Wednesday, 29 June 2016

విరించి || తెరచి ఉంచిన పుస్తకం ll
.................................
మూసిపెట్టి వుంచిన
పురాతన తలుపుల సందుల్లోంచి
వేద వాక్కొకటి
శాస్త్రోక్తంగా గాలిగొట్టుకుపోతుంటుంది

తెరచివుంచిన పుస్తకమొకటి
పాడుబడిన మసీదు గోడలమీద
దీపంలా నవ్వుతూ  కూర్చుంటుంది

గిరిగీసిన వృత్తాల్లోంచి
గీతలు గీసుకున్న శాస్త్రాల్లోంచి
దేవుడు తన్నుకుని రాలేక
మునిగిపోయిన సముద్ర నగరాల్లోనో
కూల్చేసిన శిథిలాల కిందో
చతికిలబడి చచ్చుబడి వుంటాడు

మనిషి భాష తెలిసిన మనిషి
పచ్చిక బయళ్ళలో..
పూజకు పనికిరాని
పూవుల వాసన చూస్తుంటాడు

అదిగో...
ఓ మనిషిని కూలుస్తామంటున్నారు
తలుపులు లేని దేవాలయాన్ని మూస్తామంటున్నారు.
మనిషిని కొలిచే మతం కూడదంటున్నారు
మనిషిలో దేవుడిని నిలువనీయమంటున్నారు
అష్టా చక్రా నవ ద్వారా దేవానాం పురాయోధ్యా
కిలోలు సెంటిమీటర్ల లెక్కన
దేవుడు దేహిస్తాడని ప్రమాణాలు చూపిస్తున్నారు
మనిషిలో దేవుడుండలేడని వాదిస్తున్నారు
ఈశ్వరః సర్వ భూతానాం

మనిషే దైవుడైతే
మానవుడసలే తట్టుకోలేడు
దేవుడే మనిషిగ వస్తే
మానవుడే వెంటపడి చంపేస్తాడు
దేవుడు వ్యాపారం కాలేకపోతే
ఈ దేశంలో బతికి బట్టకట్టలేడు.

అందుకే దేవుడొద్దు మనకిపుడు
గూడు పుఠాణి మతాలొద్దు మనకిప్పుడు
మనిషిని గుర్తించే మనిషి కావాలి
తలుపులు మూయని దేవాలయాలు కావాలి
వాడి పేరు సాయి అయ్యుండాలి
మతం మానవత్వం అయ్యుండాలి

13/5/16

Wednesday, 22 June 2016

విరించి ll కవితా ధ్వని ll
-------------------------------------
ఓ నిరర్ధకమైన ఒంటరి రాత్రి వేళ
నీ వునికి ఊహల్లో మాత్రమే మిగిలున్న వేళ
నీ నిదురలేని లోతుకళ్ళు
నీ ముందరొక అందమైన చీకటిని చింత్రించగలగాలి
రోజూవారి  శుష్క అనుభవాల సారమంతా
జీవితమంతటిలోకి ఇదొక్క ఘడియని మాత్రమే
దేదీప్యమానమైన చివరి ఖండికగా గుర్తించగలగాలి

గుండె నెగడిలో ఊహల్ని ఒక్కొక్కటిగా గిరాటేసి
అక్షరాల్ని చితుకుల్లాగా చుట్టూ పేర్చిపెట్టాలి
చివరికి మిగిలిన బూడిదలో
వాటి అస్థికల్నినిర్ధాక్షిణ్య౦గా ఏరుకోవాలి
మోకాళ్ళ చుట్టూ చేతుల్ని బిగ్గరగా కడియం చుట్టి
నుదుటిగీతల మీద అచ్చులు చిక్కుపడేలా
మోచిప్పల మీదే నీ తలకట్టు మునకలు వేయాలి

పదునైన చీకటిలో దారి తప్పిన నీ బేల ముఖం
అనుకోకుండా
గుండె గుంతలో దిగబడిపోయినప్పుడు
అందివచ్చిన అవకాశంలా
చుక్కలుగా కారి పోయిన పున్నమి వెన్నెల
ఏమూలన నక్కిందో
గుండె గదుల్లోలోపలికి
పెన్ టార్చి వేసి గాలించాలి

మిత్రమా!
మందలోని గొర్రె పిల్లల్లాగా అక్షరాలిక్కడ
కొలతలు కొలుచుకుంటూ ఒకే మూసలో అడుగులు వేస్తున్నాయి
దిగ్మండలాల ఆవల జీరాడే అదృశ్య మైదానాల్లో
కవాతు చేసే సైనికుల్లా నీవే వాటినిప్పుడు బొబ్బరెత్తించాలి
ప్రశాంతంగా ప్రవహించి గడ్డకట్టిన లావాలాగా
అక్షరాలిక్కడ మేటలు కట్టి ఉన్నాయి.
కలాన్ని గడ్డ పారలా విసిరి కొట్టి
పెచ్చలు పెచ్చలుగా నీవొక్కడివే పగలగొట్టాలి.

అదిగో అక్కడ
పగుళ్ళు తేలిన చేతులతో
పుండ్లిడిన పాదాలతో
మబ్బుగా పారాడే నింగి మబ్బుల నడుమ
ఊహల ఆత్మలు
రెక్కలు తెగిన పిట్టల్లాగా పట్టు తప్పి పడిపోతున్నాయి
ఇదిగో ఇక్కడ
భయమంటే ఏమిటో తెలియని చిన్న పిల్లలు
ఇరవైయ్యొకటవ శతాబ్దపు చిటారు కొమ్మ మీదికి
వడి వడిగా ఏమరపాట్లేవీ లేకుండా
అమాయకంగానే ఎగబాకి పోతున్నారు

చీకి చివికిపోయి డస్సిపోయిన ఆ ఊహల్ని
శతాబ్దాల నుండి ఎండిపోయి కావిదేరిన ఈ అక్షరాల్నీ
ఏ కొత్త కాగితాల మీదో ఎందుకు నేస్తం!!
నీ పురాతత్వ వొంటిమీద కప్పుకుని నిర్దయగా నిప్పంటించుకో!
సమాధి ఫలకం మీద అవే అక్షరాలు మళ్ళీ మళ్ళీ రాసేస్కో!

ఇదిగో ఇపుడే గుండె ధునిలో పుట్టిన
పసి మబ్బుల తొక్కిసలాటలో
ఇపుడిపుడే  మనసుకెంతటి తడి తగిలిందో!!
యావత్తు ఆకాశపు అస్తిత్వాన్ని
రెండు ముక్కలుగా కోసుకొస్తోందో పిడుగు
కర్ణ భేరీల మీద నవ కవితా రస ధ్వనిలా..

19/6/16

Friday, 17 June 2016

కవిత్వ సందర్బ౦21 endluri

మాతృత్వమే సమాధానం చెప్పాలీ సమస్యకు.
-------------------------------------------------------------

"ఇతిహాసపు చీకటి కోణం, దాచేస్తే దాగని సత్యం,అట్టుడుగున పడి కాన్పించని కథలన్నీ కావాలిపుడు" అన్నాడు శ్రీశ్రీ. నిజమే సమగ్ర చరిత్ర నిర్మించాలంటే మరుగున పడిన కథలన్నో బయటకురావాలి. ఇవి తల్లి జోలపాడుతూ చెప్పే కథలు కావు. మహా రాజుల యుద్ధాలు, అంతఃపుర రాణుల భోగభాగ్యాల కథలు అసలుకే కాదు. మరుగున పడ్డ కథలు. ఇంకో రకంగా, మరుగు పరచబడ్డ కథలు. వీటికి వీరోచిత కథానాయకుడు ఉండడు. కథ ఉంటుంది అంతే. బతుకు చిత్రం ఉంటుంది. సామాన్యుడే ఇక్కడ పాత్రధారి. అపుడు సామాన్యుడంటే ఎవరు? అనే ప్రశ్న ఒస్తుంది. ఈ దేశంలో 'సామాన్యులు' అనేవారు ఉన్నారా?. ఈరోజు సామాన్యులు అని చెప్పబడేవారందరూ సామాన్యులేనా?. నిజానికి వారంతా అసామాన్యులు. ఎందుకంటే 'మేమంతా అసామాన్యులం సుమా!' అని చెప్పుకోవడానికి వారికందరికీ పేరు గొప్ప కులాలున్నాయి. 'మేమంతా పూర్వజన్మ సుకృతానుసారము ఇలా మహత్తరంగా పుట్టాము సుమా!' అని చెప్పుకోవడానికి ఒక కర్మ సిద్దాంతమూ ఉంది. . ఒక బీద బ్రాహ్మణుడో రెడ్డో కమ్మో కాపో యాదవో గౌడో..అమ్మా!! ఆకలేస్తుంది అన్నం పెట్టమంటే, అయ్యో బాపనాయనకు ఎంత కష్టమొచ్చింది, రెడ్డిగారికెంత కష్టమొచ్చింది, నాయుడుగారికెంత కష్టమొచ్చిందని, పేరు గొప్ప కులాల్లో పుట్టిన ఈ మహనీయుల దీనస్థితిని చూసి బాధపడిపోతూ  విస్తరి వేసి నిండా అన్నం వడ్డిస్తుందీ దేశం. అడిగిన వాడెంతటి మూర్ఖుడయినా, "గొప్ప కులంలో పుట్టినందుకు వాడు అసామాన్యుడే సుమా!" అనుకుంటుందీ దేశం. మరి పొరపాటున, ఈ గొప్ప కులాల్లో పుట్టని వాడి పరిస్థితి ఏంది?. అమ్మా ఆకలని అడిగితే..."ఛీ..ఛండాలుడా! దూరం దూరం" అంటూంది ఇదే దేశం. . దారిన పోయే కుక్కలో దత్తాత్రేయుడో, పందిలో విష్ణుమూర్తో, ఆవులో లక్మీదేవో కనిపిస్తే, వాటిని ముట్టుకుని పూజలు చేసే ఈ దేశపు ఆసామాన్యులకూ, పవిత్రమైనదని గో మూత్రాన్ని తీర్థంలా కళ్ళకద్దుకునే ఈదేశపు అసామాన్యులకు, అంతా మాయే అనీ, సర్వం భగవంతుని రూపమని గ్రంధాలు రాసే ఈ దేశపు అసామాన్యులకు, సాటి మనిషిలో మాత్రం ఎక్కడలేని మలినాలు కనిపిస్తుంటాయి. వాడు ముట్టుకుంటే అపవిత్రమైపోతామని, వాడి నీడ కాదు కదా గాలికూడా తాకగూడదని మడి కట్టుకుని,  కూర్చునే ఈ దేశపు అసామాన్యులకు చెవుల్లో మైకులు పెట్టి ఒక కథ వినిపించాలి. అట్టడుగున పడి కనిపి౦చని కథ, 'దళితుడు' అనబడే ఈ సామాన్యుడి కథ చెప్పాలి. కానీ అంతకంటే ముందు, కంటికి కనిపించని శక్తేదో అనుక్షణం పీక పిసికేస్తుంటే, పుట్టినప్పటి నుంచి చచ్చేదాకా ప్రతీచోట అణచివేత పొడచూపుతుంటే, తనకంటూ చేప్పుకోడానికి పేరు గొప్ప కులమేదీ లేని నిర్భాగ్యుడినే ఈ దేశపు అతి సామాన్యుడిగా మనం గుర్తించాలి. కంటికి కనిపించని ఆ రాక్షస శక్తే మనదేశపు కుల వ్యవస్థ అని గుర్తించాలి. అందుకే అలా మరుగున పడిన జీవితాల బాధల్నీ వ్యథల్నీ చరిత్రగా మలిచే పనిలో మనకు కవి ఎండ్లూరి సుదాకర్ కనిపిస్తాడు. "వ్యదార్థ జీవిత యదార్థ దృశ్యాలు పునాదులుగా భావి వేదాలు అవతరిస్తాయని" శ్రీశ్రీ అంటాడు. ఆ భావి వేదాలను కూర్చే మహర్షుల్లో ఒకడే ఎండ్లూరి సుధాకర్.

------
170 కుటుంబాలతో, 780 మందితో ఉన్న చిన్న గ్రామం అది. పేరు ఖైర్లాంజి. మహారాష్ట్ర లో నాగ్ పూర్ నుండి 120 కి.మీ దూరం. గ్రామంలో బ్రాహ్మణులూ వైశ్యులూ ఉన్నారో లేదో తెలియదు కానీ, ఓబీసి కి చెందిన కుంబీ కులం ( క్షత్రియ కులానికి దగ్గరిసంబంధం ఉన్న కులం ) వారిదే ఇక్కడ అంగ బలం లోనూ, అర్థ బలం లోనూ పైచేయి. దళితుల మీది అణచి వేత స్వరూపాల్లో వృద్ధి చెందిన భావజాలానికి ఫలానా కులంతో పనిలేదు. దళితుడు కాని వాడు ఎవడైన అగ్ర కులపు వాడే. అసామాన్యుడే. . అనుకోకుండా రెండే రెండు దళిత కుటుంబాలున్నాయి గ్రామంలో. భూట్మంగే భయ్యాలాల్ కుటుంబం ఒకటి. అతడు తన తల్లికిచెందిన ఐదెకరాల పొలం చూసుకోవటానికని 18 యేళ్ళ క్రితం ఖైర్లాంజీకొచ్చి స్థిరపడ్డవాడు. భార్య సురేఖ, తన రెక్కల కష్టం మీద భూమిని సాగు చేసింది. పిల్లల్ని పెంచింది. ఇద్దరు మగ పిల్లలు, ఒక ఆడ పిల్ల. రోషన్, సుధీర్, ప్రియాంకా. చిన్న గుడిసెలో అందమైన జీవితం. అందమైన కలలు. సుధీర్ డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగాల గురించి అందమైన భవిష్యత్తు గురించి కలలు కంటున్నాడు. ప్రియాంక స్కూలు చదువులు పూర్తి చేసుకుంది. NCC లో స్థానం సంపాదించింది. ఇండియన్ ఆర్మీ లో చేరి దేశానికి సేవ చేయాలని కలలు కంది. చేతికంది వస్తున్న ఎదుగుతున్న పిల్లల్ని చూసి ఆ తల్లిదండ్రులు మురిసిపోయారు. తక్కువ కులమని ఎవరెన్ని రకాలుగా చిన్న చూపు చూస్తున్నా, వాటన్నిటినీ ధైర్యంగా ఎదిరించి చదువుల్లో దూసుకుపోతున్న పిల్లల్ని చూసి గుండెల మీద చేతులు పెట్టుకుని హాయిగా నిద్రపోయేవారు. అంతో ఇంతో సాఫీగా సాగిపోతున్న తమ కుటుంబంలోకి కాలం కులోన్మాద రూపంలో ఒచ్చి కాటేస్తుందని ఆ తల్లిదండ్రులు అసలెపుడూ ఊహించి ఉండరు. ఎందుకంటే ఆ కుటుంబంలో ఇపుడు భూట్మాంగే భయ్యాలాల్ తప్ప ఎవరూ లేరు. అందరూ కుల రక్కసి విష కోరల్లో నిర్దాక్షిణ్యంగా నలిపివేయబడ్డారు. అదను చూసి కులం కాటు వేసే సమయానికి భయ్యాలాల్ తన ఇంట్లో  లేకపోవడంతో అతడొక్కడే మిగిలిపోయాడు. చరిత్రకు మౌన సాక్షిగా ఒంటరిగా నిలిచాడు. ఇపుడు ఆ గుడిసె లేదు, కుటుంబం లేదు. అందమైన కలలు కన్న చిన్నారి కన్నులు లేవు. ఒకరికొకరుగా జీవించిన జీవితం లేదు. ఇప్పుడున్నదంతా ఒక్కటే. విషాదం.  అతడి కల్లల్లో భయం తప్ప కళ లేదు. జీవితంలో సహచరితో చెప్పుకున్న ఊసులు, పిల్లలతో కలిసి పంచుకున్న ఆనందాలు ఏవీ ఒక్కటంటే ఒక్కటి కూడా మిగల్లేదు. అన్నీ కన్నీళ్లై కారి పోయాయి. చెంపల మీదే ఎండిపోయాయి.  పలుకరిస్తే అతడు వణికిపోతున్నాడు. మనుషులలో మానవత్వం చచ్చి పోయిందని తెలుసుకున్నాడు. ప్రపంచం వైపు బేల చూపులు చూస్తున్నాడు. ప్రపంచంలో తామూ అందరిలాగానే మానవులుగా, మానవుల మధ్యే కదా పుట్టారు. మరెందుకు ఈ దేశం తమని తక్కువ గా చూస్తుంది?. తమకు అంటించబడిన కులం ఎందుకు తమను అంటరానివారిగా వెలి వేస్తుంది?. సమాధానం తెలియదు. సమస్యను చర్చిస్తూ మూలాల్లో సమాధానాన్ని కూడా సూచించే వాడే కవి. ఎండ్లూరి సుధాకర్ ఈ కవితలో అదే చేశాడు. ఆత్మ గౌరవంతో బతకగలిగిన కొత్త దేశం సృష్టించుకోవాలని ఆశ పడుతూనే కుల రక్కసి మూలాల్ని కుదిపే ప్రయత్నం చేశాడు.

ఏదైనా కొత్త దేశం సృష్టించుకోవాలనుంది
ఆత్మ గౌరవంగా బతకాలనుంది.

అది 2006 వ సంవత్సరం. పురాతన కాలం అంతమయి, ఎన్నో వేల సంవత్సరాలు గడిచిన తరువాత, "కుల వివక్షతనా? అదెక్కడుంది?" అని అందంగా అడుగుతున్న మనుషులుండే 'ఆధునిక యుగం' అని చెప్పబడుతున్న ఈ మధ్య కాలం నాటి ఒక సంవత్సరం. ఒకరోజు  తన ఐదెకరాల పొలంలో పని చేసుకుంటున్న సురేఖ, తమ పక్కనున్న పొలం వారు తమ పొలంలో కొంత భాగాన్ని కబ్జా చేస్తుండటం గమనించింది. ఇదేం పని అని వారిని నిలదీసింది. మామూలుగా ఎక్కడైనా ఇటువంటి సంఘటనలు జరిగితే ఇద్దరు మనుషుల మధ్యన జరిగిందనుకుంటాం. కానీ మన దేశంలో ఎవరి కులం ఏమిటనేది ప్రధాన విషయమవుతుంది. సురేఖ దళితురాలు. వారు చేసింది తప్ప ఒప్పా అనేది కాదు.  "ఒక దళితురాలు అగ్ర కులం వారిని ప్రశ్నించటమా?". ఇదే ఇక్కడున్న ఆధిపత్య భావజాలం. అందుకే  అక్కడ భూమికి సంబంధించిన వివాదం క్షణంలోని నూరోవంతు సమయంలో కుల వివాదంలా మారిపోయింది. ఇదే భావజాలం గ్రామంలోని అగ్రకులాల వారినందరిని ఏకం చేసింది. ఎదురు తిరిగిన సామాన్యురాలికి జవాబిచ్చేందుకు వేట కొడవళ్ళ ని సిద్ధం చేసుకునేలా చేసింది. ఒకరోజు సాయంత్రం, సురేఖ తన పిల్లలతో కబుర్లాడుతూ  రాత్రి వంటకు రంగం సిద్ధం చేసుకుంటున్న తరుణంలో ముందే సిద్ధం చేసుకున్న పథకం ప్రకారం కొందరు భయ్యాలాల్ లేని సమయం చూసుకుని ముష్కరుల్లాగా ఇంట్లోకి దూరారు. ఇంట్లో ఉన్న నలుగురినీ కర్రలతో చితకబాదారు. అందరినీ వివస్త్రలను చేసి, ఊరి నడి బొడ్డువరకు లాక్కుని పోయారు. సురేఖనూ, ముక్కుపచ్చలారని పసి తల్లి ప్రియాంకనూ మానభంగం చేశారు. వారి మర్మాంగాలలోకి కర్రలు దూర్చి చిత్ర వధ చేసి అతి దారుణంగా కర్కశంగా చంపేశారు. అక్కడొక భయానక వాతావరణమే నెలకొని వుంది. కానీ కవి అంతకు మించిన భయానక విషయాన్ని మనకీ కవితలో పరిచయం చేస్తాడు.

ఈ మారణ కాండ ఊరిలో అందరిముందూ జరిగింది. ఊరి అగ్రకుల ఆడవారు తమ మొగుళ్ళు తోడేల్లలా  తల్లీ కూతుల్ల పై, అఘాయిత్యం చేస్తుంటే ఏమిటిది? అని తమ మొగుళ్ళని అడిగిన పాపాన పోలేదు. చంపండి, నరకండి, చావగొట్టండని తమ మొగుళ్ళను రెచ్చగొట్టారు. వాళ్ళలోని స్త్రీత్వాల్ని ఏ దేవీ దేవతలు వచ్చి తట్టి లేపలేదు. వారిలోని మాతృత్వాల్ని ఏ సీతా సావిత్రులు ప్రోది చేయలేదు. సృష్టిలో అందమైన స్త్రీత్వం కానీ, తీయనైన మాతృత్వంకానీ ఆ సమయంలో ఎందుకు వారిలో మేలుకోలేదో ఆలోచిస్తే, ఈ స్త్రీత్వాల వెనుక, మాతృత్వాల వెనుక కుల రక్కసి కోరలు చాచి భగవంతుడిచ్చిన ఈ అమృత తత్వాల్ని ఆక్రమించి ఉండటం కనిపిస్తుంది. స్త్రీత్వమూ, మాతృత్వమూ కోల్పోయిన ఈ అగ్ర వర్ణ స్త్రీలను చూచి దేవతలు కూడా ఈ దేశం నుంచి పారిపోయి వుంటారు అంటాడు కవి.

మీరు నడిచిన నెత్తుటి నేల మీద కాలు నిలపలేక
బహుశా దేవతలు కూడా
ఈ రాత్రి శాశ్వతంగా
ఆర్యభూమి  విడిచి పారిపోయుంటారు

ఈ దారుణ హింసా కాండ జరిగాక గ్రామంలో అందరూ మీటింగు పెట్టుకున్నారు. జరిగిన విషయం బయటకు పొక్కకూడదని ఎవరూ ఈ విషయం మీద మాట్లాడకూడదని తీర్మానం చేసుకున్నారు. కానీ తరువాత ఎలాగో బయటి ప్రపంచానికి ఈ విషయం తెలిసింది. పోలీసులు ఎప్పటిలానే కొంతమందిని అరెస్ట్ చేశారు, ఆ తరువాత కోర్టులూ ఎప్పటిలాగానే స్పందించాయి. ఈ మారణకాండ వెనుక తాత్కాలిక ఆవేశ ఉద్రేకాలే ఉన్నాయిగానీ, కుల ప్రసక్తి లేనే లేదని తేల్చేశాయి. అసలు ఆడవారి మీద మానభంగమేదీ జరగలేదని పోస్ట్ మార్టం రిపోర్టులు వచ్చాయి. గ్రామమనే ప్రపంచం మొత్తం చూసిన నగ్న సత్యం న్యాయ దేవత కళ్ళ గంతలముందు కులం దుస్తులేసుకుని నిలబడింది. అయినా కవికి అర్థం కాని భయంకర విషయం ఒక్కటే.  తోటి ఆడవారిని తమ కళ్ళ ముందు మానభంగాలు చేసి మర్మాంగాలని పనస పొట్టులా తరిగేస్తుంటే, చూస్తూ ఎలా నిలబడ్డారీ అగ్రకుల ఆడవారనేది. అదే ఈ కవిత. ""బానిస విముక్తి యజమానిని మనిషిని చేయడానికే" అన్నాడు పాలో ఫియరే. దళిత సాహిత్య రూపంలో వచ్చిన వస్తున్న అణగారిన కులాల చైతన్యం, దళిత ధిక్కార స్వరం కనీసం ఒక్క అగ్రకులం వాడినయినా మనిషిగా మారుస్తుందా అన్నదే ఇపుడు మనముందున్న అసలు ప్రశ్న. దళితుడి పోరాటం మానవత్వాన్ని పునః ప్రతిష్టించుకోవడానికే అనే విషయం కనీసం అగ్రకులాల మాతృమూర్తులు గుర్తించగలిగినా మార్పు వస్తుంది అనిపిస్తుంది. అందుకే కవి ఆ మాతృమూర్తులనే అడుగుతున్నాడీ కవితలో. నిజానికి ఈ కవితే సమస్యకు పరిష్కారం కూడా. పిల్లలకు మొదటి గురువు తల్లే కదా!!

దుఃఖైర్లాంజి

      డాll ఎండ్లూరి సుధాకర్. (18/12/2006)

ఆ రాత్రి ఆకాశంలో నెత్తుటి వెన్నెల కురిసింది
ఆ రాత్రి మట్టి మాంసం ముద్దగా మారింది
ఆ రాత్రి నిలువెత్తు నీలి విగ్రహం నీరైపోయింది
ఆ రాత్రి ఆత్మగౌరవం ఆయుధం కాలేక విలపించింది
అంత దారుణం ఎంతలా జరిగిపోయింది
ఒక ఆదిమ కాలపు
భయావహ జంతుజాలపు ఊచకోతల రక్తజ్వాల
కళ్ళ ముందు కదులుతున్నట్టే వుంది
మేక పిల్లను కోసినట్లు
కోడిపెట్టను గావు పట్టినట్లు
వేట కొడవళ్ళ తో గాయపరచినట్లు
దయలేని దేశంలో
నిర్దయగా దళితుల్ని చంపడం ఎంత తేలికైపోయింది
గొడ్ల కోసే చేతికి కూడా
గుండె ఉంటుంది కదా
మాంసం కొట్టే కత్తికి సైతం
మనసు వుంటుంది కదా
పూలు కోసే చేతులు
పూజలు చేసే చేతులు
పుణ్యం చేసే చేతులు
ఎంత పని చేశాయి?
హే రామ్! వేదభూమి కూడా
ఎంత క్రూరభూమిగ రూపమెత్తింది
కోమలత్వం కూడా
రాక్షసత్వంగా మారిపోతోంది
చంపండి నరకండి
చావగొట్టండని
మగ మదమృగాల్ని
ఎలా ఉసి గొల్పారమ్మా?
పైట జారితేనే ఉలిక్కిపడి
పాతివ్రత్యానికి భంగం కలిగిందనుకునే
కులాంగనలు కదా!
సాటి స్త్రీ స్తనాలను
గొడ్డళ్ళ త అడ్డంగా నరుకుతుంటే
అడ్డం పడాల్సింది పోయి
తల్లీ కూతుళ్ళ ని
కళ్ళెదుటే మానభంగం చేయమని
మంత్రాలు పలికిన నోళ్ళతో
మద్దతునెలా పలికారమ్మా?
కత్తులతో బరిసెలతో కర్రలతో
వూరు వూరంతా పూనకంతో
శరీరాంగాల్నీ మర్మాంగాల్నీ
పనస పొట్టులా తరుగుతుంటే
ఇంత దారుణాన్ని
ఆ రాత్రి రాతిగుండెలతో
ఎంత నిబ్బరంగా చూడగలిగారు తల్లీ?
రాక్షస స్త్రీలు కూడా మీముందు బలాదూరే!
అయ్యో! ఆపలేకపోయారా తల్లీ!
అపర దేవతల్లా మిమ్మల్ని పూజించే వాళ్ళం
ఏ ఆర్తనాదాలూ తల్లి పేగుల్ని కదిలించలేదా తల్లీ
మీరు నడిచిన నెత్తుటి నేల మీద కాలు నిలుపలేక
బహుశా దేవతలు కూడా
ఆ రాత్రి శాశ్వతంగా
ఆర్యభూమి విడిచి పారిపోయుంటారు
మాకు మాతృత్వాల మీద
మానవీయ మమకారాల మీద
మానవత్వాల మీద
నమ్మకం పోయింది తల్లీ!
ఆడత్వాల వెనుక కూడా హిందుత్వాల
వర్ణ తత్వాల శతృత్వాలుంటాయని
ఇంత కిరాతకత్వం దాగుంటుందని
ఇపుడిపుడే తెలుసుకుంటున్నాం తల్లీ
అమ్మా మీరు మా వూరి స్త్రీలకు ఆదర్శం కావద్దు
అగ్నికి ఆజ్యం పోసినట్టే వుంటుంది
పల్లెల్లో పేటల్లో అంటరాని వీధుల్లో
మా శరీరాలు ప్రాణాలతో తిరగవు
మీ గాలి సోకితే
మా ఆడబిడ్డలకు ఎండిన స్తనాలు కూడా మిగలవు
నరికిన నెత్తుటి ముద్దల్లాంటి
ఆసుపత్రి ప్రాంగణాల్లో
మా బాలింతల రక్తాశ్రువులు
కళ్ళ లోంచి కాదు
పాల గుండెల్లోంచి వర్షిస్తున్నాయి
భరతమాతా! దుఃఖంగా వుంది
బాపూ! బాధగా వుంది
బాబా! భగభగ మండుతోంది
ఏదైనా ఒక కొత్త దేశాన్ని సృష్టించుకోవాలనుంది
ఆత్మ గౌరవంగా బతకాలనుంది
కనీసం అక్కడైనా
మా మర్మాంగాలూ దేహాంగాలూ భద్రంగా వుంటాయి.

కవిత్వ సందర్బ౦21
15/6/16

Friday, 10 June 2016

మంత్రలిపి లో మర్మము

మంత్రలిపి లో మర్మము
------------------------------

తత్వవేత్తలు ప్రపంచాన్ని వ్యాఖ్యానించేశారు, ఇక మార్చటమొక్కటే మిగిలిందన్నాడు మార్క్స్. కానీ ఎలా మార్చాలన్నది నిరంతర ప్రశ్నే. మార్చాలని చేసే ప్రతీ ప్రయత్నమూ ఒక వ్యాఖ్యానంలా మిగిలిపోవటానికి కారణం మనం ప్రపంచాన్ని చూసి అవగతం చేసుకునే ఫ్రేం ఆఫ్ రిఫరెన్సు మారకపోవటమే. అయినా అనుభవాల నిధిలోనుంచి ప్రపంచాన్ని అనుభూతి చెందుతూ తన ఫ్రేం ఆఫ్ రిఫరెన్సు నుండి కాస్త బయటకు వచ్చి మనకు ప్రపంచాన్ని గురించి చెప్పే ప్రయత్నం చేయాలనుకుంటాడు కవి కొనకంచి. ఆయన కవి కాబట్టి, అక్షరం తన మీడియం కాబట్టి, తను పరిచయం చేయబోయే ప్రపంచానికి కావలసిన పరికరంగా తనకు తాను ఒక లిపిని ఏర్పరచుకుంటాడు. దాన్నే ఆయన మంత్రలిపి అంటాడు. ఒక లిపి ఒక భాషని తెలుసుకోవటానికి ఉపయోగపడితే మంత్రలిపి ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి ఉపకరిస్తుంది. కవి కన్నుల ద్వార ప్రపంచాన్ని చూపించటానికే ఈ మంత్రలిపి.

కాలాన్ని జయించటానికి పుట్టిన
వెయ్యి చేతుల జననమే
ఒక తంత్ర లిపి..ఒక మంత్ర లిపి

జీవన గమనంలో తారసపడిన వ్యక్తులనీ, విషయాలనీ, వాటి వెనుక పోగైవున్న అనుభవ భాండాగారాన్నీ రంగరించి కుప్పగా ఒక చోట పోసి, ఇంకా చెప్పాలంటే అంతటినీ ఒక జోలెలో వేసి, ఏది చేతికొస్తే అది అందిస్తూ పోతాడు కవి. ఏదో అందమైన కానుక పిల్లలకు ఇద్దామనుకున్న క్రిస్టమస్ తాత తన జోలెలోకి చేతులు పెట్టి, చేతికి ఏది దొరికినా దానిని బహుమతిగా పిల్లలకు అందిస్తూ పోతాడో..అలాగే ఒక ఆర్తినీ, ఒక బాధనీ నింపుకున్న కవి, సమాజపు హిపోక్రసీని అణువణువునా చూడగలిగిన కవి, తన వారికి ఏదో చెప్పాలనీ, తనవారికి సమాజం గురించిన తెలివిడిని కలిగించాలని తాపత్రయ పడే కవి, తన మనసు జోలెలోంచి వచ్చిన ప్రతీ అనుభవాన్నీ, బాధనీ, అంశాన్నీ, మన ముందు ఆవిష్కరించే ప్రయత్నం చేస్తాడు. సమాజాన్ని మేల్కొల్పాలి అనే అంతస్సూత్రం ఆధారంగా ప్రతీ కవితా సాగుతుంది, దానికి కవి యొక్క అపారమైన అనుభవజ్ఞత పునాదులు వేస్తుంది. ఒకే అంశాన్ని వివిధ దృక్కోణాలతో ఒకే చోట ఆవిష్కరించాలంటే విషయం మీద లోతైన అవగాహన ఉండాలి. అంతే కాకా పాఠకుడిని చదివి౦చగలిగే నైపుణ్యత ఉండాలి. ఆ రెండూ కొనకంచిగారికి మెండుగా ఉన్నాయనిపిస్తుంది. మెటేరియాలిస్టిక్ ప్రపంచాన్ని వ్యాఖ్యానించటానికి కొనకించి గారు తీసుకునే పరికరాలు అపారమయినవి. మొదటి పరికరం నగ్నత్వం. తన ముందున్న సమాజాన్ని ఉన్నది ఉన్నట్టుగా నగ్న౦గా ఏ తొడుగులు లేకుండా వ్యాఖ్యానిస్తాడు కవి. ఐతే మెటీరియలిస్టిక్ సమాజాన్ని వ్యాఖ్యానించేటపుడు అంతే మెటీరియలిస్టిక్ గా నిర్దాక్షిణ్యంగా కనబడే కవి ప్రేమ భావనని తెలిపే కవితల్లో తన ఆంతరంగిక లోకాల్ని సునిశితంగా ఆవిష్కరిస్తాడు.

ఈ దేశంలో ప్రజలు ఓటేసిన మర్నాడే
అనాథలై పోతారు
ఈ దేశంలో ప్రజలు ఓటేసిన మర్నాడే
దిక్కులేనో  అయిపోతారు
ఈ దేశంలో ప్రజలు ఓటేసిన మర్నాడే
వీధి కుక్కలై పోతారు
అని కఠినంగా నిష్కర్షగా చెప్పగలిగిన కవి, మరచిపోయాడనుకున్న ప్రేయసి గుర్తుకొచ్చినపుడు మాత్రం...

అడ్రస్ లేని ఉత్తరంలా
నన్నెవరు రాసారో తెలియదు
నేను చేరాల్సిన
యజమాని ఎవరో తెలీదు అని సున్నితంగా మారిపోతాడు. ఇది అవసరాన్ని బట్టి భాషను భావాన్ని కవి ఎంచుకోవటం లోని జాగ్రత్తని చూపిస్తుంది.

పోలీస్ ఎన్కౌంటర్లో చనిపోయిన వివేక్ ని ఉద్దేశిస్తూ...
తూ ర్పు మారలేదు పడమర మారలేదు
ప్రభుత్వాలుకూడా మారలేదు
జెండా మాత్రమే మారిందని
మా అందరికీ చెప్పటానికి
జనం మీద ప్రేమతో
ఫోటోగా మారావు కదరా.. అని అడుగుతూ..యవ్వనంలో ప్రేమభావనల్నీ, ఐమాక్స్ థియేటర్లనీ కాదని విప్లవ భావాలు చేతపట్టుకున్న వారికి ఈ దేశంలో   విప్లవ భావాలు కలిగి ఉన్నంత మాత్రాన ఒరిగేదేమీలేదు, అబద్దాలు నిండిన ఈ దేశంలో అబద్ధం లా బతకడమే హాయని నిష్కర్షగా బతుకులోని డొల్లతనాన్ని తెలిపే ప్రయత్నం చేస్తాడు.

కవి ఈ కవిత్వం రాయటంలోని ఆంతర్యాన్ని చాలా చోట్ల వ్యక్త పరుస్తాడు. కవి స్వతహాగా విప్లవకారుడు. మౌనంగా ఉండాలాని అనుకొడు. నిష్కర్షగా మాట్లాడటం ప్రశ్నించటం అలవాడిన కవి దేన్నో చూసి భయపడే అవసరం ఏముంటుంది? అసలు ఏమి మాట్లాడకుండా కూర్చోవటమే..చుట్టూ జరిగే అన్యాయాలకు సగం అంగీకారం తెలిపినట్టేనని అంటాడు కవి ( ఈ అర్ధాంగీకారమే కదూ..) టీవీ ల్లో పత్రికల్లో ఒచేంత అబద్దాలని చూసి కూడా అదేమని అడగమెందుకని వ్యంగ్య౦గా ప్రశ్నిస్తాడీ కవితలో. అన్నం పండించే రైతును అతడి చుట్టూ రాబందుల్లాగా తయారయిన రాజకీయ స్వార్థాల్ని చూసి...రైతును ప్రాణమున్న శవమని సమాధిమీద వాక్యమనీ అభివర్ణిస్తాడు. అలాగే రాజకీయ నాయకుడి వివిధ రూపాల్ని పొగడరా ని తల్లి భూమి భారతి అనే కవితలో వివరిస్తాడు. ఇలా తీసుకున్న అంశం ఏదయినా విస్తారంగా వివరించగల సత్తా కొనకంచిగారి ప్రత్యేకత.

ఈ పుస్తకం లో 54 కవితలున్నాయి. ఇవన్నీ మనకు ప్రపంచాన్ని ఒక కెలిడియోస్కోపు లో చూపినట్టు చూపిస్తాయి. ఒక్కో కవిత ఒక్కో విశాలమైన అనుభవానికి దారి చూపిస్తుంది. కవిత శీర్షికను మరచిపోతే కవిత మనకు అంతు చిక్కదు. అందుకే శీర్షికను మనసులో పట్టుకుని కవితను చదివితే తప్ప కవి అంతరంగం అంత సులువుగా మనకు పట్టుబడదు. అదే టెక్నిక్. కవిత కు శీర్షిక పెట్టడం లో కవి శ్రద్ధ మనకు దీన్ని బట్టి అర్థం ఔతుంది. కాని కొన్ని చోట్ల కవిత నిడివి పెరగటం వలన పాఠకుడు చెప్పబడుతున్న అంశం నుండి పక్కకు జరిగే ప్రమాదం ఉంటుంది. కవి చేయి వొదిలి ఎటో పడిపోయినట్టు అనిపిస్తుంటుంది. అందుకే శీర్షిక అనేది కవి మనకు అందించిన ఒక చేయిలా అనిపిస్తుంటుంది. మొత్తానికి ఒక నూతన ప్రపంచాన్ని స్వప్నించే వ్యక్తి ఈ ప్రపంచాన్ని ముందుగా బద్దలు కొట్టాల్సి ఉంటుంది. మంత్రలిపి నూతన ప్రపంచాన్ని కోరుకునే వారికి , ఈ ఉన్న అబద్ధపు ప్రపంచాన్ని బద్దలు కొట్టడానికి ఒక ఆయుధం లా ఉపయోగపడుతుంది. మనసు విప్లవీకరింపబడటానికి సహాయ పడుతుంది. ఇటువంటి ఎన్నో కవిత సంపుటీలు కొనకంచిగారు తేవాలని కోరుకుంటున్నాను.

10/6/16

Thursday, 9 June 2016

కవిత్వ సందర్భం 20 svsatyanatayana

మార్పే జీవితం.
-------------------

"మార్పు అనే పద్దతి ద్వారా భవిష్యత్తు మనల్ని ఆక్రమిస్తుంది" అంటాడు ఆల్విన్ టోఫ్లర్. గడిచిన నాలుగు శతాబ్దాలలో మానవ జీవితంలో ఎంతయితే మార్పు వచ్చిందో, అంతకన్నా ఎక్కువగానే గత నాలుగు దశాబ్దాల్లో వచ్చిందంటే అతిశయోక్తి కాదు. ఒక నిర్ణీత సమయంలో వచ్చిన మార్పు (మార్పు రేటు) విపరీతమైపోయినపుడు, మానవ మనుగడలో రెండు ప్రధానమైన ప్రశ్నలు తలెత్తుతాయి. ఒకటి, వస్తున్న మార్పుకు అనుగుణంగా మనిషి తన మనస్సును సమాయత్త పరుచుకుంటున్నాడా?. రెండు, వస్తున్న మార్పుకు అనుగుణంగా మనిషి తన జీవితాన్ని మలుచుకుంటున్నాడా?. వస్తున్న రాపిడ్ చేంజ్కి అనుగుణంగా మనిషి తన జీవితాన్ని మలుచుకుంటున్నప్పటికీ మానసికంగా మార్పును ఆహ్వానించలేని పరిస్థితి ఏదైతే ఉంటుందో అది మనిషిలో తీవ్రమైన ఒత్తిడినీ, సంఘర్షణనీ కలుగజేస్తుంది. అంటే మనిషి జీవితానికీ, మనసుకీ మధ్యన ఒక ల్యాగ్ కనిపిస్తుంటుంది. మార్పు తీసుకువచ్చిన పరుగు పందెంలో మనసు జీవితానికన్నా వెనుకబడినట్టు కనిపిస్తుంటుంది. ఈ ల్యాగ్ మనిషి యొక్క అంతరంగిక జీవితంలో మానసిక సంఘర్షణనీ, బాహ్య జీవితంలో రెండు వరుస తరాల మధ్య స్పష్టమైన కాన్ఫ్లిక్ట్ నీ ప్రతిబింబిస్తుంటుంది. ఇటువంటి ఒక పరిస్థితి మనకు కవి ఎస్వీ సత్యనారాయణ కవితలో కనిపిస్తుంది. కవిత్వం ఆ కాలపు పారలెల్ చరిత్రను అందిస్తుంది అనటానికి ఇటువంటి కవితలు నిదర్శనంగా నిలుస్తాయి.

సాధారణంగా మనం, ఓల్డేజ్ హోం లు పెరిగిపోయాయనీ, ఛైల్డ్ కేర్ సెంటర్లు పెరిగిపోయాయనీ మనుషుల్లో మానవత్వం నశించిపోయిందనీ, మానవ సంబంధాలు డబ్బుచుట్టూ తిరుగుతున్నాయనీ, కుటుంబ వ్యవస్థ ఛిన్నాభిన్నమైపోయిందనీ చాలా సార్లు వాపోతూ ఉంటాం.  ఇవన్నీ గత తరం చూడని , ఈ తరం చూస్తున్న సామాజిక వాస్తవాలు. ఇవన్నీ ఆధునిక సైన్స్ అండ్ టెక్నాలజీ తనతో పాటు సమాజం లోకి తీసుకు వొచ్చిన విషయాలు. నిజంగా వీటి అవసరం ఈనాటి సమాజం లో ఉందా!? నిజంగానే మనుషుల్లో మానవత్వం కొరవడిందా? మనిషి జీవితం డబ్బు చుట్టే తిరుగుతుందా? మనవ సంబంధాలు మరీ బలహీన పడిపోయాయా? ఇటువంటి ఎన్నింటికో ఒక తాత్విక, వాస్తవిక సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తాడు కవి. తన జీవితాన్ని వ్యాఖ్యానిస్తూనే సమాజం లో ఈ అర్ధ శతాబ్ద కాలంలో వచ్చిన 'రాపిడ్ ఛేంజ్' అనేది, మనుషుల జీవితాల్లో, వారి మధ్య సంబంధ బాంధవ్యల్లో, వారి ఆలోచనా దృక్పథాల్లో ఎంతటి మార్పును తీసుకొచ్చిందో చెప్పే ప్రయత్నంలో పారలెల్ చరిత్రని కూడా అక్షరబద్ధం చేస్తాడు. రెండు వరుస తరాల మధ్య ఆలోచనల మధ్య వచ్చిన అంతరాల్నీ, తద్వారా మానవ సంబంధాల్లో వచ్చిన సంఘర్షణనీ, మానసిక వొత్తిడినీ ప్రధాన అంశంగా చేసుకుని "పుత్రాగ్రహం" అని కవిత్వం చేస్తాడు. ఈ పుత్రాగ్రహానికి కారణం తరాలు మారేంత వ్యవధిలో వచ్చిన రాపిడ్ ఛేంజ్ మాత్రమే.

భారత సమాజం అన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలలాగే స్వతహాగా సామూహిక భావజాలాన్ని కలిగి వున్న సమాజం. ఒకరి మీద ఒకరు ఆధారపడటం, సహకరించుకోవటం అన్నది వారి స్వభావం. పశ్చిమ దేశాలు సామాజిక భావజాలాన్ని కాక వ్యక్తిగత భావజాలాన్ని కలిగి ఉంటాయి. పశ్చిమ దేశాల వారితో పోల్చుకుంటే భారతీయులు ఎక్కువగా తమ వారి మీద ఆధారపడతారనేది నిర్వివాదాంశం. భారతీయులకు సాధారణంగా వ్యక్తిగతం అనేది ఉండదు. అన్నిటినీ కుటుంబ సభ్యులతో కలిసి పంచుకోవటం అనేది వారి సైకాలజీలో ఒక భాగం. అందుకే వ్యక్తిగత విషయాలమీద దృష్టిని కేంద్రీకరించే పాశ్చాత్య సైకో అనాలిసిస్ విధానం భారత దేశంలో పనిచేయదు అంటారు సైకో అనలిస్టు వర్మ (1982). కానీ గత కొన్ని దశాబ్దాలుగా ముఖ్య౦గా 1991 ఆర్ధిక సంస్కరణల తరువాత భారత సమాజంలో వచ్చిన మార్పులు, కుటుంబ నిర్మాణాన్ని సమూలంగా మార్చి వేశాయి. భారతీయ సమాజం కూడా పశ్చిమ సమాజాల వలే వ్యక్తిగత భావజాలాన్ని సంతరించుకు౦టోంది. కుటుంబ వ్యవస్థ స్వరూప స్వభావాలు పూర్తిగా మారిపోయాయి. ఉమ్మడి కుటుంబాల నుండి న్యూక్లియార్ కుటుంబాలుగా మారాయి. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే (NFHS) 1991 జనాభా లెక్కలలో మొట్టమొదటి సారి బయటపడిన విషయం ఏమంటే, కుటుంబాల పెరుగుదల రేటు జనాభా పెరుగుదల రేటు కంటే ఎక్కువగా ఉండటం.  ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిత్తి జరిగి న్యూక్లియార్ ఫ్యామిలీస్ గా విడిపోవటాన్ని ఇది సూచిస్తుంది. ఈ రేటు తరువాతి జనాభా లెక్కలలో (2001, 2010) ఇంకా విపరీతంగా పెరిగిపోయిందంటారు గణకారులు.  కవి అటువంటి న్యూక్లియర్ ఫామిలీ లో ఒకడిగా కనిపిస్తాడు. సైన్స్ అండ్ టెక్నాలజీ ద్వార modernize అయిన భారత సమాజం లో వొచ్చిన నూతన ఉద్యోగాలు, నూతన జీవన పద్దతులు- దీన్నే ఒక ఇతివృత్తంగా తీసుకుని  ఒక కుటుంబం లోని ఒక వ్యక్తిగా తన తరానికి తన ముందున్న తరానికి మధ్యనున్న కాన్ఫ్లిక్ట్ ని కవి స్పష్టంగా చూపిస్తాడు. కలెక్టివ్ దృక్పథం నుంచి, ఇండివిడ్యువల్ దృక్పథానికి మారిపోయిన తరం, తనముందున్న కలెక్టివ్ దృక్పథానికి చెందిన తరాన్ని ప్రశ్నించే కవిత ఇది. తల్లి దండ్రులకు fathers day , mothers day లకు గ్రీటింగ్ కార్డ్స్ పంపటమూ- ఈ మెయిల్ చెయ్యడామూ - కొరియర్ లో పంపడమూ ఓక తరానికి విడ్డూరంగా తోస్తే, అంతకు మించి వేరే గత్య౦తరం లేకపోవటం ఇంకో తరానిది. అంతే కాక స్వీయ మానసిక సంఘర్షణ ని తన ముందు తరానికి తెలియజెప్పడం ద్వారా జనరేషనల్ కాన్ఫ్లిక్ట్ ని తగ్గించి దాని స్థానంలో అర్థం చేసుకోవటాన్ని అవగాహన చేసుకోవటాన్ని ప్రవేశ పెడతాడు.

సైన్స్ అండ్ టెక్నాలజీ యుగంలో మనిషి సాఫ్ట్ వేర్ ఇండస్ట్రీలోని కంప్యూటర్ అనే యంత్రం యొక్క విడిభాగం మాత్రమే.విదేశీ డాలర్లు సంపాదించి పెట్టే ఒక డబ్బు యంత్ర౦ మాత్రమే. ఇండియాలో ఇండియన్ లా కనిపించే ఒక కాల్ సెంటర్ వెస్టర్నర్. ఇటువంటి ఒక మానవుడిని సృష్టించడానికి స్కూళ్లూ కాలేజీలు ఉంటాయి, ఇటువంటి మానవుడిని తమ పిల్లల్లో చూసుకోడానికే తల్లిదండ్రులు అహర్నిషలూ కష్టపడతుంటారు. అటువంటి మానవుడు ఒకడు తయారయినాక, జీవితంతో పాటు పరిగెత్తలేని మనసుకల తల్లిదండ్రులు పిల్లల నుంచి ప్రేమ రాహిత్యాన్ని అనుభవిస్తే, ఆ గ్యాప్ ని నింపటం కోసం పిల్లలు గ్రీటింగ్ కార్డ్స్ లలో ప్రేమను ఒలకబోసే మెసేజ్లకోసం నెట్ సర్ఫింగ్ చేస్తుంటారు. తల్లిదండ్రులకు ఫ్లవర్ బొక్కే లు కొరియర్ చేస్తుంటారు. Mothers day, Fathers day, Parents day కోసం ఒక్కో రోజు కేటాయించ బడుతుంది. వేల కోట్లలో ఆ రోజుల్లో బిజినెస్ జరుగుతూ  ఉంటుంది. బాల్యం డాలర్ల యంత్రం లో నలిగి పోతుంది. చైల్డ్ కేర్ సెంటర్ లో ఆధునిక౦ కాబడుతుంది. కానీ జీవితం మాత్రం మనసుకు అందకుండా నిరంతరం పరిగెడుతూ నే ఉంటుంది. వారాంతాల్లో రిసార్ట్ సెంటర్ లు కిట కిట లాడుతుంటాయి. జీవితంలోకి పరాయితనం ముంచుకొస్తుంది. భవిష్యత్తు అనుక్షణం మనిషి జీవితం మీద దురాక్రమణ చేస్తుంటుంది. "మార్పు అనేది జీవితపు అత్యావశ్యక విషయం కాదు,  మార్పే జీవితం". అని ఆల్విన్ టోఫ్లెర్  మరల మరల గుర్తుకు తెస్తుంటాడు.

పుత్రాగ్రహం
     డా ఎస్వీ. సత్యనారాయణ

మీరేకదా మమ్మల్ని మరబొమ్మలుగా తీర్చిదిద్దారు
డాలర్లు రాల్చే కల్ప వృక్షాలుగా కలగన్నారు
మాన్యులైన తల్లిదండ్రులారా!
మమ్మల్ని హాయిగా ఆడుకోనిచ్చారా? పాడుకోనిచ్చారా?
స్వేచ్ఛగా తిరగనిచ్చారా? పెరగనిచ్చారా?
అసలు బాల్యమంటే ఏమిటో తెలుసా మాకు?
మేం పుట్టక ముందే
మా పేర్లు పబ్లిక్ స్కూల్లో నమోదైపోయాక
డబ్బా పాల మాతృత్వాన్నీ, చైల్డ్ కేర్ సెంటర్ల సంరక్షణనూ పొందిన మేం
నేరుగా రెసిడెన్షియల్ స్కూల్లకు వెళ్ళామేగానీ
మీ గుండెలపై పడుకుని సేదదీరామా?
మీ కమ్మని కబుర్లు వింటూ కలలుగన్నామా?
అనురాగం, ఆత్మీయత, మమత, మనసు వంటి పదాలు
మీ నిఘంటువుల్లో మాకు నేర్పించారా?

చిన్నప్పట్నించీ ఎప్పటికప్పుడు ఏవేవో లక్ష్యాల్ని నిర్దేశిస్తూ
పాఠ్య ప్రణాలికల్ని మా మెదళ్ళ పై రుద్దుతూ
గానుగెద్దులు తిప్పారే తప్ప
మా ఇష్టానిష్టాలనూ, అభిరుచులనూ పట్టించుకున్నారా?
అసలు మమ్మల్ని మనుషులుగా పరిగణించారా?
మీరే కదా మమ్మల్ని ఈ ఊబిలోకి నెట్టేశారు
బయట పడలేక..పడినా ఇమడలేక
నీటిలో కొట్టుకుంటున్న చేవ చచ్చిన చేపలం మేం

మాకూ స్వేచ్ఛగా ఎగరాలనే ఉంటుంది పక్షుల్లా
హాయిగా విరబూయాలనే ఉంటుంది పారిజాతాల్లా
అందంగా దూకాలనే ఉంటుంది జలపాతాల్లా
అయినా ఎలా సాధ్యమవుతుందో చెప్పండి?

ప్రియమైన జన్మదాతలారా!
బహుల జాతి కంపెనీలకు,బానిసలమైన మేం
రోజుకు పన్నెండు గంటలపాటు పనిచేసి
ఒక్కసారి రోడ్డు మీద పడగానే
అడ్డొచ్చిన వాడినల్లా బండబూతులు తిట్టాలనిపిస్తుంటుంది
అంతలోనే మేం నేర్చుకున్న వ్యక్తిత్వ వికాసం పాఠాలు గుర్తొస్తాయి

పళ్ళ బిగువున కోపాన్ని దాచుకుని
పెదాలపై చిరునవ్వులు ప్రసరిస్తాం
చిరాకు పరాకులను అణచుకుని
బాడీ లాంగ్వేజీలో వినయ విధేయతలు ప్రదర్శించడం
ఎంత కష్టమో ఊహించండి?!

మిమ్మల్ని మేం ప్రేమించట్లేదనీ...పట్టించుకోవట్లేదనీ
మా సుఖాన్ని మేం చూసుకుంటున్నామనీ
నిందలు వేయకండి
అసలు మేం సుఖపడిపోతున్నామని ఎలా భావిస్తున్నారు?.
మాకున్న ప్రాజెక్టులూ... అసైన్మెంట్లూ..
డెడ్ లైన్లతోనే చస్తుంటే
మీతో హాయిగా గడపడం ఎలా సాధ్యమో చెప్పండి
దొరికే వారానికొక్కరోజు
నిర్వేదం, నిట్టూర్పులూ, మూలుగుల మధ్య నలిగిపోవాలో
రిసార్ట్ సెంటర్లో రీచార్జీ కావాలో
నిజాయితీగా సమాధానం చెప్పండి

మీకేం మీరు వృద్ధాప్యంలోనూ
తోడూ నీడగా ఉంటున్నారు
మేం యవ్వనంలోనే ద్వీపాలుగా బతుకుతున్నాం
అయినా...మొన్ననే కదా మదర్స్ డే గ్రీటింగ్ కార్డ్ పంపాం
నిన్ననే కదా ఫాదర్స్ డే ఫ్లవర్ బుకే కొరియర్ చేశాం
మళ్లీ ఇపుడు పేరెంట్స్ డే అంటున్నారేమిటి???

కవిత్వ సందర్భం 20
8/6/16

విమర్శను విమర్శించుడేంది?

విమర్శను విమర్శించుడేంది?
---------------------------------------

విమర్శ రెండు తీర్లుంటది. ఒకటేమో మన తప్పుల్ని చూపిచ్చి మనకు తెలివిలేదని గేలి చేసినట్టుండెడిది. ఇంకోటేమో మన తప్పుల్ని చూపిచ్చి మనల్ని సరిచూసుకోమని చెప్పెడిది. ఈ మొదటి రకం విమర్శ మనమంటే గిట్టనోల్లు చేసెడిది. రెండో రకం విమర్శ మనోల్లు, మనమంటే ప్రేమున్నోల్లు చేసెడిది. మనయ్యలు మనల్ని తిట్టేడ్ది కూడా మనం మంచిగుండాలనే తిడ్తరు గదా. మనం మంచిగనే ఉంటం. ఇంకా జరింత మంచిగుండాలనే అయ్యలు తిడ్తుంటరు. గసుంటిదే ఈ రెండో రకం విమర్శ. ఇపుడు కోదండరాం సారు గిసుంటి విమర్శనే చేయవట్టిండు. మనం వోట్లేసి గెల్చుకున్న సర్కారు ఇంకా మంచిగ పనిచేయాలని కొన్ని సూచనలిచ్చిండు. దానికి అధికార పక్షం వాల్లు గాయ్ గాయ్ చేత్తుండ్రు.

సాధారణంగా ఒక రాజ్యంల రెండు పక్షాలుంటై. అధికార పక్షం, ప్రతి పక్షం. ఏదైనా పాలనకి సంబంధించన రివ్యూ చేయాల్సి వస్తే, అధికార పక్షం వోల్లు వాండ్లకి అనుకూలంగా చేసుకుంటే, ప్రతి పక్షం వాండ్లు వాండ్లకి అనుకూలంగా చేసుకుంటరు. ఉగాదికి అయ్యోల్లు అధికార పక్షం దగ్గర ఒక తీరుగా, ప్రతిపక్షం దగ్గర ఒకతీరుగా పంచాంగం చదివినట్టే ఉంటదీ యవ్వారం. ఇంగ, చదువుకున్న మేధావులు గూడ్క ఏదో పక్షం వైపు వొంగి తలలాడించుడు చూస్తుంటాం. పొరపాటున ఎవడన్నా అధికార పక్షం లోపాల్ని ఎత్తి చూపిస్తే, వాడిని నిర్ద్వంద్వంగా ప్రతిపక్షపుటోడని ముద్ర వేయటం చూస్తుంటాం. ఇపుడు మన తెలంగాణల గూడ్క గిసుంటి పోకడలు కన్పిస్తున్నయి. కోదండరాం సారు తప్పనిసరిగా టీఆరెస్స్ కే వోటేసి వుంటడు. అంతమాత్రాన ఆయన పొద్దుమూకల టీఆరెస్ ని పొగడాలని రూలైతే ఉండది కదా. తప్పులు ఎత్తి సూపటందుకు ఆయనెవరు? అని అంటుండ్రు కొంతమంది. ఆయన కూడా మనలక్క ఓటేసినాయనే కదా. ఓటేసి ఈ టీఆరెస్స్ ను గెలిపించినాయనే కదా. ఆయనకు అడిగే అధికారం లేదంటే ఓటరుకు ఓటేసినంక అడిగే అధికారం లేదన్నట్టే. "ప్రశ్నిస్తా" అని పార్టీలు పెట్టి పత్తాలేకుండా పోయానోల్లు మన రాష్ట్రం లో లేరు సరికదా, అలా అనకుండనే ప్రశ్నించే మనుషులు ఉన్నందుకు మనం సంతోషపడాలె. అటు అధికార పక్షం వాండ్లు అంత పొడూ చేసినం, ఇంత పొడూ చేసినం అని గొప్పలు చెప్పుకుంటే, ప్రతిపక్షం వాండ్లు అక్కడేంది అట్లుంది, ఇక్కడేంది ఇట్లయితాందని నసుగుతుంటరు. కానీ అసలుకేం జరుగుతాందని బేరీజు వోల్లు చేయాలే? ఎట్లా సామాన్య జనానికి తెలవాలె?. గసుంటప్పుడే మన కోదండరాం సారసుంటోల్లు, హరగోపాల్ సారసంటోల్లు ముందుకు రావాలె. వొచ్చి ప్రజానీకానికి అసలుకేం జరుగుతుందో చెప్పాలె. ఏ పక్షపాతమూ లేకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పేటోల్లు, ప్రజల పక్షం వహించెటోల్లు మనకైతే కావాలె కదా.

 చదువుకున్నోల్లు బాధ్యత తీసుకుని ఇట్లా ధైర్యంగా ముందుకొచ్చి మాట్లాడుడు, పక్షపాత రహితంగా, పార్టీవ్రత్యాలకు దూరంగా ఉండుడు చాలా శుభపరిణామం. బహుశా దేశంల గిసుంటి చైతన్యం ఎక్కడా ఉండదనుకుంటా. మేధావి తనం ఎవరో ఒకరి పంతన చేరకుండా స్వతంత్ర్యంగా వుండుడు బహుశా మన తెలంగాణలనే ఉందనుకుంటా. ఏది ఏమయినా, పాలకపక్షానికీ, ప్రతి పక్షానికీ అతీతంగా ఒక ప్రజా పక్షం ఉంటదని, దానికి ప్రశ్నించే హక్కు ఉంటదని కోదండరాం సారు నిరూపించిండు. ఇగ సారు మాట్లాడుడు షురూ జేయంగనే అధికార పక్షం వోల్లు లొల్లి జేయుడు బీ షురూ జేసిండ్రు. ఒకాయనేమో కాంగ్రేసోల్ల ఏజెంటంటడు. నిజానికి ఈ మాట వింటే కాంగ్రేసోల్లకు గూడ్క సంతోషమైతుంటది కావొచ్చు. బై ఎలక్షన్లల చావు దెబ్బ తిన్న కాంగ్రేసుకు కోదండరాం సారసుంటోడు ఏజెంటంటే ఆ పార్టీ ఎగిరి గంతేస్తది కావొచ్చు. ఇట్లా సారును కాంగ్రేసుకు ఏజెంటు చేసి నిజంగనే కాంగ్రేసు బలాన్ని పెంచుతున్నరు అధికార పక్షపుటోల్లు. ఇన్ని రోజులు అసెంబ్లీల కావొచ్చు, లేదా బయట కావొచ్చు, "మీరు కంస్ట్రక్టివ్ క్రిటిసిజం చేయుర్రి బాధ్యతాయుతమైన విమర్శ చేయుర్రి మేము స్వీకరిస్తాం" అని పదే పదే చెప్పిన అధికార పక్షం వాండ్లు, ఇపుడు నిజంగానే కోదండరాం సారు బాధ్యతాయుత విమర్శను పట్టుకొస్తే ఎందుకాగం ఆగం ఐతుండ్రో అర్థం ఐతలేదు. దీన్ని కూడా గుడ్డి విమర్శ అని కొట్టిపారేయుడు ఎదురు దాడి చేయుడు ఏమి సంస్కారమో మరి?.

ఇపుడు కోదండరాం సారు ఏదైతే చేసిండో అది ఆహ్వానించతగ్గ విషయం. చదువుకున్న మేధావులు ప్రొఫెసర్లు ఇలా ప్రభుత్వాన్ని ప్రశ్నించుడు, మాట్లాడుడు చూస్తుంటే, బంగారు తెలంగాణా ఖాయమన్నట్లు తోస్తుంది. గిసుంటోల్ల పార్టిసిపేషన్ తెలంగాణాకి అవసరం. తెలంగాణా మేధావులు గుడ్డి దద్దమ్మలు కాదని సారు మరోసారి నిరూపించిండు. అటు పాలక పక్షానికో, ప్రతి పక్షానికో తమ తెలివిలు ధారబోసి కాలం గడిపే మేధావులలాగా తెలంగాణా మేధావి వర్గం లేదని, పాలకుడెవరయినా ఈ వర్గం ప్రజల పక్షం ఉన్నదని నిరూపించిండు. కోదండరాం సారు మరో మూడేండ్లకు మల్లా రివ్యూ చేస్తా అన్నడు. మూడేండ్లకు అంటే ఎలక్షన్ల టైం ల లొల్లి లొల్లి ఐతది గానీ, మరో రెండేండ్లకు మల్లా రివ్యూ చేయాలని కోరుకోవాలె. దూద్ కా దూద్ పానీకా పానీ బయటకు తీయాలె. జై తెలంగాణ.

Opinions

*తెలంగాణా సర్కారు ఏది చేసినా తప్పు పట్టకూడదు అనే ధోరణి తెలంగాణా సంస్కృతికి వ్యతిరేకం.
ఉన్నది ఉన్నట్టు కుల్లం కుల్ల చెప్పుడు మన రక్తంలోనే ఉంటది.
ఇపుడు కోదండరాం సర్ గదే చేసిండు.
రెండేండ్ల పాలన మీద రివ్యూ చేసిండు, ఇంకేం చేయాల్నో, ఎట్లా చేయాల్నో దిశా నిర్దేశం చేసిండు.
ఒక రాజ్యంలోని మేధావులు మాట్లాడకపోతే, అధికార దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంటుంది.
మేధావులు ముందుకొచ్చి మంచి చెడులను బేరీజు చేసుకుని ముందుకు సాగటం, ప్రభుత్వ లోపాల్ని ఎత్తి చూపటం ఆహ్వానించ తగ్గ పరిణామం.
కొన్ని రాష్ట్రాల్లో అధికారులు ఏక పక్షంగా వ్యవహరిస్తూ ఏకఛత్రాధిపత్యంలా పరిపాలన సాగించటం చూస్తున్నాం.
అటువంటి పరిస్థితులకి కారణం, అక్కడ మేధావులు నిద్రపోవటమే.
తెలంగాణలో ఆ పరిస్థితి ఉండదు. ఇక్కడి సంస్కృతి అటువంటి మజ్జు నిద్రను గుడ్డి నిద్రను నేర్పదు.
బంగారు తెలంగాణాని సాధించుకొనుడంటే పాలకులు ఏది చేసినా జబ్బలు తడుముకొనుడు కాదు కదా..
ఎన్నుకున్న ప్రభుత్వం మంచి చేస్తే పొగుడుడూ ఉంటది, తప్పులు చేస్తే తెగుడుడూ ఉంటది.
అనుకున్న రీతిలో తెలంగాణా ప్రభుత్వం పని చేస్తలేదా అంటే చేస్తనే ఉన్నది. కానీ ఇంకా ఫలితాలు అందరికీ అందవలసి ఉన్నది.
ఆ దిశవైపు ఒక మేధావి అడుగులేయమని చెబితే, అధికారంలో ఉన్న మంత్రులు అగ్గి మీద గుగ్గిలం అవ్వుడు విచారకరం.
గిసుంటి కల్చర్ మనది కానే కాదు. విమర్శను హుందాగా స్వీకరించి మనల్ని మనం సరిచేసుకుని బంగారు తెలంగాణా వైపు అడుగులు వేయాలె.
మేధావులని వారి మాటలని అణచివేస్తామనుడు మన సంస్కృతి కానే కాదు
---------------------------------------------------

*రాజకీయాల్లో చెడ్డ తనానికి ఒక రిఫరెన్సు పాయింట్ మనకు దొరికినట్టే వుంది.
ఒక నాయకుడిని ఫలానా రాజకీయనాయకుడి కంటే మంచి వాడనో చెడ్డ వాడనో అని నిర్ణయించటానికి అనువుగా
చెడ్డతనానికి, మోసానికి మారు పేరుగా కొందరు నాయకులు తయారుకావటం మన అదృష్టంగానే భావించాలి.
ఇక ముందు ముందు రాజకీయ నాయకులని ఎంచుకునేటపుడు ఈ రిఫరెన్సు పాయింట్ లను ఆధారం చేసుకోవచ్చు. తద్వారా గజదొంగల స్థానంలో మామూలు దొంగలని, వీధి రౌడీల స్థానంలో చిల్లర రౌడీలనీ ఎన్నుకునే అవకాశం మనకు కలుగబోతోంది. గుడ్డిలో మెల్ల నయం కదా.
ఎటొచ్చీ, మంచి తనానికి రిఫరెన్సు పాయింటు దొరకకపోవటమే మన దురదృష్టం. వెతికినా దొరకదని తెలిసి వృధా ప్రయాసలెందుకు?. ఇప్పటికి ఇట్లానే కానిద్దాం.

-----------------------------------------------------
*తెలుగు రాష్ట్రాలకు ఇద్దరు చంద్రులు
ఒకడు పక్కా లోకల్
ఇంకొకడు ఓన్లీ ఇంటర్నేషనల్
-------------------------------
*ఒకప్పుడు ఒక దేశాన్ని కబలించాలంటే దండయాత్ర చేయాల్సి వచ్చేది.
ఆ తరువాత దండయాత్రకు బదులు వ్యాపారం పేరుతో మొదలు పెట్టి వలసవాదంతో కొల్లగొట్టడం జరిగింది.
ఇప్పుడు ప్రపంచం అభివృద్ధి చెందిన దేశాలు, చెందుతున్న దేశాలు అని విడిపోయాక,
అభివృద్ధి చెందుతున్న దేశాల్ని కొల్లగొట్టటానికి ప్రపంచీకరణ అనే అస్త్రం ఉపయోగపడుతుంది. స్మూత్ కిల్లర్ అన్నమాట.
అభివృద్ధి చెందుతున్న దేశాలు ప్రపంచీకరణను చేపట్టడమంటే "రండి మమ్మల్ని కొల్లగొట్టండ"ని ఆహ్వానించటమే.
---------–-----------------------------------
* కొంత మంది రిలీజియస్లీ రిలీజియస్
మరికొంత మంది రిలీజియస్లీ అన్రిలీజియస్
ఈ రెండు రకాల వారికీ గొడవ. దేవుడున్నాడని ఒకరు, లేరని మరొకరు.
నిజానికి ప్రపంచంలో చాలా మంది అన్రిలీజియస్లీ రిలీజియస్.
ఎపుడో అవసరం వస్తేనో, పండగొస్తేనో తప్ప దేవుడు గుర్తుకురాని వారే.
ఈ అధిక సంఖ్యాకులైన వారిని అటు పూర్తి రిలీజియస్లీ రిలీజియస్ గానో..ఇటు పూర్తి రిలీజియస్లీ అన్రిలీజియస్ గానో
మలచటగలగటమే అసలైన దొంగల పని...ఈ దొంగలంతా పొలిటికల్లీ రిలీజియస్ అన్నమాట.
అదీ మేటర్!!
-------------------------------------------
*ప్రపంచంలోని  వైవిధ్యాలని గమనించి గౌరవించటం నేర్చుకుంటే, శాంతియుత సహజీవనం. నాగరికం.
వైవిధ్యాలను వైరుధ్యాలని పొరబడితే యుద్ధం. అనాగరికం
----------------------------------------------
* ప్రకృతి వైపరీత్యాలన్నీ క్రమతను సాధించటానికే
మానవ వైపరీత్యాలన్నీ అక్రమతను సృష్టించడానికే
----------------/////-------------------

Sunday, 5 June 2016

విరించి ll పెన్సిల్ స్కెచ్ ll

విరించి ll పెన్సిల్ స్కెచ్ ll
................................
ప్రతీ సాయంత్రమూ
వీధిలైట్లు వెలగడానికోగంట ముందు
సూర్యుడి చెమట నీరెండలా కారుతున్నపుడు
ఈ నగరమొక చిత్రకారుడి కాన్వాసు మీద
పలుచగా గీసుకున్న పెన్సిల్ స్కెచ్ లాగా వుంటుంది.

పొగబారుతున్న ఆలోచనలూ
సిగ్నల్  లైట్ల దగ్గర ఆగి ఆగి ముందుకు సాగే
ఆనంద విషాదాలూ
ఎంత రద్దీ కదా నగరం..!

జీ హెచ్ ఎం సీ పోసే నీళ్ళ కు పెరిగిన
రోడ్డు మీది ఓ పువ్వుకు
పిల్లగాలులూ, పిట్ట వాలిన బరువులూ
అసలెప్పటికైనా తెలుస్తాయా?
అది నవ్వే నవ్వులో ఎంతటి పల్లె లోపించిందో!
నగర వేదికమీదికెక్కిన ఆ మొక్క
మేకప్ వికటించిన కళాకారునిలా లేదు?

బహుశా ఇటువంటి సమయాల్లోనే
కవి కళ్ళ కీ కవి నోటికీ మధ్య
ఊపిరులమీద వేలాడిన గుండె
జారి నగరం మీద దొర్లిపోతుందేమో..!
చిత్రకారుడి పెన్సిలు స్కెచ్ మీద రక్తాన్నద్దుతుందేమో..!

ఏమో..! ఈ సాయంత్రం
ఇరానీ ఛాయ్ లోకి దిగులంతా ఒక్కసారిగా వంపుకుని
ఆలోచించాలి
మౌనాన్ని ఉస్మానియా బిస్కెట్ లాగా
నాలుక మీద పదే పదే చప్పరించాలి.



2/6/16

Wednesday, 1 June 2016

కవిత్వ సందర్భం 19


అసలైన ఉగ్రవాద స్వరూప౦ ఏది?
...........................................
కొన్ని దేశాలకు యుద్ధం పేదరికాన్ని తీసుకువస్తుంది. కొన్ని దేశాలకు యుద్ధం సంపదను తీసుకొస్తుంది. కాబట్టి ఈ దేశాలు నిరంతరం యుద్ధాన్ని నడిపిస్తూనే ఉండాలి అనుకుంటాయి. యుద్ధంతోటి కడుపులు నింపుకునే దేశాల జాబితాలో అమెరికా ముందుంటుంది ఎప్పుడూ. స్టాక్ హోం ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (SIPRI)  నివేదిక ప్రకారం, దాదాపు పదకొండువేల మిలియన్ డాలర్ల విలువగల ఆయుధాలను అమెరికా ప్రతీ సంవత్సరమూ ఇతర దేశాలకు ఎగుమతి చేస్తోంది. దాదాపు ఈ విలువలో సగం అంటే ఐదున్నర వేల మిలియన్ డాలర్ల విలువగల ఆయుధాలను రష్యా ఎగుమతి చేస్తోంది. ఈ ఆయుధాలు ఎగుమతి కావాలంటే యుద్ధం అనేదొకటి ఉండాలి కదా. ఒకవేళ యుద్ధం ఉండకపోతే యుద్ధం సృష్టించబడుతుంది. యుద్ధాన్ని ఎలా సృష్టించాలి, ఏ రెండు దేశాల మధ్య సృష్టించాలి అనేది అమెరికాకు వెన్నెతో పెట్టిన విద్య. ఇతరత్రా అన్ని ఆర్థిక వ్యాపారాలకి ఔట్ సోర్సింగ్ మీద ఆధారపడి యుద్ధ యంత్రాల్ని మాత్రం తానే తయారు చేస్తూ ఎగుమతులు చేసుకోవటంలోనే అమెరికా తంత్రం అర్థం అవుతుంది. దాదాపు ఎనిమిది లక్షల మందికి ఈ అమెరికన్ ఆయుధ కర్మాగారాల్లో ఉపాధి లభిస్తోంది. యుద్ధం అనేది అమెరికాకు బంగారు గుడ్లు పెట్టే బాతువంటిది. దానిని ఎందుకు చంపాలి అనుకుంటుంది?.

కాబట్టి అమెరికా ఎపుడూ ప్రపంచాన్ని గమనిస్తూ ఉంటుంది. ఎక్కడ ఏ మూల ఏ విషయం జరిగినా తన వేలు పెట్టాలని చూస్తూ ఉంటుంది. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ప్రపంచానికి ఆయిల్ పెట్రోలియం ని అందించే మిడిల్ ఈస్ట్ దేశాలు అమెరికాకు కనిపించాయి. మొదటి ప్రపంచ యుద్ధం తరువాత కాలంలో మిడిల్ ఈస్ట్ తో కేవలం స్నేహ పూర్వక సంబంధాలనే కలిగున్న అమెరికా, రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ప్రపంచంలోని అత్యంత ముఖ్యమైన ప్రాంతంగా గుర్తించింది. రెండవ ప్రపంచ యుద్ధం అమెరికా దృక్పథాన్ని ఫారిన్ పాలసీని పూర్తిగా మార్చేసింది. అప్పటినుంచే మిడిల్ ఈస్ట్ లో అమెరికా జోక్యం పెరగటమూ, మిడిల్ ఈస్ట్ తో అమెరికా మితిమీరిన రొమాన్స్ వాటి రెంటి మధ్య ఘర్షణకి దారి తీసి సో కాల్డ్ "తీవ్రవాదం"(terrorism) అనబడుతున్న దానికి దారితీయటమూ జరిగింది. తీవ్రవాద దాడులన్నీ అమెరికాను టార్గెట్ చేసుకుని జరుగటానికి కారణం లేకపోలేదు. డిపార్ట్ మెంట్ ఆఫ్ డిఫెన్సు స్టడీ ప్రకారం, ప్రపంచ వ్యవహారాల్లో అమెరికా తలదూర్చటం జరిగినప్పుడల్లా అమెరికాకు వ్యతిరేకంగా టెర్రరిస్ట్ అటాక్స్ జరిగాయని తెలుస్తోంది. అలాంటి ఒక దాడే సెప్టెంబరు పదకొండున (1991/9/11p) న్యూయార్క్ ట్విన్ టవర్స్ మీద జరిగిన దాడి. న్యూయార్క్ టైంస్ పత్రికకు సెప్టెంబరు పదకొండు దాడుల తరువాత తీవ్రవాదుల నుండి ఒక ఉత్తరం వచ్చింది.
"We declare our responsibility for the explosion on the mentioned building. This action was done in response for the American political economical and military support to Israel, the state of terrorism, and to the rest of the dictator countries in the region" ఈ ఉత్తరం టెర్రరిస్ట్లు అని అనబడుతున్నవారు దాడులకు తెగబడటానికి మిడిల్ ఈస్ట్లో అమెరికా అనవసర జోక్యాన్ని కారణంగా చూపుతోంది.

ఇవి జరగగానే, అమెరికా 2003 లో ఇరాక్ మీద యుద్ధం ప్రకటించింది. కారణాలుగా సద్ధాం హుస్సేన్ WMD (Weapons of Mass Destruction) కలిగి ఉన్నాడనీ, సున్నీ ముస్లిం అయిన సద్ధాం, అల్ ఖయిదాతో సంబంధాలు కలిగి, సెప్టెంబరు పదకొండు దాడులలో పరోక్షంగా పాల్గొన్నాడనీ చూపించింది. (నవీన కాలంలో అరబిక్ నేషనలిజం కాలం వరకు శాంతియుతంగా జీవించిన షియా సున్నీ ముస్లిం తెగలు, విడిపోయి కొట్టుకోవటం ప్రారంభించాయి. ఒలివర్ రాయ్, డైరెక్టర్ ఆఫ్ ఫ్రెంచ్ నేషనల్ సెంటర్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్, ప్రకారం ఇరాన్ లోని ఇస్లామిక్ రివొల్యూషన్ , ఇరాక్ యుద్ధం ఈ రెండూ కూడా షియా సున్నీల మధ్య అధికార మార్పిడి జరగటానికి కారణమట.) ఇరాక్ యుద్ధానికి అమెరికా చూపిన కారణాలేవీ తరువాత నిరూపించబడలేదు. బయటకి ఎన్ని మాటలు చెప్పినా, అమెరికా ఇరాక్ ను ఆక్రమించటంలోని ఆంతర్యం మాత్రం ఇరాక్ వద్దనున్న పెట్రోలు నిల్వలే. ఇరాక్ నుంచి ఇజ్రాయిల్ లోని హైఫా ఆయిల్ రిఫైనరీ వరకు గల పైపులైన్ని పునరుద్ధరించాలని అమెరికా కోరుకుంది. అందుకు ప్రతిగా ఇజ్రాయిల్ అమెరికా కు ఇరాక్ యుద్ధంలో సహాయపడాలన్నది రహస్య ఒప్పందం. హైఫాలోని ఆయిల్ రిఫైనరీల వరకు పైపులైన్లు పునరుద్ధరిస్తే, ప్రపంచ ఆయిల్ మార్కెట్టు మీద అమెరికా ఆధితప్యం చెలాయించవచ్చు. ఈ లెక్కన ఇరాక్ యుద్ధం మిడిల్ ఈస్ట్ లోని పెట్రోలియం సంపదల మీద ఎన్నో సంవత్సరాల అమెరికన్ వ్యూహాత్మక చర్యలకు ప్రతిఫలంగా జరిగింది. సెప్టెంబరు పదకొండు దాడులు ఆ వ్యూహాన్ని అమలు పరచటానికి ఒక ఊతమిస్తే, ఉగ్రవాదం మీద పోరు నినాదమూ కేవలం ప్రపంచాన్ని పక్కదారి పట్టించి, అస్థిర పరచటానికి ఉపయోగపడింది.
కానీ ప్రపంచానికి ఈ కారణాలు చూపించదు అమెరికా. షియా సున్నీ పోట్లాటల్నీ, తన జోక్యానికి వ్యతిరేకంగా మీద దాడి చేసిన ఒసామా బిన్ లాడెన్ నీ, ఇరాక్ లో భయంకర జీవ ఆయుధాలు కలిగి ఉన్నాడన్న నెపంతో సద్ధాం హుస్సేన్ నూ బూచిగా చూపిస్తుంది అమెరికా. ఇటువంటి ఒక సందర్భాన్ని తీసుకుని అమెరికా నిజస్వరూపాన్ని మనముందు ఆవిష్కరించే ప్రయత్నం చేస్తారు కవి జయధీర్ తిరుమల రావు. ఈ కవిత రాసే సమయానికి (2005) ఇరాక్ యుద్ధం జరుగుతూ నే వుంది. ఇంకా సద్ధాం హుసేన్ అమెరికన్ బలగాలకు దొరకలేదప్పటికి.

ఇపుడు దీన్నేమందాం
జాతుల పాలి పగా
కాదు కాదు పెట్రో లూటీ సెగా!

టైగ్రిస్ నది వంతెన మీద జరుగుతున్న షియా మతానికి సంబంధించిన మత ఉత్సవంలో సూసైడ్ బాంబర్స్ ఉన్నారని పుకారు లేవటంలో కూడా అమెరికా హస్తం ఉందంటాడు కవి. ట్యాంకులనిండిన యుద్ధ విమానాలని అమెరికా పోగు చేసుకునే ఉత్సాహంలో ఇరు దేశాల్లో జరిగిన మారణ హోమాన్ని ప్రశ్నిస్తాడు కవి. కత్రినా తూ ఫాన్ సమయంలో సహాయ చర్యలకు కూడా రాలేని సైన్యం, ఇరాక్లోని పెట్రోలియం పైపులైన్లకు పహారా కాస్తున్నారని ఎద్దావా చేస్తాడీ కవితలో. ఇటువంటి కవితలు చేయటంలో కవి సమగ్ర విషయావగాహన స్పష్టమవుతుంది. అమెరికన్ మీడియా చూపించే డొల్ల యుద్ధ సమాచారాన్ని పక్కకి తోసి, లోకానికి సత్యాన్ని తెలియజేసే పనిలో కృతకృత్యుడవుతాడీ కవి.

ఇసుక గడియారం
-------------------------
              డా. జయధీర్ తిరుమల రావు
              9/10/2005

అహంభావ భాస్వరంతో
మాంసం శకలాలు కాల్తున్న కాష్టంలా దేశాలు

విచక్షణ చక్షువుల్ని పొడిచి
ఆ దేశాలనిండా మరుభూములు మొలిపించాడు వీడు

ఈ రణ పిపాసి ఆత్మ
రెండు దేశాల్లో ఒకే వ్యూహం
ఒకటి గాల్లో
ఓటి శ్వేతమందిరం జారుడు లాన్ లో

వినాశం కావాలి
అణ్వాయుధాల్లేని పెట్రో దేశం
తులతూ గాలి
అణువణువు అణ్వస్త్ర సంపదగల నేల

టైగ్రిస్ వంతెనపై నరబలి పథకం
లేని మానవబాంబు పుకారు
పుట్టించిన వాళ్ళ కుట్రేమిటో అందరికీ తెలియాలి

షియా సున్నీ సోదరులున్న చోట
వారి మధ్య
విద్వేష పూరిత ఖరీదైన నివేదికొకటి ఖరారు
ప్రతి అమెరికా వాడు
గుడ్డిగా చెల్లించిన సుంకాలే కదా దానికాధారం
ఒకరిద్దరి హతం కోసం
వేలాది ఉగ్రవాదుల తయారీకి ఆజ్యం
కోట్లాది పౌరుల బహిరంగ మౌనాంగీకారం
అనివార్య విశ్లేషణీయం

రసాయనం నిండిన
పాగా చుట్టిన తలల కిందిభాగం
శూన్యంలో పేలితే బాగుండు
రెండు చేతులు చాచిన దువాలో
కూలిన శిఖరాల్లో నుసైన మనిషి
ఆనవాలు కనిపిస్తే బాగుండు

ఆదివారం ఉదయాన
మెడలో వేలాడే శిలువల సాక్షిగా
నలుగురు కలిసి చదివే సువార్త అధ్యాయాల్లో
రెండు దేశాల ఆర్త నాదాలు వినపడితే బాగుండు

ఇపుడు దీన్నేమందాం
జాతుల పాలి పగా
కాదు కాదు పెట్రో లూటీ సెగా!

ట్యాంకులు నిండాలనే కదా వాడి కుతంత్రాలు
ట్యాంకులు నిండిన విమానాలే వాడి ఆయుధాలు
మనుషుల్ని లైన్లుగా నిలబెట్టండి
దేశాలు నేలమట్టమైతే ఏమిటి
పైపులైనులు మాత్రం భద్రం
ఇరు దేశాల అస్థి పంజరాల్ని
సున్నం ముద్దలు చేసి
పైపులకి కడ్తూ పోండి సేఫ్ వాల్

కత్రినా తుఫాను సహాయంలో
అమెరికా సైనికులు లేకున్నా ఫరవాలేదు
పైపులూ, పెట్రో బేరల్స్ చుట్ఠూరి
కాపలా కాయాలంతే
మిలటరీ పహారా మాత్రం జాగ్రత్త

అరెరే! నలుగురి నిర్మూలన పేరుతో
మతాల రీతులూ
మానవ జాతులూ లోతుగా పీకలదాకా
కూరుకుతోతున్నాయి
మరో విధ్వంసంలోకి
గడియారం రెండువైపులా పారే ఇసుకలా

ఇటువంటి కవిత చదివితే అమెరికా ఎంత మోసపూరిత దేశమో అర్థమవుతుంది. ప్రజాస్వామ్యం లేదు పునరుద్ధరిస్తామంటూ , నియంతృత్వం ఉంది కూలదోస్తామంటూ, ఉగ్రవాదాన్ని రూపుమాపటానికి ఉగ్రవాదం మీద పోరు అంటూ ఎపుడూ అమెరికా ఎందుకు యుద్ధోన్ముకురాలై ఉంటుందో తెలుస్తుంది. ఆకాశ మార్గం నుంచి ఎత్తుకొచ్చే బాంబుల ద్వారా లక్షల ప్రాణాల్ని సెకండ్లలో అంతమొందించటాన్ని మనం ఉగ్రవాదమనీ, బుష్ ని ఉగ్రవాది అని ఇంకా మనం గుర్తించక పోవటం ఏంటోనని ఆశ్చర్యం వేస్తుంది. అంతేకాక ఈ రోజు ప్రపంచాన్ని పట్టి పీడిస్తుందనుకుంటున్న ఉగ్రవాద మూలాలు అమెరికా ఫారిన పాలసీ, వార్ ఎకానమీలో ఉన్నాయని తెలుస్తుంది. 2004 లో విలియం బ్లూమ్ రాసిన 'మోసపూరిత రాజ్యం' (Rogue state)  అనే పుస్తకంలో ఒసామా బిన్ లాడెన్ అన్నట్టుగా చెప్పబడుతున్న మాటల్ని ఇక్కడ ఉంచుతున్నాను. ఎందుకంటే ఈ ఉగ్రవాది మాటల్లో ఉగ్రవాదానికొక సమాధానం దొరకొచ్చు.
"If I were president, I could stop terrorist attack against united States in few days, permanently.
I would first apologize- very publicly and sinicerely to all the widows and orphans, the improvished and tortured, and the many millions of the victims of American Imperialism.
Then I would announce to every corner of the world that America's global military intervention has come to an end".

1/6/16
(కవిత్వ సందర్భం 19)
ఇవాళ పొద్దున ఒక ఫోన్ వచ్చింది. ఓం నమో వేంకటేశాయ అని ఒకాయన పలకరింపు.
పలకరింపులోనే నేనో డాక్టర్నని తెలుసుకోగలగటం ఆయనకో టెక్నిక్.
ఆయనొచ్చేసి, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అర్చకుడని చెప్పుకున్నాడు. ప్రస్తుతం తిరుమల నుండి మాట్లాడుతున్నాడట. నా నెంబరు అష్టలక్ష్మీ దేవాలయ అర్చకుడు ఆయనకు ఇచ్చాడట. అంత పెద్దవారు ఈ అల్పజీవికి ఎందుకు చేశారబ్బా అని అనుకుంటుండగానే..
తిరుమల నుండి హైదరాబాదుకు ఒక దైవకార్యం మీద ఒచ్చిన నలుగురు బ్రాహ్మణులు పయనించే కారు, హైదరాబాదు ఎల్.బీ నగర్లో ఆగిపోయిందట. రిపేరు చేయటానికి చాలా ఆలస్యమవుతుందట. కాబట్టి మీరు వారికి సహాయం చేయగలరా అని ఒక అభ్యర్థన. మనిషేమో పెద్దాయన, పైగా వేంకటేశ్వరుడి ప్రధాన అర్చకుడు, ఇదేదో ఆ వేంకటేశ్వరుడి కృపా కటాక్షాలేమో, ఇటువంటివారికి సహాయం చేయాల్సి రావటం అనుకున్నా. ఏదో "ఇక్కడ సహాయం చేయబడును" అని బోర్డు పెట్టుకున్న వాడిలా కాసేపు తెగ ఇదై పోయాననుకోండి.
పైగా త్వరలో తిరుమల ప్రోగ్రాం ఉంది, ఈ లెక్కన స్వామివారి కాళ్ళని అతి దగ్గరనుంచి గాఠిగా పట్టేసుకోవచ్చేమో అని ఒక వెర్రి ఆవేశం. అంటే ఇపుడు సహాయం అందించి ఆ తరువాత దర్శన సమయంలో సహాయం పుచ్చుకోవచ్చన్నమాట. ఆగండి ఆగండి..మరీ ఇంత దారుణమా అని అనకండి. ఏదో స్వామి మీద భక్తి నాతో అలా ఆలోచింపజేసి ఉంటుంది. ఇంకా నేను చాలా నయ్యం, రెండు లడ్లు ఎక్కువ వేసుకుని రావచ్చని ఆలోచించలేదు సుమా...!! అందుకే నేను కొద్దిగా మంచోణ్ణి అంటే నమ్మండి.
ఇహ, విషయానికొస్తే...దేవస్థానం బ్రాహ్మణులు కదా, బయట తినరు కదా ఇంటికి తీసుకెల్లి సుష్ఠుగా భోజనం చేయించమంటాడేమో అనుకున్నా...ఈ లోగా ఆయన ఇంకో వెహికిల్ ఏర్పాటు చేసుకుంటాడేమో అనుకున్నా. మాట్లాడుతున్న ఇంత సమయంలోనే ఇలా పలువిధాలుగా ఎలా ఆలోచించాననుకుంటున్నారా?. నిన్ననే మోకాలికి పాదరసంతో మర్ధన చేశానులేండి. కానీ నేను అనుకున్నది కాదట. వారికి బస్సు టికెట్టు ఇప్పించి తిరుపతి బస్సు ఎక్కించాలట, వారి దగ్గర డబ్బులు లేవట. ఇపుడు వారి వాహనం ఎల్.బీ. నగర్ లో ఆగి ఉందనీ, అక్కడికెళ్లి ఏమైనా డబ్బు ఏర్పాట్లు చేయగలరా అని అభ్యర్థన.

ఆ సమయంలో నేను హాస్పిటల్ లో ఉన్నాను. ఎల్ బీ నగర్ కి సరిగ్గా ముప్పై కిలో మీటర్ల దూరంలో. నా చేయి అక్కడి దాకా చాపలేనని అర్థం అయ్యి, వెంటనే నాన్న కి ఫోన్ చేశాను. మ్యాటర్ చెప్పాను. పాపం నాన్న అప్పటికప్పుడు తయారై రయ్యిమని ఎల్.బీ. నగర్ లో వాలాడు. ఇక సినిమా అప్పుడు మొదలైంది. ఆయన నెంబరుకు నాన్న ఫోన్ చేసి, "వాళ్ళెక్కడున్నారు సర్" అని అడిగితే, ఒక సారి ఫలానా బేకరీ దెగ్గర అని, ఇంకో సారీ ఫలానా మసీదు దగ్గర అనీ అర్థం పర్థం లేని జవాబులు. ఆ తరువాత ఆయన 'ఆ బ్రాహ్మణులవి' అని రెండు నంబర్లివ్వటం,  వాటికి నాన్న ఫోన్ చేయటం, అవి స్విఛాఫ్ అని రావటం, మరలా ఆయనకు చేస్తే, "ఛార్జింగ్ అయిపోయి ఉండవచ్చండీ..!"  అని చెప్పటమూ చాలా నాటకీయంగా జరిగి ఉంటాయని మీకు ఈ పాటికి అర్థం అయి వుంటుంది. అపుడు ఆ మహానుభావుడు, " డ్రైవరు అకౌంట్ నంబరిస్తాను ఒక ఐదు వేలు ట్రాన్స్ఫర్ చేయండి" అని అడగ్గానే,  సినిమా క్లైమాక్స్ ముందే అర్థం అయ్యి చిరాకుగా లేచొచ్చే సగటు ప్రేక్షకుడి అవతారం వెనువెంటనే ఎత్తి కారు వెనక్కి తిప్పాడు నాన్న.

కాసేపయ్యాక నేను , ఏదేదో ఊహించుకునే అల్ప సంతోషయినటువంటి ఈ సదరు 'నేను' అనేవాణ్ణి, ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా నాన్నకి ఫోన్ చేశా ఏమయ్యిందని. 'ఒరేయ్ తింగరోడా' అని అనకున్నా ఆల్మోస్ట్ అలాగే మాట్లాడి, "ఇంటికి రారా నీ పని చెప్తా" అని పెట్టేశాడు. ఇంతలో నాన్న తెలివి గమనించిన ఆ మహానుభావుడు, ఇక లాభం లేదనుకుని నన్ను బుట్టలో వేసెయ్యొచ్చనుకున్నాడేమో.. నాకు ఫోన్ చేసి "మీ నాన్న గారు కనుక్కోలేకున్నాడు నాన్నా వారిని, ఊరికే అందరికీ ఇబ్బందులెందుకు, నేనో అకౌంట్ నంబరు చెబుతా దానిలో ఓ ఐదువేలు వేసేయవా?" అన్నాడు. థోత్ ...జీవితం. నా నోటిలో ఓ నాలికుందనీ, దానికీ వీరావేశం వస్తే దబిడి దిబిడేనని అప్పుడే నాకూ అర్థం అయ్యింది. Dont trouble the trouble, if you trouble the trouble, trouble troubles you అన్నంత పని చేసాను. అయ్యవారు ఉడుక్కుని ఫోన్ పెట్టేశాడు. ఇదిగో ఇదే ఆ నెంబరు 7337535758. కోపం వచ్చిన వారు కోపంగానూ, నవ్వొచ్చిన వారు నవ్వుకుంటూ అపుడపుడూ సారును ఆడుకోండి. దేవుడి పేరుతో జరిగే మోసాల్ని చూసినపుడల్లా సారునో సూపు చూస్తూ ఉండండి. ఇక్కడ నా పని మా నాన్న చూసుకుంటాడులెండి!!.

గమనిక- తిరుమల నుండో..యాదగిరి గుట్టనుండో అర్చకులమని ఇలా అబద్దాలు చెప్పి మోసాలు చేసే వారు పెరిగిపోయారు. వీళ్ళు అర్చకులు కాదు. పెద్ద వారి పేరుని ఇలా వాడేసుకుని మోసాలు చేస్తున్నారు.
పోలీస్ లకు ఇటువంటి మోసాగాళ్ల సమాచారం వెంటనే ఇవ్వగలరు
మతమూ, ఆధ్యాత్మికత రెండూ ఒకటేనా?.

పవిత్రతని కొంతమంది తమ హక్కుగా భావిస్తారు. తమ చేతుల్లోనే పవిత్రత అంతా ఉందనీ, తాము చెప్పిందీ చేసింది మాత్రమే పవిత్రమైనదనీ నమ్మబలుకుతారు. ఫలానాది పవిత్రమనీ, ఫలానాది అపవిత్రమనీ, అపవిత్రమైనదాన్ని పవిత్రం చేయటానికే తాము దిగివచ్చామని పలుకుతుంటారు. కానీ పురాతన మానవుడికి ఈ పవిత్రత అపవిత్రతల గోల లేదు. తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ప్రకృతిని గొప్పగా, అందంగా, ఆశ్చర్యంగా, ఆనందంగా చూసి అనుభూతి చెందే ఒక అమాయక స్వచ్ఛమైన స్థితిలో అతడున్నాడు. జీవితమే ఒక అద్భుత విషయంలా కనిపించిందతనికి. గెలుపూ ఓటముల్ని బేరీజుచేసుకుని, జీవితమొట్టి నిస్సారమైనదనీ, పనికిరాని చెత్త అనీ అనుకోవడానికి అతడికి ఎట్టి అవకాశమూ లేదు. పురాతన మానవుడు ప్రపంచంలో ఎక్కడ ఏమూలలో ఉన్నా ఇలాగే ప్రపంచాన్ని అనుభూతి చెంది  వుంటాడని అతని ఆలోచనల్ని మనకు అందించే అతడి సాహిత్యం మనకు తెలియజేస్తుంది. ఈ చరాచర ప్రపంచంలో తను చూసినదాన్ని అనుభూతి చెందిన దాన్ని ఆనందంగా పాడాలని అతడు అనుకున్నాడు. అది అతని కవిత్వమయ్యింది. ఋగ్వేద ఋక్కులయినా, ఓర్ఫిక్, ఎల్యూసీనియన్ మంత్రాలయినా, అప్పటి మానవుడి ప్రపంచ దృక్కోణాన్ని అతడు ప్రపంచాన్ని అనుభూతి చెందిన విధానాన్ని తెలుపుతాయి. అతడికి ఏ మతమూ లేదు. ఏ మత అధికారీ లేడు. మనసులో స్వచ్ఛత ఉంది. మరలా మరచిపోకుండా ఉండేందుకు తన పాటలకి తానే ఒక రాగం సమకూర్చుకున్నాడు. శబ్ద సౌందర్యాన్ని పట్టి ఉంచుకునేలా దానికో ఛందస్సు ఏర్పరుచుకున్నాడు.  పది మందికీ తన పాటని వినిపించుకున్నాడు. తన కవిత్వంలో తనను తాను తెలుసుకుంటూ, తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకుంటూ, దానిలోని రహస్యాల్ని ఛేదించుకుంటూ ముందుకు సాగాడు. సృష్టిలోని అద్భుతాల్ని, ఆనందాల్ని, భయాల్నీ చూసి అదంతా ఎవరికీ అర్థంకాని ఒక దివ్య శక్తి అనీ, దైవమనీ అనుకున్నాడు. అదే అతడి అదిభౌతిక ఊహాగానాల కి నాంది అయ్యింది. అది అతడి స్వచ్ఛమైన ఆధ్యాత్మిక జీవనమయ్యింది. అప్పటిదాకా మతమన్నదేదీ లేదు.

భారతదేశంలో అలా పురాతన మానవుడు పాడినదాన్ని తరువాత వచ్చిన వారు వేదం అన్నారు. తరువాత వచ్చిన మతకారులు, అదంతా పవిత్రమన్నారు, అదంతా వారి గొప్పతనమనే చెప్పుకున్నారు. ఇంకో అడుగు ముందుకేసి దేవుడే రాసాడు అన్నారు. వేదాలు అపౌరుషేయాలని అబద్ధాలు చెప్పారు. కానీ అవి పురాతన మానవుని ఆధ్యాత్మిక అన్వేషణ, జీవిత శోధన ఫలితాలని చెప్పకుండా భగవంతుడే రాశాడని చెప్పుకున్నారు. వాటికో పవిత్రత ఆపాదించారు. వీరు చెప్పే పవిత్రత వేదాల్లో నిజంగా దాక్కుని వున్న ఆధ్యాత్మిక పసిబాలుని స్వచ్ఛత కాదు. వీరిది మత పవిత్రత. వాటిని ముట్టుకోరాదని ఎవరంటేవారు చదువుకోరాదని ఆంక్షలు పెట్టారు. భూమి మీద ఆకాశం కింద ఒక దేవుడొచ్చి ఒక విషయాన్ని ఎందుకు రాయాలి?. భగవంతుడనేవాడు ఎపుడు రాశాడు, ఎందులో రాశాడు?. రాసి ఎవరికిచ్చాడు?. ఎందుకిచ్చాడు?. సమాధానాలు  హేతువుకి దొరకవు. అహేతుకమైన నమ్మకాల మీద మతాలు నిర్మింపబడతాయనే విషయం వేదానికి సంబంధించిన వివిధ వాదాలు వింటే తెలిసిపోతుంది. ఒక ఉదాహరణ చెప్పుకుందాం.

ఓం అగ్నిమీళే పురోహితం యజ్ఞస్య దేవ మృత్విజం
హోతారం రత్న ధాతమం

ఋగ్వేదంలో మొట్ట మొదటి ఋక్కు. "ఓ అగ్నీ..! నేను నిన్ను పూజిస్తున్నాను". అని మొదలవుతుంది. 'నేను' ఎవరు ఇక్కడ?. వేదాలు అపౌరుషేయమయితే 'నేను' అనేది ఎందుకు వస్తుంది. భగవంతుడే రాస్తే 'నేను అగ్నిని పూజిస్తున్నానని' ఎందుకంటాడు?. అక్కడ చెప్పిన 'నేను' అనేవాడు ఒక ఋషి. ఒక స్వచ్ఛమైన ఆధ్యాత్మిక అన్వేషకుడు. అగ్నిని ఆశ్చర్యంగా కీర్తించాడు, సూర్యుడినీ, పర్జన్యుడినీ( మేఘం ), ఉషోదయాన్నీ అద్భుత కవిత్వంతో ఊహించాడు. అతడికి కనిపించే ప్రతీదీ ఒక అద్భుతమే. ఒక దైవమే. ఈ దైవాలతనికి అతని వ్యావసాయక జీవనానికి భౌతికమైన పనులని  చేసి పెట్టేవి. అప్పటికింకా దైవాలకి పూర్తి మానసిక ఆంతరంగిక పనులు అప్పగింపబడలేదనే చెప్పాలి. తరువాత వచ్చిన బ్రాహ్మణాలు ఉపనిషత్తులూ వేదిక్ దైవాలకు ఆంతరంగిక వ్యవహారాలను నియంత్రించే శక్తిని కనుగొన్నాయి. ఇదొక పరిణామ క్రమానికి మించిన ఆధ్యాత్మిక అవసరమైయ్యింది. ఉదాహరణకు విశ్వామిత్రుడు అందించిన గాయత్రీ మంత్రంలో సూర్యుడు మనిషిలోని జ్ఞానానికి అధిదేవతగా చెప్పబడటం కనిపిస్తుంది. ఈషోపనిషత్తులో సూర్యుడి పని వల్లనే జ్ఞానం ద్యోతకమౌతుందని సూర్యునికి మనిషిలోని ఆంతరంగిక చైతన్యానికీ సంబంధం ఏర్పరచటం కనిపిస్తుంది. అలాగే ఇదే ఉపనిషత్తులో అగ్నిని అన్నింటినీ పవిత్రం చేసేవాడిగా, దివ్య మార్గాన్వేషణలో ఆత్మకు అధికారిగా వివరించబడింది. వేదాలనుండి ఉపనిషత్తులకు వచ్చేసరికి ఈ పరిణామం కనిపిస్తుంది. ఇటువంటి అవసరమే మనకు గ్రీకు దేవతల విషయంలోనూ కనిపిస్తుంది. కానీ గ్రీకు దేవతలు మొదటినుంచే వారి వారి కార్యాలకు అధిష్టాన దేవతలుగా కీర్తించబడ్డారు. సన్ గాడ్ 'అపోలో' కవిత్వానికి ప్రవచనానికీ అధిష్ఠాన దేవతయ్యాడు. ఉషోదయ దేవత 'అథీనీ' జ్ఞానానికి దేవతయ్యింది.

ఇటువంటి వేదాల్ని ఒక పురాతన మానవుని నిర్మలమైన ఆధ్యాత్మిక గీతంగా అర్థం చేసుకున్న పాశ్చాత్యులు అవి అపౌరుషేయాలనో, భగవంతుని వాక్యాలనో అనుకోలేదు. ఇంకా అడవులల్లో బట్టలు లేకుండా తిరుగుతున్న కాలంలో భారతదేశంలోని పురాతన మానవుడు ఇటువంటి ఆధ్యాత్మిక ఆది భౌతిక ఊహాగానాల్ని చేస్తూ ఎంతగా పరిణతి చెందాడోనని ఆశ్చర్య పోయారు. కానీ మత అధికారులు వేదాన్ని మతం చేయటం కనిపిస్తుంది. వైదిక ఊహగానాలు తరువాత ఉపనిషత్తులుగా, పురాణాలుగా అభివృద్ధి చెందుతూ  ఎన్నో పరిణామాలకి లోనయ్యాయి. ఒక్కోసారి వేదానికి పూర్తి విరుద్ధమైన పోకడలూ పుట్టాయి. ఋగ్వేదంలో దేవాధిదేవుడిలా కీర్తించబడిన ఇంద్రుడు, రామాయణంలో రాముడిని ఇంద్రుడంతటి వాడిగా పోల్చిబడిన ఘన కీర్తి కలిగిన ఇంద్రుడు, తరువాతి పురాణాల్లో స్వర్గాధీశుడుగా చిన్న ఉద్యోగంతో సరి పెట్టుకోవలసి వచ్చింది. పైగా ఋషుల తపస్సులను భగ్నపరిచేవాడిగా, అభాండాలు మోయవలసి వచ్చింది. ఇదంతా స్థిరీకరించటానికి ఒక వ్యవస్థీకృత మతం ఏర్పడింది. దానికి కొన్ని శాస్త్రాలు ఏర్పడ్డాయి. వాటన్నిటికీ వేదమే ఆధారమని నమ్మబలికాయి. వేద బాహ్యమైనదేదీ ఉండకూడదంటూనే ఇంద్రుడినీ వరుణున్నీ పర్జన్యున్నీ చిన్న చిన్న దేవతలను చేశాయి. ఈ శాస్త్రాలిపుడు అన్నిటినీ నియంత్రిస్తాయి. వేదాల్ని దేవతల్నీ మనుషుల్నీ అందరినీ. ఇలా కాకుండా దేవుడు ఇంకో రకంగా ఉండటానికి వీల్లేదని కారు కూతలుకూస్తాయి. ఇలా కాకుండా మనిషి ఇంకోరకంగా ప్రవర్తించటానికి వీల్లేదని ప్రవచిస్తాయి. వేదమెంత విశాలమో ఈ భావాలంత సంకుచితం. వేదంలో ప్రతీదీ దైవమే. ఏకం సత్. ఇక్కడ శాస్త్రం చెప్పిందే దైవం. పైగా ఇదంతా ఆధ్యాత్మికమంటాయి. విచిత్రం. ఇందులో మతం తప్ప ఆధ్యాత్మికత ఎక్కడుంది. మనిషి తనను తాను తెలుసుకుంటూ, తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని, అంతరాంతరాల్లోని ప్రపంచాన్నీ ఆశ్చర్యంతో చూసుకుంటూ అవగాహన చేసుకుంటూ, అనుభూతి చెందుతూ  ఆధ్యాత్మిక సాహస యాత్ర చేసిన వేద ఋషుల స్ఫూర్తి ఇందులో, ఈ శాస్త్రాల మతంలో ఎక్కడుంది?. గంగిరెద్దుల్లాగా తలలూపే మనుషుల్ని తయారు చేసి, ఆధ్యాత్మిక చైతన్యాన్ని లోపలి అన్వేషకున్నీ నిర్ధాక్షిణ్యంగా చంపేసి, స్వచ్ఛమైన ఋషి వీరులను తాయారు చేయటానికి బదులుగా సొంత పరివారజనాల్ని వెంటేసుకు తారిగే శాస్త్ర కారులు తాము ఆధ్యాత్మికతను ఎంత నలిపేస్తున్నారో తెలుసుకోగలిగే అవకాశం లేదు కాబట్టి, ఎవరికి వారీమి వేద ఋషుల  స్ఫూర్తిని రగిలించుకుంటే తప్ప ఆధ్యాత్మిక శిఖరాల్ని స్పృశించలేం. అందుకు వేదాల్ని  చదవాలి. అది పవిత్రమనో భగవంతుని మాటలనో చదవకూడదు. మన పూర్వీకులు రాసి దాచిపెట్టుకున్న డైరీల్లాగా వాటిని చదవాలి. జీవితంలో వారు చేసిన సాహసోపేతమైన ఆధ్యాత్మిక ఆంతరంగిక యాత్రని తెలుసుకోవటానికి వాటిని చదవాలి. మతమూ ఆధ్యాత్మికత రెండూ ఒకటి కాదని ప్రత్యక్షంగా అనుభూతి చెందటానికి ఆ నిర్మలమైన భావాల్ని ఒకసారైనా చదవాలి.

27/5/16