Thursday, 11 June 2015

విరించి ll అందమైన సంతకం ll
............................ .......
నిదుర రాని ఈ చిక్కటి సమయాల్లో
నేను నిన్నే అనువదించుకుంటాను
అచ్చు తప్పు దొర్లని భావాలన్నిటినీ
నీ చీకటిలో ముంచి కడుగుకుంటాను.

నింపుతున్న గళ్ళ నుడిలో
మిగిలిపోయిన రెండు ఖాళీ డబ్బాల్లాగా
నా రెండు కళ్ళు...
రెండు అక్షరాలకోసం వెదుకుతుంటాయి.

చుట్టూ ముసురుకున్న చీకటిలో
రొద పెట్టే కీచురాళ్ళ లాగా
ఓ రెండు భావాలు..
మెదడుపుస్తకాన్ని పురుగులా తొలుస్తుంటాయి.

శిలని శిల్పంలా మలిచే ప్రయత్నంలో
శబ్దం చేసే పనిముట్లలాగా
నా రెండు చేతులూ..
కాగితాలమీద నాడుల్ని మీటుతాయి

మసక వెన్నెల క్యాండిల్ లైట్ డిన్నర్ లో
దగ్గరయిన రెండు మనసుల్లాగా
నా రెండు శ్వాసలు
ఒకదానికొకటి ఉన్మీలనాలౌతాయి

లోకాన్ని లోకులు
కొన్ని చర్వణ చర్విత పదాల్లోకి
విసుగులేక పదే పదే
వ్యాఖ్యానిస్తున్నపుడు
నీవీ జాగ్రత సుషుప్తావస్థల నడుమ
శూన్యాలనెలా నాలోపలికి పలుకుతావోనని
కర్ణభేరీల మీద నిశ్శబ్దాన్ని మోదుతుంటాను

కనిపించని చీకటిలో కరిగిపోయే
ఒక అనాత్మ వస్తువులా
నాలోని ఉద్విగ్నతనంతా
ఒక చుక్కలోకి జారిపోయినపుడు
చెంపమీద బరువెక్కిన ఓ చిన్నతడి
ఆనందానిదో దుఃఖానిదో తెలియనందుకు కూడా
ఆనంద పడిపోతాను.

ఈ అనువాదానికి చివరి మాటలా మిగిలిన నిశ్శబ్దాన్ని
ఈ రోజుటి ఎండ కింద వేలాడిన రాతిరిని
పేజీ చివర చేసే అందమైన సంతకంలా
ఒక కవితలోకి ఒంపుకుంటాను.

11/6/15

No comments:

Post a Comment