విరించి ll నిశ్శబ్దం ll కథ
-------------------------------
కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. తాను బ్రతికే ఉన్నానన్న స్పృహ తప్ప శంకర్ కి ఏ అవయవమూ శరీరంలో నిలిచి ఉందన్న స్పృహే లేదు. చేతులు వెనక్కి చెట్టుకి కట్టేయబడి ఉన్నాయి. శరీరమంతా రక్తం కారుతోంది. "దొంగలం...కొడకా!!..కన్న తల్లిని చంపేస్తావా!?..తూ..నీ బతుకు చెడ.! నడి వయసు సుంకులమ్మ ఖాండ్రించి ముఖమ్మీద ఉమ్మేసింది. ఒక చిన్న పిల్లగాడు చెప్పుతో కొడుతున్నాడు. ఇంకొక వ్యక్తి వొచ్చి కాలితో ఎగిరి డొక్కలో తన్నాడు. ప్రతీ ఒక్కరు గట్టిగా తిడుతూ..వీలైనంతగా శంకర్ ని కాళ్ళతోనో చేతులతోనో చెప్పులతోనో కర్రలతోనో కొడుతూనే ఉన్నారు. బకెట్ నీళ్ళను ఎవరో ముఖంమీద గుమ్మరించారు. ఊపిరాడక ఉలిక్కి పడి లేచి,ఆ సన్నని స్పృహలో నిస్సత్తువతో మూసుకుపోతున్న కళ్ళు తెరవక లేక తెరిచి చుట్టూ చూస్తున్నాడు. తనకు ఒంటి మీద మొలతాడు తప్ప ఇంకే నూలు గుడ్డా లేదని తెలుస్తున్నది. ఊరి జనమంతా తన చుట్టేవున్నారు. ఒక్కొక్కరుగా, గుంపులు గుంపులుగా వొచ్చి ప్రతీ ఒక్కరూ ఏదో విధంగా తనని హింసిస్తూ ఉన్నారు. అందరూ తెలిసిన వాళ్ళే..కానీ ఎవరి పేరూ తనకి గుర్తుకి రావడం లేదు. ఇంతలో కంటి ముందుకి ఒకడొచ్చి నిలబడ్డాడు. మల్లిగాడు. పుట్టిన గత ఇరవై రెండేళ్ళ నుండీ తన ప్రాణ స్నేహితుడు. ఇంటి పక్కనే ఉంటాడు. వీడయినా తనని కాపాడుతాడేమో అనుకున్నాడు. మల్లిగాడు శంకర్ నోటిచుట్టూ చేతులు పెట్టి బలవంతంగా నోటిని తెరిచి గాండ్రించి ఉమ్మేశాడు. మల్లి గాడి అమ్మ శాపనార్థాలు పెడుతూ వొచ్చి, మల్లిగాడు పట్టుకుని తెరిచిన నోట్లో..భళ్ళున పిడికిలి నిండా ఉన్న మట్టిని తీసి కొట్టింది. మల్లిగాడు కాలు లేపి శంకర్ డొక్కలో మోకాలితో తన్ని వెళ్ళి పోతున్నాడు. ఆమె శాపనార్థాలు పెడుతూ..మట్టిని శవంమీద చల్లుతున్నట్లు శంకర్ మీదకి చల్లుతున్నది. శంకర్ కి త్వరగా తనని చంపేస్తేనే బాగుంటుంది అనిపిస్తున్నది. అతని మనసులో ఒకే ఒక మాట గింగిరాలు తిరుగుతున్నది. అమ్మ. ఔను , తను గొడ్డలితో నరికేసిన అమ్మ. గుంపులుగా గుమిగూడిన ఈ జన సమూహాల సందుల్లోంచి లీలగా కనిపిస్తూ, నేలమీద నెత్తురోడుతూ శవంలా పడి వున్న అమ్మ. కళ్ళు తెరిచినపుడల్లా ఆమెని చూడాలని వెతుకుతున్నాడు. "నన్ను చంపేయండి, కానీ అమ్మని ఒకసారి చూసుకోనీవండి" అని చెబుదామనుకుంటున్నాడు. కానీ ఆ వీలు లేదు. లోపలికి దిగమింగుతున్న బాధ పై ప్రాణాలు పైనే పోకుండా ఆపుతున్నట్టున్నది. నాలిక పిడచకట్టుకు పోయింది. నోటినిండా మట్టి. ఒంటి నిండా గాయాలు. రక్తాలు. చనిపోబోయే ముందు ఒక్క సారయినా చూడాలనుకుంటున్నది చచ్చి శవమైన అమ్మని. తనే దారుణంగా చంపేసిన అమ్మని. తన ప్రాణమైన అమ్మని.
శంకర్ కళ్ళు తేలేసాడు. "అరేయ్ కట్టు ఇప్పండిరా" అరుస్తున్నారు ఎవరో..కొంతమంది కట్లు విప్పారు. "బతికినన్నాళ్ళు మనం గోరవంగా బతకాల్రా కొడకా". .చెవి పక్కన అమ్మ చెబుతున్నట్టున్నది. ఇంకెవరో తన కాళ్ళు పట్టుకుని నేల మీద ఈడ్చుకుంటూ తీసుక పోతున్నారు. శంకర్ కి శరీరంలో కదలిక లేదు. కానీ అన్నీ చూచాయగా తెలుస్తూ ఉన్నాయి. లాక్కుని వచ్చి కాళ్ళు వదిలేశాడు ఎవడో. అతని కాళ్ళు అమ్మ శవాన్ని తాకుతున్నాయి. అపరాధం. ఇంతలో ఇంకెవడో ఒచ్చి అమ్మ శవం పక్కకి తనని లాగి పడుకోబెట్టాడు. శంకర్ కుడి చేయి చిటికెన వేలు అమ్మ చేతికి వేసుకునే ఇనుప కడియాన్ని తాకుతోంది. ఎన్నో సార్లు తడిమిన ఆ కడియం అమ్మదే నని తెలుస్తోంది. వేలిని జరిపి అమ్మ శరీరాన్ని తాకాలని వుంది. ఊరి జనాలు ఈ రెండు శవాల్ని ఏం చేయాలని గొణుక్కుంటున్నారు. హోరుగా గాలి వీస్తోంది. వంటినిండా గడ్డ కట్టిన రక్తం ఆ గాలికి చల్లగా అనిపిస్తుంది. ఇనుప కడియంమీంచి జారి చిటికెన వేలు అమ్మ శరీరాన్ని తాకుతున్నది. "అమ్మా క్షమించమ్మా.." శంకర్ మనసు అగాధంలోంచి ఒక మౌన రోదన మూలుగుతోంది. తరువాత అంతా నిశ్శబ్దం.
ఎంతసేపు అయిందో తెలియదు. తన మీద నీళ్ళు కుమ్మరిస్తుండగా ఆరి పోయిన మంట లోంచి ఒక్క నిప్పు రవ్వ బుస్సున వెలిగినట్టుగా శంకర్ ప్రాణం. తననీ అమ్మ శవాన్నీ కాల్చేయడమో పూడ్చేయటమో ఏదో చేయటానికి హడావుడి ఏదో జరుగుతున్నట్టుంది. "సరస్వతిని పిల్చుకు రావాలిగా" ఎవరో అంటున్నారు. "ఆ పిల్లకి విషయం తెల్సో లేదో..!" ఇంకెవరో అంటున్నారు. "పోయినారులే..! రాజుగాడు ఆ కుంటి శీను గాడు ట్రాక్టర్ యేసుకుని గా పిల్లని తీస్కరానీకి పోయినారులే..ఈ పాటికి ఒస్తుంటారు.." ఇంకెవరో బదులు చెబుతున్నారు. సరస్వతి ఎవరు...? హా...నా చెల్లెలు. పట్నం ఏంటి..? హా.. అది పట్నంలో చదువుతోంది. ఇపుడెక్కడుంది..?. పట్నంలో ఉందా..ఇంకా బతికే వుందా..? హా లేదు. సరస్వతి చచ్చి పోయిందిగా..ఔను, సరస్వతి చచ్చిపోయిందిగా..నా చెల్లి ఎలా చచ్చి పోయింది..? నిజంగానే చచ్చి పోయిందా.. ? నా భ్రమా..? చచ్చిపోలేదనుకుంటాను. .లేదు లేదు చచ్చిపోయింది. ఎలా..? చచ్చిపోలేదు ..చంపేశారు..ఔను నా పిచ్చి తల్లి సరస్వతిని చంపేశారు...చలాకీగా నవ్వుతూ వుండే సరస్వతి ముఖం శంకర్ కి గుర్తుకొస్తోంది. చిన్న మంటలా వెలుగుతున్న ప్రాణాన్ని ఎవరో కక్షగట్టి నెయ్యిని ఆజ్యంగా పోస్తున్నట్టున్నది. ఎవరు చంపేశారు..? ఎవరో చంపారు..హా నిన్న రాత్రి చంపేశారు. ఔను ఎలా చంపారు..హా ఇంకెలా చంపుతారు..? రేప్ చేసి చంపారు. ఎవరు..? ఎవరో..గుర్తు తెలియని వాళ్ళు. ఇంటర్ చదివి, డాక్టర్ గా ఈ ఊరికి వచ్చి ..ఊరి జనాలకి మందులు ఇచ్చి.. అలా అంటుండేది కదా..కలలు కంటుండేది కదా..చంపేశారు..
ఊరి చదువులమ్మగా పేరు తెచ్చుకున్న సరస్వతిని పదిమంది కలిసి రేప్ చేసి చంపేశారు. శంకర్ మూసిన కల్లమీద ఒక చుక్క కన్నీరు ప్రత్యక్షమయింది.. అమ్మకూడా సరస్వతి చచ్చిపోవడానికి కారణం..కాదు కాదు..అమ్మనే సరస్వతిని చంపేసింది. "బతికినన్నాల్లు గోరవంగా బతకాల్రా కొడకా..నాకా ఆరోగ్యం బాగాలేదు..నీకా నాయినా లేడు..సదువూ లేదు..సరస్వతినయినా చదివిస్తే..అదన్నా గోరవంగా బతుకుతది". పట్నం సదువులొద్దని చెప్పినా యినకుండ సదివించింది...అందుకే సరస్వతి పట్నంలో చచ్చిపోయింది. తరువాత ఏం జరిగింది..? శంకర్ ఆలోచనలు అలసిపోయాయి..నిశ్శబ్దం ఆవరించింది.
పెద్దగా ఏడుపులు వినిపిస్తున్నాయి. శంకర్ ముక్కు పుటాల్లోకి ఈగలు ముసురుతున్నాయి. ఒక్కసారి ఈగల్ని అదిలించినట్టుగా లోపల్నించి శ్వాస చిన్నగా సవరించుకుంది. "ఎంత పని చేసినారమ్మా...దీపం లాంటి ఆడకూతుర్ని రేప్ చేసి ...." ఎవరో ఆడామె గట్టిగా ఏడుస్తోంది. "ఇది ఏమి పోయేకాలం శివయ్యా..కుటుంబాన్నంతా ఒకే రోజు తీస్కపోతవా..." ఇంకెవరో పెద్దాయన వణుకుతూ అంటూన్నాడు. శంకర్ ఎడమ చేయి మీద ఇంకో చేయి తగులుతూ వుంది. సరస్వతిదే అయివుంటుంది. "చెల్లెమ్మా...మన అమ్మ చచ్చి పోయిందిరా...ఎలానో తెలుసా...నేనే చంపేశాను. నీ మీద ఒట్టు ..కావాలని చంపలేదు చిట్టితల్లీ.. కట్టెల కోసమని చేతిలో గొడ్డలి పట్టుకుని నేను పొద్దున్నే చేనుకి పోదామని అనుకున్నానా..ఇంతలో నీ కాలేజి నుండి ఫోన్ వచ్చింది. ఏడుస్తూ మీ స్నేహితురాలు విషయమంతా చెప్పేసిందా..కూలబడి పోయాను..ఏమయిందని అపుడే నిద్ర లేచిన అమ్మ ఆత్రంగా అడిగిందా...ఆ ఆవేదనలో..ఆ బాధలో..నేనేం చేశానో తెలుసా..చూడు నీవల్లే ఇదంతా జరిగింది..పట్నం చదువులు ఒద్దు ఒద్దని మొత్తుకున్నానా..ఇపుడు చూడు .అంటూ..చేతిలో గొడ్డల్ని విసిరేశాను. అది అనుకోకుండా అమ్మ మెడకు గుచ్చుకుని క్షణంలో అమ్మ నేలకొరిగిపోయింది. ఇదే చెల్లమ్మా జరిగింది..కావాలని నేను అమ్మని చంపుతానా చెప్పు. నరుకుతానా చెప్పు.." సరస్వతి మీద కూడా నీళ్ళు పోస్తున్నారు..ఆమె చేతిలోంచి శంకర్ చేతిమీదకి చల్లగా నీటి చుక్కలు జారుతున్నాయి. "చెల్లెమ్మా..నన్ను ఊరి జనం తల్లిని చంపేసినానంటూ ఈడ్చుకెల్లి చెట్టుకి కట్టి చితకబాదేశారు. నీకు జరిగిన అన్యాయాన్ని నోరు విప్పి చెప్పుకోనీలేదు.. అయినా బాధలేదు. నిజానికి సంతోషం ఏంటొ తెలుసా..నీవు చని పోయినట్లు అమ్మ కి తెలియదు...అమ్మ చని పోయినట్లు నీకూ తెలియదు..ఆ బాధ తెలీకుండానే మీరిద్దరూ చనిపోయారు. కానీ మీ ఇద్దరి చావుల్ని తెలుసుకుని కడసారి చూపు కూడా దక్కకుండా బ్రతికివున్న శవంలా నేను ఇలా...." శంకర్ మేనమామ వేరే ఊరినుండి దిగాడు. బోరున ఏడుస్తున్నాడు. పట్టరాని కోపంతో లేచి శంకర్ గుండెమీద మా అక్కని పొట్టన పెట్టుకుంటావా అని కాలితో తంతున్నాడు. "మామయ్యా నీ కోసమే ఎదురు చూస్తున్నా. జరగాల్సిన కార్యం..............." .......నిశ్శబ్దం.

No comments:
Post a Comment