Thursday, 25 June 2015

విరించి  ll అసంపూర్ణ శిల్పం  ll
...................................
కొన్ని ఆకస్మిక సాయంత్రాల్ని
మనకు మనమే సృష్టించుకుంటాం.

ఎపుడోకానీ ఎదురుపడని
తూ ర్పూ పడమర తిలకాల్లాగా
మనమపుడపుడూ యాదృచ్చికంగా
ఎదురుపడుతున్నట్టు నటిస్తుంటాం.

చల్లటి చిరుగాలి నిండిన ఆకాశంలా
మన చూపుల్ని కొన్ని క్షణాలు కలుపుకుంటాం

బరువైన గాలికి రెపరెపలాడే
నీ కనురెప్పలకీ..
చూసీ చూడక చూసే
నీ క్రీగంటి సిగ్గులకీ..
జరిగే సంధి కుదరని యుద్ధంలో
నిరాయుధ సైనికుడినై నిట్టనిలువునా
ఓడిపోతున్నందుకు ఒకింత గర్వపడిపోతాను.

'బాగున్నావా' అనీ ఒక ముక్క అడిగి
చేతులు నలుపుకుంటున్న నాకూ
'బాగున్నా' నని ముక్తాయింపుగా చెప్పి
ముంగురులు సరి చేసుకునే నీకూ
హృదయాల్లో మాటలు సెలయేళ్ళై
పారాలని ఉంటుందేమో...కానీ

నీటిమీద ఎగరాలని విసిరిన రాయి
డుబుక్కున మునిగిపోయినట్టు
మన మధ్య వీచే గాలిలో చుట్టుకుపోతాం

మన పక్కనుండి నడిచే మనుషులు
మ్రోగే హారను శబ్దాలూ
మన మీదినుంచి కదలని లోకుల చూపుల నడుమ
ఒక్క కౌగిలింతకి ఎన్ని గోడల్ని పగులగొట్టాలో..

చివరికి బలవంతపు రాయిలా కదిలే నేను.
చేతులు కట్టేసిన శిల్పిలా నీవు.
'మరి ఉంటాను' అనే గాటును మోస్తూ ఒక అసంపూర్ణ శిల్పం.

24/6/15

No comments:

Post a Comment