Saturday, 27 June 2015

అ కి అ వొత్తిస్తే...2
................................
* మల్లీ ఏం జేస్తవని అడుగుతౌ....శెప్పిన కదా...ఏంజేస్తం...ట్విట్టుతం.

* గుడ్డుమీద బొచ్చు పీకడమంటే ఏందో అనుకున్న...ట్వీటడం.

* పీకావులే నెట్టు మీద ట్వీటు

* ట్వీటు శతకం రాయలని  యోగిలా మారాడు.

* తెగేదాక లాగకూడదు. ఇదేమైనా తాళా?

* మండేలా చూపే నీదేలే...ఓ మిస్సయ్యా మిస్సయ్యా అయ్యా...నీ మైనస్సే చూశామయ్యా..

* ఆయన బ్రీఫాడు..నేను ట్విట్టాను.

* ప్రశ్నించడమంటే..ఏంటో అనుకోకండి. ట్విట్టర్ లో ట్విట్టడం.

* సంబంధం ఉందా లేదా అని కాదన్నయ్యా...ట్వుటానా లేదా అన్నది చూడాలి.

* తూ చ్..తొండి. ప్రశ్నిద్దామని ట్వీటితే...ఒక్క ట్వీటుకి ఇన్ని ప్రశ్నలా?.

అ కు అ వొత్తిస్తే...
..........................
* అవును అతడు గొప్ప నటుడు. ఎక్కడైనా.

* ట్విట్టర్ పిట్టి గంట కొట్టింది.

* నెల్సన్ మండేలా నేనూ సేమ్ టు సేమ్.

* నీతులు చెప్పడం ఇంత వీజీనా..?

* ఇలాంటి ప్రాబ్లంలు వస్తే...గట్టిగా పిలవండి. తప్పక వొస్తా...వొచ్చి ట్విట్టుతా.

* చివరికి వచ్చాడు...చూశాడు..ట్విట్టాడు.

* ఏయ్...మల్లీ ట్విట్టాడు.

* అవినీతిని అంతం చేద్దాం..ట్వీటుదాం.

* ఆయనెవరినీ తిట్టడు. మర్యాదగా ట్వీటుతాడు.

* సంవత్సరానికి ఒక ట్విట్టే.

Thursday, 25 June 2015

విరించి  ll అసంపూర్ణ శిల్పం  ll
...................................
కొన్ని ఆకస్మిక సాయంత్రాల్ని
మనకు మనమే సృష్టించుకుంటాం.

ఎపుడోకానీ ఎదురుపడని
తూ ర్పూ పడమర తిలకాల్లాగా
మనమపుడపుడూ యాదృచ్చికంగా
ఎదురుపడుతున్నట్టు నటిస్తుంటాం.

చల్లటి చిరుగాలి నిండిన ఆకాశంలా
మన చూపుల్ని కొన్ని క్షణాలు కలుపుకుంటాం

బరువైన గాలికి రెపరెపలాడే
నీ కనురెప్పలకీ..
చూసీ చూడక చూసే
నీ క్రీగంటి సిగ్గులకీ..
జరిగే సంధి కుదరని యుద్ధంలో
నిరాయుధ సైనికుడినై నిట్టనిలువునా
ఓడిపోతున్నందుకు ఒకింత గర్వపడిపోతాను.

'బాగున్నావా' అనీ ఒక ముక్క అడిగి
చేతులు నలుపుకుంటున్న నాకూ
'బాగున్నా' నని ముక్తాయింపుగా చెప్పి
ముంగురులు సరి చేసుకునే నీకూ
హృదయాల్లో మాటలు సెలయేళ్ళై
పారాలని ఉంటుందేమో...కానీ

నీటిమీద ఎగరాలని విసిరిన రాయి
డుబుక్కున మునిగిపోయినట్టు
మన మధ్య వీచే గాలిలో చుట్టుకుపోతాం

మన పక్కనుండి నడిచే మనుషులు
మ్రోగే హారను శబ్దాలూ
మన మీదినుంచి కదలని లోకుల చూపుల నడుమ
ఒక్క కౌగిలింతకి ఎన్ని గోడల్ని పగులగొట్టాలో..

చివరికి బలవంతపు రాయిలా కదిలే నేను.
చేతులు కట్టేసిన శిల్పిలా నీవు.
'మరి ఉంటాను' అనే గాటును మోస్తూ ఒక అసంపూర్ణ శిల్పం.

24/6/15

Tuesday, 23 June 2015

విరించి ll అప్పగింతలు  ll
...................................
ఆ సమయంలో నాన్న నాకు
కంట్లో వొత్తులు కాలిన
పాతుకుపోయిన దీపపు స్తంభంలా కనిపించాడు.

ఆకాశాన్ని ప్రతిబింబంగా ఎత్తి మోసే
మా వూరి చెరువు
ఎండిపోయినట్లుగా కనిపించాడు

ప్రేమ బంధాల్ని పట్టుకునీ పట్టుకునీ
మొద్దుబారిన చేతులను
మొదటిసారి కన్నీటితో కడుగుతూ కనిపించాడు

ఇన్ కం టాక్స్ పేయ్మెంట్స్ కీ
ఎల్ ఐ సీ పాలసీలకీ
సంపాదనంతా సరిపోయాక
ఆకులు రాలిన
మార్చి ముప్పై ఒకటి చెట్టులాగా కనిపించాడు

అడగకుండానే అన్నీ పెట్టే నాన్న
తనకన్నీ నేనే అనుకునే నాన్న
ప్రేమని మౌనంగా గంభీరంగా పంచే నాన్న
నన్నొక అయ్య చేతిలో పెట్టిన రోజున
తన గుండెల మీది బాధనెందుకో
దాచుకోలేక భళ్ళున కురిసే వానయ్యాడు.

తన కలలేమో కలతలేమో
కష్టాలేమో నష్టాలేమో...
ఎపుడూ ఎవరికీ అంతుబట్టని నాన్న
నా చేయి వదిలి పట్టుబడిపోయాడు.

ఆడపిల్లకి పెళ్ళంటే
అప్పగింతలంటే ఏమో కాదు
మొదటిసారి నాన్న కళ్ళలో నీళ్ళు చూడటమే.

23/6/15
ఏం మహాడుతున్నారు? హైద్రాబాదులో అసలు రాత్రి కావడం లేదు. ఎన్నో స్ట్రీట్స్ లైట్స్ పెట్టాం. ఆ విధంగా ముందుకు పోయాం. అర్ధ రాత్రికూడా మిట్ట మధ్యాహ్నం లా ఉంటుందంటే...కాహదనే పరిస్థితికొచ్చారు. ఎటు పొహోతున్నామని అడుగుతున్నాను.

ఏం మహాడుతున్నారు?.  హైదరాబాదులో ఎక్కడుంది వైద్యం. మంచి డాక్టర్లు లేరు. కార్పోరేట్ హాస్పిటల్స్ లేవు. నడుము నొప్పొస్తే.. విదేశాలనుండి హైదరాబాద్ నుండి కూడా పేషంట్స్ మా పల్లెటూరి ఆసుపత్రులకే వచ్చే పరిహిస్థితొచ్చింది.

ఏం మహాడుతున్నారు?. హైద్రాబాదు అందరిదీ. ఇక్కడ గుజరాతీ వాల్లు...పంజాబీ వాల్లు..బెంగాలీ వాల్లు ..బీహారీ తమ్ముల్లు..ఆంధ్రా వాల్లు...బంగ్లాదేశ్ వాల్లు...పాకిస్థాన్ వాల్లు కూడా ఉంటారు. ఏ ప్రాంతం వాల్లకి వాల్ల భాషనే అర్థం అయ్యే పరిస్థితి. అందు కోస్రం ఆయా పోలీస్ స్టేషన్ లు ఉండాలంటున్నాం. దానికి కూడా కాదనే పరిస్థితికొచ్చారు.

ఏం మహాడుతున్నారు? హైద్రాబాద్ నిజాం కట్టిహించాడంటున్నారు. కేవలం గవర్నమెంటు సంస్థల భవనాలు మాత్రమే ఆయన కట్టించిన పరిస్థితికొచ్చారు.. ప్రైవేటు సంస్థల కోస్రం ఏహీమీ కట్టివ్వలేదు. మేము  కట్టాం. గుండ్రంగా హైటెక్ సిటీని కట్టాం. ఆవిధంగా ముందుకు పోయాం.

ఏం మహాడుతున్నారు. ఈ రోజు ఓటుకి నోటంటున్నారు. ఫోన్ టాపింగ్ చేశారు. ఆధారాలున్నాయి. మాకూ పోలీసులున్నారు..మాకు ఏసీబీ ఉందంటే..మహాట్లాడని పరిస్థితికొచ్చారు. ఆంధ్ర ప్రజల కోస్రం మేము సెక్షన్ ఎయిట్ ముందుకి తీసుకొచ్చాం. దాన్ని కూడా కాహాదనే పరిస్థితికొచ్చారు. న్యూస్ ఛానల్స్ కి సమాచారం ఇచ్చే పరిస్థితొచ్చింది. ప్రజాస్వామ్యం ఎహుటు పోతుందని అడుగుతున్నాం. ఆ విధంగా ముందుకు పోతున్నాం.

Monday, 22 June 2015

లక లకలు
..................

* 'తెదే' పాపం తలా పిడికెడు

* వెయ్యబద్దాల్జెప్పైనా ఒక తప్పు కప్పేయాలన్నారు నాయకులు

* శిశుపాలుడే నయం వంద తప్పులు వేరు వేరుగా చేశాడు.

* 'నారా'యణ మంత్రం శ్రీమ'న్నారా'యణ భ 'జనం'

* ప్రశ్నించటం అంటే ఏమిటని ప్రశ్నిస్తున్నా?.

* చండ్ర పాపం, సండ్ర రోగం.

* నేటి యయాతి మత్తయ్య.

* నా శాయశక్తులా ప్రయత్నించాను. ఐయాం వెరీ సారీ...ప్చ్..ఆయనకే జబ్బూలేదు.

* చంద్రాలోపి మమ గురుః

* సెక్షన్ లతో కొడతా..

Thursday, 18 June 2015

విరించి ll అర్ధ వాక్యం ll
..................................  
ఖాళీ కాగితాల్లా ఒక్క గీతను కూడా
ఎత్తి చూపలేని నీ పెదవులతో
ఒక్కోసారెందుకనో..
న్యూస్ పేపర్లలాగా కొన్ని జండాల్ని మోస్తూ నినదిస్తావు.

తనకు తానే చుట్ట చుట్టుకున్న పాములాగా
మెదడునొక్కదాన్ని పడగలా విప్పుకుంటావు
గొర్రెల్లా తోకల్ని వెంబడించే మేఘాల్లాగా
చిక్కటి కారు మబ్బై ముసురుకుంటావు

పుకారునొకదాన్ని బాంబులా మెడకు చుట్టుకుని
నిన్ను నీవు పేల్చేసుకోవడమొకటే ఇపుడిక మిగిలింది.

నాలుగు రూపాయలకి కిలో లెక్కన పాత పేపర్లు అమ్ముడవుతాయి
పడగ విప్పలేని పాముల తలలకీ విష గ్రంధులు వేలాడుతాయి.
వెలిసి పోయిన వర్షపు మేఘం వెనుక సూర్యుడు మరింతగా వెలిగిపోతాడు
వాక్ స్వాతంత్ర్యానికి బ్రష్ చేయని నోటి పుకారే రారాజవుతుంది.

నీకు తెలియదు కానీ..
నీకన్నా ప్రాణంలేని నీ ప్రతిబింబమే ఎక్కువగా జీవిస్తుంది.
నీ ఆత్మ హత్య మరో బానిస బ్రతుకుకి బలాన్నిస్తుంది.
ప్రపంచ పటానికి సరిగ్గా ప్రశ్నలా కనిపించే దేశం నుండి
మనం రాసుకునే ఆశ్చర్యకర బ్రేకింగ్ న్యూస్ కి ఫుల్ స్టాపెందుకు పెట్టాలి?.
డెమోక్రసీ కదా...మన ఇష్టం. కామాలే పెట్టుకుందాం.

18/6/15

comments1

*కోరికల తులా భారంలో బతుకుదే పై చేయి కాబట్టి, ఎన్నో కోరికల్ని మనసు అదిమి ఉంచుకుంటుంది. అవి స్వప్నలోకాల్లో తీవ్రంగా బయటకు రావటానికి ప్రయత్నిస్తాయి. ఫ్రాయిడియన్ స్వప్న సందేశ సిద్దాంతాన్ని మరలా కవితలో చూస్తున్నట్టుగా అనిపించింది. స్వప్నం ఒక ఉద్గారంలా అయితే తప్ప, మనిషి తన సంయమనాన్ని కోల్పోకుండా ఉండలేడు కాబట్టి, కవయిత్రి ఆ ఆశని చాలా స్వేచ్ఛగా వ్యక్తీకరించటానికి వెనుకాడలేదు. మంచి కవిత.

*
కనిపించే ప్రతి విషయమూ మనకొక అద్దంలా పనిచేస్తూ, మనమేంటో చెబుతుంటుంది. ఈ కవితలో ఆ భిక్షకురాలు  మన లోపలికి చూసుకోటానికి ఉపయోగపడింది. ఎంత చెట్టుకు అంత గాలిలానే మధ్య తరగతి బ్రతుకులు ఉండటం వల్ల, ఒక క్షణం, ఆమెతో కవి ఏకత్వాన్ని అనుభవిస్తూ సాగిపోతున్నాడు. మంచి కవిత. పుష్యమీ గారికి కృతజ్ఞతలు.

*   కుల వృత్తులకూ, సంస్కృతికీ ఆచారాలకూ ఎంతటి సంబంధం ఉండిందో అంతర్లీనంగా చెబుతుందీ కవిత. పుట్టుక పెండ్లి చావు నుంచి అనేకానేక పండగలకూ, ఆచారాల రూపంలో వివిధ కులవృత్తుల వారికి పనిని కల్పంపచేసిన ఒకానొక సంస్కృతినికూడా ఈ కవిత ఎత్తి చూపుతోంది. ప్రపంచీ కరణతో సంస్కృతితో పాటు కుల వృత్తులూ కనుమరుగుతున్న తరుణం ఇది. కానీ ఆ వృత్తి లోని వివిధ పదాల్ని ఏర్చి, కవితను కూర్చడంలో కవి యొక్క నిబద్దత స్పష్టంగా కనిపిస్తోంది. కమ్మెచ్చు తీసిన ఉక్కు ముక్క, అయిరేణి కుండ, బోణం బాన, మూకుడు వంటి పదాలకి అర్థాల్ని కూడా గ్లోసరీలో చేర్చితే..ఇలాంటి అందమైన పదాల్ని కోల్పోకుండా ఉంటామని నా అభిప్రాయం. కవి గారికి వందనాలు.

*  కంటి ముందు కదలాడే ఎన్నో నిర్లిప్త దృశ్యాలనూ, ఆంతరంగికంగా సాగే సంభాషణనూ, అందులోని జ్ఞాపకాలనూ ఒకే కవితలో కుట్టటానికి ప్రయత్నించారు. చాలా మంచి సబ్జెక్ట్ తో కొత్త శైలిలో వ్యక్తీకరించారు. కానీ మంచి శిల్పాన్ని సాధిస్తే.. అద్భుతమైన కవిత అవుతుంది. కొంత పరిశ్రమ చేసి ఉండాల్సింది అనిపించింది. అభినందనలు

*   నేరం చేశాక, పోలీసులు కావాలనే కొంత సమయాన్ని వృథాచేస్తారట. దాని వల్ల నేరగాడు తన నేరాన్ని కనిపించకుండా చేసుకునే క్రమంలో ఇంకా ఎక్కువ నేరాలు చేయటానికి, అడ్డంగా తన వల్లో తానే పడిపోవటానికి కావలని చేసే ఒక ప్లాన్ లాంటిదిది. నేరమూ శిక్ష నవల్లో డాస్టోవయెస్కీ చెప్పిన సీక్రెట్ ఇది. అందులో ప్రొటాగొనిస్ట్ రాస్కోల్నికోవ్ మానసిక స్థితికి, చంద్రబాబు స్థితికీ కొంత సిమిలారిటీస్ కన్పిస్తున్నాయి. కాబట్టి ఒక కేసు పోయి, పది కేసులు మెడకు చుట్టుకుంటున్నారు తమకు తామే. ఎసీబీ గుడ్ గోయింగ్.

*  ఈ మరుపును కోరుకోవటం నిజానికి ఏకాంతాన్ని కోరుకునే ఒక మానసిక స్థితిది. అపుడపుడూ ప్రపంచంతో పూర్తిగా సంబంధాన్ని కావాలనే కోల్పోవటం ఏకాంతం. ఒంటరి తనం లో ప్రపంచం మన వెంటే ఉండిపోతుంది, బాధిస్తుంది. కవి కోరుకునే ఈ ప్రశాంతతని ఈ కవితలో చెప్పారు.

* కవి సంగమం లో కవితలు వస్తూనే ఉన్నాయి ఈ విషయంలో. పోమాల గారు కవి సంగమం లోని కవితలను ఫాలో కావటం లేదనిపిస్తోంది. అంతేకాక ఇలారాయట్లేదేంటి మీరని వాపోయే బదులు, మీరూ ఒకటి రాసి, ఒక వరవడి తీసుకురావచ్చని నా అభిప్రాయం. సామెతలూ, జాతీయాలూ, తిట్లూ, శాపనార్థాలూ కవితలు కావని ఇలాంటి సందర్భాల్లో మేల్కొలిపే భావాలే కవితలౌతాయని మనం గుర్తించుకోవాలి.

* అసదుద్దీన్ ఒవైసీ ఆ మధ్య పాకిస్తాన్ కి వెల్లినపుడు ఇలాగే మాట్లాడాడు. మా దేశ ముస్లిం ల మీద మీరు దొంగ ప్రేమలు చూపించకండని, మా హిందూ సోదరులకు మాకూ మధ్య గొడవలుంటే అవి మేమే పరిష్కరించుకోగలమని ఆ దేశంలో చిందులేసి చీవాట్లు పెట్టి ఒచ్చాడు. ఇపుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆంధ్రా ప్రాంత వాసులు ఇలాగే స్పందిచటం చాలా అవసరం. వారి ఆరిజిన్ ఎక్కడిదయినా ప్రస్తుతం వారు తెలంగాణ ప్రజలు. కాబట్టి వారిపుడు గొంతు  విప్పాలి. అనవసరంగా తెరమీదకి లాగాలని చూసే వారికి బుద్ది చెప్పాలి.

*    ఇది పోర్నోగ్రఫీకి అడ్డిక్టయిన ఇద్దరు అమాయకుల మీద జాలి చూపే కన్నా..ఆ అవస్థని మగ దురహంకారంగా సాగుతూ నడిచే కవిత. సైకాలజిస్ట్లు డెఫినైట్ గా ఆ పిల్లలు తలిదండ్రుల ప్రేమను కోల్పోయినవారిగానో..లేక చిన్న తనంలో సెక్సువల్ అబ్యూజ్ కి గురయిన వారిగానో గుర్తించగలిగే అవకాశం ఎక్కువ. సైకాలిజిస్ట్ లు ఈ పిల్లల్ని అబ్యూజ్డ్ చిల్డ్రెన్ గా గుర్తించగలరు. మారిపోతున్న సమాజాల్లో తల్లీదండ్రులు డబ్బుల సంపాదనలో మునిగి జీవితాన్ని ఉరుకుల పందెంలా చూసే క్రమంలో.., నెగ్లెక్డెడ్ చైల్డ్ హుడ్ కి నిదర్శనాలు ఈ ఇద్దరు పిల్లలు. ఆకలికి అంగాల్ని ప్రదర్శించుకుని ఆడవారు బతికే దేశాల్నుండి, పోర్నోగ్రఫీ చట్ట బద్దమై ప్రభుత్వాలకి ప్రధాన ఆదాయ మార్గాలైన దేశాల్నుండి వచ్చే పుంఖాను పుంఖాల మెటీరియల్..దాని వెనుక సాగే కోటాను కోట్ల డాలర్ బిజినెస్ మధ్యన ఈ పసి వారు జస్ట్ కన్ఫ్యూజ్డ్..నెగ్లెక్టెడ్ ఇన్నోసెంట్స్. మెదడు కణాల్లో తము కోల్పోయిన ప్రేమని పోర్నో ద్వార తృప్తి పరచుకుని అడిక్ట్ అయిపోయిన పాపం పసివాల్లు. అరుణ గారు, ఒక గంభీరమైన కవితని తెరమీదకు తెచ్చి మనముందుంచారు. కృతజ్ఞతలు.

Thursday, 11 June 2015

విరించి ll అందమైన సంతకం ll
............................ .......
నిదుర రాని ఈ చిక్కటి సమయాల్లో
నేను నిన్నే అనువదించుకుంటాను
అచ్చు తప్పు దొర్లని భావాలన్నిటినీ
నీ చీకటిలో ముంచి కడుగుకుంటాను.

నింపుతున్న గళ్ళ నుడిలో
మిగిలిపోయిన రెండు ఖాళీ డబ్బాల్లాగా
నా రెండు కళ్ళు...
రెండు అక్షరాలకోసం వెదుకుతుంటాయి.

చుట్టూ ముసురుకున్న చీకటిలో
రొద పెట్టే కీచురాళ్ళ లాగా
ఓ రెండు భావాలు..
మెదడుపుస్తకాన్ని పురుగులా తొలుస్తుంటాయి.

శిలని శిల్పంలా మలిచే ప్రయత్నంలో
శబ్దం చేసే పనిముట్లలాగా
నా రెండు చేతులూ..
కాగితాలమీద నాడుల్ని మీటుతాయి

మసక వెన్నెల క్యాండిల్ లైట్ డిన్నర్ లో
దగ్గరయిన రెండు మనసుల్లాగా
నా రెండు శ్వాసలు
ఒకదానికొకటి ఉన్మీలనాలౌతాయి

లోకాన్ని లోకులు
కొన్ని చర్వణ చర్విత పదాల్లోకి
విసుగులేక పదే పదే
వ్యాఖ్యానిస్తున్నపుడు
నీవీ జాగ్రత సుషుప్తావస్థల నడుమ
శూన్యాలనెలా నాలోపలికి పలుకుతావోనని
కర్ణభేరీల మీద నిశ్శబ్దాన్ని మోదుతుంటాను

కనిపించని చీకటిలో కరిగిపోయే
ఒక అనాత్మ వస్తువులా
నాలోని ఉద్విగ్నతనంతా
ఒక చుక్కలోకి జారిపోయినపుడు
చెంపమీద బరువెక్కిన ఓ చిన్నతడి
ఆనందానిదో దుఃఖానిదో తెలియనందుకు కూడా
ఆనంద పడిపోతాను.

ఈ అనువాదానికి చివరి మాటలా మిగిలిన నిశ్శబ్దాన్ని
ఈ రోజుటి ఎండ కింద వేలాడిన రాతిరిని
పేజీ చివర చేసే అందమైన సంతకంలా
ఒక కవితలోకి ఒంపుకుంటాను.

11/6/15

Wednesday, 10 June 2015

విరించి  ll పద సోదరీ..ll
....................................  
గొప్ప నిర్ణయాలకిది గొంతుక కారాదు
భయంకర నిర్ణయాలకిక
సైరన్ మోత కావాలి.

అసహాయతకు సాక్షాలుగా
మేకులకు వేలాడిన శవాలన్నీ
నీ అసమర్థతకు కోవర్ట్ లుగా మారకముందే
ఈ శవయాత్రల డప్పుల ముందు
నీవిక దయ్యాల తాండవం చేసెయ్యాలి

చాలాకాలం పోరాడుతున్నావంటేనే
నీ ఓటమెపుడో నిర్ణయమైపోయినట్టు.
ఒక వాలుకు ఒరుసుకు పోయే
నీ విప్లవ సముద్రాల పోరిపుడు
క్షణాల్లో కూల్చివేసే సునామీలా హోరెత్తాలి

యుద్ధంలో గాయపడని అర్భకుడే
బట్టలలో భయాన్ని మోసుకుపోతాడు.
కనిపించని గాయాల్ని నిర్దయగా
దాచివుంచే నీ రంగు బట్టల మీద
చేయివేసిన ఆగంతకుడి మీదికి
నీవొక వేల గాయాల పుండై తిరగబడాలి.

పునాదుల్లా తవ్విన గోతులలోకి
నీ తిరుగుబాటు చరిత్ర కాంక్రీటు పోయాలి
శిథిలాల్లా నిలిపిన శిలాఫలకాల మీదకి
నీవొక సువర్ణాక్షరమై నిలబడాలి

నీ వామపాదం కదిలి కదం తొక్కాలి.
నీ బిగిసిన పిడికిలిలో నరాలు చిట్లాలి.

పద సోదరీ...
నీ ముఖానికి చుట్టిన స్కార్ఫ్ కింద
ఒక నిర్భయ ముఖమే రూపుకట్టాలి.
నీ నడుముకిచుట్టిన చున్నీ ఇపుడు
ఒక గొంతు చుట్టూ ఉరివేయాలి.

6/6/15
(ఇంకానా ఇకపై సాగదు.)

Tuesday, 9 June 2015

కొన్ని సంగతులు1

*రైలు పట్టాల వైపు
నీరు పల్లం వైపు.

నీవు అదో టైపు
నేనూ అదే టైపు

ఈ శతకంలో కొన్ని ప్రక్షిప్తాలు నావి కూడా ఉండాలి అధ్యక్షా.

*   అమూల్, ద టేస్ట్ ఆఫ్ ఇండియా
బబూల్, ద పేస్ట్ ఆఫ్ ఇండియా
రాహుల్, ద వేస్ట్ ఆఫ్ ఇండియా

ఏంటో మీ పోస్ట చూశాక కపిత్వం సముద్రాలై పొంగుతుంది.
Ofcourse, idi copy cat kavita anukondi., aina...

*  ఏం మహాడుతున్నారు మీరు?
మిమిక్రీ ఆర్టిస్ట్ లు లేరా..
డూప్ లు పెట్టి సినిమాలు తీయటం లేదా?
మహాడితే నిజాయితీ ఉండాలి.

*  తూచ్....మేమొప్పుకోం.
మేము ఫోటో షాప్ తో ఫోటోలని మాత్రమే మార్ఫింగ్ చేశాం.
మీరు ఆడియో షాప్ తో ఆడియోనూ, వీడియో షాప్ తో వీడియోనూ మార్ఫింగ్ చేశారు.


*   అక్షర వాచస్పతి ఇక లేరు. కొన్ని నెలల క్రితమే మా మిత్ర బృందానికి అంతటి మహానుభావుడి దర్శనమే కాక ఆయనతో మూడు గంటలు పైగా గడిపిన మహత్తర అవకాశం జన్మలో మరచిపోలేని అనుభూతి. ఆయన ఇంటికి వెల్లినపుడు ఆయన కుమారుడు దాశరథి విరించి గారి ఆతిథ్యం ఒకవైపు, దాశరథిగారి జ్ఞాన ప్రవాహం మరి ఒక వైపు మమ్మల్ని ఆనంద పరవశుల్ని చేసింది. సొంత ఊరికి దూరమయ్యావా అని దాశరథి గారు అడిగిన ప్రశ్న ప్రతిరోజూ ప్రశ్నిస్తూనే ఉంటుంది. ఆయన చివరి నవల శతాబ్ది నన్ను పునాదుల్నించి కదిలించి వేసింది. తెలంగాణా ఒక పోరు గడ్డ ఎందుకయిందో వీరి రచనల ద్వారానే విశదమయింది. వేదాల్ని తెలుగులోకి అనువదించిన ఈ మహా మేధావికి అభ్యుదయ వాదికి రావలసినంత గుర్తింపు రాలేదనే చెప్పాలి. ఆకలైన వాడికి అన్నంగా దాహమైన వాడికి నీటిగా దరి చేరేవాడే దేవుడని, చదువు పెరుగుతున్న ఈ కాలంలో మతాలన్నీ తమ తమ అంతరాలని మరచి ఒక తాటి పై రావటానికి మరెంతో దూరం లేదని ఒక ఆశావాద దృక్పథాన్ని మాలో నాటారు. ఆయన వాక్యాలు ఇంకా చెవుల్లో మారు మ్రోగుతున్నాయి. ఎందుకనో కళ్ళల్లో నీళ్ళు మాత్రం ఆగటంలేదు.

*  ఇతడు రాజకీయ దుర్గంధరుడు. బహు భాషా కోవిటుడు. పారిపోలన దక్షుడు. అసామాన్య మేతావి. అలుపెరుగని మోదుడు. గొప్ప చింతా పరుడు.
స్తుత ప్రజ్ఞుడు. ఆకర్శ వాది. నీతికీ నిజాయితికీ పట్టుబడనివాడు.
స్పెల్లింగు మిస్టేక్స్ కి చింతిస్తున్నాం


* డూపాయణం.
.................

1 .డూప్ ఓరియెంటెడ్ సినిమాలో తన పాత్ర నిడివి పెంచినందుకు రెమ్యూనరేషన్ పెంచాలని అలిగిన కథానాయకుడు.
2. ఫైట్స్ సూపర్బ్, హీరో డూప్ పర్ఫార్మాన్స్ ఎక్సెలెంట్.
3. ఫైట్ మొత్తం షూటింగ్ అయిపోయింది సర్. మీరొచ్చి ఫీల్ తో ఫైట్ చేస్తున్నట్టు షాట్స్ తీసుకుంటే చాలు.
4. సర్ ఈ మధ్య మీ డూప్స్ అందరూ సిక్స్ పాక్స్ మెయింటెన్ చేస్తున్నారు. మీరు కనీసం పొట్ట తగ్గించండి చాలు. 
5. డూప్ ఈ మధ్యే సడన్ గా చనిపోవటం వల్ల ఆక్షన్ సినిమాల్ని కాక ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమాల్ని చేస్తానంటున్న హీరో.
6. నా డూప్ కి కాలు విరిగితే, సినిమాలో నాకు కూడా కాలువిరిగినట్టు కథ మారిస్తే ఫ్యాన్స్ ఒప్పుకోరండీ.
7. నలుగురు కొత్త హీరోలతో వచ్చే ఆక్షన్ సినిమా కోసం, కాస్టింగ్ అయిపోయింది. ఇక డూప్ లకోసం దరఖాస్తులకు ఆహ్వానం.
8. నీకు హీరో గా తప్పక గొప్ప ఫ్యూచర్ ఉంది, మాంచి డూప్ ని పట్టావోయ్.
9. ఎవరయ్యా ఇది. హీరో కావాలని ప్రకటనిస్తే, కేవలం ఫోటోలు పంపాడు. డూప్ ఫోటోలు లేకుండా ఒచ్చే ఇలాంటి అప్లికేషన్స్ ని పడేయ్యండి.
10. ప్రస్తుత కాలంలో హీరోలకే కాదు, మాకూ కావాలి డూప్ లు అధ్యక్షా. 


*    మావాల్లు బ్రీఫ్డ్ మీ
ఐ బ్రీఫ్ కేస్డ్ యూ
యూ బ్రైబ్ కేస్డ్ మీ?.
మావాల్లు స్టాండ్ బై మీ
ఐ స్టాండ్ బై యూ
యూ నాట్ అండర్ స్టాండ్ మీ?.
మావాల్లు టుక్ డెసిషన్ బై మీ
ఐ టుక్ డెసిషన్ బై యూ
యూ గివ్ పరేషాన్ టూ మీ?.
మావాల్లు కమిట్టెడ్ టూ మీ
ఐ కమిట్మెంటెడ్ యూ
యూ నాట్ కన్సిడర్డ్ మీ?
నాట్ గుడ్..నాట్ గుడ్.


Thursday, 4 June 2015

అభిప్రాయాలు- వాదనలు 1

*    బేస్ లెస్ పోస్ట్. వైదిక మతంలో స్త్రీకి అత్యున్నత స్థానం ఇవ్వబడింది. మాతృత్వాన్ని డివినైజ్ చేసిన ఏకైక మతం ప్రపంచంలో ఏదైనా ఉందా అంటే అది కేవలం హిందూ మతం. వేదాల్లో కానీ పురాణేతిహాసాల్లో కానీ భారత సమాజంలో స్త్రీకిచ్చిన స్థానం మహోన్నతమైనది. ఎపుడైతే బౌద్దిజం ఇక్కడున్న రాజ్యాలను నిర్వీర్యం చేసిందో అపుడు స్త్రీ అంటే ఒక సెక్స్ ఆబ్జెక్ట్ అనుకునే పరాయి సంస్కృతులు మన దేశంలోకి ప్రవేశించాయి. చరిత్ర ఏమాత్రం తెలుసుకోకుండా కాటమరాయుడికి కుంభకర్ణుడికీ లింకు పెట్టి రాసే రాతలు కొంత మంది భజన రాయుల్ల చేత భజన చేయించుకోడానికితప్ప ఎందుకూ పనికి రావు. ఇపుడు అధికమౌతున్న స్త్రీ వివక్షతకానీ, రేప్ ల సంస్కృతి కానీ, చెలరేగి పోతున్న విదేశీ సంస్కృతుల పుణ్యమే కానీ, భారతీయత ఎంత మాత్రమూ కాదు.

*  మనుస్మృతిని మీరొక పవిత్ర గ్రంధం అనుకుని దానికేసి తలలు బాదుకుంటే చేసేదేమీ లేదు. ఫ్రెడ్రిక్ నీషే బైబిల్ మూసేసి మను స్మృతి తెరవండి అన్నంత మాత్రాన దినికో ప్రత్యేకత ఇచ్చేసి, ఇదే ఫైనల్ అని మీరనుకుంటే చేసేదేమీ ఉండదు . డా.అంబేద్కర్ గారు మను స్మృతి ఇండియాలో బౌద్దిజం వ్యాప్తి జరుగుతున్నపుడు, దానిని అరికట్టడానికి, దానికి వ్యతిరేకంగా రాయబడినదని చెప్పారు. అంతే కానీ ఇదే హిందూ ఇజం అని చెప్పలేదు. మను స్మృతిని మనం డూస్ అండ్ డోంట్ డూస్ వంటి కోడ్ ఆఫ్ కండక్ట్ అని అనుకుంటే, ఆ కాలంలో ఈ కోడ్ అఫ్ కండక్ట్ని తూచా తప్పకుండా పాటించిన రాజ్యాల దాఖలాలు కూడా కావాలి. గ్రీకు వాడొచ్చినపుడో ఇంకొకపుడో మాత్రమే ఆసేతు హిమాచలమూ భారతదేశమేనన్న సంగతి గుర్తించని రాజ్యాలు, ఎవరో భృగువనే మహర్షి రాసిన మను స్మృతిని తమ కోడ్ ఆఫ్ కండక్ట్ గా మార్చుకుని ఉంటాయని అనుకోనేలేము. పురాణేతిహాసాలు వేదాన్ని ప్రతిపాదించినా, మను స్మృతి వేదాన్ని ప్రతిపాదించినట్టు మనకు కనిపించదు. దాన్ని అవైదికమనే అనుకోవాలి. వేదాల్ని నెత్తినెట్టుకున్న దయానందుడు మనుస్మృతిని హత్తుకోవడం పిచ్చి పీక్స్ అనుకోవచ్చు. ఒక లా బుక్ లాంటి దాన్ని, మొత్తం భారత సాహిత్యంలో ఒక అత్యంత చిన్న భాగమైన దాన్ని పట్టుకుని ఇదే హిందూమతము చూడగ రారండి అని పాడుకుంటామంటే ఎవరికీ అభ్యంతరం ఉండదు.

*   బలము చేతనే బలమొస్తుంది, బలహీనతల్ని హైలైట్ చేయటం వల్ల రాదు. ఇపుడు బైబిల్ లో కానీ, ఖురాన్ లో కానీ స్త్రీ స్థానం ఏంటి అని అడగవచ్చు మనం. ఆ మతాలు ఆ ఒక్క పుస్తకాల్లోకే ఇమిడిపోతాయి. ఆ గ్రంథాల్ని ఆయా మతాలకు ప్రామాణికాలుగా వారే ప్రతిపాదించుకున్నారు. హిందూఇజం కి అలా ప్రతిపాదించుకోవటానికి ఏ గ్రంథమూ లేదు. ఇదే ఫైనల్ వర్డ్ ఆఫ్ గాడ్ అని ఎవరూ ప్రతిపాదించలేదు. ఈయనే నిఖార్సయిన దైవదూత అని ఎవరూ అనలేదు. చలన శీలమైన కాలంలో మహానుభావులు పుడుతూనే ఉంటారు, దిశా నిర్దేశం చేయగలిగిన అలాంటి మహానుభావులు సాక్షాత్తూ దైవసమానులని అనుకుంటాం కనుకనే మనకు జీసస్ కానీ అల్లాకానీ రాముడు కానీ కృష్ణుడు కానీ సాయిబాబా కానీ ఇంకొకరు కానీ దైవసమానులే , దైవాలే అయ్యారు. భగవద్గీతలో కూడా ఇదే నమ్మకాన్ని మానవాలికి ఇచ్చారు. సంభవామి యుగే యుగే అని. హిందూ ఇజం ఒక చలన శీలమైన జీవన విధానం. దానికి ఫిక్స్డ్ రూల్స్ ఏమీలేవు. దేశకాల పరిస్థితులను బట్టి మార్చుకోగలిగినంత ఫ్లెక్సిబిలిటీ ఉన్నది. అందుకే అది ఒక జీవన విధానం అన్నారు. ఇపుడు అసలు సమస్య ఏమిటంటే కొన్ని ఫిక్స్డ్ రూల్స్ ఉన్న ఆర్గనైజ్డ్ మతాలు, తమ కల్లద్దాలతో ఫ్లెక్సిబిలిటి ఉన్న ఒక జీవన విధానాన్ని విమర్శించ ప్రయత్నించటం. దానికి కొన్ని పోతలు పోయ ప్రయత్నించటం. ఇకడ అదే జరుగుతుంది.

Manu smriti lo...2700 slokas లో కేవలం 1500మాత్రమే ఒరిజినల్ టెక్ట్ అనీ, మిగితావి ప్రక్షిప్తాలనీ, ఈ ప్రక్షిప్తాల్లోనే స్త్రీలను కించపరిచే విధంగా ఉందని భారతీయ చరిత్రకారులే కాక యూరోపియన్ స్కాలర్స్ కూడా అంగీకరించిన విషయం. కాథోలిక్ ఎన్సైక్లో పీడియా కూడా ఆ ప్రక్షిప్తాలని వదిలేస్తే ఎథికల్ గా మను స్మృతి అత్యంత అద్భుతమైన పుస్తకమని కొనియాడింది. కాథోలిక్ మత ఉద్భోధల్లో కూడా మనుస్మృతి యొక్క ప్రభావం ఉందనేది అక్కడివారు చెప్పినదే. ఒక మంచిని గ్రహించడానికి మత సంస్కరణవాదులు ముందువరుసలో ఉంటారు. అది ఏదేశంలో అయినా అంతే. కృష్ణుడు భాగవతంలో ధర్మ శాస్త్రాలు ఒక వ్యక్తిని భగవంతుని వైపు తిప్పటానికి మాత్రమే పనికి వస్తాయని చెప్పాడు కదా. ఆయనే భగవద్గీతలో అన్ని ధర్మాలను వదిలివేసి, భగవంతుని శరణు జొచ్చమన్నపుడు ఆయనంతటి వాడి దృష్టిలో ధర్మ శాస్త్రాల స్థానం ఎట్టిదో తెలుసుకోవచ్చు. సర్వ ధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. కృష్ణుడంతటి వాడికే వాటిమీద చిన్న చూపు ఉన్నపుడు, అత్యున్నత జీవితాన్నే మనిషినుండి కోరుతున్నపుడు, మనం కాలం చెల్లిన సూత్రాల్ని పట్టుకుని తలలు బాదుకోవడం, దానికో అభ్యుదయమని దొంగ పేరు మాటున హిందూఇజాన్ని తిట్టడమూ..లేకితనానికీ, అజ్ఞానానికీ పరాకాష్ట.

సర్ అంటరానితనం ఎందుకు మన సొసైటీలోకి వచ్చిందో ఇదమిత్తంగా తెలియదు. చాలా కారణాలు అయ్యుండొచ్చు. మనకు బుద్దిస్ట్ టీచింగ్స్ ఒచ్చేవరకు చరిత్రని లిఖించిన దాఖలాలు లేవు. వేదాల్లోని పురుష సూక్తంలో మొదట చాతుర్వర్ణాల్ని వివరించారు. అసలు పురుష సూక్తము కూడా ప్రక్షిప్తమే అనే మహానుభావులు, హిందూయిజంని అంటరానితనంతో ముడిపెడుతున్నారు కనుక తప్పించుకునే వ్యవహారం ఒకటి కనిపెట్టడానికి దాన్ని కూడా ప్రక్షిప్తమని డిఫెన్సులో పడివుండొచ్చు. అయితే పురాతన సివిలైజేషన్స్ మొత్తంలో సింబాలిజం, కవిత్వం అద్భుతంగా సమ్మిలితం అయి కన్పిస్తాయి. ఈ మధ్యే వొచ్చిందనుకుంటున్న బైబిల్ లోని సింబాలిజంకే కవులు ఆశ్చర్య పోతున్నపుడు, ఇంకా పురాతనమైన సివిలైజేషన్స్ అనుకునేవి ఎంత సింబాలిక్ పోయెట్రీని క్రియేట్ చేసి ఉంటాయో మనం ఊహించుకోవచ్చు. లాంఫ్రీ అనే ఫ్రెంచ్ తత్వవేత్త, హిస్టోరియన్, ఒక సమాజం ఏవిధంగా సైకిల్స్ గా సింబాలిక్ స్టేజ్ నుంచి మొదలై, టైపల్, కన్వెన్షనల్, ఇండివిడ్యువలిస్టిక్ కాలాల ద్వారా సాగుతుందో వివరించారు. ఆయన వివరణా మన సత్యద్వాపరత్రేతాకలియుగాల వర్ణనకి చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. కాలానికి సంబంధించి, ఇలాంటి ఊహే యుక్తేశ్వర్ గిరి గారూ చేశారు. 
పురుష సూక్తంలో కనిపించే సింబాలిజం సమాజాన్ని దేవునిగా ఊహించి చేసినది. దేవునికి ముఖమేదీ అంటే, సమాజంలోని విజ్ఞులే ముఖమని, బాహువులు సమాజాన్ని కాపాడే వారుగా, తొడలు సమాజాన్ని నిలబెట్టేవారిగా, కాల్లు సమాజాన్ని నడిపించేవారిగా చేసిన సింబాలిక్ భావన. 
అదే ఋగ్వేద కాలంలో, మానాన్న మేథావి, మా తాత పశువుల కాపరి, మా అమ్మ వస్త్ర వ్యాపారి అన్నట్టుగా వివిధ వృత్తులని చేపట్టేవారు ఒకే కుటుంబంలో ఉన్నట్టుండే వివరణలు ఎన్నో ఉన్నాయి. దీన్ని బట్టి పురుష సూక్తంలోని వివరణని కేవలం సింబాలిక్ పోయెట్రీగానే చూడాలి అనేది స్పష్టం. సరే తలనుండే తాము ఒచ్చాము అనుకున్న బ్రాహ్మణులు భగవంతుడి తలను కాక పాదాల్నే కొలిచి ఉండటం కూడా బ్రాహ్మణులు కావాలనే తమకు అనుకూలంగా రాసుకున్నారనే వాదం ఒట్టి తలా తోకా లేని వాదం అని అర్థం అవుతుంది
తరువాత రాయబడిన మనుస్మృతిలో ఈ అవగాహనని ఎలా తీసుకున్నారో మనకు తెలుసు. అంబేద్కర్ అన్నట్టు, ఇది ఒక మతాన్ని ఖండించటానికి రాసుకున్న టెక్ట్స్ కాబట్టి, చాతుర్వర్ణాల్ని తమకు అనుకూలంగా ఇంకో మతాన్ని ప్రతిపాదించడానికి కొన్ని రిజిడ్ సూత్రాలతో దాన్ని తయారు చేసి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదే మన పాలిట శాపం. వివేకానంద కూడా, బౌద్దిజం భారతదేశానికి చేసిన నష్టం ఏ మతమూ చేయలేదనే అన్నాడు. 
అప్పటి బ్రాహ్మణులనబడే పూజారి వర్గం వారు తమ ఆధిపత్యం నిలుపుకోవటానికే ఈ వర్గీకరణ చేసి ఉంటారనుకోవడం రాజుల అండదండలు లేకుండా ఇది సమాజంలో పారే ఎత్తుగడ అనుకోవటం కూడా మన తొందరే అవుతుంది. ఇది బలహీనులైన పూజారి వర్గం కంటే అధికారమూ బలమూ కలిగిన రాజుల ఎత్తుగడ అయివుండే అవకాశం ఎక్కువ.

Virinchi Virivinti

ఛండాలుడంటే ఎవరు అనేది మనం తెలుసుకోకుండా, ఛండాలుడు అని మనల్నే అంటున్నారు బ్రాహ్మణులు అనుకోవడం మనకే చెల్లింది. ఒక అన్నా చెల్లెలికీ, ఒక మనిషికీ జంతువుకీ, వివాహేతర సంబంధం వల్ల పుట్టిన వాన్నీ, ఉన్నతకుల స్త్రీకి నిమ్న కుల పురుషుడికీ కలిగిన సంతానాన్నీ ఇలాంటి వారిని ఛండాలుడు అన్నారని ఉంది. అలాంటి వాడికి ఏవో కొన్ని కఠిన శిక్షలు కూడా రాశారు. అయితే ఆ శిక్షలు అమలు పరిచేకన్నా, సమాజంలో అబ్నార్మల్ సెక్సువాలిటీని ఎంకరేజ్ చేయకూడదనె ఉద్దేశమే కనిపిస్తుంది. నిర్భయ ఉదంతం, సగటు మానవుడు వారిని బహిరంగంగా చంపాలి అనుకోవడానికి లేదా అఘమేఘాల మీద నిర్భయ చట్టాల్ని చేయడానికి ఎలా ఊతం ఇచ్చి వుందో ఛండాలుణ్ణి నిర్వచించడానికి అలాంటి ఉదంతాలేవో ప్రేరణగా ఆనాడు నిలిచుండాలి. అలాంటి ఛండాలుడు సైతం భగవంతుని అంశే అని ఆది శంకరులు కాల్లు పట్టుకోవడం, ఏకీశ్వరవాదం ఫిలాసఫికల్గా ఎంత బలంగా ఉండిందో చెబుతుంది. కానీ ఆచరణాత్మకంగా విఫలమవటానికి మనుషుల చైతన్య రాహిత్యమే తప్ప ఇంకేమీ కాదు. ఉటోపియన్ సోసైటీని ఎకనామికల్ గా సృష్టంచిన మార్క్సిజం మనకు ఎంత ఆదర్శమో అదే ఉటోపియన్ సొసైటిని మత పరంగా నిర్వచించిన ఏకీశ్వరవాదం కూడే అంతే ఆదర్శం. కానీ రెండూ ఫిలాసఫికల్ గా అత్యున్నతాలే అయినా, ప్రాక్టికల్ గా ఫెయిల్యూర్ కావటానికి, మనుషులం గా మనం ఆ చైతన్య స్థాయిల్ని అందులేకపోవటమే. మార్కిస్ట్ లని అడిగినే ఈ విషయమే గా చెదుతారు.

*   లా గారూ, నాకంత అవసరం లేదు. చాలా అసమానతలు వేరియేషన్స్ ఉన్నదె హిందూయిజం. అదే అర్థం చేసుకోవాలి అంటున్నా. ఒక ఫిక్స్డ్ దేవుడు ఒక ఫిక్స్డ్ పుస్తకమూ ఉండి, నమ్మని వారినంతా చంపేసేయండి అని చెప్పే సూత్రాలు లేవు. నమ్మని వారికి స్వర్గం దక్కదని చెప్పుకోవాల్సినంత అపనమ్మకాలుగల జనాభా మన దేశంలో ఎపుడూ లేదు. నమ్మిన వారికి సర్టిఫికేట్స్ ఇచ్చి స్వర్గానికి ఎంట్రీ టికెట్ అని చనిపోయిన శవాల పక్కన సర్టిఫికేతట్ని కూడా పాతిపెట్టిన పూజారి వర్గం మనకులేరు. కాఫిర్ లనీ, సైతాన్ మనుషులనీ మనం నిర్వచించుకోలేదు. వారిని ఇంక్విజిషన్ పేరులతో చంపుకోలేదు. బ్రాహ్మణులు తమ ఉనికి అస్థిరత్వానికి గురయినపుడు, రాసిన పిచ్చి రాతలు మీరనుకునే బ్రాహ్మణీయ వ్యవస్థ అయివుండాలని కోరుకుంటాను.


*   యూరోపియన్ దేశాల్లో కానీ అమెరికాలో కానీ అనదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ కనిపిస్తుంది. అతి ఫ్రీడం. ఫ్రీడం అనేది ఎగిరే గాలిపటం లాంటిది. ఎంత పైకి ఎగిరినా దాని తాడును కింద ఒకరు పట్టి ఉంచాలి. అలా పట్టి ఉంచ గలిగిందే సంస్కృతి. అక్కడి మిత్రుల వల్ల తెలిసినదేమంటే ఈ అతి ఫ్రీడం వల్ల తాడు తెగిన గాలి పటంలా ఆడవారి జీవితాలు తయారయ్యాయని.. పదేల్లకే పిల్లలు తలిదండ్రులు లేక రోడ్లమీద పడటం జరుగుతోందని. బలమైన కుటుంబ వ్యవస్థల్ని మన వివాహ వ్యవస్థలు కల్పింప చేయటం, అతి ఫ్రీడంకి కాక ఫ్రీడంని మన సంస్కృతి కల్పించటం వల్ల మనకా పరిస్థితులు లేవనే చెప్పాలి.

*    ఇక్కడ ఇంత చర్చకి కారణం, మీరెంచుకున్న సబ్జెక్ట్ మాత్రమే కాక దాన్ని సపోర్ట్ చేసుకోడానికి మీరు హిందూఇజాన్ని పావులా వాడుకోవాలనుకోవడం. మీ బాధ స్త్రీ వివక్షే అయితే, ప్రస్తుత సమాజంలో మీరు సినిమాల మీద, పెరుగుతున్న పబ్ కల్చర్ మీద అటాక్ చేయాల్సింది. కాలం చెల్లిన పుస్తకాల్ని ఉటంకిస్తూ ఇవే కారణాలు అని చూపించ ప్రయత్నించటం వృథా ప్రయాసే అవుతుంది. సినిమాల్లో ఈ రోజుకి కూడా ఆడవారు హీరోలతో డాన్స్ లు చేయటానికి తప్ప మిగతా అంతా డమ్మీలే. వుమన్ రిప్రెజెంటేషన్ పెరిగిన సీరియల్స్ లో వుమెన్ ని విలన్లుగా చూపిస్తున్నారు. మీరనే ఏ పురాణాల్లోను వుమన్ విలన్లు లేరు. హాలీవుడ్ లో కూడా వుమన్ రిప్రెజెంటేషన్ ప్రాపర్ గా లేదని బాచ్డెల్ టెస్ట్ లాంటి వాటిని ప్రవేశ పెట్టారు. పురాణాలు స్త్రీల చుట్టే తిరిగాయి. ఆ కథలకన్నిటికీ ప్రోటాగోనిస్ట్ లు స్త్రీలే. వారి రిప్రెజెంటేషన్ ఆ కాలంలోనే ఎక్కువ. ఇతర మత గ్రంథాల్లో ప్రొటాగొనిస్ట్ లు మగవారే. ఆడవారు ఏ వ్యభిచారులుగానో దీనులుగానో చూపబడతారు. ప్లస్ పురాణాలు మత గ్రంథాలు కావు. అవి ఆ కాలములోని ఒక చారిత్రక సాంస్కృతిక వాతావరణాన్ని మనకు అందిస్తాయి. ఆ వెలుగు ద్వారా ప్రస్తుత మన దిశను నిర్దేశించుకునేలా స్పేస్ ని అవి కల్పిస్తాయి.

*   ణ గారూ ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. మీరు మీ ఒరిజినల్ పోస్ట్ లో హిందూమతం గురించి చెబుతూ, స్త్రీ పూజింపబడిన చోట....ఇలా జరుగుతోంది అని రాశారు. రెండు నాల్కల ధోరణి అని మీరు హిందూఇజాన్ని అన్నారా, అందులో ఉండే మహా మేధావుల్ని అన్నారా అనే సంశయం కలిగింది. మీరు అందులో ఉండే మహానుభావలనే కనుక అని ఉంటే నేనూ మీతో కలుస్తాను. కలిసి ఉతికి ఆరేద్దాం. కానీ తరువాత జరిగిన డిస్కషన్ లోమీరు హిందూఇజం ఈస్ ఫుల్ ఆఫ్ డబుల్ స్టాండార్డ్స్ అన్నారు. అక్కడే కదా వివాదం. ఒక వేల మీరు మీ ఒరిజినల్ పోస్ట్ లో హిందూఇజాన్ని అన్నారనే అనిపించటంతో ఇంత డిస్కషన్. నిజానికి మీకు ఒక మతాన్ని కాక, అందులో మహానుభావులని అనే ఉద్దేశమే కనుక ఉండింటే...మిమ్మల్ని అర్థం చేసుకోవటంలో నా విజ్ఞత దారుణంగా ఫెయిల్ అయిందన్న విషయాన్ని ఒప్పుకోక తప్పదు

*   Mam..meeru educated gurinchi antha neerasinchi povanavasaram ledu. And Fb is a partial medium to understand each other. Nenu cheppindi meeru mis understand chesukodaniki entha avakasam undo...meeru cheppindi nenu mis understand chesukodaniki anthe avakasam undi. We are not talking here face to face. This communucation atleast opens some doors, hopefully in a positive way, if the participants are empathetic. 

Always my stand is very clear. The scriptures we, the human beings made, were always to give a light to the society at that point of time. Wheather its Bible, Khoran or Geetha. For this newer society they act only as a road side signs. They direct us which way we have to go and which way we should not go. All mishappenings in religions are due to their mis interpretations.

Agian, in this newer age whats the fun in mis interpretating them?. We have seen enough of mis interpretations and their worst results. Being educated, being scientific ..whats the fun in criticizing one and creating differences amomg people. Why we are not in a stage to accept if some one shouting all religions are one and same, and all paths leads to one God.

*    చెవిటోడి ముందర,శంఖం ఊదినట్టు అనిపిస్తుంది మహాశయా మీ అభిప్రాయం. మనుస్మృతిని నేను సమర్థించినట్టు మీకు కనబడటం, మీ గుడ్డితనం, లేదా అర్జంటుగ నన్ను ఛడామడా తిట్టేసి గర్వంగా భుజాలెగిరేసుకోవాలనే మీ తొందరితనం. విషయమేమంటే మీ అప్రోచ్ లో కూడా కొత్తదనమేమీలేదు. శతాబ్దాలుగా ఒక మతాన్నీ ఇంకో మతము తిట్టుకోవడమూ చంపుకోవడమూ చూస్తూనే ఉన్నాం. మీ అప్రోచ్ వల్ల అస్థిరత్వం ఇంకా ఇంకా పెరుగుతుందే తప్ప సైంటిఫిక్ యుగంలో క్రాస్ కల్చరల్ అండర్స్టాండింగ్ లతో మంచిని మాత్రమే స్వీకరిస్తూ చెడును కాలరాసే వ్యవస్థ అసలు ఉత్పన్నమే కాదు. మీలాంటి చదువుకున్న మేధావులు కూడా కాలం చెల్లిన పుస్తకాలకేసి తలలు బాదుకుని అందులో ఉండే లేకితనాన్ని బయటకి తీసి గొప్ప మేధావులమని సంకలు గుద్దుకుంటామంటే..ఇక మీ ఇష్టం. లోకం పురోగమనం వైపు, ఏకత్వం వైపు పరుగులు తీస్తుంటే..హే మాన్ నీ మతమంతా తప్పు తెలుసా అనే అలగా పనులకి మీరు జై కొడతామంటే..మీ ఇష్టం . ఇక్కడ నా పోస్ట్ లు కనీసం ఒకింత డిస్ హార్మోనీ క్రియేట్ చేసి, మన మధ్య డిఫెరెన్సెస్ ని ఇంకా పెంచేదిగా ఉన్నట్టయితే ఇంక ఇక్కడ ఉండాల్సిన పని నాకు అసలు లేనే లేదు. తిట్టాలి, మిస్ ఇంటర్ ప్రీట్ చేయాలి, దానితో లభించే ఒక,మానసిక ఆనందానికి మాత్రమే మన జీవితాల్ని అంకితం చేసుకోవాలనుకునే వారికి ఇక్కడ కొదవే లేదు. మీరు వారి తలకాయల్లోకి మీ తలకాయ దూర్చుకోగలరు. థ్యాంక్యూ.

Wednesday, 3 June 2015

విరించి ll సగటు మనిషి ll
..............................................
ఇలా అనుకోని వరంలా దొరికిన జీవితం
నీకంటూ కొత్తగా ఇచ్చేదేమీ ఉండదు
అనుభవాల్ని నీ మనసులో దాచుకుంటే తప్ప.
ఎంత పిసినారిది ఈ జీవితం.

ఈ కరుడు గట్టిన మరణం
నీ నుండి పెద్దగా తీసుకుపోయేదేమీ లేదు
ఒక్క రోజులో కుళ్ళిపోయే శరీరాన్ని తప్ప.
ఎంత పిచ్చిది ఈ మరణం.

రెండు ఘటనల మధ్య ఊగిసలాడే నీ ఉనికికి
నిజానికి లక్ష్యమంటూ ఏమీ ఉండదు
ఊపిరుల మధ్య నిలబడే ప్రాణం తప్ప.
ఎంతటి గాలి కదా ఈ ప్రాణం.

నీ ప్రేమలూ
నీ ద్వేషాలూ
నీ విప్లవాలూ
నీ యుద్ధాలూ
నీ మీద నీవు చేసుకునే ప్రయోగాలు

నీవనుకునే మార్పు
పూజించే పరలోకమూ
ఊహించుకునే స్వర్గమూ
ఈసడించుకునే నరకమూ
నిన్ను నీవు మోసగించుకోవటానికీ
నీతో నీ అనంగీకారం తెలపటానికీ
నీకు నీవే చేసుకున్న బలాత్కారాలు.

నీకు నీవు ఎన్ని సగటులు కట్టుకున్నా
అటు వైపుకో ఇటువైపుకో ఒరిగిపోయే నీవు
సగటు మనిషనే ఆదర్శానికెపుడూ
ఒక జీవితకాలపు దూరం
ఇన్నికోట్ల మనిషులుగా చనిపోయేనీవు
సగటుమనిషిగా అసలు పుట్టనేలేదు

అందుకేనేమో
సాధారణంగా కనిపించాలని తాపత్రయ పడే
అసాధారణ మనిషివి నీవు.

4/6/15

book review - naku telugu chesindi

ఏదైనా సాహసం లాంటి పనిని ఎవరైనా కంటి ఎదుట చేయగానే "ఓసోస్ ఈ మాత్రం నేను కూడా చేయగలను" అని అనుకోగలవాడు ఎవడైనా ఉంటాడా అంటే అది ఒక తెలుగు వాడు మాత్రమే. ఆ పనిని తరువాత చేయలేక చతికిల పడటం వల్లేనేమో, మన తెలుగువారికి 'ఆరంభ శూరుల'ని పేరు వచ్చింది. కానీ మనకుండే ఈ విశిష్ట లక్షణం వల్లనేనేమో తెలుగు వాడు ఎన్నో రంగాల్లో దూసుకు పోతుంటాడు.  అంతర్జాలంలోని బ్లాగుల విషయంలో కూడా మన తెలుగు వారిదే ముందంజ. సాహిత్యాభిమానాన్ని ఈ బ్లాగుల ద్వారా విజయవంతంగా నిర్వహించి తెలుగు భాషని సజీవంగా నిలుప ప్రయత్నించిన ఎందరో బ్లాగరులలో సత్యసాయి కొవ్వలి గారూ ఒకరు. అయితే ఆ బ్లాగు లలో ఆయన రాసిన వ్యాసాలను ఒక సంకలనంగా ముద్రించి అంతర్జాలమనే లోకానికి దూరంగా ఉండే తెలుగు పాఠకులకోసం, సాహిత్యాభిమానులకోసం ముందుకు తీసుకువచ్చిన పుస్తకమే "నాకు తెలుగు చేసింది".

  పుస్తకం పేరు పెట్టడంలోనే చమత్కారాన్ని చూపించిన సత్యసాయి గారు, పుస్తకంలోపల కూడా చమత్కారాలు చేయడనుకోవటం మన పొరపాటు. బ్లాగడం, టైపడం, టపా కట్టడం, బ్లాగాయణం, బ్లాగోపాఖ్యానం వంటి ఎన్నో సరదా పదాలు మనల్ని నవ్విస్తున్నా బ్లాగరుల కష్టనష్టాల్నీ అక్కడక్కడా మనకు అందిస్తూ సాగుతారు. ఈ పుస్తకం నిజానికి చదువుతున్నట్టుగా ఉండదు. సత్యసాయిగారు, మనమూ ఎదురెదురుగా కూర్చుని హాయిగా పిచ్చాపాటీ మాట్లాడుకుంటున్నట్టుగా ఉంటుంది. సరళమైన భాషలో పట్టువిడువని చమత్కారాలతో హాయిగా నవ్వుకుంటూ చదువుకునేలా ఉంటుంది.  మామూలుగా మనం  చదివి గుర్తుపెట్టుకోగలిగినవి చాలా తక్కువే, కానీ మాట్లాడుకుంటూ డిస్కస్ చేసుకుంటూ గుర్తుపెట్టుకోగలిగినవే ఎక్కువ. కానీ వ్యాసాలని అలా సరదాగా చదివిస్తూ మనతో మాట్లాడగలగటం సత్యసాయిగారికే చెల్లింది. ఏదో ఒక విషయం మాత్రం మీదే కాక ఎన్నో విషయాలమీద వ్యాసాలుంటాయి. ముఖ్యంగా కొరియా కబుర్లు మనకు ఆ దేశాన్ని కంటి ముందుచుతాయి. ముంబై ముచ్చట్లతో ముంబాయి వీధుల గుండా ఓ ట్రిప్ మనతోనే వేయిస్తాడు రచయిత. శాస్త్రీయ సంగీతాన్ని అశాస్త్రీయంగా పాడటం కూడా తన వ్యాపకమే అని చమత్కారంగా చెప్పే సత్యసాయిగారు వ్యాస రచనలో మాత్రం అందె వేసిన చెయ్యి అనిపిస్తారు.

ఈ పుస్తకంలోని ఇంకో ప్రత్యేకత ఏమంటే, బ్లాగుల్లో టపా కట్టాక, ఎందరో ఔత్సాహిక పాఠకులు వారి అభిప్రాయాల్ని తెలియజేస్తుంటారు. ఇలాంటి పాఠకుల అభిప్రాయాల్లోని ముఖ్యమైన వాటినికూడా ప్రతీ వ్యాసానికీ చివర ఈ పుస్తకంలో మనకు దర్శనమిస్తాయి. బహుశా ఇదొక కొత్త వరవడి. తన వ్యాసాలకే కాక పాఠకుల అభిప్రాయాలకి కూడా పుస్తకంలో చోటు కలిగించటం నిజంగా హర్షణీయం. ఎంతటి సీరియస్ విషయాన్నయినా అలవోకగా అరటి పండు వొలచి నోట్లో పెట్టినట్టు చెప్పగల నిపుణత కలిగిన సత్యసాయిగారి "నాకు తెలుగు చేసింది" పుస్తకం, లీజర్ టైం లో సరదాగా గడుపుతూ  కొంత జ్ఞానాన్ని కూడా బుట్టలో వేసుకోవాలనుకునే వారి బుక్ షెల్ఫ్ లో తప్పక ఉండవలసినది. పాఠకుడు అనేవాడు తినబోతూ రుచి అడగకూడదు కాబట్టి, ఈ పుస్తక పరిచయం నుండి పుస్తకంలోకి పోదాం.