Wednesday, 10 June 2015

విరించి  ll పద సోదరీ..ll
....................................  
గొప్ప నిర్ణయాలకిది గొంతుక కారాదు
భయంకర నిర్ణయాలకిక
సైరన్ మోత కావాలి.

అసహాయతకు సాక్షాలుగా
మేకులకు వేలాడిన శవాలన్నీ
నీ అసమర్థతకు కోవర్ట్ లుగా మారకముందే
ఈ శవయాత్రల డప్పుల ముందు
నీవిక దయ్యాల తాండవం చేసెయ్యాలి

చాలాకాలం పోరాడుతున్నావంటేనే
నీ ఓటమెపుడో నిర్ణయమైపోయినట్టు.
ఒక వాలుకు ఒరుసుకు పోయే
నీ విప్లవ సముద్రాల పోరిపుడు
క్షణాల్లో కూల్చివేసే సునామీలా హోరెత్తాలి

యుద్ధంలో గాయపడని అర్భకుడే
బట్టలలో భయాన్ని మోసుకుపోతాడు.
కనిపించని గాయాల్ని నిర్దయగా
దాచివుంచే నీ రంగు బట్టల మీద
చేయివేసిన ఆగంతకుడి మీదికి
నీవొక వేల గాయాల పుండై తిరగబడాలి.

పునాదుల్లా తవ్విన గోతులలోకి
నీ తిరుగుబాటు చరిత్ర కాంక్రీటు పోయాలి
శిథిలాల్లా నిలిపిన శిలాఫలకాల మీదకి
నీవొక సువర్ణాక్షరమై నిలబడాలి

నీ వామపాదం కదిలి కదం తొక్కాలి.
నీ బిగిసిన పిడికిలిలో నరాలు చిట్లాలి.

పద సోదరీ...
నీ ముఖానికి చుట్టిన స్కార్ఫ్ కింద
ఒక నిర్భయ ముఖమే రూపుకట్టాలి.
నీ నడుముకిచుట్టిన చున్నీ ఇపుడు
ఒక గొంతు చుట్టూ ఉరివేయాలి.

6/6/15
(ఇంకానా ఇకపై సాగదు.)

No comments:

Post a Comment