోపిడీకి వ్యతిరేకంగా ఏ వేర్పాటువాద ఉద్యమం మొదలైందో, అదే ఉద్యమం విషయంలో ఆ పార్టీ అవలంబించిన మౌనం కమ్యూనిస్ట్ అభిమానులనూ ఆశ్చర్యపరిచింది. రాజకీయ కారణాలో ఇంకే కారణాలోగానీ, వారి  వ్యూహాత్మక మౌనం, ప్రత్యేక తెలంగాణా వాదులకు ఊహ లేని మౌనంగా కనిపించింది. నైతిక మద్ధతు అవసరమైన సమయంలో మొండి చేతులు చూపించవలసిన అవసరం ఏముందో నిజానికెవ్వరికీ తెలీదనే చెప్పాలి కమ్యూనిస్ట్ పార్టీ వర్గాలకు తప్ప. కమ్మునిస్టు అభిమానిగా కవి జూలూరి గౌరీశంకర్ ఆ పార్టీతో సైద్ధాంతికంగా తాడోపేడో తేల్చుకోవాలనుకుంటాడీ కవితలో. "ఓ ఎర్రజెండా నీవెటు దిక్కో తేలాలిపుడు" అని పట్టుబడతాడు. "విముక్తి పోరాటమే ఎర్రజెండా మ్యానిఫెస్టో కదా, తెలంగాణా విముక్తి అంటే ఎర్ర జెండా రక్తవర్ణమై రెపరెపలాడదా?" అంటూ ప్రశ్నిస్తాడు.  కమ్యూనిస్ట్ భావజాలం మీద, కమ్యూనిస్ట్ పార్టీ మీద అపారమైన ప్రేమ నమ్మకం కూడా కనిపిస్తుందీ కవితలో. ఆ ప్రేమతోటే కాబోలు ఒకింత గట్టిగా అడుగుతాడు నీవెటువైపని. ఆ నమ్మకంతోటే కాబోలు, ఈ పోరు గడ్డ మీద రియలెస్టేట్ కబ్జాలను తుడిచేయడానికి నీవే కట్టమైసమ్మవి కమ్మంటూ ప్రార్థిస్తాడు.

తెలంగాణ  రగల్ జెండా
------------------------------
         జూలూరి గౌరీ శంకర్.

నిన్నెట్ల  సాదుకున్నం
మా నెత్తురు  పోసి  ఎట్లపెంచుకున్నం

నువ్వు
అనగారినోల్లకు  అండవని
నేల  విముక్తి  నేతవని
ఆకలి  కడుపుకు  బువ్వవని
నేర్రలు  బాసిన మట్టికి  నీళ్లవని
నిన్ను  పిచ్చిగా  ప్రేమించినోన్ని
ఈ వెర్రి  గొంతుకతో  ఎర్రపాట పాడినోన్ని

మా  కలతలల్ల  కస్టాలల్ల
కన్నీళ్ళల్ల  కల్లోలాలల్ల
పాడుకున్న పాటకదే నువ్వు
నా  మనసు ఎగరేసిన ఎరుపు  కదే నువ్వు
మా  వాకిళ్ళ నొదిలి
సెట్టు సెలకల్ని బట్టి
ఈ  బొందిల  పాణం
నీకోసమేనన్నోళ్ళ నొదిలి
ఎట్ల  బోతవే సెప్పు ఓ నా ఎర్రజెండా
నన్ను నీకు  ఎడబాసేదేవరో సెప్పు  రగల్ జెండా

నా నేలను  సెరబట్టినోళ్ళపై కదా
దండు కట్టాల్సింది
అక్రమణతత్వం మీద  కదా
ఎర్రజెండా కలబడాల్సింది
నా బువ్వ లో మన్నుబోసినోడి చెంత
ఎట్ల  నిలుస్తవే  సెప్పు నా  ఎర్రజెండా
ఎర్ర జెండంటే సాయంకోరినోళ్ళ  సేతికర్ర  కదా

నా నేలని  నాకిస్తవని  కదా
కొడవలికి  కంకినైoది
సుత్తి  కొడవలి  నక్షత్ర మైంది

ఈ సేత్తో  ఉగ్గుపాలు తాపికదా
నిన్ను  ఎర్రగా  ఎగరేసింది
నా  నేల  పొత్తిళ్ళలో పెరిగే కదా
దేశానికీ  ఎర్రజెండానిచ్చింది

నా నేలను  ఉచ్చుల్లో బిగిస్తున్న వాళ్ళ సేతుల్లో
సిక్కినవు  కదే  ఓయమ్మా

ఓ ఎర్ర  జెండా
నువ్వు  ఎటుదిక్కో  తేలాలిప్పుడు
ఎర్రజెండాకిది  పరీక్షాకాలం
పేగుబంధాల్ని తెగతెంచేటొల్ల  జోలేందుకే  అవ్వ

మా బాధలు  తీర్చే ఓదార్చే
కట్టమైసమ్మవి  కావే ఓ నా ఎర్రజెండా
పోరాట జాగపైన రియలెస్టేట్ ల్ని తుడిసేయవే తల్లీ

కసికసిగా  ఎర్రెర్రగా
తెలంగాణ  పాట పాడవే ఎర్రజెండా

ఆ  నాయకత్వం  సేతులిడిసిపెట్టి
ఈ ప్రత్యెక  పాట  పల్లవించవే అమ్మా
ఈ నేలపై  ఏ ఆధిపత్యం  సెల్లదని సెప్పవే  ఎర్రజెండా
మూడు  కోట్లమంది  పక్కన  నిలవవే ఎర్రజెండా
నా  ఎర్రజెండాను  ఎట్ల ఎగరేయాలో తెలుసు నాకు
విముక్తి పోరాటమే  ఎర్రజెండా  మ్యానిఫెస్టో కదా
తెలంగాణా  విముక్తి  అంటే
ఎర్రజెండా రక్తవర్ణమై రెపరెపలాడదా?

ఇప్పటికీ తెలంగాణా ఉద్యమం ప్రాంతీయ వాదమనే వారూ ఉన్నారు. ప్రత్యేక తెలంగాణా వాదం ఎంత అప్రాంతీయమో, అంతకన్నా ఎక్కువగానే సమైక్యాంధ్ర వాదం ప్రాంతీయం. కాల పరీక్షకు నిలవని ఒకే భాషవాదం, విశాలాంధ్ర వాదం వంటివి వాటిలోని దోపిడిని ఎంతో అందంగా అలంకరించి దాచి వుంచుతాయి. చివరికి ఆ చారిత్రక ఘట్టమైతే ముగిసింది. సుదీర్ఘ పోరాటాల ఫలితంగా తెలంగాణా ఐతే విముక్తి పొందింది. కానీ కేవలం భౌతికమైన విముక్తి విముక్తికి పూర్తి రూపం కాదు. ఆ లెక్కన కమ్మునిస్టు ఆశయం అప్పటికీ ఇప్పటికీ కూడా సజీవమే. ఉద్యమసమయంలో ఏకాగ్రతతో కొంగ జపం చేసిన పార్టీ, ఇపుడు ఆశయాన్ని ఆచరణను కలిపుతూ  సాగాలని కోరుకు౦దాం. కవితలో కవి ఆశయం ప్రత్యెక తెలంగాణా మాత్రమె కాదు, కమ్యూనిస్ట్ భావన అందించే ఉద్యమ స్ఫూర్తి కూడా.


కవిత్వ సందర్భం 28
26-10-16

No comments:

Post a Comment