Tuesday, 5 May 2015

విరించి //  బ్రెయిన్ డ్రెయిన్// story.

ఆ రోజు ICCU లో నైట్ డ్యూటీ. కుర్చీలో కూర్చుని కునుకు తీస్తున్ణ నాకు ఒక పెద్ద అరుపుతో మెలకువ వచ్చింది. చూస్తే సిస్టర్ ఒక పేషంట్ కి ఐవీ కాన్యులా పెడుతోంది. వెల్లాను. వెయిన్స్ దొరకడం లేదు సర్, మీరు ట్రై చేస్తారా అని సిస్టర్ నా మీద భారం వేసేసింది. మనిషి లావుగా ఉండటం వల్ల   దాని మీద వల్లంతా ఎడిమా రావడంవల్ల నరాలు దొరకడం లేదు. పాపం ఆ పెద్ద మనిషి గట్టిగా అరుస్తోంది నొప్పికి. ఆమె తో పాటు వచ్చిన ఆమె కొడుకు చోద్యం చూస్తున్నట్టుగా నిలబడి ఉన్నాడు. "సర్ మీరు ఇలా వచ్చి ఆమె పక్కన నిలబడి ఆమెను కాస్త పట్టుకోండి". అని చెప్పాను. "డబ్బులు పాడేస్తున్నాంగా..ఈ పని మీదా మాదా..?" అన్నట్టు ఒక్క చూపు చూసాడు. నొప్పి ఉన్నపుడు మనవాడు ఎవడన్నా మన పక్కన ఉంటే బాగుంటుందనిపిస్తుంది ఎవరికైనా. ఆ విషయం వాల్ల కొడుకు కి తెలియదు. చెప్పే ఓపిక నాకూ లేదు. నరమయితే దొరికింది. హిస్టరీ తీసుకుని ట్రీట్మెంట్ అంతా స్టార్ట్ చేసే సరికి రాత్రి మూడు గంటలయ్యింది. బాగా నీరసంగా వుంది. కాస్త పడుకుందా మనుకునే సరికి, బెడ్ నం వన్ పేషంట్ కార్డియాక్ అరెస్ట్. గైడ్లైన్స్  CPR చేసాము. లాభం లేక పోయింది. అందునా ఎనభై దాటి వుంటాయి. మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్, వెంటిలేటర్ మీద వుంది. వాల్ల అటెండర్స్ కి విషయం చెప్పడానికి ఫోన్ చేస్తోంది హెడ్ సిస్టర్. ఎన్ని సార్లు చేసినా ఎవరూ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. ఇపుడు ఈ ముసలావిడ డెత్ డిక్లేర్ చేయాలి. ఈ పేషంట్ అటెండర్స్ ఇంత నెగ్లిజన్సీ తో వుంటే ఎలా. ఆల్టర్నేట్ ఫోన నంబర్ కూడా ఇవ్వ లేదు. నేనూ ట్రై చేసాను. లాస్ట్ కి ఒకతను ఎత్తాడు. మాంచి నిద్రలో ఉన్నట్టున్నాడు. "ఏమయ్యా ఐ సీ సీయూ లో పేషంట్ని పాడేసి మీరు ఇంట్లో పడుకుంటే ఎలా. ఇక్కడ ఆమె కి సీరియస్ గా వుంది. మీరు వెంటనే రండి"  అని చెప్పి కోపంగా పెట్టేసాను. రెండు నిమిషాల్లో ఒక ముసలతను హడావిడీగా ఒచ్చాడు. నేను ఫోన్లో కోప్పడింది ఈ పెద్ద మనిషినైతే కాదు కదా అనుకున్నాను. "క్షమించండి డాక్టర్ గారూ...వారం రోజులుగా నిద్ర ఉండటం లేదు. అలా కుర్చీమీద కూర్చునే సరికి నిద్ర ఒచ్చేసింది..మా ఆవిడ కండీషన్ బాగా లేదా...?" ఎంతో వినయంగా అడుగుతున్నాడు. ఏం చెప్పాలి. చనిపోయిందని చెప్పాలా.? "అవునండి బాగాలేదు. చివరి ప్రయత్నం చేస్తున్నాము. మీకు ఏ విషయమూ కాసేపట్లో చెప్తాము" అన్నాను. ఒక సారి యేంటో అన్నట్టు చేతులని తిప్పి, పైకి చూసి దండం పెడుతున్నాడు. ఒక నిముషం కింద ఆయన కల్లల్లో వుండే ఆశ ఇప్పుడు లేదు. ఒకరకమైన పిచ్చిచూపుల్లా అనిపించింది. ఆయన బాధ పడుతున్నట్టు వేగంగా తీస్తున్న శ్వాస, పండ్లు లేకపోవడం వల్ల రెండు పెదవులూ కలుసుకున్నప్పుడు వచ్చే శబ్దమూ చెబుతున్నాయి.  ఆమె బెడ్ చుట్టూ కర్టెన్స్ వుండటం వల్ల ఆయనకి ఆమె చనిపోయిందనే విషయం తెలీదు. నేను మల్లీ బెడ్ దగ్గరికి పోయాను. ఇద్దరు సిస్టర్స్ నా ఆర్డర్ కోసం ఎదురు చూస్తున్నట్టుగా ఆ బెడ్ దగ్గరే చెరొకవైపు నిలబడుకుని ఉన్నారు. కర్టెన్ కి ఇటువైపు ఈమె మరణం..అటువైపు ఆయన ఆశ మరణం. రెండింటి మధ్యలో నేను. వారధిని. ప్రాణం పోసే వాడయినా తీసే వాడయినా దేవుడే..డాక్టర్ దేవుడి పనికి చేతి సహాయం మాత్రమేగా చేసేది.

కాసేపట్లో డిక్లేర్ చేసాము. ఆయన కి ఫ్లాట్ లైన్ ఈసీజీ చూపించాను ఇక నో మోర్ అన్నట్టు. ముఖం చిన్నదిగా చేసాడు. ఆయనలోని బాధని సిస్టర్ అర్థం చేసుకున్నట్టున్నది. ఓదార్చడానికని భుజంమీద చేయి వేసింది. అలా ఒక ఆసరా దొరకగానే ఆయన లో బాధ ఏడుపులా బయటికొచ్చింది.  అది జీవితాన్ని చూసి నవ్వుతున్నట్టుగా వుంది. "పోయిందమ్మా...నా జానకి నన్ను వదిలి పోయిందమ్మా...." పీలగా ఉన్న ఆయన శరీరంలో మనసు కూలబడిపోయినట్టన్నది. "నేను ఆమెని ఇక చూడలేనమ్మా ...ఎట్లారా భగవంతుడా...వేంకటేశ్వరా...."  ఇంత బాధని ఈ ముసలి దేహం ఏం తట్టుకుంటుందో అనిపించింది. ఆయనని ఓదార్చి బయటకి తీసుకెల్లాను. వంగి పోయివున్న ఈయనకి ఇక ఆసరా ఎవరున్నారో అనుకున్నాను.
మిగతా ఫార్మాలిటీస్ లో భాగంగా ఆమె డెత్ సర్టిఫికేట్ ఫిల్ చేస్తున్నాను. "సర్ ఆ ముసలావిడ చూసారా ఎంత అందంగా వుందో..ఆమె చనిపోతే బాధగా వుంది సర్" . వారం రోజులుగా దగ్గరుండి ఆమెకు సేవలు చేస్తున్న సిస్టర్ కల్లు చెమర్చాయి. "ఆమె గొప్పటి వీణా విద్వాంసురాలట సర్"  ఇంకో సిస్టర్ గుర్తు తెచ్చుకుంది. ఒక్కసారి ఆమె ముఖం చూసాను.పసుపు పచ్చటి మేని ఛాయ. నిండయిన శరీరం.  నిజమే. చేతిలో వీణ వాయిస్తూ ఈమె నవ్వుతూ వుంటే సరస్వతీ దేవిలా ఉంటుంది. అయినా బ్రహ్మ రాత తప్పదు కదా. ఐ సి సియు లో ఫోన్..."డాక్టర్ గారూ..నా పేరు రమాకాంత్. సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్  ఫ్రం USA ..జానకమ్మ గారి రెండో సన్ ని...ఆమెకి నేనే ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నది. ...ఆమె పోయిందట కదా డాక్టర్....ఓ షిట్...ఇపుడెలా డాక్టర్....సరే..ఓ పని చేయండి...మార్చురీలో పెట్టేద్దాం....ఫ్రీజర్ ఉంది కదా....ఓకే...నో ప్రాబ్లం...ఎంత ఖర్చయినా నో ప్రాబ్లం ...ఎందుకంటే ఆమెకి ట్రీట్మెంట్ ఇప్పించ్చేది నేనే.....థ్యాంక్యూ డాక్టర్...సీ యూ...." నేను yes, ok పదాలు తప్ప పెద్దగా మాట్లాడిందే లేదు. మరి కాసేపట్లో ఇంకో ఫోన్. "డాక్టర్ గారూ..అయామ్ రాజారాం....విషయం ఇప్పుడే తెలిసింది...సరే చేసేదేముంది..వయసొచ్చింది....ఆ ..నేను ఆమె పెద్ద సన్ ని. సైంటిస్ట్ ఫ్రం USA ...ఒక త్రీ ఫోర్ డేస్ కి మనకి మార్చురీ ఉంటుంది కదా....సేఫ్ సైడ్....ఎందుకంటే...నేను కాన్ఫరెన్సలో స్ట్రక్ అయ్యేలా వున్నాను....థ్యాంక్యూ డాక్టర్."  మల్లీ సేమ్ యస్ , ఓకే తప్ప పెద్దగా ఏమీ నేను మాట్లాడింది లేదు. విషయం నాకు అర్థం అయింది. బాడీ మార్చురీకి షిఫ్ట్ చేయబడింది.

డాక్టరుగా ఇలాంటి మరణాలు చూసీ చూసీ మనసు మొద్దుబారిపోతుందా యేమి. రోజూ ప్రపంచంలో  ఎంతో మంది చనిపోతూనే ఉన్నారు. కానీ మారుతున్న పరిస్థితుల్లో హాస్పిటల్లోనే ఎక్కువ మరణాలు. దీనికర్థం హాస్పిటల్స్ బాగా పెరిగాయి అనే కదా. సగటు జీవన కాలం పెరుగుతూ పోతోంది. అయినా కానీ డాక్టర్ల వల్లే మరణాలు జరుగుతుంటాయని మనుషుల నమ్మకం కాబోలు, ఒక రకమైన దాడిలాంటిదేదో రిసెప్షన్లో జరుగుతావుంది. ఒక పెద్దమనిషి డాక్టర్ల మీద దాడి చేయ ప్రయత్నిస్తున్న వ్యక్తికి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. "పుట్టించే దేవుడే మనిషిని చంపుతున్నాడు. అలాంటి దేవుడికి మనం గుల్లు కట్టి పూజిస్తున్నాం. కానీ..మనం చచ్చేటపుడు బ్రతికించాలని తాపత్రయ పడే ఒక డాక్టరును నిర్దాక్షిణ్యంగా నిందిస్తున్నాం...దాడులు చేస్తున్నాం...ఇదెక్కడి న్యాయం..? "  చావులెంత చూస్తున్నానో దాడుల్నికూడా అంతే చూస్తుంటాను, నిత్యజీవితంలో భాగం లాగా.  మనుషులు కదా..ఆలోచించలేరని సర్ది చెప్పుకోవడమే. అందరి చూపూ ఈ గొడవ మీద వుంటే..మూలకి కూర్చున్న ముసలాయనకి ఇవేమీ పట్టనట్టున్నది. ఏదో లోకంలో ఉన్నట్టున్నాడు. నిర్లిప్తంగా..ఎవరో కాదు. జానకమ్మ గారి భర్త. ఇదేంటీ ఆమె చని పోయి అయిదు రోజులైంది..ఇక్కడున్నాడేంటి అనుకుని పోయి పలకరించాను. గుర్తు పట్టినట్టు లేడు. USA నుండి కొడుకులింకా రాలేదట. బాడీ మార్చురీలోనే వుందట. తరువాత రెండు రోజులు కూడా గమనిస్తూనేవున్నా. పేషంట్ లాంజ్ లో కూర్చునే ప్లేస్ మారుతుందే తప్ప వ్యక్తి మారట్లేదు. ఒక్కడే కనిపిస్తుంటాడు, చకోర పక్షిలా. ఆ మరుసటి రోజు సాయంత్రం డ్యూటీ అయిపోయాక ఇంటికి వెల్తుంటే, హాస్పిటల్ బయట ATM దగ్గర కనబడ్డాడు. పలకరించాను. పెద్దగా స్పందించలేదు. డబ్బులు జోబిలో పెట్టుకుని ఆటో కోసం చేయి చూపుతున్నాడు. ఆయన ఇంటికొకసారి పోవాలట. ఆరా తీస్తే మా ఇంటికి పోయే దారిలోనే వారి ఇల్లు. నా కార్ లో రమ్మన్నాను. కృతజ్ఞతతో ఒక్కసారి చూసి ఎక్కేసాడు. కార్ స్టార్ట్ చేసాను. కాసేపు దూరం పోయాక అదే నవ్వులాంటి ఏడుపుతో కుల్లుకొని ఏడుస్తున్నాడు. నా దిక్కు చూసి "యెవరూ రాలేదండి...ఆ మహా ఇల్లాల్ని చూడటానికి ఎవరూ రాలేదండి."  ఆ చివరి మాటలు అనలేక పోతున్నాడు. " ఆ చేత్తో ఎంత మందికి అన్నం పెట్టిందండి...అన్నపూర్ణండీ...వీణా సరస్వతండీ...కానీ ఎవరూ రాలేదండీ...జానకీ....!!" బోరుమని ఏడ్చాడు.." చూడండి...డబ్బులు పంపారు..ATM కి.. డబ్బులు...ఎవరికి కావాలండి డబ్బులు...వద్దండీ ...కొడుకులు వొద్దు. సముద్రం దాటితే పంచమహా పాతకాలు చుట్టుకుంటాయంటే...అంతా ట్రాష్ అనుకున్నాను...మన పెద్దలు ఊరికే చెప్పరుగా..మహాను భావులు ..రుషులు.. మొక్కాలండీ..కన్నతల్లికి చివరాఖరి చూపు లేకపోవడం పాతకంగాక ఏమిటి. స్కైప్ లో చూపాలట స్కైప్లో" ..నేను నా చేయితో ఆయన చేయి పట్టుకున్నాను..ఓదార్పుగా,.. ఆయన చేయి వణుకుతున్నది..."నాకు యిపుడు ఎవరూ లేరండీ తోడుగా...ఒంటరిని...ఈ వారం రోజులు నా జానకి శవమైనా నాతో వుంది మార్చురీలో....రేపెవరుంటారు.." .ఆ మాటలనలేక పోతున్నాడు. "అయ్యో ఈశ్వరా.!!!ఏమి జన్మనిచ్చావయ్యా జానకికి..ఇది చూట్టానికేనా ఇంత కాలం బ్రతికించావు..?!!"

ఆయనింటికి చేరుకున్ణాము. నన్ను లోపలికి రమ్మన్నాడు. కాదనలేకపోయాను, ఒంటరిగా ఉన్నాడని. బాబూ..నేను స్నానం చేసొస్తాను..కాసేపు కూర్చో...అని చెప్పి వెల్లాడు. సోఫా లో కూర్చున్నాను. పెద్ద ఇల్లు. సకల సౌకర్యాలూ ఉన్నాయి. అన్ని హంగులూ ఉన్నాయి. అటు మూలకి పాడుబడిన వీణ కనిపించింది..వెల్లి చూసాను. మీటితే...అదో రకంగా పలుకుతోంది..తీగలు సవరించక చాలారోజులైనట్టు వుంది. టీ పాయి మీద ఆల్బం కనిపించింది. అన్నీ కొడుకుల కోడల్ల మనవల్ల మనవరాల్ల ఫోటోలే...టీ షర్ట్ లో...లంగోటలో..నల్లని పేద్ద అద్దాలు పెట్టుకొని..ఆడవారైతే స్లీవ్లెస్ గౌన్లు వేసుకుని..ఒక్కోసారి టైట్ జీన్స్ వేసుకొని...ఒకసారి కారు ముందర..ఒకసారి వాటర్ ఫాల్స్ ముందర..ఇంకో సారి..ఏదో పార్క్ లో..ఇంకో సారి బొటన వేలు పైకి చూపిస్తూ..హాయ్ అని చేయి చూపుతూ..ఇంకో చోట చింపాంజి తో దిగినవి..తానా సభల్లో తెలుగు ముగ్గులేస్తూ..తెలుగు డాన్స్ లు చేస్తూ...ఒక చోట కాలోజీ పటానికి మొక్కుతూ...ఇంకోచోట చినజీయర్ స్వామితో...అమెరికాలో దసరా పండుగకు దుర్గామాతని పూజిస్తూ...ఏదో హోమం చేస్తూ..ఇలా రక రకాలయిన భంగిమల్లో దిగిన ఫోటోలున్నాయి. మామూలుగా చూసింటే నాకూ నచ్చేవేమో... ఇపుడెందుకో ఎబ్బెట్టుగా అనిపిస్తోంది..ఆ వస్రాల్లో నిండుదనం లేదనిపించింది వారి మనసుల్లాగానే..వారి అలంకరణల్లో..ఆ నవ్వుల్లో...మనిషితనం కన్నా ప్లాస్టిక్ దనం కనిపిస్తోంది.ఆత్మ శుద్ది లేని ఆచారమదియేల ...వేమన పద్యం గుర్తుకి వచ్చింది.. చూడలేక పోయాను. అటు పక్కనున్న డైరీ తీసాను..మొదటి పేపరు తీయగానే చక్కని తెలుగు అక్షరాలు. సీతా రామయ్య...జానకి అని. మిగతా అన్ని పేపర్లూ ఖాలీగా వున్నాయ్..కానీ ప్రతీ పేపర్లో పైన మూడు ఫోన్ నంబర్స్ ఉన్నాయ్..రాజారాం.....రమాకాంత్....మూడోది డాక్టర్ సుభాష్....ఫామిలీ డాక్టర్దేమో...యమర్జన్సీ కోసమని పెట్టుకుని వుంటారు. కానీ ఇలా ప్రతీ పేజ్ లో రాసుకోవడమే వింత....బహుషా ఏ పేపర్ లో చూసినా కనబడాలని కాబోలు వెతుక్కోకుండా..ఆడైరీలో నుండి ఒక కాగితం ముక్క కిందకి పడింది. చూస్తే...పాత ఇన్లాండ్ లెటర్...ఒకరి లెటర్ ఇంకొకరు చదవకూడదంటారు..కానీ చాలా పాతది...పాత కట్టడంమీద పేర్లు రాసుకున్నట్టు అక్షరాలు.

"చిరంజీవి లక్మణ్ కి..ఒరేయ్ తమ్ముడూ...మీ అన్నయ్య సీతా రామయ్య వ్రాయునది. మీ వదినా, నేనూ ఇచట కార్యక్రమం చాలా చక్కగా నిర్వహించాము. నా జన్మ ధన్యమయింది.  ఈ అద్భుతమైన గయ క్షేత్రానికి నీవు రాకపోవడం బాధగావుంది. సరేలే కాలు విరిగితే నీవైనా ఏం చేయగలవు..ఈ మహాలయ పక్షాల్లో మన తల్లిదండ్రులకి పిండ ప్రదానం చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. దాదాపు ఆరు లక్షలమంది ఈసారి పితరులకు పిండ ప్రధానం చేశారట. తలకొరివి పెట్టడానికే దిక్కులేదనుకుంటాం..కానీ ఇన్ని లక్షలమంది వారి వారి తల్లిదండ్రులని తాతలని గుర్తుంచుకుని పిండ ప్రదానాలు చేస్తున్నారంటే, మన భారతీయ సంస్కృతి ఎంతగొప్పదో చూడు. వీల్లంతా పిచ్చోల్లట్రా వెధవాయ్..నీవూ నీ ఆదర్శ భావాలూ...తల్లి దండ్రులని గుర్తుంచుకోవడం, వారిని పూజించడం..చనిపోయినాక కూడా వారిని తలచుకోవడం ఆదర్శ భావాలు కాదట్రా...మనమేమన్నా ఎక్కడ పడితే అక్కడ తిని ఎక్కడ పడితే అక్కడ పడుకుని, దులుపుకుని పోవడానికి జంతువులమట్రా..షుంఠ... జంతువులేమన్నా చేస్తున్నాయా ఈ పిండప్రదానాలు అంటావు..విదేశాల్లో వారు చేస్తున్నారా, వారందరూ హాయిగాలేరా అంటావ్. హాయి గురించి కాదురా...మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులకి మనం మన కోసం ఇచ్చుకొనే గౌరవం. సరేలే మన గొడవ ఎపుడు తీరింది కనుక..ఏమైనా ఇంతకాలానికి మన తల్లిదండ్రులకి ఈ పాపపు లోకం నుండి విష్ణుపదానికి మోక్షం లభించింది. నేను చెబితే నీవు వినలేదు. నీ పిల్లల్నయినా నీవు మాతో పంపాల్సింది.జానకి వుందిగా చూసుకునేది.  వాల్లూ ఈ పద్దతులు తెలుసుకునే వారు. మన రాజారాం రమాకాంత్ ఎంత భక్తి శ్రద్ధలతో కూర్చున్నారనుకున్నావ్..పిండాలు పెట్టడానికి పిల్లలెందుకన్నయ్యా అంటావ్ కానీ..మనం వాల్లని కూడా తీసుకెల్లకపోతే రేప్పొద్దున వాల్లకివన్నీ ఎలా తెలుస్తాయ్ రా..మనం మన ఆస్థులనే కాకుండా మన పద్దతులని కూడా మన వారసత్వ సంపదగా మన పిల్లలకి ఇవ్వాలి కదరా..వాల్లు వాల్ల పిల్లలకి ఇస్తారు. ఈ విధంగా మన ధర్మం నిలుస్తుంది. హిందువుగా పుట్టినందుకు మన ధర్మం మనం పాటించాల్సిందే... సరే..మేము చుట్టుపక్కనున్న క్షేత్రాల్ని  కూడా చూసుకుని వస్తాం..ఇంటి పట్టాన వుండు. ఆ విరసం సరసం అంటూ తిరిగి జీవితంలో రసహీనంగా తయారుగాకు. అన్నయ్యను కాబట్టి చెబుతున్నా..ఇక నీ యిష్టం. ఉంటా.."

సీతారామయ్యని మల్లీ హాస్పిటల్ లో ఒదిలేశాను. జానకమ్మని మార్చురీ నుండి తీసుకొచ్చి, ఫ్రీజర్ లోకి షిఫ్ట్ చేస్తున్నపుడు చూసాను. వారంకి పైగా మగ్గి పోయింది. పచ్చని మేని ఛాయ నల్లగా మారిపోయింది. చర్మం పేస్ట్ లాగా అయిందనిపించింది. ఎక్కడ ముట్టుకుంటే అక్కడ గుంతలు పడుతున్నాయి. నిండుగా ఉన్న ఆమె శరీరం చిన్నగా బక్కగా కృంగిపోయింది. సీతా రామయ్య ఆమెని చూడలేకపోయాడు. "ఇలా అయిపోయిందేంటయ్యా నా జానకి. అది ఏం పాపం చేసిందయ్యా.... " అని కూలబడిపోయాడు. ఒకరిద్దరు బంధువులొచ్చినట్టున్నారు . సముదాయిస్తున్నారు. ఆమెని నేను కూడా చూడలేక పోయాను. అనాటమీ లాబ్ లో శవాన్ని చూడటం వేరు...నిండుగా చూసిన మనిషిని ఈ విధంగా చూడటం వేరు. అక్కడి నుండి వెల్లిపోయాను. మరుసటి రోజు పేషంట్ లాంజ్ లో సీతా రామయ్య కూర్చునే చోట చూశాను. ఇంకో ముసలతను ఒంటరిగా కూర్చుని ఉన్నాడు. ఈలోకంలో ఉన్నట్టుగా లేడతను..ఎంతమంది సీతారామయ్యలో ఈ దేశంలో..బ్రెయిన్ డ్రెయిన్ అంటే అప్పుడే అర్థం అయ్యింది నాకు.

No comments:

Post a Comment