Saturday, 9 May 2015

విరించి ll  మధ్యాహ్నపుటెండ ll
.... .................................
ఈ రోజు మధ్యాహ్నం
ఆకాశాన్ని పిడకలమీద కాల్చినట్టుంది
పసరు వన్నెలతో తేలాల్సిన వెన్నెల
కాసింత మసిబారినట్టున్నది.

ఒక అందమైన పూవులాగా
వికసించాల్సిన ఈ రాతిరిని
ఏ మాత్రమూ కదలని మేఘాలూ
ఏ లక్ష్యమూ లేని గాలులూ
విడిచిన బట్టలు మోసే
గాడిదల్లానే మోస్తుంటాయి

చింతచెట్టు మీద పీనుగులా
నిదురకు వేలాడే నేను
ఒక స్వప్నపు భుజాన్నెక్కిన ప్రతీసారీ
ఏ జవాబూ లేని ప్రశ్నగానే
ఎగిరి పోతుంటాను

ఏ దీపాన్నీ వెలిగించలేని కన్నీటి చమురుతో
చీకటి ముసురు గడ్డకట్టినపుడు
చేతికి చిక్కిన ఈ కొన్ని మిణుగురులను
తూరుపు విత్తులుగా విసిరేస్తాను
ఈ మసిబారిన వెన్నెలతో విసిగి  పోయిన నేను
ఆ మధ్యాహ్నపుటెండలోనే నిదురిస్తాను
ఆ చెమటల్లోనే ఇక స్వప్నిస్తాను.

8/5/15

No comments:

Post a Comment