Tuesday, 5 May 2015

విరించి  ll ప్రళయం ll
......................................
చూసావా నేస్తం..
సమాజాన్ని నీవొకవైపూ నేనొకవైపూ నిలబడి
చిలికితే ఎంతటి విషం ఒలికిందో....

యుగాల కొక్కాలకి గంటల గడియారాలు వ్రేలాడదీసుకుని
నోళ్ళ చివర పళ్ళూ
వేళ్ళ చివర గోళ్ళూ
ఎంతగా పదును చేసుకున్నాం..

ముఖ స్తుతి కోసం ముఖంగా మిగిలిన అస్థి పంజరాలం
చచ్చిపోయిన దేహంలో బిగిసిన పిడికిలిని విప్లవమనుకున్నాం
చిన్న మెదడు మొదళ్ళనుండి చితికినా
చితిమంటల్లో బ్రహ్మ రంధ్రం పగిలినా
అహం బ్రహ్మమని అహరహం అరిచినాం..

మానవత్వపు మేడ కింద
అడ్డొచ్చిన ప్రతీ మెడకీ కత్తులు పెట్టాం

తెలుసుకదా..
అమీబా పరిమాణమే ప్రమాణం
మనదాకా సాగిన పరిణామానికి
హైడ్రోజన్ పరమాణువే పరమార్థం
మనం పారించబోయే ప్రళయానికి

కాలపు కొండలనుండి దూకే చరిత్ర ఈనాటి వరకూ
ఒక్క మనిషిగానైనా పుట్టలేకపోయింది
సముద్ర బాల్కనీ ముక్కల్లో కరడు గట్టిన రక్తం
సరిహద్దుల కంచె మీద శిథిలాలై ఎండిపోయింది

అయినా..ఒక టేబుల్ మీద సర్దేయగల జీవితానికి
ఒక టేబుల్ కింద చుట్టేయగల మరణానికి
ఎన్ని లేబుల్స్ కట్టేసామో చూసావా...?

మనం మారే అవకాశంకోసం
మారణాయుధాలే మిగిలుంటాయేమో..
ప్రళయానంతర నిశ్శబ్దంలో
పేలని శతఘ్నులు అపుడపుడూ పేలుతుంటాయేమో...
సముద్ర తుఫానులు మనల్ని మోసుకుపోతుంటే
ఎడారి తుఫానులు మన శవాలకి సమాధులు కడతాయేమో...

ఏమో...మనమిపుడేం చేద్దాం చెప్పు...!
మన మధ్యన దూరానికి నిచ్చెన వేద్దామా లేక వారధి కడదామా

12/12/14

No comments:

Post a Comment