Friday, 1 May 2015

విరించి ll ముద్రా రాక్షసుడు ll
....................................
నా కవితొక పోస్ట్ కార్డ్ లాంటిది
దానికి రెండు ముద్రలుంటాయి
మొదలయే చోటపడే నా ముద్రొకటి
చేరాల్సిన నిను చేరాక నీ ముద్రొకటి

స్టాంప్ బిళ్ళని మార్చుకోలేని నీవు
పోస్ట్ కార్డ్ ఏదయినా అదే ముద్రనేగా గుద్దేస్తావు
అటుపై నన్నొక లక్క అంటించిన
సంచిలోకేగా మూటగట్టేస్తావు

నిన్నటి బురదలో పడి పొర్లే నీ ఆనందంలో
నేటి అద్దంలాంటి  నా కవితలోకి తొంగిచూస్తూ
నీ అసహ్యంలో అందాల్ని పొగుడుకుంటావు

రేపటి కొలిమిలో కట్టెలా కాలిపోయే నన్ను
నేటి కొలను లో మట్టిలా తేలే నా కవితను
నిన్నటి ఒక బలిపపీఠం మీదే ఎండగొడతావు

క్రమశిక్షణతో కార్డులోకి కవాతు చేసే పదాలమీద
ఒక గ్రంథాలయ ప్రశ్నలు కురిపిస్తావు
లేని అర్థమో లోలోతు అర్థమో
నీ స్వార్థం కొలదీ నా శార్దం పెడతావు

పొరపాటున దొర్లే అచ్చు తప్పుల్లో
ముద్రలకోసం తప్పులు వెతికే నీ కొలబద్దల్లో
ముద్రా రాక్షసమేదో మరిక నీవే చెప్పాలి.

కవితల్ని అంటించుకుని నేనొక మనిషిగా
రూపుకట్టే సమయానికి
నీ చేతిలోని ముద్రనొకటి
నా ముఖం మీద కూడా అతికిస్తావు

ఓ ముద్రా రాక్షసుడా
నీకో వందనం.

1/5/15

No comments:

Post a Comment