Friday, 17 June 2016

కవిత్వ సందర్బ౦21 endluri

మాతృత్వమే సమాధానం చెప్పాలీ సమస్యకు.
-------------------------------------------------------------

"ఇతిహాసపు చీకటి కోణం, దాచేస్తే దాగని సత్యం,అట్టుడుగున పడి కాన్పించని కథలన్నీ కావాలిపుడు" అన్నాడు శ్రీశ్రీ. నిజమే సమగ్ర చరిత్ర నిర్మించాలంటే మరుగున పడిన కథలన్నో బయటకురావాలి. ఇవి తల్లి జోలపాడుతూ చెప్పే కథలు కావు. మహా రాజుల యుద్ధాలు, అంతఃపుర రాణుల భోగభాగ్యాల కథలు అసలుకే కాదు. మరుగున పడ్డ కథలు. ఇంకో రకంగా, మరుగు పరచబడ్డ కథలు. వీటికి వీరోచిత కథానాయకుడు ఉండడు. కథ ఉంటుంది అంతే. బతుకు చిత్రం ఉంటుంది. సామాన్యుడే ఇక్కడ పాత్రధారి. అపుడు సామాన్యుడంటే ఎవరు? అనే ప్రశ్న ఒస్తుంది. ఈ దేశంలో 'సామాన్యులు' అనేవారు ఉన్నారా?. ఈరోజు సామాన్యులు అని చెప్పబడేవారందరూ సామాన్యులేనా?. నిజానికి వారంతా అసామాన్యులు. ఎందుకంటే 'మేమంతా అసామాన్యులం సుమా!' అని చెప్పుకోవడానికి వారికందరికీ పేరు గొప్ప కులాలున్నాయి. 'మేమంతా పూర్వజన్మ సుకృతానుసారము ఇలా మహత్తరంగా పుట్టాము సుమా!' అని చెప్పుకోవడానికి ఒక కర్మ సిద్దాంతమూ ఉంది. . ఒక బీద బ్రాహ్మణుడో రెడ్డో కమ్మో కాపో యాదవో గౌడో..అమ్మా!! ఆకలేస్తుంది అన్నం పెట్టమంటే, అయ్యో బాపనాయనకు ఎంత కష్టమొచ్చింది, రెడ్డిగారికెంత కష్టమొచ్చింది, నాయుడుగారికెంత కష్టమొచ్చిందని, పేరు గొప్ప కులాల్లో పుట్టిన ఈ మహనీయుల దీనస్థితిని చూసి బాధపడిపోతూ  విస్తరి వేసి నిండా అన్నం వడ్డిస్తుందీ దేశం. అడిగిన వాడెంతటి మూర్ఖుడయినా, "గొప్ప కులంలో పుట్టినందుకు వాడు అసామాన్యుడే సుమా!" అనుకుంటుందీ దేశం. మరి పొరపాటున, ఈ గొప్ప కులాల్లో పుట్టని వాడి పరిస్థితి ఏంది?. అమ్మా ఆకలని అడిగితే..."ఛీ..ఛండాలుడా! దూరం దూరం" అంటూంది ఇదే దేశం. . దారిన పోయే కుక్కలో దత్తాత్రేయుడో, పందిలో విష్ణుమూర్తో, ఆవులో లక్మీదేవో కనిపిస్తే, వాటిని ముట్టుకుని పూజలు చేసే ఈ దేశపు ఆసామాన్యులకూ, పవిత్రమైనదని గో మూత్రాన్ని తీర్థంలా కళ్ళకద్దుకునే ఈదేశపు అసామాన్యులకు, అంతా మాయే అనీ, సర్వం భగవంతుని రూపమని గ్రంధాలు రాసే ఈ దేశపు అసామాన్యులకు, సాటి మనిషిలో మాత్రం ఎక్కడలేని మలినాలు కనిపిస్తుంటాయి. వాడు ముట్టుకుంటే అపవిత్రమైపోతామని, వాడి నీడ కాదు కదా గాలికూడా తాకగూడదని మడి కట్టుకుని,  కూర్చునే ఈ దేశపు అసామాన్యులకు చెవుల్లో మైకులు పెట్టి ఒక కథ వినిపించాలి. అట్టడుగున పడి కనిపి౦చని కథ, 'దళితుడు' అనబడే ఈ సామాన్యుడి కథ చెప్పాలి. కానీ అంతకంటే ముందు, కంటికి కనిపించని శక్తేదో అనుక్షణం పీక పిసికేస్తుంటే, పుట్టినప్పటి నుంచి చచ్చేదాకా ప్రతీచోట అణచివేత పొడచూపుతుంటే, తనకంటూ చేప్పుకోడానికి పేరు గొప్ప కులమేదీ లేని నిర్భాగ్యుడినే ఈ దేశపు అతి సామాన్యుడిగా మనం గుర్తించాలి. కంటికి కనిపించని ఆ రాక్షస శక్తే మనదేశపు కుల వ్యవస్థ అని గుర్తించాలి. అందుకే అలా మరుగున పడిన జీవితాల బాధల్నీ వ్యథల్నీ చరిత్రగా మలిచే పనిలో మనకు కవి ఎండ్లూరి సుదాకర్ కనిపిస్తాడు. "వ్యదార్థ జీవిత యదార్థ దృశ్యాలు పునాదులుగా భావి వేదాలు అవతరిస్తాయని" శ్రీశ్రీ అంటాడు. ఆ భావి వేదాలను కూర్చే మహర్షుల్లో ఒకడే ఎండ్లూరి సుధాకర్.

------
170 కుటుంబాలతో, 780 మందితో ఉన్న చిన్న గ్రామం అది. పేరు ఖైర్లాంజి. మహారాష్ట్ర లో నాగ్ పూర్ నుండి 120 కి.మీ దూరం. గ్రామంలో బ్రాహ్మణులూ వైశ్యులూ ఉన్నారో లేదో తెలియదు కానీ, ఓబీసి కి చెందిన కుంబీ కులం ( క్షత్రియ కులానికి దగ్గరిసంబంధం ఉన్న కులం ) వారిదే ఇక్కడ అంగ బలం లోనూ, అర్థ బలం లోనూ పైచేయి. దళితుల మీది అణచి వేత స్వరూపాల్లో వృద్ధి చెందిన భావజాలానికి ఫలానా కులంతో పనిలేదు. దళితుడు కాని వాడు ఎవడైన అగ్ర కులపు వాడే. అసామాన్యుడే. . అనుకోకుండా రెండే రెండు దళిత కుటుంబాలున్నాయి గ్రామంలో. భూట్మంగే భయ్యాలాల్ కుటుంబం ఒకటి. అతడు తన తల్లికిచెందిన ఐదెకరాల పొలం చూసుకోవటానికని 18 యేళ్ళ క్రితం ఖైర్లాంజీకొచ్చి స్థిరపడ్డవాడు. భార్య సురేఖ, తన రెక్కల కష్టం మీద భూమిని సాగు చేసింది. పిల్లల్ని పెంచింది. ఇద్దరు మగ పిల్లలు, ఒక ఆడ పిల్ల. రోషన్, సుధీర్, ప్రియాంకా. చిన్న గుడిసెలో అందమైన జీవితం. అందమైన కలలు. సుధీర్ డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగాల గురించి అందమైన భవిష్యత్తు గురించి కలలు కంటున్నాడు. ప్రియాంక స్కూలు చదువులు పూర్తి చేసుకుంది. NCC లో స్థానం సంపాదించింది. ఇండియన్ ఆర్మీ లో చేరి దేశానికి సేవ చేయాలని కలలు కంది. చేతికంది వస్తున్న ఎదుగుతున్న పిల్లల్ని చూసి ఆ తల్లిదండ్రులు మురిసిపోయారు. తక్కువ కులమని ఎవరెన్ని రకాలుగా చిన్న చూపు చూస్తున్నా, వాటన్నిటినీ ధైర్యంగా ఎదిరించి చదువుల్లో దూసుకుపోతున్న పిల్లల్ని చూసి గుండెల మీద చేతులు పెట్టుకుని హాయిగా నిద్రపోయేవారు. అంతో ఇంతో సాఫీగా సాగిపోతున్న తమ కుటుంబంలోకి కాలం కులోన్మాద రూపంలో ఒచ్చి కాటేస్తుందని ఆ తల్లిదండ్రులు అసలెపుడూ ఊహించి ఉండరు. ఎందుకంటే ఆ కుటుంబంలో ఇపుడు భూట్మాంగే భయ్యాలాల్ తప్ప ఎవరూ లేరు. అందరూ కుల రక్కసి విష కోరల్లో నిర్దాక్షిణ్యంగా నలిపివేయబడ్డారు. అదను చూసి కులం కాటు వేసే సమయానికి భయ్యాలాల్ తన ఇంట్లో  లేకపోవడంతో అతడొక్కడే మిగిలిపోయాడు. చరిత్రకు మౌన సాక్షిగా ఒంటరిగా నిలిచాడు. ఇపుడు ఆ గుడిసె లేదు, కుటుంబం లేదు. అందమైన కలలు కన్న చిన్నారి కన్నులు లేవు. ఒకరికొకరుగా జీవించిన జీవితం లేదు. ఇప్పుడున్నదంతా ఒక్కటే. విషాదం.  అతడి కల్లల్లో భయం తప్ప కళ లేదు. జీవితంలో సహచరితో చెప్పుకున్న ఊసులు, పిల్లలతో కలిసి పంచుకున్న ఆనందాలు ఏవీ ఒక్కటంటే ఒక్కటి కూడా మిగల్లేదు. అన్నీ కన్నీళ్లై కారి పోయాయి. చెంపల మీదే ఎండిపోయాయి.  పలుకరిస్తే అతడు వణికిపోతున్నాడు. మనుషులలో మానవత్వం చచ్చి పోయిందని తెలుసుకున్నాడు. ప్రపంచం వైపు బేల చూపులు చూస్తున్నాడు. ప్రపంచంలో తామూ అందరిలాగానే మానవులుగా, మానవుల మధ్యే కదా పుట్టారు. మరెందుకు ఈ దేశం తమని తక్కువ గా చూస్తుంది?. తమకు అంటించబడిన కులం ఎందుకు తమను అంటరానివారిగా వెలి వేస్తుంది?. సమాధానం తెలియదు. సమస్యను చర్చిస్తూ మూలాల్లో సమాధానాన్ని కూడా సూచించే వాడే కవి. ఎండ్లూరి సుధాకర్ ఈ కవితలో అదే చేశాడు. ఆత్మ గౌరవంతో బతకగలిగిన కొత్త దేశం సృష్టించుకోవాలని ఆశ పడుతూనే కుల రక్కసి మూలాల్ని కుదిపే ప్రయత్నం చేశాడు.

ఏదైనా కొత్త దేశం సృష్టించుకోవాలనుంది
ఆత్మ గౌరవంగా బతకాలనుంది.

అది 2006 వ సంవత్సరం. పురాతన కాలం అంతమయి, ఎన్నో వేల సంవత్సరాలు గడిచిన తరువాత, "కుల వివక్షతనా? అదెక్కడుంది?" అని అందంగా అడుగుతున్న మనుషులుండే 'ఆధునిక యుగం' అని చెప్పబడుతున్న ఈ మధ్య కాలం నాటి ఒక సంవత్సరం. ఒకరోజు  తన ఐదెకరాల పొలంలో పని చేసుకుంటున్న సురేఖ, తమ పక్కనున్న పొలం వారు తమ పొలంలో కొంత భాగాన్ని కబ్జా చేస్తుండటం గమనించింది. ఇదేం పని అని వారిని నిలదీసింది. మామూలుగా ఎక్కడైనా ఇటువంటి సంఘటనలు జరిగితే ఇద్దరు మనుషుల మధ్యన జరిగిందనుకుంటాం. కానీ మన దేశంలో ఎవరి కులం ఏమిటనేది ప్రధాన విషయమవుతుంది. సురేఖ దళితురాలు. వారు చేసింది తప్ప ఒప్పా అనేది కాదు.  "ఒక దళితురాలు అగ్ర కులం వారిని ప్రశ్నించటమా?". ఇదే ఇక్కడున్న ఆధిపత్య భావజాలం. అందుకే  అక్కడ భూమికి సంబంధించిన వివాదం క్షణంలోని నూరోవంతు సమయంలో కుల వివాదంలా మారిపోయింది. ఇదే భావజాలం గ్రామంలోని అగ్రకులాల వారినందరిని ఏకం చేసింది. ఎదురు తిరిగిన సామాన్యురాలికి జవాబిచ్చేందుకు వేట కొడవళ్ళ ని సిద్ధం చేసుకునేలా చేసింది. ఒకరోజు సాయంత్రం, సురేఖ తన పిల్లలతో కబుర్లాడుతూ  రాత్రి వంటకు రంగం సిద్ధం చేసుకుంటున్న తరుణంలో ముందే సిద్ధం చేసుకున్న పథకం ప్రకారం కొందరు భయ్యాలాల్ లేని సమయం చూసుకుని ముష్కరుల్లాగా ఇంట్లోకి దూరారు. ఇంట్లో ఉన్న నలుగురినీ కర్రలతో చితకబాదారు. అందరినీ వివస్త్రలను చేసి, ఊరి నడి బొడ్డువరకు లాక్కుని పోయారు. సురేఖనూ, ముక్కుపచ్చలారని పసి తల్లి ప్రియాంకనూ మానభంగం చేశారు. వారి మర్మాంగాలలోకి కర్రలు దూర్చి చిత్ర వధ చేసి అతి దారుణంగా కర్కశంగా చంపేశారు. అక్కడొక భయానక వాతావరణమే నెలకొని వుంది. కానీ కవి అంతకు మించిన భయానక విషయాన్ని మనకీ కవితలో పరిచయం చేస్తాడు.

ఈ మారణ కాండ ఊరిలో అందరిముందూ జరిగింది. ఊరి అగ్రకుల ఆడవారు తమ మొగుళ్ళు తోడేల్లలా  తల్లీ కూతుల్ల పై, అఘాయిత్యం చేస్తుంటే ఏమిటిది? అని తమ మొగుళ్ళని అడిగిన పాపాన పోలేదు. చంపండి, నరకండి, చావగొట్టండని తమ మొగుళ్ళను రెచ్చగొట్టారు. వాళ్ళలోని స్త్రీత్వాల్ని ఏ దేవీ దేవతలు వచ్చి తట్టి లేపలేదు. వారిలోని మాతృత్వాల్ని ఏ సీతా సావిత్రులు ప్రోది చేయలేదు. సృష్టిలో అందమైన స్త్రీత్వం కానీ, తీయనైన మాతృత్వంకానీ ఆ సమయంలో ఎందుకు వారిలో మేలుకోలేదో ఆలోచిస్తే, ఈ స్త్రీత్వాల వెనుక, మాతృత్వాల వెనుక కుల రక్కసి కోరలు చాచి భగవంతుడిచ్చిన ఈ అమృత తత్వాల్ని ఆక్రమించి ఉండటం కనిపిస్తుంది. స్త్రీత్వమూ, మాతృత్వమూ కోల్పోయిన ఈ అగ్ర వర్ణ స్త్రీలను చూచి దేవతలు కూడా ఈ దేశం నుంచి పారిపోయి వుంటారు అంటాడు కవి.

మీరు నడిచిన నెత్తుటి నేల మీద కాలు నిలపలేక
బహుశా దేవతలు కూడా
ఈ రాత్రి శాశ్వతంగా
ఆర్యభూమి  విడిచి పారిపోయుంటారు

ఈ దారుణ హింసా కాండ జరిగాక గ్రామంలో అందరూ మీటింగు పెట్టుకున్నారు. జరిగిన విషయం బయటకు పొక్కకూడదని ఎవరూ ఈ విషయం మీద మాట్లాడకూడదని తీర్మానం చేసుకున్నారు. కానీ తరువాత ఎలాగో బయటి ప్రపంచానికి ఈ విషయం తెలిసింది. పోలీసులు ఎప్పటిలానే కొంతమందిని అరెస్ట్ చేశారు, ఆ తరువాత కోర్టులూ ఎప్పటిలాగానే స్పందించాయి. ఈ మారణకాండ వెనుక తాత్కాలిక ఆవేశ ఉద్రేకాలే ఉన్నాయిగానీ, కుల ప్రసక్తి లేనే లేదని తేల్చేశాయి. అసలు ఆడవారి మీద మానభంగమేదీ జరగలేదని పోస్ట్ మార్టం రిపోర్టులు వచ్చాయి. గ్రామమనే ప్రపంచం మొత్తం చూసిన నగ్న సత్యం న్యాయ దేవత కళ్ళ గంతలముందు కులం దుస్తులేసుకుని నిలబడింది. అయినా కవికి అర్థం కాని భయంకర విషయం ఒక్కటే.  తోటి ఆడవారిని తమ కళ్ళ ముందు మానభంగాలు చేసి మర్మాంగాలని పనస పొట్టులా తరిగేస్తుంటే, చూస్తూ ఎలా నిలబడ్డారీ అగ్రకుల ఆడవారనేది. అదే ఈ కవిత. ""బానిస విముక్తి యజమానిని మనిషిని చేయడానికే" అన్నాడు పాలో ఫియరే. దళిత సాహిత్య రూపంలో వచ్చిన వస్తున్న అణగారిన కులాల చైతన్యం, దళిత ధిక్కార స్వరం కనీసం ఒక్క అగ్రకులం వాడినయినా మనిషిగా మారుస్తుందా అన్నదే ఇపుడు మనముందున్న అసలు ప్రశ్న. దళితుడి పోరాటం మానవత్వాన్ని పునః ప్రతిష్టించుకోవడానికే అనే విషయం కనీసం అగ్రకులాల మాతృమూర్తులు గుర్తించగలిగినా మార్పు వస్తుంది అనిపిస్తుంది. అందుకే కవి ఆ మాతృమూర్తులనే అడుగుతున్నాడీ కవితలో. నిజానికి ఈ కవితే సమస్యకు పరిష్కారం కూడా. పిల్లలకు మొదటి గురువు తల్లే కదా!!

దుఃఖైర్లాంజి

      డాll ఎండ్లూరి సుధాకర్. (18/12/2006)

ఆ రాత్రి ఆకాశంలో నెత్తుటి వెన్నెల కురిసింది
ఆ రాత్రి మట్టి మాంసం ముద్దగా మారింది
ఆ రాత్రి నిలువెత్తు నీలి విగ్రహం నీరైపోయింది
ఆ రాత్రి ఆత్మగౌరవం ఆయుధం కాలేక విలపించింది
అంత దారుణం ఎంతలా జరిగిపోయింది
ఒక ఆదిమ కాలపు
భయావహ జంతుజాలపు ఊచకోతల రక్తజ్వాల
కళ్ళ ముందు కదులుతున్నట్టే వుంది
మేక పిల్లను కోసినట్లు
కోడిపెట్టను గావు పట్టినట్లు
వేట కొడవళ్ళ తో గాయపరచినట్లు
దయలేని దేశంలో
నిర్దయగా దళితుల్ని చంపడం ఎంత తేలికైపోయింది
గొడ్ల కోసే చేతికి కూడా
గుండె ఉంటుంది కదా
మాంసం కొట్టే కత్తికి సైతం
మనసు వుంటుంది కదా
పూలు కోసే చేతులు
పూజలు చేసే చేతులు
పుణ్యం చేసే చేతులు
ఎంత పని చేశాయి?
హే రామ్! వేదభూమి కూడా
ఎంత క్రూరభూమిగ రూపమెత్తింది
కోమలత్వం కూడా
రాక్షసత్వంగా మారిపోతోంది
చంపండి నరకండి
చావగొట్టండని
మగ మదమృగాల్ని
ఎలా ఉసి గొల్పారమ్మా?
పైట జారితేనే ఉలిక్కిపడి
పాతివ్రత్యానికి భంగం కలిగిందనుకునే
కులాంగనలు కదా!
సాటి స్త్రీ స్తనాలను
గొడ్డళ్ళ త అడ్డంగా నరుకుతుంటే
అడ్డం పడాల్సింది పోయి
తల్లీ కూతుళ్ళ ని
కళ్ళెదుటే మానభంగం చేయమని
మంత్రాలు పలికిన నోళ్ళతో
మద్దతునెలా పలికారమ్మా?
కత్తులతో బరిసెలతో కర్రలతో
వూరు వూరంతా పూనకంతో
శరీరాంగాల్నీ మర్మాంగాల్నీ
పనస పొట్టులా తరుగుతుంటే
ఇంత దారుణాన్ని
ఆ రాత్రి రాతిగుండెలతో
ఎంత నిబ్బరంగా చూడగలిగారు తల్లీ?
రాక్షస స్త్రీలు కూడా మీముందు బలాదూరే!
అయ్యో! ఆపలేకపోయారా తల్లీ!
అపర దేవతల్లా మిమ్మల్ని పూజించే వాళ్ళం
ఏ ఆర్తనాదాలూ తల్లి పేగుల్ని కదిలించలేదా తల్లీ
మీరు నడిచిన నెత్తుటి నేల మీద కాలు నిలుపలేక
బహుశా దేవతలు కూడా
ఆ రాత్రి శాశ్వతంగా
ఆర్యభూమి విడిచి పారిపోయుంటారు
మాకు మాతృత్వాల మీద
మానవీయ మమకారాల మీద
మానవత్వాల మీద
నమ్మకం పోయింది తల్లీ!
ఆడత్వాల వెనుక కూడా హిందుత్వాల
వర్ణ తత్వాల శతృత్వాలుంటాయని
ఇంత కిరాతకత్వం దాగుంటుందని
ఇపుడిపుడే తెలుసుకుంటున్నాం తల్లీ
అమ్మా మీరు మా వూరి స్త్రీలకు ఆదర్శం కావద్దు
అగ్నికి ఆజ్యం పోసినట్టే వుంటుంది
పల్లెల్లో పేటల్లో అంటరాని వీధుల్లో
మా శరీరాలు ప్రాణాలతో తిరగవు
మీ గాలి సోకితే
మా ఆడబిడ్డలకు ఎండిన స్తనాలు కూడా మిగలవు
నరికిన నెత్తుటి ముద్దల్లాంటి
ఆసుపత్రి ప్రాంగణాల్లో
మా బాలింతల రక్తాశ్రువులు
కళ్ళ లోంచి కాదు
పాల గుండెల్లోంచి వర్షిస్తున్నాయి
భరతమాతా! దుఃఖంగా వుంది
బాపూ! బాధగా వుంది
బాబా! భగభగ మండుతోంది
ఏదైనా ఒక కొత్త దేశాన్ని సృష్టించుకోవాలనుంది
ఆత్మ గౌరవంగా బతకాలనుంది
కనీసం అక్కడైనా
మా మర్మాంగాలూ దేహాంగాలూ భద్రంగా వుంటాయి.

కవిత్వ సందర్బ౦21
15/6/16

No comments:

Post a Comment