Wednesday, 3 June 2015

విరించి ll సగటు మనిషి ll
..............................................
ఇలా అనుకోని వరంలా దొరికిన జీవితం
నీకంటూ కొత్తగా ఇచ్చేదేమీ ఉండదు
అనుభవాల్ని నీ మనసులో దాచుకుంటే తప్ప.
ఎంత పిసినారిది ఈ జీవితం.

ఈ కరుడు గట్టిన మరణం
నీ నుండి పెద్దగా తీసుకుపోయేదేమీ లేదు
ఒక్క రోజులో కుళ్ళిపోయే శరీరాన్ని తప్ప.
ఎంత పిచ్చిది ఈ మరణం.

రెండు ఘటనల మధ్య ఊగిసలాడే నీ ఉనికికి
నిజానికి లక్ష్యమంటూ ఏమీ ఉండదు
ఊపిరుల మధ్య నిలబడే ప్రాణం తప్ప.
ఎంతటి గాలి కదా ఈ ప్రాణం.

నీ ప్రేమలూ
నీ ద్వేషాలూ
నీ విప్లవాలూ
నీ యుద్ధాలూ
నీ మీద నీవు చేసుకునే ప్రయోగాలు

నీవనుకునే మార్పు
పూజించే పరలోకమూ
ఊహించుకునే స్వర్గమూ
ఈసడించుకునే నరకమూ
నిన్ను నీవు మోసగించుకోవటానికీ
నీతో నీ అనంగీకారం తెలపటానికీ
నీకు నీవే చేసుకున్న బలాత్కారాలు.

నీకు నీవు ఎన్ని సగటులు కట్టుకున్నా
అటు వైపుకో ఇటువైపుకో ఒరిగిపోయే నీవు
సగటు మనిషనే ఆదర్శానికెపుడూ
ఒక జీవితకాలపు దూరం
ఇన్నికోట్ల మనిషులుగా చనిపోయేనీవు
సగటుమనిషిగా అసలు పుట్టనేలేదు

అందుకేనేమో
సాధారణంగా కనిపించాలని తాపత్రయ పడే
అసాధారణ మనిషివి నీవు.

4/6/15

No comments:

Post a Comment