విరించి ll గుండెలనిండా జీవితం ll
.............................................
"డాక్టర్ గారూ...మా అమ్మాయి కి జ్వరం ఒచ్చిందండీ ,తగ్గటానికి మందులు రాసీయండి" అంటూ ఒక నలభైయ్యేళ్ళ లావుపాటి మహిళ క్లినిక్ లోకి రొప్పుతూ ఒచ్చేసింది. ఆమెకు మల్లే ఇంకో లావు పాటి హేండ్ బాగ్ ని భుజానికి తగిలించుకుని ఉంది. చమటలు కక్కుతూ నిలబడుకుని ఉన్న ఆమెని ఆ చలి కాలపు సాయంత్ర వేళ చూస్తుంటే, ఒక్క క్షణం ఇది వేసవి కాలమా అన్నట్టు అనిపించింది. ఊబకాయం వల్లనే ఆమెకి ఆ ఆయాసం చెమటలూ ఉండిండొచ్చు. అంత ఆయాసంలో కూడా నన్ను తదేకంగా చూస్తూ ఆమె అడిగిన విధానం 'మందులు ఇస్తావా చస్తావా' అన్నట్టు వుంది. కూర్చోమని చెప్పేలోపు ఆమే అంది, "నాకు కూర్చోడానికి కూడా టైంలేదు డాక్టర్..ఇంకా చాలా దూరం వెల్లాలి, త్వరగా ప్రిస్క్రిప్షన్ రాయండి డబ్బులిచ్చేస్తాను" అని టకటకా చప్పేసింది. 'డబ్బలిచ్చేస్తాను' అనే మాట మాత్రం వెటకారంగా అన్నదో..ఇంకే విధంగా అన్నదో నాకు అర్థం కాలేదు. లోపలికొచ్చిన ఒక్క క్షణంలోనే..నేను డబ్బులీయందే మందులు రాసివ్వనని అనుకుందో...లేక డబ్బులు పడేస్తే రాయక ఏంచేస్తాడు..అన్న ధీమానో నాకర్థం కాలేదు. ఆమె పేషంటు అయిన తన కూతురుని తీసుకరాలేదట ఆమెని చూడకుండానే నేను మందులు రాసియ్యాలట. అలా పేషంటుని చూడనిది, హిస్టరీ ఫిజికల్ ఎక్జామినేషన్ అయ్యాక వ్యాధి నిర్ధారణ చేసికానీ మందులు ఇవ్వలేమని నేను ఓపిగా చెబుదామన్నా ఆమె వినే స్థితిలో నాకు కనపడలేదు. "ప్లీజ్ డాక్టర్ గారూ ప్రిస్క్రిప్షన్ రాయండి" అంది. నిజానికి అది అభ్యర్థన గా కన్నా ఆర్డర్ లాగా అనిపించింది. ఇరవై రెండు సంవత్సరాల అమ్మాయట, రెండు రోజులుగా దగ్గు జలుబు జ్వరమూ వస్తున్నాయట. నిజానికి ఇలా ఎవరు రాసీయమని అడిగినా, కాదనే వాణ్ణేమో..ఎందుకంటే ఒక డాక్టరుగా ఉన్న నేను ఇలా మెడికల్ షాపువాడి పని చేయాల్సి ఒస్తే అరిచయినా సరే పేషంట్ని తీసుకు రమ్మని పేషంట్ని చూస్తేనే మందులు రాసిస్తాననీ ఖరాఖండీగా చెప్పేవాణ్ణి. కానీ ఈమె, ఈమె ఊబకాయమూ, ఈమె ఆయాసమూ, కల్లలోకి సూటిగా చూసే ఆ విధానమూ, రిక్వెస్ట్ ని ఆర్డరాలా జారీ చేసే ఈమె గొంతుకా..అన్నీ కలిసి నన్ను హిప్నాటై చేసినట్టున్నాయి. ఆంటీబయాటిక్స్ తో పాటు ఇంకా కొన్ని మందులు అయిదు రోజులకని రాసిచ్చాను. "థాంక్స్ " అని ఆ కాగితం తీసుకుని, వంద రూపాయలు టేబుల్ మీద పెట్టేసి గబా గబా నడుచుకుంటూ వెళ్ళి పోయింది. కానీ థాంక్స్ అన్న విధానంలో కానీ, అలా అంటూ నవ్విన విధానంలో కానీ ఎంతో కృతజ్ఞత ఆమె కళ్ళల్లో కనబడింది. ఏమిటో మనుషులు అర్థం కారు అంత త్వరగా.
అయిదు రోజుల తర్వాత ఇంతకు ముందులాగే సరిగ్గా సాయంత్రం క్లినిక్ మొదలయ్యే ఐదు గంటలకే ఆమె మళ్ళీ వచ్చింది. నేను అపుడే నా క్లినిక్ ఓపెన్ చేసుకుని కుర్చీలో కూర్చుని టేబుల్ సర్దుకుంటున్నాను. కొత్తగా పెట్టిన క్లినిక్ కావడం వల్ల డాక్టర్ గా ఈగలూ దోమలూ కూడా దులుపుకోవడం నేర్చుకోవాలి కదా..! కొంతకాలం పోయాక పరిస్థితులు మారుతాయనుకోండి, అది వేరే సంగతి. కానీ ఆమె లో అప్పుడున్నంత ఆదుర్దా కనపడలేదు. తన కూతురికి జ్వరమూ దగ్గూ తగ్గాయట. కృతజ్ఞతలు తెలపడానికని వచ్చిందట. జబ్బు ఒచ్చినపుడు మాత్రమే వచ్చే పేషంట్స్..జబ్బు తగ్గాక డాక్టరుకి కృతజ్ఞతలు తెలుపుకోవడానికి రావడమన్నది చాలా అరుదు. అలా కృతజ్ఞతలు తెలిపే వారు ఉన్నపుడు డాక్టర్ వృత్తిలోని ఆనందం తెలుస్తూ ఉంటుంది. కానీ ఆ ఆనందం ఎపుడో కానీ దొరకదు. ఈ సారి కూడా తన కూతురుని తను తీసుకు రాలేదు. ఇరవై అయిదేళ్ళ కుర్ర డాక్టర్ దగ్గరికి ఇరవై రెండేళ్ళ వాళ్ళ అమ్మాయిని తీసుకు రావటం ఆమెకి ఇష్టం లేదేమో.
"డాక్టర్ గారూ నాకు కాస్త బీపీ చూస్తారా?" వినయంగా అడిగిందామె కుర్చీలో కూర్చుంటూ. చూశాను. నేను ఎంతుందో చెప్పేలోపల ఆమే అంది. "ఎక్కువగా ఉంది కదండీ...నాకు తప్పక ఎక్కువగానే ఉంటుంది. నూటా అరవై దాటే వుంటుంది" అన్నది. మీకెలా తెలుసు అని అనే లోపల "నాకెలా తెలుసనుకుంటున్నారా..?నాకుండే ప్రాబ్లమ్స్ అలా ఉంటాయండీ..నాకు తెలుస్తుంటుంది. బీపీ పెరిగితే కాస్త కళ్ళు తిరుగుతున్నట్టుగా..కాస్త తలనొప్పిగా ఉంటుంది" . బీపీ కి మందులేమైనా వాడుతున్నారా అని అడిగాను. "లేదండీ..ఎందుకండీ దండగ..ఎప్పటికయినా పోయేదే కదా..బతికి ఏమి ఉద్దరిస్తాం చెప్పండి". అంటూనే ఆమె వాచి చూసుకుంటూ "అయ్యో అయిదున్నర అయిందండీ నేను వెల్లాలి. బస్సు మిస్సయితే మళ్ళీ గంటకిగానీ రాదు. ఒకప్పుడు ఎంచక్కా రాత్రి పది గంటలకు ఇంటికి పోయేదాన్ని. ఇపుడు తప్పని సరి ఆరింటికల్లా ఇంటికి వెళ్ళాల్సి వస్తుంది డాక్టర్ గారు...సరే ఉంటాను. మీ ఫీజు ఈ సారి ఒచ్చినపుడిస్తాను. ఇప్పటిదీ అప్పటిదీ ఒకే సారి కలిపిస్తాను. థ్యాంక్యూ డాక్టర్" అంటూ ఎంత వేగంగా వచ్చిందో అంతే వేగంగా ఆ లావు హాండ్ బాగ్ తగిలించుకుని నడుస్తూ వెళ్ళిపోయాందామె. ఈ సారి కూడా ఆమె థ్యాంక్స్ చెప్పే విధానం లో, ఇంతకు ముందు కన్నా ఎక్కువగానే కృతజ్ఞత కనిపించింది. బీపీ ఉందని తెలిసికూడా ఈమె మందులు ఎందుకు వాడటం లేదో నాకు అర్థం అవలేదు. ఏదీ..! నన్నేమయినా మాట్లాడనిస్తేనే కదా..మరీ కుర్ర డాక్టర్ ల పరిస్థితి ఇంతేనేమో..పేషంట్సే హిప్నాటైజ్ చేసి వాళ్ళకి కావాల్సిన పనులు చేయించుకుని పోతారేమో. వాళ్ళ అమ్మాయికి జ్వరం తగ్గిందిగా ఇప్పట్లో ఆమె ఇంకేం వస్తుంది అనుకుని అలా ఒక పదినిముషాలు కళ్ళు మూసుకుని కూర్చున్నానో లేదో.."డాక్టర్ గారూ.." అన్న పిలుపు విని తలెత్తి చూశాను. ఎదురుగా ఆమే...
"నా కూరగాయల బాగ్ మరచి పోయానండీ..." అంటూ రొప్పుతూ వచ్చి కూర్చుంది. "నాకు ఈ మధ్య మతిమరుపు పెరిగిపోయిందండీ...అసలు ఏం చేస్తున్నానో కూడా అర్థం కాదు ఒక్కోసారి. చూశారా బస్సు అందుకోవాలనే తొందరలో కూరగాయల బాగ్ ఇక్కడే మరచిపోయాను మళ్ళీ రావాల్సి వచ్చింది. కాస్త నీళ్ళిస్తారా" అన్నది చెమటలు తుడుచుకుంటూ..నిజానికి ఆమె ఆ బాగ్ ని టేబుల్ కి అవతలి వైపు పెట్టడం వల్ల నాకు అసలు కనిపించనే లేదు. నీళ్ళు తాగాక నింపాదిగా అంది. "బస్ మిస్ అయిందండీ..మళ్ళీ గంటకి ఉంది డైరెక్ట్ మల్కాజ్గిరికి" . ఆమె మాట్లాడతూ ఉంటే నాకు ఊహూ కొట్టడమే సరిపోయింది. ఇంత లావు శరీరంపెట్టుకుని ఆమె రెండు మూడు బస్సులు మారలేదట. అందుకే డైరెక్ట్ బస్ల నే ప్రిఫర్ చేస్తుందట. ఆమె వాలకం చూస్టుంటే నెక్స్ట్ బస్ టైం అయ్యే వరకూ ఇక్కడే తిష్ట వేసేలా అనిపించింది. ఆమె గవర్నమెంటు జాబ్ చేస్తుందట. ఉదయం తొమ్మిది నుండి నాలుగు వరకు జాబ్ చూసుకుని, ఒక గంట కూరగాయలూ గట్రా కొనుక్కుని అయిదున్నరకి దొరికే బస్ కి రోజూ వెళ్తుందట. ప్రపంచంలో ఇంతకు మించిన గొప్ప విషయాలేమీ ఆమె జీవితంలో లేవేమో అనుకున్నాను. లేక పోతే లేకపోయాయి, అవన్నీ నాతో ఎందుకు చెబుతుందో అనుకున్నాను.
"ఒకప్పుడు హాయిగా పది గంటలకు ఇంటికెల్లేదాన్ని అన్నారు, అప్పుడు వేరే జాబ్లో ఉన్నారా" అని అడగాలి కాబట్టి అడిగాను తప్ప ఏదో తెలుసుకోవాలనైతే కాదు. కానీ ఆమె ఊహించని విధంగా సడెన్ గా ఆమె నిశ్శబ్దంగా ఐపోయింది. "లేదండీ డాక్టర్ గారూ అయిదేళ్ళ క్రితం మా ఆయన చనిిపోయారండీ...హార్ట్ అటాక్ వచ్చి సడన్ గా చనిపోయారండీ...చిన్న వయసులో అలా వస్తుందా అండీ.." ఆమె కళ్ళల్లో నీళ్ళు పెట్టుకుని అమాయకంగా ముఖం పెట్టుకుని అడిగింది. మళ్ళీ ఆమే అంది. "వస్తుందట కదండీ..కార్డియాలజిస్ట్ కూడా చెప్పాడు" అని ఇంకా బొంగురు పోయిన గొంతుకతో అంది. అయ్యో ఏడవకండి అని తప్ప నేనేమీ అనలేక పోతున్నా, నిజానికి కొత్తగా ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన నాకు ఇలాంటి సందర్భంలో ఎలా రియాక్ట్ కావాలో తెలియక కాస్త ఇబ్బందిగానే వుంది. "మాది లవ్ మారేజ్ అండీ...మా ఆయన నేను ఎంత బాగా ఉండే వారిమో..నేను అపుడు ఇలా లావుగా లేను సర్..సన్నగా అందంగా ఉండేదాన్ని..అందరూ చిరంజీవి సుహాసిని లా ఉంది జంట అనేవారు. కానీ ఈ ఘోరం జరిగి పోయిందండీ...అప్పట్లో నేనూ మా ఆయనా ఆఫీస్ వర్క్ చూసుకుని సాయంత్రం ఆరు కల్లా ఇంటికి వచ్చేసే వాళ్ళము. మా అమ్మాయితో ఆడుకుంటూ పెరట్లో మొక్కల్ని చూసుకుంటూ అందమైన సాయంత్రాల్ని గడిపేసేవారం. ఆయన ప్రకృతి ప్రేమికుడు, ఇంటి పెరటి చుట్టూ ఎన్నో రకరకాల పూల మొక్కలు నాటేవాడు. వాటిని ఎంత బాగా పెంచేవాడో..ఆ పూలన్నీ నేనూ మా అమ్మాయీ అందంగా జడలో అలంకరించుకునేవాళ్ళం...ఆయన ఎంతగా మురిసిపోయేవాడో...మాకు సినిమాలూ షికార్లూ టీవీలూ పట్టేవి కాదు. మేము ముగ్గురం ఉన్నామంటే..అదే ఒక అందమైన సినిమా అయ్యేది. ఆయనెప్పుడూ ఓ మాట అనేవాడు ..ఇది మీరు కూడా గుర్తు పెట్టుకోండి. "ఈ పై పై జీవితాలన్నీ బోలు మనుషులకే. గుండెలనిండా జీవితాన్ని ఆస్వాదించేవాడికి బోర్ అనేదెందుకుంటుంది. అలా పైపైన జీవించే వారికోసమే ఈ టీవీలు, సినిమాలూ..." అనేవారు. అందరం కలిసి వంట,చేసుకుని కలిసి తినేవాళ్ళం....చెప్పాను కదండీ...అవి జీవితంలో మధురమైన సాయంత్రాలు....మాకు కాకుండా చేశాడా దేవుడు....నేను ఇంట్లోని దేవుని పటాలన్నీ బయట పడేశానండీ.." అని ఏదో చెప్పబోతుండగా నేనె అడిగాను. మరి హాయిగా రాత్రి పదింటికి ఇంటికి పోయేదాన్ని అన్నారుగా అని.
"అలాంటి ఆ యింటికి ఆరు గంటలకి ఎలా పోగలను చెప్పండి?. నా భర్త లేని ఆ యింటికి ఆఫీసు అయిపోగానే ఆరు గంటలకు ఎలా పోగలను చెప్పండి?. ఆ చెట్లనూ ఆ పూవులను చూస్తూ..ఆ మధురమైన సాయంత్రాల్ని గుండెలనిండా పీల్చిన ఆ యింటికి..నా భర్త లేకుండా..ఎలా ఆరు గంటల కల్లా పొమ్మంటారు చెప్పండి?.." ఆమె కన్నీళ్ళలాగా ప్రవహిస్తోంది. ఆ ప్రవాహంలో నా గుండె కూడా కొట్టుకు పోయేలా వుంది. "ఆఫీసు అయ్యాక నరకం అనిపించేది. ఇప్పటిలా డైరెక్ట్ బస్సు కాకుండా.. ఒక బస్సు తరువాత ఇంకో బస్సు మారేదాన్ని..పిచ్చిదానిలా కావాలనే దిగిన బస్సునే మళ్ళీ ఎక్కి మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ ఇంకో బస్సులో ఇంకో చోటకు పోయి..." ఆమె గట్టిగా ఏడవటం నన్ను కలచివేసింది..ముక్కు తుడుచుకుంటు చెబుతూనే వుంది.." ఆ స్మృతలూ..ఆయన జ్ఞాపకాలూ అణువణువున ఉన్న ఆ యింటిని చేరటం చాలా నరకంలాగా ఉండేది. నాకే కాదు మా అమ్మాయికి కూడా అంతే.అందుకే..ఆఫీసు వదిలినప్పటినుంచి రాత్రి పది అయ్యే దాకా ఆ యింటి ఛాయలకి కూడా పోకుండా బస్సుల్లో తిరిగేదాన్ని. మా అమ్మాయి కూడా కాలేజీ నుంచి పది తరువాతే ఇంటికి ఒచ్చేది. నేను అలా ఇంటికి వెళ్ళ లేక బస్సుల్లో ఎటెటో తిరుగుతున్నపుడు, మా ఆయన ఇంట్లోనే ఉన్నాడేమో అనే తలంపు ఒకటి మనసులో మెదులుతూ ఉండేది. నిజానికి అదొక అవాస్తవం. కానీ ఆ అవాస్తవంలో ఎంత ఊరట ఉండేదో.. మాకు సినిమాలకి పోబుద్ది అయ్యేదికాదు..టీవీ చూడ బుద్ది కాదు..అలాంటి వ్యాపకాలు పెట్టుకున్నా కాస్త మరచిపోయేవాళ్ళమేమో..కానీ మేము అటువంటి వాటికల్లా దూరంగానే ఉన్నాము..ఎందుకంటే..గుండెలనిండా జీవితాన్ని మేము ఆస్వాదించాలనేగా ఆయన కోరుకున్నది.." చేతుల్ని ముఖంనిండా కప్పుకుని ఆమె ఏడవ సాగింది. ఒక చేయితో ఆమె చేయిని తాకాను ఓదార్పుగా..అంతకుమించి నేను మాత్రం ఏమీ చేయలేననే అనిపించింది. కొన్ని క్షణాలు మౌనాల్ని పూసుకున్నాయి. ఆమె వాచీ చూసుకుంది. ముఖం అంతా కర్ఛీఫ్ తో తుడుచుకుంది. "డాక్టర్ గారూ నేను వెళ్తానండీ..నాకు బస్ కి టైం అయింది. మా అమ్మాయి ఒక్కతే ఎదురు చూస్తుంటుంది" అంటూ ఇందాకాటి హడావుడిగానే ఆ లావు హాండ్ బాగ్ ని మోసుకుంటూనే వెళ్ళి పోయింది. అయితే కూరగాయల బాగ్ తో పాటే వెళ్ళింది ఈసారి. ఏదో తెలియని స్తబ్దత నన్ను ఆవరించినట్టు అనిపించింది. ఒకరికోసం ఒకరు బ్రతికే వీళ్ళకి దేవుడు అన్యాయమే చేశాడు. ఆమె దేవుని పటాల్ని బయట పడేయటంలో తప్పే లేదనిపించింది. కానీ ఇపుడు పరిస్థితులు మారాయేమో..ఆరు గంటల కల్లా ఇంటికి వెళ్ళ గలుగుతోందంటే..ఆ బాధలోనుంచి బయట పడ్డారేమో ఇద్దరూ..ఎందుకో వాళ్ళ అమ్మాయిని కూడా ఒకసారి చూడాలనిపించింది. మళ్ళీ ఎపుడు వస్తుందో ఈమె అనుకున్నాను.
కానీ ఆశ్చర్యంగా మరుసటి రోజే కనబడిందామె. మళ్ళీ అదే అయిదు గంటలకి. ఒక ఆత్మీయ స్నేహం మా మధ్యన ఏర్పడిందేమో అనిపించింది. డాక్టరుకీ రోగికీ ఉండే సంబంధము చాలా వింతయినది. అది స్నేహమూ కాదు, బంధుత్వమూ కాదు. ఒక మనిషికీ ఇంకో మనిషికీ మధ్య ఉండే సాధారణ అస్తిత్వ సంబంధమూ కాదు ..మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని మార్క్స్ నిర్వచించిన సంబంధమూ కాదు. అదేదో కొత్తది. నిర్వచించలేనిది కాబట్టి 'దైవికమైనది' అని సాధారణీకరించి వదిలేయొచ్చేమో. "డాక్టర్ గారూ మా అమ్మాయి మిమ్మల్ని చూస్తానన్నది. అందుకే వెంట తీసుకుని వచ్చా ..రామ్మా..! అని బయట ఉన్న ఆమెని లోపలికి పిలుస్తూ అంది. సాధారణంగా యుక్త వయసులో ఉన్నాను కాబట్టి, ఈ ఇరవై రెండేళ్ళ అమ్మాయి ఎంత అందంగా ఉంటుందో అనే ఉత్సుకతలాంటిదేదో నాలో నాకే కనబడింది. తల నిండా స్కార్ఫ్ చుట్టుకుని కళ్ళు మాత్రమే, అదికూడా చాలా కొద్దిగా మాత్రమే కనిపించేలా లోపలికి వస్తోన్న ఆమెను ఆమె అందాన్ని నేనెలా చూడగలను. పైగా కాస్త కుంటుతూ కూడా నడుస్తోంది. 'నమస్కారం డాక్టర్' అని ఆమె నమస్కారం పెట్టినపుడు రెండు విషయాల్ని నా డాక్టర్ బుద్ది ఠకీమని గుర్తించగలిగింది. ఒకటి- ఆమె చేతులు కూడా కనపడకుండా గ్లోవ్స్ వేసుకుని వుంది. రెండు- ఆమె నమస్కారం డాక్టర్ అన్నపుడు ఆమె కాస్త నత్తిగానే అన్నది. ఒక రకంగా దాన్ని డిసార్త్రియా అనొచ్చేమో. కొద్దిగా అందమైన అమ్మాయిని చూస్తానేమో అనుకున్న నా మనసుకి ఏదో బలమైన దెబ్బే తగిలినట్టు అనిపించింది. కానీ ఆమె ఇంకా దగ్గుతూనే వుంది. పూర్తిగా దగ్గు తగ్గినట్టులేదు..వాళ్ళమ్మ ఆ అమ్మాయి చదువుల గురించి నాతో చెబుతున్నంత సేపూ ఆ అమ్మాయి దగ్గుతూనే వుంది. ఇంకా దగ్గు తగ్గలేదా అని అడిగాను. దానికి వాళ్ళమ్మ సమాధానం చెప్పింది. ఆ అమ్మాయికి దగ్గటం కొత్తేమీ కాదట. ఎప్పట్నించో అలాగే ఉందట. నేను టీబీ ఏమైనా ఉందేమో అనుకున్నా..కానీ హిస్టరీ అడిగితే అలాంటి లక్షణాలయితే ఏమీ లేవు కాస్త దగ్గుతప్ప. కానీ ఎంత సేపయినా వాళ్ళమ్మే మాట్లాడుతోంది తప్ప ఆ అమ్మాయి మాట్లాడటం లేదు. నేను ఆ అమ్మాయికే ప్రశ్నలు వేసినా సమాధానం వీళ్ళ అమ్మ దగ్గరినుండే వస్తోంది. కాసేపయాక నేను మీ స్కార్ఫ్ తీయండి...కళ్ళు, నాలిక పరీక్ష చేయాలి అన్నాను. ఇద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఆ అమ్మాయి మెల్లిగా కట్టు విప్పితున్నట్టుగా స్కార్ఫ్ విప్పేస్తోంది. నా కళ్ళను నేనే నమ్మలేక పోయాను. ఆమె మొఖం అంతా కాలి పోయి వుంది. కళ్ళు చిన్నవిగా అయిపోయినై. చెంపల మీద గొంతు మీద చర్మం మందంగా నల్లగా కమిలిపోయి చారలుగా కనిపిస్తోంది. పెదవులు ఒక వైపు ఒకదానికొకటి అతుక్కుని పోయివున్నాయి. రెండోవైపు అలా లేకపోవటంవల్ల ఈ వైపు ఉబ్బి ఉన్నాయి. నా ఊహకీ కంటిముందున్న వాస్తవానికీ పోలికే లేదు. ఆమెను చూసి ఆ కన్న తల్లి బోరున ఏడ్చేసింది. ఊబ కాయంతో బలవంతంగా లేచి ఆమె సెల్ ఫోన్ లోని ఆ అమ్మాయి ఫోటో చూపిస్తూ.."చూడండి ఎలాంటి పిల్ల ఎలాగయిందో" ఆ అమ్మాయి నిజంగా సినిమా హీరోయిన్ లాగా వుంది. " బోలు మనుషులండీ డాక్టర్ గారూ..! బోలు మనుషులు. సినిమా..టీవీ సంస్కృతిలో ఇరుక్కుపోయిన బోలుమనుషులు..అలాంటి ఒక వెధవ నా చిట్టి తల్లిని ప్రేమిస్తున్నానని వెంటపడీ..వెంటపడీ.. వేధించి...(ఆమె బోరున ఏడుస్తోంది). .నా భర్త పోయి.మా ఇద్దరి కలలన్నీ కూలిపోయి బ్రతుకుని శవాల్లాగా మోస్తూ చావకుండా మా కష్టాల్లో మేము నలిగిపోతుంటే, ఈ దరిద్రుడొచ్చి...నా చిట్టి తల్లిని వేధించి..ప్రేమించక పోతే..యాసిడ్ మీదపోస్తాడాండీ...అదాండీ ప్రేమంటే...వాడెవడో కూడా తెలీదండీ..ముక్కూ ముఖం లేనివాడు, చూడండి ఎంత అందగత్తె..ఎంత ర్యాంకు స్టూడెంట్ .ఎలాగయిందో చూడండి. దాని ముఖం గుర్తు పట్టలేనంతగా మారింది. దాని ఊపిరి తిత్తులన్నీ కూడా కాలిపోయాయట. చదువూ లేక బయటకి రాలేక ఇంట్లో ఒక్కత్తే గోడలు చూసుకుంటూ ఉదయం నుండి సాయంత్రం దాకా నాకోసం ఎదురు చూస్తూ కూచుంటుంది.. ఏంటండీ మాకీ ఖర్మ..జీవచ్ఛవంలా అది...కాటి కాపరిలా నేనూ....అంతేనండీ..ఇదీ మా జీవితం"
ఆమె ఇంకా ఏదీ చెప్పుకోలేక పొతోంది. ఇంతకు మించి చెప్పటానికి కూడా ఆమెకి ఏమీ మిగలలేదు. "అమ్మా..! ఏడవకమ్మా..నీవేడిస్తే నాకూ ఏడుపొస్తొంది". అని ఆ అమ్మాయి అమాయకంగా అంటుంటే.కాలిపోయిన ఆమె మూతి భయంకరంగా వంకర్లు పోతోంది. "అమ్మా..! నాన్న ఏం చెప్పారమ్మా..జీవితాన్ని గుండెలనిండుగా ఆస్వాదించమన్నాడుగా ..నీవిలా ఏడుస్తావేం...?" ఆ అమ్మాయి ఓదార్పులో...నిజమైన ఓదార్పంటే ఇదేనేమో అనిపించింది. ఈ ఇద్దరిలో ఎవరు ఎవర్ని ఓదారుస్తున్నారో..ఎవరి జీవితం కోసం ఎవరు జీవిస్తున్నారో అని వేరేగా చెప్పాల్సిన పనే లేదనుకుంటాను. జీవచ్ఛవం లా బతుకుతున్న వీళ్ళిద్దరికీ నిరంతరం చెవిపక్కన వినిపించే చనిపోయిన ఆ వ్యక్తి మాటలే, నిరంతరం జీవితంలోకి ప్రవహించే ఆ తండ్రి జ్ఞాపకాలే ఓదార్పులుగా మారటం బహుశా ఎవరకోగానీ ఇలా జరగదనుకుంటాను.
3/5/15