వంటింట్లో ఏముంది?
-----------------------------
ఎపుడైతే మనం మన అస్తిత్వం కోసం పోరాటం మొదలు పెడతామో...మనమీద ప్రపంచానికున్న దృష్టికోణంతో కూడా పోరాడాల్సి వుంటుంది. ఆ దృష్టికోణాన్ని బద్దలు చేయాల్సి వుంటుంది. అలా చేయాలంటే ఎన్నుకునే మార్గం కఠినంగా ఉండాలా లేక మృదువుగా ఉండాలా అన్నది ప్రపంచానికున్న ఆ దృష్టికోణపు కర్కశత్వాన్ని బట్టి ఉండాలి. సాహిత్యంలో పదాల సహాయంతో అస్తిత్వ పోరాటం చేయటమంత సులభమైనది కాదు. స్త్రీ వాద కవిత్వం స్త్రీల పట్ల ప్రపంచ దృక్కోణాన్ని ఎంతవరకు మార్చిందో తెలుసుకోవటానికి కంటిముందున్న ప్రస్తుత సమాజమే సాక్షి. దీనికి ఈ కవిత్వం, దురదృష్టవశాత్తూ వాసి ఉన్నంతగా రాశి తగినంతగా లేకపోవడం బహుశా ఒక కారణంగా కనిపిస్తున్నది. శారీరక స్త్రీని, సమాజం ఏర్పరిచిన మానసిక స్త్రీని వేరుచేసి చూపించటం ద్వారా, తన అస్తిత్వం శరీరంలో కాదు, మనసులో ఉందని చెప్పటానికి 80 వ దశకంలో మొదలైన తెలుగు స్త్రీ వాద కవిత్వం ఇంకా ఎక్కవలసిన శిఖరాలెన్నో ఉన్నాయన్నది కాదనలేని నిజం. ఈనాటికీ స్త్రీల మీద జరుగుతున్న లైంగిక దాడులూ, యాసిడ్ దాడులూ స్త్రీ వాద కవిత్వపు పటుత్వాన్ని పెంచాల్సిన అవసరాన్ని తెలుపే సవాళ్లుగా మిగిలిపోతున్నాయి. ఒక సంఘటన జరిగినపుడు దానిని ఖండిస్తూ వచ్చే కవిత్వం వచ్చినట్టుగా, ఆ విషయం పట్ల ప్రపంచపు దృష్టికోణం మార్చగలిగిన కవిత్వం రావాల్సిన అవసరం ఉంది.
స్త్రీ కానీ పురుషుడు కానీ, ఒక తల్లికే పుడతారు. ఈమె భౌతిక మైన స్త్రీ. కానీ మానసికమైన స్త్రీ లేదా సమాజపపు దృష్టికోణంలోని స్త్రీ మాత్రం వంటింట్లో పుడుతుంది. ఇది సమాజం నిర్మించిన ఒక నమూనా. దానిని బద్దలు కొట్టడానికి ప్రయత్నం చేస్తుంది కవయిత్రి విమల ఈ కవితలో. డాll కాత్యాయినీ విద్మహే గారి ప్రకారం, స్త్రీ వాద కవిత్వంలో నాలుగు ప్రధాన ధోరణులు. ఒకటి స్త్రీల ఉనికికి సంబంధించిన కవిత్వం, రెండు కుటుంబ సంబంధాల్లో తమ స్థానాన్ని గురించి వివేచించిన కవిత్వం. మూడోది కుటుంబం నుంచి బయటకు వచ్చినపుడు తనకు సంబంధించి సమాజంలో వచ్చే స్పందనను చిత్రించే కవిత్వమైతే, నాలుగవది సామాజిక పరిణామాలు, సామాజిక సమూహాలను స్త్రీగా తను చూసే పద్దతికి సంబఁధించినది. ఈ కవితలో మొదటి రెండు ధోరణులూ కనిపిస్తాయి. స్త్రీల పట్ల ప్రపంచ దృక్కోణం మారటానికి ఈ రెండు ధోరణులూ ఎంత వరకు సహకరిస్తాయన్నది ఆలోచించ వలసి ఉంటుంది. చిన్న ఆయుధంతో పెద్ద శత్రువును ఎదుర్కోవడం వంటిదిది. అయినా కవయిత్రి విమల విమలంగానే రాడికల్ స్త్రీవాదాన్ని వినిపించే ప్రయత్నం చేస్తారీ కవితలో.
మగ, ఆడ అనేవి లింగ బేధాన్ని సూచిస్తే, తల్లి పాత్ర అనేది ఒక మానసిక స్థితిని సూచించే సింబల్ అవుతుంది. భార్య గానీ, భర్తగానీ, ఇంకెవరైనాగానీ తల్లి పాత్రను పోషించకపోతే ఆ పిల్లలు చనిపోయే అవకాశం ఎక్కువని సైన్సు చెబుతోంది. తల్లి పాత్రను కన్వీనియంట్ గా స్త్రీకి అప్పజెప్పడం పితృ స్వామ్య సమాజం నేర్చుకున్న పోకడ. తల్లి, తల్లి పాత్ర కేవలం ఒక సింబల్ గా మనం తీసుకోలేనపుడు, దానిని ఒక జెండర్ కు మాత్రమే పరిమితమైన అంశంగా మార్చినపుడు, దాని చుట్టూ ఎన్నో దోపిడి వ్యవస్థలు మొదలవుతాయి. అటువంటి దోపిడిలో వంటిల్లు ప్రధాన పాత్ర పోషిస్తూ స్త్రీ జీవితాన్నే శాసిస్తున్నపుడు, ఆ వంటింటిని కూల్చేయాలి అనుకోవటం ఏ మాత్రం తప్పు కాదు. కవయిత్రి విమల తన వంటింటిలో తన బాల్య జ్ఞాపకాలు నెమరేసుకుంటున్నపుడు వంటిల్లు వంటిల్లు లాగానే అద్భుతంగా, ప్రాణంతో శ్వాసించే దానిలా, రుచులతో ముస్తాబయ్యే దానిలా, మేల్కోవటం, పడుకోవటం తెలిసిన దానిలా అనిపిస్తుంది, కానీ బాల్యం కరిగిపోయాక, ఆ వంటింటిలోనే తన స్త్రీత్వం కూడా పుడుతుందని తెలిసినపుడు, అదే వంటింటిలో బందీ అయిన తన తల్లి, గరిటలా, పెనం లాగా కనిపించటమూ, నిశ్శబ్దంగా, నిరాశగా, భయం భయంగా జీవించే ఆమె ఒక ప్రేతంగా కనిపించటమూ మనం ఈ కవితలో చూస్తాం. తల్లి పాత్ర ద్వారా సమాజం స్త్రీ మీద చేసే అదనపుదోపిడీని కవయిత్రి చాలా సమర్థవంతంగా చూపిస్తారీ కవితలో. తరం మారినా, శ్రమ దోపిడిని తగ్గించే ఆధునిక ఎలక్ట్రానిక్ పరికరాలు వచ్చినా, వంట వండే పదార్థాలు మారినా, వంట చేయడం స్త్రీకి, ఇంకా చెప్పాలంటే, తల్లి పాత్ర పోషిస్తున్న స్త్రీ కి తప్పటం లేదు. ఆ వంట పాత్రలన్నింటి మీదా, అమ్మ తరం లో నాన్న పేరు ఉండటం, ఈ తరంలో తన భర్త పేరు ఉండటాన్ని సూచించటం ద్వారా, చాలా బలమైన అస్తిత్వ వాదనను వినిపిస్తారు కవయిత్రి విమల.
వంటిల్లు
----------- విమల
--------------------------------
ఎంత అద్బుతమైంది ఈ వంట గది
రుచులు రుచులుగా పరిమళాన్ని వెదజల్లుతూ
తెరచిన తినుబండారాల దుకాణంలా
ఎంత నోరురిస్తుందో !
తాలింపు ఘుమాయిన్పులతో
పూజ మందిరం అగరొత్తుల సువాసనలతో
మా వంటిల్లు నిత్యం శ్వాసిస్తూ ఉంటుంది.
వసారాలో చల్ల చిలికే చప్పుడుతోనో
అంట్ల గిన్నెలు తోమే చప్పుడుతోనో
రోజు ఉదయమే మా వంటిల్లు మేల్కొంటుంది
అలికి ముగ్గులు దిద్దిన పొయ్యి
మండేందుకు ముస్తాబవుతుంది
వంటింటి పోపు డబ్బాలో చిల్లర పైసలు
దాచుకు తిన్న మిటాయి ఉండలు
పప్పు బెల్లలతో ఉత్తుత్తి వంటా-వడ్డనలు
అమ్మ నాన్న ఆటలు
ఈ వంటిల్లోక వదలని మొహమై
నా బాల్యాన్నంత చుట్టేసుకుంది .
నాకు మా వంటిల్లోక అద్బుత మాయా బజార్
ఇప్పుడు వంటిల్లోక ఆట స్థలం కాదు .
మెల్లగా బాల్యపు చాయలు వదిలిపెడుతున్డగానే
ఇక్కడే నన్ను తీర్చి దిద్దటం మొదలయ్యింది
"వంటింటి తనాన్ని" ఇక్కడే నేర్పారు నాకు
మా అమ్మ, మా అమ్మమ్మ,
ఇంట్లో అమ్మలంతా ఇక్కడే "స్త్రీ" లయ్యారట
గిన్నెలు, డబ్బాలు, బస్తాలతో
రకరకాల శవాలు నిండిన శ్మశానంలా
మా వంటిల్లు -
తడి కట్టెల పొగ మేఘాల మధ్య
మా వంటిల్లు వేలాడుతూ ఉంటుంది
భయం, భయంగా నిశ్శబ్దంగా, నిరాశగా
మా అమ్మొక ప్రేతంలా తేలుతూ ఉంటుందిక్కడ
అస్సలు మా అమ్మే నడుస్తున్న వంట గదిలా ఉంటుంది,
ఏడ్చి ఏడ్చి ఆమె కళ్ళు ఎక్కడో కారి పోయాయి.
తోమి తోమి ఆమె చేతులు అరిగి పోయాయి
మా అమ్మకు చేతులు లేవు
ఆమెను చుస్తే
ఒక గరిటగానో, పెనం లానో
మా వంటింటిని అలంకరించిన ఓ పరికరం లానో ఉంటుంది.
ఒక్కో సారి ఆమె మండుతున్న పొయ్యిలా కూడా ఉంటుంది.
అప్పుడు బంది అయిన పులిలా ఆమె
వంట గదిలో అశాంతిగా తిరుగుతుంది .
నిస్సహాయతతో గిన్నెలు తిప్పితే చాలు
వంట సిద్దం అంటారంతా !
తినేందుకు తప్ప ఇటుకేసి రారు ఎవ్వరూ
ఈ వంటింటి సామ్రాజ్యానికి మా అమ్మే రాణి
అయనా చివరకు వంటింటి గిన్నేలన్నింటి పైనా
మా నాన్న పేరే !
అదృష్ట వశాత్తూ నేనో మంచి వంటిట్లో పడ్డనన్నరంత !
గ్యాసు, గ్రైన్దర్లు, సింకులు , టైల్స్ ...
అమ్మలా గారెలు, అరిసెలు కాక
ఇప్పుడు కేకులు , పుడ్డింగులు చేస్తున్నాను నేను
ఇంకా గిన్నెలపై పేర్లు మాత్రం నా భర్తదే
కుక్కర్ కూత తోనో , గ్రైండర్ మోత తోనో
నా వంటిల్లు మేల్కొంటుంది .
నేనొక అలంకరించిన వంట గదిలా
కీ ఇచ్చిన బొమ్మలా ఇక్కడ తిరుగుతూ ఉంటాను
నా వంటిల్లోక యంత్రశాల ల ఉంది
రకరకాల చప్పుళ్ళతో ఈ వంటిల్లోక కసాయి
దుకాణంలా ఉంది
కడిగిందే కడిగి ఏళ్ళ తరబడి , వండి ,వండి,
వడ్డిస్తూ ఎంగిళ్ళు ఎత్తెసుకుంటూ
చివరకు నా కలలలోను వంటిల్లె
కళాత్మకమయిన వంటింటి కలలు
మల్లె పూవుల్లోను పోపు వాసనలే !
ఈ వంటింటి ని తగలెయ్య
ఎంత అమానుష మయ్యిందీ వంట గది !
మన రక్తం పీల్చేసి , మన ఆశల్ని , కలల్ని కాజేసి
కొద్ది కొద్దిగా జీవితాంతం పీక్కు తింటున్న
రాకాసి గదా ఈ వంటిల్లు
వంటింటి సంస్కృతి ; వంటింటి ముచ్చట్లు
వంటలక్కలమైన మనం
మనం ఏమయినా మన అంతిమ కర్తవ్యం
గరిట తిప్పడం గా చేసిన ఈ వంటిళ్ళను
ద్వంసం చేద్దాం రండి !
ఇక గిన్నెలపై ఎవ్వరి పేర్లు వద్దూ
వేర్వేరు స్వంత పొయ్యిలను
పునాదులతో సహా తవ్వి పొద్దం రండి!
మళ్లి మన పాపలు ఈ వంటరి వంటిళ్ళలోకి
అడుగిడపోతున్నారు.
మన పిల్లల కోసం
వంటరి వంట గదులు కూల్చేందుకు రండి
వంటల పుస్తకాలు నిజానికి ఎంత మంది చదువుతారో గానీ, ఈ రోజుకీ ప్రపంచంలో బెస్ట్ సెల్లర్ లిస్ట్ లో ఈ వంటింటి సాహిత్యమే టాప్ లో ఉంటోంది. పొరపాటున ఈ వంటింటి సామ్రాజ్యానికంతటికీ స్త్రీ యే ఇప్పటికీ మహారాజ్ఞి. స్త్రీ వాద కవిత్వమిస్తున్న పిలుపులోని బలాన్ని ప్రశ్నించేదిగా ఈ లెక్కలున్నాయి. వంటింటిని కూల్చేయలేక పోయినా, వంట చేయటం నీచమైన కార్యమేమీ కాదనే దృష్టికోణమొకటి ప్రపంచంలో మొదలైంది. అది స్త్రీవాదం వలన కలిగిందా, లేక వంటను వ్యాపారంగా మార్చే కాపిటలిస్ట్ పోకడలు మార్చాయో తెలుసుకోవాలంటే, హోటల్ మేనేజ్మెంటు కోర్సుల్లోని పురుషాధిక్యతను గమనించకతప్పదు. స్త్రీ వాదం నిర్దేశించిన వంటిల్లు లేకపోవడం అన్నది, కాపిటలిస్ట్ సమాజంలో పురుషులతో పాటుగా స్త్రీల ఆఫీసు పనిగంటల దోపిడీగా, రెడీ మేడ్ ఫుడ్ ని అందించే కే.ఎఫ్.సీ, డొమినో, మ్యాక్ డొనాల్డ్ వంటి బహుల జాతి కంపనీలు పుట్టుకురావడంగా రూపాంతరం చెందుతూ వస్తూంది. పనిలో పనిగా ఈ మారుతూన్న కుటుంబ వ్యవస్థలను కంపనీలు పలువిధాలుగా క్యాష్ చేసుకునే పనిలో పడ్డాయి. కాపిటలిస్ట్లకు పనికొచ్చే విధంగా స్త్రీ వాదం మారుతోందని, దీనిని బూచిగా చూపించి స్త్రీ వాదాన్ని పలుచన చేసే పోకడల్ని చూస్తున్నపుడు, వంటల పుస్తకాల స్థానాన్ని వంటింటి కవితలు నింపాల్సి ఉంటుంది. ఈరోజు వంటిల్లు ఉందా లేదా అంటే..లేదు, కాపిటలిస్ట్ లకు అవసరమైనంత మేరకే లేదు, ఉంది కాపిటలిస్ట్లకు వంటింటి సామాగ్రిని అమ్ముకోవడం వరకూ ఉంది. కానీ స్త్రీ మాత్రం వంటింట్లోనే వుంది, ఆఫీసుకు ముందూ, ఆఫీసుకి తరువాత. ఇది వాస్తవం. మారుతున్న సామాజిక రూపంలోని మితుల్నీ, పరిమితుల్నీ దాటి స్త్రీవాద కవిత్వం తన విస్తృతిని పెంచుకోవటం కేవలం స్త్రీలకే కాదు, మొత్తం సమాజానికి కూడా అవసరం.
No comments:
Post a Comment