Thursday, 18 June 2015

విరించి ll అర్ధ వాక్యం ll
..................................  
ఖాళీ కాగితాల్లా ఒక్క గీతను కూడా
ఎత్తి చూపలేని నీ పెదవులతో
ఒక్కోసారెందుకనో..
న్యూస్ పేపర్లలాగా కొన్ని జండాల్ని మోస్తూ నినదిస్తావు.

తనకు తానే చుట్ట చుట్టుకున్న పాములాగా
మెదడునొక్కదాన్ని పడగలా విప్పుకుంటావు
గొర్రెల్లా తోకల్ని వెంబడించే మేఘాల్లాగా
చిక్కటి కారు మబ్బై ముసురుకుంటావు

పుకారునొకదాన్ని బాంబులా మెడకు చుట్టుకుని
నిన్ను నీవు పేల్చేసుకోవడమొకటే ఇపుడిక మిగిలింది.

నాలుగు రూపాయలకి కిలో లెక్కన పాత పేపర్లు అమ్ముడవుతాయి
పడగ విప్పలేని పాముల తలలకీ విష గ్రంధులు వేలాడుతాయి.
వెలిసి పోయిన వర్షపు మేఘం వెనుక సూర్యుడు మరింతగా వెలిగిపోతాడు
వాక్ స్వాతంత్ర్యానికి బ్రష్ చేయని నోటి పుకారే రారాజవుతుంది.

నీకు తెలియదు కానీ..
నీకన్నా ప్రాణంలేని నీ ప్రతిబింబమే ఎక్కువగా జీవిస్తుంది.
నీ ఆత్మ హత్య మరో బానిస బ్రతుకుకి బలాన్నిస్తుంది.
ప్రపంచ పటానికి సరిగ్గా ప్రశ్నలా కనిపించే దేశం నుండి
మనం రాసుకునే ఆశ్చర్యకర బ్రేకింగ్ న్యూస్ కి ఫుల్ స్టాపెందుకు పెట్టాలి?.
డెమోక్రసీ కదా...మన ఇష్టం. కామాలే పెట్టుకుందాం.

18/6/15

No comments:

Post a Comment