Tuesday, 23 June 2015

విరించి ll అప్పగింతలు  ll
...................................
ఆ సమయంలో నాన్న నాకు
కంట్లో వొత్తులు కాలిన
పాతుకుపోయిన దీపపు స్తంభంలా కనిపించాడు.

ఆకాశాన్ని ప్రతిబింబంగా ఎత్తి మోసే
మా వూరి చెరువు
ఎండిపోయినట్లుగా కనిపించాడు

ప్రేమ బంధాల్ని పట్టుకునీ పట్టుకునీ
మొద్దుబారిన చేతులను
మొదటిసారి కన్నీటితో కడుగుతూ కనిపించాడు

ఇన్ కం టాక్స్ పేయ్మెంట్స్ కీ
ఎల్ ఐ సీ పాలసీలకీ
సంపాదనంతా సరిపోయాక
ఆకులు రాలిన
మార్చి ముప్పై ఒకటి చెట్టులాగా కనిపించాడు

అడగకుండానే అన్నీ పెట్టే నాన్న
తనకన్నీ నేనే అనుకునే నాన్న
ప్రేమని మౌనంగా గంభీరంగా పంచే నాన్న
నన్నొక అయ్య చేతిలో పెట్టిన రోజున
తన గుండెల మీది బాధనెందుకో
దాచుకోలేక భళ్ళున కురిసే వానయ్యాడు.

తన కలలేమో కలతలేమో
కష్టాలేమో నష్టాలేమో...
ఎపుడూ ఎవరికీ అంతుబట్టని నాన్న
నా చేయి వదిలి పట్టుబడిపోయాడు.

ఆడపిల్లకి పెళ్ళంటే
అప్పగింతలంటే ఏమో కాదు
మొదటిసారి నాన్న కళ్ళలో నీళ్ళు చూడటమే.

23/6/15

No comments:

Post a Comment